పాత తెలుగు క్రాస్ వర్డ్ లలోని ఉత్కృష్ట ఆధారాలు
సాహితీమిత్రులారా!
పాత తెలుగు క్రాస్ వర్డ్ లు అంటే వెంటనే మనసులో మెదిలేవి శ్రీశ్రీ గారి పదబంధ ప్రహేళికలు. అవి ప్రమాణికతతో కూడుకున్నవి కావటమే అందుకు కారణం. తర్వాత ఆరుద్ర గారి పదబంధ ప్రహేళికలు గుర్తుకొస్తాయి. ప్రధానంగా శ్రీశ్రీ గారు రూపొందించిన ఆధారాలను పరిశీలించి, వాటికి వివరణలను ఇవ్వటం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. వాటిని కింద ఇస్తున్నాను. చదివి ఆనందించండి.
1.ఆడదాని ఆద్యంతాలు కెరటం (2)
దీనికి సమాధానం అల. ఎలా అంటే, ఆడది = అబల. ఆద్యంతాలు అంటే అబలలోని మొదటి అక్షరమైన ‘అ’ను, చివరి అక్షరమైన ‘ల’ను తీసుకోవాలి. రెండింటిని కలిపితే అల వస్తుంది.
2. కవిత్వం మధ్య నునుపులు మొదలెట్టి ఆకర్ణించు (2)
కవిత్వం మధ్య అంటే కవిత్వం అనే పదంలోని మధ్య అక్షరమైన వి. నునుపులు మొదలు అంటే నునుపులు లోని మొదటి అక్షరమైన ను. వి + ను = విను = ఆకర్ణించు. కనుక, విను సమాధానం.
3. అనడు, కనడు, వినడు. అకవి లేడు, పో! (2)
అనడు, కనడు, వినడు – ఈ మూడు పదాలలోని మొదటి అక్షరాలు (అకవి) లేకుంటే ప్రతి పదంలో మిగిలేది నడు. నడు = పో కనుక, అదే సమాధానం.
4. చెడి పోయిన ఊళ్లలో వ్యాపార కేంద్రం (2)
డిపో అంటే వ్యాపార కేంద్రం కనుక, డిపో అన్నది సమాధానం. జవాబు అయిన ఈ పదం మొదటి రెండు పదాల మధ్య ఏ మార్పూ లేకుండా దాగివుంది.
5. కనుదెరచి చూడరా శిష్యా! కనబడుతుంది చక్రం (2)
ఇక్కడ చక్రం అంటే రాశిచక్రం లోని రాశి అన్న మాట. కనుక, అదే జవాబు. చూడరా శిష్యా మధ్య రాశి ఉన్నది కదా.
6. గురుతిడని చోట వెనక్కి చూసి పరిభ్రమించు (3)
పరిభ్రమించు = తిరుగు కాబట్టి, తిరుగు జవాబు. ఆధారంలోని మొదటి మూడక్షరాలను తిరగేస్తే (వెనక్కి చూస్తే) తిరుగు వస్తుంది.
7. ఇంటికి వింటికి కావాలి (2)
వింటికి (విల్లుకు లేక ధనుస్సుకు) అల్లెతాడు ఉంటుంది కదా. దాన్ని నారి అంటారు. ఇక నారి అంటే ఇల్లాలు (స్త్రీ) అనే అర్థం కూడా వుంది. ఇల్లుకు కూడా నారి కావాలి కనుక, ఇక్కడ నారి జవాబు.
8. వంటింట్లోనూ వాటికన్ లోనూ (2)
పోప్ జాన్ పాల్ (Pope John Paul) గారు వాటికన్ లో ఉంటారు. వారిని తెలుగులో పోపు అనవచ్చు మనం. ఇక పోపు (తాలింపు) వంటింట్లో కూడా అవసరమే.
9. విరోధాలు (రాత్రికి కావచ్చు) (3)
విరోధాలుకు సమానార్థకమైన పగలు (శత్రుత్వాలు) సమాధానం. ఇక పగలు (daytime) అన్నది రాత్రికి విరుద్ధం. ఇదే ఈ ఆధారంలోని చమత్కారం.
10. పండు, నీళ్లలో కొట్టేది (2)
ఇక్కడ ఈత సమాధానం. ఈతపండు ఉంటుంది. నీళ్లలో కొట్టే ఈత (స్విమింగ్) కూడా ఉంటుంది.
11. విశ్వనాథ సత్యనారాయణలో ఉన్న రెండింటిలో ఒకటి మదీయం (1)
విశ్వనాథ లోని మూడవ అక్షరం నా. సత్యనారాయణ లోని మూడవ అక్షరం కూడా నా. మదీయం అంటే నా(యొక్క) కనుక, నా అనేది జవాబు.
12. వ్యధా రహిత వ్యవధానము; అదే అడవి, అదే నీరు (3)
వ్యవధానము లోంచి వ్యధా తీసేస్తే వనము మిగుల్తుంది. వనముకు అడవి, నీరు అని రెండర్థాలున్నాయి. జ = పుట్టినది. వనము(నీరు)లో పుట్టినది వనజము. అదే తామర పువ్వు. తామరపువ్వుల వంటి కన్నులు గలది వనజాక్షి (స్త్రీ).
13. ఎప్పుడూ హృదయం లేని సరదా (2)
ఎప్పుడూకు సమానార్థకమైన సదా ఇక్కడ సమాధానం. సరదా లోని మధ్య అక్షరం ర నట్టనడుమ ఉంటుంది కనుక, అది హృదయానికి సమానం. అందుకే సరదా మైనస్ ర = సదా. ఇంగ్లిష్ పజిళ్లలో మధ్య అక్షరాన్ని లేక అక్షరాలను సూచించడానికి essentially, at heart అనే పదాలను వాడుతారు.
14. లంక కొస నుండి లంక మొదటి దాకా; మధ్యని మధ్యకు ప్రారంభం. ఇదో పువ్వని వేరే చెప్పాలా? (3)
లంక కొస = క. లంక మొదలు = లం. మధ్యకు ప్రారంభం = మ. కలం మధ్యన మ చేరితే వచ్చే కమలం సమాధానం.
15. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు (2)
ఇది ప్రసిద్ధినీ, ప్రజాదరణనూ పొందిన ఆధారం. కష్టజీవి లోని మొదటి, చివరి అక్షరాలను కలిపితే కవి వస్తుంది. కవి అన్నవాడు ప్రజల పక్షం వహించాలని అన్యాపదేశంగా చెప్పబడిందిక్కడ.
16. కడుగడు; కడు విడు; మిగిలేది తల లేని అద్దె (2)
కడుగడు మైనస్ కడు = గడు. దాన్ని రివర్స్ చేస్తే డుగ వస్తుంది. అదే జవాబు. అద్దె = బాడుగ. తల (మొదటి అక్షరం) లేకుంటే డుగ వస్తుంది.
17. వారాలకు రాలలేని మాట. కావత్తు కావాలంటారు కొందరు (2)
వారాలకు మైనస్ రాల = వాకు. దీనికి కావత్తు కలిపితే వాక్కు వస్తుంది. వాక్కు = మాట. ఇక్కడ సమాధానం వాకు.
18. కల కతన మారిన పసిడి తీగ (3, 2)
కల కతనను తారుమారు/కలగాపులగం చేయగా వచ్చే కనకలత ఇక్కడ జవాబు.
19. కవిగారి తోక, తల; తరువాత తలకిందులు; చాంచల్యం (4)
కవి తోక = వి. కవి తల = క. ‘తల’కిందులు అంటే తలను తారుమారు చేయగా వచ్చే లత. వి + క + లత = వికలత = చాంచల్యం కనుక, వికలత జవాబు.
ఇట్లా, శ్రీశ్రీ గారి పజిళ్లలో word play, జటిలత్వం మరీ అంత ఎక్కువగా లేకపోయినా, అద్భుతమైన చమత్కారం ఉంటుంది అక్కడక్కడ. పాఠకులకు మరీ కొరుకుడు పడని ఆధారాలను తయారు చెయ్యడం ఆయనకు ఇష్టం లేకుండిందేమో అనిపిస్తుంది. తెలుగులో ప్రామాణిక పజిళ్లను ప్రవేశపెట్టిన శ్రేయస్సు శ్రీశ్రీ గారికే దక్కుతుంది.
‘ఈమాట’ అంతర్జాల పత్రికలో వస్తున్న ‘గడినుడి’ లోని ఆధారాలు కూడా చెప్పుకో తగినవే. అందులో ఇప్పటిదాక ఏడు పజిళ్లు వచ్చాయి. త్రివిక్రమ్, భైరవభట్ల కామేశ్వరరావు, కొల్లూరు కోటేశ్వరరావులు వీటి కూర్పరులు. అదే క్రమంలో ఒక్కొక్కరివి ఐదు చొప్పున ఆధారాలను వివరిస్తున్నాను.
1.వాడన పని చెడి కరువును తెచ్చింది (3, 2)
దీనికి సమాధానం పడని వాన. ఎలా అంటే, వాడన పని లోని అక్షరాలను కలగాపులగం చేస్తే పడని వాన వస్తుంది. అది కరువుకు కారణం కదా.
2. తిరుమాడ వీధుల్లో తిరిగొచ్చిన కోతి (3)
తిరిగొచ్చిన అంటే వెనక్కి వచ్చిన. అంటే రివర్స్ అయిన అన్న మాట. ఆధారంలోని మొదటి మూడక్షరాలను రివర్స్ చేస్తే మారుతి వస్తుంది. మారుతి అంటే హనుమంతుడు. కనుక, మారుతి సమాధానం.
3. నరసమాంబ తలలో మడత పడిన నాలుక (3)
ఇక్కడ తల అంటే మొదటి భాగమనుకోవచ్చు. మొదటి మూడక్షరాలను తారుమారు చేస్తే రసన వస్తుంది. రసన అంటే నాలుక కనుక, అదే జవాబు.
4. ఎలుక గుట్టుగా ఉండే చోటు (3)
గుట్టుగా అంటే నిగూఢంగా. ఆధారంలోని 2, 3, 4 వ అక్షరాలను తారుమారు చేయగా వచ్చే కలుగు ఈ ఆధారానికి సమాధానం.
5. నారిని లోభిగా మార్చే కంప్యూటరు (2)
ఇది చాలా మంచి క్లూ. కూర్పరికి మంచి ఊహాశక్తి ఉందన్న విషయాన్ని సూచిస్తుంది. పర్సనల్ కంప్యూటరుకు పి.సి. పొట్టిరూపం కదా. నారికి ముందు పిసిని కలిపితే పిసినారి వస్తుంది. కనుక, సమాధానం పిసి.
6. కసరత్తు సరిపాళ్లతో పిండి కలిపితే అమ్మవారి నైవేద్యం రెడీ.
ఇక్కడ సరిపాళ్లు అంటే కసరత్తు లోని 2, 4 వ అక్షరాలన్న మాట. 2, 4 సరి సంఖ్య (even number) కు చెందినవి. వాటిని కలిపితే సత్తు వస్తుంది. దీనికి పిండిని కలుపగా వచ్చే సత్తు పిండి సమాధానం.
7. వేరే ప్రశంస సరే, తీసి చూడు. లోపలి మార్గం కనిపిస్తుంది.
మొదటి ఐదు అక్షరాలలోంచి సరే తీసివేయగా మిగిలినదాన్ని మిశ్రమం చేస్తే వచ్చే ప్రవేశం ఇక్కడ సమాధానం.
8. ఒక పురుగు విషం కూడా శుభమే
ఇది మంచి క్లూ. దీనికి సమాధానం శ్రీ. శ్రీ అనే పదానికి (సాలె) పురుగు, విషం, శుభం అని అర్థాలున్నాయి.
9. ఇది ఆడవాళ్ల కేశపాశానికి ఉరి కాదు, ఆభరణం.
దీనికి జవాబు జడకుచ్చు. ఎలా అంటే, కేశపాశానికి అంటే జడకు. ఉచ్చు అంటే ఉరి. జడకుచ్చులు ఒక రకమైన ఆభరణాలు. వ్యుత్పత్తిని పరిశీలిస్తే, జడకు ఉచ్చు అనే అర్థం వచ్చే అవకాశం ఉన్నా, వాస్తవంలో జడకు + ఉచ్చు (జడకు ఉరి) కాదు అన్నది ఇక్కడి ధ్వని.
10. నందమూరి గోల చేస్తే టూకిగా అది రక్తభరిత సమరమే.
టూకీగా అంటే షార్ట్ ఫామ్ లో అన్న మాట. రక్త భరిత సమరమే – ఈ మూడు పదాల మొదటి అక్షరాలను కలిపితే వచ్చే రభస జవాబు.
11. అక్కడక్కడ వేలు మధ్యన చిక్కుకున్న శతకకారుడు (3)
వేలు మధ్యన – దీనిలోని 1, 3, 5 వ అక్షరాలను కలుపగా వచ్చే వేమన దీనికి జవాబు.
12. రకరకములైన తినుబండారాలు తింటుంటే తిరిగి వచ్చే ధ్వని (4)
ఇక్కడ తిరిగి వచ్చే అంటే రివర్స్ లో వచ్చే అన్న మాట. ఆధారంలోని మొదటి నాలుగు అక్షరాలను రివర్స్ చేస్తే వచ్చే కరకర జవాబు.
13. రాయలేని ఆటంకముతో చావు (3)
ఇది కొంచెం జటిలమైన ఆధారం. ఆటంకముకు సమానార్థక పదం అంతరాయము. ‘రాయలేని’ అని ఉంది కనుక, అంతరాయము లోంచి ‘రాయ’ను తీసివేయాలి. అట్లా చేస్తే అంతము మిగులుతుంది. అంతము అంటే చావు.
14. వాడు పట్టుకుని చెల్లాచెదురైతే ఇక బట్టలెవడు కుడతాడు? (6)
బట్టలెవడు కుడతాడు? అనే ప్రశ్నకు జవాబైన కుట్టుపని వాడు ఇక్కడ సమాధానం. ఆధారంలోని మొదటి ఆరు అక్షరాలను తారుమారు చెయ్యాలన్న మాట.
15. చేబదులు అక్కడక్కడ తీసుకుంటే రుచిగానే ఉంటుంది (2)
ఆధారంలోని 1, 3 వ అక్షరాలను కలుపగా వచ్చే చేదు ఇక్కడ జవాబు. కాని, చేదు రుచిగా ఉండదు కదా, అని సందేహం కలుగవచ్చు ఎవరికైనా. అయితే ఇక్కడి చమత్కారమేమంటే, చేదు షడ్రుచులలో ఒకటి. కాబట్టి, అది ఆరు రుచులలోని ఒకటి అని చెప్పటం.
ఇంకా వేరే పత్రికల్లో కూడా ఇటువంటి ఆధారాలతో కూడిన పజిళ్లు వచ్చి ఉండవచ్చు. కాని, అవి నాకు అందుబాటులో లేవు. పైగా అన్నింటినీ ఉదాహరించలేం కదా.
ఈ విధంగా తెలుగు క్రాస్ వర్డ్ వికసనం చెందుతున్నదని భావించవచ్చు. ఈ ప్రక్రియకు మరింత ప్రాచుర్యం, వైభవం దొరకాలని, ఆ దిశగా ప్రయత్నం చేసేందుకు కొత్త కూర్పరులు పుట్టుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.
----------------------------------------------------------
రచన - ఎలనాగ, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment