Sunday, January 20, 2019

నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు


నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు




సాహితీమీత్రులారా!

1. ఉపక్రమణిక
నన్నెచోడుని కుమారసంభవ కావ్యాన్ని తొలిసారి ప్రకటించిన మానవల్లి రామకృష్ణకవిగారు 1909 నాటి ప్రథమభాగం పీఠికలో ఈ విధంగా వ్రాశారు:

“ఇతఁడు కలావిలాస మను మఱియొక్క కావ్యమును గూడరచించెను. అది నాకు లభింపకున్నను దానిలోని పద్యములు కవిసంజీవని, రత్నాకరము, అథర్వణచ్ఛందము, గణపవరపు వేంకటకవి లక్షణశిరోమణిలో నుదాహరింపఁబడినవి. ఆపద్యములలోఁ గొన్నింటి నిందుదాహరించినయెడల సుముఖులెవ్వరైనఁ దద్గ్రంథమును వెదకి దానిననర్హమగు మరణమువలనఁ దప్పింతురను నాస గలుగుచున్నది.

సీ. పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరు
      కాంచనాచల కార్ముకమునకు సాటిగాఁ జేపట్టె నెవ్వాఁడు చెఱకువిల్లు
      నవిరళ పాశుపతాస్త్రమునకు వాఁడి మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు
      నతులితామర దానవాదిబలంబుల గెలిపించె నెవ్వఁడయ్యళిబలంబు

తే. నట్టి జగజెట్టి మన్మథుం డఖిలలోక
      ములకు వెఱగొంగ జీవుల మూలకండ
      యతనియిలుఁ జొచ్చి వెడలనియతఁడు గలఁడె
      యతనియమ్ములఁ బడకున్నయదియుఁ గలదె.

క. తలపోయఁగ రుచులాఱును
      గలుగును వాతంబుఁ గ్రిమియుఁ గఫముంజెడు నా
      కలివుట్టు దగయుఁ జెడుఁ ద
      మ్ములము పదార్థంబు రాగమూలము ధరణిన్.

చ. తొడవులు వెట్టు సంభ్రమముతోఁ దిలకించు మడుంగుగట్టు పైఁ
      బడఁ దడవోప దింపెఱిఁగి పట్టుదు నేర్పులు గట్టిపెట్టుఁ బ
      ల్కెడునెడఁ దొట్రుపాటొదవుఁ గింకకు చేగిలుమన్ సమర్పఁగాఁ (?)
      జిడుముడిఁ బొందుఁగాంత పతిచేరిన గూరిమిగల్గెనేనియున్.

చ. లలనలు కొందఱాత్మపతులం దగఁగూడినచెయ్వులన్నియుం
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పకచెప్పెడు వారు పుణ్యజీ
      వులు చెలి యామినీశుని కవుంగిలి డాయుటె కాక తాల్మికీ
      ల్దొలఁగిన తీరుగీరు నటదోపవు నాకు రతిప్రయోగముల్.

క్షేమేంద్రుఁడను నొకానొక కశ్మీరమహాకవి కలావిలాసమని సంస్కృతమున నొకగ్రంథము వ్రాసియున్నాఁడు. తెనుఁగుబద్యముల నన్నియుఁ గూర్చి పోల్చిచూడఁగా నద్దాని కిది తెనుఁగుగాదనియు నిందుఁ గథా భాగముకూడఁ గలదనియు సంస్కృతమున దానిలోఁ గథాంశములు లేకుండుటయుఁ జూడఁగా రెంటికిని నామమాత్రసాదృశ్యము గలదని తేలినది.” — (మానవల్లికవి రచనలు: పుటలు. 1,2)

మానవల్లి వారు సుప్రమాతంగా నిర్ధారించిన ఈ అంశాన్ని పురస్కరించికొని చరిత్రకారులు, విమర్శకులు నన్నెచోడుని రచనమైన కళావిలాసము అన్న ఆంధ్రకృతి — క్రీస్తుశకం 1029-1064ల నడుమ కాశ్మీరదేశాన్ని పరిపాలించిన అనంత నరేంద్రుని ఆస్థానకవి, మహాలాక్షణికుడు అయిన క్షేమేంద్రుని కలావిలాస కావ్యానికి అనువాదం కాదని, నామసాదృశ్యం తప్పించి దానితో ఎటువంటి సంబంధమూ లేని స్వతంత్రకావ్యమని నిశ్చయించారు. నన్నెచోడుని కాలం, కుమారసంభవ కర్తృత్వం తెలుగు సాహిత్యచరిత్రలో వివాదాస్పదం అయిన తర్వాత కూడా మానవల్లి వారి ఈ నిర్ధారణ విషయం క్షోదక్షమంగా మళ్ళీ పరీక్షకు గురికాలేదు.

ఈ వ్యాసంలో తెలుగు కళావిలాసమును గురించిన కొన్ని చర్చనీయాంశాలు చర్చింపబడుతున్నాయి. క్షేమేంద్రుని కలావిలాసానికి తెలుగు కళావిలాసము నిజంగా అనువాదం అవునా? కాదా? అన్నది ప్రధాన సమస్య. పై ఉదాహరణలో మానవల్లి వారు ఏయే గ్రంథాలలో ఈ కళావిలాసములోని పద్యాలు ఉదాహరింపబడి ఉన్నాయని సూచించారో – ఆ గ్రంథాల పూర్వాపరచరిత్ర తెలిస్తే కాని ఈ సమస్య స్వరూపం, అందుకు పరిష్కారం అర్థం కావు. అందువల్ల ఆ వివరణ కొంత అవసరమవుతున్నది. ఆ తర్వాత పెదపాటి జగన్నాథకవి, గణపవరపు వేంకటకవి కళావిలాసము నుంచి ఉదాహరించిన పద్యాలను సమీకరించి, వాటి స్థితగతిచింతన చేయాలి. క్షేమేంద్రుని కలావిలాసంలోని కథాంశాన్ని, కవితాంశాన్ని పరిశీలిస్తే, తెలుగు కవులపై ఆ కృతి ప్రభావం, నన్నెచోడుడు దానిని తెలుగు చేయటంలోని ఔచిత్యం స్పష్టపడతాయి. కళావిలాసము నుంచి లభిస్తున్న ఒక్కొక్క పద్యాన్ని జాగ్రత్తగా అనుశీలిస్తే నన్నెచోడుని ఆంధ్రీకరణవిశేషాలు, కావ్యానువాదం జరిగిన కాలాన్ని నిర్ణయించటానికి మరికొన్ని ఆధారాలు దొరుకుతాయి. కళావిలాసము కర్త నన్నెచోడుడు గాక బద్దె భూపాలుడని, ఆ బద్దె భూపాలుడికి నన్నిచోడుడు అనే బిరుదున్నదని, అసలు కళావిలాసము కావ్యమే కాదని, అదొక కామశాస్త్రమని పరిపరివిధాల విమర్శకులు ఊహించిన విషయాల తథ్యమిథ్యావివేచన అవసరం. గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఉదాహరించిన పద్యాలు కూటసృష్టిపద్యాలని ఉన్న విమర్శకూడా ఆలోచింపదగినదే. ఈ చర్చాఫలితంగా – ప్రబంధరత్నాకరములో ఉదాహృతుడైన నన్నెచోడుడు, ప్రయోగరత్నాకరములో ఉదాహృతుడైన నన్నెచోడుడు ఒకరేనా? ఇద్దరు వేర్వేరు వ్యక్తులా? అన్న ప్రశ్న ఏర్పడుతుంది. వస్తుతత్త్వావధారణతో వీటికి సమాధానాలను ప్రతిపాదించటం ఈ వ్యాసరచనోద్దేశం.

ఇంతకీ సంస్కృత కలావిలాసం కథాకావ్యం అవునా? కాదా? అంటే, క్షేమేంద్రుడే స్వయంగా అన్న మాటలివి –

కేలీమయః స్మితవిలాసకలాభిరామః
సర్వాశ్రయాన్తర కలా ప్రకటప్రదీపః
లోకోపదేశవిషయః సుకథావిచిత్రో
భూయాత్ సతాం దయితఏష కలావిలాసః.(10-42)

(నానావిధాల మనోజ్ఞకేళీకలాపాలను ఏకరువుపెట్టేది, విలాసజీవనులు ఏ విధంగా సౌఖ్యానుభవాన్ని పొందుతున్నారో వివరించేది, ఎల్లవారు ఆశ్రయింపదగిన రసిక కళలను వెలుగులోకి తెచ్చేది, లోకానికి విధినిషేధపూర్వకంగా మంచిచెడ్డలను బోధించేది, యోగ్యులు వ్యవహరింపవలసిన తీరుతెన్నులను నేర్పే ఆసక్తికరమైన కథలతో వింతగొలిపేది అయిన ఈ సర్వకళావిలాసకథనం సజ్జనులకు ప్రీతిని కూర్చే మంచి స్నేహితుని వంటిది అగుగాక!)

క్షేమేంద్రుడు ఇంత స్పష్టంగా తన కావ్యంలో కథాంశ గుఱించి అనుఘటించినా, రామకృష్ణకవిగారు తెలుగు కళావిలాసములో మాత్రమే కథాభాగం ఉన్నదని — ‘…సంస్కృతమున దానిలోఁ గథాంశములు లేకుండుటయు…’ అని వ్రాయటానికి కారణం ఏమిటో తెలియదు. కవిగారి ఈ నిర్దేశాన్ని విమర్శకులు, వాఙ్మయచరిత్రాసక్తులు ప్రామాణ్యభావంతో ఔదలదాల్చటమే గాని, తామై స్వయంగా పరిశోధించినట్లు కనబడదు. చాగంటి శేషయ్య, 1946 నాటి ఆంధ్రకవితరంగిణి మొదటి సంపుటం (పు.173)లో — ‘క్షేమేంద్రుఁడు కళావిలాస మను పది సర్గల కావ్యమును సంస్కృతమున రచించియున్నాఁడు. కాని యిది యా గ్రంథమున కాంధ్రీకరణమైనట్లు గన్పట్టదు. క్షేమేంద్రుఁడు క్రీ.శ. 1020 – 60 కాలమువాఁడు.’ అని వ్రాశారు. ఆ తరువాతి చరిత్రకారులు, విమర్శకులు ఇంతకంటె ఈ విషయాన్ని అధికరించి తథ్యమిథ్యావివేచన చేయలేదు. ఆచార్య రవ్వా శ్రీహరిగారు అలబ్ధకావ్యపద్యముక్తావళి (పు.49)లో — ‘క్షేమేంద్రుడు సంస్కృతంలో రచించిన కళావిలాసమనే గ్రంథం ఒకటి ఉన్నది. కాని అందులో కథాంశమేమీ కానరాదు. నన్నెచోడుని కళావిలాసంలో మాత్రం కథాభాగం కనిపిస్తుంది. అందువల్ల నన్నెచోడుని గ్రంథం క్షేమేంద్రుని గ్రంథానికి అనువాదం కాదని చెప్పవచ్చు,’ అని వ్రాశారు. ఈ గతానుగతికోక్తుల నైపథ్యం వల్ల ఈ వ్యాసరచన ఆవశ్యకమైంది.

2. నన్నెచోడుని కాలనిర్ణయం: కళావిలాస కర్తృత్వం
కుమారసంభవము పీఠికలో మానవల్లి వారు నన్నెచోడుని కాలనిర్ణయానికి రూపొందించిన మార్గాలను వారి తర్వాతి పరిశోధకులు నిర్విచికిత్సంగా అనుసరించటం వల్ల ఈ సమస్య విషయమై ఎంతో అవ్యవస్థ, సందిగ్ధత ఏర్పడ్డాయి. చరిత్రకాథికులు నన్నయాథర్వణులిద్దరూ సమసామయికులని భావించిన రోజులవి. 1895లో కవిగారే, ‘ఆంధ్రభాషను గూర్చిన యుపన్యాసము’ అన్న వ్యాసంలో –

“నన్నయభట్టు మహాభారతముఁ దెనిఁగింపఁ బ్రారంభించినప్పుడే యథర్వణాచార్యులును దెనింగింపఁ దొడంగియుండును. వాగనుశాసనుఁ డారణ్యపర్వమున విడువఁగా నథర్వణాచార్యుఁడు కర్ణపర్వమున వదలెను. కాలముసెల్లఁగాఁ దిక్కనసోమయాజి దానును భారతము మొదటినుండి వ్రాయుటకంటె వీరిద్దరి పొత్తములలో నేదానినైన పూర్తిచేయుటయ భావ్యమని యూహించి రేఫఱకారసంకరమును లక్షణదోషములును లేని నన్నయ భట్టారకుని భారతమే పరిసమాప్తి నొందించుటకుఁ దలఁచెనని తోఁచుచున్నది.” -(మానవల్లికవి రచనలు: పు.456)

అని ఆనాటి తమ ఊహను ప్రకటించారు. నన్నయకు సమకాలికుడైన అథర్వణుడు రచించిన ఛందస్సులో కళావిలాసములోని పద్యాలున్నాయన్న ప్రతిపాదన వల్ల నన్నెచోడుడు క్రీస్తుశకం 11వ శతాబ్ది కంటె మునుపటివాడని సాధించటం జరుగుతుంది. కాని, సంస్కృతమహాకవులలో అగ్రేసరభాసమానుడైన క్షేమేంద్రుని కలావిలాసం ఆంధ్ర కళావిలాసానికి మూలమే గనుక అయితే, క్రీ.శ. 1029 – 64ల మధ్య కాశ్మీరాన్ని పరిపాలించిన అనంత నరేంద్రుని ఆస్థానంలో ఉన్న ఆ మహాకవికంటె నన్నెచోడుడు కనీసం ఒక శతాబ్ది తర్వాతివాడు కాకతప్పదు. ఈ వైషమ్యాన్ని గుర్తెరిగినందువల్లనే రామకృష్ణకవిగారు రెండు కావ్యాలను సరిపోల్చి, వాటికి వస్తుసామ్యం లేదని నిర్ధారించుకోవలసి వచ్చింది. నన్నెచోడుడు నిజంగా క్షేమేంద్రానువాదకుడే అయితే, ఆయన నన్నయ్యగారికి పూర్వతరుడన్న నిర్ణయానికి ఆ రోజుల్లోనే మూలచ్ఛేదం కలిగేది.

మహాకవిరచితమైన కావ్యంలో సమాధాయకమైన సౌందర్యాన్ని మనఃస్ఫూర్తిగా ఆస్వాదించి అనుభవింపవలసినదే కాని ఈ కాలనిర్ణయాలు, ఈ కర్తృత్వనిర్ణయాల భౌతికాంశవివేచన నిర్నిమిత్తకాలక్షేపమని కొందరంటారు. అది నిర్నిమిత్తం కాదు. ముముక్షువులు గృహస్థాశ్రమంలో ఉంటూ కేవలానుభవానందనీయమైన బ్రహ్మపదంకోసం అన్వేషించినట్లే, సాహిత్యికులు భౌతికం నుంచి ఆధిభౌతికానికి, అక్కడినుంచి ఆధిదైవికానికి, ఆ తర్వాత ఆధ్యాత్మికానికి ప్రయాణించేందుకు ఆద్యసాధనం ఇది. ఈ చరిత్రావగాహనతోడి పద్యానుశీలనం కవిత్వానుభవాన్ని మరింత పరిపూర్ణం చేస్తుంది. ఎరుక సమగ్రం అవుతుంది.

ప్రస్తావవిషయం పరిధి పెద్దదైనందున పఠనసౌలభ్యం కోసం కొంత సమాచారం ఉపాంగాలుగా ప్రకటించబడింది. ఆ వివరాలివి:

అనుబంధము – 1: కళావిలాసము లోని పద్యాలు: మానవల్లి వారి ప్రాకరనిరూపణం
అనుబంధము – 2: కళావిలాసము కావ్యకర్త నన్నెచోడుడు: బద్దె భూపాలుడు
అనుబంధము – 3: సంస్కృతంలో కలావిలాసము అనే కామశాస్త్రగ్రంథం ఉన్నదా?
అనుబంధము – 4: సంస్కృత కలావిలాసము: ఆంధ్రకవులపై క్షేమేంద్రుని ప్రభావం
తెలుగు కళావిలాసము భౌతికస్వరూపావస్థను నిర్ణయించి, అది క్షేమేంద్రుని ప్రసిద్ధకావ్యానికి అనువాదమే అన్న నిశ్చయానికి వచ్చిన తర్వాత దాని కాలనిర్ణయం చేయబూనటం మేలు. అందుకు ఈ పరిశీలన దోహదం కాగలదన్న ఆకాంక్షతో ఈ విషయజాతం ప్రతిపాదింపబడుతున్నది.
3. కళావిలాసము నుంచి ఇప్పటి వరకు లభించిన పద్యాలు
గణపవరపు వేంకటకవి తన ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఉదాహరించిన పద్యాలివి:

వ. ఇందుకే (అంటే, థ-ధల వర్గ ప్రాసకు) నన్నెచోడ కళావిలాసం –

క. పాథోనిధిగాంభీర్యున్
      రాధాకాముకపదాబ్జరాజత్సేవా
      మేధాధుర్యతపోరా
      గాధేయుని మునివతంసగాధేయు వనిన్.

(తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీమహల్ గ్రంథాలయంలో D. 695 సంఖ్య గల తాళపత్ర ప్రతి: (18-b) పద్దెనిమిదవ ఆకు వెనుక వైపున)

వ. ఇందుకే (అంటే, అర్ధబిందు ప్రాసకు) నన్నెచోడ కళావిలాసం –

క. నగజాత నారదు నుడి వి
      నఁగలే కాగ్రహముఁ జెందినఁ గని హరుఁడు లే
      నగవు సెలవి నిగుడఁగఁ ది
      న్నగఁ బలికెన్ సతికి మునికి నాయము దోఁపన్.

(అదే ప్రతి: (24-b) ఇరవైనాలుగవ ఆకు వెనుకవైపున)

పెదపాటి జగన్నాథకవి సంధానించిన ప్రబంధరత్నాకరములో కళావిలాసము నుంచి ఉదాహరించిన పద్యాలివి.

1) (మదనస్తుతి –) కళావిలాసము

సీ. పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరుఁ
      గాంచనాచలకార్ముకమునకు సాటిగాఁ జేపట్టె నెవ్వండు చెఱకువిల్లు
      నవిహతపాశుపతాస్త్రమ్మునకు వాఁడి మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు
      నతులితామరదానవాది(?)బలంబుల గెలిపించె నెవ్వఁ డ య్యళి(?)బలంబు(?)

తే. నట్టి జగజెట్టి మన్మథుం డఖిలలోక
      ములకు వెఱగొంగ, జీవుల మూలకంద
      మతని యిలుసొచ్చి వెడలనియతఁడు గలఁడె?
      యతని యమ్ములఁ బడకున్న యతఁడు గలఁడె.

(తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీమహల్ గ్రంథాలయంలో D.189 సంఖ్య కలిగిన తాళపత్రప్రతి: (108/b) నూటఎనిమిదవ ఆకు వెనుకవైపున)

2) (తాంబూలానకు –) కళావిలాసము

క. తలపోయఁగ రుచు లాఱును
      గలుగును; వాతంబుఁ గ్రిమియుఁ గఫముం జెడు; నాఁ
      కలివుట్టు; దగయుఁ జెడుఁ ద
      మ్ములము పదార్థంబు రాగమూలము ధరణిన్. (142/b)

3) (విటలక్షణము –) కళావిలాసము

క. శ్రీమంతుఁడు గుణవంతుఁడు
      ధీమంతుఁడు రూపయుతుఁడు ధీరుండుఁ గళా
      ధాముండును గావలయును
      దా మహిఁ గాముండు కామతంత్రవివేకీ. (142/b)

4) (భద్ర దత్త కూచిమార పాంచాలులు -) కళావిలాసము

చ. … … … … … … …
      … … … … … … …
      … … … ..ట్టి యతం డరుదేరఁ గాంచియుం
      దడవకయుండ నెప్పటి విధంబని కౌఁగిటఁ జేర్ప నంతటన్. (144/b)

చ. తొడవులు వెట్టు, సంభ్రమముతోఁ దిలకించు, మడుంగు గట్టు, పైఁ
      బడఁ దడవోప, దిం పెఱిఁగి పట్టుడు నేర్పులు గట్టిపెట్టుఁ, బ
      ల్కెడునెడఁ దొట్రుపా టొదవుఁ, గింకకు జేగుఱు మై జెమర్పఁగాఁ
      జిడిముడిఁ బొందుఁ గాంత పతి చేరినఁ గూరిమి గల్గెనేనియున్. (145a/b)

5) (భద్ర దత్త కూచిమార పాంచాలులు -)

చ. లలనలు గొందఱాత్మవరులం దమకూడిన చెయ్వులన్నియున్
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పక చెప్పెడువారు పుణ్యజీ
      వులు చెలియా మదీశుని కవుంగిలి డాయుడు నాకు వల్పురే
      ల్దొలఁగు టెఱుంగఁబోలు నటఁ దోఁపవు మీఁద రతిప్రయోగముల్. (145b)

ప్రబంధరత్నాకరములో కళావిలాసము నుంచి ఐదారు పద్యాలను స్వీకరించినా, జగన్నాథకవి నన్నెచోడుని కళావిలాసము అని శీర్షికాకృతంగా కవి పేరును జోడించి చెప్పలేదు. అయితే గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరములో నన్నెచోడ కళావిలాసం అని ఉన్నందువల్ల ఆ రెండూ భిన్నకావ్యాలు కావని; ప్రబంధరత్నాకరములోని కళావిలాసము, ఆంధ్ర ప్రయోగరత్నాకరములోని కళావిలాసము ఏకకర్తృకాలని రామకృష్ణకవిగారు భావించి, కుమారసంభవము పీఠికలో ఉదాహరించటం జరిగిందన్నమాట.

1918లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ప్రబంధరత్నావళిని రూపొందించినప్పుడు అందులో నన్నిచోడుని కళావిలాసము లోనివిగా 1) తలపోయఁగ రుచు లాఱును, 2) తొడవులు పెట్టి సంభ్రమముతో, 3) పృథుల విశ్వంభరారథమున కెదురుగా, 4) శ్రీమంతుఁడు గుణవంతుఁడు, అన్న నాలుగింటిని మాత్రమే స్వీకరించారు. రామకృష్ణకవిగారు చూపిన ‘లలనలు కొందఱాత్మపతులన్’ అన్న పద్యాన్ని గ్రహింపలేదు.

జగన్నాథకవి ఉదాహరించిన కళావిలాసము లోనిదిగా ఉదాహరించిన ‘శ్రీమంతుఁడు గుణవంతుఁడు’ అన్న పద్యాన్ని రామకృష్ణకవిగారు ఎందుకో గ్రహింపలేదు. గణపవరపు వేంకటకవి సర్వలక్షణశిరోమణిలో కళావిలాసమును ఉదాహరించాడని చెప్పినప్పటికీ, అందులోని ఆ పద్యాలను ఆయన ఉదాహరింపలేదు.

పైని రామకృష్ణకవిగారు ఉదాహరించిన ‘లలనలు గొందఱాత్మవరులం దమకూడిన’ అన్న పద్యం జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో ఉన్నది కాని, అక్కడి శీర్షికలో కళావిలాసము అన్న కృతినిర్దేశిక లేదు. దానికి పైనున్న ‘తొడవులు వెట్టు, సంభ్రమముతోఁ దిలకించు అన్న పద్యానికి మాత్రమే కళావిలాసము అన్న నిర్దేశం ఉన్నది. దానికి తర్వాత ఏ నిర్దేశమూ లేకుండా ఉన్న ‘లలనలు…’ అన్న పద్యాన్ని ఆయన కళావిలాసము లోనిదిగా ఉదాహరించారు.

రామకృష్ణకవిగారు చూపిన పాఠం ఇది:

చ.లలనలు కొందఱాత్మపతులం దగఁగూడినచెయ్వులన్నియుం
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పకచెప్పెడు వారు పుణ్యజీ
      వులు చెలి యామినీశుని కవుంగిలి డాయుటె కాక తాల్మికీ
      ల్దొలఁగిన తీరుగీరు నటదోపవు నాకు రతిప్రయోగముల్.

ప్రబంధరత్నాకరము వ్రాతప్రతిలో ఉన్న ఆ పద్యపాఠం ఇది:

చ. లలనలు గొందఱాత్మవరులం దమకూడిన చెయ్వులన్నియున్
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పక చెప్పెడువారు పుణ్యజీ
      వులు చెలియా మదీశుని కవుంగిలి డాయుడు నాకు వల్పురే
      ల్దొలఁగు టెఱుంగఁబోలు నటఁ దోఁపవు మీఁద రతిప్రయోగముల్.

చిత్రమేమంటే, ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి గ్రంథాలయంలో D. 705 (M. 326) సంఖ్యతో ఛందోగ్రంథము అన్న పేరిట ఉన్న వ్రాతప్రతిలో ఇది కళావిలాసము లోనిదిగా కాక, భాస్కర ప్రెగ్గడ రచించిన రసాలంకారము లోనిదిగా ఉదాహరింపబడింది. అక్కడి పాఠం ఇది:

చ. లలనలు గొందఱాత్మవరులం దమకూడిన చెయ్వులన్నియున్
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పక చెప్పెడువారు పుణ్యజీ
      వులు చెలి యామినీశుని కవుంగిలి డాయుడు నాకు వల్పురే
      ల్దొలఁగు టెఱుంగఁబోలు నటఁ దోఁపవు మీఁద రతిప్రయోగముల్.

1989లో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ప్రకటించిన ప్రబంధరత్నాకరము ప్రత్యంతరంలో ఇదే పద్యం భాస్కరుని శృంగార రత్నాకరము లోనిదిగా ఉదాహృతమై ఉన్నది. అక్కడి పాఠం ఇది:

చ. లలనలు గొంద ఱాత్మవరులన్ దమకూడిన చెయ్వు లన్నియున్
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పక చెప్పెడువారు పుణ్యజీ
      వులు చెలియా మదీశుని కవుంగిలి డాయుడు నాకు వల్పురే
      ల్దొలఁగు టెఱుంగఁబోలు నటఁ దోఁపవు మీఁద రతిప్రయోగముల్.

పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో కళావిలాసము లోనిదిగా ఉదాహరించిన

క. శ్రీమంతుఁడు గుణవంతుఁడు
      ధీమంతుఁడు రూపయుతుఁడు ధీరుండుఁ గళా
      ధాముండును గావలయును
      దా మహిఁ గాముండు కామతంత్రవివేకీ.

అన్న పద్యమే శ్రీరామమూర్తి గారు ప్రకటించిన ప్రబంధరత్నాకరము ప్రత్యంతరంలో ఈ విధంగా ఉన్నది:

క. శ్రీమంతుఁడు గుణవంతుఁడు
      ధీమంతుఁడు రూపయుతుఁడు ధీరుండుఁ గళా
      ధాముండును గావలయును
      దా మహిఁ గాముకుఁడు కామతంత్రవివేకీ. (పద్యసంఖ్య. 1)

ఇదిగాక శ్రీరామమూర్తిగారి ప్రత్యంతరంలో — విటలక్షణము – కళావిలాసము అన్న శీర్షికతో మరి మూడు పద్యాలు; విటశృంగారము అన్న శీర్షికతో రెండు పద్యాలు; కుటిలవేశ్య లక్షణము అన్న శీర్షికతో ఒక పద్యం; వేశ్యమాత అన్న శీర్షికతో ఒక పద్యం; భద్ర దత్త కూచిమార పాంచాలురు అన్న శీర్షికతో ఒక పద్యం; చిత్తిని, హస్తిని, శంఖిని, పద్మిని అన్న శీర్షికలతో ఒక్కొక్కటి వంతున మొత్తం నాలుగు పద్యాలు; బాలకు, యౌవనకు, ప్రౌఢకు, అన్న శీర్షికలతో రెండేసి వంతున మొత్తం ఆరు పద్యాలు; లోలకు అన్న శీర్షిక క్రింద ఒక పద్యం కళావిలాసము నుంచి ఉన్నాయి. ఇవి మొత్తం ఇరవై పద్యాలు. చివరిగా కూర్మి అన్న శీర్షికతో ఇందాక ఉదాహరించిన, తొడవులు వెట్టు, సంభ్రమముతోఁ దిలకించు — అన్న పద్యం ప్రత్యంతరంలో ఈ క్రింది రూపంలో ఉన్నది:

చ. తొడవులు పెట్టి సంభ్రమముతోఁ దిలకించు, మడుంగు గట్టుఁ బైఁ
      బడఁ దడ వోర్చుఁ దెం పెఱిఁగి పట్టదు నేర్పులు గట్టిపెట్టుఁ బ
      ల్కెడునెడఁ దొట్రుపా టొదవుఁ, గింకకు బెగ్గిల మై చెమర్పఁగాఁ
      జిడుముడిఁ బొందుఁ గాంత పతిఁ చేరిన కూరిమి గల్గెనేనియున్.

ఈ ప్రకారం లెక్కవేస్తే — గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరములో నన్నెచోడ కళావిలాసము నుంచి ఉదాహరించినవి రెండు, పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో కళావిలాసము అన్న శీర్షికతో ఉదాహరించినవి నాలుగు, ప్రబంధరత్నాకరములోనే రామకృష్ణకవిగారు కళావిలాసము లోనిదిగా ఊహించినదొకటి, ప్రబంధరత్నాకరము ప్రత్యంతరము లోనివి పందొమ్మిది –- మొత్తం కళావిలాసము నుంచి మనకు లభించినవి ఇరవైఆరు పద్యాలన్నమాట.

4. నన్నెచోడుని ఆంధ్రీకరణ వైదగ్ధి
కళావిలాసము లోనిదిగా పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో –

క. శ్రీమంతుఁడు గుణవంతుఁడు,
      ధీమంతుఁడు రూపయుతుఁడు ధీరుండుఁ గళా,
      ధాముండును గావలయును,
      దా మహిఁ గాముండు కామతంత్రవివేకీ

అని; శ్రీరామమూర్తిగారి ప్రత్యంతరంలో –

క. శ్రీమంతుఁడు గుణవంతుఁడు,
      ధీమంతుఁడు రూపయుతుఁడు ధీరుండుఁ గళా,
      ధాముండును గావలయును,
      దా మహిఁ గాముకుఁడు కామతంత్రవివేకీ

అని ఉన్న పద్యానికి మూలం క్షేమేంద్రకృతిలోని లోభవర్ణనసర్గంలో కనబడుతుంది. కుబేరుడు తాను అడిగిన ధనాన్ని ఇవ్వలేదని ఆగ్రహించిన శుక్రాచార్యుడు మాయాప్రభావంతో అతని సర్వస్వాన్నీ హరిస్తాడు. ధూర్తుడైన శుక్రుడు మోసం చేశాడు. ఇల్లు గుల్లయింది. నేనిప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? ఎక్కడికని తిరిగేది? ఏమి చేసేది? అని కుబేరుడు వాపోతాడు:

ధనరహితం త్యజతి జనో జనరహితం పరిభవాః సమాయాన్తి
పరిభూతస్య శరీరే వ్యసనవికారో మహాభారః.

(డబ్బులేనివాణ్ణి జనం వద్దువద్దని విడిచిపెడతారు. జనం తోడులేనివాడికి అవమానాలు వచ్చిపడతాయి. అవమానం పాలైనవాడికి దుఃఖభారం భరింపలేనిదవుతుంది.)

దయితేషు శరీరవతాం బత ధర్మలతాలవాలేషు
ద్రవిణేషు జీవితేషు చ సర్వం యాతి ప్రయాతేషు.

(శరీరధారులకు ధర్మమే మోక్షమూలం. ఆ ధర్మము అనే తీగెకు ఆలవాలమైనది డబ్బు. ఆ డబ్బును పోగొట్టుకొన్నాక జీవితంలో అన్నీ ఉన్నా ఏదీ లేనట్లే.)

విద్వాన్ సుభగో మానీ విశ్రుతకర్మా కులోన్నతః శూరః
విత్తేన భవతి సర్వో విత్తవిహీనస్తు సద్గుణోప్యగుణః. (2: 54-7)

(తెలివి కలవాడు, అందరికీ ఇష్టమైనవాడు, అభిమానవంతుడు, మంచి పనుల వల్ల పేరొందినవాడు, ఉత్తమకులంలో పుట్టినవాడు, గొప్ప పరాక్రమం కలవాడు – డబ్బున్నట్లయితే ఇవన్నీ అవుతాడు. డబ్బులేకపోతే ఎన్ని మంచి గుణాలున్నా ఏమీ లేనివాడే.)

ఈ శ్లోకభావాలను మూడవదైన కామవర్ణనసర్గం లోనికి తీసికొని వెళ్ళి కామతంత్రంలో యుక్తాయుక్తాలు తెలిసిన వివేకవంతులు ఏ విధంగా వ్యవహరించాలో మూలదేవుడు శిష్యునికి బోధించిన సందర్భంలో కవి పరికరింపజేసికొన్నట్లు కనబడుతుంది. విత్తవాన్ = శ్రీమంతుడు, సద్గుణః = గుణవంతుడు, విద్వాన్ = ధీమంతుడు, సుభగః = రూపయుతుడు, శూరః = ధీరుడు మొదలైన శబ్దానువాదాలు అందుకు అనురూపంగానే ఉన్నాయి. ‘కాముండు’ (మన్మథుడు) అన్న పాఠానికంటె ‘కాముకుఁడు’ అన్న పాఠం మేలు. అయితే, కాముకుడైనవాడు శ్రీమంతుడు, గుణవంతుడు, ధీశాలి, రూపసి, ధైర్యవంతుడు, కళాకోవిదుడు కావాలని వక్త ఎవరో ‘కామతంత్రవివేకి’ అయిన శ్రోతకు చెప్పటం సముచితంగా లేదు. ఇవన్నీ ఉండటం వల్ల కాముకుడు సాఫల్యాన్ని పొందగలడన్న భావమూ అర్థవంతం కాదు. శ్రీమంతుడు కాని గుణవంతుడు, రూపవంతుడు కాని ధీరుడు కాముకులైతే సంభవించే సాధ్యాసాధ్యపరిణామాలను వక్త ఊహించలేదని తెలుస్తూనే ఉన్నది. ఇది ప్రబోధలక్షణం కాదు. ఇంతకంటె, మూలానుసారం –

క. శ్రీమంతుఁడు గుణవంతుఁడు,
      ధీమంతుఁడు, రూపయుతుఁడు, ధీరుండుఁ, గళా
      ధాముండును గా వెలయును
      దా మహిఁ గాముకుఁడు కామతంత్రవివేకీ

అని చదువుకొంటే – శ్రీమంతుడైనవాడికి తక్కిన ఆ గుణాలన్నీ స్వయంగానే సమకూడుతాయన్న అర్థం వస్తుంది. ‘కాన్ వెలయును’ అంటే గుణవంతుడు కాకపోయినా గుణవంతుని గానూ, ధీశాలి కాకపోయినా ధీశాలి గానూ భాసిల్లగలడని ఉద్దేశం. మూలంలో రెండవ సర్గంలో కుబేరుడు శంఖాది నిధులతో ఈ మాటలన్నట్లుగా ఉన్నది. కామలోభాదియుక్తుడు శ్రీమంతుడైతే చాలు; అన్నీ ఉన్నట్లే. శ్రీ లేకపోతే ఏమీ లేనట్లే – అని కుబేరుని దుఃఖాలాపంగా కవి ఈ ప్రసంగాన్ని మలిచి ఉంటాడు. మూడవదైన కామవర్ణన సర్గంలోనూ కవి దీనిని సందర్భోచితంగా ప్రవేశపెట్టి ఉండవచ్చును. అందువల్ల ఇది కళావిలాసములోని పద్యమే అని మనము నిశ్చయింపవచ్చును.

(కళావిలాసములో ఈ పద్యాన్ని జక్కన చూశాడో, లేక జక్కన రచననే మన కవి చూశాడో కాని, సర్వశః దీనికి పర్యాయకృతమైన పద్యం ఒకటి జక్కన విక్రమార్కచరిత్రములో ఉన్నది:

క. శ్రీమంతుఁడు కులవంతుఁడు
      శ్రీమంతుఁడె సుభగరూపజితకంతుఁడు సూ
      శ్రీమంతుఁడె గుణవంతుఁడు
       శ్రీమంతుఁడె సిద్ధశేముషీమంతుండున్. (2-175)

నిజానికి జక్కన పద్యం క్షేమేంద్రుని శ్లోకానికి అచ్చపు అనువాదంలా అమరింది. తెలుగులో ఎవరి రచన ఎవరికి ఆధారమో అన్నట్లుగా రెండు పద్యాలూ ఉన్నాయి.)

ఇక, రామకృష్ణకవిగారు ప్రబంధరత్నాకరములోనుంచి కళావిలాసములోనిదిగా ఉదాహరించిన పద్యం విషయం మరింత ఆసక్తిదాయకం.

క. తలపోయఁగ రుచు లాఱును
      గలుగును; వాతంబుఁ గ్రిమియుఁ గఫముం జెడు; నాఁ
      కలివుట్టు; దగయుఁ జెడుఁ ద
      మ్ములము పదార్థంబు రాగమూలము ధరణిన్

కలావిలాసం మూడవ సర్గంలో సముద్రదత్తుడనే వ్యాపారి పరపురుషాసక్త అయిన భార్య వసుమతి వల్ల మోసపోయిన కథ ఉన్నది. భర్త నిద్రించే దాకా వేచి ఉండి, అనుకొన్న సమయానికంటె ఆలస్యంగా వసుమతి ఉపపతికోసం ఉద్యానవనానికి బయలుదేరుతుంది. ఒక దొంగవాడు ఆమె ధరించిన ఆభరణాలపై కన్నువేసి ఆమెను వెంబడిస్తాడు. తోటలో ప్రియుడు ఆమె ఇక రాదని నిరాశచెంది చెట్టుతీగలతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకొంటాడు. ఆమె అక్కడికి వచ్చి జరిగినదంతా గ్రహించి, అతని శవాన్ని దగ్గరకు తీసికొని ముఖాన్ని తొడపై పెట్టుకొని, తాంబూలపు రక్తిమ నిండిన పెదవులతో అతని నోట్లో నోరుపెట్టి ఊపిరిపోసే ప్రయత్నం చేస్తుంది. ఆ శరీరగంధానికి ఆకర్షితుడై చెట్టుమీది బేతాళుడు అతని శరీరంలోకి ప్రవేశించి ఆమె ముక్కు కొరుకుతాడు. నెత్తురోడుతున్న ముఖంతో ఆమె ఇంటికి వెళ్ళి, భర్త తనపై చెయ్యిచేసుకొన్నాడని ఇంట్లోవాళ్ళకు చెబుతుంది. కుటుంబపెద్దలు రాజుకు ఫిర్యాదు చేస్తారు. సముద్రదత్తుడికి శిక్ష పడుతుంది. ఇదంతా చూస్తూ ఉన్న దొంగ ముందుకు వచ్చి, జరిగిన కథను వివరించి, ఘటనాస్థలంలో బేతాళుడు కొరికిన ముక్కును చూపించి, అమాయకుడైన భర్తను విడిపింపజేస్తాడు. ఆ సన్నివేశంలో క్షేమేంద్రుడు వ్రాసిన శ్లోకం ఇది:

సా తస్య వదనకమలం నిజవదనే మోహితా కృత్వా
తామ్బూలగర్భ మకరోత్ ప్రకటితసాకారరాగేవ. (3-68)

(ఆమె మోహవివశురాలై అతని ముఖపద్మాన్ని తన మోముదమ్మి చెంతకు చేర్చి, తన మనసులో నిండిన అనురాగం వెల్లడయేట్లు తాంబూలపు రక్తిమ నిండిన పెదవులతో ముద్దుపెట్టుకొని ఊపిరులద్దే ప్రయత్నం చేయసాగింది.)

ఇంతకీ, కళావిలాసము కావ్యార్థం మాటెలా ఉన్నా – ఈ పద్యానికి కవి స్వీకరించిన ఈ మూలాన్ని పరిశీలింపవలసి ఉన్నది:

తామ్బూలం కటుతిక్త ముష్ణమధురం క్షారం కషాయాన్వితం
వాతఘ్నం కృ(క్రి)మినాశనం కఫహరం దుర్గన్ధినిర్ణాశనమ్
వక్త్రస్యాభరణం విశుద్ధికరణం కామాగ్నిసన్దీపనం
తామ్బూలస్య సఖే! త్రయోదశగుణాః స్వర్గేపి తే దుర్లభాః.

ఇది క్రీస్తుశకం 18-వ శతాబ్ది నాటి తాంబూలమంజరి అన్న సంకలనగ్రంథం లోనిది. తాంబూలంలోని ద్రవ్యనికరపు గుణాలేమిటో అభివర్ణింపబడుతున్నది. 1. కటువు (కారం), 2. తిక్తము (చేదు), 3. ఉష్ణము (వేడిమి), 4. మధురము (తీపి), 5. క్షారము (ఉప్పన), 6. కషాయము (వగరు) అన్న ఆరు రుచులతో అన్వితమైనది; 7. వాతఘ్నము (వాయురోగాన్ని పోగొట్టేది), 8. కృమినాశనం (కడుపులోని పురుగులను తొలగించేది), 9. కఫహరము (శ్లేష్మాన్ని హరించేది), 10. దుర్గంధినిర్ణాశనం (చెడువాసన లేకుండా చేసేది), 11. వక్త్రస్య ఆభరణం (ముఖానికి అలంకారప్రాయమైనది), 12. విశుద్ధికరణం (ముఖములోని, శరీరంలోని మలినాలను కడిగివేసేది), 13. కామాగ్నిసందీపనం (వాజీకరణశక్తి మూలాన ఆకలిని, భోగశక్తిని వర్ధిల్లజేసేది) అన్న త్రయోదశ (పదమూడు) సద్గుణాలను కలిగిన తాంబూలంలోని గుణాల వంటి గుణాలున్నాయే, ఓయి మిత్రమా! స్వర్గానికి వెళ్ళినా దొరికేవి కావు సుమా – అని భావం. ఆ సంధాత దీనిని ధన్వంతరి శ్లోకమని ఉదాహరించాడు. ఇదే శ్లోకం తత్తత్సందర్భోచితంగా ఇతర సంకలనాలలోనూ కొద్దిపాటి వ్యత్యాసంతో కనబడుతుంది.

తామ్బూలం కటుతిక్త ముష్ణమధురం క్షారం కషాయాన్వితం
వాతఘ్నం కృమినాశనం కఫహరం దుర్గన్ధినిర్ణాశనమ్
వక్త్రస్యాభరణం విశుద్ధికరణం కామాగ్నిసన్దీపనం
తామ్బూలస్య సఖే త్రయోదశగుణాః స్వర్గేపి తే దుర్లభాః.

అని క్రీస్తుశకం 1746కి మునుపటిదైన ప్రముఖ ఆయుర్వేదగ్రంథం యోగరత్నాకరములోనూ, 1557 నాటి పురుషోత్తమ హరిదాసు ప్రస్తావరత్నాకరములోనూ, ఉన్న పాఠం.

తామ్బూలం కటుతిక్త ముష్ణమధురం క్షారం కషాయాన్వితం
వాతఘ్నం కృమినాశనం కఫహరం కామాగ్నిసన్దీపనమ్
వక్త్రస్యాభరణం విశుద్ధికరణం దుర్గన్ధినిర్ణాశనం
తామ్బూలస్య సఖే త్రయోదశగుణాః స్వర్గేపి తే దుర్లభాః.

అన్న స్వల్పభేదంతో 1524కు మునుపటిదైన శివదాసుని జ్యోతిర్నిబంధములో ఉన్న ఈ శ్లోకమే,

తామ్బూలం కటుతిక్త ముష్ణమధురం క్షారం కషాయాన్వితం
వాతఘ్నం కఫనాశనం కృమిహరం దుర్గన్ధినిర్ణాశనమ్
వక్త్రస్యాభరణం విశుద్ధికరణం కామాగ్నిసన్దీపనం
తామ్బూలస్య సఖే త్రయోదశగుణాః స్వర్గేపి తే దుర్లభాః.

అన్న రూపంతో క్రీస్తుశకం 1683కు కొంత మునుపటిదైన ధన్వంతరి నిఘంటువులోనూ, 1450 నాటి నరహరి కృతమైన రాజనిఘంటువులోనూ ఉన్నది. క్రీస్తుశకం 1258 నాటి జల్హణుని సూక్తిముక్తావళిలో ఈ శ్లోకమే,

తామ్బూలం కటుతిక్త ముష్ణమధురం క్షారం కషాయాన్వితం
వాతఘ్నం కఫనాశనం కృమిహరం దుర్గన్ధినిర్ణాశకమ్
స్త్రీసంభాషణభూషణం రుచికరం శోకస్య విచ్ఛేదకం
తామ్బూలస్య సఖే త్రయోదశగుణాః స్వర్గేపి తే దుర్లభాః.

అన్న పాఠంతో కనుపిస్తుంది. జల్హణుని శ్లోకం తాంబూల గుణపంక్తిలో స్త్రీ సంభాషణ వేళ సాలంకృతిని, ఔషధయుక్తికి రుచిని, తన్మూలకంగా శోకవినాశనాన్ని నిరూపిస్తున్నది. ఆ తర్వాతి రోజులలో తాంబూల సేవనం పురుషులకే గాక స్త్రీలకు కూడా విధాయకమైనందున స్త్రీపురుషులకు ఉభయతారకంగా ‘స్త్రీసంభాషణభూషణం’ అన్న పాఠం ఉన్న చోట ‘వక్త్రస్యాభరణం’ అన్న విస్తృతార్థం ఏర్పడి ఉండటం సహజమే. నిజానికి ‘శోకస్య విచ్ఛేదకం’ అన్న కవితాత్మకత, సందర్భౌచితి రెండూ లేని విశేషణయుక్తి కంటె ‘కామాగ్నిసన్దీపనం’ అన్న పాఠం తర్వాతి రోజులలో చేరిన మేలిరూపమని సులభంగానే ఊహింపగలము.

వీటన్నిటినీ పరికించినప్పుడు కళావిలాస కర్తకు జల్హణుని ప్రాచీన పాఠశ్లోకంతో పరిచయం లేదని, క్రీస్తుశకం 15-16 శతాబ్దుల నడిమి కాలంలో వెలసిన శ్లోకపాఠమే పరిచితమని స్పష్టమవుతుంది. విమర్శకులు ఇది జల్హణుని శ్లోకం కావచ్చునేమో అని కూడా సందేహించారు. జల్హణునిది అయినా, కాకపోయినా శ్లోకపాఠం కళావిలాస కర్తకు ఆధారకల్పం కాదన్న మాట స్పష్టమే. జల్హణుని తర్వాతి కాలంలో ఈ శ్లోకం రూపాంతరాన్ని సంతరించుకొని ఆయుర్వేద ప్రకరణ గ్రంథాలకెక్కింది. ఆయుర్వేద గ్రంథకర్తలలో పెక్కుమంది దీనిని ధన్వంతరి నిఘంటు కర్త రచించిన శ్లోకమనే భావించారు.

ఆయుర్వేద ప్రకరణ గ్రంథాలలోని ఈ శ్లోకమే కళావిలాస కర్తకు ఆంధ్రీకరణవేళ ఉపకరించింది. కాకపోతే ‘స్త్రీసంభాషణభూషణం, శోకస్య విచ్ఛేదకం’ అన్న ఉపయుజ్యాలను తప్పక వాడుకొనేవాడే. సంస్కృతంలోని — 1) కటు 2) తిక్తం 3) ఉష్ణ 4) మధురం 5) క్షారం 6) కషాయాన్వితం, అన్న పంక్తిని సంక్షేపించి, ‘తలపోయఁగ రుచు లాఱును, గలుగును’ అని వ్రాశాడు. ‘వాతఘ్నం కృమినాశనం కఫహరం’ అన్న 16వ శతాబ్దికి పూర్వతరం కాని ఆధునిక పాఠమే, ‘వాతంబుఁ గ్రిమియుఁ గఫముం జెడు’ అని తెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే ఉన్న ‘కామాగ్నిసన్దీపనం’ అన్న పాఠం రాగమూలకతతోడి వ్యంగ్యాన్ని సంతరించికొని ‘ఆఁకలి వుట్టు’ అయింది. వాజీకరణాన్ని, శరీరవిశుద్ధికారకత్వాన్ని బోధించే ‘విశుద్ధికరణం’ అన్న దళానికి యథాతథంగా ‘దగయుఁ జెడు’ అని భావవ్యక్తిని కూర్చాడు. ‘తామ్బూలం … కామాగ్నిసన్దీపనం’ అన్న దళాలకు ఉపక్రమించి, ‘తమ్ములము రాగమూలము’ అని తెలుగుచేశాడు. భోజరాజు చారుచర్యలో నిర్దేశించిన

మనసో హర్షణం శ్రేష్ఠం రతిదం మదకారణమ్
ముఖరోగహరం హృద్యం దీపనం వస్తిశోధనం
ముఖశుద్ధి (?) కృమిహరం తామ్బూలం శ్రీకరం పరమ్.

మొదలైన లక్షణాలు క్రీస్తుశకం 15-వ శతాబ్ది నాటి అప్పన మంత్రి తెలుగుసేత మూలాన పాఠకులకు సుపరిచితాలే కనుక వాటి చర్చను ఇక్కడ ప్రసక్తించటం లేదు. తాంబూలం మనస్సుకు ఉల్లాసాన్ని కలుగజేస్తుందని, ఆ కారణాన తప్పక సేవింపదగినదని, భోగవాంఛను పెంపొందిస్తుందని, ఆ భోగం వల్ల హర్షోన్మత్తత, అతిశయం కలుగుతాయని, ముఖరోగాలు తొలగుతాయని, సేవించేవారికే గాక చూసేవారికి సైతం హృద్యమని, జఠరాగ్ని దీప్తమై ఆకలి పెరిగి రుచులకోసం ఉవ్విళ్ళూరటం జరుగుతుందని, వస్తి (పొత్తికడుపు) సంబంధమైన బాధ, నొప్పి తగ్గిపోతాయని, ముఖం నిర్మలంగా ఉంటుందని, కడుపులోని పురుగులను హరిస్తుందని, శరీరానికి ఇన్ని విధాలా మేలు చేకూరటం వల్ల ఆరోగ్యమే మహాభాగ్యం కనుక శ్రీకరం అని, అదే ఇహంతోపాటు పరాన్ని కూడా కూర్చి పెడుతుడని భోజరాజు శ్లోకార్థం.

కళావిలాస కర్తకు భోజరాజు రచన ఆదర్శకం కాదని చెప్పటం మాత్రమే ఇక్కడి విషయం. ఈ శ్లోకాలన్నింటికి మూలమైన వరాహమిహిరుని బృహత్సంహిత గంధయుక్తి ప్రకరణంలోని ‘కామం ప్రదీపయతి రూప మభివ్యనక్తి, వక్త్రసుగన్ధితా చ, ఊర్జం కరోతి కఫజాంశ్చ నిహన్తి రోగాన్, తామ్బూల మేవ మపరాంశ్చ గుణాన్ కరోతి’ అన్న శ్లోకం కూడా కళావిలాస కర్తకు ఆధారం కాదన్నమాట.

ఇక, పెదపాటి జగన్నాథకవి ‘భద్ర దత్త కూచిమార పాంచాలులు’ అన్న శీర్షికతో కళావిలాసము నుండి ఉదాహరించిన

“చ. … … … … … … …
      … … … … … … …
      … … … ..ట్టి యతం డరుదేరఁ గాంచియుం
      దడవకయుండ నెప్పటి విధంబని కౌఁగిటఁ జేర్ప నంతటన్.”

అన్న పద్యానికి మూలం క్షేమేంద్రుని కలావిలాసంలో పైని ఉదాహరించిన ‘తలపోయఁగ రుచు లాఱును, గలుగును’ అన్న పద్యానికి మూలమైన కామవర్ణనసర్గంలోనే ఉన్నది.

సముద్రదత్తుడు వివాహానంతరం కొంతకాలం అత్తవారింట విందులందుకొని అక్కడినుంచి వ్యాపారనిమిత్తం ద్వీపాంతరానికి వెళ్తాడు. భార్య వసుమతి కట్టుతప్పి ఒక నవయువకునితో ఇష్టభోగాలను అనుభవిస్తుంటుంది. కొన్నాళ్ళకు సముద్రదత్తుడు భార్యను చూడాలన్న ఉత్కంఠతో ఇంటికి తిరిగి వచ్చి ఎప్పటి వలె అనుకొని ఆమెను దగ్గరకు తీసికొంటాడు. ఆమె ప్రియునిమీది వలపు మూలాన పెడమొహంతో ఉంటుంది. ఆ సందర్భంలో క్షేమేంద్రుడు –

తత్ర స మధుమదవిలులితలోచనకమలాం ప్రియాం సమాలిఙ్గ్య (3-46)

(మధువు త్రాగినప్పటి మత్తువల్ల తేలిపోతున్న కనుదమ్ములు గల ప్రియురాలిని అతడు కౌగిట హత్తుకొన్నాడు.)

అని వ్రాసినదే, తెలుగులో — అతండు (సముద్రదత్తుడు), అరుదేరన్ = చెంతకు రాగా, కాంచియున్ = ఆ వసుమతి అతనిని చూసికూడా, తడవక+ఉండన్ = స్పృశింపక పెడమోముతో ఉండగా, ఎప్పటి విధంబు+అని = తమ తొలిపొందు నాడు సిగ్గుపడినట్లుగానే జంకుతో ఉన్నదని, కౌఁగిటన్ చేర్పన్ = కౌగిలిలో హత్తుకొనగా, అంతటన్ = అప్పుడు (తర్వాతి పద్యంతో అన్వయం) అన్న యథాతథమైన రూపాన్ని పొందింది. ఆ సమయంలోనే ఆంధ్రీకర్త పతియందు అనుక్తురాలైన ప్రియకాంత వర్తనగా ఈ క్రింది పద్యాన్ని నిలిపి ఉంటాడు:

చ. తొడవులు వెట్టు, సంభ్రమముతోఁ దిలకించు, మడుంగు గట్టు, పైఁ
      బడఁ దడవోప, దిం పెఱిఁగి పట్టుడు నేర్పులు గట్టిపెట్టుఁ, బ
      ల్కెడునెడఁ దొట్రుపా టొదవుఁ, గింకకు జేగుఱు మై జెమర్పఁగాఁ
      జిడిముడిఁ బొందుఁ గాంత పతి చేరినఁ గూరిమి గల్గె నేనియున్.

ప్రియానురక్త అయిన కాంత పతి సన్నిధిలో ఉన్నప్పటి భావలక్షణాన్ని వర్ణిస్తున్న పద్యమిది. ఇవి రెండూ కళావిలాసము లోనివే. ‘భద్ర దత్త కూచిమార పాంచాలులు’ అన్న శీర్షికను తొలగించి చదువుకోవాలి.

ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి గ్రంథాలయంలో D. 705 (M. 326) సంఖ్యతో ఛందోగ్రంథము అన్న పేరిట ఉన్న వ్రాతప్రతిలో క్షేమేంద్రుడనే నామాంతరం కలిగిన తెలుగు కవి లక్కాభట్టు రచించిన శతపక్షిసంవాదము లోనిదిగా ఈ పద్యం ఉన్నది:

శా. నీవీబంధము వీడు; మోవి యదరున్; నేత్రంబు లల్లాడుఁ; జన్
      గ్రేవల్ గానఁగవచ్చుఁ; గ్రొమ్ముడి విరుల్ పృథ్వీస్థలిం జెందు; స
      ద్భావాగారము లోను చెమ్మగిలుఁ; జిత్తం బుత్తలం బొందు; నా
      నావిభ్రాంతులు వుట్టు నింతులకుఁ జెంతన్ వింతవా రుండినన్.

పైని ఉదాహరించిన ‘తొడవులు వెట్టు, సంభ్రమముతోఁ దిలకించు’ అన్న కళావిలాస కర్త పద్యమూ, ఈ శతపక్షిసంవాద కావ్యకర్త పద్యమూ ఆత్మీయసన్నిధిలో అనురక్తల దేహమనోగతులు, బాహ్యాభ్యంతరాల సంచారిభావాల అభివర్ణనలే అయినా, ధారాశుద్ధి మూలాన నన్నెచోడుని రచనకంటె లక్కాభట్టు రచన కొంత ఆకర్షణీయంగా అమరిన మాట నిజం. నన్నెచోడుని రచనలోని సూచ్యార్థసూచకత్వం మరింత ధ్వనిబంధురతను సంతరించికొని గంభీరంగా అలరారుతున్నది.

ప్రబంధరత్నాకరములో పెదపాటి జగన్నాథకవి కళావిలాసము లోనిదిగా ఉదాహరించిన మన్మథస్తుతిపరకమైన పద్యం ఇది:

సీ. పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరు
      కాంచనాచల కార్ముకమునకు సాటిగాఁ జేపట్టె నెవ్వాఁడు చెఱకువిల్లు
      నవిరళ పాశుపతాస్త్రమునకు వాఁడి మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు
      నతులితామర దానవాదిబలంబుల గెలిపించె నెవ్వఁ డ య్యళిబలంబు

తే. నట్టి జగజెట్టి మన్మథుం డఖిలలోక
      ములకు వెఱగొంగ జీవుల మూలకండ
      యతని యిలుఁ జొచ్చి వెడలనియతఁడు గలఁడె
      యతని యమ్ములఁ బడకున్నయదియుఁ గలదె.

తెలుగు సాహిత్యంలో అద్భుతావహమైన రచనగా పలువురు విమర్శకులచేత పరిపరి ప్రశంసలను పొంది ప్రసిద్ధికెక్కిన పద్యం ఇది. ఇంతకంటె ప్రబంధరత్నాకరము వ్రాతప్రతిలో ఉన్న పాఠం మేలైనదిగా అగుపిస్తుంది. కవిగారు దీనిని వ్రాసుకొన్నప్పుడు కొన్ని మార్పులు వచ్చి ఉంటాయి. ప్రబంధరత్నాకరములోని పాఠం ఇది:

సీ. పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరుఁ
      గాంచనాచలకార్ముకమునకు సాటిగాఁ జేపట్టె నెవ్వండు చెఱకువిల్లు
      నవిహతపాశుపతాస్త్రమ్మునకు వాఁడి మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు
      నతులితామరదానవాది(?)బలంబుల గెలిపించె నెవ్వఁ డ య్యళి(?)బలంబు(?)

తే. నట్టి జగజెట్టి మన్మథుం డఖిలలోక
      ములకు వెఱగొంగ, జీవుల మూలకంద
      మతని యిలుసొచ్చి వెడలనియతఁడు గలఁడె?
      యతని యమ్ములఁ బడకున్న యతఁడు గలఁడె.

ఇందులో ఎత్తుగీతిలోని ‘జీవుల మూలకండ’ అన్న అపపాఠం తొలగిపోయింది. సీసచరణంలో ‘నవిరళపాశుపతాస్త్రమ్మునకు వాఁడి మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు’ అన్నప్పటి లోపం పరిష్కరింపబడింది. ‘అవిరళ’ అన్నప్పుడు అర్థం లేదు. అవిహతమైన = తిరుగులేని, పాశుపతాస్త్రము అన్నది అర్థవంతం. ఎత్తుగీతి అమితస్ఫూర్తిమంతం గానూ, అమోఘం గానూ అమరింది. అయితే రెండు పాఠాలలోనూ సీసం నాలుగవ చరణంలో ‘అతులితామరదానవాదిబలంబుల గెలిపించె నెవ్వఁ డ య్యళిబలంబు’ అన్న అపపాఠం మాత్రం అట్లాగే ఉండిపోయింది. ‘గెలిపించె నెవ్వఁ డ య్యళిబలంబు’ అన్నప్పుడు ల – ళ లకు ప్రాసయతి ప్రాచీనం కాదని, అదీ గాక అప్రశస్తమని భావించేవారు ‘గెలిపించె నెవ్వఁ డ య్యలిబలంబు’ అని దిద్దుకోవచ్చును. ‘అతులితామరదానవాదిబలంబుల’ అన్నదానికి అన్వయం లేదు. అతులిత = సాటిలేని, అమర = దేవతలు, దానవాది = రాక్షసాదులైన, బలంబులన్ = బలాలను అన్న తర్వాత, ‘గెలిపించె నెవ్వఁ డ య్యలిబలంబు’ అంటున్నాడు. దేవదానవులు యుద్ధం చేసినప్పుడు తుమ్మెద సైన్యం ఎవరికి తోడ్పడింది? మన్మథుడు ఎవరిని గెలిపించాడు? అమరదానవాదులకు యుద్ధం జరిగినప్పుడు ఆ బలాలలో ఒకటైన అమరబలాన్ని అళిబలం గెలిపించినదన్న అన్వయం సాధ్యం కాదు.

‘అతులితామరదానవాదిబలంబులన్ గెలిపించెను ఎవ్వఁడు ఆ అలిబలంబున్’ అన్నది ఏ మాత్రం దిద్దటానికి వీలులేని స్థితిలో ఉన్నది.

అతులితామరదానవారిబలంబులన్ గెలిపించెను ఎవ్వఁడు ఆ అలిబలాన — అని దిద్దుకొని, అతులిత = సాటిలేని, అమర = మృత్యువు లేని, దానవారిబలంబులన్ = దేవసైన్యాలను, ఆ = ప్రసిద్ధమైన, అలిబలాన = తుమ్మెదసైన్యంతో, ఎవ్వఁడు = ఏ మన్మథుడు, గెలిపించెను = గెలిపించాడో – అని దిద్ది సరిపెట్టుకోవాలి. మృత్యువు లేని దానవారిబలాలను మన్మథుడు కాపాడవలసి రావటమూ భావ్యమైన చిత్రణ కాదు. అందువల్ల అమల (నిర్మలులైన) దానవశత్రుసైన్యాలను అని పఠించటం మేలు.

పద్యప్రతిపాదితార్థాన్ని కూడా మరికొంత విమర్శించి చూద్దాము. మన్మథుడు పృథుల విశ్వంభరా రథానికి ఎదురుగా పువ్వుతేరును ఎప్పుడు పూన్పించాడు? పరమశివుని చేతిలోని మేరుపర్వత కాంచన కార్ముకానికి సాటిగా ఇక్షుకోదండాన్ని ఎప్పుడు చేపట్టాడు? ప్రత్యామ్నాయం లేని పాశుపతాస్త్రానికి పదును తగ్గే తీరున తన పుష్పాయుధాన్ని ఎప్పుడు సంధించాడు?

సతీదేవి దక్షయజ్ఞంలో పితృతిరస్కృతయై అవమానభారంతో యోగాగ్నిదగ్ధ అయిన తర్వాత పరమేశ్వరుడు హిమగిరికి వెళ్ళి తపోదీక్షితుడై ఆత్మయోగంలో ఉన్నాడు. తారకాసుర వధ నిమిత్తం దేవతలు పార్వతీపరమేశ్వరులకు దాంపత్యాన్ని ఘటించి, వారికి కలిగే కుమారుని అమరసైన్యాధ్యక్షునిగా నిలపాలని ఉద్యమించారు. ఫాలనేత్రునికి తపోవిఘ్నాన్ని కలిగించే సాహసం ఎవరికీ లేకపోయింది. దేవేంద్రుడు మన్మథుని లోకరక్షార్థమై శివదీక్షను భగ్నం చేయమని కోరాడు. అప్పుడు మన్మథుడు తన పరివారంతో వెళ్ళి పరమశివుని ఎదుట నిలిచాడు. ఇది పద్యసందర్భం.

అంతర్ముఖుడై ఉన్న పరమశివుని మనస్సులో వికల్పాన్ని కల్పించి మన్మథుడు తన అస్త్రాలను బయటికితీశాడు. అంతే కాని సాయుధుడై ఉన్న పరమశివుని ఎదిరించలేదు. దేశౌచితి, కాలౌచితి, సమయౌచితి, సందర్భౌచితి లేని శబ్దాడంబరం తప్ప సార్థకత లేని కల్పనం ఇది. కావ్యాదిని అవతారికలో ప్రసక్తమైన మన్మథస్తుతి అయితే అనౌచిత్యాపాదకమే. సీసం నాలుగవ చరణంలో మన్మథుడు దేవదానవ బలాలను అళిబలంతో గెలిపించిన ప్రస్తావన ఉన్నది. అళిబలంతో గెలిపించినది దేవబలాన్నే కాని దానవబలాన్ని కాదు. అమల దానవారిబలాలను అని దిద్దుకొంటే, అది పరమేశ్వరుని మన్మథుడు ఎదుర్కొన్న సన్నివేశానికి స్ఫోరకం.

పరమేశ్వరుడు విశ్వంభరా రథాన్ని అధిరోహించి, మేరుపర్వతాన్ని వింటిగా చేతబూనినది త్రిపురాసుర సంహారసమయం. ఆ తర్వాత మళ్ళీ అటువంటి ఘటన జరుగలేదు. పూర్వం ఒకనాడు ఆ మహాకార్యాన్ని నిర్వహించిన మహాదేవుడు వేరొక తరుణంలో తపోదీక్షితుడై ఉన్నవేళ మన్మథుడు ఆయన యెదుట నిలిచాడు. అప్రకృతమైన ఆ ఘట్టితాంశాన్ని మూడు పాదాలకు సాగించి, ఆ తర్వాత ప్రకృతార్థాన్ని ప్రతిపాదించటం మహాకవిత్వలక్షణం అనుకోలేము.

ఈ పద్యశిల్పాన్ని పోలిన పద్యం ఒకటి తెనాలి రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యములో ఉన్నది. పంచమాశ్వాసంలో శివుడు తనకు విష్ణువు సిద్ధమంత్రాన్ని ప్రసాదించాడని నారదునికి చెబుతాడు. నారదుడు ఆ మంత్రాన్ని తనకు ఇమ్మని అడుగుతాడు. శివుడు దానిని ఉపదేశించి, ఇట్లా అంటాడు:

నారదా! సర్వప్రదాయకమైన సిద్ధమంత్రం ఇది. సిద్ధేశ్వర నామంతో నువ్వు ఉంటున్న దక్షిణద్వారం వద్ద ఈ మంత్రాన్ని జపించేవారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. పూర్వం బలరాముడు శ్రీకృష్ణుని ద్వారా ఈ మంత్రరహస్యాన్ని గ్రహించి అభీష్టసిద్ధులను పొందాడు. రుక్మిణీదేవి ఈ మంత్రాన్ని జపించటం వల్లనే మన్మథుని కొడుకుగా పొందగలిగింది. మన్మథుడు పూవుటమ్ములతో మూడు లోకాలను జయించటానికి ఈ మంత్రబలమే కారణం.

ఈ సందర్భంలో తెనాలి రామకృష్ణకవి వ్రాసిన పద్యాలివి:

సీ. బలభిదారామసంభవలతాంతశ్రేణిఁ బన్నుము నాకొక్క చిన్నతేరుఁ
      గాళి కెంగేలి చిల్కలరాజుఁ గొనితెచ్చి నా వెంట బడివాగె నడవఁ బనుపు
      గగనచరద్రాశిగణవర్తి మకరంబు బిరుదుటెక్కెముగ వేగిర మొనర్పు
      మదనగోపాలుండు మా తండ్రిచే నాకుఁ జెఱకుచే మలిపించు కఱకువిల్లు

తే. వనజహితు వేఁడి తమ్మితూపునకుఁ దెమ్ము
      దివ్యములఁ గాని సాధింపఁ దీర దీశు
      నంబ! నీ వంచు రుక్మిణి నట్టునిట్టుఁ
      దిగుచు శైశవచాపలార్దితుఁడు మరుఁడు. పాండురంగ. (5-125)

క. సరసిజభవ వర వాయు
      స్ఫురితములై త్రిపురదహనములు త్రిజగములన్
      బురికొని నీరస యవసాం
      కుర సఖముగ నేర్చె ము న్నకుంఠితశక్తిన్. పాండురంగ. (5-127)

రామకృష్ణకవి పద్యశిల్పం, కల్పన కళావిలాస కర్త పద్యానికి మూలాలని తెలుస్తూనే ఉన్నది. ‘బలభిదారామసంభవలతాంతశ్రేణిఁ బన్నుము నాకొక్క చిన్నతేరు; పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరు; మదనగోపాలుండు మా తండ్రిచే నాకుఁ జెఱకుచే మలిపించు కఱకువిల్లు; కాంచనాచలకార్ముకమునకు సాటిగాఁ జేపట్టె నెవ్వండు చెఱకువిల్లు; వంటివి ఎత్తుగడలలోని సామ్యాలు. మన్మథుడు అసమర్థమైన సాధనసంపత్తితో అసాధారణమైన కార్యసాధనకు ఉపక్రమించటం అన్నది కూడా ఉభయరచనలలోనూ సమానంగానే ఉన్నది. మన్మథుడు ఈశ్వరుని ఎదుర్కొనవలసి రావటమే ఇద్దరి రచనలోనూ లక్ష్యార్థం. రామకృష్ణకవి చిత్రణలో మరుడు శైశవచాపల్యంతో పలుకుతున్నవాడు. అయినా, దివ్యసాధనాలు ఉంటేనే గాని ఈశ్వరుని సాధించటం సాధ్యం కాదన్న అభిజ్ఞానం ఉన్నవాడు. కళావిలాస కర్త దానిని వ్యంజింపజేశాడనుకొన్నా తాద్రూప్యంతో కల్పనను కొనసాగించలేక తబ్బిబ్బుకు లోనయ్యాడు.
ఇక, పెదపాటి జగన్నాథకవి కళావిలాసము లోనిదిగా చెప్పకపోయినా రామకృష్ణకవిగారు నన్నెచోడుని కళావిలాసము లోనిదిగా గ్రహించిన పద్యాన్ని గురించి కొంత చర్చింపవలసి ఉన్నది.

చ. లలనలు కొందఱాత్మపతులం దగఁగూడినచెయ్వులన్నియుం
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పకచెప్పెడు వారు పుణ్యజీ
      వులు చెలి యామినీశుని కవుంగిలి డాయుటె కాక తాల్మికీ
      ల్దొలఁగిన తీరుగీరు నటదోపవు నాకు రతిప్రయోగముల్.

పైని పేర్కొన్నట్లు, ప్రబంధరత్నాకరము వ్రాతప్రతిలో కళావిలాసము లోనిదని, శ్రీరామమూర్తి గారి ప్రత్యంతరంలో భాస్కరుని శృంగార రత్నాకరము లోనిదని ఉన్న పాఠం ఇది:

చ. లలనలు గొందఱాత్మవరులం దమకూడిన చెయ్వులన్నియున్
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పక చెప్పెడువారు పుణ్యజీ
      వులు చెలియా మదీశుని కవుంగిలి డాయుడు నాకు వల్పురే
      ల్దొలఁగు టెఱుంగఁబోలు నటఁ దోఁపవు మీఁద రతిప్రయోగముల్.

ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి గ్రంథాలయంలో D. 705 (M. 326) సంఖ్యతో ఛందోగ్రంథము అన్న పేరిట ఉన్న వ్రాతప్రతిలో ఇది కళావిలాసము లోనిదిగా కాక, భాస్కర ప్రెగ్గడ రచించిన రసాలంకారము లోనిదిగా ఉదాహరింపబడిన పాఠం ఇది:

చ. లలనలు గొందఱాత్మవరులం దమకూడిన చెయ్వులన్నియున్
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పక చెప్పెడువారు పుణ్యజీ
      వులు చెలి యామినీశుని కవుంగిలి డాయుడు నాకు వల్పురే
      ల్దొలఁగు టెఱుంగఁబోలు నటఁ దోఁపవు మీఁద రతిప్రయోగముల్.

వీటన్నిటిని సమన్వయించితే, పద్యరూపం ఇలా ఉంటుంది:

చ. లలనలు గొంద ఱాత్మవరులన్ దమకూడిన చెయ్వు లన్నియున్
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పక చెప్పెడువారు పుణ్యజీ
      వులు; చెలియా! మదీశుని కవుంగిలి డాయుడు నాకుఁ దాల్మి కీ
      ల్దొలఁగు టెఱుంగఁబోలు; నటఁ దోఁపవు మీఁద రతిప్రయోగముల్.

ప్రాకృతంలోని గాథాసప్తశతి శ్లోకానికి అనువాదం ఇది. ప్రియవల్లభునికి తనయెడ గల రాగాతిశయాన్ని తలచుకొని పరవశిస్తున్న ఒకానొక నాయిక తన సవతులను నిందిస్తూ చెలికత్తెలతో అంటున్న మాటలివి.

ణీసాసుక్కమ్పిఅపులహఏహిఁ జాణన్తి ణచ్చిఉ ధణ్ణా
అమ్హారిసీహిఁ దిట్ఠే పిఇమ్మి అప్ప వి వీసరిఓ. — (గాథాసప్తశతి, 4-61)

ఛాయ: (నిఃశ్వాసోత్కమ్పితపులకితై ర్జానన్తి నర్తితుం ధన్యాః
అస్మాదృశీభి ర్దృష్టే ప్రియే ఆత్మాపి విస్మృతః.)

విమర్శకులు గుర్తింపని విశేషం కాబట్టి వివరణ అవసరమవుతున్నది. ప్రియుని సన్నిధిలో సాత్త్విక భావోదయం కలిగి నిట్టూర్పులకు, గాత్రకంపానికి, గగుర్పాటుకు లోనైనప్పటికీ నర్తింపగలవాళ్ళున్నారే, ధన్యురాండ్రు సుమా! నాలాంటివాళ్ళ మాటేమిటంటావా, ఆయన కనబడితే చాలు, నన్ను నేను మైమరచిపోతాను కదా – అని గాథార్థం. తనను తాను నిందించికొంటున్న నెపంతో సపత్నులను అభిశంసిస్తున్నది నాయిక. సపత్నుల నాట్యప్రదర్శన వారి పారవశ్యలోపం వల్లనే అని, నిజంగా వారు ధన్యురాండ్రు కారని భావం. నిఃశ్వసితమూ, గాత్రవిభ్రమం, రోమాంచం వారి నాట్యప్రదర్శనలో భాగమే కాని, అనుభూతివిశేషద్యోతకం కాదని విమర్శ. వారెంతటి నర్తనకళావిశారదలు అయినా, తన ప్రేమాతిశయం ముందు వారి ప్రేమ దిగదుడుపేనని ఉత్కర్ష. తన ప్రేమకు కారణం నాథుడు తనకు వశుడై ఉండటమే అని ధ్వని. ఇది మూలంలోని గాథ విషయం.

తెలుగులో ఆ విషయం కొంత వ్యాఖ్యాతమయింది. ‘నర్తనము’ అన్న క్రియ ‘వర్తనము’గా మారింది. సపత్నులు తమ వల్లభునితో జతకూడినప్పటి విశేషాలను అరమరిక లేక చెలిమికత్తెలకు మనసువిప్పి చెప్పుకుంటారు. ఓ చెలీ! నాకు నాథుని కౌగిలిలో కరిగిపోవటమే తెలుసు. ఆ పైని రతిప్రయోగాలు, సురతవిలాసాలు ఆ మైమరపులో నాకు తెలియనే తెలియవు – అని నాయిక అంటున్నది. మూలంలోని సవతులు నాథుని యెదుట నర్తించటం మాత్రమే జరిగింది. వీళ్ళు తిరిగివచ్చి సఖీజనానికి చెప్పుకొంటున్నారు. పారవశ్యలోపంతోపాటు లజ్జాపరిత్యాగం కూడా చిత్రితమయింది. తనకు ‘కవుంగిలి డాయుడు’ = వల్లభుని సమీపించి, ఆయన కౌగిలిలోనికి హత్తుకొనే వేళకే శరీరం అదుపు తప్పింది. అంతగా తనను ప్రేమిస్తున్నాడని అతిశయాన్ని పొందింది.

సపత్నులయందు సకళంకత్వం ఆరోపింపబడుతున్నది. అందువల్ల తన కళంకరహితమైన శీలవ్యక్తి ప్రతిపాదింపబడింది. సపత్నులు సఖీజనానికి చెప్పిన విషయం తన చెవికెట్లా సోకినదీ ఆమె చెప్పలేదు. ఏ చెలియతో ఈ మాట అంటున్నదో ఆమెద్వారా శ్రుతపూర్వమని ఊహించాలి. నాథుని ప్రేమ తనకు, సవతులకు అనుభవంలోని విషయమే అయినా, వారి మైమరపు లేమి అన్న హేతుసామాన్యం అనుపాదానమైంది. అది ఆమె ఆక్షేపానికి విషయం. సవతుల అపకర్ష నిమిత్తంగా తన ఉత్కర్షను వెల్లడిస్తున్నది. వ్యతిరేకం అపకర్ష వల్ల ప్రతిపాదితమై ఆ వైధర్మ్యం ఆమె ఉత్కర్షకు హేతువయింది. ఆక్షిప్తిరూపమయిన వ్యతిరేకాలంకారం అన్నమాట.

అత్ర తా అధన్యా, వయం తు ధన్యా ఇతి వ్యతిరేకాలఙ్కారః వ్యఙ్గ్యః — అని గంగాధర టీక. వ్యతిరేకాలంకారం వంగ్యమని ఆయన నిరూపణ.

గాథాసప్తశతి లోని ఈ ప్రాకృతగాథ భోజరాజు శృంగారప్రకాశములో ఉదాహృతమై ఉన్నది. తెలుగు కవి దీనిని భోజుని రచన నుంచి కూడా గ్రహించి ఉండవచ్చును.

వల్లభదేవుని సుభాషితావలిలోని ఈ క్రింది శ్లోకాన్ని చూడండి:

సత్యం తథా న విదితః సురతోపచారః
సజ్జన్తి యేన పురుషా ఇహ కామినీనాం
దత్తః కరశ్చ దయితేన మమోపనామి
సఖ్యై క్షపామి యది కిఞ్చిదపి స్మరామి. (శ్లో. 2141)

ఇది సర్వశః గాథాహృదయాన్ని ఆవిష్కరిస్తున్న కేవలానుసరణమని స్పష్టంగానే తెలుస్తున్నది. పోలికయితే ఉన్నది కాని, నిఃశ్వాసోత్కంపపులకితాదులు లేనందువల్ల ఇది తెలుగు పద్యానికి మూలం కాదు.

మమ్మటాచార్యుని కావ్యప్రకాశము చతుర్థోల్లాసంలోని ఈ శ్లోకాన్ని చూడండి:

ధన్యాసి యా కథయసి ప్రియసఙ్గమేఽపి
విస్రబ్ధచాటుకశతాని రతాన్తరేషు
నీవీం ప్రతి ప్రణిహితశ్చ కరః ప్రియేణ
సఖ్యై క్షపామి యది కిఞ్చిదపి స్మరామి. (శ్లో. 61)

ఇందులోనూ పై గాథలో వలెనే వ్యతిరేకాలంకారముఖంగా విషయం సపత్నీగర్హణమే అయినప్పటికీ, నిఃశ్వాసోత్కంపపులకితాదులు లేనందువల్ల ఇది తెలుగు పద్యానికి మూలం కాదు. ఇంకా ఆసక్తి గలవారు ‘అత్ర వాక్యార్థేన వస్తుమాత్రరూపేణ ధనసమృద్ధిమయత్వేన మయైవ భోగ్య ఇతి’ అన్న సోమేశ్వర భట్టు కావ్యప్రకాశ సంకేతవ్యాఖ్యలోని అందమైన వివరణను చూడండి. ఈ ‘ధన్యత్వ’ నిరూపణం కూడా తెలుగు కవిని ప్రభావితం చేయలేదని స్పష్టమే.

ఇంతకీ, ఈ పద్యాన్ని ఉదాహరించిన భాస్కరుని శృంగార రత్నాకరము, భాస్కర ప్రెగ్గడ రసాలంకారము ఒకటే అవునో కాదో తెలియదు. రచనా కాలం తెలియదు. ఆ గ్రంథాలలోనూ ఇది కళావిలాసము లోనిదిగా ఉదాహృతమై ఉండదు.

క్షేమేంద్రుని కలావిలాసంలో దీనికి స్థానం లేదు. కళావిలాసము కామశాస్త్రగ్రంథమైతే ఈ పద్యానికి అక్కడా నివేశం ఉండదు. పెదపాటి జగన్నాథకవి దీనిని కళావిలాసము లోనిదిగా చెప్పలేదు కాబట్టి దీనిని ఈ ఉపరి పరిశీలన పట్టిక నుంచి తొలగించాలి.

పై గాథకు మరొక అనువాదం మానవల్లి వారు 1910లో ప్రకటించిన ప్రబంధమణిభూషణములో ఉన్నది:

తే. భాగ్యవతులు మున్ను ప్రాణేశ్వరునిఁ జూచి
      వడఁకువారు నూర్పు విడుచువారు
      పులకలొత్తువారుఁ బోలంగ ననుఁబోటి
      తన్ను మఱచునదియుఁ దడవఁ గలదె. ప్రబంధ. (ప. 71)

మానవల్లి వారు, నిడుదవోలు వేంకటరావుగారు ఇది శ్రీనాథుని గాథాసప్తశతి లోనిది కావచ్చునని ఊహించారు. పదసార్థకతను, శైలి భణితిని, అలంకార్యతను చూస్తే దీనికంటె ‘లలనలు గొంద ఱాత్మవరులన్’ అన్న పద్యమే శ్రీనాథుని రచన కావచ్చు ననిపిస్తున్నది. విమర్శకులు ఇంకా ఆలోచించాలి.
5. ఆంధ్ర ప్రయోగరత్నాకరము లోని కళావిలాసము
ఇక, నన్నెచోడుని కళావిలాసము లోనివిగా గణపవరపు వేంకటకవి తన ఆంధ్ర ప్రయోగరత్నాకరములో లక్ష్యాలుగా ఉదాహరించిన పద్యాలు కళావిలాసము లోనివి అవునని, కాదని ఉభయతః భావించటానికి వీలయిన స్థితిలో ఉన్నాయి. వీటిలో మొదటిది – పార్వతీదేవి నారదుని మాటను వినలేక ఆగ్రహింపగా చూచి పరమేశ్వరుడు పెదవులపై చిరునవ్వు చిందిస్తూ ఈ ఇద్దరితో న్యాయయుక్తంగా అంటున్న మాటగా – కథావశాన చోటుచేసికొన్న కొంత విపర్యాసంతో క్షేమేంద్రుని రచనలోని లోభవర్ణనసర్గం లోనిది కావచ్చును:

క. నగజాత నారదు నుడి వి
      నఁగలే కాగ్రహముఁ జెందినఁ గని హరుఁడు లే
      నగవు సెలవి నిగుడఁగఁ ది
      న్నగఁ బలికెన్ సతికి మునికి నాయము దోఁపన్.

ఈ క్రింది పద్యంలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. సముద్రమంత లోతైనవానిని, రాధామనోవల్లభుడైన శ్రీకృష్ణుని పాదపద్మములయందు సేవాభావముతో సమర్పితమైన తపశ్శక్తి కలిగినవానిని, మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని వనస్థలంలో దర్శించినదెవరో స్ఫుటగోచరం కాకపోయినా, కథావశాన చోటుచేసికొన్న కొంత విస్తృతితో క్షేమేంద్రుని రచనలోని దంభవర్ణనసర్గం లోనిది కావచ్చును. దంభపురుషుని దాంభికతను చూసి తలవంచికొని నిలబడిన ఋషిలోకంలో విశ్వామిత్రుడు కూడా ఉన్నాడు. అది నిమిత్తంగా తెలుగు కవి దీనిని ప్రవేశపెట్టినట్లు ఊహింపవచ్చును.

క. పాథోనిధిగాంభీర్యున్
      రాధాకాముకపదాబ్జరాజత్సేవా
      మేధాధుర్యతపోరా
      గాధేయుని మునివతంస(సు?) గాధేయు వనిన్.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ రెండు పద్యాలు గణపవరపు వేంకటకవి తాను నిరూపించిన లక్షణాలను వ్యవస్థీకరించుకోవటం కోసం కల్పించిన కూటసృష్టిపద్యాలని భావించారు. కళావిలాసము అంటూ ఒక గ్రంథం బయటపడితే గాని ఏ సంగతీ నిర్ధారణగా చెప్పలేము. కూటసృష్టి పద్యాలు అయితే గణపవరపు వేంకటకవికి ఈ నన్నెచోడుని పేరు ఎక్కడ దొరికినదన్న ప్రశ్నకు సమాధానం చెప్పవలసివస్తుంది. క్షేమేంద్రుని కలావిలాస కావ్యాన్ని ముందుంచుకొని ఈ కూటసృష్టి చేశాడని భావించాలి. ఈ విజిజ్ఞాసకు సమాధానం చెప్పటం కష్టం. పద్యభణితిని బట్టి, ‘రాధాకాముక’ అన్న ప్రయోగవిశేషాన్ని బట్టి ఆచార్య శ్రీరామమూర్తిగారు ఇది శ్రీనాథునికి అనంతరకాలంలో వెలసినదై ఉంటుందని నిశ్చయించారు.

6. కుమారసంభవము కర్త, కళావిలాసము కర్త ఒక్కరేనా?
నన్నెచోడుని కళావిలాసము క్షేమేంద్రుని కావ్యానికి అనువాదమేనని నిశ్చయమైనాక, వివాదాస్పదుడైన కుమారసంభవము కర్త నన్నెచోడుడు, ఈ కళావిలాసము కర్త ఒక్కరేనా? కాదా? అన్న జిజ్ఞాస కలగటం సహజం. ఆ సందేహనిరాసార్థం కుమారసంభవ కర్త నన్నెచోడునికి క్షేమేంద్రుని కలావిలాస కావ్యంతోనూ, క్షేమేంద్రుని ఇతర రచనలతోనూ పరిచయం ఉన్నదా? లేదా? అని కొంత పరిశీలింపగా, ఈ క్రింది పద్యం ఒకటి కనబడింది:

మ. నలి నాత్మవ్యవసాయవాదులును గన్యావాదులున్ మంత్రవా
      దులు దివ్యౌషధ వశ్యధాతు రసవాదుల్ మోహులై త ద్దయా
      కులతం బొందుదు రాశఁ బె ట్టవియ కోర్కుల్ గూర్చు మున్ భక్తవ
      త్సల! సర్వేశ్వర! నిన్నుఁ గొల్వ కెదలో దారిద్ర్యవిద్రావణా! (10-96)

ఈ పద్యంలోని అనన్వితాలు, పాఠవిపర్యాసాల మాట అటుంచి, కుమారసంభవము ద్వితీయ భాగం లఘుటీకలో మానవల్లి వారు వ్రాసిన మాటలను చూడండి:

“461. ఆత్మవాదులు, కపటవేదాంతులు, లేక కపటయోగులు. వ్యవసాయవాదులు = వ్యవసాయమున నపూర్వమార్గముల నుపదేశించి ఫలాధిక్యముఁ జూపుదుమనెడు కపటదేశికులు. కన్యావాదులు = కన్యలఁ దెచ్చి వివాహము చేయించి ద్రవ్యము గొనువారు. దివ్యౌషధవాదులు = రసాయనౌషధములచేఁ జిరజీవులుగాఁ జేయుదు మనువారు. ధాతువాదులు = తాళక హింగుళాది ధాతువుల రూపాంతరములఁ గల్పించువారు.” (మానవల్లి కవి రచనలు: పుట. 55)

ఇది క్షేమేంద్రుడు తప్ప సాహిత్యంలో వేరెవరూ చేయని భావార్థనిరూపణ. కలావిలాసంలో ధాతువాదాన్ని గురించి క్షేమేంద్రుని నిర్వచితాన్ని చూడండి:

శతవేధీ సిద్ధో మే సహస్రవేధీ రసోఽపి నిర్యాతః
ఇతి వదతి ధాతువాదీ నగ్నో మలినః కృశో రూక్షః. (9-8)

(శతవేధినైన సిద్ధుణ్ణే కాని నేను సహస్రవేధి సిద్ధరసం ఒకదాన్ని తయారుచేశాను. దాన్ని తింటే ఆయుష్షు పెరుగుతుంది. బలం వస్తుంది. ఐశ్వర్యం కలుగుతుంది – అని చెబుతూ ధాతువాది తాను మాత్రం కట్టుబట్టలు లేక, చేత చిల్లిగవ్వ లేక, నీరసం వల్ల కోపంతో కన్నులెఱ్ఱజేసి తిరుగుతుంటాడు.)

వివిధౌషధపరివర్తైః యోగై ర్జిజ్ఞాసయా స్వవిద్యాయాః
హత్వా నృణాం సహస్రం పశ్చాద్వైద్యో భవేత్ సిద్ధః. (9-4)

వివిధౌషధపరివర్తైః = దివ్యౌషధవాదులు = రసాయనౌషధములచేఁ జిరజీవులుగాఁ జేయుదు మనువారు; ధాతువాదులు = తాళక హింగుళాది ధాతువుల రూపాంతరములఁ గల్పించువారు; అన్న ప్రయోగాలు క్షేమేంద్రప్రయుక్తాలకు అనుసరణలే. ఇంకా రసాయనవాదుల వర్ణనకోసం క్షేమేంద్రుని దేశోపదేశములో (8-20, 21, 48) శ్లోకాలను చూడండి. కుమారసంభవ కర్తకు క్షేమేంద్ర రచనలతో పరిచయం ఉండటమే గాక, ‘వ్యవసాయము’ అంటే ‘సేద్యము’ అన్న ఆధునిక వ్యవహారం కూడా తెలిసి ఉండటం మరొక విశేషం.

7. ఉపసమ్హారం
నామధేయానికి నోచుకొని, రూపధేయాన్ని కోల్పోయి సాహిత్యచరిత్రలో భాగధేయాన్ని పొందిన గొప్ప రచన నన్నెచోడుని కళావిలాసము. దాని గవేషణ విమర్శకుల కర్తవ్యం. వసుంధర ఏనాటికీ రత్నగర్భే. వెలలేని రత్నాలకోసం వెతికేవాళ్ళు, వెలికితీసేవాళ్ళు ఉండగా భోగించేవాళ్ళ కొదవ ఉంటుందా?

ఈ చర్చానుసారం వెల్లడైన విషయాలివి:

క్షేమేంద్రుని కలావిలాసానికి తెలుగు కళావిలాసము అనువాదమే. మానవల్లి రామకృష్ణకవిగారు అందులో కథాంశాలు లేవనటం సరికాదు.
పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరములో ఉదాహరించిన కళావిలాసము, గణపవరపు వేంకటకవి ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఉదాహరించిన నన్నెచోడుని కళావిలాసము, ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి ప్రత్యంతరంలోని కళావిలాసము ఒకటే కావచ్చును. అవి వేర్వేరు గ్రంథాలు కావు.
ఆచార్య శ్రీరామమూర్తిగారు ఊహించినట్లు కళావిలాసము కర్త నన్నెచోడుడు, మడికి సింగన సకలనీతిసమ్మతములో ఉదాహృతుడైన నీతిశాస్త్రముక్తావళి, బద్దె నీతి కృతుల కర్త అయిన బద్దె నృపాలుడు, బద్దె నన్నిచోడుడు, ఒకరు కారు. అసలు బద్దెన నన్నిచోడుడు లేదా బద్దె నన్నిచోడుడు అన్న వ్యక్తి లేడు. కళావిలాసము కర్త బద్దె నన్నిచోడుడు కాడు.(చూ. 2వ అనుబంధము.)
కళావిలాసము కావ్యమే; కామశాస్త్ర ప్రకరణగ్రంథం కాదు. (చూ. 3వ అనుబంధము.)
తెలుగు కళావిలాసము క్రీస్తుశకం 1029-1064ల నడుమ కాశ్మీరదేశాన్ని పరిపాలించిన అనంత నరేంద్రుని ఆస్థానకవి, మహాలాక్షణికుడు, మహాకవి అయిన క్షేమేంద్రుని కలావిలాస కావ్యానికి అనువాదం కాబట్టి ఆంధ్రీకర్త నన్నెచోడుడే అయితే క్షేమేంద్రునికి కనీసం ఒక శతాబ్దికి తర్వాతివాడు కావాలి. క్రీస్తుశకం 15-16 శతాబ్దుల నడిమి కాలంలో వెలసిన ‘తామ్బూలం కటుతిక్త ముష్ణమధురం క్షారం కషాయాన్వితం’ అన్న శ్లోకానికి అనువాదం ఉండటం వల్ల, క్రీస్తుశకం 1575 ప్రాంతాల వెలసిన తెనాలి రామకృష్ణకవి పాండురంగమాహాత్మ్యము ప్రభావం (4వ. అనుబంధం) ఉన్నందున కళావిలాసము ఆ రెండింటికి తర్వాతిది; క్రీస్తుశకం 18-వ శతాబ్ది నాటి పెదపాటి జగన్నాథకవి, గణపవరపు వేంకటకవి ఉదాహరించినందువల్ల అంతకు మునుపటిది.
కుమారసంభవము కర్త నన్నెచోడునికి క్షేమేంద్రుని రచనలతో పరిచయం ఉన్నది. అయితే, కుమారసంభవము కర్త నన్నెచోడుడు, కళావిలాసము కర్త నన్నెచోడుడు ఒకరో కాదో చెప్పడానికి ఇప్పుడున్న ఆధారాలు చాలవు. శబ్దసంయోజనను బట్టి ఒకరు కాకపోవచ్చునని అనిపిస్తుంది.
కుమారసంభవము కర్త నన్నెచోడుడు, కళావిలాసము కర్త నన్నెచోడుడు ఒకరే అయితే మాత్రం అంతగా ప్రౌఢం కాని కళావిలాసము సుపరిణతమైన నన్నెచోడుని కుమారసంభవము కావ్యానికంటె మునుపటిది అన్నమాట.
సాహితీవేత్తలు పరిశీలించి నిగ్గుతేల్పవలసిన చర్చనీయాంశాలివి.
----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: