Friday, August 31, 2018

రామాన్వేషణ


రామాన్వేషణ





సాహితీమిత్రులారా!

సీతాన్వేషణ మనం విన్నాం సినిమాల్లో కన్నాం
కానీ ఇక్కడ రామాన్వేషణ ఆస్వాదించండి మరి..........

“సీతే..సీతే!” అన్న అరుపులు ఎక్కడో అగాధంలోంచి వస్తున్నట్టున్నాయి.

అగాధపు అంచుల్లో ఉన్న సూడో-సీత ఆ అరుపులను లెక్కచేయకుండా, “రామా! రామా!” అని అక్కడక్కడే వెతుకుతుంది.

సూడో-రాముడు అపహరణ గురైయ్యాడన్న వార్త సూడో-సీతకు ఇప్పుడిప్పుడే అందింది. ఆ వార్తను చెప్పుకోడానికి, బాధను పంచుకోడానికి, కలిసి వెతకడానికి లక్ష్మణుడు, హనుమంతుడు వగైరాలెవ్వరూ సూడో-సీతకు అందుబాటులో ఉండరు. వాళ్ళంతా రాముడి పక్షం కదా! వాళ్ళకి సూ.సీత ఉందని కూడా తెలీదు.

సూ.సీత అక్కడక్కడే వెతికి వేసారింది. కట్టుకున్న మనుషులైతే కారడవులు దాటుకొని, ఆనకట్టలు కట్టుకొని వెతుకుతారని మనం విని ఉన్నాం. కానీ, కంటికి ఆనని మనుషులు వెతకాల్సినవచ్చినప్పుడు చాలా టర్మ్స్ ఆండ్ కండీషన్స్ ఉంటాయి. “రామా!” అన్న పిలుపు సూ.రాముడికి కాదు కదా, మరెవ్వరికి వినిపించకూడదు. ప్రైవసీ ఇష్యూస్! మాటమాటల్లో తనకు కొన్ని ప్రత్యేక స్థావరాలు, కొన్ని రహస్య మందిరాలూ ఉన్నాయని సూ.రాముడు చెప్పాడు. వాటిల్లోకి సూ.సీతకు ప్రవేశం నిషిద్ధం అని కూడా చెప్పాడు. కానీ, అవి ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. పొరపాటున కూడా వాటి జోలికి వెళ్ళకూడదని సూ.సీత, అక్కడక్కడే తచ్చాడుతూ “రామా! రామా!” అని తనకి కూడా వినిపించనంత బిగ్గరగా అరుస్తుంది.

ఇదేదో “రోల్ రివర్సల్” కథలా ఉంది. మరప్పుడు టైటిల్ “సీతాయణం” అని ఉండాలేమోగా – అని మీరు ఉత్సాహపడచ్చు.

కథ ఎప్పుడూ రాముడిదే! సీతది అందులో కథను ముందుకో, పక్కకో నడిపించే పాత్ర మాత్రమే. సూడోసీత కాబట్టి కథను నడిపించడంలో ఆమె పాత్రే లేదు. అందుకే సూడో అయినా సరే, ఇది రామాయణమే! (కాదూ, కూడదు అని మీరు వాదించదల్చితే, సూ.సీత ఆగ్రహానికి లోనవ్వాల్సి వస్తుంది. అసలే సూ.రాముడు కనబడ్డం లేదన్న చిరాకులో ఉంది. ఆలోచించుకోండి.)

సూ.రాముడు రాముడంతటివాడు. (కానీ, రాముడు కాదు. అందుకే సూడో-రాముడు. హెన్స్ ప్రూవ్డ్.) రాజ్యాలూ, పూజ్యాలూ లేని మామూలు వాడైనా తనదంటూ ఉన్న ప్రపంచాన్ని రామరాజ్యం అన్నట్టు భావిస్తాడు. ( అందులో ఎన్నటికీ ప్రవేశంలేని సూ.సీత అదే నిజమనుకుంది.) ప్రాణమిచ్చే బలగం అతడి ఆస్తి. మంచి బాలుడే – మంచిలో ఒక గరిటెడు చిలిపితనం, ఒక బకీటుడు రసికతనం, ఒక గంపెడు బతకనేర్చినతనం కలుపుకుంటే!

అచ్చంగా జరిగిందేంటో తెలీదు గానీ.. (మాకు తెలియాలి! తెలిసి తీరాలి! – అని మీరు ఆవేశపడకండి. సూ.సీత దాటలేని గీతలు, ప్రవేశించలేని రహస్యమందిరాలు ఉన్నాయని మీకు ఇదివరకే తెలియజేయడం జరిగింది. అయినా, జరిగిందేదో తెలిసి తీరాలంటే…కరెక్ట్.. మీరు సూ.సీత ఆగ్రహానికి లోనవ్వాలి. రాముడికోసం తపిస్తున్న సీత దగ్గరకు వెళ్ళడానికి రావణుడే జంకాడు. ఆపై మీ ఇష్టం.)

మళ్ళీ.. అచ్చంగా జరిగిందేంటో తెలీదు గానీ, సూ.రాముణ్ణో రాక్షసుడు ఎత్తుకుపోతూ ఉంటాడు, అప్పుడప్పుడూ. (రాక్షసుడే! రాక్షసి అయ్యుంటే – “స్త్రీలను గౌరవించడం మన సంపద్రాయం” అని ఆర్టిసి బస్సుల సూత్రం ప్రకారం కిక్కురుమనకుండా అక్కడే ఉండిపోయేంత మంచి బాలుడు.)

మరి యుద్ధాలు చేసి గెలిచే వస్తాడో, లేక తప్పించుకొని పారిపోయే వస్తాడో తెలీదుగానీ, సూ.రాముడే తిరిగివచ్చేస్తుంటాడు. ఒక్కోసారి త్వరగా వచ్చేస్తాడు. ఒక్కోసారి ఎంతకీ రానట్టే అనిపిస్తాడు. వెనక్కి వచ్చేశాక మాత్రం తన రాజ్యంలో ఉన్నవారందరి బాగోగులూ దగ్గరుండి చూసుకుంటాడు. తరతమ బేధాలు లేకుండా అందరికి బోలెడంత సంతోషాన్ని కలిగిస్తాడు, వాళ్ళందరూ అతణ్ణి పూజింజేంతగా!

సు.రాముడు అలా మాయమైనప్పుడల్లా సూ.సీత ఇలా వెతకటం మొదలెడుతుంది.
కథ మధ్యలో ఇలా జొరబడటం మర్యాద కాకపోవచ్చుగానీ.. ఇలా వెతకటం వల్ల లాభం ఏంటి? ఇలా అయితే రాముణ్ణి ఏ రాక్షసుడు తీసుకెళ్తున్నాడు? తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ నుండి రాముడు ఎలా తప్పించుకుంటున్నాడు? చంపి వస్తున్నాడా? అలా అయితే, రాక్షసుడు మళ్ళీ ఎలా వస్తున్నాడు? ఇంకోడుగానీ పుట్టుకొస్తున్నాడా?
చంపకుండా తప్పించుకుంటుంటే – ఎన్నాళ్ళిలా? రాక్షసుడిని చంపాలిగా కదా? ఎలా? దానికోసం ప్రణాళిక.. ప్లానింగ్ కమిషన్…వర్కింగ్ కమిటీ..

మీరూ… మీ గాభరా! మనకన్నా చాలా ముందునుండే గాభరా పడుతున్న సూ.సీత ఇప్పటి వరకూ సాధించిన పురోగతి ఏమీ లేదు.

ఎందుకుండదండీ? మనసుంటే మార్గం అదే ఉంటుంది. దీని బట్టి సీతకి రాముడిపై దొంగప్రేమే.. అదే …సూడోప్రేమ ఉన్నట్టుంది. నిజమైన ప్రేమే ఉంటే ఎప్పుడూ రాముణ్ణి కనిపెట్టుకొని ఉండి, అతడినే “ఫాలో” అయితే ఈ రాక్షసుడు ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నవి తేలిగ్గా తెల్సుకోవచ్చు!

ఈ టెహల్కా ట్రిక్ సూ.సీత తెలీక కాదు. సూ.రాముణ్ణి రాక్షసుడిలా ఎత్తుకుపోతాడన్న సంగతి నిర్ధారణ చేసుకున్నాక, రాక్షసుడి రాక కోసం కాపుకాచింది. రాక్షసుడు వచ్చాడు. సూ.రాముడి ఇంటిలోకి వెళ్ళాడు. తలుపులు మూశాడు. కొంతసేపటి వరకూ భీకరమైన శబ్ధాలు వినిపించాయి. ఆ తర్వాత ఆగిపోయాయి. అప్పటి వరకూ బయట కారిడర్‌లో తచ్చాడుతున్న సూ.సీత టెన్షన్ తట్టుకోలేకపోయింది. తలుపులు బద్దలు కొట్టింది. లాభం లేదని కిటికి అద్దం పగలగొట్టింది.

అగ్నిపత్ సినిమా క్లైమాక్సులో హృతిక్ రోషన్‌లా, టి-20లలో బౌలర్లలా సూ.రాముడు చావుదెబ్బలు తింటున్నాడు, రాక్షసుని చేతిలో. ఉక్రోషంతో సూ.సీత మళ్ళీ ఇంకో రాయి విసిరింది కిటికిల్లోంచి.

రాక్షసునికే తగిలింది.

“ఇది చీటింగ్!” అన్నాడు రాక్షసుడు, సూ.రామునికేసి చూస్తూ.
“టైమ్ ప్లీజ్” అన్నాడు సూ.రాముడు

వచ్చి, సూ.సీత చేయి పట్టుకొని గట్టిగా కొరికి వదిలిపెట్టాడు సూ.రాముడు. వెంటనే వెళ్ళకపోతే ఆమెనే తినేస్తానన్నాడు. ఆమె ఏడ్చుకుంటూ తిరిగివచ్చేసింది.

అలా కొరికింది తన రాముడు అయ్యుండడని, అలా భయపెట్టటం తనవాడికి చేతకాదని సూ.సీతకో గట్టి అనుమానంతో కూడిన వట్టి నమ్మకం. అదంతా రాక్షసమాయని నచ్చజెప్పుకుంటుంటుంది ఇప్పటికీ. అప్పటినుండి మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదులే. (అతడు తినేస్తాడేమోనన్న భయం కాదు. అతడికి తాను అరగకపోతే అని బాధ!)

ఏడ్చినట్టే ఉంది… ఇలా అయితే ఈ కథ ఎక్కడికి పోతుంది?

సూ.సీతలా… అక్కడక్కడే…

రాముడు దొరికేస్తే…అదే తిరిగొచ్చేస్తే, అంతా హాపీసేగా…

హాపీస్ అంటే సూ.రాముడికి హాపి. అతడి బంధుజనానికి హాపి. వాళ్ళెవ్వరైనా దయతలచి ఫేస్‌బుక్ అప్‌డేట్ చేస్తే, విషయం తెల్సుకున్న సూ.సీత కూడా హాపీ..

వియోగంలో ఉన్న సూ.సీతకు ఆశోకవనం లాంటి లగ్జరీలు లేవు. పైగా బాస్‌లకి, డెడ్‌లైన్లకి ఇవ్వనీ వినడానికి మీకున్నంత ఓపిక ఉండదు. అందుకని సూ.రాముడు మాయమైపోయినప్పుడల్లా సూ.సీత అగాధంలోకి పడిపోయీ పోనట్టుంటుంది. సూ.రాముడొచ్చేశాడని తెలిశాక, పడిపోయిన సీతను పడిపోని సీత బయటకు తెచ్చుకోవాలి.

అయితే, కథ మొదట్లో, సీతే, సీతే అని వెతుకుతుందీ… సీత తాలూకా.. ?

అంతే!

హమ్మ్.. మల్టి లేయర్డ్ పెర్పెచ్యువల్ గేమ్ ఆఫ్ సూడో-సెర్చింగ్?

నాట్ బాడ్.

ఏంటో.. రాముడు-సీత, మధ్యలో రాక్షసుడు అనే కథ మాకు కంఠతావచ్చు. ఇదేంటో, రాముడూ-రాక్షసుడూ, మధ్యలో సీత కథ? అసలా రాముడి గతమేంటి? ఆ రాక్షసుడికి ఏం కావాలి? మధ్యలో సీతకు ఎందుకొచ్చిన సంత?

అవ్వన్నీ.. మరెప్పుడైనా..

వాట్ ది…
[ఇంకా (ఉన్నట్టే) ఉంది]
--------------------------------------------------------
రచన - పూర్ణిమ తమ్మిరెడ్డి, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments: