Saturday, July 21, 2018

మాయమ్మాన సు నీవే (భాషాచిత్రం)


మాయమ్మాన సు నీవే (భాషాచిత్రం)



సాహితీమిత్రులారా!

నలుగురు కవులు ఓ రాజుని చూట్టానికి వెళ్తే ఒక మంత్రి వాళ్ళకి అడ్డు తగుల్తుంటాడు. ఇలా కాదని వాళ్ళు పల్లెటూరి వాళ్ళ వేషాల్లో ఆ రాజు దగ్గరికెళ్ళి ఓ పద్యం చెప్తారు

మాయమ్మాన సు నీవే
రాయలవై కావ దేవరా జేజేజే
మాయాతుమ లానిన యది
పాయక సంతోసమున్న ఫల మిలసామీ

చదువేమీ రాని వాళ్ళ మాటల్లా అనిపించే ఈ పద్యం నిజానికి తెలుగు పద్యం గానూ, సంస్కృత శ్లోకం గానూ కూడా చదువుకోవచ్చు. ముందుగా, తెలుగు పద్యానికి అన్వయం ఇది దేవరా, జేజేజే, ఇలసామీ (భూమిని పాలించే వాడా), నీవే రాయలవై కావ, సంతోసము, పాయక (విడవకుండా), మాయాతుమలు (మా ఆత్మలు), ఆనినయది (తాకింది), ఉన్నఫలము, మాయమ్మ, ఆన, సు!

ఇదే పద్యం సంస్కృతంలో ఐతే
హే, సునీవే (శుభప్రదమైన మూలధనము కలవాడా), ఆయమ్‌ (రాబడిని), మామాన (లెక్కపెట్టుకో వద్దు), అలవా (ముక్కలు కాని), రాః (ధనము), ఏకైవ (ఒక్కటే), అవత్‌ (కష్టాల్లో రక్షించేది);  అజేజే (యజ్ఞం చేసే), రాజే (రాజు కోసం), మా (లక్ష్మి), ఆయాతు (వస్తుంది), మలాని న (పాపాలు అంటవు); పాయక (ఓ రక్షకుడా), సః (మంచివాళ్ళు), యది (దర్శనానికొస్తే), అసముత్‌ (సంతోషం లేకుండా), నఫల (వాళ్ళని చూడకుండా ఉండొద్దు), మిల (వాళ్ళతో కలువు), అమీ (వచ్చిన మేము), సా (ఆ లక్ష్మీ దేవే అనుకో) ఇంత వ్యవహారం ఉంది ఆ చిన్ని కందంలో!

పింగళి సూరన ” కళాపూర్ణోదయం” లోనిది ఈ భాషాచిత్రం

No comments: