Thursday, January 31, 2019

ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు


ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు





సాహితీమిత్రులారా!

పరిచయము
నవీనయుగములో మాత్రా ఛందస్సుకు ఒక గొప్ప స్థానము నిచ్చి కవితావ్యవసాయమును చేసినవారిలో గురజాడ అప్పారావు తఱువాత శ్రీశ్రీ అగ్రగణ్యుడు. శ్రీశ్రీ మహాప్రస్థానం[1] తెలుగు భాషలో ఒక నూతన కవితాశైలికి నాందీవాక్యమును పలికినదన్న విషయములో అతిశయోక్తి లేదు. ఇందులో ఎన్నో గేయములలో ఎన్నో రకములైన మాత్రాఛందస్సులను శ్రీశ్రీ వాడినాడు. ఈ వ్యాసములో నేను అట్టి ఛందస్సులలో నొక దానిని గురించి చర్చిస్తాను.

మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే).

ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి. కొన్ని సమయములలో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర కూడ వాడబడినది. కన్నడ, తెలుగు భాషలలోని దేశి ఛందస్సులో వర్జించబడిన లగారంభమగు ఎదురు నడకను కవి స్వీకరించాడు. అందువలన ఈ కవితలలో మనకు ఎదురు నడక కూడ అక్కడక్కడ గోచరిస్తుంది. ఈ యెదురు నడక ఆఱు మాత్రల పూర్వ భాగములో, ఎనిమిది మాత్రల ఉత్తర భాగములో, రెంటిలో కూడ ఉన్నాయి. కాని ఉత్తరార్ధములో రెండవ చతుర్మాత్రకు ఈ యెదురు నడక లేదు. ఈ 14 మాత్రల ఛందస్సును సరిగా ఉపయోగిస్తే ఇది నిజముగా అందమైన దన్న విషయములో సందేహము లేదు. హిందీ భాష యందలి మాత్రాఛందస్సులో 6, 8 మాత్రల విఱుపుతో ఛందస్సు ఏదియు లేదు. మిశ్రగతి లయతో భామినీషట్పదివలె అమర్చబడిన ఛందస్సును అప్పారావు ముత్యాలసరము అని పిలిచినట్లు, శ్రీశ్రీ ఈ 14 మాత్రల ఛందస్సుకు ఏ పేరు పెట్టినట్లు లేదు. దీనికి నేను ఆనందార్ణవము అని పేరును పెట్టాను. మిరియాల రామకృష్ణ ఇట్టి ఛందస్సు చతురస్రగతి యని తెలిపారు[2]. నా ఉద్దేశములో అది సరికాదు. వీటిలోని మాత్రల విఱుపు నిస్సందేహముగా ఆఱు, ఎనిమిది మాత్రమే.

ఆనందార్ణవము
ఈ ఆనందార్ణవఛందస్సును ఎన్ని విధములుగ కల్పించ వీలగును అనే ప్రశ్నకు జవాబును పరిశీలిద్దాము. ఆఱు మాత్రలు 13 విధములుగా సాధ్యము. అందులో పది షణ్మాత్రలకు (UIUI, UIIU, UIIII, IIIUI, IIIIU, IIIIII, UUII, IIUU, UUU, IIUII) ఎదురు నడక లేదు, మూడింటికి (IUIU, IUUI, IUIII) ఉన్నాయి. రెండవ భాగములోని మాత్రాగణములు చతుర్మాత్రలు అయిన పక్షములో, ఈ చతుర్మాత్రలు 5 విధములుగా సాధ్యము. అందులో నాలుగింటికి (UU, IIU, UII, IIII) ఎదురు నడక లేదు, ఒక దానికి (IUI) గలదు. పూర్తిగా షణ్మాత్రలను, చతుర్మాత్రలను ఉపయోగిస్తే ప్రతి పాదమును 13*5*5 = 325 విధములుగా వ్రాయ వీలగును. అందులో 78 విధములను శ్రీశ్రీ పై ఐదు కవితలలో నుపయోగించాడు. ఇందులో కొన్ని తప్ప మిగిలిన అధిక భాగము ఏ లాక్షణిక గ్రంథములో లేదు. వాటినన్నిటిని కూలంకషముగా పరిశోధించి లక్షణ లక్ష్యములను నేను ఈవ్యాసంలో తెలియబఱచినాను. ఇవిగాక రెండవ భాగములో అష్టమాత్ర ఉపయోగించబడిన 10 వృత్తములకు కూడ లక్షణములను ఇచ్చాను.

గేయములలో పదచ్ఛేదయతి
ఒక విధంగా చూసినట్లయితే, గేయములు నిజముగా ఏకపాద వృత్తములు! ఈ విషయము ఆశ్చర్యకరముగా కనిపించవచ్చును కాని ఇది ముమ్మాటికి నిజము. మఱొక ముఖ్య విషయము. ‘ఛందస్సు సర్పపరిష్వంగము’ నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ ఎన్నో ఛందస్సు విధివిధానాలను పాటించాడు. తెలుగులో (కన్నడములో కూడ) వృత్తములకు పాదాంత యతి లేదు, అనగా పాదము ఒక పదముతో అంతము కానక్కరలేదు. ఒక పదము ఒక పాదము చివర ఆరంభమై మఱొక పాదములో అంతము కావచ్చును. కాని సంస్కృతములో పాదాంతయతి పాటించబడుతుంది. గేయము అనగా పాడదగినది. పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది. లేకపోతే చెవులకు బాధాకరముగా ఉంటుంది. అదే విధముగా సంస్కృతములో శార్దూలవిక్రీడితము, స్రగ్ధరలవంటి వృత్తములకు పాద మధ్యములో కూడ పదముల విఱుపు ఉంటుంది. దీనినే ఆ భాషలో యతి అంటారు. తెలుగు భాషలోని పద్యములకు పదపు విఱుపుకన్న అక్షరసామ్యత లేక వడి ముఖ్యము. గేయ రచనలో శ్రీశ్రీ పాదమధ్యములో, పాదాంతములో పదచ్ఛేదయతిని తప్పక ఉపయోగించాడు. ఈ ఆనందార్ణవ ఛందస్సులో కూడ ఆఱు మాత్రలవద్ద పదముల విఱుపు, అదే విధముగా పాదాంతములో కూడ పదమును అంతము చేసి గేయమును వ్రాశాడు. ఉదాహరణమునకు ‘ఆనందం అర్ణవమైతే’ అనే పాదమును తీసికొన్నప్పుడు, ఇందులో ఆనందం – ఆఱు మాత్రల పదము, అర్ణవ – నాలుగు మాత్రల పదము, మైతే – నాలుగు మాత్రల పదము. ఆఱు మాత్రలవద్ద, ఆనందం పదము అంతమయినది, తరువాత ఏడవ మాత్రవద్ద ఒక క్రొత్త పదము ఉపయోగించబడినది. అదే విధముగా 14వ మాత్ర వద్ద పదము అంతమయినది. తరువాతి పాదము ‘అనురాగం అంబరమైతే’ క్రొత్త పదముతో ప్రారంభమవుతుంది. ఈ సంస్కృత ఛందస్సు నియమములు గేయములలో శ్రీశ్రీ రసానుభూతికోసం వాడాడు. అంతే కాక పదములను ఈ14 మాత్రల చట్రములో ఇమిడించుటకై హ్రస్వములను దీర్ఘముగా చేయుటకు వెనుకంజ వేయలేదు, ఉదా. ‘రగులుకొనే రాక్షసి బొగ్గూ.’ బొగ్గు అంటే మూడు మాత్రలే, కాబట్టి బొగ్గూ అని పదమును పొడిగించాడు.

ఖ్యాత వృత్తములలో ఆనందార్ణవపు నడక
శ్రీశ్రీకి ఇలాటి ఛందస్సు ఉపయోగించవలెననే ఆలోచన ఎలా వచ్చి ఉంటుంది? సంస్కృత ఛందస్సులో ఇంతకు ముందు చెప్పినట్లు ఇట్టి వృత్తములు కొన్ని ఉన్నా, అవి సామాన్యముగా ఉపయోగములో లేనివి. కాని వైతాళీయములలో ఇట్టివి ఉన్నాయి. ఆపాతలిక అనే అర్ధసమ వైతాళీయ వృత్తములో బేసి పాదములలో పూర్వ భాగములో ఆఱు మాత్రలు, ఉత్తర భాగములో చతుర్మాత్రలైన భ-గణము, గగము ఉండును. సరి పాదములలో ఎనిమిది మాత్రలు, భ-గణము, గగము ఉండును. అనగా ఆపాతలికపు బేసి పాదములలో శ్రీశ్రీ ఉపయోగించిన 6, 8 మాత్రల విఱుపుతో అమరిక ఉన్నది. అదే విధముగా వైతాళీయములో మాత్రల సంఖ్య (బేసి 6, సరి 8) ఇట్టిదే. కాని ఉత్తర భాగములోని గణములు ర-లగ, అనగా రెండు చతుర్మాత్రలు కాని ఒక అష్టమాత్ర. క్రింద వీటికి ఉదాహరణములను ఇచ్చాను.

ఆపాతలిక – బేసి పాదములు – 6 మాత్రలు – భ-గగ // సరి పాదములు – 8 మాత్రలు – భ-గగ

మానిని నీ – మాధవుఁ డేడే
మానసమందున – మాయల ఱేఁడే
తేనియవలెఁ – దీయఁగఁ బల్కున్
కానఁగ మెల్లఁగఁ – గల్లలఁ జిల్కున్

వైతాళీయము – బేసి పాదములు – 6 మాత్రలు – ర-లగ // సరి పాదములు – 8 మాత్రలు – ర-లగ

గోదావరి – గుండెలో సదా
ఖేదము మోదము – కేళి యాడుఁగా
గోదావరి – గొంతులో సదా
నాదము బ్రహ్మా-నంద మీయుఁగా

ఛందోగ్రంథములలో వివరించబడినా కూడ, వైతాళీయము, ఆపాతలిక తెలుగులో ఉపయోగించబడలేదు. కావున 14 మాత్రల గేయమునకు స్ఫూర్తిని మఱెక్కడైనా వెదకాలి. చంపకోత్పలమాలలలో, శార్దూల మత్తేభవిక్రీడితములలో ఇట్టి అమరికలు గలవు. అట్టి పద్యములను చదివినప్పుడు అక్కడక్కడ ఈ అమరికలు ధ్వనించి ఉండవచ్చును. శ్రీశ్రీ మేధస్సులో అతనికి తెలియకుండ ముద్రితమైన ఈ మూసలు ఈ ఛందోనిర్మాణమునకు దారి తీసినదేమో?

ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U

ఉత్పలమాలలో ఆఱు అమరికలలో 14 మాత్రల అమరికలు గలవు. అందులో చివరి దానిలో ఉత్తర భాగములో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర ఉన్నది. ఇది చంపకమాలకు కూడ అన్వయిస్తుంది, ఎందుకంటే ఈ రెండు వృత్తముల భేదము – చంపకమాలలోని మొదటి రెండు లఘువులు ఉత్పలమాలలో ఒక గురువు అవుతుంది.

శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U

శార్దూలవిక్రీడితములో కూడ ఆఱు అమరికలకు 14 మాత్రలు ఉన్నాయి. అందులో రెండవ, ఐదవ, ఆఱవ అమరికలకు ఉత్తరార్ధములో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర ఉన్నది. ఇది మత్తేభవిక్రీడితమునకు కూడ అన్వయిస్తుంది, ఎందుకంటే ఈ రెండు వృత్తముల భేదము – శార్దూలవిక్రీడితములోనిలోని మొదటి గురువు మత్తేభవిక్రీడితములో రెండు లఘువులు అవుతుంది.

[పై అమరికలలో న/జ/భ/లగ (చంపకమాల మొదటి 11 అక్షరములు) గణములతో సుమ అను వృత్తపు లక్షణములను కలిగిన పాదములు (అ-27: వలయములై చలించినపుడే, అ-28: విలయములై జ్వలించినపుడే), స/స/జ/గ (చంపకోత్పలమాలలలోని చివరి 10 అక్షరములు) గణములతో సహజా అను వృత్తపు లక్షణములను కలిగిన పాదములు (దే-46: పడిపోయెను పేక మేడలై, దే-60: అణగారిన ఆర్తులందరూ, న-03: పులి చంపిన లేడినెత్తురూ) ఈ గేయములలో ఉన్నాయి. వలయములై చలించినపుడే – పడిపోయెను పేక మేడలై, అనే కాల్పనిక పాదము యతిలేని ఒక చంపకమాల పాదము.]

మాలావృత్తములకు, విక్రీడిత వృత్తములకు కొన్ని 14 మాత్రల అమరికల ఉదాహరణములను క్రింద ఇస్తున్నాను –

అర్ధసమవృత్తము అతిగంధము –
బేసి పాదములు – చంపకమాల పూర్వార్ధము (1-11) – న/జ/భ/లగ IIIIU – IUI IIU
సరి పాదములు – చంపకమాల ఉత్తరార్ధము (12-21) – స/స/జ/గ IIUII – UIUIU

ప్రతిమగ రా – వరించఁ ద్వరగా
నతిగంధపు – హ్లాదనమ్ముతో
ప్రతి క్షణమున్ – బ్రతీక్షణములే
బ్రతుకెప్పుడు – బంధనమ్ములే

పై అర్ధసమవృత్తము అతిగంధపు రెండు పాదములను కలిపి వ్రాస్తే ఇలాగుంటుంది –

ప్రతిమగ రా – వరించఁ ద్వరగా – నతిగంధపు – హ్లాదనమ్ముతో
ప్రతి క్షణమున్ – బ్రతీక్షణములే – బ్రతుకెప్పుడు – బంధనమ్ములే

ఇప్పుడు ఇవి చంపకమాలలోని రెండు పాదములుఅవుతుంది. కాని ఈ పాదములను చదివినప్పుడు మనకు చంపకమాలను చదివినట్లు అనిపించదు!

అర్ధసమవృత్తము పుష్పరాశి –
బేసి పాదములు – మత్తేభవిక్రీడితము (1-10) – స/భ/ర/ల IIUU – IIU IUI
సరి పాదములు – మత్తేభవిక్రీడితము (11-19) – స/త/త IIUU – UIUUI

వనమందున్ – వర పుష్పరాశి
మనమందున్ – మందహాసమ్ము
వనమందున్ – స్వర పుష్పరాశి
మనమందున్ – మౌన గీతమ్ము

పై అర్ధసమవృత్తము పుష్పరాశిని కలిపి వ్రాస్తే ఇలాగుంటుంది –
వనమందున్ – వర పుష్పరాశి మనమందున్ – మందహాసమ్ము
వనమందున్ – స్వర పుష్పరాశి మనమందున్ – మౌన గీతమ్ము

ఇప్పుడు ఇవి మత్తేభవిక్రీడితములోని మొదటి 19 అక్షరముల రెండు పాదములుఅవుతుంది. కాని ఈ పాదములను చదివినప్పుడు మనకు మత్తేభవిక్రీడిత వృత్తపు ధార కనిపించదు!

అర్ధసమవృత్తము కోరకము –
బేసి పాదములు – శార్దూలవిక్రీడితము (2-11) – త/జ/భ/ల UUII – UIUIII
సరి పాదములు – శార్దూలవిక్రీడితము (12-19) – మ/య/లగ UUU – IUUIU

చిత్తమ్మున – శ్రీధరుం డెపుడు
మత్తిల్లన్ – మనోజ్ఞమ్ముగా
నృత్తమ్మును – నిత్య మాడుఁ గద
చిత్త మ్మా – శివమ్మౌనుగా

రెండేసి పాదములను కలిపి వ్రాసి చదివితే మనకు ఇది శార్దూలవిక్రీడితపు నడకగా ధ్వనించదు.

ఉత్పలమాల (4-13) ర/న/భ/గ UIUI – IIU IIU

రాగవీణ – రవముల్ వినఁగా
సాఁగి రమ్ము – స్వర యోగములో
నూఁగి పొమ్ము – యొగి మోదముతో
భోగమన్న – భువిలో నిదియే

శార్దూలవిక్రీడితము (6-14) ర/న/మ UIUI – IIU UU

లోక మెల్ల – రుచులన్ దోఁచెన్
నాక మెల్ల – నవమై పూఁచెన్
నాకు నీవు – నవమే కాదా
నీకు నేను – నెనరే కాదా
శ్రీశ్రీ ఆనందార్ణవ గేయములు
మహాప్రస్థానములో 14 మాత్రలపైన ఆధారపడిన ఛందస్సును ఉపయోగించిన ఐదు గేయములు – అద్వైతం (38 పంక్తులు), ఋక్కులు (13), దేశచరిత్ర (96 పంక్తులు), నవకవిత (28 పంక్తులు), పేదలు (20 పంక్తులు), అనగా మొత్తము 195 పంక్తులు. ఇందులో ఋక్కులులోని తొమ్మిదవ పంక్తిలో (ఔనౌను శిల్ప మనర్ఘం) 13 మాత్రలు, ఋక్కులులోని 14వ పంక్తిలో (వాక్కుంటే వ్రాసీ) 10 మాత్రలు, దేశచరిత్రలోని తొమ్మిదవ పంక్తిలో (భీబత్స రస ప్రధానం) 12 మాత్రలు మాత్రమే ఉన్నాయి. ఇది ముద్రణలోని దోషమో లేక శ్రీశ్రీ కావాలనే అలా వ్రాశాడో మనకు తెలియదు. వాటిని తొలగిస్తే లభించిన పంక్తులు 192. ఈ 192 పంక్తులలో 78 విధములైన 14 మాత్రల ఛందస్సులు మనకు కనబడుతాయి. పంక్తుల సంఖ్యలతో ఈ ఐదు గేయములు, ప్రతి యొక్క పంక్తి ఛందస్సు మొదటి అనుబంధములో ఇవ్వబడినవి. 78 స్వతంత్ర ఛందస్సులు రెండవ అనుబంధములో ఇవ్వబడినవి. ఇందులో ప్రతి ఛందస్సు ఏ గేయములో, ఏ పంక్తిలో వస్తుందో అనే విషయమును కూడ తెలియబఱచినాను. ఆ వృత్తములు ఎన్నిమారులు వాడబడినవో అన్న సంఖ్య చతురస్ర కుండలీకరణములలో చూపబడినవి. ఈ 78 వృత్తములలో ఏయే వృత్తములు వేళంకర్ సంకలనము జయదామన్[3], దుఃఖభంజనకవి వ్రాసిన వాగ్వల్లభ[4] గ్రంథములలో ఉన్నవో వాటిని ఎఱ్ఱని రంగుతో చూపినాను, అవి 22. వృత్తములోని మొదటి ఆఱు మాత్రలు, తఱువాతి ఎనిమిది మాత్రలు కూడ చూపబడినవి. ఈ ఎనిమిది మాత్రలు రెండు చతుర్మాత్రలు కాని పక్షములో అట్టి అష్టమాత్రను క్రింద ఒక అడ్డగీతతో చూపియున్నాను. రెండు అర్ధ భాగములలో పాదము లగారంభమయితే (అనగా ఎదురు నడకను కలిగి ఉన్నట్లయితే) దానిని కూడ ఎఱ్ఱ రంగుతో చూపియున్నాను. ఈ 78 వృత్తములకు ఉదాహరణములను మూడవ అనుబంధములో ఇవ్వబడినవి.

ఈ 78 వృత్తముల కొన్ని వివరములను క్రింద ఇస్తున్నాను –

పాదమునకు 7 అక్షరములు – ఉష్ణిక్కు ఛందము – సర్వగురువృత్తము – 1
పాదమునకు 8 అక్షరములు – అనుష్టుప్పు ఛందము – 6 గు, 2 ల – 7
పాదమునకు 9 అక్షరములు – బృహతి ఛందము – 5 గు, 4 ల – 24
పాదమునకు 10 అక్షరములు – పంక్తి ఛందము – 4 గు, 6 ల – 23
పాదమునకు 11 అక్షరములు – త్రిష్టుప్పు ఛందము – 3 గు, 8 ల – 17
పాదమునకు 12 అక్షరములు – జగతి ఛందము – 2 గు, 10 ల – 5
పాదమునకు 14 అక్షరములు – శక్వరి ఛందము – సర్వలఘు వృత్తము – 1

ఛందోగ్రంథములలో వివరించబడినవి – 22
నేను కల్పించినవి – 56

పూర్వార్ధములో ఎదురు నడకతో ఉండే వృత్తములు – 12
ఉత్తరార్ధములో ఎదురు నడకతో ఉండే వృత్తములు – 12
రెండు అర్ధములలో ఎదురు నడకతో ఉండే వృత్తములు – 4
లఘ్వంతమైన వృత్తములు – 33
ఉత్తరార్ధములో రెండు చతుర్మాత్రలు లేక ఒక అష్టమాత్ర కలిగిన వృత్తములు – 10 (ఎదురు నడక 2)

ఒక్క పంక్తిలో మాత్రమే వాడిన వృత్తముల సంఖ్య – 43
పది, పదికన్న ఎక్కువ పంక్తులలో వాడిన వృత్తములు – 4 (శిప్రా, శృంగి, నాయికా, ఉదితము)

6, 4, 4 మాత్రలతో 325 వృత్తములు సాధ్యము. అందులో 68 వృత్తముల మూసలను శ్రీశ్రీ ఈ ఐదు గేయములలో వాడెను. 6, 8 మాత్రలతో 432 వృత్తములు సాధ్యము, అందులో 10 వృత్తముల మూసలు ఈ గేయములలో ఉన్నవి.

ఇంతకు ముందే చెప్పినట్లు, తెలుగు ఛందస్సులో యతి లేక వడి అంటే అక్షరసామ్యము, అనగా యతి స్థానము వద్ద గల అక్షరమునకు పాదాదిలో ఉన్న అక్షరమునకు లాక్షణికులు నిర్ణయించిన రీతిలో పొత్తు కుదరవలెను. కాని సంస్కృతములో యతి అన్నది పదముల విఱుపు, అనగా యతి స్థానము వద్ద ముందు పదము విఱుగవలెను, లేక యతి స్థానము వద్ద సంధి జరుగవలెను. పాదాంతములో కూడ సామాన్యముగా పదము అంతము కావలెను. ఇట్టి యతిని పదచ్ఛేదయతి అంటారు. శ్రీశ్రీ తప్పని సరిగా ఇట్టి యతిని పాటించెను, ఉదా. కావాలోయ్ | నవకవనానికి | కాని పాదమునందలి ఉత్తరార్ధములోని రెండు చతుర్మాత్రల మధ్య ఈ విఱుపు ఎల్లప్పుడు లేదు, ఉదా.

పదముల విఱుపు ఉన్న పాదము: అ-03 అనురాగపు | టంచులు | చూస్తాం
పదముల విఱుపు లేని పాదము: అ-05 నీ కంకణ | నిక్వాణంలో

అన్ని ఛందస్సులతో ఒక గేయము
పై ఐదు గేయములలో శ్రీశ్రీ ఉపయోగించిన 78 ఛందస్సులతో ఒక గేయమును క్రింద వ్రాసియున్నాను. ఇందులో వరుసగా రెండవ అనుబంధములోని ఆయా సంఖ్యలు గల ఛందస్సులు వాడబడినవి. ఇందులో పదచ్ఛేదయతి, పాదాంతయతి, వీటితో అక్షరసామ్యయతిని లేక వడిని కూడ ఉపయోగించినాను. ఇది వ్యావహారిక భాషలో వ్రాయబడినది. ఇది ఒక ఉదాహరణము మాత్రమే –

ఆనందార్ణవము

01. ఏముందో – ఈ లోకంలో
02. కానుకగా – కష్టాలన్నీ
03. ఏదేవుడు – ఇచ్చాడిట్లా
04. కష్టాలే – కథలయ్యాయా
05. శూలాలే – సుఖమ్ము లౌనా
06. ముళ్లే స-మ్మోదము లౌనా
07. కన్నీళ్లే – కామితార్థమా
08. కన్నీళ్లే – కావ్య మ్మగునా
09. తిమిరములో – దివ్వెల్ లేవా
10. సమరమ్మున – శాంతుల్ రావా
11. పరాజయము – పాపమ్మౌనా
12. ఏ సుధలకు – ఈ ఆరాటం
13. ఎవరిస్తా – రిట పీయూషం
14. గళమ్ములో – కమనీయమ్మై
15. వెతలన్నీ – విలాసమౌనా
16. విరించితో – వివాదమేనా
17. వేదనతో – విచారమేనా
18. నేత్రమ్ముల – నిరాశలేనా
19. శ్రమజీవీ – చాకిరి చాలోయ్
20. ఎవ్వరికో – యీ జతనమ్ముల్
21. వారందఱి – బానిస నీవా
22. వారించే – ప్రజ లిల లేరా
23. ఇక వద్దీ – యెద్దు జీవితం
24. సఖ్యముతో – సంతసమ్ముతో
25. సౌఖ్యమ్ముగ – సాహసమ్ముతో
26. ఉండాలోయ్ – యొకటై యవనిన్
27. నవ జీవం- నాలో పారగ
28. నవప్రభల్ – నాలో నాడగ
29. దేవునికే – దీటై క్రొత్తగ
30. చిత్రమ్మును – సృష్టించా లిక
31. ఆనాడే – యగుగా భూమికి
32. సత్యమ్మై – జన్మ దినమ్ముగ
33. నవ లోకపు – నవ నాదమ్ముల్
34. వికాసముల – విలసద్రాగం
35. కలహంసల – కళావిలాసం
36. అమరముగా – నామని గీతం
37. కుసుమమ్ముల – కోమల నృత్యం
38. ప్రభాతముల – రాగపు కాంతుల్
39. వెన్నెల తెర – వేసిన మాయల్
40. వరవీణ – స్వరముల సొంపుల్
41. హరుసముతో – హాయి నీయగా
42. మనమందున – మౌనరాగమౌ
43. నవమగు నీ – నాదమ్ములకై
44. కూరిమితో – కోరిక లలలై
45. నవసృష్టికి – నాందీవాక్యము
46. పల్కించుము – వరమై భూమికి
47. రాగములో – రసప్రవాహము
48. వేగమ్మున – విలాస మిచ్చును
49. నవగీతం – నాకపు నాదము
50. ప్రభాతమో – రాత్రియొ యెప్పుడు
51. కాంతులతో – క్షాంతియు నిండును
52. లోకమ్మున – లోటులు లేవిక
53. యుద్ధ మ్మీ – యుగమున రాదిక
54. శస్త్రమ్ములు – క్షయించంగ నిల
55. సామమ్మే – సంతస మగు నిక
56. కష్టము లిక – కరువగు గాదా
57. కల నిజమగు – కంటి ముందుగా
58. గతమ్ము లొక – కథగా నగుగా
59. భువనములో – ముదమ్ము లెదురౌ
60. ప్రజలందఱు – రమించి మనగా
61. మతాల పగ – మాయము లగుగా
62. ఆనందము – లలరుగ విరులై
63. కలలన్నిటి – కనులం జూడగ
64. మానసమున – మధువే పారును
65. నవజీవన – నవోదయమ్మగు
66. ధ్వనించు గద – ధరాతలమ్మున
67. పాటలు పలు – వరమ్ములై యిక
68. నవనాదము – నాట్యము సేయును
69. నవ మార్గం – నగుచును బిల్చును
70. వసంతములు – ప్రమోదమ్ములగు
71. మురియున్గా – పుడమి పచ్చగను
72. ఆకాశపు – టవధుల్ సులభము
73. ప్రపంచమున – పలుపలు హక్కులు
74. సమాన మిక – జను లెల్లరికిని
75. మరో జగతి – మహా రుచిరములు
76. కనువిందై – కనబడుగద నిక
77. అనంతమౌ – హరుసపు తరగలు
78. గలగలమని – కడు వడి పరుగిడు
ముత్యాల సరములు
గురజాడ అప్పారావు వ్యాప్తి చేసిన ముత్యాల సరముల అమరికను క్రింది విధముగా కూడ అవగాహన చేసికొన వచ్చును –

పాదము 1 – మత్తకోకిల – మత్తకోకిల
పాదము 2- మత్తకోకిల – మత్తకోకిల
పాదము 3- మత్తకోకిల – మత్తకోకిల
పాదము 4 – మత్తకోకిల – మత్తకో

మొదటి మూడు పాదములను (1) హరిణగతి రగడ లేక (2) వృషభగతి రగడ అర్ధ పాదము లేక (3) మత్తకోకిల లయతో ఉండే అర్ధపాదము లేక (4) భామినీ షట్పది మొదటి రెండు పాదములు, మూడవ పాదములోని ప్రథమార్ధముగా భావించవచ్చును. క్రింద ఇట్టి ముత్యాల సరమునకు ఒక ఉదాహరణము –

ఈ వసంత – మ్మెంత సుందర
మీ వసంత – మ్మెంత సుఖకర
మీ వసంత – మ్మెంత మధురము
జీవరాశికిఁ – జెలువమై

రత్నాలసరములు – శతదళ షట్పద
పురాతన వృత్తములలో నర్కుటకము ఒకటి. ప్రతి పాదములో 17 అక్షరములు దీనికి. దీని చివర రెండు లగములు చేర్చినప్పుడు మనకు చంపకమాల లభిస్తుంది. శ్లోకములలోని సరి పాదములలో చివరి నాలుగు అక్షరములు రెండు లగములే. మాఘుడు చంపకమాలను (ధృతశ్రీ) ఈ విధముగా కనుగొని ఉండవచ్చునని నా ఊహ. నర్కుటక వృత్తమునకు కుటక, అవితథ, నర్దటక అని కూడ పేరులు ఉన్నాయి. నర్కుటకపు లయతో ఉండే మరికొన్ని వృత్తములు – వంశదళ, శైలశిఖా, మణికల్పలతా, ఉన్మాల్యా, వరయువతీ, ఉడుపథ, వాణిని. సంస్కృతములో యతి ప్రస్తావన లేదు. చంపకమాల, నర్కుటకములతో అర్ధసమ వృత్తమును కల్పించవచ్చును. రెండు వృత్తములకు చంపకమాలవలె యతి నుంచిన ఉదాహరణములను ఈమాటలో నేను వ్రాసిన చంపకోత్పలమాలల కథలో చదువవచ్చును. మఱొక ముఖ్యమైన విషయము. కన్నడ శాసనములలో అతి ప్రాచీనమయిన వృత్తము నర్కుటకము[5] అని పండితుల ఊహ (సుమారు క్రీస్తు శకము 500, బినమణి యంతు …). ఈ వృత్తములను 6-8 మాత్రలుగా విడదీసి ఒక అర్ధసమ వృత్తమును, ఒక షట్పదిని, ఒక నూతనమైన ‘సరము’ను వ్రాయు విధానమును ఇక్కడ తెలియజేస్తున్నాను. ఈ సరమునకు నేను రత్నాలసరము అని పేరు నుంచినాను.

చంపాకటకము –
బేసి పాదములు – చంపకమాల – 6-8-6-8
సరి పాదములు – నర్కుటకము – 6-8-6-2

సరసముఖా – సరోజనయనా – స్వరచిత్రముఁ – జక్క వ్రాసెదన్
హరుసముతో – నపూర్వముగ నీ – వరుదెంచుమురా
విరులవలెన్ – బ్రియమ్ముగ మదిన్ – విరబూయును – బ్రేమచింతనల్
సిరులివె సు-స్థిరమ్ము మనికిన్ – జిరమై నిలుచున్

శతదళ షట్పదిగా (నూరు మాత్రలు) –

సరసముఖా సరోజనయనా
స్వరచిత్రముఁ జక్క వ్రాసెదన్
హరుసముతో నపూర్వముగ నీ – వరుదెంచుమురా
విరులవలెన్ బ్రియమ్ముగ మదిన్
విరబూయును బ్రేమచింతనల్
సిరులివె సుస్థిరమ్ము మనికిన్ – జిరమై నిలుచున్

రెండు రత్నాల సరములుగా –

సరసముఖా – సరోజనయనా
స్వరచిత్రముఁ – జక్క వ్రాసెదన్
హరుసముతో – నపూర్వముగ నీ
వరుదెంచుమురా

విరులవలెన్ – బ్రియమ్ముగ మదిన్
విరబూయును – బ్రేమచింతనల్
సిరులివె సు-స్థిరమ్ము మనికిన్
జిరమై నిలుచున్

రత్నాల సరమును కూడ ముత్యాల సరమువలె క్రింది విధముగా వివరించవచ్చును –

పాదము 1 – చంపక (ఉత్పల) మాల ప్రథమార్ధపు లయ లేక 6 – 8 మాత్రలు
పాదము 2- చంపక (ఉత్పల) మాల ద్వితీయార్ధపు లయ లేక6 – 8 మాత్రలు
పాదము 3- నర్కుటకము లేక చంపక (ఉత్పల) మాల ప్రథమార్ధపు లయ లేక 6 – 8 మాత్రలు
పాదము 4 – నర్కుటకపు ద్వితీయార్ధము లేక చివరి నాలుగు అక్షరములు లుప్తమైన చంపక (ఉత్పల) మాల ద్వితీయార్ధపు లయ లేక 6-2 మాత్రలు.

ముత్యాల సరములు, రత్నాల సరములు
ముత్యాలసరాలలో మొదటి మూడు పాదములలో 14 మాత్రలు (3-4, 3-4 మిశ్రగతి), నాలుగవ పాదములో 9 నుండి 14 మాత్రలు ఉంటాయి. పైన వివరించబడిన రత్నాలసరాలలో మొదటి మూడు పాదములలో 14 మాత్రలు, నాలుగవ పాదములో కనీసము ఎనిమిది మాత్రలు. పాదములలోని మాత్రల సంఖ్య ఒకటే అయినా, ఈ రెండు సరముల నడక వేఱు. ముత్యాలసరాలు మిశ్రగతిలో త్రిపుట తాళానికి సరిపోతుంది. రత్నాలసరాలు చతురస్రజాతి ధ్రువతాళానికి సరిపోతుంది (లఘువు, ద్రుతము, రెండు లఘువులు, అనగా 4+2+4+4 = 14 మాత్రలు). రత్నాల సరముల మొదటి మూడు పాదములు శ్రీశ్రీ గేయములలోని ఆనందర్ణావ ఛందస్సు నియమములను అనుసరించును, నాలుగవ పాదములో కనీసము ఎనిమిది మాత్రలు ఉండాలి. క్రింద రత్నాల సరమునకు ఉదాహరణములు –

దండలవలె – తారాగణములు
నిండు శశియు – నింగి తెరువులో
మండెను హృది – మారా జెక్కడ
దండుగ బ్రదుకే

నిండిన యీ – నీరవ నిశిలో
పిండివోలె – వెన్నెలె లెల్లెడ
గుండెలోన – గ్రుచ్చిన గునపము
దండుగ బ్రదుకే

పై రత్నాల సరములను చేర్చి వ్రాస్తే, అది శతదళ షట్పదగా మారుతుంది (మూడవ, ఆఱవ పాదములలో ప్రాసయతితో.)

శతదళషట్పది –

వందలుగా – వారిదమాలలు
సుందరముగ – శుభ్ర గగనమున
తొందరగా – దొరలుచు నుండెను – దూదిపింజలై
వందలుగా – వారిజమాలలు
సుందరముగ – శుభ్ర సరసిలో
తొందరగాఁ – దూఁగుచు నాడెను – తొగరుపుంజలై

పై శతదళషట్పదిని రెండు రత్నాల సరములుగా క్రింద చూపినట్లు వ్రాయ వచ్చును. నాలుగవ పాదములో ప్రాస లేదు.

రత్నాలసరములు –

వందలుగా – వారిదమాలలు
సుందరముగ – శుభ్ర గగనమున
తొందరగా – దొరలుచు నుండెను
దూదిపింజలై

వందలుగా – వారిజమాలలు
సుందరముగ – శుభ్ర సరసిలో
తొందరగాఁ – దూఁగుచు నాడెను
తొగరుపుంజలై

ముగింపు
శ్రీశ్రీ నేను ఆనందార్ణవము అని పేరుపెట్టిన 6-8 మాత్రల ఛందస్సును ఏ విధముగా సృష్టించాడో మనకు తెలియదు. కాని అది చంపకోత్పలమాలలలో, శార్దూల మత్తేభవిక్రీడితములలో అంతర్లీనమై ఉన్నదని ఇక్కడ నిరూపించినాను. పంక్తికి 14 మాత్రలు కలిగిన ముత్యాల సరము ఛందస్సు మిశ్రగతితో నుండును (3,4-3,4 మాత్రలు). అది త్రిపుట తాళమునకు సరిపోవును. ఈ నడకను యక్షగానములలో త్రిపుటరేకులు అని అంటారు. భామినీషట్పది, మత్తకోకిల మున్నగునవి ఈ నడకకు ఉదాహరణములు. పంక్తికి 14 మాత్రలు కలిగిన ఆనందార్ణవ ఛందస్సుతో రత్నాల సరమును కల్పించవచ్చును. దీని తాళము ధ్రువతాళము. ముత్యాలసరములకు, రత్నాల సరములకు మాత్రల సంఖ్య ఒక్కటే. కాని గతి వేఱు, తాళము వేఱు. ఛందశ్శాస్త్రములో ఇలాటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఓపికతో వెదకినప్పుడు గవ్వలు, నత్తగుల్లలు మాత్రమే కాదు, ముత్యాలు, రత్నాలు కూడ మనకు లభిస్తాయి.
---------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: