వేయిపడగలు – గాన్ విత్ ద విండ్:
2. సారథి, సచివుడు, సఖుడు… రెట్ బట్లర్!
సాహితీమిత్రులారా!
ఒక రచన, దాని రూపం, ఇతివృత్తం, భాష, శైలి, శిల్పం, పాత్రలు, అది ప్రకటించే దృక్పథం ఎలా ఉండాలన్నది పూర్తిగా రచయిత స్వాతంత్ర్యానికి సంబంధించినది. ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆర్. ఎస్. సుదర్శనంగారు తన సాహిత్యంలో దృక్పథాలు అనే వ్యాససంపుటిలో అభిప్రాయపడినట్టు వేయిపడగలను ఆత్మాశ్రయ స్వభావంగల నవలగా గుర్తిస్తే, ఆ రచనకు చెందిన మొత్తం ప్రణాళిక అంతా ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, వేయిపడగలు, గాన్ విత్ ద విండ్‌ల మధ్య పోలికలను, తేడాలను చర్చిస్తున్నప్పుడు ఒక ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తుంది. అది- వేయిపడగలులో రెట్ బట్లర్, మెలనీ లాంటి పాత్రలు ఎందుకు లేవని!
వేయిపడగలలోని ధర్మారావు పాత్రను పోలిన ఆష్‌లీ భావజాలాన్ని తోసిపుచ్చగల బలమైన ప్రతివిమర్శను రెట్ బట్లర్ రూపంలో గాన్ విత్ ద విండ్ రచయిత్రి సృష్టించిందని; స్కార్లెట్, భార్య మెలనీ సైతం ఆష్‌లీని దాటి ముందుకు వెళ్ళడం ద్వారా అతని భావజాలానికీ జీవన సరళికీ ఒక మేరకు ప్రతివిమర్శను కల్పించారనీ గత వ్యాసంలో చెప్పుకున్నాం. తేడా ఏమిటంటే, స్కార్లెట్, మెలనీలది ఆష్‌లీ పట్ల సానుకూలత కలిగిన అప్రకటిత విమర్శ అయితే, రెట్ బట్లర్‌ది ప్రతికూల విమర్శ. పైన చెప్పిన రచయిత స్వాతంత్ర్యం నుంచి కాస్త బయటికి వచ్చి పరిశీలించినప్పుడు, ఇలా ప్రతివిమర్శను సృష్టించడం వల్ల వేయిపడగల ఇతివృత్తానికి లేని ఒక పరిపూర్ణత గాన్ విత్ ద విండ్ ఇతివృత్తానికి సిద్ధించిందనీ, ఆ విధంగా వేయిపడగల రచయిత కంటే గాన్ విత్ ద విండ్ రచయిత్రి ఎక్కువ పరిణతినీ జీవితం పట్ల ఎక్కువ దృష్టివైశాల్యాన్నీ ప్రకటించిందన్న భావన కలుగుతుంది.
అయితే, రెండు రచనల మధ్య అతి కీలకమైన తేడాను తెచ్చే యుద్ధం (లేదా అంతర్యుద్ధం) ఉన్న సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యుద్ధనేపథ్యం గాన్ విత్ ద విండ్‌లో పైన చెప్పుకున్న పరిపూర్ణతకు, పరిణతికి, దృష్టివైశాల్యానికీ కారణమనుకుంటే; అలాంటి యుద్ధనేపథ్యం లేని వేయిపడగలులో, దాని రచయితలో అవి లోపించడం ఒకవిధంగా సహజమే. అప్పుడు పరిపూర్ణత, పరిణతి, దృష్టివైశాల్యం అనే లక్షణాలు, ఈ రెండు రచనా ప్రణాళికలకు, వ్యక్తిగతంగా ఈ ఇద్దరు రచయితలకూ సంబంధించినవి కాక, వాటిలోని వస్తువుకు సంబంధించినవి అవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనిని ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే; గాన్ విత్ ద విండ్‌కు ఉన్నట్టు వేయిపడగలకు కూడా ఒక యుద్ధ, లేదా అంతర్యుద్ధ నేపథ్యం ఉండి ఉంటే; దానికి కూడా పైన పేర్కొన్న పరిపూర్ణత, పరిణతి, దృష్టివైశాల్యం సిద్ధించి ఉండేవా?! ప్రస్తుతానికి వీటిని ప్రశ్నలుగానే ఉంచితే —
యుద్ధం ఉండడం, లేకపోవడం అనేది; ఈ రెండు రచనల మధ్య పోలికలు, తేడాల చర్చను, ‘ఒక రచనను ఉన్నది ఉన్నట్టుగా పరిశీలించడం’ అనే హద్దును దాటించి బయటికి విస్తరింపజేస్తోంది. ఇక్కడ జరుపుతున్న ఈ పరిశీలన మొత్తానికి ఇలాంటి విస్తరణ స్వభావం ఉంది. వేయిపడగలకు ఆత్మాశ్రయ లక్షణం ఉండడం, గాన్ విత్ ద విండ్‌కు లేకపోవడం; కిందటి వ్యాసంలో చెప్పుకున్నట్టు వేయిపడగల రచయిత తనే డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం, గాన్ విత్ ద విండ్ రచయిత్రి తమను డ్రైవ్ చేసుకునే స్వేచ్ఛను ఇతివృత్తానికీ, పాత్రలకే విడిచిపెట్టడం – అనేవి ఎందుకు జరిగాయని ప్రశ్నించుకుని ఆ లోతుల్లోకి వెళ్లినప్పుడు కూడా చర్చ బయటికి విస్తరిస్తుంది.
ఆష్‌లీ – రెట్ బట్లర్
ముందుగా ఆష్‌లీ భావజాలంపై బట్లర్ విమర్శ ఎలాంటిదో చూద్దాం.
గాన్ విత్ ద విండ్‌లో బహుశా అందరికంటే ఎక్కువ ఆకర్షణ గొలిపే పాత్ర రెట్ బట్లర్. అతని మాట, నడక, మిగిలిన పాత్రలకు భిన్నంగా, విలక్షణంగా ఉండి అతని వ్యతిరేకుల దృష్టిని కూడా బలంగా ఆకర్షిస్తాయి. ఆష్‌లీ లానే అతను కూడా దక్షిణాది ప్లాంటర్‌ల తరగతికి చెందినవాడే. ఆ తరగతికి చెందిన జనం మధ్య ఉంటూనే వారికి దూరంగానూ ఉండగలగడం అతని ప్రత్యేకత. అంటే, ప్రవాహంలో భాగమవుతూనే, మళ్ళీ దానినుంచి వేరుపడి ఒడ్డు నుంచి దానిని చూడగలగడం అన్నమాట. ఆవిధంగా బట్లర్ పతనమవుతున్న ప్లాంటర్‌ల తాలూకు కులీనసమాజం తీరుతెన్నులపై నవల పొడవునా వ్యాఖ్యాతపాత్రను నిర్వహిస్తాడు. తను కూడా భాగమైన ఆ సమాజం పట్ల అతనిలోనూ అంతర్గతంగా మమకారం ఉంటుంది. అయితే, ఆ మమకారమే తనకు కాలం చెల్లిన సంగతిని గుర్తించలేకపోతున్న ఆ సమాజంపట్ల కసిగా, కార్పణ్యంగా, క్రోధంగా వ్యక్తమవుతుంది. అది అతని మాటతీరును కూడా ప్రభావితం చేసి అందులో వ్యంగ్యాన్ని, వక్రతను, కాఠిన్యాన్ని, అధిక్షేపణను గాఢంగా నింపుతుంది. సందర్భం నుంచి తప్పించి చూస్తే అతని మాటలు వివాదాస్పదాలుగా కనిపించే మాట నిజమే. అదే సమయంలో వాటిలో ఉటంకింపునకు అర్హమైన ఒక లక్షణం అలవోకగా దొర్లిపోతూ ఉంటుంది. ఉదాహరణకు, కాన్ఫెడరేట్ సైనికుల సహాయార్థం జరిగిన పార్టీలో స్కార్లెట్‌తో అతని సంభాషణ ఇలా ఉంటుంది:
స్కార్లెట్:
ఓహ్, ఉత్తమగుణాలే మూర్ఖమైనవన్నట్టు ధ్వనించే నీచమైన ధోరణి నీది.
రెట్:
కానీ ఉత్తమగుణాలు మూర్ఖమైనవే(But virtues are stupid). జనం ఏదైనా అంటే నువ్వు లెక్కచేస్తావా?
స్కార్లెట్:
చేయను-కానీ…సరే, దాని గురించి మనం మాట్లాడుకోవద్దు….
రెట్:
నా ప్రశ్నల్ని దాటేయద్దు. అమ్మలక్కలు అనే మాటల్ని నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా?
స్కార్లెట్:
ఓహ్, మరీ అంత గుచ్చి గుచ్చి అడిగితే- లేదు! కానీ ఆడపిల్ల అన్నాక పట్టించుకోవలసిందే. ఇవాళ మాత్రం నేను పట్టించుకోను.
రెట్:
అద్గదీ! నీ గురించి ఆలోచించే బాధ్యతను ఇంకొకళ్ళకి విడిచిపెట్టకుండా నీ అంతట నువ్వే ఆలోచించుకోవడం ప్రారంభించావన్నమాట. జ్ఞానానికి అదే ప్రారంభం(That is the beginning of wisdom).
స్కార్లెట్:
ఓహ్, కానీ—
రెట్:
నా గురించి చెప్పుకుంటున్నంతగా నీ గురించి కూడా చెప్పుకుంటుంటే అది పట్టించుకోనవసరం లేని ఎంత అల్పవిషయమో నువ్వే గ్రహిస్తావు. చార్ల్‌స్టన్‌లో నన్ను ఆహ్వానించే ఇల్లు ఒక్కటీ లేదంటే నువ్వే ఆలోచించు. మన న్యాయమైన, పవిత్రమైన యుద్ధానికి నేను చేసిన సాయం కూడా ఆ నిషేధాన్ని తొలగించలేదు.
స్కార్లెట్:
ఎంత ఘోరం!
రెట్:
ఓహ్, ఎంతమాత్రం కాదు. నీ పరువు కోల్పోయేవరకూ అదెంత బరువో, నిజంగా స్వేచ్ఛ అంటే ఏమిటో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు (Until you’ve lost your reputation, you never realize what a burden it was and what freedom really is)
….
స్కార్లెట్:
డబ్బు ప్రతీదీ కొనలేదు.
రెట్:
అని నీకెవరో చెప్పారు. ఆ చిలకపలుకులు సొంతంగా నీ బుద్ధికి తట్టినవి కావు. డబ్బుతో ఏది కొనలేవు?
దాదాపు నవల చివరిలో తన గతం గురించి స్కార్లెట్‌కు చెబుతాడు. అతని స్వస్థలం న్యూ ఆర్లిన్స్ (New Orleans) లోని చాల్స్‌టన్(Charleston)నగరం. ప్లాంటర్‌ల తరగతికి చెందిన అందరిలానే అతని తండ్రి వంశగౌరవానికి, పరువుప్రతిష్టలకు, విధినిషేధాలకు, కట్టుబాట్లకు విపరీత ప్రాధాన్యమిస్తాడు. ఆ వైపరీత్యం వికటించి, తండ్రికి పూర్తిగా భిన్నమైన స్వభావం వైపు, ప్రాధాన్యాల వైపు బట్లర్‌ను మళ్లించింది. బాల్యం నుంచీ ఇద్దరి మధ్యా ఏర్పడిన ఘర్షణ తండ్రిలా పెద్దమనిషి అనిపించుకునే శిక్షణకు బట్లర్‌ను దూరం చేసి, గురి చూసి పిస్టల్ పేల్చగల నేర్పరిగా, జూదగాడిగా మార్చింది. తండ్రి ఇంటినుంచి వెళ్లగొట్టడంతో అతను ప్లాంటర్‌ల సమాజం నుంచి బయటపడి విశాలప్రపంచంలోకి అడుగుపెడతాడు. జూదంలోనే పైకి వస్తాడు. ఆ క్రమంలో ప్లాంటర్‌ల కులీన సమాజం ఆమోదించని అనేకానేక అడ్డదారుల్లో సంపద గడిస్తాడు. తనది తాత పోలిక అంటాడు. ప్లాంటర్‌ల సమాజానికి చెందిన తొలి తరం వ్యక్తులు అతనిలా విశాలప్రపంచాన్ని చూసినవారే. అతనిలానే విలువలను పక్కన పెట్టి సంపద గడించడం ఒక్కటే లక్ష్యంగా విపరీతమైన తెగింపు, సాహసం, కార్యదీక్ష కనబరచినవారే. తండ్రి తరానికి వచ్చేటప్పటికి వాటి స్థానంలో కులీనత, విధినిషేధాలు, కట్టుబాట్లు సర్వస్వమయ్యే పరిస్థితి వచ్చి, అవి కల్పించిన గూడులో ముడుచుకుపోవడం మొదలైంది. కాలజ్ఞానం, లోకజ్ఞత కొరవడిన ఫలితం, మనవల తరానికి వచ్చేసరికి ఆ సమాజాన్ని పతనావస్థకు తీసుకొచ్చింది. అందరి మీదా పడినట్టే యుద్ధం ప్రభావం బట్లర్ తండ్రిమీద, కుటుంబసభ్యుల మీద కూడా పడుతుంది. ప్లాంటేషన్ నివాసం కాలి బూడిదవుతుంది. పంట పొలాలు చిత్తడి నేలలవుతాయి. టౌన్ ఇల్లు పన్నుల కింద పోతుంది. తల్లి, తండ్రి, చెల్లెలు రెండు గదుల్లో, ఆకలి కడుపులతో జీవించే పరిస్థితి వస్తుంది. ఆ దశలో కూడా తండ్రి కొడుకు నుంచి ఆర్థికసాయాన్ని నిరాకరిస్తాడు. అలా భార్యను, కూతురునీ కూడా మాడ్చి చివరికి తండ్రి మరణించినప్పుడు, అందుకు తను ఏమాత్రం విచారించడం లేదని స్కార్లెట్‌తో బట్లర్ అంటాడు. అది మరీ దారుణం అని ఆమె అన్నప్పుడు ‘లేని విచారాన్ని నటించడం అంతకన్నా దారుణం’ అంటాడు.
ప్లాంటర్‌ల సమాజం నుంచి బయపడి విశాలప్రపంచంలోకి అడుగుపెట్టే క్రమంలో ఆ సమాజం తాలూకు విలువలను, భ్రమలనే కాదు, దానిని ఆవరించి ఉన్న డాంబికత్వాన్ని బట్లర్ బద్దలు కొడతాడు. వాస్తవికతను నగ్నంగా దర్శించి ముఖాముఖి ఎదుర్కొంటాడు. అది అతని మాటకు కటుత్వాన్ని, నిక్కచ్చితనాన్ని అలవరిచింది. బార్బిక్యూ విందులో ప్లాంటర్ తరగతికి చెందిన యువకులు, పెద్దలూ యుద్ధం గురించి ఎంతో తమకంగా చర్చించుకుంటూ, ‘నెలరోజుల్లో యాంకీలను మట్టి కరిపించగల’ తమ ప్రతాపం గురించి ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు వారి ఉత్సాహంపై నీళ్ళు చల్లుతూ అతను మాట్లాడిన మాటలు, అతనిలోని వాస్తవికతాదృష్టి నైశిత్యాన్ని పట్టి చూపుతాయి.
దక్షిణాదిన ఒక్క తుపాకుల ఫ్యాక్టరీ కూడా లేని సంగతి కానీ, అతి తక్కువ సంఖ్యలో ఇనప కర్మాగారాలు, ఊలు మిల్లులు, పత్తి కర్మాగారాలు, తోలు పరిశ్రమలు ఉన్న సంగతి కానీ మీకేమైనా తెలుసా? అని అడుగుతాడు. మనకు ఒక్క యుద్ధనౌక కూడా లేకపోవడాన్నీ యాంకీల నౌకాబలం వారం రోజుల్లో మన రేవుల్ని దిగ్బంధం చేయగలవన్న వాస్తవాన్నీ గుర్తించారా? అలాంటప్పుడు మన కాటన్‌ను విదేశాలకు ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తాడు. మీతో ఉన్న సమస్యల్లా లోకం చుట్టిన అనుభవం లేకపోవడమేనంటాడు. మీరు చూసిందల్లా, యూరప్, న్యూయార్క్, ఫిలడెల్ఫియాలనేననీ, అక్కడ కూడా మీరు దర్శించినది హోటల్స్, మ్యూజియమ్స్, బాల్‌రూమ్స్, కసీనోలను మాత్రమేననీ ఎద్దేవా చేస్తాడు. నా విషయానికి వస్తే, చాల్స్‌టన్‌లో పుట్టినా గత కొన్ని సంవత్సరాలపాటు ఉత్తరాదిన ఉన్నాననీ, మీరు చూడనివి ఎన్నో నేను చూశాననీ, పట్టెడు అన్నం కోసం, పిడికెడు డాలర్లకోసం యాంకీల తరపున యుద్ధం చేయడానికి వేలాదిమంది వలసదారులు సిద్ధంగా ఉన్నారనీ, మనకు లేని కర్మాగారాలు, బొగ్గు గనులు, నౌకా స్థావరాలు ఉన్న యాంకీలు నెల రోజుల్లో మనల్ని మట్టి కరిపిస్తారనీ అంటాడు. యుద్ధం సహా ఆయా ఆదర్శాల పొరలను ఒక్కొక్కటే విప్పి వాటి వెనుక ఉన్న డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తాడు. మరో సందర్భంలో యుద్ధం గురించి ఇలా అంటాడు:
అన్ని యుద్ధాలూ పవిత్రమైనవే. ఎవరికి? పోరాడేవారికి. యుద్ధాలను ప్రారంభించినవారు అవి పవిత్రమైనవని చెప్పకపోతే ఎవరు యుద్ధం చేస్తారు? యుద్ధం చేసే మూర్ఖులకు యుద్ధం గురించి వక్తలు ఎంత గొప్పగానైనా చెప్పనివ్వండి, యుద్ధాలకు ఎంత గొప్ప కారణాలనైనా ఆపాదించనివ్వండి- యుద్ధాలకు అసలు కారణం ఒకే ఒకటి, అది డబ్బు. అన్ని యుద్ధాలూ డబ్బు కోసం జరిగేవే. కొద్దిమందే ఆ నిజాన్ని గ్రహిస్తారు.
యుద్ధం ప్రారంభమై, తను ఇంతకుముందు చెప్పినట్టే యాంకీ సేనలు దక్షిణాది రేవులను దిగ్బంధం చేసినప్పుడు, గుప్తమార్గాలలో సరకు రప్పించి నిత్యావసరాలకోసం అల్లాడుతున్న దక్షిణాది జనానికి అమ్మి సొమ్ము చేసుకోడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. అంతేకాదు, ముందుచూపుతో భారీ ఎత్తున పత్తి కొనుగోలు చేసి దానిని వేరే చోట భద్రత కలిగిన గిడ్డంగులకు తరలించి, దొరకని పరిస్థితిలో దానిని అనూహ్యమైన ధరకు అమ్మి యుద్ధకాలంలో మరిన్ని కోట్లకు పడగెత్తుతాడు. స్కార్లెట్‌తో మాట్లాడుతూ యుద్ధానికీ ధనార్జనకూ ఉన్న ముడిని ఇలా సూత్రీకరిస్తాడు:
బాగా డబ్బు చేసుకునే సమయాలు రెండే. ఒకటి దేశాన్ని పునర్నిర్మించేటప్పుడు; రెండవది, దేశం విధ్వంసానికి లోనవుతున్నప్పుడు! పునర్నిర్మాణంలో డబ్బు మెల్లగా వస్తుంది, విధ్వంసంలో త్వరగా వస్తుంది.
ప్రపంచానుభవం అతని మాటలకు కటుత్వాన్ని, వ్యవహారశైలికి వాస్తవికతను మప్పడమే కాదు; జ్ఞానాన్ని పెంచి ఆలోచనలకు స్పష్టతనిస్తుంది. అలాగని అతను మానవీయ విలువలు, కోమలమైన స్పందనలూ లేనివాడు కాదు. మంచి-చెడులు కలగలసిన ఒక విలక్షణ మిశ్రమ స్వభావం అతనిది. అతనిలో ఆకర్షణ గొలిపేది అదే. మనిషి సహజప్రవృత్తి కూడా అదే. విలువల నుంచి జీవించడం కాక, జీవించడం నుంచి విలువలను సంతరించుకోవడం అతని జీవన గమనంలో కనిపిస్తుంది. జీవితేచ్ఛలో అతను ముమ్మూర్తులా స్కార్లెట్‌ను పోలినవాడే. తనలో ఉన్నట్టు జీవితాన్ని గెలుచుకోడానికి అవసరమైన తెగింపు ఆమెలోనూ ఉంది. ఆమెపట్ల అతని ప్రథమాకర్షణకు అదే మూలం. బార్బిక్యూ విందులో ఆష్‌లీ చెంప ఛెళ్లుమనిపించినప్పుడే ఆమె వ్యక్తిత్వం అతనిని ఆకర్షించింది. అంతేకాదు, స్కార్లెట్, ఆష్‌లీ వ్యక్తిత్వాల మధ్య ఉన్న అంతరమూ అర్థమయింది. ఆమె పట్ల అనురక్తికీ, ఆష్‌లీ పట్ల తిరస్కారానికీ అదే నాంది అయింది.
మళ్ళీ ఇద్దరిలోనూ వ్యత్యాసమూ ఉంది. జీవించడం అనే సహజాతం స్కార్లెట్‌లో అప్పుడే తవ్వి తీసిన ముడి బంగారమైతే, బట్లర్‌లో అది శుద్ధి చేసి మంచి పనితనంతో ఆకర్షణీయమైన నగగా మలచిన బంగారం. ఒక్కమాటలో చెప్పాలంటే, స్కార్లెట్‌లోని జీవితేచ్ఛ అనే సహజాతానికి తెలివి, లోకానుభవం, జ్ఞానం, వివేకం జోడిస్తే రెట్ బట్లర్ అవుతాడు. ఆవిధంగా స్కార్లెట్‌కు బట్లర్ ప్రవర్ధితరూపం.
ప్లాంటర్‌ల తరగతికి చెందిన ఇతర స్త్రీ, పురుషులు ఎందరిలోనో లేని ప్రగాఢ జీవితేచ్ఛను స్కార్లెట్‌లో చూసిన బట్లర్, దానికి అన్ని విధాలా దోహదం చేసే బాధ్యతను తీసుకుంటాడు. సాంప్రదాయికమైన కట్టుబాట్లను, నిషేధాలను తోసిరాజని తనకు ఇష్టమైన పద్ధతిలో జీవించేందుకు ప్రోత్సహిస్తాడు. నిత్యావసరాలకు కూడా కటకటలాడే యుద్ధం వంటి క్లిష్ట ఘట్టంలో కూడా తన సరదాలు తీర్చుకోడానికి వస్తురూపంలో సాయపడతాడు. యుద్ధమధ్యంలో ఆమె అట్లాంటా నుంచి టారాకు సాహసోపేతంగా ప్రయాణం కట్టినప్పుడు బండిని తనే ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత పునర్నిర్మాణఘట్టంలో ఆమెకు ఆర్థిక సాయం చేస్తాడు. గతించిపోతున్న వ్యవస్థ, దాని తాలూకు విలువల గురించి ఆమెలో మిగిలి ఉన్న భ్రమలను, అపోహలను వదలగొట్టే ప్రయత్నంలో గురువు పాత్ర నిర్వహిస్తాడు.
వితంతువును బతికి ఉండగానే సమాధి చేసే దక్షిణాది ఆచారం కన్నా, హిందువులు పాటించే సతిలోనే కాస్తయినా కనికరం ఉందని ఒకచోట అంటాడు. మధ్యయుగాలనాటి భూస్వామ్యానికి కాలం చెల్లినట్టుగా నీ దక్షిణాది జీవన విధానానికి కాలం చెల్లిందనీ, ఇంత కాలం కొనసాగడమే ఆశ్చర్యమనీ, అది పోవలసిందేననీ పోతోందనీ అంటాడు. స్కార్లెట్ తననుంచి సాయాలు పొందుతూనే, తనను తూలనాడుతూ ఆష్‌లీపై ప్రేమను ప్రకటించుకుంటున్నప్పుడు కూడా, ఆమెకు చేయి అందిస్తూ వచ్చిన బలమైన, స్థిరమైన వ్యక్తిత్వం అతనిది.
‘జీవించడం’ ఒక్కటే లక్ష్యంగా ముందుకు సాగడంలో స్కార్లెట్‌కు, అతనికి ఉన్న తేడా ఎలాంటిదంటే, ఆ ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ ఆగాలో కూడా అతనికి తెలుసు. ఆ వివేకం స్కార్లెట్‌కు లేదు. అంతవరకు యుద్ధాన్ని వ్యతిరేకించిన బట్లర్ ఒక దశలో యుద్ధంలో పాల్గొంటాడు. అందులో బందీగా చిక్కి తన పలుకుబడిని ఉపయోగించుకుని విడుదలవుతాడు. ‘తప్పా ఒప్పా అన్నది కేవలం అకడమిక్ ప్రశ్న. పలుకుబడిలోనే ఉంది అంతా‘ అని స్కార్లెట్‌తో అంటాడు. బందీగా చిక్కిన కాన్ఫెడరేట్ సైనికులు విధేయత ప్రకటిస్తే వారిని సరిహద్దుల్లో ఇండియన్‌లతో పోరాటానికి రిక్రూట్ చేసుకుంటామని, ఆ తర్వాత విడుదల చేస్తామని యూనియన్ ప్రతిపాదన చేసిందనీ ఆష్‌లీ అందుకు నిరాకరించాడనీ బట్లర్ చెప్పినప్పుడు, ఆష్‌లీ ఆ పనిచేసి బయటపడితే బాగుండేదనుకున్న స్కార్లెట్, ‘నువ్వైతే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పారిపోయిరావా?‘ అని అడుగుతుంది. ‘అఫ్ కోర్స్!‘ అని అతను సమాధానం చెబుతాడు. ‘మరి ఆష్‌లీ ఆ పని ఎందుకు చేయలేదు?‘ అని అడిగినప్పుడు, ‘అతను పెద్దమనిషి‘ అంటాడు. ఆ మాటలో అతను దట్టించిన తృణీకారాన్ని గమనించి స్కార్లెట్ విస్తుపోతుంది.
ఆష్‌లీ – బట్లర్‌ల దృక్పథాల మధ్య అంతరాన్ని వెల్లడించే ఇలాంటి సందర్భాలు, వ్యాఖ్యలు నవల పొడవునా కనిపిస్తాయి. స్కార్లెట్‌తో మాట్లాడేటప్పుడు ఆష్‌లీని విమర్శించడానికి, చులకన చేయడానికి దొరికే ప్రతి అవకాశాన్ని బట్లర్ వినియోగించుకుంటాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు, నవల మధ్యలో వచ్చే ఆష్‌లీ – స్కార్లెట్‌ల దీర్ఘసంభాషణ ఎలా కీలకమో; బట్లర్ – స్కార్లెట్ మధ్య రెండు సందర్భాలలో జరిగిన దీర్ఘసంభాషణ కూడా అలాగే కీలకం. మొదటిది, బట్లర్ గతంతోనూ, ఆష్‌లీతోనూ ముడిపడినది. రెండవది, కూతురు బానీతో (Bonnie) ముడిపడి, బట్లర్‌లో వచ్చిన పరివర్తన గురించి చెప్పేది.
ఆష్‌లీతో ముడిపడిన సంభాషణలో అతని పట్ల బట్లర్ వ్యతిరేకత, విమర్శ పతాకస్థాయిని అందుకుని ఇద్దరి ప్రాపంచికదృక్పథాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్పష్టంగా స్థాపిస్తాయి. ఆష్‌లీని అడుగడుగునా సమర్థించే స్కార్లెట్, నువ్వతనిని ఎందుకు ద్వేషిస్తావని అడుగుతుంది. ద్వేషించడం కాదు, అతని మీద జాలిపడతానంటూ, అది ‘చావవలసినవాడు చావకపోవడం వల్ల‘ కలిగే జాలి అంటాడు. తన ప్రపంచం గతించిన ఈ సమయంలో తనేం చేయాలో తెలియని, తెలుసుకోని అతన్ని ఏవగించుకుంటానంటాడు. ఇలాంటివారివి పరిష్కారం లేని సమస్యలు కనుక చావే వారికి పరిష్కారమని, ఆ చావుకు వారి కుటుంబాలు కొన్ని తరాలపాటు గర్విస్తాయనీ అంటాడు. ‘అతని ఇల్లు పోయింది, ప్లాంటేషన్ పన్నుల కింద పోయింది, ఇప్పుడు తన చేతులతోనూ, తెలివితోనూ అతను ఏమైనా చేయగలడా?’ అని ప్రశ్నిస్తాడు. అకర్మణ్యతకు ప్రతిరూపమైన ఆష్‌లీ పట్ల బట్లర్ నిరసన తీవ్రత ఇంకా ఎంతటిదంటే, స్కార్లెట్ తన నుంచి పొందిన ఆర్థికసాయంతో ఆష్‌లీని ఆదుకోవడాన్ని తప్పుపట్టి, నా సాయాన్ని నువ్విలా దుర్వినియోగంచేస్తే నేను సాయపడకపోగా ఏ బ్యాంకు నుంచీ నీకు అప్పు పుట్టకుండా చేస్తానని బెదిరిస్తాడు.
ఒకపక్క ఆష్‌లీపై తన బద్ధ వ్యతిరేకతను చాటుకుంటూ, తన దృష్టిలో ఎంతైనా అపాత్రుడైన అతనికి స్కార్లెట్ సాయపడడాన్ని గర్హిస్తూనే, ఇంకో పక్క అదే స్కార్లెట్‌పై, ఇంకా అలాంటి వారిపై బట్లర్ అపారగౌరవాన్ని, అభిమానాన్ని ప్రకటించుకుంటాడు. ఇది అతని వ్యక్తిత్వపు లోతును, ప్రాపంచిక దృక్పథాన్ని వెల్లడిస్తుంది. నువ్వు మంచిమనిషి వనుకుంటున్నాననీ, అంత డబ్బూ పలుకుబడీ ఉన్న నువ్వు, చితికిపోయిన తననూ ఆష్‌లీనీ ఎలా ఆడిపోసుకుంటున్నావనీ స్కార్లెట్ అన్నప్పుడు, బట్లర్ అంటాడు:
నిన్ను అతని తరగతిలోకి చేర్చుకోకు. నువ్వు చితికిపోలేదు. నిన్ను చితికిపోయేలా చేయగల శక్తి దేనికీ లేదు. చితికిపోయింది అతను. తను బతికి ఉన్నంత కాలం ఒక శక్తిమంతుడు ఎవరైనా అతని వెనక ఉండి నడిపిస్తూ, సంరక్షిస్తూ ఉండకపోతే అతను ఉన్న చోటే ఉంటాడు. ఇలాంటి మనిషికోసం నా డబ్బు ఖర్చుపెట్టడానికి ఎంతమాత్రం ఇష్టపడను.
తమ కాళ్ళ మీద తాము నిలబడే వ్యక్తులకు సాయపడడంలో మజా ఉంది. ఆ ఇల్లాలు మేరీవెదర్‌కు (Mrs. Merriweather) నోటు కూడా లేకుండా వెయ్యి డాలర్లు అప్పు ఇచ్చాను. ఒక బుట్టతో కేకుల అమ్మకం ప్రారంభించింది. ఇప్పుడామెను చూడు, అరడజను మంది పనివాళ్లతో బేకరీ నడుపుతోంది. ఆ ముసలాయన సంతోషంగా డెలివరీ వేగన్ నడుపుకుంటున్నాడు. పనీ పాటా లేకుండా గడిపే ఆ కుర్రాళ్ళు క్రియోల్ (Creole), రెనే(Rene) ఇప్పుడు ఎంతో ఇష్టంగా ఒళ్ళొంచి పనిచేస్తున్నారు. పాపం ఆ టామీ వెల్‌బర్న్(Tommy Wellburn) సగం మనిషి శరీరంతో ఇద్దరు మనుషులు చేసేపని చేస్తున్నాడు.
సాయం పొందే అర్హత ఉన్నది ఇలాంటి వాళ్ళకు. కానీ, ఆష్‌లీ విల్క్స్? ఓహ్! తలకిందులైన నేటి మన ప్రపంచంలో ఈ బాపతు జనం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు, వీరికి ఏ విలువా లేదు.
ఆష్‌లీ గురించి బట్లర్ అన్న పై మాటలు వేయిపడగలులోని ధర్మారావుకూ అతికినట్టు సరిపోతాయి. అతని ఆస్తీ తండ్రి హయాంలోనే హరించుకుపోయింది. ఉద్యోగానికి అర్హమైన ఇంగ్లీష్ చదువు చదివాడు కాని, గట్టిగా ఉద్యోగం కోసం ప్రయత్నించడు. వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోడు. సుబ్బన్నపేటను విడిచి బయటకు వెళ్లడానికే ఇష్టపడడు. ‘తను బతికి ఉన్నంత కాలం ఒక శక్తిమంతుడు ఎవరైనా అతని వెనక ఉండి నడిపిస్తూ, సంరక్షిస్తూ ఉండకపోతే అతను ఉన్నచోటే ఉంటాడు’ అని ఆష్‌లీ గురించి అన్నమాటలు ధర్మారావుకూ ఎంత తూచినట్టు అన్వయిస్తాయంటే, చదువుకోడానికి డబ్బు, కుటుంబం గడవడానికి సంభారాలు సమకూర్చే జమీందారీ అనే శక్తిమంతమైన వ్యవస్థ అతని వెనుక ఉంటుంది. అయినా సరే, అతను ఉన్నచోటే ఉండిపోవడం పై వాక్యానికి చిన్న అపవాదం.
పైన ఉదహరించిన మాటలకు కొనసాగింపుగా బట్లర్ అన్న కింది మాటలు సంభాషణను హఠాత్తుగా మరింత ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టి, బట్లర్ ముఖంగా ప్రపంచపరిణామస్వభావాన్ని గొప్ప తాత్విక స్ఫురణతో బోధిస్తాయి. అందులో ఉండే ప్రాకృతిక న్యాయాన్ని ఉద్ఘాటిస్తాయి. ఉత్థాన పతనాలతో కూడిన ప్రపంచచరిత్రను మన కళ్ళముందు నిలుపుతూనే, పడిపోయిన ప్రతిసారీ కొత్త జవసత్వాలలో తిరిగి పైకి లేచేందుకు తోడ్పడే మనిషిలోని అంతులేని జీవనేచ్ఛను, అందుకు అవసరమైన పూనికను ఆకాశమంత ఎత్తులో ప్రదర్శిస్తాయి. కొత్త ప్రపంచం పాత ప్రపంచంలా ఉండదు, నిజమే. పాత ప్రపంచానికి చెందిన వ్యవస్థలూ విలువలూ కొన్ని అంతరించే మాట కూడా నిజమే. కానీ అదే సమయంలో ఆ శూన్యాన్ని పూరించే కొత్త వ్యవస్థలూ విలువలూ పాదుకుంటాయి. మనిషి మనుగడలో కాలపరీక్షలో నెగ్గి పరిణామ ప్రచండత్వాన్ని తట్టుకుని నిలబడగల విలువలూ కొన్ని ఉంటాయి. అవి పాత కొత్తల తేడా లేకుండా మనిషి వెన్నంటి వస్తూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కాలం అనే గానుగలో ఆడే మనిషి జీవితం నుంచి నిరంతరం విలువల కొత్తమిశ్రమం రూపొందుతూనే ఉంటుంది. ఈ అవగాహన కలిగినప్పుడు మార్పుతో సమాధానపడడం, దానిని జీర్ణించుకోవడం, జీవితానికి అనుకూలంగా అన్వయించుకోవడం తప్ప దానితో విరోధించడం, పరాజితులుగా మిగిలి జీవనక్షేత్రంనుంచే తప్పుకోవడం అనేది ఉండదు.
బట్లర్ అంటాడు:
ప్రపంచం ఇలా తలకిందులైన ప్రతిసారీ మొదట నశించిపోయేది అతని (ఆష్‌లీ) బాపతు జనాలే. ఎందుకు నశించరు? వారికి బతికి బట్టకట్టే అర్హత ఎందుకు లేదంటే, వాళ్ళు పోరాడరు. ఎలా పోరాడాలో కూడా వాళ్ళకు తెలియదు. ప్రపంచం తలకిందులవడం ఇదే మొదటిసారీ కాదు, ఇదే చివరిసారీ కాబోదు. గతంలోనూ జరిగింది, రేపు మళ్ళీ జరుగుతుంది. జరిగిన ప్రతిసారీ ప్రతి ఒకరూ సర్వస్వం కోల్పోయి ప్రతి ఒకరూ సమానులవుతారు. ఆ శూన్యస్థితినుంచే అంతటినీ తిరిగి ప్రారంభిస్తారు. తెలివి, చేతుల్లో శక్తి తప్ప ఏమీలేని స్థితి అది. కానీ ఆష్‌లీ లాంటివారికి ఆ తెలివీ ఉండదు, ఆ శక్తీ ఉండదు; ఉన్నా వాటిని ఉపయోగించగల స్థైర్యం ఉండదు. కనుక అణగారిపోతారు, అణగారిపోవలసిందే. అది ప్రాకృతిక న్యాయం. వారు లేనప్పుడు ప్రపంచం మరింత మెరుగ్గా ఉంటుంది. మహాకల్లోలాన్ని అజేయంగా దాటగల గట్టిపిండాలు కొందరు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ప్రపంచం తిరగబడకముందు తాము ఉన్న స్థితిని అనతికాలంలోనే వాళ్ళు తిరిగి అందుకుంటారు.
ప్రపంచం తిరగబడిన ప్రతిసారీ ప్రతి ఒకరూ సమానులవడం, కల్లోలాన్ని అజేయంగా దాటగల కొందరు గట్టిపిండాలు తిరిగి తమ వెనకటి జీవితాన్ని గెలుచుకుంటారనడం ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన సూత్రీకరణలు. ఆష్‌లీ, బట్లర్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెల్లడించే ఈ సూత్రీకరణలు వేయిపడగల లోని ధర్మారావుకూ యథాతథంగా వర్తిస్తాయి. లౌకికానికి పరిమితమై చెబితే, ఆష్‌లీకి ఉన్నట్టే ధర్మారావుకు కూడా గతం మీద, గతించిపోతున్న వ్యవస్థ మీద, దానికి సంబంధించిన అన్నింటి మీదా కాల్పనిక వ్యామోహము, ఆరాధన, తపనా ఉంటాయి. అతను కూడా ఆష్‌లీలానే నిష్క్రియాపరుడిగా, నిర్వేదిగా మిగిలిపోతాడు. మార్పు రూపంలో వచ్చిపడిన విపత్తును తట్టుకుని జీవితాన్ని గెలుచుకుని తాము కోల్పోయిన వాటిని తిరిగి సాధించుకునే పోరాటపటిమే కాదు సరికదా, మార్పు అనే ప్రాకృతిక న్యాయం పట్ల పైన బట్లర్‌లో వ్యక్తమైన అవగాహన ఈ ఇద్దరిలోనూ కనిపించదు.
ప్రపంచం తలకిందులైన ప్రతిసారీ ప్రతి ఒకరూ సమానులవుతారనడం కూడా ప్రాకృతిక న్యాయంగా పరిగణించదగిన సూత్రీకరణే. చారిత్రక దృక్కోణం నుంచి చూస్తే యుద్ధాలు, పెద్ద ఎత్తున ప్రకృతి ఉత్పాతాలు సంభవించి సామాజిక వ్యవస్థలు తలకిందులైన ప్రతిసారీ అందరూ సమానులవడం, అంతకు ముందు అన్నివిధాలుగా శిష్టులనిపించుకున్నవారు సామాన్యత్వంలోకి జారిపోవడం, అంతవరకు సామాన్యులుగా ఉన్నవారు కొత్త శిష్టవర్గంగా అవతరించడం ఎప్పుడూ జరుగుతూనే వచ్చింది. మన మహాభారతం మొత్తాన్నే ఈ కోణం నుంచి వ్యాఖ్యానించడానికి కావలసినంత అవకాశముంది. అదలా ఉంచితే, ఆష్‌లీ, ధర్మారావుల మధ్య ఇక్కడ అచ్చుగుద్దినట్టు కనిపించే మరో పోలిక ఏమిటంటే, ఇద్దరికీ ‘అందరినీ సమానుల్ని’ చేసే పరిణామస్వభావం పట్ల సానుకూల అవగాహన లేదు, సామాన్యవర్గాల పట్ల సానుభూతి, గుర్తింపు లేవు. అంతవరకూ తన ప్లాంటేషన్ తరగతికి చెందిన జనం మధ్య, అది కూడా తను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న కొద్దిమంది మిత్రులతో తనదైన భావనాత్మక ప్రపంచంలో జీవించిన ఆష్‌లీ, యుద్ధం వల్ల తనతో ఎలాంటి సారూప్యత లేని మనుషుల మధ్య గడపవలసి వచ్చినందుకు బాధపడతాడు. ధర్మారావులోనూ అడుగడుగునా శిష్టత-సామాన్యతల వివేచన వ్యక్తమవుతూనే ఉంటుంది. మారిన పరిస్థితులలో ఏదో విధంగా నిలదొక్కుకుని జీవించే వ్యక్తుల గురించిన సానుకూల చింతన కానీ చర్చ కానీ వేయిపడగలులో ఎక్కడా కనిపించదు. డబ్బు వ్యామోహంతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత పశ్చాత్తాపంతో ఆధ్యాత్మికతలోకి మళ్లిన మంగమ్మ అనే గృహిణికి ఆ మార్గంలో ముందుకు వెళ్లడానికి ధర్మారావు దోహదపడతాడు కానీ, అది రహస్యంగా జరుగుతుంది. పదిమందిలో ఆమెతో మాట్లాడడానికీ, చివరికి ఆమెను కన్నెత్తి చూడడానికి కూడా అతనికి తన శిష్టత్వం అడ్డువస్తుంది.
కొందరు గట్టిపిండాలు కల్లోలాన్ని దాటి నిలదొక్కుకుని తిరిగి తమ వెనకటి స్థితిని అందుకుంటారన్న బట్లర్ సూత్రీకరణ మరింత ముఖ్యమైన సూత్రీకరణ. తమ వెనకటి స్థితిని అన్నప్పుడు అందులో వారి భౌతిక జీవనస్థితి మాత్రమే కాక; అప్పటివారు నమ్మిన విలువలు, ఆదర్శాలు, అందమైన కాల్పనిక ఊహాప్రపంచం సహా భావనాత్మక జీవనం కూడా భాగమై ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు కాలపరీక్షకు నిలిచిన ఏ మానవీయ విలువ కూడా శాశ్వతంగా అంతరించిపోవడం ఉండదు. కాకపోతే కొత్త విలువలు వాటికి జతపడి, పాత-కొత్తల మధ్య ఒక సమాధానం, సమన్వయం రూపొందుతాయి. మారిన పరిస్థితుల ముందు జడీభూతునిగా మారి అకర్మణ్యతలోకి జారిపోవడం తప్ప తమ పాతజీవితంలోని మన్నికైన పార్శ్వాలను తిరిగి గెలుచుకోవాలన్న పూనిక ఆష్‌లీలో లేదు, అలాగే వేయిపడగలులో చిత్రితమైన లౌకిక జీవితం మేరకు ధర్మారావులోనూ లేదు. పై రెండు సూత్రీకరణల ద్వారా బట్లర్ వీరిద్దరిలో లేనిది ఎత్తిచూపుతూ అలాంటివారికి గురుత్వం వహిస్తున్నాడు.
మళ్ళీ ఇక్కడ కూడా మహాభారతంతో చిత్రమైన పోలిక. ఎలాగంటే, యుద్ధసమయంలో అకర్మణ్యత ఆవహించిన అర్జునుడికి కర్మను బోధించడం ద్వారా కృష్ణుడు చేసిన గీతోపదేశానికి; పైన చెప్పిన బట్లర్ ఉపదేశం భిన్నమైనదీ కాదు, తక్కువైనదీ కాదు. యుద్ధం చేయడం కృష్ణుడు బోధించిన ‘నరు’ని (అర్జునుని) స్వధర్మమైతే, ప్రపంచం తలకిందులైనప్పుడు లేచి నిలబడి నిలదొక్కుకుని తిరిగి జీవితాన్ని గెలుచుకోవడం కోసం యుద్ధం చేయడం బట్లర్ బోధించిన నరుని స్వధర్మం. యుద్ధానికి ప్రేరణ కలిగించడంలో అర్జునునికి కృష్ణుడు గురువు, యుద్ధంలో సారథి అయినట్టే, జీవించడం కోసం యుద్ధం చేయడంలో స్కార్లెట్‌కు బట్లర్ ప్రత్యక్షంగానే గురువు, సారథి అవుతాడు.
బట్లర్ అన్న ఈ కింది మాటలు కూడా కృష్ణునితో అతని పోలికను మరింత ముందుకు తీసుకెడుతున్నాయి:
నాగరికత విధ్వంసంలో మేము ఒక అవకాశాన్ని చూశాం. కొంత నిజాయితీతో, కొంత వంచనతో ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం. ఇప్పటికీ వినియోగించుకుంటున్నాం. ఈ ప్రపంచంలోని ఆష్‌లీ లాంటివాళ్లకూ అవే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాళ్ళు వాటిని అందుకోరు. అందుకునే తెలివి వారికి లేదు. ఆ తెలివి ఉన్నవాళ్లకే జీవించే అర్హత ఉంది.
మహాభారతయుద్ధంలో కృష్ణుడు నిర్వహించిన పాత్రలోనూ వంచన ఉన్న సంగతి తెలిసినదే. అదలా ఉంచితే, స్కార్లెట్‌లో ఆష్‌లీ వ్యక్తిత్వంపట్ల ప్రశంసాభావన, బట్లర్ పట్ల ఈసడింపు ఇప్పటికి కొంత కదలబారి ఉండవచ్చు కానీ, పూర్తిగా తొలగలేదు. కార్పెట్ బ్యాగర్స్ (Carpetbaggers: అంతర్యుద్ధం తర్వాత దక్షిణాదిన ఉన్న అస్థిర పరిస్థితులను అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకోడానికి ఉత్తరాది నుంచి వచ్చిన ‘చిల్లర జనాన్ని’ సూచించే నిందార్థకం), స్కాలీవాగ్స్ (Scallywags: అంతర్యుద్ధం తర్వాత పునర్నిర్మాణ ఘట్టంలో ఉత్తరాది రిపబ్లికన్‌లతో కుమ్మక్కయిన దక్షిణాది తెల్లవారిని సూచించే నిందార్థకం), యాంకీల (Yankee: ఉత్తరాది జనాన్ని ఉద్దేశించి దక్షిణాదివారు ఉపయోగించే పదం. Dixie అని ఉత్తరాదివారు దక్షిణాదిని అంటారు.) సహవాసంలో డబ్బు సంపాదించిన నీలా ఆష్‌లీ చేతులను మురికి చేసుకోలేదనీ అతను నీతిమంతుడనీ మర్యాదస్తుడనీ బట్లర్‌తో అంటుంది.
అప్పుడు బట్లర్ గురిచూసి విసిరిన ఒక వ్యాఖ్య ఆమె అంత గొప్పగా భావించే ఆష్‌లీ వ్యక్తిత్వంలోని ఒక వెలితిని ఎత్తి చూపి ఆమెను దాదాపు నిరుత్తరను చేస్తుంది. ‘ఒక ఆడదాని సాయమూ డబ్బూ తీసుకోనంత నీతిమంతుడూ మర్యాదస్తుడూ మాత్రం కాడని‘ బట్లర్ అంటాడు. విచిత్రంగా ఇక్కడా ఆష్‌లీతో ధర్మారావుకు పోలిక. తండ్రి రామేశ్వరశాస్త్రి భోగపత్ని రంగాజమ్మ ధర్మారావు శోభనానికి, అతనికి తెలియకుండా సెట్టి చేత వందరూపాయలు ఇప్పిస్తుంది. రాణి అతని చదువుకయ్యే ఖర్చు భరిస్తుంది.
బట్లర్ బోధతో ఆలోచనలో పడిన స్కార్లెట్‌కు, తనను పరాజితుడిగా ప్రకటించుకుంటూ ఆష్‌లీ టారాలో ఉన్నప్పుడు తనతో అన్న మాటలు చటుక్కున గుర్తొస్తాయి. బట్లర్‌తో అన్నప్పుడు ఆ మాటలు అతనికి ఆసక్తిని కలిగిస్తాయి. ‘(ఇలాంటివారు) తమను మోహపెట్టే గతాన్ని ఎక్కడ కోల్పోయారో అక్కడే జీవితాంతం పరిభ్రమిస్తూ ఉంటారు. కేవలం (గతవైభవ స్మరణ కలిగించే) గర్వభావనలోనూ, అసమర్థ మౌనంలోనూ మగ్గిపోతూ ఉంటారు. అయితే, అతనికి (ఆష్‌లీకి) అర్థమైంది, తను పరాజితుడినన్న సంగతి తెలిసింది‘ అంటాడు. ఇందులోని మొదటి రెండు వాక్యాలూ ధర్మారావుకూ యథాతథంగా వర్తిస్తాయి. అతను కూడా తనను మోహపెట్టే గతాన్ని కోల్పోయిన చోటే జీవితాంతం పరిభ్రమిస్తూ ఉండిపోయాడు. అది సుబ్బన్నపేటే కావచ్చు, లేదా నవలలో అది ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థ, భావజాలమూ కావచ్చు. (గతవైభవ స్మరణ కలిగించే) గర్వభావనలోనూ, అసమర్థ మౌనంలోనూ, లేదా నిర్లిప్తతలోనూ మగ్గిపోవడమూ సమానమే. అయితే, ఆష్‌లీకి కలిగినట్టు తను పరాజితుడినన్న గ్రహింపు ధర్మారావుకు కలిగిందా అంటే కలిగిందని చెప్పలేం. కారణం, మొదటే చెప్పినట్టు ఆష్‌లీకి ఉన్నట్టు అతనికి యుద్ధాన్ని చూసిన అనుభవం లేకపోవడం.
‘పడవ మునిగిపోతున్నప్పుడు పరువు, మర్యాద, సత్యనిష్ఠ, శీలసంపద, దయాగుణం ముఖ్యం కావ‘ని ఈ సంభాషణాక్రమంలో ఉద్ఘాటించిన ఇదే బట్లర్, యుద్ధానంతర పరిస్థితులలో ఇందుకు భిన్నమైన ఆలోచనాసరళి వైపు మళ్లడం విశేషం. అంతవరకూ తను ఏ దక్షిణాది ప్లాంటర్‌ల సమాజం తాలూకు విలువలను, ఆదర్శాలను, కట్టుబాట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడో ఇప్పుడు వాటిలో అతనికి మంచి కనిపిస్తుంది. డబ్బే సర్వస్వం కాదన్న గ్రహింపూ కలుగుతుంది. స్కార్లెట్‌లో ఆ గ్రహింపు కలగకపోవడాన్ని తప్పుపడతాడు కూడా. ఈ మేరకు స్కార్లెట్‌తో అతని దీర్ఘసంభాషణ కూడా నవలలో కీలకమైనది.
అతనిలో ఈమార్పుకు ప్రధాన కారణం కూతురు బానీ. డబ్బు సంపాదనలో అంతవరకూ ఊపిరి సలపని జీవితం గడిపిన అతనికి ఇక స్థిమితపడి జీవితానికి కొత్త ధ్యేయాన్ని కల్పించుకునే వయసు వచ్చిందనిపిస్తుంది. తనకిప్పుడు నలభై అయిదేళ్లని స్కార్లెట్‌తో అంటూ, ఆ వయసు వచ్చాక నీకూ ఆ గ్రహింపు కలగవచ్చునంటాడు. అతనికి కూతురుపై ఎంత మమకారమంటే, డబ్బుతో సహా అతని అన్ని యావలూ ఆ మమకారం ముందు మబ్బు తునకల్లా మాయమైపోతాయి. కూతురితో అతని బంధం తల్లీ-కూతుళ్లను మించి, తండ్రీ-కూతుళ్ల బంధం. పసివయసు నుంచీ కూతురు అతని దగ్గరే పడుకుంటుంది. కూతురును అన్నివిధాలా విశిష్టంగా తీర్చిదిద్దాలని అతను కలలుకంటాడు. చిన్నవయసులోనే గుర్రపుస్వారీ కూడా నేర్పడానికి పూనుకుంటాడు. బానీ చిన్న రాకుమారి అవుతుందని, ప్రపంచమంతా తనను నెత్తిన పెట్టుకుంటుందని, ఆమె వెళ్లలేని చోటు ఏదీ ఉండదని, ఈ చిల్లర జనాల మధ్య తను పెరగదని స్కార్లెట్‌తో అంటాడు. రేపు తను పెళ్లాడబోయేది కూడా ఈ చెత్తజనాల నుంచి కాదని, తనలో బట్లర్ రక్తం ప్రవహిస్తోందనీ అంటాడు. ‘నీకు ఈ జనాలంటే ఇష్టమే కదా’ అని స్కార్లెట్ అన్నప్పుడు, ‘నీకూ ఇష్టమే, కానీ బానీకి కాదం’టాడు. తన తప్పూ ఉందని, దేనినీ లక్ష్యపెట్టలేదని, ఏదీ ముఖ్యంగా తోచలేదని, ఇప్పుడు బానీయే తన సర్వస్వంగా మారిందని, ఇంతకాలం ఎంత మూర్ఖంగా వ్యవహరించానా అని అనిపిస్తోందనీ అంటాడు.
యుద్ధానంతరం అట్లాంటా సమాజంలో వచ్చిన పరివర్తన, కూతురిపై వల్లమాలిన ఆపేక్ష అతని ఆలోచనల్లో ఈ మార్పు తీసుకొస్తాయి. అంతవరకూ ఉన్న సాంప్రదాయిక సమాజం, దానిని అంటిపెట్టుకుని ఉన్న మానవ సంబంధాలు యుద్ధానంతరం క్షీణిస్తాయి. బలమైన సాంప్రదాయిక నేపథ్యం, లోతైన వ్యక్తిత్వమూ లేని జనం నడమంత్రపుసిరితో పైపైకి వచ్చారు. ఆ జనం, వారి జీవనసరళుల వెల్లువలో పాత సమాజం కొట్టుకుపోయి అక్కడక్కడ పైకి తేలిన తిప్పలా మిగిలింది. తాము కూడా తమదైన పాతసమాజానికి దూరమై కొత్తనీటిలో కొట్టుకుపోతున్న సంగతిని స్కార్లెట్, బట్లర్‌లు గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే, ఐశ్వర్యపు తళుకు బెళుకుల మధ్య విందు వినోదాలతో కాలాన్ని దొర్లించే ఈ జీవనవిధానమే బాగుందని స్కార్లెట్ అనుకుంటుంది కానీ బట్లర్ అనుకోలేకపోతాడు. చాల్స్‌టన్, అట్లాంటాలలోని తమదైన సాంప్రదాయిక సమాజానికి వెలిగా తాము జీవించవలసిరావడం అతనిని బాధిస్తుంది. కూతురి విషయంలో జాగ్రత్తపడాలనుకుంటాడు. ప్రపంచమంతా ఆమెను కోరుకుంటుందని, ఆమె వెళ్లలేని చోటు ఏదీ ఉండదనీ అతను అనడంలో వ్యక్తమవుతున్నది; సాంప్రదాయిక సమాజానికీ, దానితో అల్లుకున్న మానవసంబంధాలకూ తమలా కూతురు వెలి కాకూడదన్న తపనే. ‘చాల్స్‌టన్‌లో తనను దగ్గరకు తీసేవాళ్ళు ఎవరూ లేరు, త్వరగా మేలుకోకపోతే అట్లాంటాలో కూడా అదే జరుగుతుంది.’ అంటాడు.
‘నువ్వు దీనిని ఇంత తీవ్రంగా తీసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. అంత డబ్బు ఉండి కూడా…‘ అని స్కార్లెట్ అన్నప్పుడు, ‘దిక్కుమాలిన డబ్బు! నేను బానీకి ఏది కావాలని కోరుకుంటున్నానో దానిని నీ డబ్బు కొనలేదు. బానీ రిపబ్లికన్ ప్రారంభోత్సవ నృత్యంలో నాట్యకత్తె కావడంకన్నా పికార్డ్ (Picard) ఇంట్లో ఎండు రొట్టె తినడానికి వెళ్ళినా, మిసెస్ ఎల్సింగ్ పూరిగుడిసెకు వెళ్ళినా నాకు సంతోషమే. నీ పిల్లలకు నువ్వు సమాజంలో తగిన స్థానం ఎప్పుడో కల్పించి ఉండాల్సింది. ఆ పని చేయలేదు. నీకున్న స్థానాన్ని నిలబెట్టుకోడానికి కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు ఇంత ఆలస్యంగా నీ నడక మార్చుకుంటావనీ ఆశించడమూ వ్యర్థమే. ఎంతసేపూ నీకు డబ్బు యావే,’ అంటాడు.
తన కలల రాశిగా తన జీవితానికి ఏకైక ఆశాకిరణంగా కనిపించిన కూతురు చివరికి దక్కలేదు. గుర్రపు స్వారీ శిక్షణలో దుర్మరణం పాలైంది. అది అతనికి ఊహించని తీవ్ర ఆఘాతం!
అంతవరకూ ఆష్‌లీని ఆడిపోసుకుంటూ వచ్చిన అతను, ఇప్పుడు అచ్చంగా ఆష్‌లీలానే మాట్లాడడాన్ని ఎత్తిచూపి దెప్పడానికి ఒక అవకాశాన్ని మాత్రమే అతని మాటల్లో స్కార్లెట్ చూడగలిగింది. అది ఆమె ఆలోచనాస్థాయి. స్థూలంగా, అవునని ఒప్పుకునే నిజాయితీ బట్లర్‌లో ఉంది. అయితే, ఈ దశలో కూడా ఆష్‌లీ పట్ల అతని వైఖరి మారిందా అంటే మారలేదు. కాకపోతే అతనిపై విమర్శలో కటుత్వం తగ్గి ఉండచ్చు. ‘అతనిని ఉన్నవాడిని ఉన్నట్టు, తిన్నగా చూడు. తనకు చెందని ప్రపంచంలో ఇరుక్కుపోయి, గతించిపోయిన తన ప్రపంచం తాలూకు నియమనిబంధనల ప్రకారం ఉన్నంతలో ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నిస్తున్న పెద్దమనిషి మాత్రమే‘ నంటాడు.
తన ప్రారంభ జీవితంలో జీవించడానికి ఏ విలువలైతే అడ్డుపడుతున్నాయని భావించి తను నిరాకరించాడో, అనంతర దశలో ఆ విలువలలోని కొన్నింటి వైపైనా అతను ఇలా మళ్లడాన్ని చూపించి స్కార్లెట్లానే ఎవరైనా దెప్పడానికి ప్రయత్నించినా, అతనికి అపరాధభావనను, పశ్చాత్తాపాన్నీ ఆపాదించినా తొందరపాటు అవుతుంది. అతను ఆష్‌లీలా ఒడ్డున ఉండిపోలేదు. మార్పు అనే ప్రవాహంలో కలసిపోయి ప్రవహించాడు. ఆ ప్రవాహంలో తనకు దొరికిన రాళ్ళను, రత్నాలనూ స్వయంగా పరీక్షించి వాటి విలువల నిగ్గు తేల్చుకున్నాడు. తన కళ్ళతో ప్రపంచాన్ని చూశాడు. తన బుద్ధితో అర్థంచేసుకున్నాడు. స్వీయానుభవాల నిచ్చెన మీద ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి వెళ్ళిన క్రమంలో, మొదటి మెట్టు మీద తను దేనినైతే నిరాకరించాడో చివరిమెట్టు మీద అదే ప్రత్యక్షమై ఉండచ్చు. అంతమాత్రాన మెట్లు ఎక్కడంలో తను పడిన ప్రయాస వ్యర్థమన్న భావన అతనికి లేదు. అతనిలో అపరాధభావన లేదు, పశ్చాత్తాపం లేదు. ఉండవలసిన అవసరంలేదు. చివరి మెట్టు మీద తనకు ప్రత్యక్షమైన దానిని సహజంగాను, వయసు తీసుకొచ్చే మార్పుగానూ తీసుకున్నాడు. కాలంలో ఘనీభవించిపోయిన ప్లాంటర్‌ల ఇరుకు ప్రపంచం నుంచి విశాలప్రపంచంలోకి అడుగుపెట్టడం ద్వారా, యుద్ధం కల్పించిన అవకాశాలను అందుకోవడం ద్వారా తాను కోల్పోయిన గతం తాలూకు మంచిని తన కూతురికి అందించాలనుకున్నాడు. గతాన్ని, దానికి సంబంధించిన విలువలనూ కేవలం గుడ్డిగా ఆరాధిస్తూ, జీవించడమే మానేసి, అకర్మణ్యతలోకి జారిపోయి, పరాజితులుగా ఒడ్డున ఉండిపోయిన వారికి భిన్నంగా అతను తన జీవితాన్నే ప్రయోగశాలగా మార్చుకుని దానినుంచి సొంత ముద్ర కలిగిన విలువలను రాబట్టుకున్నాడు. విలువలనుంచి జీవించడం కాక, జీవించడం నుంచి విలువలను పిండుకున్నాడు. ఈ విలువలకు ఉన్న విలువ యాంత్రికంగా వల్లించే విలువలకు ఉండదు. అదీగాక, అతను రాబట్టుకున్న ఆ విలువలు పూర్తిగా గతానికి చెందిన విలువల వంటివి కావు. పాత జీవితానికి, కొత్త జీవితానికి మధ్య రాపిడి నుంచి, రెండు జీవితాల వారసత్వాన్ని సంతరించుకుంటూ పుట్టిన సంకీర్ణ విలువలు!
నిజానికి బట్లర్ మళ్ళింది ఆష్‌లీ భావజాలం వైపు కాదు, ఆష్‌లీ కంటే నిండైన, పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగి, అతనిలో భాగమవుతూనే అతనిని దాటి ప్రవహించిన మెలనీ వైపు! ఒక కోణం నుంచి చూస్తే నవల మొత్తంలో కీలకమనిపించే పాత్రలు బట్లర్, మెలనీలే. ఇద్దరూ పాత, కొత్తల మేలు కలయికలు, పరస్పర పూరకాలు. మొత్తం పాత్రలన్నింటిలో బట్లర్ నుంచి సంపూర్ణ గౌరవాన్నీ అభిమానాన్నీ ఆర్ద్రతనూ అందుకున్నది మెలనీ ఒక్కతే.
(3వ భాగం)
---------------------------------------------------------
రచన: కల్లూరి భాస్కరం,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment