గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం
సాహితీమిత్రులారా!
రాష్ట్రకూట రాజవంశానికి చెందిన అమోఘవర్ష నృపతుంగ చక్రవర్తి పరిపాలించిన కాలంలో (క్రీ. శ. 814-877) వెలువడిన అలంకారశాస్త్రం కవిరాజమార్గం. ఇది కన్నడంలో లభ్యమైన మొట్టమొదటి గ్రంథం కావడం విశేషం. 1898లో కె. బి. పాఠక్ అనే పండితుడు మొదటిసారి ప్రచురించిన నాటినుండి కవిరాజమార్గం అనేక దేశవిదేశీయుల దృష్టినాకర్షించింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
సంస్కృత కావ్యశాస్త్రాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది కావ్యాదర్శం. క్రీ. శ. 6-7 శతాబ్దాలకు చెందిన దండి రాసిన ఈ అలంకారగ్రంథాన్ని ఆధారంగా చేసుకొని నృపతుంగ ఆస్థానకవి శ్రీవిజయుడు కవిరాజమార్గాన్ని రచించాడు. ఈ గ్రంథానికి మరో ఆధారం భామహుని కావ్యాలంకారం (క్రీ. శ. 6-7 శతాబ్దాలకు చెందింది). కవిరాజమార్గం అచ్చయి వంద ఏళ్ళు దాటినా ఆ గ్రంథానికి చెందిన అనేక ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. రాజకవి అయిన నృపతుంగుడే దాన్ని రచించాడని కొందరు భావిస్తే, ‘నృపతుంగుడి అనుమతితో ఇది రచితమైందని’ గ్రంథంలోనే ఉన్న ఆధారాన్ని బట్టి దీన్ని శ్రీవిజయుడనే కవి రాసి కవిరాజయిన నృపతుంగుని మార్గాన్ని లోకంలో ప్రచారం చేశాడని చాలామంది పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా భారతీయ భాషలలోనే కాక ప్రపంచ భాషల్లోనే కవిరాజమార్గం ఒక విశిష్ట శాస్త్ర గ్రంథమని చెప్పడానికి ఆస్కారం ఉంది. భారతీయ అలంకారశాస్త్ర సంప్రదాయాన్ని స్థానిక భాషలో పరిచయం చెయ్యడానికి పూనుకొని, తన భాష, సంస్కృతి, కావ్యసంప్రదాయం, జనుల రీతి నీతుల్ని చేర్చి తీర్చిదిద్దిన ఘనత శ్రీవిజయునిది. తమిళంలో తొల్కాప్పియమ్ ఇలాంటి గ్రంథమే. కానీ, అది తమిళాన్నే దృష్టిలో ఉంచుకొని రాసిన వ్యాకరణం. కొంతవరకూ ఇతర శాస్త్రాలకు సంబంధించిన విషయాలున్నా కవిరాజమార్గానికి ఉన్న వైవిధ్యం అందులో లేదు. కన్నడ గ్రంథానికున్న వైశిష్ట్యం ఏమిటంటే దాన్ని రచించిన కవికి భారతీయ అలంకార శాస్త్ర సంప్రదాయం మీద గౌరవం ఉంది. కన్నడ భాషా సంస్కృతుల మీద అపారమైన అభిమానం ఉంది. ఇలాంటి సామరస్యాన్ని సాధించడంలోనే ఈ గ్రంథం ప్రత్యేక గుణం వ్యక్తమవుతుంది.
ఈ రచనలో మొత్తం 536 పద్యాలున్నాయి. చాలా వరకూ కందపద్యాలే. శాస్త్రగ్రంథాలకు కందపద్యాన్ని వాడే అలవాటు తెలుగు వారికీ ఉండడం విశేషం. హితంగా, మితంగా చెప్పడానికి కందపద్యం అనువైనదని ఈ రెండు భాషలవాళ్లు భావించారు. అంతేకాదు, ఈ రెండు భాషల వారికీ సమానంగా ఉండే కొన్ని కావ్యపీఠికా సంప్రదాయాలు కవిరాజమార్గంతోనే ప్రారంభమయ్యాయి. కావ్యాన్ని శ్రీకారంతో ప్రారంభించడం; అందులోనూ నాంది పద్యంలాగా మొదటి పద్యాన్ని ఆశీర్నమస్క్రియలతో రచించడం; దేవతాస్తుతి, పూర్వకవి స్తుతి, సత్కవి ప్రశంస, కుకవినింద మొదలైనవన్నీ ఈ గ్రంథంతోనే ప్రారంభమయ్యాయి. ఈ గ్రంథంలోని కొన్ని ఆధారాలను బట్టి శ్రీవిజయుడు జైనుడని భావించవచ్చు. తెలుగులో జైనుడైన రేచన కవిజనాశ్రయము అనే పేరుతో ఛందోగ్రంథాన్ని రాయడానికి కవిరాజమార్గం ప్రేరణ ఇచ్చిందేమో అని ఒక ఊహ.
శ్రీవిజయుని గ్రంథంలో మొదటి పరిచ్ఛేదం అనేక విధాల ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ భాగంలోని విషయాలు రచయితలకుండే కొన్ని స్పష్టమైన అభిప్రాయాలను విశదపరుస్తున్నాయి. కన్నడనాడు, కన్నడనుడి, కన్నడ సంస్కృతి మొదలైన విషయాలను గురించి తొమ్మిదవ శతాబ్దిలోనే ఇంత స్పష్టంగా చెప్పడం ఈ గ్రంథంలో విశేషం. మొదటి పరిచ్ఛేదంలోని కొన్ని విశేషాలు మాత్రమే ఈ పరిచయంలో ప్రస్తావిస్తాను. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
కావ్యాలలో గద్యకావ్యాలు, పద్యకావ్యాలు, గద్యపద్యాలు రెండూ ఉండే కావ్యాలు ఉన్నాయి. గద్యపద్యాలున్నవి చంపూ కావ్యాలని దండి చెప్పాడు. కానీ, కన్నడంలో అలాంటి వాటిని ‘గద్యకథ’ అంటారని శ్రీవిజయుడు చెప్పడం విశేషం.
మిగె కన్నడగబ్బంగళొ
ళగణిత గుణ గద్య పద్య సమ్మిశ్రితమం
నిగదిసువర్ గద్యకథా
ప్రగీతియిం తచ్చిరంతనాచార్యర్కళ్ (1-27)
(కన్నడ కావ్యాలలో లెక్కకు మీరిన గుణాలతో కూడిన గద్యపద్యాల సమ్మిశ్రితమైన దాన్ని ప్రాచీనాచార్యులు గద్యకథ అన్న పేరుతో పిలుస్తారు.)
తొమ్మిదవ శతాబ్దికి ముందే కొంతమంది గద్యకవులున్నారని శ్రీవిజయుడు ఒక పట్టిక ఇచ్చాడు.
విమళోదయ నాగార్జున
సమేత జయబంధు దుర్వినీతాదిగళీ
క్రమదొళ్ నెగళ్చె గద్యా
శ్రమ పద గురుతా ప్రతీతియం కైకొండర్ (1-29)
(విమళోదయ, నాగార్జున, జయబంధు, దుర్వినీతాduలు ఈ క్రమంలో ప్రకాశించి గద్యాశ్రమ పదగురుతా ప్రతీతిని సంపాదించారు.)
వాళ్ళు సంస్కృత కవులా, ప్రాకృత కవులా, లేక కన్నడ కవులా అన్నది మాత్రం స్పష్టం కావడం లేదు. విమళోదయ, నాగార్జున, జయబంధు, దుర్వినీతాదులు కన్నడ కవులేనని కన్నడ పండితులు భావిస్తున్నారు. శ్రీవిజయుడు పేర్కొన్న ఈ కవులు కన్నడ గద్య కవులు కాకున్నా మరో పట్టిక (1-32) మాత్రం కన్నడ కవులదే అని ఒప్పుకోక తప్పదు.
పరమ శ్రీవిజయ కవీ
శ్వర, పండిత చంద్ర, లోకపాలాదిగళా
నిరతిశయ వస్తు విస్తర
విరచనె లక్ష్యం తదాద్య కావ్యక్కెందుం (1-32)
(పరమశ్రీ విజయ కవీశ్వర, పండిత చంద్ర, లోకపాలాదులు గొప్పవైన వస్తువిస్తర రచనలకు లక్ష్యాలను ఆద్యకావ్యానికి సమకూర్చారు.)
తొమ్మిదవ శతాబ్దికి ముందే కన్నడంలో కవులు, కావ్యాలు ఉండడమే కాకుండా చత్తాణ, బెదండె వంటి దేశి సాహిత్య ప్రక్రియలున్నాయని కూడా శ్రీవిజయుడు చెప్పాడు
నుడిగెల్లం సల్లద క
న్నడదొళ్ చత్తాణముం బెదండెయుమెందీ
గడిన నెగళ్తెయ కబ్బదొ
ళొడంబడం మాడిదర్ పురాతనకవిగళ్ (1-33)
(ఇతర భాషల కంటే వేరైన కన్నడంలో చత్తాణ, బెదండెవంటి ప్రసిద్ధ కావ్యాలు ఒనగూడేట్లుగా పురాతన కవులు రచించారు.)
కందమమళిన వృత్తము
మొందొందెఁడెగొందు జాతి జాణెసెయె బెడం-
గొందివఱొళమరె పేళల్
సుందరరూపిం బెదండెగబ్బమదక్కుం (1-34)
(కందం, అమలిన వృత్తం ఒక్కొక్కటి వాటి మధ్య జాతి పద్యం చక్కగా చేరగా అందంగా అమర్చి చెప్తే సుందరరూపంగల బెదండె కావ్యమవుతుంది.)
కందంగళ్ పలవాగిరె
సుందర వృత్తంగళక్కరం చౌపది మ-
త్తం దల్ గీతికె తివదిగ
ళందంబెత్తెసెయె పేళ్వొడదు చత్తాణం (1-35)
(పలు కందపద్యాలు, సుందరవృత్తాలు అక్కర, చౌపది ఇంకా గీతికె త్రిపది అందంగా చేర్చి చెబితే అది చత్తాణం.)
కందం, వృత్తాలు జాతులు కలసిన అందమైన ప్రక్రియ బెదండె. ఇది ‘వైదండికా’ శబ్దభవం కావచ్చు. ఈ కావ్య పఠనానికి వైదండికా అనే వాద్యం నేపథ్య సంగీతాన్ని సమకూర్చేదేమో. చత్తాణ అనే ప్రక్రియలో కందపద్యాలు ఎక్కువగా సుందర వృత్తాలు, చౌపది, గీతికె, తివది (త్రిపది) ఉంటాయని రచయిత చెప్పాడు.
ఏ గ్రంథంలోనూ లేని విధంగా ఒక ప్రాంతానికి స్పష్టమైన ఎల్లలు నిర్దేశించి, అచ్చగన్నడనాడును– అంటే ప్రామాణిక కన్నడ భాషను మాట్లాడే ప్రాంతం – గురించి చెప్పడం కూడా విశేషం. ‘వడక్కే వేంగడం, తెన్ కుమరిమునై’ అని తమిళంలో కనిపిస్తుంది కానీ, కాలనిర్ణయం మాత్రం సాధ్యం కాదు. శ్రీవిజయుడు కావేరి నుంచి గోదావరి దాకా ఉన్న నాడు కన్నడనాడు అని స్పష్టం చేశాడు (1-36). అంతేకాక ఆనాట కిసువొళల్, మహాకొపణనగరం, పులిగెరె, ఒక్కుంద అనే ప్రదేశాల మధ్య ఉన్నదే సారభూతమైన కన్నడం అని చెప్పాడు.
కావేరియిందమా గో
దావరివరమిర్ద నాడదా కన్నడదొళ్
భావిసిద జనపదం వసు-
ధా వలయ విలీన విశద విషయ విశేషం (1-36)
(కావేరి నుండి ఆ గోదావరి వరకు ఉన్న కన్నడ నాట భావించగల్గిన జనపదం ఈ భూమండలంలోని విశద ప్రదేశాలలో విశేషమైనది.)
అదఱొళగం కిసువొళలా
విదిత మహా కొపణ నగరదా పులిగెఱెయా
సదభిస్తుతమప్పొంకుం
దద నడువణ నాడె నాడె కన్నడద తిరుళ్ (1-37)
(అందులో కిసువొళల్, ప్రసిద్ధమైన మహాకొపణనగరం, పులిగెఱె, స్తుత్యమైన ఒక్కుంద అనే ప్రదేశాల నట్టనడుమ ఉన్న నాడు అచ్చమైన కన్నడనాడు.)
కన్నడిగులు ఎలాంటివారు అని చెప్పడంలోనూ రచయిత ఆత్మాభిమానం కనిపిస్తుంది. ‘సొగసుగా చెప్పడం, చెప్పినదానిని శోధించడం వీరికి తెలుసు. వాళ్ళు చాతుర్యం కలవారు. చదువు లేకున్నా కావ్యాన్ని రాయగల పరిణతములు (1-38)’ అని కన్నడిగుల గురించి చెప్పాడు.
పదనఱిదు నుడియలుం నుడి
దుదనఱిదారలుమార్పరా నాడవర్గళ్
చదురర్ నిజదిం కుఱితో
దదెయుం కావ్య ప్రయోగ పరిణత మతిగళ్ (1-38)
(ఆ ప్రదేశంలో వారికి సొగసుగా చెప్పడం, చెప్పిన దాన్ని శోధించడం తెలుసు. వాళ్ళు చతురులు, చదువు లేకున్నా కావ్యాన్ని రాయగల పరిణత మతులు.)
మిగతా పండితకవుల లాగా కాకుండా జానపదులను కూడా మెచ్చుకున్నాడు. ‘వీళ్ళు తమ తమ నుడులలో జాణతనం ఉన్నవాళ్ళు’ అని ప్రాంతీయ భాషల సొగసును పొగిడాడు. చివరకు చిన్నపిల్లలు, మూగవాళ్లు కూడా వివేకం కలవారన్నాడు.
కుఱితవరల్లదె మత్తం
పెఱరుం తంతమ్మ నుడియొళెల్లర్ జాణర్
కిఱువక్కళ్ మామూగరు
మఱిపల్కఱివర్ వివేకమం మాతుగళం (1-39)
(ముందు చెప్పిన వాళ్ళే కాకుండా మిగిలిన వారు కూడా తమ తమ నుడులలో జాణతనం కలవారు. చిన్న పిల్లలు, మూగవాళ్ళు సైతం మాటల్లో వివేకాన్ని చూపించగల సమర్థులు.)
సంస్కృత ప్రాకృతాలను గురించి శ్రీవిజయుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ భాషల్లో నిర్దిష్టమైన లక్ష్యలక్షణాలున్నాయి. అందువల్ల ఆ భాషల్లో రాయడం తేలికే. కానీ, కన్నడంలో అలాంటి లక్షణగ్రంథాలు లేకున్నా రాస్తున్నారు కాబట్టి తమ భాషలో వాళ్ళే ఒజ్జబంతులని చెప్పాలి.
అరిదాదం కన్నడదొళ్
తిరికొఱెగొండఱియ పేళ్ వెనెంబుదిదార్గం
పరమాచార్యరవోల్ సై-
తిరలఱియర్ కన్నడక్కె నాడవరోజర్ (1-42)
(అరుదైన కన్నడంలో పరమాచార్యులలాగా గొప్పగా చెప్పడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ కన్నడానికి సంబంధించినంత వరకూ ఆ నాడులో ఉన్నవారే ఒజ్జలు.)
మాండలికాలను గుర్తించిన మొదటి కవి కూడా ఇతనే. కన్నడంలో దేసి వేరువేరుగా ఉండడం వల్ల “దాన్ని తెలుసుకొని మాండలిక భేదాలను గుర్తించడం వాసుకి వల్లకూడా కాదు” అన్నాడు.
దోసమినితెందు బగెదు
ద్భాసిసి తఱిసందు కన్నడంగళొళెందుం
వాసుగియుమఱియలాఱదె
బేసఱుగుం దేసి బేఱెబేఱప్పుదఱిం (1-46)
(కన్నడ భాష ప్రభేదాలలోని దోషాలను విడమర్చి చెప్పడానికి వాసుకి వల్ల కూడా కాదు. దేసి వేరువేరుగా ఉండడం వల్ల అతనికే విసుగు పుడుతుంది.)
‘ఎవరికీ తమ తమ దోషాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. తమ కన్నులలోని కాటుకను ఎవరూ చూచుకోలేరు. అందువల్ల తెలివిగల వారెవరికైనా చూపించి కావ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి,’ అని గొప్ప సలహా ఇచ్చిన శ్రీ విజయుణ్ణి ప్రశంసించాల్సిందే.
కాణనేగెయ్దుం తన్న దోషమం
కాణదంతెందుం కణ్గళ్ తమ్మ కాడిగెయం
పూణిగనాదుదఱిం పెఱరిం
జాణరినోదిసి పేళ్వుదు కబ్బమం (1-45)
(తన దోషాన్ని తాను తెలుసుకోవడం కష్టం. కళ్ళు తమ కాటుకను ఎప్పుడూ చూడలేవు. అందువల్ల కావ్యరచనకు పూనుకున్నవాడు తెలివిగల వాళ్ళ చేత తన కావ్యాన్ని చదివించుకోవాలి.)
పాతవడ్డ మాటల్ని గురించి శ్రీ విజయుని అభిప్రాయం స్పష్టంగా ఉంది. ‘పాతమాటలు పురాణకావ్య ప్రయోగానికి సొగసుగానే ఉంటాయి. కానీ, ‘దేసి’కి అవి పనికిరావు. వాటిని వాడితే, ముసలిదాన్ని సంభోగిస్తున్నట్టు ఉంటుంది,’ అని కటువుగా చెప్పడం గమనించదగింది.
దొరెకొండిరె సొగయిసుగుం
పురాణ కావ్య ప్రయోగదొళ్ తత్కాలం
విరసం కరమవు దేసిగె
జరద్వధూ విషయ సురత రస రసికతెవోల్ (1-50)
(పురాణకావ్య ప్రయోగానికయితే, [పాత కన్నడ పదాలు] ఆ కాలానికి చక్కగానే ఉంటాయి. కానీ, దేసికి సంబంధించినంత వరకూ అవి ముసలిదాన్ని సంభోగించే రసికతలాగా చాలా విరసంగా ఉంటాయి.)
‘తత్సమాల్ని కూడా చూచుకోని వాడండి, ఇష్టం వచ్చినట్లు వాడవద్దు. సంస్కృతాన్ని కన్నడాన్ని కలిపి రాయవద్దు. అహరహః, ముహుర్ముహుః, పునఃపునః, లాంటి అవ్యయాల్ని అలాగే వాడవద్దు. కన్నడాన్ని, సంస్కృతాన్ని ఈ విధంగా కలిపి రాస్తే కరడె, మద్దెలల లాగా కర్కశంగా ఉంటుంది’ (1-51 నుండి 1-53 వరకూ) అన్నాడు రచయిత.
సమ సంస్కృతంగళొళ్ సై-
తమర్దిరె కన్నడమనఱిదు పేళ్గెంబుదిదా-
గమ కోవిద నిగదిత మా
ర్గమిదం బెరసల్కమాగదీ సక్కదదొళ్ (1-51)
(సంస్కృత సమాసాలతో కన్నడాన్ని కలిపి చెప్పేటప్పుడు జాగ్రత్త వహించాలన్నది ఆగమకోవిదులు నిర్దేశించిన మార్గం. సంస్కృతంతో కన్నడం కలిపి చెప్పడానికి వీలులేదు.)
అహరహరుచ్చైర్నీచై
ర్ముహుర్ముహురితస్తతః పునః పునరంత-
ర్బహిరాదిహ ప్రాదురహో-
సహసాదిగళవ్యయంగళసహాయంగళ్ (1-52)
(అహరహః, ఉచ్చైః, నీచైః, ముహుర్ముహుః, ఇతస్తతమ్, పునః పునః, అంతర్, బహిర్, ఇహ, ప్రాదుర్, అహో వంటి అవ్యయాలను అలాగే వాడుకోకూడదు).
బెరసిరె కన్నడదొళ్ బం
ధురమాగదు కావ్యరచనె పేళ్దొడె పీనం
పరుషతరమక్కుమొత్తుం
గరడెయ మద్దళెయ జర్ఝరధ్వనిగళవోల్ (1-53)
(వీటిని కలిపివేస్తే కన్నడం అందంగా ఉండదు. చాలా పరుషంగా కరడె, మద్దెల చేసే కర్కశ ధ్వనిలాగా ఉంటుంది).
అలా ఛందోబద్దమైన పద్యం హృద్యమైనదని శ్రీవిజయుని అభిప్రాయం. పద్యకవులను గురించి రాసేటప్పుడు పద్యం ఎంత సొగసుగా ఉంటుందో తెలిపాడు. చక్కని సంస్కృత పదాలను వాడడం వల్ల ఈ పద్యం తెలుగు వాళ్లకూ అర్థమవుతుంది.
పద్యం సమస్త జనతా
హృద్యం పదవిదితపాదనియమనివేద్యం
విద్యా పారాయణ
మాద్యం సద్వృత్తి వృత్త జాత్యాయత్తం (1-30)
(పద్యం సమస్త జనతకు హృద్యమైనది. పదములతో కూడి పాదనియమం కలిగి ఉండేది. విద్యావంతులకు ఇష్టమైనది. ఆద్యమైనది. వృత్తాలతోనూ, జాతులతోనూ కూడి ఉండేది.)
ఇంకా ఈ అలంకార శాస్త్రంలో ఉన్న అన్ని విశేషాలను చెప్పాలంటే చాట భారతం అవుతుంది. కన్నడంలో యతి స్వరూపం, కారకాదులలో దోషాలు, గురులఘుదోషాలు, అలంకార లక్షణం, అలంకార భేదాలు, ప్రాస భేదాలు, దక్షిణోత్తర మార్గాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, వాటికి లక్ష్యాలు కవిరాజమార్గంలో ఉన్నాయి. దండి కావ్యాదర్శంలో ఉన్నట్లే చిత్రకవిత్వం గురించి కూడా ఇందులో విపులమైన వివరణ ఉంది. ధ్వనిని కూడా అలంకారంగా నిరూపించడం ఒక విశేషం. మహాకావ్య లక్షణాన్ని విశదీకరించి తన లక్షణ గ్రంథాన్ని ముగించాడు శ్రీవిజయుడు.
ఇన్ని విధాల విశిష్టతను సంతరించుకొన్న కవిరాజమార్గం తొమ్మిదవ శతాబ్దిలోనే రచించిన శ్రీవిజయుడు, ఈ మార్గాన్ని నిర్దేశించిన నృపతుంగుడు యశోభూషణులు అయ్యారు. నీతినిరంతరుడు, ఉదారుడు, అతిశయధవళుడు అని బిరుదులు పొందిన నృపతుంగ చక్రవర్తి సార్థక నామధేయుడయ్యాడు.
--------------------------------------------------------
రచన: రాళ్ళపల్లి సుందరం,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment