వేయిపడగలు-గాన్ విత్ ద విండ్:
3. మారే ప్రపంచంలో మారని విలువ మెలనీ!
సాహితీమిత్రులారా!
గొప్ప ఉరవడితో శబ్దిస్తూ ఎత్తైన కొండలు గుట్టల మీంచి దూకడమే లక్ష్యంగా చిత్రగతులు పోయే జలపాతం; పైకి కనబడని లోతులతో, అవతలి ఒడ్డు కనిపించని మహావైశాల్యంతో ప్రశాంతగంభీరంగా ప్రవహించే జీవనది; ప్రకృతిలో దేని అందం, దేని ఆకర్షణ, దేని విలువ దానివే. ఒకటి చూపుల్ని అమితంగా మంత్రించి అద్భుతత్వంలో ముంచి తేల్చితే, ఒకటి అలసిపోయిన ఆత్మకు హాయి గొలుపుతుంది. మాటవరసకు గాన్ విత్ ద విండ్ లోని స్కార్లెట్, రెట్ బట్లర్ జీవితాలకు జలపాతంతో సామ్యాన్ని ఊహించుకుంటే, మెలనీ హామిల్టన్, అసలు ప్రవహిస్తున్నట్టే తోచని జీవనది! నదితో మెలనీ పోలిక ఎంత గొప్పగా అతుకుతుందంటే, సన్నని పాయగా పుట్టి క్రమంగా వైశాల్యాన్ని, లోతును సంతరించుకునే నదిలానే — నవల ప్రారంభంలో ఏమాత్రం నదురుగా కనిపించని అర్భకురాలు, అనామకురాలిగా పరిచయమైన మెలనీ, నవల అంతానికి చేరుకుంటున్న కొద్దీ యుద్ధంతో మానసికంగా, భౌతికంగా కుంగిపోయిన ప్లాంటర్ల సమాజం మొత్తాన్ని తన చలవదనపు ఒడ్డుమీదికి లాక్కుని అక్కున చేర్చుకునే ఒక మహానదిగా విస్తరిస్తుంది.
ఊఁహూఁ. మెలనీ వ్యక్తిత్వపు ఔజ్వల్యం ముందు ఈ నాలుగు వాక్యాలు మిణుగురుల పాటి కూడా చేస్తాయనిపించడం లేదు. ఇది వృధాప్రయాస అనిపిస్తోంది. పోనీ, ప్రపంచసాహిత్యం మొత్తం ఇంతవరకు సృష్టించిన అత్యుదాత్త వ్యక్తిత్వాలను ఒక్క చేతి వేళ్లమీద లెక్కించవలసివస్తే, వాటిలో మెలనీ తప్పనిసరిగా ఉంటుందని చెబితే ఎలా ఉంటుంది!? …ఏమో!
రచయిత్రి మెలనీ పాత్రను మలచిన తీరులో, సహజత్వంలో, ఇట్టే ఒదిగిపోయే ఒక ప్రణాళిక కనిపిస్తుంది. పైకి చెప్పని ఒక స్పష్టమైన తాత్వికత కనిపిస్తుంది. దూరమైన రెట్‌ను తిరిగి గెలుచుకుంటానన్న ఆత్మవిశ్వాసాన్ని, రేపటి మీద ఆశను ప్రకటించుకుంటూ స్కార్లెట్ టారాకు ప్రయాణమైందని చెప్పి నవల ముగించడం ద్వారా రచయిత్రి మొత్తం కథకు నాయిక ఆమే నని చెప్పదలచుకుందా అనిపిస్తుంది. కానీ మెలనీ పాత్రచిత్రణ దృష్ట్యా చూసినప్పుడు అంతిమంగా ఆమెనే నాయికగా స్థాపించదలచుకుందా అన్న అభిప్రాయం కలుగుతుంది. నవల ముగింపునకు వస్తున్న దశలో రెండోసారి ప్రసవం కష్టమై మెలనీ కన్నుమూసినట్టు రచయిత్రి చెబుతూనే, ఆమె ప్రభావాన్ని, ఆమె ప్రాతినిధ్యం వహించిన విలువలనూ నవల పుటలను దాటిస్తూ అనంతకాలంలోకి ప్రవహింపజేసి చిరంజీవుల్ని చేసింది.
రెట్ బట్లర్ లానే మెలనీ పరిచయానికి కూడా బార్బిక్యూ విందే ప్రధానవేదిక అవుతుంది. ఆ సందర్భంలో మెలనీ, ఆష్‌లీల పెళ్లి చర్చకు వస్తుంది. తను ఆష్‌లీ భుజాలవరకూ కూడా రాదు. అర్భకత్వం కొట్టొచ్చినట్టు కనిపించే శరీరాకృతి. అమ్మ ధరించే భారీ హూప్ స్కర్టు (Hoop Skirt: నడుము నుంచి గంట ఆకారంలో ఉండే స్కర్టు) చిన్నపిల్ల ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆపైన సిగ్గరి. కళ్ళు మాత్రం పెద్దవి. వాటిలో బెదురు తొంగిచూస్తూ ఉంటుంది. ముఖం పిరికితనాన్ని వ్యక్తం చేస్తూ ముద్దుగొలుపుతూనే, సీదా సాదాగా ఉంటుంది. వయసొచ్చిన ఆడపిల్ల ముఖాన్ని ఆకర్షణీయం చేసే నయగారాలు ఏవీ అందులో కనిపించవు. రచయిత్రి మాటల్లో చెప్పాలంటే, భూదేవంత నిరాడంబరంగానూ, తాజా ఆహారమంత శ్రేష్ఠంగానూ, ఊట జలాలంత నిర్మలంగానూ కనిపిస్తుంది. అయితే, కవళికలు ఎంత సీదా సాదాగా, శరీరాకృతి ఎంత చిన్నగా ఉన్నా ఆమె కదలికలలో మాత్రం ఎదుటివారిని విచిత్రంగా తాకే ఒక హుందాతనం తొణికిసలాడుతూ పదిహేడేళ్ళ వయసును మించిన పెద్దరికాన్ని తోపింపజేస్తూ ఉంటుంది.
తన ఈడు ఆడపిల్లలు చాలామందిలా ఏమాత్రం నదరుగా కనిపించని మెలనీ, ఆష్‌లీని పెళ్లాడబోతున్నట్టు తెలిసిన తర్వాతే అందరి కళ్ళల్లో పడుతుంది. మిసెస్ టార్లెటన్ అంటుంది: “ఏమిటా అమ్మాయి పేరు? మెలనీయా? ముద్దుగా కనిపించే ఓ అర్భకం పిల్ల. తన పేరూ, మొహమూ నాకు ఎప్పుడూ గుర్తుండవు…మనిషిని చూడు. కడ్డీలా సన్నగా, గాలేస్తే ఎగిరిపోయేంత సున్నితం. బొత్తిగా ఎలాంటి హుషారూ లేదు. సొంత అభిప్రాయం సున్నా. ‘నో మేడమ్, యెస్ మేడమ్’ అంటూ ఎవరేం చెప్పినా తలూపడమే.”
బార్బిక్యూ విందులో స్కార్లెట్, మెలనీ ఒకరికొకరు ఎదురుపడిన సందర్భాన్ని చిత్రించిన తీరు ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులో వారిద్దరి సంబంధం ఎలా ఉండబోతోందో అది సూచనగా చెప్పి రచయిత్రి పాత్ర చిత్రణ దక్షతను ఆశ్చర్యస్ఫోరకంగా వెల్లడిస్తుంది. స్కార్లెట్‌ను మెలనీ ఎంతో ఇష్టంగా చూసి చిరునవ్వు నవ్వుతుంది. తను ధరించిన ఆకుపచ్చ దుస్తులు ఎంతో బాగున్నాయంటుంది. కానీ ఆష్‌లీని ఒంటరిగా కలసి మాట్లాడాలన్న తహతహలో ఉన్న స్కార్లెట్ మర్యాదకైనా మెలనీ మాటకు స్పందించదు. ఒకవైపు మెలనీ అర్భక ఆకారం పట్ల తృణీకారభావం, ఇంకోవైపు మగవాళ్ళను వెంట తిప్పుకోగల తన అందచందాల గురించిన స్వాతిశయం; వీటికి తోడు, తను కోరుకున్న ఆష్‌లీని పెళ్లాడబోతున్నట్టు తెలిసి మెలనీపై కలిగిన అసూయ. ఇలా స్కార్లెట్‌పై మెలనీ అభిమానం, మెలనీపై స్కార్లెట్ వైముఖ్యం, వారిద్దరి మధ్యా ఆష్‌లీ అడ్డుగా- అనే ఈ త్రికోణ సంబంధం విందు ఘట్టంలో బీజరూపంలో వ్యక్తమై క్రమంగా కొమ్మలు, రెమ్మలతో విస్తరించి దాదాపు నవల అంతా పరచుకుంటుంది. చివరికొచ్చేసరికి ఈ త్రికోణసంబంధంలో సంభవించిన అద్భుతరూపపరివర్తన మెలనీని, ఆమె వ్యక్తిత్వాన్ని సహస్రాధిక ప్రమాణంలో పెంచడంతో స్కార్లెట్ ఆమె ముందు మరుగజ్జు అవుతుంది.
నిజానికి స్కార్లెట్ ఒక్కతే కాదు, మెలనీ ఉజ్వల వ్యక్తిత్వం ముందు ఆమె భర్త ఆష్‌లీ కూడా వెలవెల బోతాడు. మెలనీ కార్యక్షేత్రం అతన్ని దాటి చాలా ముందుకు విస్తరిస్తుంది. అయితే ఆ సంగతిని రచయిత్రి ఎక్కడా ప్రత్యక్షంగా చెప్పదు. మెలనీ ముఖతః కూడా ఆ స్పృహ ఎక్కడా వ్యక్తం కాదు. వారిద్దరి దాంపత్య చిత్రణ, భారతీయ సంప్రదాయం ఆదర్శవంతంగా భావించే భార్యాభర్తల సంబంధాన్ని ముమ్మూర్తులా పోలి ఉంటుంది. అది ఎక్కువతక్కువలకు, వ్యక్తిత్వ తారతమ్యాలకు, స్పర్థలకు చోటివ్వని పరిపూర్ణ అన్యోన్య దాంపత్యం. మెలనీ వ్యక్తిత్వం ఎంత వైశాల్యాన్ని సంతరించుకున్నా అది భర్త భావజాలంలో భాగమవుతూ అతని నీడలో తను ఒదిగి ఉంటూనే. వారిద్దరి మధ్య ప్రత్యక్ష సంభాషణ జరిగిన ఘట్టాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. దాంపత్యం మేరకే చూసినప్పుడు వేయిపడగలలోని అరుంధతీ ధర్మారావుల దాంపత్యానికి మెలనీ ఆష్‌లీల దాంపత్యం ఏవిధంగానూ భిన్నమైనదీ కాదు, న్యూనమైనదీ కాదు. భర్తను కూడా దాటి మెలనీ ముందుకు వెళ్ళిన క్రమాన్ని రచయిత్రి వాచ్యంగా చెప్పకపోయినా ఇతర పాత్రలతో, ముఖ్యంగా స్కార్లెట్, రెట్ బట్లర్‌లతో మెలనీ సంబంధ చిత్రణ ద్వారా అది ఉన్మీలనమవుతుంది.
మెలనీ-స్కార్లెట్
బార్బిక్యూ విందులో మెలనీ, స్కార్లెట్ కలసుకున్న పై ఘట్టం జరిగే సమయానికి మెలనీ అన్న చాల్స్ హామిల్టన్‌తో స్కార్లెట్ వివాహం ఊహలోనే లేదు. ఆష్‌లీ తనను నిరాకరించడంతో కలిగిన క్షణికావేశంలో చాల్స్‌ను స్కార్లెట్ పెళ్లి చేసుకుని మెలనీకి వదిన అవుతుంది. ఈ కొత్త బంధుత్వం స్కార్లెట్ పట్ల మెలనీ అభిమానాన్ని మరింత పెంచింది కానీ మెలనీపై స్కార్లెట్ వైముఖ్యంలో మార్పులేదు. యుద్ధం ఇద్దరినీ ఒక గూటికి చేర్చుతుంది. ఆష్‌లీ, చాల్స్, యుద్ధానికి వెళ్ళడం, చాల్స్ మరణం; అట్లాంటాలో ఆంట్ పిటీపాట్‌తో కలసి ఒకరికొకరు తోడుగా గడిపే అనివార్యతను కల్పిస్తాయి. అప్పటికే స్కార్లెట్‌పై మెలనీకి ఉన్న ఇష్టం ఈ సహజీవనంలో ప్రేమగా వికసిస్తూ ఆమె చుట్టూ అమాయకంగా అల్లుకుపోతుంది. మెలనీపై స్కార్లెట్ అయిష్టత అలాగే ఉన్నా గతిలేని పరిస్థితిలో ఆమె ప్రేమలత అల్లుకోడానికి తనో పందిరి కావలసివస్తుంది. ఈ క్రమంలోనే మెలనీ వ్యక్తిత్వంలోని సొబగులు ఆమెకు మధ్య మధ్య మెరుఫుల్లా తాకి విస్మయం కలిగిస్తాయి. అంతలోనే ఆమెపట్ల తన వైముఖ్యం, అసూయ, ద్వేషం; తనలోని స్వార్థమనే చీకట్లు ఆ మెరుపుల్ని కప్పివేస్తుంటాయి. మెలనీని స్కార్లెట్ అర్థంచేసుకునే ఈ క్రమం ఎంత మందగతిలో సాగుతుందంటే, మెలనీ చల్లని తోడు తనకు ఎంత అవసరమో ఆమె పూర్తిగా గ్రహించేలోపలే మెలనీ ఈ లోకం నుంచే నిష్క్రమిస్తుంది.
మెలనీది తన ఆంట్ పిటీపాట్ పోలిక అని, ఆమెలానే అస్తమానూ సిగ్గుతో ముడుచుకుపోతుందనీ అనుకుంటూనే తనలో ఒకవిధమైన ఇంగితజ్ఞానం ఉన్నట్టు స్కార్లెట్ గమనిస్తుంది. మెలనీ గురించి ఆమెకు ఇది తొలి ఎరుక. అత్త ముఖంలో లానే మెలనీ ముఖంలోనూ నైర్మల్యం, సత్యం, దయ, ప్రేమ నిండిన పసిదనపు ఛాయలు తొంగిచూస్తూ ఉంటాయి. ఎదుటివారిలో మంచినే తప్ప చెడును చూడలేని ఆ పసిస్వభావం మెలనీ ముఖంలో నిత్యసంతోషాన్ని తెచ్చిపెడుతుంది. తన ప్రవర్తన అవతలివారిలో సంతోషాన్ని, సంతృప్తిని నింపాలనీ ఆమె కోరుకుంటుంది. అందుకే చిన్నా పెద్దా అంతస్తుల తేడా లేకుండా అందరికీ తలలో నాలుక అవుతుంది. తన రూపంతోనూ, ఆభిజాత్యంతోనూ మగవారిని వెంట తిప్పుకునే స్కార్లెట్‌కు పూర్తి భిన్నమైన, స్త్రీపురుష వయోభేదాలకు అతీతమైన ఆకర్షణ మెలనీది. అట్లాంటాలో ఆమెకు ఉన్నంతమంది ఆడ, మగ స్నేహితులు ఇంకెవరికీ లేరు. అలాగని మెలనీ ప్రవర్తన అపూర్వమూ కాదు, అసాధారణమూ కాదు; దక్షిణాది ప్లాంటర్‌ల సమాజంలోని ఆడపిల్లలకు చిన్నప్పటినుంచీ అలవరిచే ప్రవర్తనే అది. ఈ సంతోషపూరితమైన స్త్రీ వ్యవహారసరళే దక్షిణాది సమాజాన్ని ఆహ్లాదభరితం చేసేదని రచయిత్రి అంటుంది. మెలనీ వ్యక్తిత్వపు విశిష్టత ఎక్కడ ఉందంటే, మిగతా ఆడపిల్లలకు భిన్నంగా యుద్ధం అనే మహా విపత్తును కూడా ఎదురొడ్డి ఈ వ్యవహారసరళిని కాపాడుకోవడంలో!
యుద్ధకాలంలోనూ ఆ తర్వాతా మెలనీతో గడిపినన్ని రోజుల్లో ఆమె గురించి స్కార్లెట్‌కు ఇంచుమించు రోజుకో ఆశ్చర్యం, రోజుకో కొత్త ఎరుక! ఇద్దరూ క్షతగాత్రులైన సైనికులకు ఆసుపత్రి సేవలు అందించే కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అయితే, స్కార్లెట్ అయిష్టంగా, మెలనీ ఇష్టంగా! పిరికిగొడ్డు అనుకునే మెలనీ ఆసుపత్రి వాతావరణాన్ని, అక్కడి దుర్గంధాన్ని భరించడం అలా ఉంచి; శస్త్రచికిత్సలకు సైతం సాయపడడం చూసి స్కార్లెట్ విస్తుపోతుంది. మృత్యుముఖంలో ఉన్న, కాలో చెయ్యో కోల్పోయిన సైనికులకు మృదుత్వము, సానుభూతి, ఆహ్లాదమూ నిండిన తన ప్రవర్తనతో మెలనీ కారుణ్యదేవతలా కనిపిస్తుంది.
స్కార్లెట్, మెలనీల వ్యక్తిత్వాల మధ్య తేడాను చూపించే మరో సందర్భం, సైనికుల సహాయార్థం జరిగిన కార్యక్రమం. పెళ్ళికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా చాల్స్‌ను స్కార్లెట్ ఏనాడూ ప్రేమించలేదు, గౌరవించలేదు. పైగా ఇంత చిన్నవయసులోనే వైధవ్యం తెచ్చిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశాడన్న అక్కసు అతని మీద ఉంది. సైనికుల సహాయార్థం విరాళం అడిగినప్పుడు తన పెళ్లి ఉంగరాన్ని ఇచ్చేస్తుంది. ఆ క్షణంలో ఆ ఉంగరాన్ని వదిలించుకోవడమే ఆమెకు ప్రధానంగా కనిపిస్తుంది తప్ప, సైనికుల కోసం ఇవ్వడం కాదు. ఎదుటివారిలో మంచినే తప్ప చెడును ఊహించుకోవడమే తెలియని మెలనీ ఆ చర్యను గొప్ప త్యాగంగా అర్థంచేసుకుని గర్వంతో పులకించిపోతుంది. తను ఎంతో ప్రేమించే భర్త ఆష్‌లీ తన వేలికి తొడిగిన పెళ్లి ఉంగరాన్ని విరాళంగా ఇచ్చేస్తుంది. ఇద్దరూ చేసింది ఒకటే అయినా ఆంతర్యంలో రెంటి మధ్యా హస్తిమశకాంతరం.
ఆ కార్యక్రమంతోనే ముడిపడిన మరో అంశంలో మెలనీ వ్యక్తిత్వంలోని ఇంకొక ఆశ్చర్యకరమైన పార్శ్వం స్కార్లెట్ దృష్టికి వస్తుంది. తను వితంతువు, పైగా సంతాప దినాలు ఇంకా పూర్తి కాలేదు. విందువినోదాలలో పాల్గొనడం అలా ఉంచి, అసలు తను పదిమందిలోకి రానే కూడదు. కానీ యుద్ధసమయం కనుక ఒక మేరకు మినహాయింపు లభిస్తుంది. తాము కోరుకున్న యువతితో నృత్యం చేసే అవకాశాన్ని కార్యక్రమ నిర్వాహకులు వేలం వేసినప్పుడు స్కార్లెట్‌ను రెట్ బట్లర్ హెచ్చుమొత్తానికి పాడుకుంటాడు. మిగతా అమ్మలక్కలతోపాటు స్కార్లెట్ కూడా దిగ్భ్రాంతి చెందుతుంది. రెట్ పట్ల తనలో ఎంత అయిష్టత ఉన్నా తనకు ఎక్కువ ధర పలికినందుకు గర్విస్తూ, నృత్యించే ఆ అవకాశాన్ని స్కార్లెట్ వినియోగించుకుంటుంది. ఇంటికొచ్చాక ఆ చర్యను పిటీపాట్ తీవ్రంగా తప్పు పడుతుంది. అసలు నృత్యం చేయడమే తప్పైతే, రెట్ బట్లర్ లాంటి తప్పుడు మనిషితో చేయడం ఇంకా తప్పంటుంది.
దుఃఖంతో కుంగిపోయిన స్కార్లెట్‌కు ఆ సమయంలో మెలనీ నుంచి సమర్థన, ఓదార్పు లభిస్తాయి. సైనికుల కోసం, ఆసుపత్రి కోసం నువ్వు చేసిన పని తప్పు కాకపోగా ఎంతైనా అభినందనీయమని మెలనీ అంటుంది. అసలే తను భర్త మరణించిన దుఃఖంలో ఉందని, నాలుగు గోడల మధ్య మగ్గిపోవడం తనను ఇంకా బాధిస్తుందనీ ఆంట్‌తో అంటుంది. యుద్ధ సమయం అన్ని సమయాల వంటిది కాదని, ఇంటికీ ఊరికీ అయినవారికీ దూరంగా బయట, ఆసుపత్రిలో ఒంటరిగా గడిపే సైనికులను తలచుకున్నప్పుడు మనం ఇంటికే పరిమితమవడం స్వార్థమవుతుందని, మనందరం అప్పుడప్పుడు పార్టీలకు వెళ్లవలసిందేనంటుంది.
పైన చెప్పుకున్నట్టు, దక్షిణాది ప్లాంటర్‌ల సాంప్రదాయిక సమాజంలోని అమ్మాయిలకు ఒక పరిపూర్ణమైన నమూనాగా భావించదగిన మెలనీకి ఆ సమాజం తాలూకు కట్టుబాట్లపై ఎంత పట్టింపు ఉంటుందో ఊహించుకోగలం. ఇందుకు భిన్నంగా కేవలం తన ఇష్టాయిష్టాలకు, సరదాలకు, స్వార్థాలకూ అనుగుణంగా జీవించడమే లక్ష్యంగా కట్టుబాట్లను తోసిరాజనే స్వభావం స్కార్లెట్‌ది. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే, కట్టుబాట్లను పక్కకు నెట్టేసి ముందుకు వెళ్లడంలోనే స్కార్లెట్‌లో అసాధారణమైన తెగింపు కనిపిస్తుంది తప్ప, వాటిని నిరాకరించడంలో కాదు. వాచా వాటిని కాదనడం దగ్గరికి వచ్చేసరికి ఆమెలో ఊగిసలాట, అధైర్యం అనేక సందర్భాలలో వ్యక్తమవుతాయి. పార్టీలో రెట్ బట్లర్‌తో ఆమె సంభాషణ అలాంటి ఒక సందర్భం. ‘అమ్మలక్కల మాటలను నువ్వు పట్టించుకుంటావా?’ అని అతను అడిగినప్పుడు, ‘అంత గుచ్చి గుచ్చి అడిగితే పట్టించుకోననే చెబుతానని, అయితే ఆడపిల్ల అన్నాక పట్టించుకోవాలేమోననీ’ ఆమె సందిగ్ధంగా సమాధానం చెబుతుంది.
విశేషమేమిటంటే, అనామకంగా, అర్భకంగా, వ్యక్తిత్వరహితంగా కనిపించే మెలనీలో ఆ ఊగిసలాట, అధైర్యం మచ్చుకైనా కనిపించవు. సమయానుసారంగా కట్టుబాట్లను సడలించే ధైర్యమే కాదు; ఆ సంగతిని నిర్ద్వంద్వంగా, యుక్తియుక్తంగా, సహేతుకంగా ప్రకటించగల వివేకమూ ఆమెలో ఉంది. ‘యుద్ధ సమయం అన్ని సమయాలలాంటిది కా’దనడంలో అది కనిపిస్తుంది. ఎందులోనూ ఊగిసలాట లేకపోవడం అనే ఈ లక్షణం ఆమెలో ఇంకా అనేక సందర్భాలలో వ్యక్తమవుతుంది. యుద్ధ ప్రయోజకత్వం విషయానికే వస్తే, భర్త ఆష్‌లీ ఒక దశలో సందిగ్ధానికి లోనవుతాడు. గెలిచినా, ఓడినా ఫలితం ఒకలానే ఉంటుందనుకుంటాడు. కానీ మెలనీలో ఎలాంటి సందిగ్ధత, ఫలితం గురించిన ఎలాంటి విచికిత్స లేదు. యుద్ధమంటూ వచ్చాక అందులో పాల్గొని వీరమరణం చెందడమే అత్యున్నతమంటుంది. ‘ఆష్‌లీ యూనియన్ పట్ల విధేయతను చాటుకుని జైలునుంచి విడుదలై పారిపోయి రావచ్చుకదా!’ అని స్కార్లెట్ అన్నప్పుడు, మెలనీ ఆ మాటకు తీవ్రంగా స్పందిస్తుంది. ఆమె కోపం ప్రదర్శించిన చాలా అరుదైన సందర్భాలలో ఇది ఒకటి. ‘ఆయన అలాంటి పని చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? సొంత కాన్ఫెడరసీని అలా వంచిస్తాడా? అంతకన్నా రాక్ ఐలండ్‌లో తను మరణించడానికైనా సిద్ధపడతాడు. జైల్లోనే తను మరణిస్తే నేను ఎంతో గర్విస్తాను. పారిపోయి వస్తే ఆయన మొహం కూడా చూడను,’ అంటుంది. భర్త క్షేమంగా తిరిగిరావాలని అహర్నిశలూ పరితపించే మెలనీ నోట ఈ పరుషవాక్యాలు స్వభావవిరుద్ధంగా తోచి ఒకవైపు ఆశ్చర్యం కలిగిస్తాయి. మరోవైపు, కొన్ని సాంప్రదాయిక విలువల పట్ల పట్టువిడుపులు లేని ఆమె వైఖరిని వెల్లడిస్తాయి. అదే సమయంలో, ఎక్కడ గీత గీయాలో ఎక్కడ గీత చెరిపేయాలో తూచినట్టు నిర్ధారించగలిగిన ఆమెలోని అసాధారణ వివేకాన్నీ పట్టి చూపుతాయి. ఇంకా విశేషమేమిటంటే, ఈ సందిగ్ధతారాహిత్యంలో చివరికి రెట్ బట్లర్ కూడా ఆమెకు సాటి రాకపోవడం. తన సిద్ధాంతాలనూ, సూత్రీకరణలనూ సవరించుకున్న సందర్భాలు అతనికీ ఉన్నాయి. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఒక దశలో తను కూడా అందులో పాల్గొనడం ఒక ఉదాహరణ. ఈ కోణంలో చూసినప్పుడు నవల మొత్తంలో మెలనీయే నాయికామణిగా భాసిస్తుంది.
ఒకవైపు మెలనీ స్వభావంలోని ఈ ఆశ్చర్యకరమైన పార్శ్వాన్ని గమనిస్తూనే మరోవైపు స్కార్లెట్ ఆమె స్పర్శను, ఓదార్పును చీదరించుకుంటుంది. ‘నన్ను నేను సమర్థించుకోగల’ననుకుంటూ ఆమె సమర్థింపును ఈసడించుకుంటుంది. తనలో కరడుగట్టిన అహం, ఆభిజాత్యం, ద్వేషం మెలనీ ఔన్నత్యం ముందు తలవంచే క్రమానికి ఇది ఇంకా ప్రారంభం మాత్రమే.
మెలనీ స్వభావం స్కార్లెట్‌ను మరింత ఆశ్చర్యంలో ఆలోచనలో ముంచెత్తే మరో కీలక సందర్భం, యుద్ధం నేరుగా అట్లాంటాలోకే అడుగుపెట్టడం. మెలనీ ప్రసవించే సమయం తోసుకువస్తుంటూంది. తను అసలే అరిపేద, ఆపైన ఆమె కటిస్థలం ఎంత ఇరుకంటే, డాక్టర్ మీడ్ ఉద్దేశంలో ఆమె సంతానం కనడానికే యోగ్యురాలు కాదు. భయస్తురాలైన అత్త పిటీపాట్ మెలనీని, స్కార్లెట్‌ను తీసుకుని తన కజిన్ ఉండే మెకాన్‌కు (Macon) వెళ్లిపోవాలనుకుంటుంది. తను ససేమిరా మెకాన్‌కు రానని, తన పుట్టిల్లు టారాకు వెళ్లిపోతాననీ స్కార్లెట్ పట్టుబడుతుంది. అప్పుడు, ‘నన్ను ఒంటరిని చేసి వెళ్లవద్దు, నువ్వు నాకు సోదరి కన్నా ఎక్కువ, అదీగాక నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని ఆష్‌లీకి మాట ఇచ్చావ’ని మెలనీ తనను కాళ్లా వేళ్లా పడినప్పుడు స్కార్లెట్ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండిపోతుంది. ఆమె మీద తన అయిష్టాన్ని ఏనాడూ దాచలేదు; ఆష్‌లీ రాకకోసం, అతని క్షేమసమాచారం కోసం తన కంటే ఎక్కువ ఆత్రంగా ఎదురుచూస్తూ ఇన్ని మాసాల్లో ఆమె ముందు తను వందలసార్లు బయటపడిపోయింది, అయినా తనను ప్రేమించే ఇంత మూర్ఖురాలేమిటని అనుకుంటుంది. తన ప్రేమాస్పదులలో మంచిని తప్ప మరేమీ చూడలేని ఆమె స్వభావానికి విస్తుపోతుంది.
పిటీపాట్ మెకాన్‌కు వెళ్లిపోతుంది. స్కార్లెట్, మెలనీలు అట్లాంటాలో ఉండిపోతారు. యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతూ పట్టణం మొత్తాన్ని ఉద్రిక్తత అంచుల మీద నిలబెడుతుంది. ఎంత అత్యవసరానికైనా వీథిలోకి వెళ్లలేని పరిస్థితి. ఇంకోవైపు నెలలు నిండి ఏ క్షణంలోనైనా మెలనీ ప్రసవించే అవకాశం. స్కార్లెట్‌లో స్వార్థ, పరార్థాల మధ్య సంఘర్షణ పతాకస్థాయిని అందుకుంటుంది. మెలనీని తన చావుకు తనను విడిచిపెట్టి, తను టారాకు వెళ్లిపోవాలని ఆమె అనుకోని క్షణం లేదు. వీథుల్లో ఏప్రిల్ వర్షంలా కురిసే తూటాల మధ్య డాక్టర్ కోసం తను వెళ్ళేది లేదని అనుకుంటుంది. తనతో ఏ విధమైన సారూప్యమూ లేని, తను అమితంగా ద్వేషించే మెలనీ కోసం తను అట్లాంటాలో ఉండిపోవడం ఆమెకు వింతగా అనిపిస్తుంది. మెలనీ త్వరగా ప్రసవించాలనే కాదు, చివరికి ఆమె చావును కూడా కోరుకుంటుంది. ఆష్‌లీకి తను ఇచ్చిన మాట అడ్డుపడకపోతే ఆమె స్వార్థమే గెలిచి ఉండేది. నిజానికి ఆ మాటకు కట్టుబడడంలో ఉన్నదీ స్వార్థమే.
ఈ ఘట్టంలోనే మెలనీ, స్కార్లెట్‌ల మధ్య జరిగిన ఒక సంభాషణలో మెలనీ వ్యక్తిత్వపు మరో విశిష్ట కోణం మెరపులా తాకుతుంది. ‘నువ్వు ప్రసవించడానికి ఎంత సమయం పట్టిం’దని మెలనీ అడుగుతుంది. ‘నేను పెరట్లోకి వెళ్ళాను. తిరిగి ఇంట్లోకి వెళ్ళేంత వ్యవధి కూడా లేకుండా ప్రసవించాను. ఇలాంటి ప్రసవాన్ని అప్రతిష్టగా భావిస్తారని అమ్మ చెప్పింది. ఒక డార్కీ ఇలాగే ప్రసవించిందట.’ అని స్కార్లెట్ అంటుంది. అప్పుడు, ‘నేను కూడా అలాంటి డార్కీనైతే బాగుండుననిపిస్తోం’దని మెలనీ అంటుంది.
మెలనీ ప్రసవించాక ఆమెను తీసుకుని బట్లర్ సమకూర్చిన చిన్న బండిలో స్కార్లెట్ సాహసోపేత ప్రయాణం సాగించి టారాకు చేరుకుంటుంది. మెలనీ అసలే దుర్బలురాలు, దానికితోడు బాలెంత. పుష్టికరమైన ఆహారం లేదు. పూర్తిగా మంచానికే పరిమితమవుతుంది. తనకు పాలు పడకపోవడంతో డిల్సీ (Dilcey) అనే నల్లజాతి స్త్రీ ఆ పసిబిడ్డకు స్తన్యమిస్తుంది. రోగగ్రస్తులకు ఆకలి ఉండదని, తనకిచ్చే పాలు కూడా డిల్సీకే ఇవ్వమని మెలనీ అన్నప్పుడు ఆ నిస్వార్థత స్కార్లెట్‌కు కోపం తెప్పిస్తుంది. అంతకన్నా ఆమెకు ఆశ్చర్యం గొలిపింది, మంచానికే అతుక్కుపోయిన అంత నిస్సత్తువ స్థితిలో కూడా ఇంట్లోని పనివాళ్లతోపాటు తన కొడుకు వేడ్ (Wade), చివరికి తండ్రి జెరాల్డ్ కూడా మెలనీనే పట్టుకుని వేళ్లాడడం!
అసలే తిండికి కటకట పడుతున్న పరిస్థితిలో తండ్రి, చెల్లెళ్ళు, పనివాళ్ళ పోషణభారంతోపాటు మెలనీ భారం కూడా తనకెందుకున్న స్కార్లెట్ ఆమెను, పసికందును అత్త దగ్గరకు మెకాన్‌కు పంపేయాలని కూడా ఒక దశలో అనుకుంటుంది. మెలనీ లాంటి దుర్బలులను తను ఎప్పటికీ ప్రేమించలేనని అనుకుంటుంది తప్ప; మెలనీ ఉనికే తనకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందన్న సంగతిని అప్పటికీ గ్రహించలేని కరడుగట్టిన అజ్ఞానం తనది. ఆ అజ్ఞానాన్ని సమూలంగా పెకిలించగల ఘట్టం త్వరలోనే వస్తుంది కాని, అది స్కార్లెట్‌పై శాశ్వతప్రభావం చూపలేకపోతుంది.
ఒక యాంకీ సైనికుడు దొంగతనానికి ఇంట్లోకి జొరబడతాడు. స్కార్లెట్ అతన్ని చూసి భయంతో బిక్కచచ్చిపోతుంది. ఇంట్లో తను, అస్వస్థులైన ఇద్దరు చెల్లెళ్ళు, బాలెంత అయిన మెలనీ తప్ప మగవాళ్ళు ఎవరూ లేరు. సైనికుల అత్యాచారాల గురించి తను విన్నవన్నీ ఆ క్షణంలో ఆమెకు గుర్తుకొస్తాయి. అతని కంటపడకుండా తను పారిపోలేని పరిస్థితి. అతను డైనింగ్ హాలు దాటి వంటింటి వైపు వెళ్ళడం చూసి ఆమెలోని భయం కాస్తా కసిగా, క్రోధంగా మారిపోయి గొప్ప తెగింపును తీసుకొస్తుంది. కారణం, నిర్మానుష్యాలైన చుట్టుపక్కల ఇళ్ళలోంచి తాము వెతికి తెచ్చిపెట్టుకున్న యాపిల్ పళ్ళు, కూరగాయలు వంటింట్లో ఉన్నాయి. ఇద్దరికి సరిపోయే ఆహారం అవి. కానీ ఇంట్లో ఉన్న తొమ్మిది మంది పంచుకోవాలి. అవి ఆ దొంగ పాలు కావడాన్ని ఆమె సహించలేకపోతుంది. ఆపైన తల్లి ఎలెన్ తన కుట్టుపని సామగ్రిని ఉంచుకునే బంగారు పెట్టెను అతని చేతిలో చూసి మరింత ఆగ్రహంతో ఊగిపోతుంది. చప్పుడు చేయకుండా ఒక సొరుగు లాగి భర్త చాల్స్‌కు చెందిన ఒక బరువైన పిస్టల్ తీస్తుంది. ఆమెను చూసి ఆ సైనికుడు తన పిస్టల్ గురిపెట్టేలోపలే తను అతన్ని కాల్చివేస్తుంది.
తను ఒక మనిషిని చంపింది! ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకోవడం, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం స్కార్లెట్‌కు వెంటనే సాధ్యం కాలేదు. తను పేల్చిన పిస్టల్ చాల్స్‌దే కానీ దానినతను ఎప్పుడూ వాడలేదు, తను వాడింది. అంటే ఈ ఏడాది కాలంలో యుద్ధం, అది తెచ్చిపెట్టిన జీవనకల్లోలం స్త్రీ-పురుష వివక్షను ఎలా చెరిపివేసిందో ఈ చిన్న సూచన ద్వారా రచయిత్రి స్ఫురింపజేస్తుంది. తీరా, రక్తపు మడుగులో పడున్న ఆ సైనికుని మృతదేహాన్ని సమీపించి అక్కడ ఉన్నతల్లి తాలూకు పెట్టెను, అందులోని వస్తువులను చేతిలోకి తీసుకున్నాక స్కార్లెట్‌లో అపరాధభావన తొలగిపోయి సంతృప్తి, గర్వం అంకురిస్తాయి. కళ్ళెత్తి చూసేసరికి ఇంకో ఆశ్చర్యం! మెట్ల మీద మెలనీ! చింకిపాతతో ఉంది. బలహీనమైన ఆమె చేతిలో చాల్స్‌కు చెందిన ఓ బరువైన కరవాలం. నిశ్శబ్దంగా ఆమె కళ్ళు స్కార్లెట్ కళ్లను కలసుకున్నాయి. ఎప్పుడూ మార్దవంగా కనిపించే ఆమె ముఖంలో పట్టలేని గర్వం తెచ్చిపెట్టిన ఒక ఔజ్వల్యం; విపరీతమైన ఆనందం ఉట్టిపడే ఆమె చిరునవ్వులో ఒక ఆమోదముద్ర. స్కార్లెట్ హృదయంలో ఆ క్షణంలో చెలరేగే తీవ్ర కల్లోలంతో ఆ చిరునవ్వు తులతూగింది.
ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైన స్కార్లెట్, ‘తను అచ్చం నా ప్రతిరూపంలా ఉంది, నా హృదయసంచలనాన్ని తను అర్థం చేసుకుంది’ అనుకుంటుంది. అంతేకాదు, ‘నేను చేసిన పనే తనూ చేసి ఉండే’దనుకుంటుంది. ఆ ఊహ కలిగించిన పులకింతతో కళ్ళెత్తి, గాలిలో తేలిపోతున్నట్టున్న ఆ దుర్బలమూర్తిని చూసింది. అయిష్టమూ తృణీకారమూ తప్ప తనలో ఏనాడూ ఎలాంటి ఆదరభావమూ కలిగించని మనిషి తను. అలాంటి ఆష్‌లీ అర్ధాంగిపై ఆమెలోని ద్వేషంతో సంఘర్షిస్తూ ఆ క్షణంలో ఒక ప్రశంసాభావన, సహవాసస్ఫూర్తీ ఉబికి వచ్చాయి. మృదువుగా ధ్వనించే ఆ కంఠధ్వని మాటున ఎలాంటీ అల్పభావోద్వేగస్పర్శ లేని ఒక మెరుపు లాంటి స్పష్టత, పావురం కళ్ళలాంటి ఆ కళ్ళలో దుర్భేద్యమైన ఉక్కు తాలూకు మెరుపులీనే పదునైన సన్నని అంచులూ కనిపించాయి. ప్రశాంతంగా పారే ఆమె రక్తంలో సాహసం ఎగరేసిన జెండా రెపరెపలూ మోగించిన భేరీధ్వానాలూ ఉన్నట్టనిపించింది.
అంతలోనే వాస్తవికతలోకి వచ్చి స్కార్లెట్ అప్రతిభురాలై ఉండిపోయిన స్థితిలో మెలనీ వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. పిస్టల్ పేలిన ధ్వనికి స్కార్లెట్ చెల్లెళ్ళు, కొడుకు భయంతో కేకలు పెడుతున్నప్పుడు మెలనీ వారి దగ్గరికి వెళ్ళి, చాల్స్ పిస్టల్ తుడుస్తుండగా అది పొరపాటున పేలిందని సముదాయిస్తుంది. ‘ఎంత తేలిగ్గా అబద్ధమాడింది! నాకైతే ఆ ఆలోచన వెంటనే వచ్చేది కా’దని స్కార్లెట్ అనుకుంటుంది. పనివాళ్లు వచ్చే లోపలే శవాన్ని ఇక్కడి నుంచి తప్పించాలని తొందరపెట్టిన మెలనీ అందుకు సాయపడడానికి ముందుకొస్తుంది. నేనే ఆ పని చేస్తానని స్కార్లెట్ అన్నప్పుడు, శవం పడున్న ప్రదేశాన్ని శుభ్రం చేసే బాధ్యత మెలనీ తీసుకుంటుంది. అతని భుజం సంచీలో ఏమైనా తినే పదార్థాలు ఉండచ్చని వెతుకుదామని సలహా ఇచ్చింది. అందులో చిన్న కాఫీ పొట్లంతో పాటు అతను దొంగిలించిన రకరకాల వస్తువులు; అతని జేబులో పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతాయి.
పైకి కనిపించే తన ఆకృతికి, స్వభావానికి భిన్నంగా; ఒక మనిషిని చంపడంతో సహా యుక్తాయుక్త మీమాంసను అధిగమించి తక్షణమే క్రియాశీల కావడంలో స్కార్లెట్‌లో లేని వేగం మెలనీలో ఉంది. అంతకంటే ఆశ్చర్యకరంగా ఆ వేగంలోనూ సమయస్ఫూర్తితోపాటు ఎక్కడా తడబాటుకు, ఊగిసలాటకు తావివ్వని అసాధారణమైన స్పష్టత ఉంది. అప్పుడున్న ఆ క్లిష్టపరిస్థితులలో మెలనీతో బలమైన సహవాసిత్వాన్ని అల్లుకోవడం ఎంత అవసరమో స్కార్లెట్ గ్రహించడానికి ఇంతకు మించిన అనుభవం మరొకటి ఉండదు.
ఆ తర్వాత ఒక అగ్నిప్రమాదం నుంచి మెలనీ తనను కాపాడిన మరో గొప్ప అనుభవం స్కార్లెట్‌కు ఎదురవుతుంది. ఆ సమయంలో తన ఆడబడుచుపై ఆమెలో మున్నెన్నడూ లేనంత గౌరవభావము, మరింత సన్నిహిత సహవాసిత్వ భావన, అంకురిస్తాయి. ఈ విషయం తనతో చెప్పాలని కూడా అనుకున్న స్కార్లెట్, ప్రతి అవసరానికీ నేనున్నానని తను ముందుకు వస్తూనే ఉందని అనుకుంటుంది. అయితే, మళ్ళీ అదీ క్షణికమే అవుతుంది. మెలనీపట్ల అయిష్టమూ చిన్నచూపే కాక; వాటిని మించిన ద్రోహబుద్ధి ఆమెలో ఆ తర్వాతా పడగవిప్పుతూనే వచ్చింది. ఆష్‌లీ టారాకు తిరిగి వచ్చిన తర్వాత అతనితో జరిగిన తన దీర్ఘసంభాషణలో, ఇద్దరం ఏ మెక్సికోకో పారిపోదామని స్కార్లెట్ ప్రతిపాదన చేసినప్పుడు, మెలనీకి నేను ద్రోహం చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావని ఆష్‌లీ ప్రశ్నిస్తాడు.
మెలనీ సాంప్రదాయికమైన కట్టుబాట్లను, అంతస్తుల తేడాలను తోసిరాజన్న సందర్భాలు ఉన్నట్టే, వాటిపై తన పట్టింపును చాటుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ వైరుధ్యాన్ని కాస్త లోతుగా చూసి అర్థం చేసుకుంటే వాస్తవంగా మెలనీ పట్టింపు వీటి వేటి మీదా కాక, మనిషి గురించి, మానవత్వం గురించి అన్న అభిప్రాయం కలుగుతుంది. ఉదాహరణకు, తమలానే సంపన్న ప్లాంటర్ తరగతికి చెందిన కేథలీన్ కాల్వర్ట్ (Cathleen Calvert) అనే అమ్మాయి తమ అంతస్తుకు తగని హిల్టన్ (Hilton) అనే ఓవర్సీర్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్టు స్కార్లెట్, మెలనీలకు చెప్పినప్పుడు, అందులో ధ్వనించిన విషాదం మెలనీని చలింపజేస్తుంది. దాంతో కాల్వర్ట్‌ల వంశమే అంతరించే ప్రమాదాన్ని ఊహించుకుని, అంతకన్నా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే ఉత్తమమని స్కార్లెట్‌తో అంటుంది. అంతేకాదు, పనివాడు పోర్క్‌ను పంపించి కేథలీన్‌ను మన ఇంటికి రప్పించుకుందామని, తను మనతోనే ఉంటుందనీ స్కార్లెట్‌తో అంటుంది. ఇంట్లో అయినవారికే కడుపునిండా తిండిపెట్టలేకపోతున్న దుర్దశలో మెలనీ సలహాకు స్కార్లెట్ విస్తుపోతుంది. ‘నువ్వే నెలల తరబడిగా నా దాతృత్వం కింద గడుపుతున్న సంగతి నీకు ఎప్పుడూ తట్టలేదు. యుద్ధం ఎలాంటి మార్పూ తేని మనుషుల్లో నువ్వొకదానివి. అసలేమీ జరగనట్టు, జీవితం ఇంతకుముందు ఉన్నట్టే ఉన్నట్టు అనుకుంటున్నా’వని మనసులో అనుకుంటుంది. ప్రతి సందర్భంలోనూ తనకు అక్కరకు వస్తూ, చివరికి తన ప్రాణాలను కూడా కాపాడిన మెలనీ తన ‘దాతృత్వంలో జీవిస్తోం’దనుకోవడం స్కార్లెట్‌లో ఇప్పటికీ చావని అహానికి, మెలనీపై చిన్నచూపుకీ సూచన.
కేథలీన్ విషయంలో అంతస్తుకు ప్రాధాన్యమిచ్చిన మెలనీయే విల్ బెంటీన్ అనే బీదరైతు విషయానికి వచ్చేసరికి అంతస్తుల తేడాలను తోసిపుచ్చే వైఖరి తీసుకుంటుంది. ఆమెలోని నిర్ద్వంద్వతను, స్కార్లెట్ లోని ద్వైధీభావాన్నీ ఆశ్చర్యకరంగా పట్టి చూపే మరో సందర్భం ఇది. విల్ బెంటీన్ వ్యక్తిత్వానికి ముగ్ధురాలైన స్కార్లెట్ తన చిన్న చెల్లెలు కరీన్‌ను అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నా, ఓహారాలకు తూగడని సంశయించినప్పుడు- ‘అతనికున్నలాంటి దయార్ద్ర హృదయమూ పరోపకారచింతనా ఉన్నవారు ఎవరైనా ఉత్తమజన్ములే’ నంటూ మెలనీ ఆ వివాహం ఆలోచనను సమర్థిస్తుంది. ఇలాంటి అనేక ఘట్టాలలో మెలనీలో తన ఆకృతికీ, స్వభావానికీ పూర్తి భిన్నంగా తోచే, కేవలం ధర్మశాస్త్రకర్తలలో మాత్రమే కనిపించే, ఒక నిష్కర్ష, ఒక అనుశాసనత్వం ధ్వనిస్తాయి. ఆమెలోని నైతిక దారుఢ్యం నుంచి, అన్ని రకాల సంకోచాలనూ చెరిపివేయగల ఎల్లలెరుగని ప్రేమైక శీలం నుంచి, అచంచలమైన మానవీయ చింతననుంచీ సంక్రమించే లక్షణాలు అవి. ఆ ప్రేమైకాశీలత, ఆ మానవీయ చింతనల ముందు కట్టుబాట్లు, అంతస్తుల తేడాలు సహా కాలం గిరిగీసేవి అన్నీ పక్కకు తొలగిపోతాయి. లేదా వాటికి అనుగుణంగా సర్దుకుంటాయి, రూపాంతరం చెందుతాయి. ఎలాంటి సంక్షోభాలనైనా అధిగమించి బతికి బట్టకట్టే కొన్ని విలువలు ఎప్పటికీ మనిషి వెన్నంటి ఉంటూనే ఉంటాయి. అంతిమంగా మెలనీ ప్రాతినిధ్యం వహించేది ఆ విలువలకు. వాటి గురించిన స్పృహ, ప్లాంటర్ల తరగతికి చెందిన ఎందరిలోనో లేని గొప్ప ఆశాభావాన్ని ఆమెలో నింపుతుంది. కేథలీన్‌ను కలసుకున్న సందర్భంలో జరిగిన సంభాషణ ఇందుకు ఒక ఉదాహరణ. ‘స్కార్లెట్, (యుద్ధంలో) మరణించిన మన మగవాళ్ళ స్థానాలను భర్తీ చేసేలా, వాళ్ళ లాంటి ధైర్యవంతుల్నిగా మన పిల్లల్ని పెంచుదా’మని మెలనీ అంటుంది. ఇందులో ఆమె ఉగ్గడించినది ధైర్యమనే చిరంతన విలువను! దానికి కేథలీన్ స్పందిస్తూ, ‘అలాంటి పురుషులు మళ్ళీ పుట్టరు, వాళ్ళ స్థానాలను ఎవరూ భర్తీ చేయలేరు,’ అంటుంది. ప్రేమైకశీలమూ మానవీయచింతనా అనే లోతుల్లోంచి ఉబికివచ్చే ఆశాభావం నిండిన మెలనీ వ్యక్తిత్వానికి, మిగతావారి వ్యక్తిత్వానికి ఉన్న తేడాకు ఇది మచ్చుతునక. ఈ తేడాలోనే ఉంది మెలనీ ముఖంగా నవల ధ్వనించే మొత్తం సందేశమంతా.
భారతీయ సాంప్రదాయిక గృహిణి విషయంలో నొక్కి చెప్పే ‘పాతివ్రత్య’చాయలు మెలనీలోనూ ప్రస్ఫుటంగా కనిపించడం రెండు సాంప్రదాయిక సమాజాల మధ్య భౌగోళికదూరాన్ని చెరిపివేస్తూ సామ్యాన్ని వెల్లడించే ఇంకొక విశేషం. యుద్ధం ముగిశాక, ప్రాణాలతో బయటపడిన దక్షిణాది సైనికులు తిండి కోసం, నిలువ నీడకోసం అల్లాడుతూ గుంపు గుంపులుగా నడిచివస్తూ ఉంటారు. అలా టారా నీడలోనూ కాసేపు సేదదీరుతూ ఉంటారు. అతిథిని ఆదరించి అన్నం పెట్టే వెనకటి పరిస్థితి ఇప్పుడు లేదు. అయినా ఉన్నదాన్నే వారితో పంచుకుంటూ వచ్చినా ఇక మీదట అది సాధ్యం కాదనుకున్న స్కార్లెట్ ఆతిథ్యం తగ్గించమని పనివాడు పోర్క్‌ను ఆదేశిస్తుంది. దాంతో మెలనీ తన వాటా ఆహారంలో కొంతే తీసుకుని మిగతాది అతిథులకు పెట్టే ఏర్పాటు చేస్తుంది. ఇది తెలిసిన స్కార్లెట్, ప్రసవించిన తర్వాత ఇంతవరకు నువ్వు బలం పుంజుకోలేదు, ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందని మందలిస్తుంది. అప్పుడు మెలనీ కళ్ళల్లో ఎన్నడూ కనిపించనంత ఉద్వేగం కనిపిస్తుంది. ఇలా అంటుంది: ఓహ్! స్కార్లెట్, నా మీద కోప్పడకు. నన్నిలా చేయనివ్వు. ఇది నన్నెంత ఆదుకుంటుందో నీకు తెలియదు. ఒక పేదమనిషితో నా వాటా అన్నం పంచుకున్నప్పుడల్లా నేను ఒకటే అనుకుంటూ ఉంటాను; ఉత్తరాదిన ఎక్కడో ఏ రోడ్డు మీదో ఇలాగే నడిచివెళ్లే నా ఆష్‌లీకి ఏ చల్లని తల్లో తన అన్నం లోంచి నాలుగు ముద్దలు పెడుతుంది. తను నా దగ్గరికి రావడానికి అది ఓపిక నిస్తుంది.
భర్త క్షేమం కోసం భారతీయ గృహిణులు చేసే ఉపవాసాలు, వ్రతాలతో ఇక్కడ పోలిక సరే; ఆశ్చర్యం గొలిపే ఒక తేడా కూడా ఉంది. ఉపవాసాలు, వ్రతాల వెనుక వ్యక్తమయ్యే ఒక యాంత్రిక విశ్వాసానికి భిన్నంగా తనిక్కడ ఒక అన్నార్తుడికి అన్నం పెడితే, దయగల ఏ తల్లో తన భర్తకూ ఇలాగే అన్నం పెడుతుందన్న ఒక సరళమైన తర్కము, లౌకికంగా మన బుద్ధికి అందే ఒక హేతుబద్ధత మెలనీ మాటల్లో ఉన్నాయి. అంతేకాదు, దయ, సానుభూతి వంటి సహజాతాలు దేశ కాలాలను, ప్రాంతాలను, శత్రుత్వాలనూ కూడా దాటి తమ ఉనికిని చాటుకుంటాయన్న గొప్ప భరోసా, దృష్టివైశాల్యం ఆ మాటల్లో వ్యక్తమవుతాయి.
మెలనీలోని ఈ సరళ తార్కికత, హేతుబద్ధత మరింత ఆశ్చర్యకరంగా వ్యక్తమైన మరో సందర్భం అట్లాంటాలోని ప్లాంటర్‌ల సమాజానికి ఆమెను నాయకురాలిగా ప్రతిష్టిస్తుంది. అమరవీరుల సమాధులున్న ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దడానికి, యుద్ధంవల్ల వితంతువులు, అనాథలుగా మారినవారికి కుట్టుపని నేర్పించి ఉపాధి కల్పించడానికీ రెండు సంఘాలు ఏర్పడి అప్పటికే పనిచేస్తూ ఉంటాయి. యుద్ధంలో మరణించిన యాంకీ, కాన్ఫెడరేట్ సైనికుల సమాధులు పక్కపక్కనే కలసిపోయి ఉండడం, వాటి చుట్టూ కలుపు మొక్కలు పెరిగిపోవడంతో శత్రుసైనికుల సమాధుల దగ్గర కూడా శుభ్రం చేయాలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. కుట్టు పని సంఘం శుభ్రం చేయాలని భావిస్తే, రెండో సంఘం దానిని వ్యతిరేకిస్తుంది. వివాదం ముదిరి ఘర్షణకు దారితీస్తుంది. యాంకీల సమాధుల్నే తవ్వేసి వాళ్ళ మృతదేహాలను చెత్తకుప్ప మీద పారేస్తానని మిసెస్ మీడ్ అంటుంది. ఇలా ఆగ్రహావేశాలు మిన్నంటిన ఆ దశలో మెలనీ వాళ్ళ మధ్యకు వెళ్ళి గొంతు విప్పుతుంది. ఆమె మృదువైన కంఠధ్వనికి, అందులోని గాద్గద్యానికి చలించిన రెండు పక్షాలూ వెంటనే మౌనంగా వహిస్తాయి. ఒక్కసారిగా చల్లబడిన ఆ నిశ్శబ్ద వాతావరణంలో మెలనీ గొంతు ఇలా వినిపిస్తుంది: నేను ఒక మాట చెప్పదలచుకున్నాను. నేను చాలా రోజులుగా దీని గురించి ఆలోచిస్తున్నాను. మనం సమాధుల దగ్గర కలుపు తీయడమే కాదు, వాటి దగ్గర పువ్వులు కూడా ఉంచాల్సిందే. మీరు ఏమనుకున్నా సరే, నా ప్రియమైన చార్లీ సమాధి దగ్గర పువ్వులు ఉంచిన ప్రతిసారీ పక్కనే ఉన్న ఒక అజ్ఞాత యాంకీ సమాధి దగ్గర కూడా పువ్వులు ఉంచి వస్తూ ఉంటాను. అది- అది దిక్కూ దివాణంగా లేనిదిగా కనిపిస్తుంది!
వ్యతిరేకులు ఆమె మాటలకు అడ్డుతగలబోతారు. అప్పుడు మెలనీ ప్రాధేయపూర్వకంగా వాళ్ళతో అంటుంది: దయచేసి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఈ విషయం మీద మాట్లాడే హక్కు నాకు లేదని తెలుసు. ఒక్క చార్లీ తప్ప నా ప్రియతములు ఎవరూ యుద్ధంలో చనిపోలేదు. అయితే, తనను ఎక్కడ సమాధి చేశారో, భగవంతుడి దయవల్ల నాకు తెలుసు. కానీ, తమ కొడుకుల్ని, భర్తలను, సోదరులను ఎక్కడ సమాధి చేశారో కూడా తెలియని అభాగ్యులు ఈ రోజున మనలో ఎంతమంది ఉన్నారో గమనించారా…
దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోతుంది. అంతటా నీరవనిశ్శబ్దం అలముకుంటుంది. యుద్ధంలో తమ ప్రియతములను కోల్పోయిన అక్కడున్న ఎందరో మహిళల గుండెల్ని మెలనీ మాటల్లోని నిష్టురసత్యం శూలంలా గుచ్చుకుని నిరుత్తరలను చేస్తుంది. దాంతో మరింత స్థైర్యాన్ని పుంజుకున్న మెలనీ అంటుంది: యాంకీల సమాధులు మన దగ్గర ఉన్నట్టే, మన వాళ్ళ సమాధులు యాంకీల దేశంలో ఎక్కడో ఉంటాయి. ఏ యాంకీ మహిళైనా మన వారి సమాధుల్ని తవ్వి పారేస్తానంటే మన కెలా అనిపిస్తుంది — అదే, ఒక ఉత్తమురాలైన యాంకీ మహిళ అక్కడా ఉండే ఉంటుందని తెలిస్తే మనకెంత బాగుంటుంది– యోగ్యులైన యాంకీ మహిళలు కచ్చితంగా ఉంటారు. ఎవరేమనుకున్నా సరే, వాళ్ళందరూ అయోగ్యులు కావడానికి వీల్లేదు. తమకు ఎంత శత్రువులైనాసరే, మన వాళ్ళ సమాధుల దగ్గర వాళ్ళు కలుపు తొలగించి పువ్వులు కూడా ఉంచితే అదెంత హృదయంగమంగా ఉంటుంది! చార్లీ ఉత్తరాదినే చనిపోయి ఉంటే ఏ పుణ్యాత్మురాలైనా అలా చేస్తుందన్న ఊహ నాకు ఎంతో ఓదార్పునిస్తుంది. నా గురించి మీరు ఏమనుకున్నా లెక్క చేయను… రెండు సంఘాలనుంచీ తప్పుకుంటాను. నాకు కనిపించిన ప్రతి యాంకీ సమాధి దగ్గరా కలుపు తొలగిస్తాను. అంతేకాదు, వాటి దగ్గర పువ్వులు కూడా ఉంచుతాను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను!
ఈ చివరి మాటలతో, కళ్ళు జలజలా వర్షిస్తుండగా ఆపుకోలేని ఉద్వేగంతో తడబడుతూ మెలనీ బయటకు వెళ్లబోతుంది. ఓ గంట తర్వాత, గ్రాండ్‌పా మేరీవేదర్ అంకుల్ హెన్రీ హామిల్టన్‌కు చెప్పిన ప్రకారం, మెలనీ ఈ మాటలన్న తర్వాత అక్కడున్న అందరూ భోరున విలపిస్తూ మెలనీని వాటేసుకుంటారు. వాతావరణం ఒక్కసారిగా ప్రేమోద్వేగపూరితంగా మారిపోతుంది. రెండు సంఘాలకూ మెలనీని కార్యదర్శిని చేస్తారు.
ఇక్కడ యాంకీ సైనికుల సమాధుల దగ్గర కూడా శుభ్రం చేసి పువ్వులు ఉంచితే అక్కడి దయగల తల్లులు తమ వాళ్ళ సమాధులనూ అలాగే గౌరవిస్తారన్న- అదే సరళమైన తర్కం, అదే హేతుబద్ధత మెలనీ మాటల్లో! ఎల్లలెరుగని మంచితనం, మానవత్వాల పట్ల అదే ధీమా. మళ్ళీ అది స్వార్థాన్ని పూర్తిగా చంపుకుని పరార్థం కోసం పాకులాడాలని చెప్పే విపరీత ఆదర్శవాదం కాదు; స్వార్థంతో కూడిన పరార్థచింతన. యుక్తియుక్తంగా మనల్ని ఒప్పించగలిగిన ఆచరణయోగ్యమైన పరార్థదృష్టి. మెలనీ ప్రేమాస్పద వ్యక్తిత్వాన్ని మరింత ఉజ్వలింపజేస్తూ ఆకర్షణ గొలిపేది ఆమెలోని ఈ అసాధారణ వివేకమే. వీటికి అదనంగా, ఆరు నూరైనా సరే, తను నమ్మింది ఆచరించే ఆమెలోని సాహసాన్నీ ధిక్కారాన్నీ అంతిమంగా అందరినీ తన వెంట నడిపించుకోగలిగిన నాయకత్వ లక్షణాన్నీ కూడా వెల్లడించే సందర్భం ఇది. అయితే అట్లాంటా లోని ప్లాంటర్‌ల సమాజానికి తను నాయకురాలు అవుతున్న సంగతి అప్పటి కామెకు తెలియనే తెలియదు.
ఇక్కడినుంచి ఓసారి వెనకకు, అంటే మెలనీ, స్కార్లెట్‌లు టారాలో కలసి గడిపిన రోజులకు వెడదాం. ఎప్పటిలానే మెలనీని అర్థంచేసుకోడానికి స్కార్లెట్‌కు ఒక జీవితకాలం పట్టేలానే ఉంది. ఆమె తండ్రి జెరాల్డ్ చనిపోతాడు. తల్లి ఎలెనును అమితంగా అభిమానించే గ్రాండ్‌మా ఫాన్‌టెయ్‌న్ (Fontaine) జెరాల్డ్ అంత్యక్రియలకు వస్తుంది. ఆమె ఈ ఒక్క సందర్భంలోనే కనిపించి మాయమయ్యే చిన్న పాత్ర. కానీ దక్షిణాది ప్లాంటర్‌ల సమాజం తీరుతెన్నులను లోతుగా ఎరిగి వ్యాఖ్యానించగలిగిన ఒక ప్రతినిధిపాత్ర. రెట్ బట్లర్ లోని కరకుదనం, మెలనీలోని వివేకం, స్కార్లెట్ లోని సాహసంతో పాటు, రేపటి పట్ల ఆ ముగ్గురిలోనూ ఉన్న ఆశాభావం ఆమె మాటల్లో వ్యక్తమవుతుంది.
ఆమెకూ స్కార్లెట్‌కూ మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. నవలలోని దీర్ఘసంభాషణలలో అదొకటి. వివిధ సందర్భాలలో జరిగిన ఈ దీర్ఘసంభాషణలు అంతర్యుద్ధ నేపథ్యంలో ప్లాంటర్‌ల సమాజ స్థితిగతుల సమీక్షలుగానూ భవిష్యనిర్దేశాలుగానూ కనిపించి కీలకమైన ప్రబోధాత్మక పాత్ర నిర్వహిస్తాయి. ఈ దీర్ఘసంభాషణలు అన్నింటిలో స్కార్లెట్ భాగస్వామి కావడం కూడా గమనించవలసిన అంశం. విచిత్రంగా, ఇలాంటి అంతర్యుద్ధమే ప్రధాన వస్తువుగా ఉన్న మహాభారత ఇతిహాసంతోనూ ఇక్కడ పోలిక కుదురుతోంది. అందులో కూడా వివిధ ఘట్టాలలో ప్రబోధాత్మకాలైన దీర్ఘ సంభాషణలు ఉంటాయి. యుద్ధ సమయంలో భగవద్గీత రూపంలో కృష్ణార్జునుల మధ్య జరిగిన దీర్ఘసంభాషణ ఇలాంటిదే.
కరీన్‌ను తను ఇష్టపడినా, సుఎలెన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు అంత్యక్రియల ప్రసంగంలో విల్ బెంటీన్ ప్రకటిస్తాడు. డబ్బుమీద ఆశతో యూనియన్‌కు విధేయతను చాటే పత్రంపై సంతకం చేయమని తండ్రిపై ఒత్తిడి తెచ్చి పరోక్షంగా అతని ఆకస్మిక మరణానికి బాధ్యురాలిగా నింద మోయవలసివచ్చిన సుఎలెన్‌పై సానుభూతే అతని ఈ నిర్ణయానికి కారణం. ఫాన్‌టెయిన్, స్కార్లెట్‌ల సంభాషణలో ఈ పెళ్లి ప్రస్తావన వస్తుంది. ‘నీ చెల్లెలు తన తరగతికి చెందని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా?’ అని ఫాన్‌టెయిన్ అడుగుతుంది. ‘తరగతా?’ అంటూ విస్తుపోయిన స్కార్లెట్, ‘ఇప్పుడు తరగతి ఎవరిక్కావాలి? అమ్మాయిని పోషించగలిగిన మొగుడు దొరికితే గొప్ప’ అంటుంది. ‘అయితే విల్ నీ కుటుంబంలో ఒకడు కావడం నీకు సమ్మతమేనా?’ అని ఫాన్‌టెయిన్ గుచ్చి అడుగుతుంది. తను ఈ పెళ్లిని ఖండించబోతోందనుకున్న స్కార్లెట్ ఆమె మీద విరుచుకుపడడానికి సిద్ధమవుతూ, ‘సమ్మతమే’నని నొక్కి చెబుతుంది.
కానీ, ఫాన్‌టెయిన్ స్పందన ఆమె ఊహను తలకిందులు చేసి ఆశ్చర్యపరుస్తుంది. చిరునవ్వుతోనే ఈ పెళ్ళికి తన ఆమోదాన్ని సూచించిన ఫాన్‌టెయిన్, ‘ఇంతవరకూ నీ మీద నాకు ఎప్పుడూ ఇష్టం కలగలేదు. చిన్నప్పటినుంచీ నువ్వు కొరకరాని కొయ్యవే (మూలంలో వాడిన మాట, hickory nut). నేను మినహా ఆడవాళ్ళు ఎవరూ అలా ఉండడం నాకు నచ్చదు. కానీ నువ్వు సమస్యలను ఎదుర్కొనే తీరును నేను ఇష్టపడతాను. నీకు ఎంత నచ్చనివైనా నీ చేతుల్లో లేని వాటి గురించి నువ్వు అదే పనిగా గింజుకోవు,’ అని స్కార్లెట్‌తో అంటుంది.
‘అయితే ఈ పెళ్లిని నువ్వు ఆమోదిస్తున్నావన్నమాట,’ అని తను గుచ్చి అన్నప్పుడు ఫాన్‌టెయిన్ చెప్పిన సమాధానం స్కార్లెట్‌ను మరోసారి చిత్తు చేస్తుంది. ‘ఈ పెళ్లిని నువ్వు ఎంత ఆమోదించవో నేనూ అంతే ఆమోదించను. కానీ నేను ఆచరణవాదిని, నువ్వూ అంతే,’ నన్న ఫాన్‌టెయిన్ పడిపోయిన ప్రతిసారీ తిరిగి పైకి లేచిన ప్లాంటర్‌ల సమాజపు గతాన్ని స్పృశిస్తూ దానిలోని జీవశక్తి ఎలాంటిదో చెబుతుంది. అంతకంటే ముఖ్యంగా ఈ అంతర్యుద్ధ పతనాన్ని తట్టుకుని తిరిగి ఈ సమాజం సంతరించుకోగల పూర్వవైభవం పట్ల చెక్కుచెదరని ఆశాభావాన్ని ప్రకటిస్తుంది. మన చేతుల్లో లేని అసంతుష్టికర పరిణామాలు సంభవించినప్పుడు దాని గురించి ఊరికే గింజుకోవడంలో తనకు ఎలాంటి అర్థమూ కనిపించదంటుంది. తిరిగి పుంజుకునే అదను కోసం నిరీక్షిస్తూ, ఇలాంటి అనేక ఉత్పాతాలను చిరునవ్వుతో ఎదుర్కొన్నామని, ఆ విధంగా ఎలాగైనా బతికి బట్టకట్టే కళలో సిద్ధహస్తులమయ్యామని, అదే మన అస్తిత్వ రహస్యమనీ అంటుంది. ‘మనం ప్రతిసారీ తప్పుడు గుర్రాల మీదే పందెం కాశాం. హ్యూగనాట్‌లతో కలసి ఫ్రాన్స్ నుంచి; కెవాలియర్‌లతో కలసి ఇంగ్లండ్ నుంచి; బోనీ ప్రిన్స్ చార్లీతో కలసి స్కాట్లండ్ నుంచి; నల్లజాతివారితో కలసి హేటీ (Haiti) నుంచి మనం పారిపోయి ఇక్కడికి వచ్చాం. అయినా కొన్నేళ్లలోనే తిరిగి పైకి ఎగబాకగలిగాం,’ అంటుంది. పతనం నుంచి పైకి లేచే ఈ ప్రక్రియలో మనకంటే తక్కువ తరగతి జనాల బుజాలపై కూడా చేతులు వేసి నడిచామనీ, వాళ్ళు మనకు ఎంతవరకు పనికొస్తారో అంతవరకూ వాడుకున్నానమనీ, తిరిగి వెనకటి బలాన్ని పుంజుకున్నాక వారిని తన్ని తరిమేశామనీ అంటుంది. అదేపనిగా గతవైభవాన్ని తలచుకుంటూ మనకు మనం అణగారిపోవాల్సిందే తప్ప, మనల్ని అణగదొక్కే శక్తి ఈ మొత్తం ప్రపంచానికే లేదని తీర్మానిస్తుంది.
[Huguenots: క్రైస్తవమతంలోని సంస్కరణ సంప్రదాయానికి చెందిన ఫ్రెంచ్ ప్రొటెస్టెంట్‌లను సూచించే ఈ మాట 16వ శతాబ్దిలో పుట్టి 19వ శతాబ్ది ప్రారంభంవరకు వ్యాప్తిలో ఉంది; Cavaliers: 1640 లలో ఇంగ్లీష్ అంతర్యుద్ధంలో రాజుకు మద్దతు తెలిపినవారు; Bonnie Prince Charlie: [1720-88] ఇంగ్లండ్, స్కాట్లండ్, ఐర్లండ్‌ల రాజు జేమ్స్ II కొడుకు ప్రిన్స్ చాల్స్ ఎడ్వర్డ్ స్టువర్ట్ ఈ పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. స్కాట్లండ్‌లో స్టువర్ట్‌లకు ప్రజల మద్దతు ఉండేది. బ్రిటన్ సింహాసనంపై తన హక్కును స్థాపించుకునేందుకు ఇతను 1745లో రాజు జార్జి IIతో యుద్ధం చేసి ఓడిపోయి అయిదు మాసాలపాటు స్కాట్లండ్‌లో అజ్ఞాతంగా గడిపి ఆ తర్వాత ఫ్రాన్స్‌కు పారిపోయాడు.]
‘తక్కువ తరగతి జనాన్ని అవసరానికి వాడుకుని ఆ తర్వాత తన్ని తరిమేస్తా’మనడంలోని విపరీత, వికృత మనస్తత్వాన్ని హర్షించలేకపోయినా ఫాన్‌టెయిన్ అన్న మిగతా మాటలు ఈ నవలలోని ఆష్‌లీకే కాక వేయిపడగలు లోని ధర్మారావుకూ వర్తిస్తాయి. ఇద్దరూ గతవైభవ స్మరణలోనే మునిగి వర్తమానంలో అకర్మణ్యతలోకి జారిపోయినవారే. (అలౌకిక జగత్తుకు చెందిన ఒక అజెండా ధర్మారావుకు ఉన్నప్పటికీ, లౌకిక జగత్తుకు వస్తే, నవలలో చిత్రితమైన మేరకు అతనిలో అకర్మణ్యతే కనిపిస్తుంది.) తమకంటే తక్కువ తరగతికి చెందిన జనాలతో కలసి నడవడంలో ఇబ్బంది పడినవారే.
అదలా ఉంచితే, ఈ సంభాషణ సందర్భంలోనే మెలనీ గురించి ఫాన్‌టెయిన్ అన్న మాటలు స్కార్లెట్‌కు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆష్‌లీని ఒక అప్రయోజకుడిగా తీసిపారేస్తూ, విల్క్స్ కుటుంబం ఈ గడ్డుకాలాన్ని దాటడమంటూ జరిగితే ఆ ఘనత మెలనీదే కానీ ఆష్‌లీది కాదని ఆమె అంటుంది. ఆ మాటకు విస్తుపోయిన స్కార్లెట్, తను మెలనీతో చాలాకాలంగా కలిసుంటున్నానని, ఆమె గురించి తనకు బాగా తెలుసని, తనో రోగిష్టిదని, బాతును కూడా అదిలించే ధైర్యం తనకు లేదనీ అంటుంది. నిజానికి ఇక్కడ ఆశ్చర్యం గొలిపేది, మెలనీతో అన్ని అనుభవాల తర్వాత కూడా ఆమె ఎలాంటిదో తెలుసుకోలేకపోయిన స్కార్లెట్ లోని అజ్ఞానం. అప్పుడు ఫాన్‌టెయిన్ అంటుంది: ఆమె బాతును కూడా అదిలించలేకపోవచ్చు, తన ప్రాణప్రదుడైన ఆష్‌లీకి గాని, తన కొడుక్కి గాని, తను విశ్వసించే ఉత్తమ జీవనసరళికి గానీ ముప్పు ఏర్పడితే ఈ ప్రపంచాన్నీ ఈ యాంకీ ప్రభుత్వాన్నే కాదు, దేనినైనా అదిలించగలదు. ఆమెది నీ లాంటి, నా లాంటి పంథా కాదు; మీ అమ్మ పంథా. మీ అమ్మ జీవించి ఉంటే ఆమెలానే వ్యవహరించి ఉండేది. మెలనీని చూస్తుంటే చిన్నప్పటి మీ అమ్మే నాకు గుర్తొస్తోంది… తను అర్భకురాలే కావచ్చు, కానీ విల్క్స్ కుటుంబాన్ని ఉద్ధరించగలిగింది తనే.
సుఎలెన్, విల్ బెంటీన్‌ల పెళ్లై, కరీన్ చాల్స్‌టన్‌లోని కాన్వెంట్‌కు వెళ్ళిన తర్వాత ఆష్‌లీ, మెలనీ అట్లాంటా చేరతారు. యుద్ధంలో పాక్షికంగా ధ్వంసమైన ఒక రెండంతస్తుల భవనంలోని చిన్న భాగంలో కాపురం పెడతారు. అంత అందవికారమైన కొంప ఎక్కడా ఉండదని స్కార్లెట్ అనుకుంటుంది. దానికితోడు చవకబారు ఫర్నిచర్. కానీ మెలనీకి ఆ ఇల్లు ట్వెల్వ్ ఓక్స్ లోని తమ ఒకప్పటి భవంతి కన్నా అందంగా కనిపిస్తుంది. కారణం, చాలాకాలం తర్వాత తను, తన భర్త తమదైన ఒక కప్పు కింద ఉన్నారు. అవివాహిత అయిన ఆష్‌లీ చెల్లెలు పాతికేళ్ళ ఇండియా కూడా మెకాన్ నుంచి వచ్చి అన్నా వదినెల పంచన చేరింది. రోజులు మారాయి, చేతిలో చిల్లిగవ్వ ఆడని పరిస్థితి. కానీ కూటికి కరువైన పెళ్లికాని ఆడబంధువులను దగ్గరికి తీసి ఆదరించే దక్షిణాది సాంప్రదాయిక జీవనశైలిలో ఎలాంటి మార్పూ లేదు.
మెలనీలో వెల్లివిరుస్తున్న ఆ సంతోషమూ సంతృప్తీ స్కార్లెట్‌కు మరో ఆశ్చర్యం. తను ముందే బలహీనురాలు. ప్రసవం ఉన్న ఆ కాస్త ఓపికనూ హరించింది. ఆపైన తిండికి కటకట, టారాలో అందరితో కలసి తనూ కాయకష్టం చేయవలసి వచ్చింది. దాంతో కొంచెమైనా ఆరోగ్యాన్ని పుంజుకునే అవకాశం ఆమెకు కలగలేదు. చిక్కి శల్యమైంది. ఆమె చిన్న ముఖంలో కళ్ల కింద ఉన్న నల్లని మచ్చలు ఆ కళ్ళను మరీ పెద్దవిగా చూపిస్తున్నాయని స్కార్లెట్ అనుకుంటుంది. కానీ, వాటిలోని అభివ్యక్తి మారలేదు, ఏ చీకూచింతా లేని తన కౌమార వయసులో ఆ అభివ్యక్తి ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. యుద్ధమూ అది తెచ్చిపెట్టిన అంతులేని వ్యథా ఆ కళ్ళల్లో ఉట్టిపడే ప్రశాంతమాధుర్యం ముందు ఓడిపోయాయి. తన చుట్టూ రేగిన ఎలాంటి కల్లోలాలైనా సరే చెదరగొట్టలేని స్వభావసిద్ధ నైర్మల్యం కలిగిన నిత్యసంతోషి అయిన ఒక ఇల్లాలి కళ్ళు అవి.
తను ఆ కళ్లను అలా ఎలా ఉంచుకోగలిగిందోనని స్కార్లెట్ అనుకుంటుంది. అసూయతో ఆమెనే చూస్తూ ఉండిపోతుంది. తన కళ్ళు ఒక్కోసారి ఆకలిగొన్న పిల్లి కళ్ళలా ఉంటాయని తనకు తెలుసు. మెలనీ కళ్ళ గురించి ఓసారి రెట్ అన్న మాటలు ఆమెకు గుర్తొస్తాయి. ఈ తుంటరి ప్రపంచంలో రెండు సత్కార్యాలను తలపించే కళ్ళు అవి (Like two good deeds in a naughty world)!
ఇక్కడ మెలనీని వేయిపడగలులోని అరుంధతితో పోల్చాలనిపిస్తుంది. అలాగే, ధర్మారావుతో కూడా. భర్త తోడిదే లోకంగా జీవించడంలో మెలనీ, అరుంధతీ సమానమే. మెలనీలానే అరుంధతి జబ్బుపడి చిక్కిశల్యమవుతుంది. మెలనీలానే కన్నుమూస్తుంది. జబ్బుపడినప్పటి ఆమె స్థితిని రచయిత ఇలా వర్ణిస్తాడు: ఖద్దరు చీరెలు బరువై మోయలేక అరుంధతి స్వదేశీ మిల్లు సన్న చీరెలు తాల్చుచుండెను. ఆమె స్నానము చేసిన యొడలి మీద చీర యత్తుకుని, పరిశుష్కితములైన యామె యంగములు బొమికల ప్రోవు వలె కనిపించెను. ఆమె యొడలు పలుచనై తాటియాకు వలె నుండెను.
భర్తపట్ల ఆమెది ఎంతటి పేదరికాన్ని, కష్టాన్ని, శారీరక అనారోగ్యాన్ని అయినా జయించి నిశ్చలంగా వెలిగిన అంకితభావం. అరుంధతీ, ధర్మారావుల దైహిక, మానసిక తాదాత్మ్యాన్ని రచయిత అత్యంత హృద్యంగా చిత్రిస్తాడు. మెలనీ, ఆష్‌లీల దాంపత్య చిత్రణలో అది కనిపించదు. నవల పొడవునా అది గుప్తంగానే ఉంటుంది. అసలు వారిద్దరి మధ్యా ఎక్కడా సంభాషణే కనిపించదు. మళ్ళీ అరుంధతీ, మెలనీల వ్యక్తిత్వాల మధ్య ఎంతో అంతరమూ కనిపిస్తుంది. ఒక మహాయుద్ధం తెచ్చిపెట్టిన జీవన కల్లోలాన్ని ప్రత్యక్షంగా చవి చూసిన అనుభవం మెలనీకి ఉండడం, అరుంధతికి లేకపోవడం అన్నది ఆ అంతరానికి ఒక కారణమైనా, దేశీయ నేపథ్యాలకు చెందిన కారణాలూ ఉన్నట్టు అనిపిస్తుంది. మొదటగా చెప్పాలంటే, అరుంధతి పూర్తిగా భర్త చాటు ఇల్లాలు. భర్త సాహచర్యంలోనే ఆమె ప్రపంచజ్ఞానంలో కొంచెమైనా ఓనమాలు దిద్దుకుంటుంది. లోకాన్ని, వ్యక్తులను భర్త కళ్ళతోనే చూస్తుంది. భర్త ఇష్టాయిష్టాలనే తన ఇష్టాయిష్టాలుగా చేసుకుంటుంది. భర్తకు విడిగా ఆమెకు తనదైన కార్యక్షేత్రం ఏదీ లేదు. భర్తపట్ల మెలనీ అంకితభావం పూర్తిగా అలాంటిదే అయినా భర్తకు విడిగా ఆమెకు సొంత కార్యక్షేత్రం ఉంది. యుద్ధం ఆ కార్యక్షేత్రాన్ని మరింత ప్రస్ఫుటం చేసి ఆమె హృదయ, భావ వైశాల్యాలను అనూహ్య ప్రమాణానికి పెంచి, అట్లాంటాలోని దక్షిణాది సమాజం మొత్తానికే తనను నాయకురాలిగా ప్రతిష్టించిన మాట నిజమే. కాని, యుద్ధం లేకపోయినా ఆమెకు తనదైన కార్యక్షేత్రం ఉండి ఉండేదనడంలో సందేహం లేదు. స్కార్లెట్ తల్లి ఎలెన్‌తో ఆమెను పోల్చడమే ఇందుకు నిదర్శనం. ఎలెన్‌కు యుద్ధాన్ని దగ్గరగా చూసిన అనుభవం లేదు. కానీ పిల్లల పెంపకం, గృహనిర్వహణలలో భర్తకు విడిగా ఆమె దక్షతకు అద్దంపట్టే తనదైన కార్యక్షేత్రం ఉంది. అరుంధతి విషయంలో అలాంటిది కనిపించదు.
దాంపత్యానుభవంలో అరుంధతి పరిపూర్ణ స్త్రీయే కానీ, లౌకికమైన పరిణతులలో ఆమె బాల్యావస్థను దాటలేదు. సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబాలలో బాల్యం నుంచీ అలవరిచే కులభేదాలు, హెచ్చు తగ్గుల తేడాలు, వాటికి సంబంధించిన పరిభాష వయసు పెరిగిన తర్వాత కూడా అరుంధతిలో అలాగే ఉండిపోతాయి. వాటిని సొంత బుద్ధితో వివేచించుకోగలిగిన లోకానుభవం, అధ్యయనం, అందుకు అవసరమైన తర్కం, హేతుబద్ధత అరుంధతిలోనే కాదు; అలాంటి సాంప్రదాయిక కుటుంబానికి చెందిన గృహిణులలో అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ. తమకంటే తక్కువ కులస్తులని భావించేవారిపై, పనివారిపై ప్రేమాదరాలు కనబరచడంలో వారిని కుటుంబ సభ్యులుగా పరిగణించడం వేరు; కులభేదాలను, హెచ్చు తగ్గులను సూత్రరీత్యా విశ్వసించడం వేరు. రెండింటినీ కలగాపులగం చేయకూడదు.
ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి రంగాజమ్మ అనే క్షత్రియ స్త్రీని పెళ్లిచేసుకోవడం, భోగకాంతను (గిరిక తల్లి) చేరదీయడం అత్తవారింటికి వచ్చిన కొత్తలో అరుంధతికి వింతగా తోస్తాయి. వాటి గురించి అడిగినప్పుడు హఠాత్తుగా కోపం ముంచుకొచ్చి ధర్మారావు ఆ ప్రశ్ననే నిషేధిస్తాడు. అది భర్తకు ఇష్టం లేని ప్రస్తావన అనుకున్న అరుంధతి అంతటితో ఊరుకుంటుంది. భర్త చాటు ఇల్లాలుగా ఆమెకు భర్త ఇష్టాయిష్టాలే తప్ప మామగారి సంబంధాలతో సహా ఏవీ ముఖ్యం కాదని ఇందులోని ధ్వని. మంగమ్మ గురించిన సందర్భంలో ధర్మారావు అన్న మాటలు, ఒక సాంప్రదాయిక భారతీయ గృహిణికి, భర్తకు ఉండే సంబంధం ఎలాంటిదో స్పష్టంగా చెబుతాయి. భర్తనుంచి అందే జ్ఞానాన్ని మాత్రమే భార్య ప్రతిఫలించాలి. స్వయంప్రకాశమూ స్వతంత్ర బౌద్ధికవికాసమూ ఆమె పత్నీత్వాన్ని పలుచన చేస్తాయి. ధర్మారావు అంటాడు: భర్త, స్త్రీకిని ప్రపంచమునకును మధ్య తెర వంటివాడు. తెర తీసివేసినచో, లోకజ్ఞత దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి, సర్వము పిదుకును.
అరుంధతి జబ్బుపడినప్పుడు భర్తకూ, తనకూ జరిగిన కింది సంభాషణలో సాంప్రదాయిక కుటుంబాలలో కులభేదాలను చాటే పరిభాష కనిపిస్తుంది. భర్త నిషేధించినది తన తండ్రికి గల ఇతరేతర సంబంధాలను ప్రశ్నించడాన్నే తప్ప, ఈ పరిభాషను కాదు.
అరుంధతి:
నేడు జబ్బు చేసినదని మాలకూడు తినమందురా?
ధర్మారావు:
వారు మనకన్నా చెడిపోలేదు.
అరుంధతి:M/h5> చెడిపోకపోనిచో ఈసారి మాలదానినే పెండ్లి చేసికొనుడు.
ధర్మారావు:
చెంపపైని కొట్టరా? తీరికగా కూర్చుండి దుష్టపు మాటలు మాట్లాడెదవేల?
పతితగా ముద్రపడి పశ్చాత్తాపంతో ఆధ్యాత్మికం వైపు మళ్లిన మంగమ్మ తన ఇంట్లో సత్సంగం జరుపుతోందని కుమారస్వామి ధర్మారావుతో అన్నప్పుడు ‘గూడెములో క్రతువు జరిపినట్లు’ అని ధర్మారావు అంటాడు. గూడెం పట్ల, గూడెంలో ఉండే జనాలపట్ల ఈ మాటల్లో వ్యక్తమవుతున్న అవహేళన, ఇతరత్రా అతని స్వభావచిత్రణకు పూర్తి భిన్నంగా ఉండి ఆశ్చర్యచకితం చేస్తుంది. తనూ, గణాచారి కలసి వెడుతుండగా ఒక పంచముడు ఎదురైన సందర్భంలో అతను అన్న మాటల్లోనూ ఇలాంటి అవహేళనే ధ్వనిస్తుంది: ఒక్క పది యేండ్లాగుము. అప్పుడు గణాచారియే ఉండడు. అప్పుడు మనందరమును కలసి దేవాలయములోనికే పోదము. స్వామి కప్పుడు గణాచారి ప్రసక్తి యుండదు...
ఇంకోవైపు పాత ఆచారాలు, కట్టుబాట్లపై ధర్మారావుకు ఉన్నంత విధేయత మెలనీకీ ఉంది. నిత్యపరిణామశీలి అయిన ఈ ప్రపంచానికి అనుగుణంగా తాను మారడానికి తిరస్కరించడంలోనూ ఆమె మరో ధర్మారావే. కానీ తేడా ఎక్కడుందంటే, తమకంటే తక్కువ తరగతి జనాలపట్ల అరుంధతీ ధర్మారావులలో వ్యక్తమైన వివక్ష కానీ అవహేళన కానీ మెలనీలో లేవు. నవల పొడవునా ఆమె స్వభావచిత్రణను గమనిస్తే, ఆమెలో అలాంటివి అసలు ఊహకే అందవు. యుద్ధసమయంలో తను కూడా యాంకీలను శత్రుపూరిత దృష్టితోనే చూస్తుంది. అది యుద్ధం వరకే. ఆ తర్వాత యాంకీలలో ఉండగల మానవీయ స్పందనల పట్ల సైతం గొప్ప విశ్వాసాన్ని, గౌరవాన్ని ఎలా చాటుకుందో పైన చెప్పుకున్నాం. మళ్ళీ పేదరికాన్ని ఎలాంటి ఫిర్యాదూ లేకుండా వరించడంలోనూ ఒకింత హెచ్చుతగ్గుల తేడాతో–మెలనీ, అరుంధతి, ధర్మారావుల మధ్య పోలిక ఉంది. అయితే దుర్భరమైన లేమిలోనూ గొప్ప ఆత్మగౌరవాన్ని, సాహసాన్ని, ఔదార్యాన్ని, దయనూ మరింతగా చాటుకునే అవకాశాన్ని యుద్ధ నేపథ్యం మెలనీకి కల్పించింది. అలాంటి యుద్ధ నేపథ్యం లేదు కనుక అరుంధతీ ధర్మారావులలో ఈ లక్షణాలు అదే స్థాయిలో ప్రస్ఫుటించే అవకాశం సహజంగానే ఉండదు. ఆ మేరకు వారిద్దరికీ సందేహలాభాన్ని ఆపాదించినా, అంతస్తులకు, సామాజిక ప్రతిపత్తిలోని హెచ్చు తగ్గులకు, కుల భేదాలకు అతీతంగా మనిషిని మనిషిగా గౌరవించే భావవైశాల్యంలో మెలనీకీ, అరుంధతీ ధర్మారావులకూ మధ్యనున్న పైన చెప్పిన అంతరం స్పష్టమే.
మళ్ళీ మెలనీ-స్కార్లెట్‌ల విషయానికి వస్తే, మెలనీపై స్కార్లెట్ ద్వేషానికి, ఆమెపై మెలనీ ప్రేమకు, మధ్య జరిగిన అంతులేని పెనుగులాటలో చివరికి మెలనీ ప్రేమే జయిస్తుంది. అట్లాంటాలో స్కార్లెట్, ఆష్‌లీల మధ్య జరిగిన ఒక ఘటన ఆ పెనుగులాటను పతాకస్థాయికి తీసుకెళ్లి స్కార్లెట్ లోని కరడుగట్టిన ద్వేషాన్ని సైతం కరిగిస్తుంది. మొదటిసారి మెలనీపై ఆమెలో అస్పష్టతకు తావులేని సానుకూలభావన తొంగిచూస్తుంది. ఒక భావోద్వేగ పూరిత ఏకాంతంలో స్కార్లెట్‌ను ఆష్‌లీ దగ్గరకు తీసుకున్న దృశ్యాన్ని ఆష్‌లీ చెల్లెలు ఇండియా చూసి ఊరూవాడా ఏకం చేస్తుంది. అపరాధభావనతో కుంగిపోయిన స్కార్లెట్, మెలనీకి తన మొహం చూపించడానికి సిగ్గుపడుతుంది. అంతేకాదు, చిన్నప్పుడు తప్పు చేసినప్పుడు తల్లి ఎలెన్‌కు తను వివరణ ఇచ్చుకున్నట్టే మెలనీకి వివరణ ఇచ్చుకుని హృదయ భారాన్ని దింపుకోవాలను కుంటుంది. ఆ విధంగా తల్లిపై తనకున్న భయభక్తులే మెలనీపై ఏర్పడడం ఆమెకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సందర్భంలో మెలనీ స్పందన, ఆమె ఉదాత్త వ్యక్తిత్వానికి స్కార్లెట్ బేషరతుగా దాసోహమయ్యే ప్రక్రియను సంపూర్ణం చేస్తుంది. స్కార్లెట్ నుంచి ఎలాంటి వివరణను వినడానికీ మెలనీ తిరస్కరిస్తుంది. ఏవో ఉబుసుపోక వదంతులకు అంత ప్రాధాన్యం ఇవ్వడం, యుద్ధకాలంలో ఎదురైన విపత్కర పరిస్థితులను వీరోచితంగా ఎదుర్కోవడంలో మనం చాటుకున్న అద్భుత సాహచర్యాన్ని, అప్పటి అపురూపమైన అనుభవాలను అవమానించడమేనని స్పష్టం చేస్తుంది.
అయితే తన పట్ల స్కార్లెట్‌లో ఈ పరివర్తన వచ్చిన సమయానికి మెలనీ ఈ లోకంనుంచే నిష్క్రమించబోతోంది. రెండోసారి గర్భవతి అయిన మెలనీ మృత్యువుకు చేరువవుతున్నదన్న వార్త స్కార్లెట్‌కు పిడుగుపాటు అవుతుంది. ఒకప్పుడు మెలనీ చావును కోరుకున్న తను, ఇప్పుడు మెలనీ ఎట్టి పరిస్థితిలోనూ కన్నుమూయ కూడదనుకుంటుంది. గతంలో ఎన్నడూ లేనంతగా మెలనీ అవసరం తనకు ఇప్పుడు ఉందనుకుంటుంది. ఇంతకాలం తనపై తనే ఆధారపడిందన్న ఆహాన్ని పటాపంచలు చేస్తూ వాస్తవానికి ప్రతి ఘట్టంలోనూ తనే మెలనీపైనే ఆధారపడిందన్న గ్రహింపు ఆమె అంతరాంతరాలలోంచి తన్నుకువస్తుంది. తన చేతిలోని కత్తీ డాలూ, తనకు ఓదార్పూ బలమూ అన్నీ మెలనీయేనన్న ఎరుక తనను కమ్ముకున్న స్థితిలో ఆమె మృత్యుముఖంలో ఉందన్న వార్త ఒక్కసారిగా స్కార్లెట్‌ను భయభ్రాంతం చేస్తుంది. మెలనీయే తన ఏకైక నేస్తం అనుకున్న స్కార్లెట్, అమ్మ తర్వాత తనను నిజంగా ప్రేమించింది తనే అనుకుంటుంది. అంతేకాదు, తను అచ్చం అమ్మేనని, ఆమెలో అమ్మను చూశారు కనుకనే అందరూ ఆమె స్కర్ట్ పట్టుకుని వేళ్లాడారని అనుకుంటుంది.
(ఆఖరి భాగం)
----------------------------------------------------------
రచన: కల్లూరి భాస్కరం,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment