Monday, July 2, 2018

శారదోదాహరణ తారావళి

 శారదోదాహరణ తారావళి

సాహితీమిత్రులారా!ఉదాహరణవాఙ్మయమును గురించిన వ్యాసాలు రెండింటిని
చూచాము. ఇక్కడ మరోవ్యాసం చూడండి -
జెజ్జాల కృష్ణ మోహన రావుగారు వ్రాసిన శారదోదాహరణతారావళి
అనబడు ఒక ఉదాహరణ కావ్యమును మీకు సమర్పిస్తున్నాను.


1. తెలుగు విభక్తి లక్షణములు
నేను అదనముగా చేర్చినవి రెండు, అవి – (1) ఉదాహరణముల నియమములలో వృత్తములుగా శార్దూల మత్తేభవిక్రీడితములను, చంపకోత్పలమాలలను మాత్రమే వాడవలయునని ఉన్నది. కవులు ఇతర వృత్తములను, కందమును, ద్విపదను కూడ వాడినారు. నేను ప్రతి విభక్తికి ఒక వృత్తమును వాడినాను. అవి పై నాలుగు వృత్తములుగాక వేఱైనప్పుడు ఆ వృత్తములలో ఒకదానిలో కూడ వ్రాసినాను. (2) విభక్త్యాభాసమునకు చతుర్థీ విభక్తిని మాత్రమే కవులు ఉపయోగించినారు. ద్వితీయా, తృతీయా, షష్ఠీ విభక్తులలో కూడ ఉత్కళికను వ్రాయునప్పుడు విభక్త్యాభాసము సాధ్యము అని నిరూపించినాను. ఉదాహరణములలో ఉపయోగించే విభక్తులను, ఈ ఉదాహరణపు కళికలలోని రగడలను గుఱించిన వివరముల పట్టికను కూడ ఇచ్చియున్నాను.

ప్రథమా విభక్తి
ఉత్పలమాల –
శ్రీల నొసంగు దేవి పలు – చెల్వము లిచ్చెడు దేవి విద్యలన్
జాల నొసంగు దేవి నర-జన్మకు నర్థము నిచ్చు దేవి స-
చ్ఛీల మొసంగు దేవి ప్రవ-చించఁగ వేదము లిచ్చు దేవి గా-
రాల నొసంగు దేవి యను-రాగము మీఱఁగ వాణి నీయుతన్

కళిక – మధురగతి రగడ –
మఱియును నుత్పల – మాలల గంధము
గరువపు నడకల – కందపు టందము
హరుసము నిచ్చెడు – హంస రుతమ్ములు
కరిబృంహితములు – క్రౌంచపదమ్ములు
కోకిల కలరవ – కోమల గీతము
ప్రాకట మగు ష-ట్పద మృదు గీతము
వసుమతి చేసెడు – పలు వందనములు
ప్రసువున కొసగెడు – ప్రణ యార్పణములు

ఉత్కళిక – చ/చ
నవ్వులు తెల్లన
పువ్వులు తెల్లన
హారము తెల్లన
కీరితి తెల్లన
డెందము తెల్లన
చందము తెల్లన
భగవతి ధ్యానము
యుగముల ప్రాణము

కొన్ని వివరణలు
విభక్తులకు పేరులు, అధిదైవములు గలవు. ప్రథమా విభక్తి పేరు వాణి, అధిదేవత వీరావళి. ఇందులో వాణి పేరు పద్యములో వచ్చినది.
కావ్యము శ్రీకారముతో నారంభమైనది. ఎందుకనగా-
శ్రీకారము శుభకర మగు
శ్రీకారము సకలకార్యసిద్ధి నొసంగున్
శ్రీకారము గీర్తిద మగు
శ్రీకారము గృతుల నాది జేకూర్ప దగున్ (చాటుధార)
కళికలో ప్రకృతిలో గల చరాచరములను, జడజీవములను తల్లి శారదకు భూదేవి ప్రేమతో అర్పణ చేయుచున్నదను ఒక భావన. ఛందస్సు నాకు ప్రియము, అందు వలన వృత్తముల, ఇతర పద్యముల నామములు ఇందులో గలవు. అవి- ఉత్పలమాల, కందము, హంసరుతము, కరిబృంహితము, క్రౌంచపదము, కోకిల, కలరవ, కోమల, గీతము, వసుమతి.
చందము అనగా తెఱగు. ఛందస్సు అని కూడ అర్థము. ఛందస్సు వేద భాష కూడ.
సరస్వతిని తెల్లదనముతో బోల్చుట వాడుక. యా కుందేందు తుషారహార ధవలా… శారద నీరదేందు ఘనసార పటీర… ఇత్యాదులు. అందువలన ఉత్కళికలో మొదటి ఆఱు పాదములలో ఆ తెల్లదనమును తెలిపి, చివరి రెండు పాదములలో నియతమైన ప్రథమా విభక్తిని వాడినాను.
ద్వితీయా విభక్తి
వసంతతిలక
రాజేశ్వరిన్ సుకవి-రాజహృదంతరాత్మన్
రాజీవ నేత్రిని స్వ-రామృత వర్షదాయిన్
రాజీవగంధిని ని-రంతర హర్షదాయిన్
రాజాననన్ గొలుతు – రాజ మరాళయానన్

ఉత్పలమాల –
నన్నయ నన్నెచోడుల మ-నమ్ముల నిల్చిన నీరజాక్షిఁ, ది-
క్కన్న కలమ్ములోన మధు-రామృత మద్దిన మిన్కుగొమ్మఁ, బో-
తన్న గళమ్ములోన మధు – ధారల నింపిన శారదాంబనున్
జెన్నుగ సత్కవిత్వ మధు-సేవన మీయఁగ వేడెదన్ సదా

కళిక – మధురగతి రగడ –
మఱియు గులాబుల, – మణిమంజరులను
విరియు నలినముల, – విపినతిలకమును
మకరందికలను, – మల్లెల మాలను
రకరకముల కిస-లయ వృత్తములను
చంపకకేసరి – చంపకమాలను
సొంపుల నొసగెద – సురలత ననలను
పదములఁ గొలువఁగ – భారతి ప్రభవను
ముదమున బొగడఁగ – మోహన విభవను

ఉత్కళిక – చ/చ
గురువుల గురువై
స్వరముల కిరవై
అక్షి కలఘువై
అక్షర లఘువై
కీర్తికి మతియై
ఆర్తికి గతియై
తలచఁగ సుముఖిని
పిలువఁగ ప్రముఖిని

వివరణలు
ఎనిమిది విభక్తులకు ఎనిమిది రకములైన వృత్తములను వాడవలయునని తలచినందున, ఈ విభక్తికి వృత్తముగా వసంతతిలకను ఎన్నుకొనినాను. వసంతతిలక- త-భ-జ-జ-గ-గ యతి (1, 8). ఈ వృత్తమునకు ఇతర నామములు సింహోన్నత, ఔద్ధర్షిణి, శోభావతి, మధుమాధవి. ఇది శక్వరి ఛందములోని 2933వ వృత్తము.
కళికోత్కళికలలో గోచరమగు పద్యముల పేరులు- గులాబి, మణిమంజరి, నలిన, విపినతిలక, మకరందిక, మల్లెలమాల (నా సృష్టి), కిసలయ, వృత్త, చంపకకేసరి, చంపకమాల, సురలత, సుముఖి. కాలమునకు ఆదియని ప్రభవ పదము సూచించును.
పద్యము పాదములతో విరాజిల్లును. పాదములు పదములతో శోభించును. పదములు అక్షరములతో నిండియుండును. అక్షరములు గురులఘువులు. పద్యములు సంగీతభరితము. ఈ గుణములు అక్షర, గురు, లఘువు, స్వర పదములతో తెలుపబడినవి.
ద్వితీయా విభక్తికి పేరు ఝట, అధిదేవత కీర్తిమతి. కీర్తిమతి యను పేరు ఉత్కళికలో ఇచ్చినాను.
కళికలో అన్ని పాదాంతములలో ద్వితీయా విభక్తియైన ను-కారము, ఉత్కళిక చివరి రెండు పాదములలో ని-కారము ఇవ్వబడినవి.
క్రొత్త ప్రయోగము – ద్వితీయా విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము

ఉత్కళిక- చ/చ
కంజదళాక్షి ని
రంజనమూర్తి ని
రంతర శాంతి ని
తాంత సుకాంతి ని
గూఢ గుణాళి ని
రూఢ కళాబ్ధి ని
రర్గళ వాణిని
స్వర్గవిహారిని
తృతీయా విభక్తి
శార్దూలవిక్రీడితము –
నీచే విశ్వము లెల్ల జ్ఞానమయమౌ – నిస్తంద్ర తేజోమయీ
నీచే మానస మెల్ల కాంతిమయమై – నిత్యమ్ము నిండున్ గదా
నీచే బోధన శోధనల్ జరుగు న-న్వేషార్థ మీవే సదా
నీచే సృష్టియు గల్గు హృష్టి గలుగున్ – నీచేత శ్వేతాంబరీ

కళిక – ద్విరదగతిరగడ –
మఱియు నవ శబ్దముల – మధురిమల శ్రేణిచే
వర సుభగ వాక్సుధా – భరిత గీర్వాణిచే
చిత్రలేఖన నాట్య – సృజన బ్రహ్మాణిచే
చిత్ర కవితల గూర్చు – చెలువముల రాణిచే
వీణియను మ్రోగించు – వేదాంత వేదిచే
వాణి కొక మెఱుఁ గిచ్చు – వచన సంవాదిచే
శిల్పము లనల్పముగ – చెక్కు ఘన శిల్పిచే
కల్పనల కల్ప మగు – కడు దయల వేల్పుచే

ఉత్కళిక – పం/పం
రాగముల యోగములు
యోగముల రాగములు
విద్యల వినోదములు
పద్యముల చోద్యములు
కాంతిమయ దీపములు
శాంతిమయ రూపములు
శరదిందు వదనచే
స్వరచిత్ర సదనచే

వివరణలు
ఇందులో పలు లలితకళలను విశదీకరించినాను. తృతీయా విభక్తికి కీర్తి అని పేరు. అధిదేవత సుభగ. సుభగ అను పేరు కళికలో వాడబడినది.

క్రొత్త ప్రయోగము – తృతీయా విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము

ఉత్కళిక – పం/పం
అంతటను నెన్నొ చే-
మంతుల సరములు చే-
లమ్ముల సితమ్ము చే-
తమ్ముల ముదమ్ము చే-
దోడుగను నామె చే-
కూడుఁగద మేలు చే-
తనమెల్ల బ్రాహ్మిచే
స్వనమెల్ల వాణిచే

చతుర్థీ విభక్తి
తరలము –
నలువ దేవుని రాణికై రచ-నావిధాన ప్రమాణికై
కలువ కన్నుల జ్ఞానికై నవ-కాంతిదాయిని ధ్యానికై
లలిత విద్యల రాశికై సువి-లాస నాట్య కలాపికై
తెలుగు కైతల భావికై యిది – దేవలాభిని దేవికై

చంపకమాల –
అమల దుకూల ధారిణికి-నై, యసమాన కళావధూటికై
యమిత రసార్ణవాంబుజకు-నై, యపరాజిత వేదవాణికై
యమృతసమాన భాషిణికి-నై, యనురాగమయార్ద్ర చిత్తకై
యమర మునీంద్ర సేవితకు-నై, యమరాక్షరఁ గొల్తు నెప్పుడున్

కళిక – మధురగతిరగడ –
మఱియును జీఁకటి – మదిఁ దొలఁగుటకై
వఱలెడు కాంతులు – వఱద లగుటకై
జిజ్ఞాసల విరి – జీవించుటకై
సుజ్ఞానపు ప్రియ – సుధ లూరుటకై
నవ జీవన లత – నన బూయుటకై
నవ రాగపు ఛవి – నడయాడుటకై
హృదయస్పందన – లిలఁ బాడుటకై
బ్రదు కిది జయభ-ద్రను వేడుటకై

ఉత్కళిక – చ/చ
మీఱగ నీ కై-
వారము నీ కై-
రవములు నీ కై-
రవియును నీ కై-
సేతలు నీ కై-
వ్రాతలు నీ కై-
దివియలు నీకై
స్తవములు నీకై

వివరణలు
చతుర్థీ విభక్తికి దేవలాభిని యని పేరు, దీని అధిదేవత పేరు భోగమాలిని. దేవలాభిని అను పేరు మొదటి పద్యములో నున్నది.
ఉత్కళికలో విభక్తి ఆభాసము తోచునట్లు వ్రాసినాను. కైవారము (నమస్కారము), కైరవము (కలువపూవు), కైరవి (వెన్నెల), కైసేత (పని), కైవ్రాత (చేతివ్రాత), కైదివియ (చేతగల దీపము)- ఈ ఆఱు పదములు విభక్త్యాభాస పదములు. నీ అను పదము సంధివలన వచ్చినది. (మీఱగన్ + ఈ = మీఱగ నీ, ఇట్లే మిగిలినవి). కై అను అక్షరముతో ప్రారంభమగు పదములు చాల తక్కువ. నేను ఈ పదములనే ఎందుకు ఎన్నుకొన్నాను అనగా- ఈ పదములు విభక్తియొక్క ఆభాసమును తెలుపుటయే గాక, కై లేకున్నను, తదుపరి పాదములోని పదములు స్వతంత్రముగా నిలువగలవు. వారము, రవము, రవి, సేత, వ్రాత, దివియ పదములు తమంతట తామే అర్థవంతములు.
పంచమీ విభక్తి
మత్తేభవిక్రీడితము –
వరదాయీ జగ మెల్ల నీవలననే – భాసించు సందీప్తమై
వర వీణా మృదు పాణి నీవలన స-ద్భావమ్ము గల్గున్ సదా
నరనారీకుల మెల్ల నీవలన జ్ఞా-నమ్మొంద యత్నించు సుం-
దరమౌ సద్‌హృదయమ్ము నీవలన మా-తా వేదవిద్యానిధీ

కళిక – వృషభగతిరగడ –
మఱల నుల్లము పూర్ణ మందఁగ – మధుర విద్యల దీప్తి వలనన్
సిరుల నిండఁగ జీవన మ్మిటఁ – జిత్ర మగు నీ కళల వలనన్
గణిత శాస్త్రపు గాన శాస్త్రపు – గంధ మబ్బఁగ ఘనత వలనన్
గనుల శాస్త్రపు మణుల శాస్త్రపు – గరిమ తెలియఁగ మహిమ వలనన్
వివిధ భాషల విమల శోభలు – వెలుఁగ నిల నీ కలము వలనన్
వివిధ స్వరముల ప్రణవ రవములు – వెల్లువవ నీ గళము వలనన్
ఫుల్ల కుంద సుహాసినీ మది – పొంగ నీ గురు కృతుల వలనన్
పల్లవించఁగ జ్ఞానవల్లి య – పారమగు నీ కృపల వలనన్

ఉత్కళిక – త్రి/చ/త్రి/చ
మఱియు మంగళ మధురగీతులు
సురుచిరమ్మగు శుభ విభూతులు
విలసితమ్మగు వృత్త రీతులు
లలిత పదముల లయవిభాతులు
చంద్రభాను సుచారు కాంతులు
నింద్రచాపము లిచ్చు భ్రాంతులు
నవరసోజ్జ్వల నటన వలనన్
భువన మోహిని భ్రూవు వలనన్

వివరణలు
పంచమీ విభక్తికి పేరు పాణి, అధిదేవత కళావతి. పాణి అను పదము వృత్తములో వచ్చినది.
కళికలో ఎన్నియో కళల పేరులు, విజ్ఞాన విభాగములు చెప్పబడినవి. (గణితము, సంగీతము, భూగర్భశాస్త్రము, స్ఫటికశాస్త్రము ఇత్యాదివి.)
ఉత్కళికలో ఛందస్సులోని గణములైన సూర్య, ఇంద్ర, చంద్ర గణముల పేరులు సూచించబడినవి.
ప్రణవ, మంగళ, మధురగీతి, సురుచిర, శుభ, విభూతి, వృత్త, లలిత, లయవిభాతి, చంద్రభాను, కాంతి, ఉజ్జ్వల అను పద్యముల పేరులు కళికోత్కళికలలో తెలుపబడినవి.
షష్ఠీ విభక్తి
(షట్పద) కందము –
సురుచిర బంభర వేణికి
సరసిజభవుఁ గూర్మి సతికి
స్వర భేదినికిన్
సరసోక్తుల కవయిత్రికిఁ
గరుణాలయ కనుదినమ్ము
గరములు మోడ్తున్

ఉత్పలమాల –
హారము లిత్తు నా హృది వి-హారము సల్పెడు దేవికిన్ నమ-
స్కారము సల్పుదున్ జదువు – సారము దెల్పెడు వాణికిన్ మనో-
ద్వారము దీసెదన్ వెలుఁగు – దారులు సూపెడు తల్లికిన్ సదా
స్మారము సేసెదన్ గళల – మర్మము విప్పెడు శారదాంబకున్

కళిక – ద్విరదగతిరగడ –
మఱియు స్వరభూషణికి – మలహరికి శ్రీమణికి
వరదకు సుపోషిణికి – భైరవికి తారిణికి
భూపాల నాయకికి – పూర్ణచంద్రిక ప్రతికి
శ్రీ పావనికి ప్రణవ-శీలి ఛాయావతికి
నారాయణికి సామ – నాదనామక్రియకు
కీరవాణికి జయకు – కృష్ణవేణికి సితకు
రాగచూడామణికి – రత్నాంగి రంజనికి
రాగమాలికలు ఘన – రాగ రసమంజరికి

ఉత్కళిక – పం/పం
స్వరరూపవతి లలిత
కిరణావళీకలిత
కనకాంగి చారుమతి
వనజాక్షి భానుమతి
రాగవర్ధని వాణి
వేగవాహినివేణి
స్వామిని కళావతికి
ప్రేమల శరావతికి

వివరణలు
కందము షట్పద కందము, అనగా రెండవ, నాల్గవ పాదములలో యతితోబాటు ప్రాస యతి కూడ నున్నది.
షష్ఠీ విభక్తికి పేరు లలిత, అధిదేవత కాంతిమతి. ఇందులో లలిత అను పేరు ఉత్కళికలో నున్నది.
కళికోత్కళికలలో రాగముల పేరులను సూచించినాను. అవి- స్వరభూషణి, మలహరి, శ్రీమణి, సుపోషిణి, భైరవి, భూపాల, నాయకి, పూర్ణచంద్రిక, శ్రీ, పావని, ఛాయావతి, నారాయణి, సామ, నాదనామక్రియ, కీరవాణి, కృష్ణవేణి, రాగచూడామణి, రత్నాంగి, రంజని, రసమంజరి, రూపవతి, లలిత, కిరణావళి, కనకాంగి, చారుమతి, భానుమతి, రాగవర్ధని, వేగవాహిని, కళావతి, శరావతి (30 రాగములు)
క్రొత్త ప్రయోగము – షష్ఠీ విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము

ఉత్కళిక – పం/పం
చారుమతి భగవతి కి
శోరులకు సృత్వరి కి
నుక లేని వాఙ్మణి కి
టుకు సూపు బ్రాహ్మణి కి
ణకిణల గాయని కి
లకిలల హాసిని కి
రీటములు భారతికి
మేటియగు కీరితికి

సప్తమీ విభక్తి
చంపకమాల –
ఉదయమునందు ధ్యానమున – నోజము లొప్పుగ బోధ సేసె నా
హృదయమునందు చిందులిడు – మృష్ట సువిగ్రహ మామెదే గదా
వదనమునందు నుచ్చరణ – స్వచ్ఛము సేసెను గంగవోలె నీ
సుదినమునందు సుందర వ-చోఽమృత మిచ్చిన దామెయే గదా

కళిక – హంసగతిరగడ –
మఱియు ఛవి యుదయించ – మనసు నందు
విరియ హృత్కమల మా – వెలుఁగు నందు
దీవె లవ భావములు – దినము నందు
రావ మవ భావములు – రాత్రి యందు
మెలిక లవ రాగములు – మెలకు వందు
నిలువ లయ యోగములు – నిదుర యందు
బాట నీవవ చావు – బ్రదుకు నందు
ఆట నీవవఁగ నా-ద్యంత మందు

ఉత్కళిక – పం/త్రి
చింతన మవంగ
మంతన మవంగ
చిత్రము లవంగ
సూత్రము లవంగ
సూచన మవంగ
మోచన మవంగ
గద్యముల యందుఁ
బద్యముల యందు

వివరణలు
కళిక అరుదుగా వాడబడే హంసగతిరగడలో వ్రాసినాను.
సప్తమీ విభక్తికి పేరు ఘోణి లేక ఘోటిక, అధిదేవత కమల. కమల అను పదము కళికలో వచ్చినది.
సంబోధనా ప్రథమా విభక్తి
మాలిని –
జయతి జయతి వాణీ – శ్రావ్య సంగీత వాణీ
జయతి సుజన పక్షా – సత్య సంకల్ప దక్షా
జయతి జయతి మాయీ – జన్మసాఫల్య దాయీ
జయతి విమల వేషా – సంస్కృతారామ పోషా

చంపకమాల –
జయము సరస్వతీ జయము – శారద చంద్ర సమాన హాసినీ
జయము ప్రియంవదా జయము – సత్య వచోఽమృత సింధు వాఙ్మయీ
జయము సుమాలినీ జయము – చందన కుంకుమ పుష్ప భూషిణీ
జయము విశారదా జయము – ఛందపు టందముఁ జూపు శారదా

కళిక – హయప్రచారరగడ –
మఱియు దేవి – మంగళాంగి
స్థిర సుమేరు – శ్రీ శుభాంగి
ముక్తి దాయి – మోద దాయి
భక్తి దాయి – భావ దాయి
యుక్తి దాయి – యోగ దాయి
శక్తి దాయి – శమన దాయి
అహము రాత్రి – అమరవల్లి
ఇహము పరము – నిచ్చు తల్లి

ఉత్కళిక – త్రి/త్రి
అజయ మతిగ
విజయవతిగ
వళుల వడిగ
కళల గుడిగ
ముదపు విరిగ
హృదికి సిరిగ
అక్ష రాంబ
అక్ష యాంబ

వివరణలు
ఈ విభక్తికి సరసావళి అని పేరు. దీనికి అధిదేవత జయవతి. జయవతి అను పదము ఉత్కళికలో వ్రాసినాను.
మాలినీ వృత్తమును సంస్కృతములో కూడ సంబోధనకై ఉపయోగింతురు. ఇట్టి పద్యములు జయతి అను పదముతో ప్రారంభమగును. నేను కూడ ఇట్లే ఈ పద్యమును వ్రాసినాను.
సార్వవిభక్తికము
ద్విపద-
ఆరని పృథు దీప – మమర భూజమ్ము
తీరని యాశలన్ – దీర్చు దైవమ్ము
భారతిచే విద్య – వఱలు వేగమ్ము
కారుణ్య దృష్టికై – కైమోడ్తు నమ్ము
నీ రాగము వలన – నేర్తు గానమ్ము
గారాల తల్లికి – కవి తామృతమ్ము
చేర నీ పదమందు – చిన్ని జీవమ్ము
కోరితిన్ శారదా – గురుదేవి రమ్ము

మత్తేభవిక్రీడితము –
వరవీణామృదుపాణి నీవు, నిను నేఁ – బ్రార్థింతు, నీచేత సుం-
దరకావ్యమ్ముల సృష్టి యౌను, సుమనో-దామమ్ము నీకై కదా,
సరసోక్తుల్ జనియించు నీవలన, భా-షాదేవి నీకంజలుల్,
జరణాబ్జమ్ములయందు నుంతుఁ గవితల్, – సర్వేశ్వరీ శారదా

పాల్కుఱికి సోమనాథుడు పండితారాధ్యచరిత్రలో ఏడు విభక్తులు వచ్చునట్లు ద్విపదలలో వ్రాసెను. ద్విపదను ఎన్నుకొనుటకు అది ఒక ప్రోత్సాహమైనది.

మంగళము
మంగళమహాశ్రీ –
మంగళము వర్తనలు – మంగళము నర్తనలు – మంగళము కీర్తనల స్ఫూర్తీ
మంగళము వేదములు – మంగళము నాదములు – మంగళము మోదన వినోదీ
మంగళము నీ స్వరము – మంగళము నీ కరము – మంగళము నీ వరము దేవీ
మంగళము నీ గృహము – మంగళము నీ మహిమ – మంగళము మంగళమహాశ్రీ

వివరణ
ఉదాహరణ కావ్యములలో ఎల్లప్పుడు ఇరువదియాఱు పద్యములు ఉండవలయును. ఎనిమిది విభక్తులకు ఇరువది నాల్గు, సార్వవిభక్తికమున కొకటి, అంకితాంకితమున కొకటి. తారావళికి ఇరువది ఏడు పద్యములు ఉండవలయును. అదనపు పద్యము ప్రథమా విభక్తికి ముందు కొందఱు వ్రాసినారు. నేను సార్వవిభక్తికమునకు పిదప మంగళవాక్యముగా వ్రాయ దలచితిని. ఈ విధముగా మొదట శ్రీకారముతో చివర శ్రీకారముతో ఈ లఘు కావ్యము శోభిల్లును. మంగళాంతమునకు మంగళమహాశ్రీ ఉండగా వేఱు వృత్తము ఎందులకు ఎన్నుకొన వలయును.

అంకితాంకము
కందము-
జెజ్జాల వంశ సూనుఁడ
సజ్జనని యుదాహరణము – చందమ్ములతో
సజ్జన ప్రియముగ వ్రాసితి
ముజ్జగముల పతికి కృష్ణ – మోహనునకు నేన్
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో 

No comments: