తిలక్ కవితా మూలాలు – ఆయన సాధించిన సౌందర్యం
సాహితీమిత్రులారా!
దేవరకొండ బాలగంగాధర తిలక్ సాహితీ సృజన కేవలం వచన కవితా రచనకు మాత్రమే పరిమితమయినది కాదు. ఆయన ఇతర సాహితీ ప్రక్రియలలో కూడా విశేషమైన కృషి చేసినవారు. అయినా ఛందోబద్ధమైన కవిత్వ రచనలో, కథా రచనలో, నాటికారచనలో తిలక్ అందరిలో ఒకరు. ఆయనకు ప్రత్యేకత ఏమీ లేదు. కాని, వచన కవితలో ఆయన అసమానమైన సౌందర్యాన్ని సాధించారు. చాలామంది వచన కవిత్వమంటూ చేసింది శుష్కమైన వచనాన్ని వ్రాయటం మాత్రమే. కాని, తిలక్ గొప్ప సౌందర్య సీమల్ని, వివిధమైన సాంద్రమైన మానవానుభవాలను ఆవిష్కరించారు. సుకుమారమైన భావసౌందర్యాన్ని, మధురనాద ప్రధానమైన శైలీ రమ్యతను సాధించారు. చాలామంది కవిత్వాన్ని, కవిత్వ తత్వాన్ని గురించి రకరకాలుగా చెబుతారు. తిలక్ ఎంతో సూటిగా, క్లుప్తంగా చెప్పారు: ‘అందం ఆనందం దాని పరమావధి’ అన్నారు. వచన కవిత్వ లక్షణ గ్రంథం వ్రాయవలసి వస్తే ప్రధానంగా ఆయన అమృతం కురిసిన రాత్రినీ, మరి కొద్దిమంది ఇతర ప్రసిద్ధులైన వారి వచన కవిత్వాన్నీ ఆధారం చేసికొని వ్రాయాలేమో. అందం సాధించి ఆనందం అందివ్వని రచన కవితే కాదని ఆయన రూఢిగా చెప్పినట్లయింది. నిజానికి ఇజాలతో కవితకు సంబంధం లేదు. వాటి పని రాజకీయ పార్టీలకు, వ్యవస్థలకు. ఏ పొలిటికల్ పార్టీ మానిఫెస్టోనో, పొయెటైజ్ చేస్తే చాలని అనుకోవటం సరిపోదు. మరొక విషయం: సూక్తులన్నీ క్లుప్తతతో కూడి ఉండి వినడానికి ఆకర్షణీయంగానే ఉంటాయి. అంతే వాటి విలువ. వాటిని కవితా పంక్తులుగా చలామణీ చేయించాలనే ప్రయత్నం కవితా విరోధమవుతుంది. ఏ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలకూ పరిమితం కాని సర్వకాలీన మహావిలువలు ప్రేమ, కరుణ, క్షమ, సత్యం, స్నేహం, సహకారం. ఇవన్నీ అందరికీ ఆనందాన్ని పంచే పెంచే విలువలు. ఆ విలువలకే కవిత్వంలో చోటుంటుంది. వాటికుండే స్పందనలు లోతైనవిగా వుంటాయి. కవి వానినే ప్రేరేపిస్తాడు. తిలక్ చేసింది అదే.
కవిత్వ పరామర్శ జరగవలసింది రెండు భూమికల మీద: మొదటిది, భావ శబలత, మధురోహల మార్దవం మీద, సాంద్రత మీద. రెండవది, సంపూర్ణమైన సందర్భశుద్ధి కలిగిన పదాల కూర్పులోని శబ్ద సారూప్యత వల్ల ధ్వనించే మనోహరమైన లయ మీద, శైలీరమ్యత మీద, రస పారదర్శకత మీద; ఇంకా ఆ పదాల కూర్పులోంచి క్రమక్రమంగా ఉదయించే సూర్యునిలా ఆవిర్భవించి దృశ్యమానమయ్యే సజీవ చిత్రాల మీద. పదచిత్రాల ప్రాదుర్భావానికి పాదుకొల్పేవి ముఖ్యంగా రూపకాలంకారాలు. ఈ రూపకాలంకారాలను (మెటఫర్స్) అంత సులభంగా, సుందరంగా, అంత విస్తృతంగా తిలక్‌లా వాడుకొన్న వారిని చాలా కొద్దిమందిని మాత్రమే చూడగలమేమో! తిలక్ కవితా పంక్తుల అల్లికలలో రూపకాలంకారాలు అంతర్భాగాలై కలసిపోతాయి. అంచేత అవి వీడని మమతలై మన మస్తిష్కంలో నిలచిపోతాయి. ఈ రెంటిని గూడా అద్భుతంగా వచన కవితలో తిలక్ సాధించారు.
కంఠవశమయే గుణం కవిత్వం యొక్క అతిముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాపేక్షంగా చెప్పాలంటే ఛందోబద్ధమైన కవిత్వానికి కంఠవశమయే గుణం ఎక్కువగా వుంటుంది. ఆ కవి గొప్పవాడు కావచ్చు, కాకపోవచ్చు. ఆ పద్యం గొప్ప పద్యం అవొచ్చు, అవకపోవచ్చు. ఛందోభంగం కాకుండా వ్రాయబడితే చాలు కంఠవశమవుతుంది. ఇది పద్యం గొప్పదనం, ఈ ఛందోరీతులను రూపొందించిన ఆదికవుల, ఆలంకారికుల గొప్పదనం. కాని వచన కవిత కంఠవశమవడానికి వచన కవి అద్భుతమైన ప్రతిభ కలవాడై వుండాలి. అంత ప్రతిభను మనం తిలక్‌లో చూడగలం. ఆయన కవితలు పంక్తులకు పంక్తులు మధురాక్షరాల ప్రవాహాలై ఆనందంతో మనల ముంచెత్తుతాయి. వర్ణిత విషయాలు మెరుపు తీగల్లా సాగిన పదచిత్రాల ద్వారా దృశ్యమానమవుతాయి. అదృష్టాధ్వగమనం, నీవు లేవు నీ పాట వుంది, అమృతం కురిసిన రాత్రి, ఆర్తగీతం, కఠినోపనిషత్, వసుధైక గీతం, విరహోత్కంఠిత, చావులేని పాట, నెహ్రూ, వెళ్ళిపొండి వెళ్ళిపొండి, మంచు, వెన్నెల, శిఖరారోహణ, వానలో నీతో, సైనికుడి ఉత్తరం – ఇలా ఎన్నో, ఎన్నెన్నో గొంతెత్తి పాడుకోవాలనిపిస్తుంది, ఒక ‘ఇన్స్‌పైర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్’లో.
తిలక్ సున్నిత మనస్కులు, గొప్ప సౌందర్యారాధకులు. ఆయన ఆరాధించే సౌందర్యం, శీలానికి సంబంధించినది, రూపానికి సంబంధించినది. శబ్దానికి సంబంధించినది. శీలానికి సంబంధించిన సౌందర్యం కవితా వస్తువుకు సంబంధించిన సౌందర్యం. అంటే కవితకు ఆలంబనమైన కవి యొక్క సాంద్రమైన స్పందనలకు సంబంధించిన సౌందర్యం. మహా మానవీయ గుణాల్ని ప్రబోధించే ఔన్నత్య గుణ విశేషం. సకల లోక కళ్యాణం, సకల జనుల సౌభాగ్య, సంతోష కామన కలిగిన వస్తు విశేష ఔన్నత్యం. తోటి జనుల బాధలకు కన్నీటి గీతికై స్పందించే దయాగుణానికి సంబంధించిన సౌందర్యం. కవిత్వీకరణకు మాధ్యమంగా వుండే అలంకారం ముఖ్యంగా రూపకాలంకార ప్రయోగం ద్వారా సాధించే పదచిత్ర సృజనకు సంబంధించిన సౌందర్యం రూపానికి సంబంధించినది. అంతర్భావావేశ వ్యక్తీకరణకు మాధ్యమంగా, వాహికగా వుండేది పదచిత్ర సమూహం. దానికి సంబంధించిన సౌందర్యాన్నే, రూపానికి సంబంధించిన సౌందర్యంగా పరిగణించవలసి వుంది. ఈ దృశ్యరూప సౌందర్యాన్ని స్థిరీకరించేది నిర్మాణ ప్రౌఢిమ, శిల్పం. భావమెపుడూ అమూర్తమే. అమూర్తమైన భావాన్ని, మూర్తమైన వస్తు లేదా దృశ్య లేదా ప్రాణి మాధ్యమంగా స్ఫురింప చేయడం ప్రతీకాత్మకత (సింబాలిజమ్). రూపకాలంకారం ప్రతీకాత్మకత పరస్పరాశ్రయాలై, ఒకటై, అందమైన శక్తివంతమైన కవిత్వీకరణ మాధ్యమంగా ఉపయోగపడతాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రతి ప్రతీక నిక్షిప్తమైన రూపకమే. Every symbol is an unexpressed metaphor. That is to say there is a potential metaphor in every symbol. ఈ విషయం బాగా తెలిసిన తిలక్ వాటిని చక్కగా సమన్వయపరచి సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు.
శబ్దానికి సంబంధించిన సౌందర్యం ప్రధానంగా శైలీరమ్యతకు సంబంధించినది. సందర్భ శుద్ధికలిగి, శబ్ద సారూప్యత కలిగిన పద ప్రయోగ జనితమైన లయ విన్యాసానికి సంబంధించి, చెవుల కింపై, మనసును అలరించే సౌందర్యం శబ్దానికి సంబంధించినది. విడమరచి విశ్లేషిస్తున్నపుడు ఈ సౌందర్యాన్ని మూడుగా లేదా త్రిముఖంగా చెప్పుకుంటున్నాము కాని, ఈ మూడూ చాలా అర్థవంతంగా సమగ్రంగా సమన్వయింపబడిన ఏకంగా సాగే రసప్రవాహం. ప్రవాహంలో జలం వుంటుంది. ఆ జలానికి రూపముంటుంది, రంగు వుంటుంది, వేగం ఉంటుంది. ఒక ప్రవాహ దర్శనానుభవం మనకు కలిగినపుడు దాని రంగు, వేగం,రూపం మనకు విడివిడిగా అనుభూతమవవు. వాటిని మనం విడివిడిగా చూడం. మన అనుభవానికి సంబంధించి అక్కడ వున్నది ప్రవాహ మొక్కటే. అలానే కవితా చరణం. దానిలో శబ్దార్థ భావరూప సౌందర్యాలు సమగ్రంగా సమన్వయింపబడినవన్న స్పృహ కూడా ఆ కవితాచరణ సౌందర్యానుభవంలో వుండదు. కారణం, మనది పాక్షిక దృష్టికాదు, సమ్యక్ దృష్టి. దానివల్ల కలిగే రసానుభవం ఏకతానుభవం.
ఊరవతల సందులలో
దుమ్ము కొట్టుకపోయిన పిల్లల కండ్లలో
ఆరిపోతున్న వెలుగులో
కాలవ వడ్డున ఒంకర దిరిగిన
తుమ్మచెట్టు కొమ్మలోంచి
కాలి మసైపోతున్న పశ్చిమ దిశాగగనంలో
ఒక భయంకర సృష్టిక్రమాన్ని
మానవయత్న వైఫల్యాన్ని
ఊహించికొని వొణికిపోయేవాణ్ణి.
శీల, రూప, శబ్ద సౌందర్యాల సమగ్ర సమన్వయత సాధించి పాఠకునికి లేదా శ్రోతకు రసానంద వాహికగా అస్థిత్వం కలిగి వుంటాయి ఈ పంక్తులు. ఒక వర్గపు ప్రజల జీవితంలోని దైన్యాన్ని మన గుండె గూడుపట్లు ఎక్కడో కదలినట్లు, మన కలలు కాగితపు పేలికలై రాలినట్లు, జాలిగా, దుఃఖపు జాలుగా తాకుతాయి. అలాగే
కాంక్షామధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను
జీవితాన్ని హసన్మందార మాలగా ధరించాను
అంటే, ఒక పరిపూర్ణమైన ఆనంద స్థితి మాత్రమే మన అనుభవంలోకి వస్తుంది. విడివిడిగా పాక్షిక సౌందర్యాలుగా రావు.
దిగులు నీరు నిండిన కోటి మనస్సరస్తీరాల నా కవిత
కోరికల కోణాకారపు కొత్త చెట్లను నాటుతుంది
అంటే, శోకతప్తమైన హృదయభారంలోంచి దుఃఖితుల కష్టాలు తీర్చగలిగే ప్రయత్నం తన కవిత ద్వారా చేయాలనే ఆర్ద్రతతో కూడుకొనిన అచంచల విశ్వాసం మనకు అనుభూతమవుతుంది. అలా అనుభూతమయేపుడు విడివిడిగా మనం చూడం గాని, మన అనుభవాన్ని అర్థం చేసికొని విశ్లేషించేప్పుడు దాని శబ్దానికి, రూపానికి, శీలానికి సంబంధించిన సౌందర్యాలతో సమన్వయింపబడిన మహాసౌందర్యంగా దానిని మనం గుర్తించగలం. శైలిలో అక్షర రమ్యత, రూపంలో కంటిని, మనసును వశపరచుకోగల దృశ్య సౌందర్యం, వస్తు సాధుతత్వ సౌందర్యాల సమ్మేళనం తిలక్ కవితా చరణాలలో చూడగలం.
ఒక శుష్క స్తన్య సన్నిధిన
క్షుధార్తినేడ్చు పసిపాప వున్నంత వరకు… – అన్నప్పుడు
ఏడుపింకిపోయిన ఎడారి రొమ్ముల్ని
చూపించకండి … – అన్నప్పుడు
ఎంత అందమైన కవిత్వీకరణ! ఏడుపింకిపోయిన ఎడారి రొమ్ముల్లో సౌందర్యం లేదు. వాటి సౌందర్యాన్ని ఆకలి మంటలు ఏనాడో హరించి వేశాయన్న దుర్భర దుఃఖం సూచించబడింది. ఆకలికి, కష్టాలకు, దుఃఖాలకు క్రుంగి, కృశించిపోయిన దయనీయమైన బ్రతుకులకు అద్దం పట్టగలిగిన పదచిత్ర ప్రయోగంగా అది గొప్ప సౌందర్యం సంతరించుకుంటుంది. తిలక్‌లో ఈ సమన్వయత ప్రయత్నరహితంగా రూపుదిద్దుకుంటుంది. దానికి మూలం ఆయన స్పందనలలోని సమగ్రత, ఆయన కవిత్వీకరణలోని ఆర్కిటెక్చర్. ఇపుడు ఉటంకించిన కవితా చరణాలలో ఇంతకు క్రితం చెప్పుకున్నట్లు రూపక ప్రతీకాత్మకతలు ఒకటై ఆ భావావిష్కరణలకు ఎలా సుందరమైన మాధ్యమాలుగా మారిపోయాయో చూడగలం.
తిలక్ గొప్ప సున్నితమనస్కులు, గొప్ప సౌందర్యారాధకులనుకున్నాము గదా. అవును. విశ్వవ్యాప్తమైన సౌందర్యం మొత్తం కుంచించుకొని సాంద్రమై ఒక కేంద్ర స్థానం వైపు పరుగులెత్తి వస్తే, ఆ పరిపూర్ణమైన సౌందర్యాన్ని మొత్తాన్ని తన చైతన్యంలోకి దింపుకోవాలనేంత ఆర్తి కలిగిన సౌందర్యారాధకులు. అపరిమితమైన సౌందర్యకాంక్ష, పరిమితమైన ఆనందానుభవం వలన జీవితంలో వీడని విషాదానికి ఉనికి. ఆనందం ఉంటుంది, దానినంటిపెట్టుకొనే విషాదం ఉంటుంది. పరిపూర్ణ సౌందర్యారాధకుల జీవితమంతా ఇలా గడుస్తుంది. అలానే ఆనంద విషాదాలమధ్య డోలాయమానమైంది ఆయన నలభై అయిదు సంవత్సరాల జీవితం.
తిలక్ కవిత్వమూలాలను వెదకవలసింది ఆయన అనంతమైన సౌందర్య కాంక్షలో ఎంతో, క్రమక్రమ జరారుజాగ్రస్తమై మృత్యుముఖాభిముఖంగా నెట్టివేయబడే నిస్సహాయ జీవన స్థితి కల్పించే వేదనలో అంత. Where beauty can’t keep her lustrous eyes అని విలపించే కీట్స్ (John Keats) గుర్తుకు వస్తాడు. మనిషికి కష్టాలు రెండు విధాలుగా వుంటాయి: మొదటిది జీవన గమనరీతి; చూస్తూ చూస్తుండగానే కనుమరుగైపోయే యౌవనం, సౌందర్యం, ముంచుకొచ్చే మృత్యు స్థితి. రెండవది; శ్రీశ్రీ మాటల్లో బలవంతులు బలహీనుల్ని కాల్చుక తినటం. ఈ రెంటికీ అనునిత్యం వేదనతో ఘూర్ణిల్లింది తిలక్ కోమలమైన అంతరంగం. జీవితంలోని సౌందర్యానికి, మధురిమలకు ఎంత మూర్ఛనలు పోయారో, జీవితంలోని అస్థిరత్వానికి, అశాశ్వతత్వానికి అంత విలవిల్లాడిపోయారు. తన వ్యక్తిగతమైన అసంతోషకరమైన పరిస్థితులకే గాదు పరిణామ పరిణాహ జగత్కటాహంలో సలసలకాగే మానవాశ్రుజలాలను చూసి దుఃఖానికి, వేదనకు, విషాదానికి గురయ్యారు.
తిలక్ కవితాశైలిని గురించి ఒకటి రెండు మాటలు చెప్పవలసి వుంది. ఆయన కవితా సంకలనం అమృతం కురిసిన రాత్రికి కుందుర్తి ఆంజనేయులు ముందుమాట వ్రాస్తూ తిలక్ శైలి గ్రాంథిక భాషతో మిళితమైనదని అసంతృప్తి వ్యక్తపరుస్తారు. సంస్కృత భాషా ప్రభావానికి వచన కవితాశైలిని దూరంగా ఉంచాలని భావిస్తారు. నోరు తిరగని సంస్కృతాన్ని వ్యతిరేకించవచ్చు కానీ సరళ సుందర సంస్కృత పద సమ్మిళితమైన తెలుగుభాషను ఈసడించుకోవలసిన అవసరం లేదు గదా. ప్రజల నానుడి భాష కావ్యంలో ఉండకూడదనడం లేదు. తప్పనిసరిగా ఉండవచ్చును. కానీ, అందమైన తేలిక సంస్కృత పదాల సంయోగంతో తెలుగు భాష వన్నెచిన్నెలు సంతరించుకుంటుందని, అర్థస్ఫురణశక్తి, వ్యక్తీకరణ విస్తృతి విస్తరిస్తాయని, అటువంటి భాష కావ్య భాషా శైలికి ఎక్కువ అనువుగా ఉంటుందని మాత్రమే ఇక్కడ చెప్పటం. గతి తార్కిక భౌతిక వాదరస సిద్ధాంతంతో ప్రభావితులైన తర్వాత కూడా శ్రీశ్రీ ఎలా వ్రాస్తారో చూడండి:
షాజహాన్ అంతఃపురములో
షట్పదీసింజాన మెక్కడ?
…
రుద్రమాంబా, భద్రకాళి
లోచనోజ్జ్వల రోచులేవి
ఖడ్గ తిక్కన కదన కాహళ
కహకహ ధ్వనులెక్కడమ్మా?
ఎక్కడమ్మా కృష్ణరాయని బాహు జాగ్రద్బాడబాగ్నులు?
కేవలం వాడుక భాషలో రచనలు చేసి చలం గొప్ప శైలి సాధించారని చెబుతారు. కానీ తన సుధ కావ్యం, క్రింది పంక్తులతో ప్రారంభమవుతుంది.
యామినీ శిరోజ దీప్తజ్వాలా కుసుమాలు
తేజోతల్పంపై వ్రాలి అదృశ్యమైనయ్
రవి కిరణాంగుళీనఖక్షతాలతో
శ్యామలాకాశం కందింది
అరుణాచల వామభాగాన
కుంకుమపూజ జరుగుతుంది
ఇదంతా వాడుక భాషేనా? కాదు, సరళసుందరమైన కావ్యభాష, కవితా భాష.
కుందుర్తి ఇంకా అంటారు: ‘సగం గ్రాంధికం, సగం వ్యావహారికం గల యీ శైలీ సాంకర్యదశ వచన కవితా రంగంనుండి తప్పుకోవడానికి మరికొంత కాలం పడుతుంది’. మరలా, ‘ఈ మాట చెప్పినందువల్ల ప్రతిపాదిత వస్తువుకంటే తత్ప్రయోజనంకంటే శైలికి అధిక ప్రాధాన్యమిస్తున్నాననే అపోహ ఎవరూ పడనవసరం లేదు‘ అంటారు. కుందుర్తి చేసిన ఈ శైలీ పరామర్శలో కూడా అందమైన గ్రాంధిక భాషాచ్ఛాయలు లేవా? వచనమే ఇలా వ్రాస్తే, వచన కవితలో సూక్ష్మమైన, లోతైన, బహుముఖీనమైన మానవానుభవాలను వాని ఆవేశ స్థాయిని బట్టి సాంద్రతను బట్టి అవసరమైన సరళసుందరమైన గ్రాంథిక భాషాచ్ఛాయలు గలిగిన భాషను ఉపయోగించడం అసంగతం అవుతుందని అంటే అంగీకరించడం కష్టమౌతుంది. పూర్తిగా ప్రజలు మాట్లాడుకునే భాషే కావ్య భాషగా వాడాలని చెప్పేవారే అలా వ్రాయకపోవడానికి, వ్రాయలేకపోవడానికి కారణమేమిటి? వ్రాద్దామనుకున్నా ఆ భాషలోనే పూర్తిగా కావ్యం వ్రాయడం కుదరదు కాబట్టేమో ఆలోచించుకోవాల్సిన అవసరముంది.
వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు పెద్దలు. సందర్భం నుండి పెకలింపబడిన పదబంధాలు, వాక్యభాగాలు కూడా తిలక్ కవిత్వంలో రసాత్మకమే. అమృతం కురిసిన రాత్రి, వెన్నెల మైదానం, కలల పట్టుకుచ్చులూగుతున్న కిరీటం, కాంతి సంగీత గీతం, కాంక్షా మధుర కాశ్మీరాంబరం, పండు వెన్నెల మత్తు, ఏడుపింకిపోయిన ఎడారి రొమ్ములు, దిగులు నీరు నిండిన కోటిమనస్సరస్తీరాలు, నవనవాలైన ఊహా వర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు… ఇటువంటి పదబంధాలు ఎన్నో ఎన్నెన్నో. తిలక్ కవిత్వంలో పొయెట్రీ లేని పదబంధం ఎక్కడుంది! ఆయన వాక్యం సాయంసంధ్యలో మధుర ధ్వనులతో ముందుకు సాగే ప్రవాహ సౌందర్యాన్ని పుణికి పుచ్చుకొని విస్తరిస్తుంది, ఆద్యంతం అలరిస్తుంది. వచనకవితా సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం తిలక్ కవిత్వం.
-----------------------------------------------------------
రచన: సి. ఎస్. రావ్,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment