మేధకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిళ్లు
సాహితీమిత్రులారా!
మెదడుకు ఉత్తేజాన్నిచ్చి, మేధ (intelligence)కు పదును పెట్టే ప్రక్రియ క్రాస్ వర్డ్ పజిల్. మతిమరుపు ముఖ్య లక్షణంగా గల Alzheimer’s disease ఈ రోజుల్లో ఎందరినో పట్టి పీడిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాని బారిన పడకుండా వుండాలంటే ప్రతిరోజూ సుడోకు, క్రాస్ వర్డ్ మొదలైన పజిళ్లను పూరించడం, కొత్త భాష(ల)ను నేర్చుకోవడం, శాస్త్రీయ సంగీతాన్ని వినడం, ఎడమ చేతితో దంతాలను బ్రష్ చేసుకోవడం, అరికాలునూ పాదాల వేళ్లనూ అన్ని దిక్కుల్లో వంచుతూ ఓ ఐదు నిమిషాల సేపు చిన్న వ్యాయామం చేయడం – ఇవన్నీ అవసరమని వైద్యశాస్త్రం చెప్తోంది. ప్రామాణికమైన క్రాస్ వర్డ్ లను పూరించడం మెదడుకు మేలును కలిగిస్తుందనటంలో అనుమానం లేదు. భౌతికమైన వ్యాయామం చేస్తే కండరాలు పెరిగినట్టే, మెదడును ఈ రకమైన వ్యాయామానికి గురి చేస్తే మెదడులోని నాడీకణాలు వృద్ది చెందుతాయని పరిశోధన ద్వారా రుజువైంది.
దాదాపు నలబై సంవత్సరాల క్రితం జ్యోతి మాసపత్రికలో శ్రీశ్రీ గారు నిర్వహించిన ‘పదబంధ ప్రహేళిక’ చాలా ప్రామాణికంగా, జటిలంగా ఉండేది. తర్వాత ఆ శీర్షికను ఆరుద్ర గారు కొంతకాలం పాటు కొనసాగించారు. అంతకన్న దాదాపు పది సంవత్సరాల ముందు – అంటే 1965 ప్రాంతంలో – వీటికన్న తక్కువ ప్రమాణికత ఉన్న క్రాస్ వర్డ్ ఒకటి ‘పుస్తక ప్రపంచం’ అనే పత్రికలో వచ్చేది. నాకు జ్ఞాపకమున్న మొట్టమొదటి క్రాస్ వర్డ్ అదే. 2007 – 2011 ప్రాంతంలో ‘పొద్దు’ ఇంటర్నెట్ పత్రికలో ధారావాహికంగా వచ్చిన పజిళ్లు కూడా చాలా వరకు ప్రమాణికతను కలిగి ఉన్నవే. ఈ రోజుల్లో మన తెలుగు పత్రికలలో వస్తున్న క్రాస్ వర్డ్ లు చాలా సులభమైనవి కనుక, వాటిని పూరించడం వలన మెదడుకు అంతగా వ్యాయామం ఉండదు. జటిలమైన పజిళ్లు సాధారణ పాఠకులకు విసుగును తెప్పిస్తాయి కనుక, వాటికి ఆదరణ తక్కువ. అందుకే వాటిని ప్రచురించడానికి పత్రికలు జంకుతాయి.
ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ ల విషయానికి వస్తే, న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ కు అన్నిటికన్న ఎక్కువ జటిలమైనదనే పేరుంది. దాన్ని వదిలేస్తే, నేను చూసినంత వరకు ఇంగ్లిష్ , తెలుగు రెండు భాషల్లో కలిపి చూసినా The Hindu పత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ అన్నిటికన్న జటిలమైనదే కాక, ఎంతో thrill ను ఇచ్చే పజిల్. అయితే క్రాస్ వర్డ్ పూరణకు సంబంధించిన కిటుకులు తెలిస్తే తప్ప హిందు పత్రికలోని పజిల్ను పూరించడం చాలా కష్టం. అవి తెలియనప్పుడు భాష ఎంత బాగా వచ్చినా లాభం లేదు. ఇంగ్లిష్ లో కానీ, తెలుగులో కానీ ఈ పజిళ్ల క్లూలు (ఆధారాలు) రెండు రకాలుగా ఉంటాయి. నేరుగా ఉండే ఆధారాలు (డైరెక్ట్ క్లూస్) మొదటి రకం. ఇక్కడ సాధారణంగా ఆధారంలో ఒకటే పదం ఉండి, దానికి సమానార్థక పదం సమాధానంగా ఉంటుంది. ఇక రెండవ రకం ఆధారాలను cryptic clues (నిగూఢ ఆధారాలు) అంటారు. ఇవి వాక్యాల రూపంలో ఉండి, డైరెక్టుగా ఉండక చాలా తికమక పెడతాయి. కాని సరైన సమాధానం దొరికితే గొప్ప thrill కలుగుతుంది. ముందు ఆంగ్ల పజిళ్ల గురించి చెప్పి, తర్వాత తెలుగు పజిళ్లకు వస్తాను.
హిందులో వచ్చే క్రాస్ వర్డ్ ను శ్రీశ్రీ గారు ప్రతిరోజూ ఉదయం కాఫీ తాగేటప్పుడు పూరించానికి ప్రయత్నించేవారట. హిందు క్రాస్ వర్డ్ లో ఉండే ఆధారాలలో దాదాపు వంద శాతం cryptic (నిగూఢ) రకానికి చెందినవే కాబట్టి, ట్రిక్స్ తెలియకుంటే ఆంగ్లభాష బాగా వచ్చినవాళ్లు కూడా చాలా మంది ఒక్కటంటే ఒక్క ఆధారానికి సైతం సమాధానం చెప్పలేకపోవచ్చు. ఆ ఆధారాలు ఎలా ఉంటాయో తెలుపడానికి ఈ కింద కొన్ని ఉదాహరణలిచ్చి, వాటికి సమాధానాలను వివరిస్తాను. బ్రాకెట్లలో ఉన్నది సమాధానంలోని అక్షరాల సంఖ్య. పాఠకులు సులభంగా అర్థం చేసుకోవడం కోసం కొన్ని కీలకమైన అక్షరాలను bold font లో ఇస్తున్నాను. కాని, పజిళ్ల ఆధారాలను అచ్చు వేసినప్పుడు అవి ఈ విధంగా red bold font లో ఇవ్వబడవు.
1. Flower in my control (7)
దీనికి సమాధానం mastery. ఎట్లా అంటే, my అనే పదంలో aster (ఒక పువ్వు పేరు)ను చొప్పించాలి. అంటే m ను ఒక చివరన y ని మరొక చివరన వుంచి, మధ్య aster ను పెట్టాలన్న మాట. అప్పుడు mastery వస్తుంది. Mastery అన్న పదం control కు సమానార్థకం కదా!
2. Run and fall in Karnataka (3)
దీనికి సమాధానం jog. వివరణ చూడండి. Jog (జాగ్) అంటే run (పరుగెత్తడం). ఇక Jog (జోగ్) అన్నది జలపాతం (fall = waterfall) కూడా. ఇది కర్ణాటక రాష్ట్రంలో వుంది!
3. Edward got ten by ten to project (6)
దీనికి సమాధానం extend. ఎలాగంటే, Edward కు Ed ను short form గా తీసుకోవాలి. ఆ రెండు అక్షరాలను దూరంగా వుంచి, వాటి మధ్యన xten ను చొప్పించాలి. రోమన్ సంఖ్యల ప్రకారం X అంటే పది. తర్వాత మరొక పదికి ten ను అలాగే పెట్టాలి. Extend అన్నా project అన్నా ఒకటే (చొచ్చుకుని బయటికి రావడం).
4. They take pictures – hundred and a thousand times (7)
దీనికి సమాధానం cameras. రోమన్ సంఖ్యల ప్రకారం C = 100, M = 1000, eras = times. ఈ సమాధానంలో, ఆధారంలోని a ను ఉన్నదున్నట్టుగానే c తర్వాత వుంచాలి.
5. Wander with or without Right (5)
దీని సమాధానం amble. ఎట్లా అంటే, wander = తిరగడం లేక నడవడం. దీనికి సమానార్థక పదం amble. ఇక్కడ చమత్కారమేమంటే with or without Right అన్నప్పుడు ఆధారంలోని Right కు మొదటి అక్షరమైన R ను తీసుకోవాలి. దాన్ని amble కు ముందు వుంచితే ramble వస్తుంది. అప్పుడు కూడా అర్థం మారదు. R ఉన్నా లేకపోయినా ఒకటే అర్థం అన్న మాట (Ramble అన్నా amble అన్నా నడవడం లేక తిరగడం)
6. Discovers Sun revolving around a planet (7)
దీనికి సమాధానం unearths. ఇక్కడ earth ఒక planet కనుక, ఆ పదం చుట్టూ Sun లోని మూడక్షరాలను అమర్చాలి. అయితే ఇక్కడ Sun అని కాక, uns అని చేర్చాలి. ఇక unearths = discovers.
7. Some walk in grass and see a person of royal origin (4)
దీనికి సమాధానం king. హిందు క్రాస్ వర్డ్ లోని ఆధారాలలో ఎక్కడైనా some అని వస్తే సాధారణంగా సమాధానం నేరుగా (ఎటువంటి మార్పు లేకుండా) ఆ ఆధారంలోనే వుంటుంది. అయితే అది ఒకే పదంగా కాక, దానిలోని అక్షరాలు రెండు లేక మూడు పదాలలో వ్యాపించి ఉంటాయి. ఈ ఆధారంలో walk లోని చివరి అక్షరం, grass లోని మొదటి అక్షరం, ఆ రెండింటి మధ్య in ను తీసుకోవాలి. అంటే సమాధానం మనకు en-bloc గా దొరికిందన్న మాట.
8. Beginners in empirical research role often repeat this mistake (5)
దీనికి సమాధానం error. ఇక్కడ beginners అంటే రాబోయే పదాలను ప్రారంభించే అక్షరాలు అని అర్థం చేసుకోవాలి. Empirical, research, role, often, repeat – ఈ పదాల మొదటి అక్షరాలను కలిపితే error వస్తుంది. అది mistake కు సమానం.
9. Nasty agreement to disown male adolescent (8)
దీనికి సమాధానం teenager. ఇక్కడ agreement లోంచి m అనే అక్షరాన్ని తొలగించి (disown చేసి), మిగిలిన అక్షరాలను తారుమారు చేయగా teenager వస్తుంది. అది adolescent కు సమానం. Nasty అంటేనే తారుమారైన అని అర్థం చేసుకోవాలి. ఒక పదంలోని అక్షరాలను తారుమారు చేసి సమాధానాన్ని పొందటం చాలాసార్లు అవసరమౌతుంది క్రాస్ వర్డ్ పజిళ్లలో. వీటిని anagrams అంటారు. ఉదాహరణకు lived – devil, Nepal – panel, ruminates – anti serum, amusing or – ignoramus మొదలైనవి.
10. After removing the tail, sear and eat fish (7)
దీనికి సమాధానం sardine. ఎట్లా అంటే, the అనే పదానికి tail (తోక) అయిన e ని sear లోంచి తీసేస్తే sar మిగులుతుంది. దాని పక్కన eat కు సమానమైన dine ను చేర్చాలి. అప్పుడు sardine వస్తుంది. అది ఒక చేప రకం పేరు!
11. Money holders with everyone set out (7)
దీనికి సమాధానం wallets. ఆధారంలో ఉన్న with అనే పదంలోని మొదటి అక్షరమైన w ను తీసుకుని, దానిపక్కన everyone కు సమానమైన all నూ, తర్వాత set ను తారుమారు చేయగా వచ్చిన ets నూ చేర్చితే wallets వస్తుంది. వాలెట్స్ (పర్సులు) మనీ హోల్డర్సే కదా.
12. Hit the French and get a glass ring (6)
దీనికి సమాధానం bangle. Hit = Bang. ఇక the కి le తీసుకోవాలి (ఫ్రెంచ్ భాషలో the ని Le, Les అంటారు). Bangle = Glass ring.
అదే విధంగా sailor కు ab (Able Bodied men కు short form), work కు op (సమానార్థక పదమైన operation లోని మొదటి రెండక్షరాలు), worker కు ant, ship కు SS, the Spanish కు el, doctor కు MO లేక MB, bachelor కు BA, politician కు MP, student కు L (Learner లోని మొదటి అక్షరం), father కు pa, m other కు ma – ఇట్లా లెక్కలేనన్ని సంకేతాక్షరాలు, పదాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో అవి సంకేత పదాలు అని నిఘంటువులలో ఇవ్వబడదు. మరి ఆ విషయం మనకు ఎట్లా తెలియాలి అంటే క్రాస్ వర్డ్ లను పూరించడంలో అనుభవం ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి. క్రాస్ వర్డ్ లను గురించిన పుస్తకాలలో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉండవచ్చు. లేదా ప్రతిరోజూ క్రాస్ వర్డ్ ను నింపటానికి ప్రయత్నం చేస్తూ, అంతకు ముందురోజు ఇవ్వబడిన పజిల్ సమాధాలను జాగ్రత్తగా పరిశీలించి కొత్త సంకేతాక్షరాలను, పదాలను నేర్చుకోవాలి.
13. Slight deficiency in a hormone (7) అనే ఆధారానికి insulin ఎట్లా సమాధానం అయిందో తెలుసుకోవడానికి తలను బద్దలు కొట్టుకోవాల్సివచ్చింది. ఇక్కడ slight అంటే కొంచెం అని కాక, అవమానించుట/అవమానం అనే అరుదైన మరో అర్థాన్ని తీసుకోవాలి. దానికి సమానార్థక పదం insult. అయితే deficiency (కొరత) ఉన్నదంటున్నారు కనుక, ఒక అక్షరాన్ని (ఇక్కడ చివరి అక్షరమైన t ని) తీసేయాలి. అప్పుడు insul మిగులుతుంది. ఆధారంలో ఉన్న in ను అలాగే ఉంచి కలపాలి. అప్పుడు insulin వస్తుంది. ఇది రక్తంలోని గ్లూకోజును నియంత్రించే ఒక హార్మోను! చూశారా, దీంట్లో ఎంత తిరకాసు వుందో.
14. Sultana’s odd, substituting king with knight (5). ఇది మరొక క్లిష్టమైన ఆధారం. దీనికి సమాధానం queen. ఎట్లా అంటే, odd కు సమానార్థక పదం queer. ఆ పదంలోని చివరి అక్షరమైన r రాజును సూచిస్తుంది (Royal, regal అనే పదాలలోని మొదటి అక్షరం R కనుక). Queer లోని r ను తొలగించి దాని స్థానంలో knight లో ఉచ్చారణపరంగా మొదటి అక్షరమైన n ను పెట్టాలి. అప్పుడు queen వస్తుంది. సుల్తానా అంటే ముస్లిమ్ రాణి కదా! ఇక్కడ Sultana’s అంటే Sultana is అన్న మాట. హిందు క్రాస్ వర్డ్ లో ఇంతకన్న ఎక్కువ క్లిష్టమైన ఆధారాలు కూడా వుంటాయి. వాటిని చర్చిస్తే మెదడు విపరీతంగా వేడెక్కిపోతుంది.
హిందు క్రాస్ వర్డ్ లోని ఆధారాలలో ఇవ్వబడే చాలా పదాలకు సాధారణ అర్థమున్న పదాలను కాక, అరుదైన అర్థమున్న పదాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు writer అన్నప్పుడు రచయిత అని కాక pen అనే పదాన్ని (that which writes) తీసుకోవాలి. Pen అన్నప్పుడేమో కలం అని కాక sty (పందుల దొడ్డి)ని తీసుకోవాలి. Rail అన్నప్పుడు రైలు/పట్టా అని కాక shout/ rant (కోపంతో అరచుట)ను, see అన్నప్పుడు look/behold అని కాక eye ని (క్రియాపదాన్ని), locks అన్నప్పుడు తాళాలు అని కాక hair ను (side locks = side hair) తీసుకుని ఉపయోగించాలి. అదే విధంగా will అన్నప్పుడు దాన్ని helping verb గా కాక, వీలునామా అనే అర్థంలో తీసుకోవాలి. Retire ను ఉద్యోగ విరమణ చేయడం అనే అర్థంలో కాక, sleep (రాత్రి పూట నిద్ర పోవటం) ను తీసుకోవాలి.
తెలుగు పజిళ్లలో anagrams కాని, అటువంటి పదాలున్న ఆధారాలను కాని, ఇచ్చినప్పుడు తారుమారైన, కకావిలైన, తలక్రిందులైన, అస్తవ్యస్తమైన, అయోమయమైన, గజిబిజిగా – ఇట్లాంటి పదాల ద్వారా సూచన ఇవ్వబడుతుంది. కాని, హిందు క్రాస్ వర్డ్ లో కొన్నిసార్లు అటువంటి సూచన ఏమీ ఉండదు. మనమే ఊహించి తదనుగుణంగా పజిల్ పూరణ చేసుకోవాలి.
ఇటువంటి వివిధ రకాల విన్యాసాలతో, చమత్కారంతో కూడిన ఆధారాలుంటాయి హిందు క్రాస్ వర్డ్ లో. ఒక్కటి మాత్రం తప్పక గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే, ఆధారాలలోని వాక్యాలు ఇచ్చే అర్థం ప్రకారం సమాధానం వెతికితే పజిల్ను అసలే పూరించలేము. దానికి బదులు వాక్యపు అర్థాన్ని పూర్తిగా మరచిపోయి, ఆధారంలోని కీలక పదాన్ని గుర్తు పట్టి, దానికి సమానార్థక పదాన్ని ఆలోచించాలి. ఈ కీలక పదం సాధారణంగా ఆధారంలోని మొట్టమొదటి పదం కాని, చివరి పదం కాని అయి వుంటుంది.
***
ఇక తెలుగు పజిల్స్ కు వద్దామా?
శ్రీశ్రీ తయారు చేసిన ఆధారాలు కొన్ని మాత్రమే జ్ఞాపకమున్నాయి నాకు. వాటిని ఈ కింద ఇస్తున్నాను.
1. ఒకటి, ఇంకొకటి, మరొకటి (1, 1, 1)
దీనికి సమాధానం టి, టి, టి. వివరణ అవసరం లేదనుకుంటాను.
2. విరోధాలు (రాత్రికా?) (3)
దీనికి సమాధానం పగలు. శత్రుత్వాలు అన్నది ఒక అర్థమైతే daytime అన్నది మరొక అర్థం. ఇక్కడ చమత్కారమేమంటే పగలు (daytime) రాత్రికి విరోధం లేక వైరుధ్యం (opposite) కూడా!
3. ఆవాలు (1, 1, 1, 1)
దీనికి సమాధానం వా, వా, వా, వా. దీనికి కూడా వివరణ అవసరం లేదనుకుంటాను.
4. పొట్టితనం (x గాడిదా?) (4)
దీనికి సమాధానం వామనత. ఇందులో విశేషమేమీ లేదు. కాని, ఒక విలక్షణమైన చమత్కారం వుంది. అదేమిటంటే నిజానికి x స్థానంలో ఆ రోజుల్లో తన శత్రువైన ఒక ప్రసిద్ధ వ్యక్తి పేరును పెట్టాడు శ్రీశ్రీ. ఆ వ్యక్తి పొట్టిగా ఉంటాడు. ఇక్కడ ‘గాడిదా?’ ను రెండు రకాలుగా explain చేయవచ్చును కదా.
5. ఒకటికన్న రెండు నయం (3).
దీనికి సమాధానం తలలు. అయితే దీని గురించి పెద్ద దుమారం చెలరేగింది. ఇంత జటిలమైన ఆధారాన్నివ్వడం అన్యాయం, అసమంజసం అని పాఠకులు గగ్గోలు పెట్టారు. ఈ ఆధారానికి తలలు అనే సమాధానం ఎట్లా వస్తుందంటే, Homer రాసిన Iliad అన్న గ్రంథంలో Two heads are better than one అనే సామెత లాంటి ప్రసిద్ధ వాక్యం ఒకటి వుంది. దాని అర్థం ప్రకారం ‘తలలు’ సరైన సమాధానమే. క్రాస్ వర్డ్ ను పూరించటంలో కూడా ఒకటికన్న రెండు తలలు నయం అనే సూత్రం బాగా వర్తిస్తుంది సుమండీ – ముఖ్యంగా ఆ రెండు తలలు క్రాస్ వర్డ్ ను పూరించటంలో అనుభవాన్ని కలిగినవి అయినప్పుడు!
ఇక ఈ వ్యాస రచయిత చాలా కాలం క్రితం కలంపేరుతో కాక తన అసలు పేరుతో ‘రచన’ మాసపత్రికలో నాలుగైదు సంవత్సరాల పాటు పజిలింగ్ పజిల్ అనే పెద్ద (చాలా గడులున్న) క్రాస్ వర్డ్ ను నిర్వహించినప్పుడు తయారు చేసి ఉపయోగించిన ఆధారాలలోంచి కొన్నిటిని ఉదాహరిస్తాను.
1. బీరువాలో ఉండేవి. నాలుగుంటే రెండవుతాయి. (3)
దీనికి సమాధానం అరలు. అరలు అంటే సొరుగులు అనే కాక, సగాలు (½ లు ) అనే మరో అర్థం వుంది. నాలుగు సగాలు 2కు సమానం అవుతాయి కదా!
2. హణ హణ హణ హణ హణ తర్వాతది అధిరోహించడం (4)
దీనికి సమాధానం ఆరోహణ. ఎట్లా అంటే, ఆధారంలో ఐదు హణలు ఇచ్చి తర్వాతది అడగబడింది. ఐదు హణల తర్వాత ఆరవ లేక ‘ఆరో’ హణ వస్తుంది. ఆరోహణ అంటే అధిరోహించడం.
3. వార్తా పత్రిక – సత్రములో వెనక్కి పరచామా? (4, 3)
దీనికి సమాధానం సమాచార పత్రము. ‘స’ ను ఎడమ వైపు, ‘త్రము’ను కుడివైపు దూరంగా వుంచి మధ్యన ‘పరచామా’ అనే అక్షరాలను వెనక్కి (అంటే రివర్స్ ఆర్డర్లో) అమర్చితే సమాచార పత్రము వస్తుంది.
4. నీ వార ఫలాలు ఫరవా లేదు, మణులు రావచ్చు. (3)
‘నీ వారఫలాలు’ లోంచి ‘ఫరవా’ తీసేస్తే నీలాలు మిగులుతుంది. నీలాలు ఒక రకమైన మణులు కనుక, అదే జవాబు.
5. పవిత్ర నది కోసం మంచి ప్రారంభానంతరం దానికి సవరణ చెయ్యాలి. (4)
మంచి ప్రారంభం అంటే మంచి అనే పదంలోని మొదటి అక్షరం ‘మం’ అన్న మాట. తర్వాత దానికి అన్న పదాన్ని ‘దాకిని’గా మార్చి కలిపితే మందాకిని వస్తుంది. అది పవిత్ర నది.
6. తదుపరి చారి కట్టబోయే దాంట్లో దాగివున్న సేవకురాలు. (5)
ఇక్కడ సమాధానమైన ‘పరిచారిక’ ఆధారంలోనే en- bloc గా దాగివుంది.
7. చిత్తూరు పొలిమేరల నడుమ తారుమారై కూలు బాలాజీ గుడి ఉన్న ప్రసిద్ధ క్షేత్రం (4)
ఇక్కడ చిత్తూరు అనే పదంలోని రెండు చివరలైన చి,రు పొలిమేరలన్న మాట.వాటి మధ్యన తారుమారైన ‘కూలు’ ను – అంటే ‘లుకూ’ను – ఉంచితే చిలుకూరు వస్తుంది!
8. అర్ధరాత్రికి గంటన్నర ముందు అడ్డదిడ్డంగా పన్నదిర! (4)
అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల సమయం. దానికి గంటన్నర ముందు అంటే పదిన్నర కదా. ‘పన్నదిర’ అడ్డదిడ్డంగా ఉన్నది కనుక దాన్ని సరి చేస్తే ‘పదిన్నర’ వస్తుంది!
9. స్పర్ధ కోసం నడుమ లేకుండా అట్నుంచి టీ తేపో. (2)
ఇక్కడ పోటీ అన్నది సమాధానం ఎలా అయిందంటే, ‘టీ తేపో’ లోని మధ్య అక్షరమైన ‘తే’ ను తీసేసి రివర్స్ చెయ్యాలి. స్పర్ధ అంటే పోటీ అని అర్థం.
10. తలకిందులైన నావ చుట్టూ పలు గాలులు (4)
ఇక్కడ నావను తలకిందులు చేస్తే ‘వనా’ వస్తుంది. దానికి అటూ యిటూ ‘పలు’ అమర్చితే పవనాలు వస్తుంది. కనుక అదే సమాధానం. దీన్ని నిలువు ఆధారాలలో ఒకటిగా ఇస్తే బాగుంటుంది.
11. తెలివి లేనివాడు అని లోపల జ్ఞానం సగమే ఉంటుంది. (3)
‘అని’ లోపల జ్ఞానంలోని సగమైన ‘జ్ఞా’ను చేర్చితే అజ్ఞాని వస్తుంది. అదే సమాధానం.
12. పాక్షికమైన పలవరింత తర్వాత కొంత కాలానికి మాట్లాడాలా? (4)
పలవరింత పాక్షికమే కనుక ‘పల’ మాత్రమే తీసుకోవాలి. దాని తర్వాత ‘కాలానికి’లో కొంత (కాలా) మాత్రమే తీసుకుని కలపాలి. అప్పుడు పలకాలా (మాట్లాడాలా) వస్తుంది.
13. తలుపేసి నడుమ తారుమారుగా తలకెక్కేవి. (2)
దీనికి పేలు సమాధానం ఎలా అంటే, తలుపేసి అన్న పదం మధ్యన పేలు తారుమారై వుంది.
14. నా నా నా – ఇట్లాంటివి నూరు నమస్కారాలు. (4)
నా అనే అక్షరాలు నూరు (వంద) – అంటే వందనాలు అనే కదా. అదే సమాధానం.
15. వేరు మూల్యం యావత్తు పోయింది. (2)
ఇక్కక వేరుకు సమాన పదమైన మూలం సమాధానం. ‘మూల్యం’లోంచి ‘యా’వత్తు పోయిందన్న మాట!
ఈ విధంగా ప్రామాణికమైన, జటిలమైన క్రాస్ వర్డ్ లను ప్రతిరోజు నింపటానికి ప్రయత్నిస్తే మెదడుకు మంచి వ్యాయామం దొరికి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ వ్యాసం ఒకరిద్దరికైనా స్ఫూర్తిని కలుగజేసి క్రాస్ వర్డ్ పట్ల ఆసక్తిని పెంచితే ఈ వ్యాసకర్త ధ్యేయం నెరవేరినట్టే.
----------------------------------------------------------
రచన - ఎలనాగ,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment