శ్రీ శ్రీ దేశచరిత్రలకు పారడీ
సాహితీమిత్రులారా!
శ్రీ.శ్రీ. గారి
"ఏదేశచరిత్రచూచినా" అనే కవితకు పేరడీగా
భరద్వాజ్ గారు వ్రాసిన కవిత చూడండి-
ఏ సినిమా చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం?
సినీమాల చరిత్ర సమస్తం
నరపీడన పారాయణత్వం
సినిమాల చరిత్ర సమస్తం
స్టార్ హీరోల పాద సేవనం
సినిమాల చరిత్ర సమస్తం
చెంచాల వీరవిహారం
సూపర్స్టార్ పాత్ర ప్రధానం
తారాగణ అతివికారం
సినిమాల చరిత్ర సమస్తం
ప్రేక్షకులను కాల్చుకు తినడం
దర్శకుడే హీరొయిన్లచే
వ్యభిచారం చేయించాడా?
పరకాంతలు తెలుగు భామలై
సినీరంగమున ప్రసిద్ధికెక్కిరి
రాసక్రీడలు లేని చోటు టా
లీవుడ్ లో వెదకిన దొరకదు
హీరోయిన్ తడిసె వర్షమున
లేకుంటే హీరో స్వేదములో
కల్లోలిత సంసారాలు
దిగజారిన సంస్కారాలు
అపహాస్యపు హాహాకారం
సినిమాల్లో నీలుగుతున్నవి
అవివేకం అతిమూర్ఖత్వం
రీమేకులు కాపీ కథలూ
మాయలతో మారు పేర్లతో
సినిమాల్లో కనిపిస్తున్నవి
ఏయన్నార్ ఎంటీవోడు
శొభన్ సూపర్ స్టార్ కృష్ణ
చిరంజీవో ఎవడైతేనేం?
ఒకొక్కడూ శిరభక్షకుడు
నాగార్జున వెంకటేషులు
బాలయ్య పవన్ కల్యాణులు
మహేష్ బాబు ఉదయ్ కిరణ్ చేసిరి
మెదళ్ళతో రస పానీయం
అభిమానుల సందోహంలో
మీడియా ప్రకంపనలలో
ప్రకటనల పరంపరలో
సినిమాలను తీసిన మనుష్యులు
అంతా తమ ప్రయోజకత్వం
తామే ఇక సామ్రాట్టులమని
స్థాపించిన స్టూడియోలు
నిర్మించిన ఫిల్మ్ సిటీలూ
ప్రేక్షకుల చీత్కారంతో
పడిపోయెను పేకమేడలై
పరస్పరం సంగ్రహించిన
స్టోరీలతో సినిమా పుట్టెను
సహజమైన కథానికలు
మధురమైన సినీసంగీతం
అర్థమయ్యే మాటలు, పాటలు
ఇంకానా? ఇకపై ఉండవు
ఒక మహిళకు ఒకరే భర్త
ఒక పురుషునఒకరే పత్ని
ఉండే ఏ సినిమా అయినా
ఇంకానా? ఇకపై ఆడదు
మెగాస్టార్ ఘరానా మొగుడు
గోల్డ్ స్టార్ సమరసింహుడు
యువసామ్రాట్ మాస్ బాస్ బాస్ మాస్
సూపర్ హీరోలే అందరూ
పావలాకి రూపాయి నటన
హీరోయిన్ బికినీ వీక్షణ
సెంటిమెంటల్ చావబాదుడు
కలిపేస్తే సినిమా అయ్యెను
ఏ స్తాలిన్ ఎవడిని నరికెనో
లక్ష్మీ, మాస్ ఏ స్టేప్పేసెనో
నరసిమ్హుడి కంటిచూపులు
ఇంతేనా సినిమా అంటే?
ఏ షూటింగ్ ఎక్కడ జరిగెనో
ఏ సినిమా ఎన్నాళ్ళాడెనో
రికార్డులు గాసిప్ రచనలు
ఇదీ సినీ పత్రికల సారం
హాలివుడ్ వాడిపారేసిన
ఫార్మ్యులా ల జోలికి పోని
కథలేవో కావాలిప్పుడు
వినకుంటే ఇక వాళ్ళిష్టం
ముచ్చటైన సన్నివేశం
వెనకనున్న రచయిత ఎవ్వరు?
మణిరత్నం చీకటి షాట్లో
పనిచేసిన లైట్ బాయ్ ఎవ్వడు?
ఆకాశపు విన్యాసాల్లో
స్టంట్ మేన్ల సాహసమెట్టిది?
హీరోల స్టెప్పులు కాదోయ్
అవి నేర్పిన మేస్టర్ ఎవ్వడు?
ఏ పోరి ఎవడితో తిరిగెనో
ఏ గుంటడు ఎవతిని తార్చెనో
న్యూస్ చానెళ్ళ స్పై కేం స్టింగులు
సృష్టించెను గందరగోళం
పదికోట్లతో తీసిన చిత్రం
అది చూసిన ప్రేక్షకులెవ్వరు?
ఆ సినిమా ఏ కాలంలో
సాధించిన దే పరమార్ధం?
ఏ కథనం ఏ సంగీతం?
ఏ మధనం ఏ సాహిత్యం?
ఏ జన్మల పాపమీ చిత్రం?
ఏం చేస్తాం? ఏమీ చెయ్యలేం!!
----------------------------------------------------------
రచన - భరద్వాజ్,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment