అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు,
ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం
సాహితీమిత్రులారా!
అన్ని పవిత్ర గ్రంథాలలోకీ రామాయణాన్ని సత్యసంధతకు ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతారు. రామాయణం ఒక పురాణమే అయినా ఆ గ్రంథాన్ని అనేక విధాలుగా వ్యాఖ్యానించవచ్చు. ఐనప్పటికీ ముఖ్యంగా మానవుల సత్ప్రవర్తనకొక ఉదాహరణగా చూస్తారు భారతదేశంలో. ఇతర ప్రసిద్ధ హిందూ దేవతలైన కృష్ణుడు, దుర్గ, శివుడు కన్నా రాముడే ధర్మనిరతుడు, ధర్మ ప్రతిరూపుడుగా ఎంచి కొలుస్తారు. భారతీయ పురాణాలను అధ్యయనం చేసిన పాశ్చాత్య పండితులు ఇటీవల అవసరమైన చోట కూడా అందలి నైతికతను ప్రశ్నించకుండా ఊరుకొనడాన్ని జెఫ్రీ మేసన్ (Jeffrey M Mason) వంటివారు ఎత్తిచూపారు. భారతీయ సంప్రదాయ వ్యాఖ్యాతలు, రామాయణ కవులు ఆ విమర్శలయందు అసహనం చూపించకపోగా ఒక్కొక్క సందర్భంలో రాముని ప్రవర్తనను తప్పుపట్టారు కూడా. వాళ్ళు కూడా ఒక విధంగా ఆ సన్నివేశాల పట్ల అసమ్మతి వుండికూడా, సకల సద్గుణాభిరాముడైన రాముని ప్రవర్తనకు సరితూగేలా ఆ సన్నివేశాలకు వివరణలు ఇచ్చారు. ఇటువంటి రెండు సందర్భాలేమిటంటే, ఒకటి–ధీరత్వానికి విరుద్ధంగా వానర రాజు వాలిని వెనకనుంచి వధించడం; రెండు–సీతను రెండుసార్లు పరిత్యజించడం. (ఒకసారి అగ్నిపరీక్ష, రెండవసారి ఆమె భూదేవి ఒడిలోకి వెళ్ళడం.)
అటువంటిదే మరొక సన్నివేశం శూర్పణఖను విరూపిని చెయ్యడం. ఆ అంశంపైనే ఈ వ్యాసం. పంచవటిలో రాముని పట్ల తన ప్రేమను ప్రకటించిన శూర్పణఖ ముక్కు చెవులను రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ఖండించడం. రామాయణ కథనం ప్రకారం ఈ సంఘటన చాలా కీలకమైనది. అనేక సంఘటనలకు కారణభూతమైనది. సీతాపహరణానికీ, రామ రావణ యుద్ధానికీ దారితీసినది. మొత్తం కథ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. నైతికత దృష్టితో చూసినా ఈ సంఘటన చాలా కీలకమైనది. రాముని వ్యక్తిత్వంపైనా, భారతీయ సంస్కృతిలో స్త్రీల లైంగికతపైనా సాధారణ అభిప్రాయాలు, స్వభావాలు విదితమౌతాయి. భారతదేశంలోని రామాయణ రచయితలూ వ్యాఖ్యాతలూ ఈ సన్నివేశాన్ని భిన్నరీతులలో చిత్రీకరించారు. రామ లక్ష్మణులు, ఆఖరికి శూర్పణఖ ప్రవర్తనలలో కూడా ఒక అనిశ్చితిని చూపించారు. ఒకవైపు రాముణ్ణి స్త్రీలను, ఇతర బలహీనులను రక్షించే ధీర నాయకుడుగానూ ధర్మ వర్తనునిగానూ చూపించాలనే కోరిక, మరొక పక్క స్త్రీల లైంగికతను, వారి ఆధిక్యాన్నీ పురుషులు అదుపులో పెట్టకపోతే కష్టమనే తీవ్రమైన అనుమానం. శూర్పణఖను విరూపిని చేసేముందు అన్నదమ్ములిద్దరూ ఆమెతో పరిహాసాలాడిన తీరు సరైనదా కాదా అనే ప్రశ్నను దాటవేసే ప్రయత్నం ఒకవైపు, మరొకవైపు శూర్పణఖను సిగ్గులేనిదానిగాను, ఆమెకు వేసిన శిక్ష సరైనదిగాను చూపే ప్రయత్నం కొన్ని కథనాలలో ప్రత్యక్షంగా చూస్తాం.
ఇక్కడ నేను మేసన్ చేసిన సవాలును స్వీకరించక తప్పడం లేదు. ఈ సంఘటనను నేను కేవలం పూర్వ కథనాల పట్ల వుండే కుతూహలంతోను, కేవలం వస్తుగతంగాను చూడడం లేదు. వాల్మీకి రామాయణం మొదట చదవగానే నేను శూర్పణఖ పట్ల మోహంలో పడ్డాను. ఆమె దుస్థితి పట్ల సానుభూతి, ఆమె సూటిదనం పైన, స్వతంత్ర ప్రవృత్తి పట్ల ఆరాధనాభావం కలిగాయి. ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాముని సవతి తల్లి కైకేయికి వలే ఈమెకు కూడా సరి అయిన గౌరవం లభించి వుండదు అనిపించింది. వాల్మీకి కాకుండా ఇతర రామాయణాలు ఈ సంఘటనను ఎట్లా చిత్రించాయో చదవాలనే కుతూహలం కలిగింది. అప్పుడు చాలా రామాయణాలు సేకరించి చదివాను. ఎక్కువ కథనాలు చదివినకొద్దీ వాటిలోని సందిగ్ధత, అనిర్దిష్టత బయటపడ్డాయి. ఈ అనిర్దిష్టతను చుట్టుకుని భారతీయ సంస్కృతిలో వుండే ద్వైదీభావాలు (Dichotomy) కూడా కనపడ్డాయి. అంటే మంచికి విరుద్ధమైన చెడు, పవిత్రత-అపవిత్రత, దైవము-మానవుడు, స్త్రీ-పురుషుడు వంటివి.
పలు రామాయణాలలో శూర్పణఖ ఉదంతాన్ని చెప్పిన తీరును వివరిస్తాను. ప్రతి వాచకము మరొక దానిని ప్రభావితం చేసిన తీరును కూడా వివరిస్తాను. అందువలన సాధారణ నమూనాలు ఎట్లా ఏర్పడ్డాయో అర్థమౌతుంది. ఇందుకోసం నేనెంచుకున్న హిందూ రామాయణాలు ఇవి:
వాల్మీకి సంస్కృత రామాయణం (క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య)
కంబన్ తమిళంలో వ్రాసిన రామావతారం (క్రీ.శ. 12వ శతాబ్దం)
సంస్కృత ఆధ్యాత్మ రామాయణం (క్రీ.శ. 16వ శతాబ్దం)
తులసీ దాస్ రామ చరిత మానస్ ( అవధి భాష క్రీ.శ. 16వ శతాబ్దం)
ఆధునిక హిందీ భాషలో రాధేశ్యామ్ రామాయణం ( క్రీ.శ. 20వ శతాబ్దం)
లెవి-స్ట్రాస్ (Claude Levi-Strauss) సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఈ రామాయణ కథనాలు, వ్యాఖ్యానాలు ప్రామాణికమైనవనే భావిస్తూ వ్రాస్తున్నాను. నేను కథల నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే, ఒక కరడుగట్టిన నిర్మాణవాదిలా కాక కథనాలలోని విషయాన్నీ, ఆయా కవుల భావజాలాన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటాను. ముందుగా నేను వాల్మీకి రామాయణంలోని శూర్పణఖ ఉదంతాన్ని సంక్షిప్తంగా చెప్పి దాన్ని ఇతర కథనాలకు ఆధారంగా ఉపయోగించుకుంటాను. అది ముందుగా వచ్చిన సంపూర్ణ వాచకం కనుకను, దానితో తక్కిన కవులకు పరిచయం వుండేవుంటుందని కూడా. వాల్మీకి రామాయణమే ప్రామాణికమైన మూల గ్రంథమని నా ఉద్దేశం కాదు. వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకున్న ఇతర కవులు కూడా వారి వారి స్థానిక సంప్రదాయాలను, వారి సృజనాత్మకతను, తమ తమ వ్యక్తిగత భావజాలాన్ని యథాశక్తి చొప్పించారు. ఎ. కె. రామానుజన్ (A. K. Ramanujan) చెప్పినట్లు రామ కథ ఎంత పెద్ద విశ్వమంతదంటే దాన్ని ఒక వాచకంలో ఇమడ్చలేము. కనుక ప్రతి వ్యాఖ్యానమూ ఒక కథనమే! ప్రతి కథనమూ ఒక వ్యాఖ్యానమే.
శూర్పణఖ వృత్తాంతము
వాల్మీకి రామాయణం (అరణ్య కాండ 16-17)
ప్రపంచ ప్రసిద్దిగాంచిన వాల్మీకి రామాయణాన్ని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అరణ్యకాండతో సహా కావ్యం మొత్తం రాముడుని ఒక దేవుడిగా కాక మానవ స్వభావంకల కావ్య నాయకుడిగానే చిత్రించిందని పండితులంతా అంగీకరిస్తారు.
శూర్పణఖను విరూపిని చేసే సన్నివేశం పంచవటిలో ప్రారంభమౌతుంది. రాముడు సీతాలక్ష్మణ సమేతంగా పూజాపునస్కారాలు, కథాకాలక్షేపాలు చేస్తూ వుండగా, ఒకనాడు రావణ సోదరి అయిన శూర్పణఖ అనే రాక్షసి అటువైపు వెడుతూ అందాల రాముడిని చూసి మోహపరవశురాలైంది. వాల్మీకి ఆమెను, రాముడిని పరస్పర విరుద్ధమైన రూపాలు కలవారిగా మనకు పరిచయం చేస్తాడు.
“ఆతని ముఖం అందానికి ప్రతిరూపం. ఆమె వదనం వికృతం. అతని శరీరం కోమలం. ఆమెది ఊబకాయం. అతనివి విశాల నేత్రాలు. ఆమెవి చీకిరి కళ్ళు. అతని కేశములు అతి సుందరమైన శ్యామవర్ణం కలవి. ఆమెవి తామ్రవర్ణం. అతని కంఠం మృదుమధురం. ఆమెది కర్ణకఠోరం. అతనిది మృదుభాషణ. ఆమెది కఠినస్వరం. అతనిది ధర్మపరత్వం. ఆమెది దుష్ట స్వభావం. అతనిది ఆకర్షించే రూపు. ఆమెది వికర్షించే రూపు…” (పుల్లెల రామచంద్రుడి అనువాదం.)
కోరికతో తపిస్తూ ఆమె రాముని సమీపించి ‘రామా! రాక్షసులు సంచరించే ఈ ప్రదేశంలో నీవెందుకిక్కడ ఒక ముని రూపంలో జడలుకట్టిన జుట్టుతో విల్లంబులు ధరించి భార్యతో కూడా వున్నావు?’ అని అడిగింది. అందుకు జవాబుగా రాముడు తనను, తన తమ్ముడిని, భార్యను ఆమెకు పరిచయం చేసుకుని, ఆమెను గురించి అడిగాడు. కొన్ని వాచకాలలో ‘నువ్వు రాక్షసిలా వున్నావు కానీ ఎంత అందమైన శరీరం నీది!’ అంటాడు. ఆమె తానొక రాక్షసిననీ పేరు శూర్పణఖ అనీ, తను కామరూపి కనుక తలచినంతనే రూపు మార్చుకోగలననీ, అందర్నీ భయపెడుతూ దండకారణ్యంలో ఒంటరిగా సంచరిస్తున్నాననీ చెబుతుంది.
ఈ సంభాషణ ఎన్నో సందేహాలకు తావిస్తుంది. అసలు రాముడికి శూర్పణఖ ఏ రూపంలో కనిపించింది? తనొక కామరూపి అయితే ఆమె వికృతంగా ఎందుకు వున్నది? వాల్మీకి ఆమె బయటికి కనిపిస్తున్న రూపాన్ని కాక నిజరూపాన్ని వర్ణించాడా? రాముడు నిజంగా ఆమె అందాన్ని ప్రస్తావించినపుడు అది యథార్థమా, వ్యంగ్యమా? ఇతర రామాయణాలు ఈ అనిర్దిష్టతను స్పష్టపరచడమో మరికొంత కలపడమో ముందు ముందు చూస్తాము.
తరువాత శూర్పణఖ తన అన్న, తమ్ముల గురించి చెప్పటం కొనసాగిస్తుంది. రాజైన రావణుడు, నిద్రించే కుంభకర్ణుడు, పుణ్యాత్ముడైన విభీషణుడు, సాహసవంతులైన ఖర దూషణులను గురించీ, తను వారందర్నీ అధిగమించగలనని కూడా చెబుతుంది. అటుపిమ్మట రామునిపై తన వలపును తెలిపి తన భర్తగా వుండమని కోరుతుంది. అంతేకాదు, ‘బానకడుపుతో వికృతంగా వున్న ఆ అవిధేయురాలైన స్త్ర్రీ(సీత)నీ, లక్ష్మణుడినీ మింగేస్తాననీ, వాళ్ళిద్దర్నీ వదిలించుకుని తామిద్దరూ దండకారణ్యంలోని సుందర దృశ్యాలను చూసుకుంటూ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా సంచరించవచ్చు’ననీ చెబుతుంది. రాముడు నవ్వి, ఇలా అంటాడు: “నేను వివాహితుడను, నా భార్యను చాలా ఇష్టపడతాను. నీ వంటి స్త్రీ సవతితో వుండడం భరించలేదు. వీడు నా తమ్ముడు లక్ష్మణుడు. సుగుణశీలి, అందగాడు, మగసిరి కలవాడు, బుద్ధిమంతుడు, అవివాహితుడు. నీ వంటి అందగత్తెకు సరిజోడైనవాడు. ఓ సుందరీ! విశాలమైన కన్నులు కలదానా! మేరు పర్వతంపై సూర్యకాంతిలాగా సవతిపోరు లేని మా తమ్ముడిని వరించు.”
ఈ వాక్యాల ప్రాముఖ్యతపై వ్యాఖ్యాతలు చాలా దీర్ఘమైన చర్చ చేశారు. రాముడు ఎప్పుడూ అసత్యమాడడు. మరిప్పుడు లక్ష్మణుడు అవివాహితుడని ఎందుకు చెప్పాడు? చాలా సులభమైన వివరణ ఏమంటే హాస్యానికి చెప్పిన విషయాన్ని అబద్దమనకూడదని. అయితే పరిష్కృత ప్రతిలో (critical edition) మాత్రం రాముడు హాస్యానికి (స్వేచ్ఛయా) అన్న విషయం స్పష్టంగా లేదు. అంతేకాదు, నిజంగా రాముడు అట్లా (స్వేచ్ఛయా అంటే హాస్యానికి) అన్నాడనుకున్నా, తమ్ముడి పట్ల అటువంటి ముతక హాస్యం ప్రయోగించడంలో రాముని ఉద్దేశం ఏమిటి? ఆతను లక్ష్మణుడిని గోముగా ఆటపట్టిస్తున్నాడా? లేక శూర్పణను ఏడిపిస్తున్నాడా? ఇందుకు వ్యతిరేకంగా కొంతమంది చారిత్రిక విమర్శకులు రాముని మాటలను బాగా పట్టించుకుని లక్ష్మణుడికి సీత చెల్లెలితో వివాహమైనదని చెప్పే బాలకాండే ప్రక్షిప్తమనీ, అసలు వాల్మీకి రామాయణంలో లేదనీ వాదించారు.
మూడవది అయిన వివరణ పి.ఎస్. సుబ్రహ్మణ్యశాస్త్రి వ్రాసిన వ్యాసం ‘పంచవటిలో రాముడు అబద్ధం ఆడాడా లేదా?’ అనేది. ఈ వ్యాసం కొంత చమత్కారమైనది. ఆయనేమంటాడంటే: ‘అక్త్రదార’ (అవివాహితుడు) అనే పదానికి ‘భార్య తన దగ్గర లేనివాడు’ అని అర్థము, ‘భార్య పొందు లేనివాడు’ అనే అర్థము కూడా వున్నదని. అంతేకాదు, రాముని మాటలలో శ్లేష వున్నదని కూడా అంటాడు. రాముని మాటలకు రెండర్థాలు వున్నాయని, ఒకటి లక్ష్మణుడుకి భార్యతో దాంపత్య సుఖం కొరవడిన కారణంగా అతనికి శూర్పణఖ అవసరం వుందని, రెండు లక్ష్మణుడు ఎవరూ చేయని విధంగా యౌవన పరువంలో వున్న భార్యను వదిలి అడవులకు వచ్చాడని. ఇది నిజంగా శ్లేష అయితే దీనిని అర్థం చేసుకోడం కష్టం. ఈ వాదనను ఇక్కడ ప్రస్తావించడంలో నా ఉద్దేశం సంస్కృత అలంకారాలను డొంకతిరుగుడుగా చెప్పడం కాదు. కానీ ఇటువంటి అనేక సమస్యాపూర్వకమైన వాక్యాలను సమర్థింపచూడడానికి చేసే ప్రయత్నాలను ఎత్తి చూపడమే.
తరువాత శూర్పణఖ లక్ష్మణునికి తన ప్రతిపాదన వినిపిస్తుంది. అతను నవ్వి, తను రాముని బంటు కాబట్టి తను అనర్హుణ్ణి అనీ, రాముడికే చిన్న భార్యగా వుండిపోమ్మనీ, తరువాత రాముడు ‘ఆ బాన పొట్ట కల వికృత రూపి అయిన స్త్రీ’ని విడిచి పెట్టి నిన్నే వుంచుకుంటాడనీ అంటాడు. అతని మాటలు నిజమని నమ్మిన శూర్పణఖ, వెంటనే ఆ స్త్రీని మింగేస్తానంటుంది. లక్ష్మణుడు వెక్కిరింపు ధోరణిలో అంతక్రితం శూర్పణఖ సీతను గురించి చేసిన వర్ణనే చెయ్యడం గమనించండి. లక్ష్మణుడి శీల రక్షణ కోసం ఇక్కడ కూడా మరొక అర్థాన్ని వెతకడంకోసం ఒక హిందీ అనువాదం (గీతా ప్రెస్) కూడా ఇక్కడ శ్లేషను ప్రతిపాదిస్తుంది.
శూర్పణఖ అభిప్రాయం ప్రకారం ఆ వాక్యాల అర్థం పైన ఇచ్చాము. అయితే లక్ష్మణుడి అభిప్రాయం ప్రకారం అవి విమర్శలు కావు. ప్రశంసలే. కనుక సంస్కృతంలో విరూప(వికృత) అంటే విశిష్ట రూపము కలది అని అర్థం. అసతి (అవిధేయ, అపవిత్ర) అంటే అద్వితీయమైన, విధేయత గలది అని అర్థం. కరాళ (భయంకర) అంటే సరి అయిన శరీర నిర్మాణం కలది అని అర్థం. నిర్నతోదరి (బాన కడుపు కలది) అంటే సన్నటి నడుము కలది, వృద్ధ (ముసలి) అంటే వివేకవంతురాలు అని అర్థం కనుక లక్ష్మణుడు శూర్పణఖ ఉపయోగించిన మాటలనే వేరే అర్థంలో వాడాడు. అంతేకాక, ‘నిన్ను వదిలించుకుని రాముడు సీతతోనే వుంటాడు’ అనికూడా అతని మాటల అర్థం.
ఈ వాదన కూడా సుబ్రహ్మణ్య శాస్త్రిగారి వాదనతో సరిపోలినదే. మరొక పండితుడు కె. రామస్వామి శాస్త్రి ‘శూర్పణఖ అనే చిక్కుప్రశ్న’ అనే వ్యాసం వ్రాశారు. ఆయన ఇట్లా వ్యాఖ్యానిస్తారు:
వాల్మీకి ఊహాత్మక శక్తికీ సృజనాత్మకతకూ శూర్పణఖ ఉదంతం ఒక మచ్చుతునక. రావణుడు మోహావేశంతో సీతను అపహరించుకుపోవడానికి పూర్వరంగాన్ని వాల్మీకి తెలివిగా అల్లిన కథ శూర్పణఖది. ఆమె కామాతురత వలన, ఈ వృత్తాంతం కవికి ఒక హాస్య సన్నివేశాన్ని సృష్టించడానికి కూడా చాలా అవకాశం కలిగింది. రామ లక్ష్మణులు శూర్పణఖను గురిచేసి హాస్యాలాడుకుంటారు. శూర్పణఖ మానసిక నిర్మాణంలో హాస్యానికి(పరిహాస వికసన) తావులేదంటాడు కవి. క్రూరులు, అహంభావులు అయిన రాక్షసులకు పరిహాసాలు అర్థం కావని ఆయన సూచన కావచ్చు.
ఇక్కడ చెప్పదలిచినది ఏమంటే శూర్పణఖకు హాస్య ప్రియత్వం శూన్యం, ఆమె మానవ స్త్రీ కాదు ఒక రాక్షసి కనుక. అంతేకానీ మోహంతో కళ్ళు మూసుకుపోయి కాదు. అయినా వారి పరిహాసాలు ఆమెకి అర్థమయాయో లేదో! శూర్పణఖను పరాయిగా సృష్టించడం సబబే. ఎందుకంటే ఆమె మానవి కాదు. రాముడు అడవికి రావడంలోని ఒక ఉద్దేశం అక్కడ మునులను వేధిస్తున్న రాక్షసులను నిర్మూలించడమే.
శూర్పణఖ ఉదంతాన్ని వాల్మీకి ఇలా కొనసాగిస్తాడు. లక్ష్మణుని పరిహాసం తరువాత శూర్పణఖ భీతావహురాలైన సీతను కబళించడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే రాముడు శూర్పణఖను పట్టుకుని లక్ష్మణునితో ‘అజ్ఞానులు, మూర్ఘులు అయినవారితో ఎప్పుడూ పరిహాసాలాడకూడదు. వికృతమైన బానపొట్టగల, కామాంధురాలైన ఈ రాక్షసిని తక్షణమే విరూపిని కావించు!’ అన్నాడు. వెంటనే లక్ష్మణుడు కత్తితో శూర్పణఖ ముక్కు, చెవులు కోసివేశాడు. నెత్తురోడుతూ పెద్దగా అరుస్తూ శూర్పణఖ ఆమె సోదరుడు ఖరుని వద్దకు పరిగెత్తి జరిగిన సంగతి చెప్పింది. ఆమెకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోడానికి ఖర, దూషణ, త్రిసిరాదులు రాముని మీదకు యుద్ధానికి పోయారు. రాముడు ఒంటి చేత్తో వాళ్ళని ఓడించాడు. మొదట ఈ విషయాన్ని రావణునికి అతని మంత్రులు తెలియచేయగా, తరువాత శూర్పణఖ స్వయంగా అన్నగారి దగ్గరికి వెళ్ళింది. వెళ్లి సీత సౌందర్యాన్ని వర్ణించింది. తన చెల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా సీతను అపహరించి తేవాలనుకున్నాడు రావణుడు. శూర్పణఖను విరూపిని చేయడానికి ముఖ్య కారణం ఆమె సీతను కబళించబోవడమే కానీ ఇందులో అంతర్గతంగా వున్న కారణం ఆమె వ్యభిచరించడానికి ప్రయత్నించడం. ఇది మనం ఇతర కథనాల్లో స్పష్టంగా గమనించవచ్చు. వాల్మీకి కథనంలో కూడా స్త్రీలను విరూపులను చెయ్యడం వుంది. బాలకాండలో రాముడు తాటక అనే రాక్షసిని వధిస్తాడు. మొదట లక్ష్మణుడు ఆమె చేతులను, ముక్కు, చెవులను కోస్తాడు. ఇటువంటిదే మరొక వృత్తాంతం అరణ్యకాండలో వున్నది. అయోముఖి అనే రాక్షసి లక్ష్మణుని మోహించి రాగా ఆమెను వధిస్తాడతను.
రాముడు పరిపూర్ణ మానవుడనో, అవతార పురుషుడనో భావించేవారికి శూర్పణఖ వృత్తాంతం వంటి సమాధానపడవలసిన అంశాలతో సమస్యలెదురౌతున్నాయి; అటు సంప్రదాయ వ్యాఖ్యాతలకూ ఇటు భారతీయ విద్యార్థులకూ కూడా. ఇటువంటి వృత్తాంతాలు కావ్యం యొక్క చారిత్రక ప్రామాణికతను రుజువు చేస్తాయని కొందరు వాదిస్తారు. ఇవి నిజం కాకపొతే వాల్మీకి ఎందుకు నాయకుడికి అపకీర్తి తెచ్చిపెట్టే ఇటువంటి సన్నివేశాలను సృష్టిస్తాడు? మరికొందరిది భక్తి భావంతో ప్రేరణచెంది ఇటువంటి మత వ్యతిరేక వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ధోరణి. సి. రాజగోపాలాచారి తన రామాయణ కథనంలో ఒక పాద సూచికలో ఇట్లా వ్రాస్తాడు:
కొందరు మన పవిత్ర గ్రంథాలను విమర్శించేవారిలా కనిపిస్తారు. ‘ఈ నాయకుడు తనపై ప్రేమను ప్రకటించిన ఒక స్త్రీని వధించాడు… వాలిని వెనక నుంచి చంపాడు… అన్యాయంగా సీతను బహిష్కరించాడు…’ ఇటువంటి వ్యాఖ్యలన్నీ ద్వేషపూరితమైన మనస్తత్వం నుంచి పుట్టినవి. దురదృష్టంకొద్దీ మనకు హృదయంలేని ఊసరక్షేత్రం వంటి తెలివి చాలా వుంది. అవగాహన మృగ్యం. రామునిలో తప్పులెన్నేవారిని ఎన్ననివ్వండి. ఈ విమర్శకులు రామునిలో ఎన్నిన తప్పులు తాము చెయ్యకుండా ధర్మం పాటిస్తే భక్తజనులంతా సంతోషిస్తారు.
ప్రక్షిప్తమని చెప్పే ఉత్తర కాండలో శూర్పణఖ నేపథ్యం గురించి మరింత సమాచారం వుంది. ఈమె బ్రహ్మ మనవడైన విశ్రవసుకు, కైకసి అనే రాక్షసికీ పుట్టిన కూతురు. ఈమె అన్న రావణుడు ఈమెను విద్యుత్‌జిహ్వ రాజుతో వివాహం చేశాడట. కానీ, రావణుడు పాతాళలోకాన్ని జయించే క్రమంలో ఇతన్ని అనుకోకుండా చంపేశాడట. అప్పుడు శూర్పణఖ అతన్ని నిందించడానికి వస్తే ఆమెను ఖర దూషణుల దగ్గరకు దండకారణ్యానికి పంపాడట. వాల్మీకి కథనంలో ఆమె వితంతువనే విషయం ముందుకు రాకపోయినా ఇతర కథనాలలో ఈ విషయం కనుగొనవచ్చు.
రామావతారం
పన్నెండవ శతాబ్దంలో కంబన్ వ్రాసిన రామాయణం సౌందర్యాత్మక, ఆధ్యాత్మిక ఔన్నత్యాలుగల పద్య కావ్యం. ఈ కావ్యంపై వైష్ణవ భక్తి ఉద్యమాల ప్రభావం ఎక్కువ అనే సంగతి రామావతారం అనే శీర్షికను బట్టే గ్రహించవచ్చు. దాని అర్థం ‘విష్ణుమూర్తి అవతారమైన రాముడు’ అని. రాముని కథ చెప్పడంలో వాల్మీకికీ కంబన్‌కూ చాలా తేడాలున్నాయి. శూర్పణఖ ఇతివృత్తంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు. హిందూ రామాయణాలన్నింటిలోను కంబన్ రామాయణంలో శూర్పణఖను చిత్రించిన తీరు దానికదే ప్రత్యేకమైనది. రాజగోపాలాచారి కూడా తన వాల్మీకి రామాయణ పునఃకథనంలో ఈ ఇతివృత్తాన్ని అనుబంధంగా చేర్చాడు. సంస్కృత, తమిళ రామాయణాల్లో ప్రముఖంగా కనిపించే తేడా ఏమిటంటే సంస్కృతంలో శూర్పణఖ ఇతివృత్తం అంతా ఒకే సన్నివేశంలో 51 శ్లోకాలలో ఇమడ్చగా, కంబన్ తన రామాయణంలో ఇది రెండు రోజులు జరిగినట్లుగా ఎంతో వివరంగా 143 పద్యాలలో వివిధ ఛందస్సులలో ఎంతో హృద్యంగా వ్రాశాడు. వాల్మీకి వలే కాక కంబన్ శూర్పణఖను సౌందర్యవతిగా చూపిస్తాడు. అంతేకాక ఆమె దురదృష్టానికి సానుభూతి కూడా చూపిస్తాడు. ఆయన భాషలోని సౌందర్యాన్ని ఇక్కడ నేను చెప్పలేను కానీ జార్జ్ హార్ట్ (George Hart), హాంక్ హీఫెజ్ (Hank Heifetz) అనువాదంలోని కొన్ని ఉల్లేఖనాలు ఇస్తూ ఆ ఉదంతపు సారాంశం చెబుతాను.
కంబ రామాయణంలో శూర్పణఖ ఉదంతం, గోదావరి నదివొడ్డున పంచవటిలో సీతారామలక్ష్మణులు కుదురుకుంటూ వుండగా ప్రారంభమవుతుంది. ఈ సుందర దృశ్యంలోకి శూర్పణఖ ప్రవేశిస్తుంది. రావణుడి వినాశనానికి కారణభూతురాలుగా ఈమెని కవి వర్ణిస్తాడు. ఒంటరిగా వున్న రాముడిని, అతని అందాన్ని చూసి ఆమె వెంటనే ప్రేమలో పడిపోతుంది. అతని దరికి చేరడం ఎట్లా అని ఆలోచిస్తుంది.
ఆమె హృదయంలో ప్రేమ వరదొచ్చిన నదిలా, పోటెత్తిన సముద్రంలా ఎగసిపడింది. ఆమె వివేకం నశించింది. ధనం కూడబెట్టికూడా, ఎవరికీ ఏమీ ఇవ్వనివాని కీర్తిలా ఆమె పవిత్రత మాయమైపోయింది.
పవిత్రత(కఱ్పు) అంటే సచ్ఛీలత. లైంగిక పవిత్రత అనికూడా తమిళంలో అర్థం. ఎందుకంటే పాతివ్రత్యం, పవిత్రత అనేవి స్త్రీలకు ఎంతో శక్తినీ అధికారాన్నీ ఇస్తాయని తమిళులు భావిస్తారు. ఈ భావనను ఇక్కడ పరిచయం చెయ్యడం జరగబోయే సంఘటనకు సూచన. శూర్పణఖకు పవిత్రత లోపించడం అంటే ఆమెకున్న ఇతర శక్తులన్నీకూడా మాయమైపోయినట్లే.
తన వెగటుపుట్టించే రూపం గురించి తెలిసివున్న శూర్పణఖ తామర పుష్పంపై అధిష్టించి వున్న ‘శ్రీ’ని తలుచుకుని ఒక మంత్రం చదివి తేజోవంతంగా విరాజిల్లే ఒక సుందరిగా మారిపోతుంది.
కలువపూ ఆసనంపై బంగారం రాలుస్తూ కూచున్న శ్రీదేవిలా
ఆకాశంలో మెరిసి భూమిపై తన రతనాల తేరుపై అరుదెంచి వుండిపోయిన తటిల్లతలా
మెత్తని వలువలు ధరించిన మిసిమి యవ్వనిలా
మెరిసే వదనంలో కత్తుల వంటి కళ్ళతో
అందమైన మైనా పక్షిలాగా
నెమలిలాగా నడిచి వచ్చింది.
ఆ హరిణేక్షణ
సౌందర్యం రూపుదాల్చినట్లు, పలుకు తేనెల మాటలతో
సమ్మోహపరిచే విల్లు వంటి శరీరంతో
కల్పతరువుపై పాకిన దివ్య లత వలే.
ఈ సౌందర్య రాశి తనను రామునికి పరిచయం చేసుకుంటుంది. తన పేరు కామవల్లి. కన్య. బ్రహ్మకి మనమరాలు. కుబేరునికీ, రావణునికీ చెల్లెలు… అప్పుడు రాముడు ఆమెను అడుగుతాడు, ‘రాక్షసివైన నీకు ఇంత అందమైన రూపం ఎలా వచ్చింది? ఒంటరిగా ఇక్కడికెందుకు వచ్చావు?’ అని. తన సచ్చీలతవలనా తపోఫలంవలనా తనకింత చక్కటి రూపం దక్కిందనీ, అపవిత్రులైన రాక్షసుల సాహచర్యాన్ని వదిలివేశాననీ ఆమె చెబుతుంది. చెప్పి, తనను పెళ్లిచేసుకోమని రాముడిని కోరుతుంది. అందుకు రాముడు అనేక అభ్యంతరాలు చెబుతాడు. మొదటగా ఒక బ్రాహ్మణ స్త్రీ ఒక క్షత్రియుడిని పెళ్లి చేసుకోకూడదంటాడు. తన తల్లి రాజవంశానికి చెందినది కనుక తను బ్రాహ్మణి కాదంటుంది ఆమె. రాముడు కొంత హాస్యానికి దిగుతూ ‘ఒక మానవుడు రాక్షసిని చేసుకోకూడదు’ అంటాడు. తను ఆ దురదృష్టకరమైన రాక్షసి పుటకను వదిలేశానంటుంది. ఆమె అన్నతమ్ములు కనుక ఆమెను తనకిచ్చి పెళ్లి చేస్తే ఒప్పుకుంటానంటాడు రాముడు. స్త్రీ పురుషులు ఒకర్నొకరు ఇష్టపడితే గంధర్వ విధిన పెళ్లి చేసుకోవచ్చని వేదాలు చెప్పాయంటుంది శూర్పణఖ. పెళ్లి అయిన తరువాత మా అన్నలు ఒప్పుకుంటారంటుంది. తనని పెళ్లి చేసుకుంటే రాక్షసుల నుంచి ఇక భయపడనక్కర్లేదంటుంది. రాముడు నవ్వి, నిజంగా అది తన అదృష్టమేనంటాడు. అప్పుడు సీత నదిలో స్నానంచేసి వస్తుంది. ముని వేషంలో వున్న రాముడు భార్యను ఇక్కడికి తీసుకొచ్చాడనుకోని శూర్పణఖ ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపడి రాముడిని హెచ్చరిస్తుంది–ఆమె రాముడిని వంచించడానికి రూపు మార్చుకుని వచ్చిన రాక్షసి కావచ్చు అని. ఆమెని ఏడిపించడానికి రాముడు నిజమేనంటాడు. సీత భయపడుతుంది. అప్పుడు ప్రమాదాన్ని ఊహించిన రాముడు, ఆమె అందాన్ని చూసిన శూర్పణఖను పంపివేసి సీతను లోపలి తీసుకుపోతాడు.
ఆ రాత్రంతా శూర్పణఖ రాముని పట్ల ప్రేమతో విరహ వేదనతో వేగిపోతుంది.
స్నానం చేస్తున్న నీళ్ళు మసిలిపోతే ఆమె భీతిల్లింది
తనకి ప్రియమైన ఈ దేహం మంటల్లో బుగ్గి అయిపోతోందని
‘ఈ సముద్ర గర్జన నుంచి, ఈ క్రూరమైన వలపు బాణాలనుంచీ
ఎక్కడ దాక్కోను?’ అనుకుంటుంది.
తన బాధ ఎట్లా సమసిపోతుందో అని దిగులుచెందిన శూర్పణఖ తనను సీతతో పోల్చుకుంటుంది. ‘ఆమె అంతటి పరిశుద్ధురాలిని కాని నా వంక చూస్తాడా ఆతను? ఆమె చాలా అందమైనది, పవిత్రమైనది. అది కాక ఆమె అతని హృదయేశ్వరి.’ మరునాడు ఉదయం సీత ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను ఎత్తుకుపోయి ఎక్కడైనా దాచిపెట్టి ఆమె రూపం ధరించి రాముని దరిచేరాలని అనుకుంటుంది. క్రిందటి రోజు జరిగినదంతా ఎరుగని లక్ష్మణుడు ఆమెను పడదోసి ముక్కు చెవులు చనుమొనలు ఖండించాడు. శూర్పణఖ బాధతో కొట్టుకుంటూ ప్రతీకారం తీర్చుకోమని అన్నలను కోరుతూ అరిచింది. అప్పుడు రాముడు ప్రవేశించి ‘నువ్వెవరు?’ అని అడిగాడు. ‘నేను నిన్న నిన్ను కలిసిన దానినే!’ అంది శూర్పణఖ. ‘ఒక స్త్రీ తన ముక్కు చెవులు చనుమొనలు పోగొట్టుకుంటే ఆమె అందమంతా పోయినట్టే గదా?’ అంటుంది. అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ సీతను ఎత్తుకుపోబోయిందని చెప్పగా రాముడు ఆమెను వెళ్లి పొమ్మంటాడు.
అయినా శూర్పణఖ వెళ్ళదు. జరిగిన విషయం రావణునికి చెబితే రాముని వంశం అంతా నాశనం చేస్తాడంటుంది. రాముడు ఇప్పటికైనా తనను స్వీకరిస్తే అతడిని కాపాడతానంటుంది. అతన్ని యుద్ధంలో కాపాడగల తనవంటి బలశాలి ఐన స్త్రీ, సుకుమారమైన సీతకన్నా మేలుకదా అంటుంది. తన ముక్కు చెవులు ఖండించడం ద్వారా తనని ఎవరూ కోరుకోకుండా చేశాడు రాముడని నిందిస్తుంది. కానీ రాముడు కోరితే వాటిని తను మళ్ళీ సృష్టించుకోగలనంటుంది. తను, తన తమ్ముడు ఎవరి సాయం లేకుండానే ఎంతమంది రాక్షసులనైనా సంహరించగలమని ఆమెను అక్కడనుంచి పొమ్మంటాడు రాముడు. కానీ ఆమె పోదు. లక్ష్మణుడు ఆమెను వధించడానికి రాముని అనుమతి కోరగానే ఆమె ఖరుని వెతుక్కుంటూ పోతుంది.
ఖర దూషణులు రాముని పైకి యుద్ధానికి రావడం వాల్మీకి రామాయణంలో వలెనే సాగుతుంది. అయితే వారిద్దరి ఓటమి తరువాత కూడా కంబ రామాయణంలో శూర్పణఖ రామునిపై వలపు పోగొట్టుకోదు. రావణుని దగ్గరకు పోయి సీత సౌందర్యాన్ని వర్ణిస్తుంది. ఎంతగా వర్ణిస్తుందంటే అతను సీతను ఉహించుకుని ఆమెను మోహిస్తాడు. తానూ రాముడిని వలచాననీ రావణుడు సీతను పొందితే తను రాముడిని పొందగలననీ ప్రకటిస్తుంది.
కథనస్వరంలోని పై తేడాలే కాక వాల్మీకి, కంబన్ వస్తువులోని కొన్ని వివరాలలో కూడా స్వల్ప భేదాలున్నాయి. ఇందులో రాముడు శూర్పణఖతో పరిహాసమాడినా అది నాగరికంగాను, సున్నితంగాను వుంటుంది. వాల్మీకి కథనంలోలాగా ఇందులో రాముడు లక్ష్మణుని ప్రేమించమని మొరటుగా చెప్పడు. అంతేకాక శూర్పణఖను విరూపిని చేయడంలో లక్ష్మణుడిదే మొత్తం బాధ్యత. తరువాతే ఆ సంగతి రాముడికి తెలిసింది. ఇదంతా కూడా సీతాపహరణ విషయంలో కంబన్ తీసుకున్న ఉదాత్తమైన వైఖరి. ఇందులో రావణుడు సీత చుట్టూ భూశకలాన్ని పెళ్ళగించి పట్టుకుపోతాడేగాని ఆమెను తాకి అవమానించడు. అయితే ఇందులో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులతో పాటు చనుమొనలను కుడా ఖండిస్తాడు. తమిళ సంస్కృతి ప్రకారం స్త్రీ వక్షోజాలు ఆమె శక్తికి చిహ్నాలు. వాటిని ఖండించడం చాలా ఘోరమైన అవమానం. ఇందులో శూర్పణఖ ఉపయోగించిన యుక్తులు ఎంత మోసంతో కూడినవైనా మొత్తంమీద రావణుని వలెనే శూర్పణఖను కూడా కంబన్ వాల్మీకికన్నా కొంత సానుభూతితో చిత్రించాడని చెప్పాలి.
ఆధ్యాత్మ రామాయణం 5 (అరణ్యకాండ)
పద్నాలుగు పదిహేను శతాబ్దాలలో వచ్చిన సంస్కృత ఆధ్యాత్మ రామాయణం, ఉత్తర భారతదేశంలో రామ ఉపాసన పెరగడంలో ముఖ్యపాత్ర వహించింది. రామానంది శాఖవారి పవిత్ర గ్రంథం అయింది కూడా. పురాణ, వేదాంత, తాంత్రిక మూలాలను కలుపుతూ రామకథలోని మానవ పాత్రలు, సన్నివేశాల ద్వారా ఒక దివ్య అన్యాపదేశ కథలా చెబుతారు. రాముడు విష్ణువు అవతారం. లక్ష్మణుడు ఆదిశేషువు. సీత లక్ష్మీదేవి.
శూర్పణఖ ఉదంతం వాల్మీకి చెప్పిన పద్ధతిలోనే వున్నా చాలా క్లుప్తంగా కొంత భిన్నంగా వుంటుంది. వాల్మీకి కథనంలో వలే శూర్పణఖను అందవిహీనురాలిగాను తరువాత రూపు మార్చుకున్నట్లు చూపలేదు, కానీ ఆమెకు తలచిననే రూపు మార్చుకునే శక్తి వుందని మాత్రం ప్రస్తావించబడింది. రాముని పాద ముద్రలు చూసి శూర్పణఖ అతనిని ప్రేమించింది. అతని పాదముద్రలపై తామరపువ్వు, పిడుగు, అంకుశం గుర్తులుంటాయి. అవి దివ్య చిహ్నాలు. ఆమె రాముని దగ్గరకు వెళ్లి తన ప్రేమను ప్రకటిస్తుంది కానీ, సీతకు నువ్వు సవతిగా వుండ కోరవు అంటూ ఆమెను లక్ష్మణుని దగ్గరకు పంపిస్తాడు రాముడు. లక్ష్మణుడు అవివాహితుడని అనడు. తను రాముని బంటు కనుక తనకు పెళ్లి చేసుకునే అర్హత లేదని, అందరికీ ప్రభువైన ఆ రాముని దగ్గరకే పొమ్మంటాడు లక్ష్మణుడు. తనని అటు ఇటు తిప్పినందుకు కోపం వచ్చిన శూర్పణఖ సీతను కబళిస్తానంటుంది. తక్కిన కథ వాల్మీకి రామాయణంలో వలెనే సాగుతుంది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కొయ్యడం, ఆమె ఖర దూషణులను ఆశ్రయించడం, వారు రామునితో పోరాడి ఓడిపోవడం, ఆమె రావణుని దగ్గరకు పోవడం వరకు. కానీ ఇక్కడ శూర్పణఖ రావణునితో తను అతనికోసం సీతను అపహరించుకు రాబోతుంటే రామలక్ష్మణులు తననిలా అవమానించారని చెబుతుంది. రాముడు మానవమాత్రుడు కాదని రావణుడు గ్రహిస్తాడు. ‘నేను ఆ దేవదేవుని చేతిలో మరణిస్తే స్వర్గానికి పోతాను. లేదంటే రాక్షసులకు సార్వభౌముడిని అవుతాను. కనుక రాముడితో తలపడతాను.’ అనుకుంటాడు.
ఇది వాల్మీకి రామాయణ కథనం వలే వున్నా ఆ వీర కావ్యంలోని సన్నివేశాలకు భిన్నమైన అర్థాలు స్ఫురిస్తాయి. అక్కడ ఇద్దరు శత్రువుల మధ్య పోరాటం, ఇక్కడ మరణం ద్వారా ముక్తికోసం చేసే పోరాటంలా వుంటుంది. భక్తి సంప్రదాయంలో భగవంతునిపై చూపే ఎంత తీవ్రమైన భావోద్వేగమైనా దైవభక్తి క్రిందికే వస్తుంది కనుక దేవుని చేతిలో మరణం పొందడం ముక్తి మార్గమని రావణుడు అర్థం చేసుకుంటాడు. కనుక ఇక్కడ దృష్టి కోణం మారింది. ఇక్కడ చివరికి అంతా అనుకున్నట్లే జరిగే విధంగా కొన్ని దైవలీలల్ని కూడా మనం చూడవచ్చు. ఈ లీలల వలన ఎన్నో నైతిక ప్రశ్నలని సొగసైన సమాధానాలతో పక్కకు నెట్టేయవచ్చు. కనుక ఆధ్యాత్మ రామాయణంలో రావణుడు అపహరించుకుపోయినది మాయ సీత అనీ, జరగబోయేదంతా ముందుగానే రామునికి తెలుసనీ వుంటుంది. ఆధ్యాత్మ రామాయణంలోని బాలకాండలో రాముడిని చిలిపి పిల్లవాడిగా దాదాపు కృష్ణునివలే చిత్రించారు. అంతా దేవుని లీలే కనుక, ఈ సందర్భంగా శూర్పణఖ ఉదంతాన్ని కూడా దైవసంకల్పమైన ఒక చిలిపిచేష్ట క్రింద పరిగణించాలి.
రామచరిత మానస్ (అరణ్య కాండ 16-18)
రామ చరిత మానస్ అంటే రాముని చర్యల సరస్సు అని అర్థం. ఇది పదహారో శతాబ్దంలో అవధి భాషలో (ప్రాచీన హిందీ భాష) తులసీదాస్ వ్రాసిన కావ్యం. ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యం పొందిన కావ్యం. అక్కడ రామాయణం అంటే రామచరిత మానస్ మాత్రమే అనేంత ప్రాచుర్యం పొందినది. ఇది ప్రథమంగా భక్తి కావ్యం. రామభక్తి ప్రవచనాలతో నిండి వుంటుంది.
శూర్పణఖ ఉదంతం దాదాపు వాల్మీకి రామాయణంలో వలే ఆధ్యాత్మ రామాయణంలో వలెనే వుంటుంది. అయితే ఇందులో కథనంలో వుండే లయ భిన్నంగా వుంటుంది. కొన్ని అంశాలను నొక్కి చెప్పడం, మధ్య మధ్యలో కొన్ని నీతి వాక్యాలను చొప్పించడం వుంటుంది. ఇది ఇతర రామాయణ కథనాలలో కనిపించదు. ఈ ఉదంతాన్ని కాక్‌భుసుంది (కాకాసురుడు) విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి నివేదిస్తున్నట్లుగా వుంటుంది. దాని సారాంశం ఇది:
పంచవటిలో రాముడు లక్ష్మణునికి నిరపేక్షమైన భక్తి గురించి బోధిస్తూ వుంటాడు. ఒక రోజు క్రూరస్వభావురాలు, నోటితీటగలదీ అయిన రావణుని సోదరి శూర్పణఖ అటుగా వస్తూ రామ లక్ష్మణులను చూసి మోహించింది. ఇక్కడ కథకుడు కల్పించుకుని ఇట్లా వ్యాఖ్యానిస్తాడు, ‘ఓ గరుడా! అందగాడైన యువకుడిని చూస్తేనే చాలు, అతడు తండ్రి కానీ కొడుకు కానీ సోదరుడు కానీ, స్త్రీ మనస్సు చలిస్తుంది. కోరికను జయించలేదు. సూర్యుని ముందుపెట్టిన సూర్యకాంత శిల ఎట్లా మంటలు వెదజల్లుతుందో అట్లా!’
ఈ వ్యాఖ్యానమే రాబోయే కథకు కంఠస్వరం అవుతుంది. సూచిక కూడా అవుతుంది. ఇక్కడ రచయిత శూర్పణఖ రాక్షస ప్రవృత్తిని కాక స్త్రీ ప్రవృత్తికి ప్రాముఖ్యమిస్తాడు. ఆమె ఆ ఇద్దరు అన్నదమ్ములు అందంగా వున్నారు కనుక ఇద్దరినీ మోహిస్తుంది, అందరు స్త్రీల వలే ఒక్కరినే కాదు. ఆమె నిగ్రహం లేని స్త్రీ.
తరువాత ఆమె ఒక సమ్మోహనాకారం ధరించి రామునితో అతను విశ్వసుందరుడనీ తానూ విశ్వసుందరిననీ తామిద్దరికీ జోడు స్వర్గంలోనే కుదిరిపోయిందనీ అంటుంది. అతనికోసమే తానింతవరకు కన్యగా వుండిపోయాననీ అంటుంది. అప్పుడు రాముడు సీత వైపు ఒకసారి దృష్టి సారించి ‘నా తమ్ముడు అవివాహితుడు’ అంటాడు. వెంటనే శూర్పణఖ లక్ష్మణుడి వైపు వెడుతుంది. అతనికి అప్పటికే తెలుసు ఆమె తమ శత్రువు చెల్లెలని. తాను రాముని సేవకుడనని చెప్పి ఆమెని వెనక్కి పంపిస్తాడు. రాముడు ఆమెను మళ్ళీ వెనక్కి లక్ష్మణుడి దగ్గరకు పంపుతాడు. ‘సిగ్గు శరము గాలికి వదిలేసినవాడు మాత్రమే నిన్ను పెళ్లి చేసుకుంటాడు’ అంటాడు లక్ష్మణుడు. అప్పుడామె తన నిజ రూపాన్ని ప్రదర్శించి సీతను భయపెడుతుంది. తరువాత లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేస్తాడు. అట్లా చేసి రావణుడిని యుద్ధానికి సవాలు చేస్తాడు. వెంటనే శూర్పణఖ ఖర దూషణుల దగ్గరకు పోతుంది. వాళ్ళు రామునితో యుద్ధం చేసి ఆయన పేరు స్మరిస్తూ చనిపోయి స్వర్గానికి పోతారు. శూర్పణఖ అప్పుడు రావణుడి దగ్గరకు పోయి ఇదంతా జరగనిచ్చినందుకు అతన్ని నిందిస్తుంది. ఈ భవసాగరాన్ని ఈదడానికి సులువైన మార్గం రాముని చేతిలో మరణించడమే అని నిర్ణయించుకున్న రావణుడు సీతను అపహరించుకొస్తాడు. నిజానికి ఆమె నిజమైన సీత కాదు. మాయా సీత!
ఆధ్యాత్మ రామాయణంలో అన్యాపదేశాలపై చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కూడా వర్తిస్తాయి, భక్తి భావ ప్రకటన ఎక్కువగా వున్న సందర్భాలలో. రామలక్ష్మణులు శూర్పణఖను ఎవరివి నీవని అడగనైనా అడగరు. వారు దైవాంశ సంభూతులు కనుక, ఆమె ఎవరో వారికి తెలుసు. కథలో శూర్పణఖ వృత్తాంతాన్ని అట్లాగే వుంచడం కూడా అవసరమే. ఎందుకంటే అది కథకు ఉత్ప్రేరకం కనుక. కాకపొతే ఈ వృత్తాంతాన్ని మరింత ఆకర్షణీయంగా చెప్పలేదు. రాముడు సీత వైపు చూసిన చూపులోనే రాబోయే కథ మనకి తెలిసిపోతుంది. ఈ కథ జరుగుతున్నంతసేపు సీత అక్కడే వున్నది. అక్కడొక దివ్య వాతావరణం నెలకొని వుంది. అన్నతమ్ములు శూర్పణఖతో వ్యవహరించిన తీరుని కూడా తులసీదాసు నైతికంగా సమర్థించాడు. పూర్వపు రామాయణాల్లో లేని విధంగా లక్ష్మణుడిని ప్రస్తుతించాడు. అయితే ఈ నైతికపరమైన సమర్థింపులను రామచరిత మానస్ వ్యాఖ్యాతలందరూ సమ్మతించలేదు. మాతాప్రసాద్ గుప్తా అనే హిందీ పండితుడు రాముని చర్యలలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాడు.
“ఆయన గొప్ప శీల సంపదకు సరితూగని సంఘటనలు రెండు ఉన్నాయి. 1. శూర్పణఖను అందవిహీనను చేసి పరాభవించడం 2. వాలిని మోసంతో వధించడం. అయితే, ఈ రెండు చర్యలనూ పూర్తిగా సమర్థించేవారు కొందరున్నారు. ఈ రెండు అంశాలనూ ఎత్తి చూపడం నైతికత దృష్ట్యా అవసరమే కావచ్చు. సాహితీపరంగా చూస్తే కూడా ఈ లోపాలు ఎంతవరకు ఈ కావ్య సౌందర్యాన్ని పెంచగలవు?” అంటాడాయన.
ఇవికాక మరి రెండు అంశాలున్నాయి. ఇతర రామాయణాల్లో వలే కాక కంబ రామాయణంలోలా శూర్పణఖ తాను కన్యనని చెబుతుంది ఇక్కడ. ఆమెను అన్నతమ్ములిద్దరు మరొకసారి తమ మధ్య తిప్పుకుంటారు.
రాధేశ్యామ్ రామాయణం
రాధేశ్యామ్ రామాయణం ఇరవయ్యో శతాబ్ది మధ్యలో వచ్చిన సరళమైన హిందీ కావ్యం. సాధారణ పాఠకులకు కూడా సులభంగా బోధపడే సజీవ భాషలో వున్న ఈ కావ్యం చవకగా కూడా దొరుకుతున్నది. అలంకారాలతో కూడి కాలం చెల్లిన భాషలో వ్రాసిన రామచరిత మానస్ కన్నా సులభ గ్రాహ్యమైనది. ఉత్తర హిందుస్తానంలోని రామలీల ప్రదర్శనలకు ఎక్కువగా ఈ రామాయణమే మూలం.
తక్కిన రామాయణాల్లో వలెనే ఇందులో కూడా శూర్పణఖ రాముని ప్రేమించడంతోనే కథ మొదలౌతుంది. సీతాలక్ష్మణ సమేతుడైన రాముని నివాసంలో చూసిన శూర్పణఖ రామునిపై ప్రేమలో పడిపోయింది.
మిగతా కథంతా ఇలా సాగుతుంది.
ఆమె ఇలా అంటుంది: ‘ఈ ప్రపంచంలో నా అంత అందగత్తె మరెవరూ లేరు. నీ అంత అందగాడు కూడా లేడు. భగవంతుడే మనిద్దరినీ కావాలని ఇట్లా సృష్టించి వుంటాడు. చంద్రుడిని సృష్టించినవాడే సూర్యుడిని కూడా సృష్టించాడు. ఓ వనవాసీ! నాకు ఆశ్రయమివ్వు. సృష్టికర్త ఆశయం నెరవేర్చు. గంధర్వ విధిని నన్ను వివాహమాడమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.’
సీత ఇట్లా అనుకున్నది. ‘నా హృదయం ముక్కలైపోకుండా వుండుగాక! నిజంగానే సూర్యచంద్రుల కలయికే సంభవిస్తే నా ప్రపంచమిక గాఢాంధకారమే!’ అప్పుడు తనలో తను నవ్వుకుంటూ సీతాపతి ఇలా అన్నాడు. ‘నన్ను క్షమించు సుందరీ, నేను నీ ప్రేమకు అర్హుడిని కాను. నేను బ్రహ్మచారిని కాను, వివాహితుడిని. ఏకపత్నీవ్రతుడిని. తక్కిన స్త్రీలందరూ నాకు సోదరీ సమానులు లేదా మాతృసమానులు. అందువలన నీ కోర్కె నేను తీర్చలేను. నేను మర్యాదస్తుడిని, ధర్మ బద్ధుడిని.’
ఆ రాక్షస వనిత రాముడు చెప్పినదంతా విని, లక్ష్మణుని వైపు చూస్తూ అతనితో అన్నది: ‘నా వైపు ఎందుకలా చూస్తున్నావు? ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? అతనంటే సరే, వివాహితుడు. నీవు అవివాహితుడి వలే కనపడుతున్నావు. అతనిచ్చినటువంటి కటువైన సమాధానం నువ్వు ఇవ్వకు. నాకిష్టమే కనుక నీకు ఇష్టమైతే మనిద్దరి కలయికలో తప్పేమీ లేదు.
లక్ష్మణుడిది మొదటి నుంచీ కాస్త దుడుకు స్వభావమే. అతడు ఆ రాక్షస వనిత ప్రవర్తనను భరించలేకపోయాడు. అతనిలా అన్నాడు, ‘ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదా నీకు? ఇట్లా మాట్లాడే ముందు నువ్వు చచ్చిపోవాల్సింది పాపిష్టిదానా! నా జీవితంలో ఇంత సిగ్గులేనితనాన్ని ఇప్పుడే చూస్తున్నాను కనుక ఇవ్వాళ చాలా అమంగళకరమైన రోజు. నీ కుటుంబానికి మచ్చ తెచ్చావు. నువ్వింకా అవివాహితురాలివే అయితే నీ పెద్దలతో త్వరగా నీకు పెళ్ళి చెయ్యమని చెప్పు. వివాహమనేది చాలా పవిత్రమైన క్రతువు. అది ధర్మం ప్రకారం జరగాలి. దాన్ని విపణిలో బేరమాడే సరుకుగా తలవకు. వివాహం ఆశయం సుఖం కాదు. అదొక విధి నిర్వహణ. నీవిప్పటికే వివాహితవై ఉంటే నీ భర్తను కొలుచుకో! అతడే నీ భగవంతుడు, పూజనీయుడు. అతని సుఖం కోరుకో! నీవు వితంతువు అయివుంటే నీ భర్త కోసం సుఖాలను త్యాగం చెయ్యి. నీ కుటుంబానికి నీ జాతికి నీ దేశానికి సేవచెయ్యి. నీ సోదరీమణుల అభ్యున్నతి కోసం కృషిచెయ్యి. నువ్వు చెయ్యవలసిన సరైన పని అదే. నీ భర్తనే తలుచుకుంటూ నిశ్చల చిత్తంతో మనుగడ సాగించు. ఈ విధంగా అక్కడా ఇక్కడా తిరుగుతూ ఎందుకు సిగ్గు వదిలిపెడతావు? ఇట్లా నీ తండ్రి, సోదరుల ప్రతిష్టను దిగజారుస్తున్నావు!’
ఇందులో లక్ష్మణుడి ఆగ్రహ ప్రవాహం ముందు రామచరిత మానస్‌లోని నీతి బోధలు చాల సున్నితమైనవిగా అనిపిస్తాయి. లక్ష్మణుడి ఆంతర్యం ఇక్కడ స్పష్టంగానే వున్నది. ఒక స్త్రీ జీవితంలో మూడు దశలు వుంటాయి. అవి కన్య, వివాహిత లేదా వితంతువు. ఈ మూడు దశలలో ఏదీ కూడా ఆమె స్వతంత్రంగా తన లైంగిక భాగస్వామిని ఎంచుకునే వీల్లేదు. స్త్రీల పాతివ్రత్యం, పవిత్రతల మీదే ఆయా కుటుంబాల పరువు ప్రతిష్టలు ఆధారపడివుంటాయి. ఈ మాటలలో త్వరత్వరగా మారుతున్న ఇరవయ్యో శతాబ్దపు భారతదేశంలో ఒక ఆధునిక ధ్వని కూడా వున్నది. పూర్వపు గాంధర్వ వివాహాల వలే ఈనాటి ప్రేమ వివాహాలు అనుమతింపబడతాయేమోననే శంక, వాటి పట్ల కవి అసమ్మతిని కూడా ఈ వాక్యాలు సూచిస్తాయి. కవి విపణి గురించి చేసిన యథాలాప వ్యంగ్య వ్యాఖ్య కూడా నేడు పెద్దలు కుదిర్చిన వివాహాల్లోని ఆర్ధిక కోణాన్ని ప్రస్తావిస్తుంది. పనిలో పనిగా ఒక భార్య తన భర్తను దైవంగా కొలవాలని, అదే ఆమెకు ముక్తి మార్గమనే సంప్రదాయ సూత్రాన్ని కూడా పునరుద్ఘాటిస్తాడు. వితంతువులను గురించి కవి చేసిన వ్యాఖ్య కూడా అప్పుడప్పుడే సమాజంలో ప్రవేశిస్తున్న వితంతు పునర్వివాహాల పట్ల అసమ్మతిని సూచిస్తుంది. దేశసేవ, స్త్రీల అభ్యున్నతి గురించిన ప్రస్తావన కూడా ఆనాటి సమాజంలో వస్తున్న మార్పులను సూచిస్తుంది.
కథ ఇలా కొనసాగుతుంది…
ఆ వనవాసి చెప్పిన మాటలు విని మరింత ఆవేశాల జడికి గురైంది శూర్పణఖ. కుండ జారి పరిశుద్ధమైన నీరు ఒలికిపోయిన చందమయింది. అప్పుడామె ఇలా అనుకున్నది, ‘ఇతనితో ఇలా మాట్లాడి లాభంలేదు. ఎప్పుడూ నీతులు బోధించేవాడు మారడు. నల్లనివాడూ పద్మాక్షుడూ అయిన పెద్దవాడే కొంత నెమ్మదిగా మాట్లాడాడు. కానీ అతనితో పాటు అతని భార్య వున్నది కదా! ఆమె వుండగా అతను నన్ను చేపట్టడు. కనుక నేను నా భయంకరమైన స్వరూపాన్ని ధరించి ఆమెను మింగేస్తాను. ఆ విధంగా ఒక్క క్షణంలోనే నా దారిలో ముల్లుని తొలగించేసుకుంటాను.’
ఆమె అట్లా భయంకరాకారం దాల్చగానే ఆమె మెడలోని పుష్పహారం ఈటెలతో చేసిన దండలా మారిపోయింది. వెంటనే ఆమె సీతను సమీపించి నోరు తెరుస్తుండగా, ఇక ఆమె వికృత చేష్టలను భరించలేకపోయాడు లక్ష్మణుడు. తన ఎదుటే తన తల్లిని హింసపెడితే ఎవరు సహించగలరు? ఒక సేవకుని ముందు యజమానురాలిని హింసపెట్టే ధైర్యం ఎవరు చెయ్యగలరు? లక్ష్మణుడి కళ్ళు ఎర్రబడ్డాయి. క్షత్రియపుత్రుడైన అతని బాహువులు ఆయుధాలైనాయి. ‘ఈమె గొంతు నులిమి భూభారం తగ్గిస్తాను. నా ముష్టి ఘాతాలతో అమెను క్షణంలో పిండి పిండి చేస్తాను.’ అనుకున్నాడు. లక్ష్మణుని మనసులో చెలరేగుతున్న భావాలను పసిగట్టిన రాముడు ‘ఆమెను చంపకు. అందవిహీనను చెయ్యి.’ అని అతనికి సైగ చేస్తాడు. రాముని ఆజ్ఞను ధిక్కరించలేని లక్ష్మణుడు వెంటనే ఆమె ముక్కూ చెవులూ కోసేస్తాడు.
బాధతో రోదిస్తూ ఆ చెడ్డమనిషి వెళ్ళిపోగానే రాముడు లక్ష్మణుడితో, ‘నువ్వు ఆమెను చంపాలనుకున్నావు. అది ధర్మం కాదనిపించింది. ఈ పరిస్థితిలో ఒక అబలను చంపడం సరి అయిన పని కాదు. అందుకే ఆమెను అందవిహీనను చెయ్యమన్నాను. అట్లా అయితే ఇంక ఆమె ఎవరితోనూ ఇటువంటి అసభ్య ప్రతిపాదన చెయ్యదు,’ అన్నాడు.
‘నువ్వు యోధుల ధర్మాలను పాటించావు. అయినా ఆమెను చంపడం కూడా తప్పుకాదు. మన గురువు విశ్వామిత్రుడు మన బాల్యంలోనే తాటకను మనచేత చంపించలేదా? ఆయన అనేవారు కదా, పతితురాలైన స్త్రీని చంపడం పాపం కాదని! భూమి మీద క్షుద్ర జీవులని చంపడం పాపం కాదు.’
సీత నవ్వుతూ ‘నువ్వైతే చంపి వుండేవాడివి. కానీ మీ అన్న కరుణాసముద్రుడు, దయాశీలి…’ అన్నది. ఆమె మాటలలోని వ్యంగ్యానికి రాముడు ఇబ్బందిపడ్డాడు. లక్ష్మణుడు చేతులతో నోరు కప్పుకుని పగలబడి నవ్వాడు.
ఈ కథనం నీతి బోధాత్మకంగానూ, అసంబద్దంగానూ వుంటుంది. ఆసక్తికరంగా కూడా వుంటుంది. ఇక్కడ తక్కిన కథనాలలోలాగా రామలక్ష్మణులు శూర్పణఖతో చెలగాటమాడరు. ఉదాహరణకి ఇక్కడ రాముడు శూర్పణఖతో లక్ష్మణుడు అవివాహితుడని చెప్పడు. శూర్పణఖ అట్లా భావిస్తుంది. లక్ష్మణుడి ఉపన్యాసం కూడా కొత్తదే. బహుశా రామచరిత మానస్ దీనికి ప్రేరణ కావచ్చు. రాధేశ్యామ్ రామాయణంలో శూర్పణఖ అవమానం ఆమెను శిక్షించడానికే కాదు, ఒకవిధంగా నిరోధించడం. చాలాకాలం తరువాత రాముని కుమారులు లవకుశులు రామకథను గానం చేసేటప్పుడు శూర్పణఖ ఉదంతాన్ని ఇట్లా ప్రస్తావిస్తారు: “రాముడు లక్ష్మణుడిచేత శూర్పణఖ ముక్కు చెవులు ఖండింపచేయగలడని ఎవరనుకున్నారు? అయితే పాపాత్ములను శిక్షించడం ఆయన విధి. ఆమెను పాపం చెయ్యకుండా కాపాడడానికే అందవిహీనను చెయ్యవలసి వచ్చింది.”
అంటే రాముడు ఆమెను కాపాడడానికే అట్లా చేశాడని అర్థం. శూర్పణఖ అక్కడ నుంచి వెళ్ళిపోయాక ఆ ముగ్గురూ మనసారా నవ్వుకున్నారు.
మిగిలిన కథంతా రామచరిత మానస్ వలెనే సాగుతుంది. శూర్పణఖ రావణాసురుడి దగ్గరకు వెళ్లి ఇట్లా అంటుంది: ‘నా ముక్కు పోతే పోయింది. ఇప్పుడు నీ ముక్కు సంగతి చూసుకో!’ ప్రజల హిందీ భాషలో ముక్కు పోవడం అంటే గౌరవం పోవడం. రావణుడికి కోపం వచ్చినట్లు అభినయించాడు కానీ ఇతర భక్తి ప్రధానమైన కథనాలలో వలెనే ఈ అవకాశాన్ని తన మోక్ష సాధనకు వినియోగించుకున్నాడు.
రాధేశ్యామ్ రామాయణంలోని క్షమాపణ స్వరానికి అనుకూల ప్రతికూల అంశాలను పక్కపక్కన పెట్టి చూపడానికి ఇక్కడ నేను ఇటీవల అరవిందకుమార్ శూర్పణఖ నాసికా ఖండన గురించి వ్రాసిన A study in the ethics of the banishment of Seetha అనే వ్యాసాన్ని ఉదాహరిస్తాను. అది యథార్థంగా ఆయన వ్రాసిన ‘రామ్ కా అంతర్ ద్వంద్వ’ (రాముని అంతరంగ మథనం) అనే కవితను సమర్థించుకుంటూ చేసిన రచన. ఇది ప్రసిద్ధ హిందీ పత్రిక ‘సరిత’లో 1957లో ప్రచురితమైంది. దీని మీద పాఠకులు చేసిన ఆందోళన, చూపిన ఆగ్రహావేశాల వలన ఆ రచనను ప్రభుత్వం బహిష్కరించింది. అప్పటికి ఇంకా బహిష్కరణ అమలులో ఉన్నందున ఆ రచనను ఆయన తన పుస్తకంలో చేర్చలేదు.
తన పుస్తకంలోను, ఆ కవితలోనూ కూడా రాముడికి సీతపట్లగల విశ్వాసాన్ని ప్రశ్నించాడు అరవిందకుమార్. రాముడు శూర్పణఖ పట్ల ఆకర్షితుడైనట్లు కూడా ఆయన సూచించాడు. సీతను పరిత్యజించాలా వద్దా అని తనలో తనే మథనపడుతూ తన గత జీవితాన్ని మననం చేసుకుంటూన్న రాముని స్వగతంలాగా వుంటుంది ఈ కవిత. అందులో సీత పాతివ్రత్యాన్ని శంకించడమూ, ఒకప్పుడు తను కూడా శూర్పణఖ అందంపట్ల ఆకర్షితుడైనట్లూ రాముడు భావిస్తాడు. రాముడు తన జీవితంలో చేసిన అనేక విన్యాసాలలో శూర్పణతో ప్రవర్తించిన తీరుకూడా ఒకటి అనీ అనుకుంటాడు. తను అబద్ధం ఆడుతున్నానని రామునికి తెలుసు. వనవాసానికి ముందే లక్ష్మణుడు ఊర్మిళను వివాహమాడి పన్నెండేళ్ళు ఆమెతో కాపురం చేశాడు. ఇది కూడా ఒక విన్యాసం కావచ్చు.
శూర్పణఖతో అతని ప్రవర్తనను కూడా అరవిందకుమార్ విమర్శించాడు. అంతే కాదు, ఆతను శూర్పణఖతో తుంటరిగా చతుర్లాడడంలోని ఔచిత్యాన్ని కూడా అరవిందకుమార్ ప్రశ్నించాడు. మనసులో ఏ ఉద్దేశమూ లేని నిజాయితీపరుడైన పురుషుడు, తనను కోరి వచ్చిన స్త్రీని తన తమ్ముడి దగ్గరకు పొమ్మని అనగలడా? రాముడు శూర్పణఖను సూటిగా తిరస్కరించలేదు. ‘నువ్వు నన్ను నీ సవతితో పంచుకోలేవు కదా?’ అంటాడు. ఆ తరువాత రామలక్షణులిద్దరూ ఆమెను ఒక బంతిలా ఆడుకున్నారు.
కుమార్ మొదటి కవిత పట్ల ప్రజాగ్రహం పెల్లుబికిన తరువాత అతను దానిని సమర్థించుకుంటూ వ్రాసిన వ్యాసం వలన తేలినదేమిటంటే మతపరమైన పాత్రల విషయాలలో వ్యంగ్యం కానీ విమర్శను కానీ ఇటు హిందూ మతమూ అటు క్రైస్తవం కానీ, ఇస్లామ్ కానీ సహించలేవు. (ఉదా: ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా, సల్మాన్ రుష్డీ వ్రాసిన శాటానిక్ వర్సెస్ అనే నవల). రాముని సచ్ఛీలత అనేది భారతీయ సంస్కారానికి ప్రతీక కనుక అతడిని ఆక్షేపించడం మతాన్ని వ్యతిరేకించడంతో సమానం.
విరూపణ స్త్రీలకొక శిక్ష
శూర్పణఖ ఉదంతం నుంచి ఒకదానికొకటి సంబంధంకల మూడు అంశాలు ఇక్కడ ఉత్పన్నమౌతున్నాయి. ఇవన్నీ కూడా హిందు సంస్కృతిలోనూ పురాణాలలోను ఎంతో ప్రాముఖ్యం కలిగి వున్నవి. అన్నిటిలో మొదటిది శూర్పణఖ విరూపణ. ఇది అన్ని రామాయణ కథనాలలోనూ ప్రామాణికమైన అంశం. ఎక్కువ రామాయణ కథనాలలో శూర్పణఖ ముక్కూ చెవులూ ఖండించబడినట్లు వుంటుంది. కొన్నిటిలో ముక్కు ఒక్కటే ఖండించబడ్డట్లు వుంటే, మరికొన్నింటిలో ముక్కూ చెవులే కాక ఆమె వక్షోజాలు, కాళ్ళు చేతులు, చివరికి జుట్టు కూడా ఖండించినట్లు వుంటుంది. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో వక్షోజాలు స్త్రీ శక్తికి ప్రతీకగా భావించడం చూస్తాం. కనుక వాటిని లేకుండా చెయ్యడం అంటే స్త్రీలను అత్యంత అవమానకరంగా శక్తిహీనులను చెయ్యడం అన్నమాట. నాసిక వ్యక్తి గౌరవానికి చిహ్నం. అన్ని రామాయణ కథనాలలోనూ ఆమె నాసికని ఖండించడం వుంటుంది. అంటే ఆమెను గౌరవహీనురాలిని చెయ్యడం. ఈ విషయాన్ని రాధేశ్యామ్ రామాయణంలో స్పష్టంగా చూడవచ్చు. ఇందులో శూర్పణఖ రావణుడిని ‘ముందు నీ ముక్కు సంగతి చూసుకో!’ అని హెచ్చరిస్తుంది. అంటే అతని గౌరవానికి ముప్పు కలగబోతోందని. ముఖ్యంగా స్త్రీల గౌరవం వారి లైంగిక పవిత్రత మీద ఆధారపడి వుంటుంది కనుక నాసికా ఖండనం అనే శిక్ష స్త్రీలకు ప్రత్యేకమైనది.
భారతీయ శిక్షాస్మృతులు చాలావరకు స్త్రీలకు మరణ దండనను నిషేధిస్తాయి, ఎంత తీవ్రమైన నేరానికైనా సరే. అయితే వాల్మీకి రామాయణంలోని బాలకాండలో లక్ష్మణుడు తాటక అనే రాక్షసిని విరూపిని చేసిన తరువాత కూడా విశ్వామిత్రుని ఆజ్ఞానుసారం రాముడు ఆమెను సంహరిస్తాడు. సాధారణంగా ఒకే నేరం చేసినప్పటికీ స్త్రీ పురుషులకు వేరు వేరు శిక్షలుంటాయి. లైంగిక సంబంధమైన నేరాలకు, అంటే వ్యభిచారం చేసినా, భర్తకు విషం యిచ్చి చంపినా, సాధారణంగా స్త్రీలకు విరూపణే శిక్ష. ఈ నమూనా మన పురాణాలలోనూ జానపద గాథలలోనూ విస్తృతంగా కనిపిస్తుంది. ఇటువంటి దృశ్యాలను సాధారణంగా హాస్యంగా చిత్రీకరిస్తూవుంటారు. ఉత్తర భారతంలో రామలీల ప్రదర్శనల్లో శూర్పణఖ ఉదంతాన్ని ఒక ప్రహసనంలా ప్రదర్శిస్తారు. ప్రేక్షకులలో పురుషులు నవ్వులతోనూ ముతక చతుర్లతోనూ ఆనందాన్ని ప్రకటిస్తారు. స్త్రీలు పాతివ్రత్యంపట్ల ఉత్సుకతను వెళ్ళగక్కుతారు.
వనవాసంలో శృంగారం, పవిత్రత
శివుడికీ కృష్ణుడికీ సంబంధించిన పురాణాలలో శృంగారానికీ, లైంగిక పవిత్రతకీ సమానమైన పాతినిధ్యం వుంటుంది–ఈ రెండూ విరుద్ధమైన విషయాలైనప్పటికీ కూడా. రాముని విషయంలో శృంగారం పూర్తిగా అదృశ్యం. సన్యాసికీ గృహస్థుకూ మధ్య కొంత సంబంధం వుంటుంది. వీటిని ధర్మాలని చెప్పటం జరుగుతుందే కానీ గృహస్థు అంటే కోరికలకు లొంగిపోయేవాడనీ, సన్యాసి అంటే కోరికలని శమింపజేసుకునేవాడనీ కాదు. ఆ రెండింటినీ తన ధర్మాలక్రింద భావించేవాడని అర్థం. సంప్రదాయం ప్రకారం వనవాసంలో రాముడు వానప్రస్థంలో వున్నట్లు లెక్క. అంటే భార్యతో వనవాసం చేస్తున్న ఒక సన్యాసి అని. జీవితంలోని ఈ దశ చాల సంక్లిష్టమైనది. ఎందుకంటే రెండు విరుద్ధమైన అంశాల మధ్య అసంతృప్తితో కూడిన రాజీ (ఒక గృహస్థుగా ఒక సన్యాసిగా) ఇది. వాల్మీకి ఈ విషయంలో స్పష్టత చూపకపోయినప్పటికీ సంప్రదాయం ప్రకారం రాముడూ సీతా వనవాసంలోని పద్నాలుగు సంవత్సరాలూ బ్రహ్మచర్యాన్ని పాటించారు.
అభినవ గుప్తుడు వ్రాసిన సంస్కృత సౌందర్య శాస్త్రంలో రామాయణంలోని ముఖ్య వస్తువును ఇట్లా సంక్షేపించాడు. శృంగారకేళిలో వున్న రెండు పక్షులపై బాణం వేసి, ఒకదానిని చంపి పాపం చేసిన వేటగాని కథను ప్రాతిపదికగా చెప్పాడు వాల్మీకి. రాముని కథలో కూడా సీతారాముల ప్రేమకు మొదట అంతరాయం కలిగించినదానిగా శూర్పణఖ, తరువాత మరింత విధ్వంసకారిగా రావణుడిని చిత్రించడం జరిగింది. హిందూ పురాణాల్లో వుండే సర్వసామాన్యమైన నమూనా ఇదే. శివపార్వతుల శృంగారానికి అంతరాయం కలిగినప్పుడు వినాశకరమైన పర్యవసానాలు సంభవించాయి. ఇదే విధంగా వానప్రస్థంలో శూర్పణఖ ఉదంతాన్ని పోలినదే శివుని తపస్సుకు భంగం కలిగించిన కాముని ఉదంతం. అహల్య కథ కూడా ఈ కోవలోనిదే. అడవిలో నివసించే అహల్య గౌతముల వైవాహిక జీవితాన్ని భగ్నం చేశాడు ఇంద్రుడు. అందుకు అతనితోపాటు అహల్య కూడా శిక్ష అనుభవించింది. శూర్పణఖ ఉదంతం అడవిలోని సౌందర్యభరితమైన వాతావరణం, సీతారాముల ఆదర్శ దాంపత్యం, వారి పవిత్ర ధర్మాచరణతో ప్రారంభమౌతుంది. శూర్పణఖ ప్రదర్శించిన శృంగార కాంక్ష అటు గృహస్థ ధర్మాలకూ ఇటు సన్యాస ధర్మాలకూ కూడా అంతరాయం కలిగించింది కనుక ఆమెకు శిక్ష పడింది.
సీత, శూర్పణఖలు స్త్రీకి రెండు పార్శ్వాలు
పురాణాలలోనూ జానపద గాథలలోనూ సాధారణంగా కనిపించే రెండు విధాలైన స్త్ర్రీ పాత్రలకు సీతా శూర్పణఖలు ఉదాహరణలు. సీత యోగ్యురాలు, పవిత్రమైనది, మంగళకరమైనది. ఆమె ఒక వెలుగు, అంతేకాక విధేయురాలు. కాగా శూర్పణఖ అయోగ్యురాలు, అమంగళకరమైనది, తమస్సు వంటిది, అవిధేయురాలు. పురుష పాత్రలు కూడా మంచీ చెడు గుణాలు కలవిగా ఉన్నప్పటికీ స్త్రీ పాత్రలలో ఈ వైరుధ్యం మరింత ప్రస్ఫుటంగా కనపడుతుంది. అంతేకాక ఇది వారి లైంగికతపరంగా చూపించడం జరుగుతుంది. శూర్పణఖ వంటి ఒక స్త్రీ ఒక తప్పు చేస్తే ఆ తప్పు ఆమె స్త్రీ స్వభావానికి అన్వయించబడుతుంది. రావణుడి దుష్క్రియలు అతని పురుష స్వభావానికి అన్వయించబడవు. అంతేకాక భక్తి ప్రధానమైన రామాయణాలలో మంచి స్త్రీ శారీరకంగానూ మానసికంగానూ భర్త అదుపాజ్ఞలలో వుంటుంది. భర్త సమక్షంలో లేనప్పుడు తండ్రి, సోదరుడు లేదా తన కుమారుడి అదుపాజ్ఞలలో వుంటుంది. ఆమె లైంగిక వాంఛలు భర్త ద్వారా కేవలం సంతానోత్పత్తి కోసమే తీర్చుకోవాలి. అది ఆమె ధర్మం. అటువంటి మంచి భార్య ద్వారా పుత్రులను కని, తన పూర్వీకులను సంతోషపెట్టడం పురుషుని ధర్మమని శాస్త్రాలు తరచూ వక్కాణిస్తూ వుంటాయి. తరచూ చెప్పే ఒక సూక్తి ప్రకారం ఒక స్త్రీ బాల్యంలో తండ్రి అదుపులో వుంటూ రక్షణ పొందాలి. అట్లాగే యౌవ్వనంలో భర్తను, వార్ధక్యంలో కుమారుడిని అనుసరిస్తూ రక్షణ పొందాలి. స్త్రీకి స్వతంత్రంగా జీవించే అర్హత లేదు.(మను స్మృతి V.147 IX.3) అలాగని మంచి స్త్రీ ఎప్పుడూ ఆబల కాదు. శక్తిహీనురాలు కాదు. ఆమె శక్తిస్వరూపిణి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె పవిత్రతా, సంరక్షణ స్వభావాలే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కానీ, పురుషస్వామ్య సమాజ లక్ష్యాలను కాపాడుకోవాలంటే ఆమె శక్తిని అదుపులో వుంచాలి. అట్లా సీత తన భర్తకు తోడుగా వనవాసానికి వచ్చింది. ఆమెను ప్రతి అడుగులోనూ కనిపెడుతూ కాపాడుతూ వుండాలి. అట్లా కాకపొతే ఆమెను రాజ భవనం నుంచి అడుగు బయట పెట్టనిచ్చేవారు కాదు.
చెడ్డ స్త్రీలకు ఇటువంటి అదుపాజ్ఞలు వుండవు. సీతవలే కాక శూర్పణఖ ఒక చోట కట్టుబడి వుండక స్వేచ్ఛగా సంచరిస్తూ వుంటుంది. తన ఇష్టానుసారం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే శక్తిమంతురాలిననీ సబలననీ తన గురించి తను చెప్పుకుంటుంది శూర్పణఖ. ఆమె ఒక వితంతువని చెప్పినా మనం ఆశ్చర్యపడనక్కరలేదు. ఎందుకంటే వితంతువులు ప్రమాదకరమైనవారు, బిడ్డలకు జన్మనివ్వలేని పరిస్థితులలో వున్నవారు కనుక అమంగళకరమైనవారు. వారు ఒక పురుషుని అదుపులో లేరు కనుక వారి పవిత్రత కూడా అనుమానించతగ్గదే! అంతేకాక స్త్రీలకు అంతులేని శృంగార కాంక్ష వుంటుంది కూడా కదా! హిందీ, పంజాబీ, మరికొన్ని ఉత్తర భారతీయ భాషలలో ‘సుహాగిన్’, ‘సుమంగళి’ వంటి పదాలు భర్త బ్రతికి వున్న స్త్రీని గురించి చాలా శుభమైన పదాలుగా వాడుతూ వుంటారు. ‘రండి’ అనే పదాన్ని వితంతువుకూ వ్యభిచారిణికీ కూడా వాడతారు. శూర్పణఖ అవివాహిత కావడం కూడా ఆమె చెడు స్వభావానికి మూలం. ఆమె రాక్షసి అవడం కూడా అందుకు మరొక కారణం. మండోదరి కూడా రాక్షసే. కానీ భర్త రావణుడి పట్ల ఆమెకున్న భక్తీ, ఆమె పవిత్రత వలన ఆమెను ప్రశంసిస్తారు. శూర్పణఖను దూషించడానికి కారణం ఆమె ఎవరి అదుపులోనూ లేని స్వతంత్ర మహిళ కావడం ముఖ్యమైనది. అటువంటి స్త్రీల పట్ల, చుట్టూ కూడా పురుషుల ఊహలు పరిభ్రమిస్తూ వుంటాయి. అందువలనే కావచ్చు, శూర్పణఖను వెంటనే తరిమివేయకుండా రామలక్ష్మణులు ఆమెతో చెలగాటమాడారు.
శూర్పణఖను శిక్షించడానికి రాముడు సీతను ఒక నెపంగా వాడుకున్నాడనేది తెలుస్తూనే వుంది. సుశీలను కాపాడడానికి దుశ్శీలను శిక్షించడం, లేదా మంచి స్త్రీలు చెడుగా మారితే ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పడం, మొత్తానికి స్త్రీలను రెండు పక్షాలుగా విభజించడం- ఈ మొత్తం వ్యవహారమంతా అసలు స్త్రీలను నమ్మకపోవడంగా అర్థమౌతుంది. ఇలా కూడా మనం వాదించవచ్చు: సౌందర్యవతి శీలవతి శుభప్రద అయిన సీత, లక్ష్మి (భాగ్యానికీ సౌభాగ్యానికీ చిహ్నం) అనుకుంటే అందవిహీన, అమంగళకరి, అపవిత్ర అయిన శూర్పణఖ దురదృష్టానికీ ఆశుభానికీ చిహ్నమైన ‘అలక్ష్మి’ కావాలి. లక్ష్మిని ఆహ్వానించే పండుగలో ఆమె సోదరి అలక్ష్మిని దీపాలు వెలిగించి వెళ్ళగొడతారు. కానీ బెంగాలీ లక్ష్మి పండుగలో పనిగట్టుకుని ఒక అలక్ష్మి ప్రతిమను పెట్టి, దాని ముక్కు చెవులూ కోసి విరూపం చేసి వేడుక చేస్తారు. తరువాత ఆ స్థానంలో లక్ష్మి ప్రతిమను ప్రతిష్టించి పూజ చేస్తారు, రాగల సంవత్సరాలలో అదృష్టం ఐశ్వర్యం కలగాలని. ఈ క్రతువుకూ శూర్పణఖ ఉదంతానికీ వున్న పోలిక కొట్టవచ్చినట్టు వుంటుంది.
కొన్ని ఎంపిక చేసిన కథనాలలోని ఈ శూర్పణఖ ఉదంతం యొక్క విశ్లేషణ, వ్యాఖ్యానాలు, మొత్తం రామాయణం యొక్క గమనాత్మక శక్తుల లోకి చూసినట్లే వుంటుంది. శూర్పణఖ విరూపణ రామ కథకు అనేక దృక్కోణాలనుంచి ప్రాముఖ్యం కలది. కథనం దృష్ట్యా చూస్తే అది అనేక కీలక సంఘటనలకు ఉత్ప్రేరకంగా వుంటుంది. శూర్పణఖ తనకు జరిగిన అవమానం గురించి చెప్పాకనే రావణుడు సీతను అపహరించాలని నిశ్చయించుకుంటాడు. నైతిక కోణంలో నుంచి చూసినట్లయితే అందరికీ అనుసరణీయుడైన రాముని ప్రవర్తన గురించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. వాటిని పరిష్కరించడానికి, విశ్లేషించడానికి అనేకమంది అనేక విధాలుగా ప్రయత్నించారు. సాంస్కృతిక కోణంలోనుంచి చూసినట్లయితే, స్త్రీల లైంగికత పట్ల హిందూ వైఖరి, మంచి-చెడు, పవిత్రత-అపవిత్రత, శుభము-అశుభము, అనే ద్వంద్వాల మధ్య వుండే సంబంధం అర్థమౌతుంది. అయితే శూర్పణఖ గురించి తుది పలుకు వెలువడలేదు. ఆమె కథ ముందు తరాల శ్రోతలను, పాఠకులను, వ్యాఖ్యాతలను ఉత్తేజపరుస్తూనే వుంటుంది.
-----------------------------------------------------------
రచన: పి. సత్యవతి
మూలం: కేథలీన్ ఎర్న్‌డల్,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment