Friday, August 17, 2018

ఒకే కవిత నాలుగు అనువాదాలు!


ఒకే కవిత నాలుగు అనువాదాలు!





సాహితీమిత్రులారా!


కవిత్వం ఒక క్రియాత్మక వ్యవసాయం అనుకుంటే అందులో రెండు రకాలున్నాయి. ఒకతీ కవి స్వతహగా తన ప్రేరణతో రాసే కవిత్వం. రెండో రకం, అంతకంటే తక్కువ స్థాయిది అయినప్పటికీ, ఒక మూల భాషలోని సౌందర్యాన్ని తనకి ఒద్దికగా ఉన్న మరో భాషలోకి చేసే అనువాదం. అందుకే అనువాదాన్ని అనుసృజన అనవచ్చు. నిజానికి ప్రతి భాషలోను తొలుత వచ్చేవి అనువాదాలే. కారణం ఆ భాష ఇంకా స్థిరపడకపోవడం, అంతవరకు మరొక భాషతో కలిసి ఉన్న ఆ భాష తన అస్థిత్వాన్ని నిలుపుకోవడంలో భాగంగా సాహిత్య సృష్టి చెయ్యవలసిన అవసరం రావడం కొన్ని ముఖ్యమైన కారణాలు. అనువాదాల్లో మాతృకకి దగ్గరగా ఉన్నవి కొన్నయితే, కొన్ని కేవలం నామమాత్ర మూలకథనో, సంఘటననో సందర్భాన్నో తీసుకుని, కవి తన ప్రతిభతో రెండవభాషలో పూర్తిగా స్వయం ప్రతిపత్తి గల వస్తువుగా తీర్చిదిద్దడం. మూడవది మూలంలోని లోపాలను పరిహరిస్తూ, (సమకాలీన) ఔచిత్యానికి భంగం లేకుండా అనువాదం చెయ్యడం. ఇక్కడ సమకాలీన అని ఎందుకు అన్నానంటే, ఒక యుగంలో ఉండే రస ప్రమాణాలు మరొక యుగంలో ఎబ్బెట్టుగా మారిపోతుంటాయి.

అనువాదం చేసేటప్పుడు వచ్చే సమస్యల్లో పలుకుబడులు(usages), నుడికారాలు (idioms)సామెతలు (proverbs), సందర్భాలూ (contexts), చాలా ముఖ్యమైనవి. మానవ ఇతిహాసంలో భాషకి అతీతంగా అనుభవాలూ, ఆవేశాలూ సర్వ సామాన్యమైనప్పటికీ, మనిషి నివసించే పరిసరాలూ, సహజీవనం చేసే జంతుజాలాలూ, తినే పదార్థాలూ వేరవడం వల్ల, ఆయా వస్తువులు ఉపమానాలుగానో, రూపకాలుగానో ప్రతీకలై భాషలో కలిసిపోయినపుడు, వాటికి సమానమైనవి అనువాదభాషలో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో శబ్దాశ్రయమైన అనువాదం కంటే, భావాత్మకమైన అనువాదం పాఠకుడికి మూల భావాన్ని చేరవెయ్యడంలో ఉపకరిస్తుంది. నిజానికి ఏది మంచి అనువాదం అన్నది చెప్పడం ఎప్పుడూ కష్టమే! రెండూ మనసు రంజింపచెయ్యగలిగినప్పుడు.

అయితే, అనువాదాలు ఖచ్చితంగా చెప్పేది ఒకటుంది: ఒక కావ్యానికి ఎన్ని ఎక్కువ అనువాదాలు వస్తే, ఆ కావ్యం, అందులోని వస్తువూ కాలాన్ని అతిక్రమించి నిలబడగలుగుతున్నాయి; దాని relevance మనుషులు మారినప్పటికీ పోలేదు; అందులో ఏదో నిగూఢమైన సార్వజనీనత ఉంది.

అలాంటి కవిత నాకు అంతర్జాలం పుణ్యమా అని ఒకటి లభించింది. నిజానికి ఇందులోని రెండు అనువాదాలని తులనాత్మకంగా పరిశీలించడానికి ఒకరు దీని ఒక Website లో ప్రచురిస్తే, దాన్ని చదివిన ఇద్దరు అదే కవితకి తమ తమ అనువాదాలనుకూడా ప్రచురించారు స్పందనలో.
Du Fu లేదా Tu Fu ( 712- 770) చినీ కవిత్వానికి స్వర్ణ యుగంగా పిలవబడే Tang Dynasty కి చెందిన గొప్పకవులలో ఒకరు. ఆ కాలపు 300 కవితల సంకలనం ద్వారానే బాహ్య ప్రపంచానికి చీనీ కవిత్వం గొప్పదనం తెలిసింది. అది చైనాలో పిల్లలకు పాఠ్యభాగం. ఈ దిగువలింకులో మీకు మంచికవితలు దొరుకుతాయి: http://etext.lib.virginia.edu/chinese/frame.htm


విశాలప్రకృతిలో ఒక రాత్రి… తూ ఫూ, చీనీ కవి
తీరంవెంబడి పచ్చికపై పిల్లగాలి అలలుగా తేలియాడుతోంది
రాత్రల్లా, కదలని నా తెరచాప కొయ్యపైకి
ఆరుబయట ఆకాశంలోంచి చుక్కలు ఒద్దికగా వాలుతూనే ఉన్నాయి.
చంద్రుడు నది మీంచి గబగబా పరిగెత్తుకుని వచ్చేడు.
నా విద్య నాకు పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చి
ఈ వాటారిన వయసులో బాధ్యతలు తప్పించగలిగితేనా!
పరిగెడుతూ, పరిగెడుతూ, ఏమిటీ జీవితం,
ఈ అనంత విశ్వంలో ఎల్లమ్మ కాకిలా!
(అనువాదం: విటర్ బైనర్)

A Night Abroad
A light wind is rippling at the grassy shore….
Through the night, to my motionless tall mast,
The stars lean down from open space,
And the moon comes running up the river.
..If only my art might bring me fame
And free my sick old age from office! –
Flitting, flitting, what am I like
But a sand-snipe in the wide, wide world!
Du Fu / Tu Fu
(Translated by Witter Bynner, 1929)

రాత్రి ప్రయాణం
రెల్లు గడ్డి మీద పిల్లగాలి తేలిపోతోంది.
నేను ఒంటరిగా ఈ ఓడకొయ్యకి చేరబడ్డాను.
విశాలమైన మైదానం మీదకి చుక్కలు వాలుతున్నాయి
నదీ ప్రవాహంలో చంద్రుడు లోలకంలా ఊగుతున్నాడు
చదువు నాకు కీర్తి తెచ్చిపెట్టలేదు.
పదవులా? దానికి వయసు మించిపోయింది.
ఎటుపోతున్నానో తెలీని నా బతుకు ఏమిటి?
నింగీ నేలా మధ్య తిరుగాడే నీటికాకిలా.
(అనువాదం: విక్రం సేఠ్, 1992)

“Thoughts While Travelling at Night”
Light breeze on the fine grass
I stand alone at the mast.
Stars lean on the vast wild plain
Moon bobs in the great river’s spate.
Letters have brought no fame
Office? Too old to obtain.
Drifting, what am I like?
A gull between the earth and sky.
(Translation by: Vikram Seth, 1992)

రాత్రి ప్రయాణంలో ఆలోచనలు
నదీ తీరాన రెల్లు గడ్దిలో
చిరుగాలి సవ్వడి చేస్తోంది.
నా ఒంటరి పడవ తెరచాప
చీకటిలో ఉవ్వెత్తుగా ఎగురుతోంది.
విశాలమైన నీటి ఎడారిపై
చుక్కలు మెరుస్తున్నాయి. ఉరకలేస్తున్న
నీటితో వెన్నెలకూడా ప్రవహిస్తోంది.
నా కవిత్వం నాకు పేరు తెచ్చింది కాని,
నేను అలసి, వయసుడిగి, రోగాలతో
అటో ఇటో దూరంగా ఎక్కడికో కొట్టుకుపోతాను.
భీమికీ ఆకాశానికీ మధ్య
దారి తప్పిన నీటికాకిని నేను.
(అనువాదం: కెన్నెత్ రెక్స్ రాత్)

Night Thoughts While Travelling
A light breeze rustles the reeds
Along the river banks. The
Mast of my lonely boat soars
Into the night. Stars blossom
Over the vast desert of
Waters. Moonlight flows on the
Surging river. My poems have
Made me famous but I grow
Old, ill and tired, blown hither
And yon; I am like a gull
Lost between heaven and earth.

రాత్రి ప్రయాణంలో ఆలోచనలు
నదీ తీరాన చిరుగాలిరెల్లుగడ్డిని ఓలలాడిస్తోంది.
రాత్రి, ఒంటరిగా, నా పడవ
తెరచాపని చూస్తుంటే
దూరంగా పొలాల్లోకి
ఒక చుక్క పడిపోడం గమనించేను.
నిశ్చలంగా ఉన్న ఈ నది ముఖం మీదకి
చంద్రుదు మెల్లగా ఎగబాకుతున్నాడు.నేను కవిగా పేరుతెచ్చుకోలేకపోయాను
కనుక ఓ ముసలి రోగిష్టి ఉద్యోగిలా
నా ఉద్యోగాన్ని విరమించుకోవాలి.
ఎగురుతూ రెక్కలు కొట్టుకుంటూ
ముందుకీ వెనక్కీ గమ్యంలేకుండా
నా మనసు చక్కర్లు కొడుతోంది…
భూమికీ ఆకాశానికీ మధ్య
దారితప్పిన ఒంటరి నీటికాకిలా.
(అనువాదం : స్టేంటన్ హేగర్)
NIGHT THOUGHTS AS I TRAVEL
A gentle breeze sways the deep grass
along the riverbanks.
At night, alone, glancing at my boat’s
tall mast,
I spot a star plunging into a far-off field.
On the still face of the Yangtze, the
moon traces its slow ascent.
I’ve not made my mark as a poet, and
Should, like an old and ill official, retire
from my career.
Flapping and fluttering this way, that,
and back again,
My soul wheels in aimless circles,
a lost lone gull adrift
Between heaven and earth.
(Translation by: Stanton Hager)
---------------------------------------------------------
రచన - నౌడూరి మూర్తి, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

No comments: