దారా షుకోయ్ (20 మార్చి 1615 – 9 సెప్టెంబర్ 1659)
సాహితీమిత్రులారా!
ప్రపంచానికి వెలుగు చూపించినవి ఉపనిషత్తులని మనం మురిసిపోవచ్చుగాని, బహుశా 4 వందల ఏళ్ళ క్రిందట ఒక మొగలాయీ యువరాజు, ముస్లిము మేధావి … లాహోరుకి చెందిన ప్రముఖ Qadiri Sufi Saint Hazrat Mian Miir శిష్యుడూ, 50 ఉపనిషత్తులని కాశ్మీరునుండి పండితులని రప్పించుకుని, స్వయంగానో, వారి సహాయంతోనో సంస్కృతం నుండి పెర్షియనులోకి అనువాదం చేసి ఉండి ఉండకపోతే, బహుశా ఈ నాటికీ అవి వెలుగుకి నోచుకుని ఉండేవి కావు… అని అంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతే కాదు, చక్రవర్తి అక్బరు అవలంబించిన పరమత సహనాన్ని బాహాటంగా సమర్థించి, ఆచరణలోచూపిన వాడు అతను.
అతని ఉపనిషత్తుల అనువాదాన్ని Sirr-e-Akbar (The Greatest Mystery) అని పిలిచేవారు. వాటి ఉపోద్ఘాతంలో అతను ధైర్యంగా ఖురానులో చెప్పిన Kitab al-maknun అన్న రహస్య పుస్తకం ఉపనిషత్తులే అని ప్రతిపాదిస్తాడు. సూఫీతత్త్వానికీ, హిందూవేదాంతములోని చింతనకి మధ్యగల సమసంబంధాన్ని అతని ప్రముఖమైన రచన Majma-ul-Bahrain (“The Confluence of the Two Seas”) లో నిరూపించడానికి ప్రయత్నిస్తాడు.
ఆ మొగలాయీ రాజకుమారుడు మరెవ్వరో కాదు … 1615 మార్చి 20న చక్రవర్తి షాజహాన్ – ముంతాజ్ బేగంలకు పుట్టిన తొలి మగబిడ్డ… దారా షుకోయ్. అంతవరకూ అందరూ ఆడపిల్లలే పుట్టేరని, సామ్రాజ్యానికి వారసులు లేరన్న బెంగతో 1615లో షాజహాన్ అజ్మీరులోని గొప్ప సూఫీ తత్త్వవేత్త హజరత్ మొయిహుద్దీన్ చిష్టీ సమాధిని దర్శించి కుమారుడిని అనుగ్రహించమని ప్రార్థించేడట.
మిగతా మొఘల్ రాజకుమారుల్లాగే, దారా ప్రాథమిక విద్య రాజదర్బారులోని మౌల్వీలకి అప్పచెప్పబడింది. వాళ్ళు అతనికి ఖురాను, పెర్షియను చరిత్ర, సాహిత్యం పరిచయం చేశారు. అతనికి ముఖ్య గురువు ముల్లా అబ్దుల్ లతీఫ్ సహ్రాన్ పురీ. అతను బాలుడైన దారాలో సూఫిజం పట్ల, అలౌకిక విషయాలపట్ల అంతులేని ఆర్తినీ, జిజ్ఞాసనీ రగిలించేడు. చిరుతప్రాయంలోనే దారాకి చాలా మంది హిందూ, ముస్లిం మార్మిక వాదులతో పరిచయం అయింది. అందులో కొందరి ప్రభావం అతనిమీద గాఢంగా పడింది. వాళ్లలో ముఖ్యులు లాహోరుకి చెందిన కద్రీ సూఫీ హజరత్ మియా మీర్ . తర్వాత దారా అతనికి శిష్యుడయ్యేడు. దారా కద్రి సూఫీగా మారిన తర్వాత, షా ముహిబుల్లా, షా దిల్ రుబా, షా ముహమ్మద్ లిసానుల్లా రోస్తగీ, బాబా లాల్ దాస్ బైరాగి, జగన్నాధ మిశ్రా వంటి ఎందరో పేరుపడ్ద హిందూ, ముస్లిం తాత్త్వికుల్ని కలుసుకున్నాడు. ఈ పరిచయమే అతనికి హిందూ, సూఫీతత్త్వాలలోని మార్మికతను అనుసంధానం చెయ్యాలన్న కోరిక కలిగింది.
ఈ ప్రయత్నంలో భాగంగానే, దారా హిందూ మతం గురించి తెలుసుకుందామని సంకల్పించాడు. కాశీలోని పండితుల సహకారంతో సంస్కృతం నేర్చుకున్నాడు. ఉపనిషత్తులని అనువాదం చేశాడు. తర్వాత గీత, యోగ వాసిష్ఠం కూడా అనువదించాడు. భగవంతుడొక్కడే అన్నది అతని ప్రాథమిక విశ్వాసం. హిందూ ఇస్లాం మతగ్రంధాల్లోని సారూప్యాలని బయటికి తీసి దాన్ని నిరూపించబూనడమే అతని ప్రయత్నంలోని అంతరార్థం.
పెర్షియనులో దారా చాలా కృషిచేసినప్పటికీ, ప్రస్తుతం కొన్నే లభ్యమవుతున్నాయి.
సూఫీ ధర్మాన్ని అవలంబించడంలోని వివిధ పద్ధతులగురించి చెప్పే Tariqat ul-Haqiqat అన్న అతని గ్రంధం ఉపోద్ఘాతంలో భగవంతుని సర్వశక్తిమంతత్వాన్నీ, సర్వవ్యాపిత్వాన్నీ పొగుడుతూ
“నువ్వు కాబాలోనూ ఉంటావు, సోమనాథ్ లోనూ ఉంటావు
నిన్ను గాఢంగా ప్రేమించే భక్తుల హృదయాలలోనూ ఉంటావు.”
అంటాడు
దారా షుకోయ్ భారతదేశపు విభిన్న మతాల సామరస్య సహజీవనానికి సహకరించగల మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హజరత్ మియామీర్ అమృతసర్ స్వర్ణదేవాలయానికి పునాదివేయడానికి ఆహ్వానించబడ్డాడంటే; ఉపనిషత్తులవంటి పుస్తకాలని పెర్షియన్, ఇంగ్లీషు, లాటిన్, జర్మన్ వంటి ఇతర భాషలలోకి అనువదించ ప్రయత్నాలు జరిగేయంటే (అక్బరుకాలంనుండీ), మేధావులు లౌకిక విషయాలకు కాకుండా తాత్త్విక విషయాలకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో మనం అర్థం చేసుకోవచ్చు. భిన్న సంస్కృతుల సహజీవనాన్నీ, భిన్నమతాల సమ్మేళనాన్ని ప్రోత్సహించగల భవిష్యత్తుకి ఆశాకిరణంగా భావించబడ్డాడు. అదే కారణంవల్ల మతఛాందసుల దృష్టిలోనూ, సింహాసనంచుట్టూ తిరిగే అధికార దళారీల దృష్టిలోనూ రాజ్యదాహంతో తండ్రిని కూడా పదభ్రష్టుణ్ణి చేసి జైలుపాలు చేసిన ఔరంగజేబుకి, అతను “మత ద్రోహి” అయ్యేడు.
సింహాసనంకోసం జరిగిన పోరాటంలో ఔరంగజేబుచేతిలో ఓడిన దారా, తనను తరుముకుంటూ వస్తున్న ఔరంగజేబునుండి రక్షణకు షాజహాన్ కోపం బారినుండి తను ఎన్నోసార్లు రక్షించిన ఆఫ్ఘను నాయకుడు మాలిక్ జీవన్ ని, ఆశ్రయిస్తే, అతను విశ్వాసఘాతం చేసి ఔరంగజేబుకి అప్పచెప్పడం వల్ల, ఢిల్లీ నగర వీధుల్లో సంకెళ్ళు వేయబడి ఏనుగుమీద ఊరేగింపబడ్డాడు. ప్రజలందరికీ ఎప్పుడైతే అతను ప్రీతిపాత్రుడయ్యాడో, అప్పుడే అతను మతఛాందసులకి కిట్టని వాడయ్యాడు. ఔరంగజేబు ఏర్పాటు చేసిన మతపెద్దల, రాజవంశీకుల సభ అతను రాజ్యంలోని ప్రశాంతతకి, భద్రతకీ ముప్పనీ, ఇతరమతాలతో పొత్తుకలిపిన అవిశ్వాసి అనీ తీర్పు ఇచ్చింది.
1659 సెప్టెంబరు 30 వ తేదీ రాత్రి, ఔరంగజేబు అనుచరులు దారాని అతని కుమారుడి సమక్షంలోనే హత్యచేశారు.
ఔరంగజేబుకి బదులు బహుశా దారా షుకోయ్ రాజ్యానికి వచ్చి ఉంటే, బహుశా భారతదేశపు ఇతిహాసం ఇంకోలా ఉండేదేమో!
ఇక్కడ మనం నేర్చుకోదగ్గ పాఠాలు చాలా ఉన్నాయి. రాజు తన రాజ్యంలోని అన్ని మతవిశ్వాసాలవారూ సామరస్యంగా బ్రతకడానికి కావలసిన పరిస్థితులు కల్పించాలి; అన్ని మతాలనూ సమదృష్టితో చూడగల తాత్త్విక పరిణతి కలిగి ఉండాలి; అంతేకాదు దాన్ని ఆచరణలో ప్రతిఫలించాలి. మనుషులకోసం మతంగాని మతంకోసం మనుషులు కాదన్నది తెలియాలి. కానీ, రాజ్యకాంక్షగలవారికి ఇవేవీ పట్టవు. వాళ్ళకి తమ అవసరాలే ముఖ్యమై, మతాలమధ్య సామరస్యతని, ప్రజలమధ్య ఐక్యతని “బూచి”లా చూపించి మనుషుల్ని విడగొట్టగల నేర్పు ఉంటుంది. అధికారానికి అడుగులకు మడుగులొత్తేవారెప్పుడూ తమ లాభంకోసం చూసుకుంటారు తప్ప, వ్యక్తిగత విలువలకుగాని, ప్రజా ప్రయోజనాలగురించిగాని ఎన్నడూ పట్టించుకోరు. రాచరిక వ్యవస్థలోనే ఇవి ఇలా ఉంటే, ప్రజా స్వామ్య వ్యవస్థలో అవి ఇంకా తీసికట్టుగా ఉంటాయి.
అయితే మనం ఎప్పుడూ ప్రతికూల విషయాలే కాదు, మంచిని చూడగలగాలి. మనుషుల్ని విడదియ్యడం సులువు. కలపడమే కష్టం. ఒక దేశం సమిష్ఠిగా సుభిక్షంగా ఉండాలంటే, మేధావి వర్గం క్రియాత్మకంగా ఈ పనికి పూనుకోవాలి.
దారా షుకోయ్ వంటి మేధావి తన జీవితంలో చాలా భాగాన్ని ఒక విషయం గురించి ధారపోసేడంటే, అతను ప్రజలందరికీ ఆమోదయోగ్యుడయ్యేడంటే, ఆ రోజుల్లో సామాన్య ప్రజల మానసిక పరిణతి మనం ఊహించవచ్చు. అధికారం కోసమో, మన వర్గానికి లాభం చేకూరుతుందనో మనం మనుషుల్ని చీల్చే వర్గాలకి చెయ్యి అందిస్తే, కొన్ని తరాల జీవితాలు అతలాకుతలం అయిపోతాయన్న విషయం మరచిపోకూడదు.
దారాదృష్టిలో దేముడంటే
హిందూ- ఇస్లాం మతాలలోని ఏకేశ్వరత్వాన్ని ఎంత చక్కగా దారా షుకోయ్ అక్షరబద్ధం చేశాడో గమనించండి. ఇందులో ఎక్కడా హిందూ అని గాని, ముస్లిం అని గాని అనలేదు. దేముడొక్కడే. దేముడుని నమ్మినపుడు అతను అన్ని జీవరాసుల్లోనూ కనిపిస్తాడు. మాలలూ జపమాలలూ అన్ని పైకి వేషాలు తప్ప అవి దేముడి దగ్గరకు తీసుకుపోయే సాధనాలు కావు. డబ్బు, బంగారం మీద వ్యామోహంతో మునిగిన ఆత్మకి మోక్షం లేదు. దేముడెక్కడో ఉన్నాడని వెతికే వాడికి జీవితాంతమూ వెతుకులాటే కాదు, చచ్చినా ఆ వెతుకులాట పోదు. దేముడిని తనలో తాను చూసుకున్నవాడే నిజమైన మోక్షం పొందగలడు.
ఇంతకంటే దేమునిగురించి మెరుగ్గా చెప్పగల నిర్వచనం ఉందా?
1. ఏకేశ్వరత్వం
నువ్వెటుచూడదలుచుకుంటే అటు చూడు, అంతటా అతనే
దేముని ముఖం నీకెప్పుడూ ఎదురుగానే ఉంటుంది.
అతను కానిది నువ్వేదిచూసేవనుకున్నా అది కేవలం నీ ఊహ.
అతని కాని వస్తువుల ఉనికి ఎండమావి లాంటిది.
భగవంతుని ఉనికి అంతులేని సముద్రం లాంటిది.
మనుషులు ఆ నీటిమీది ప్రతిబింబాలూ, కెరటాలవంటివారు
అతనికంటే భిన్నంగా నన్ను నేను ఊహించుకోనప్పటికీ,
నేను దేముణ్ణని మాత్రం అనుకోను.
నీటిబిందువుకి సముద్రంతో ఎటువంటి అనుబంధం ఉంటుందో
అది తప్ప, అంతకు మించి నా అనుబంధాన్ని తలపోయను .
ఏ అణువునీ సూర్యుడినుండి వేరుచేసి చూడలేము.
సముద్రంలోని ప్రతి నీటిబొట్టూ సముద్రంలోభాగమే
సత్యాన్ని ఏ పేరుపెట్టి మనం పిలవాలి?
ఉన్న పేర్లలో ప్రతీదీ దేమునికి చెందిందే.
2. మార్మిక మార్గము
దేముడిని తప్ప మరెవ్వరినీ శరణు కోరకు
జంధ్యాలూ, తావళాలూ లక్ష్యానికి సాధనాలు మాత్రమే
ఈ నియమనిష్టలన్నీ వట్టి బూటకం, కేవలం స్వాతిశయం.
భగవంతుడిని అవి ఎలా చేరువ చేస్తాయి?
రాజవడం సుళువు, ముందు పేదరికమేమిటో తెలుసుకో,
వానచినుకు సముద్రంగా మారగలిగినపుడు
ముత్యంగా ఎందుకు మారాలి?
బంగారం అంటిన చేతులే ముక్కవాసనవేస్తాయి గదా,
పాపం, బంగారం అంటుకున్న ఆత్మ గతి ఎలా ఉంటుందో కదా!
ప్రతిరోజూ ఏదో ఒక చావు వార్త వింటూనే ఉంటావు,
నువ్వు కూడా పోవలసిందే. ఐనా నీ ప్రవర్తన ఎంత చిత్రంగా ఉంటుంది!
బాటసారికి భుజం మీద బరువు ఎంత తక్కువుంటే
ప్రయాణంలో అతనికి అంత తక్కువ చింతలు ఉంటాయి.
నువ్వు కూడా ఈ ప్రపంచంలో బాటసారివే,
నీకు గాని తెలివి ఉంటే, ఇది సత్యమని తెలుసుకో.
నీలోంచి అహంభావాన్ని అవతలకి పారద్రోలు, ఎందుకంటే
గర్వమూ, దురహంకారంలా అదికూడా బరువే.
భూమి మీద బ్రతికినన్నాళ్ళూ, స్వతంత్రంగా జీవించు.
ఇదే కాద్రి హెచ్చరిక. గుర్తుంచుకో.
ఇది గుర్తుంచుకున్నవాడు, దినం తీర్చుకున్నాడు.
ఎవడు తననితాను కోల్పోయేడో, వాడు దేవుణ్ణి కనుగొన్నాడు .
ఎవడు దేముణ్ణి తనలోకాకుండా బయట వెతికేడో,
తనతో పాటే తన వెతుకులాటనీ వెంట తీసుకుపోయాడు.
కాద్రీ తను వెతుకుతున్న దైవాన్ని తనలోనే చూసుకున్నాడు
మంచి మనసు కలిగి ఉండడంతో దైవకృపకి పాత్రుడయ్యాడు.
నువ్వు ఏ వస్తువుని చూడు, అందులో అతను కనిపిస్తాడు.
నీకు కనిపించదా? మరి “నేనే దేవుడిని” అని చెప్పుకుంటావేం?
--------------------------------------------------------
రచన - నౌడూరి మూర్తి,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment