Wednesday, July 18, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 3


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 3
సాహితీమిత్రులారా!


నిన్నటి తరువాయి..............
మంత్రి మహిషం 4
చదువు వ్యాపార వస్తువై పోయింది. మర్యాదగా విద్యా జీవనం సాగించడం నానాటికీ కష్టమై పోతోందని ఉదాహరణలద్వారా మంత్రి విశదం చేస్తున్నాడు.

విద్యాపణ్య విశేష విక్రయవణిగ్జాత స్సుధీ శ్శ్రీధర
స్స్వన్నం స్వర్ణ మభూ ద్బతాంబు మఖినో ధిక్తస్య షడ్దర్శినీం
ఖ్యాతః కుట్టికవిస్తు దుర్ధని గృహద్వారేషు నిద్రాయతే
త త్సర్వం మహిషేశ్వరాననుసృతే ర్దౌర్భాగ్య ధామ్నః ఫలం.

శ్రీధర పండితుడు డబ్బు తీసుకొని చదువు చెప్పి బతుకు వెళ్ళదీయవలసి వస్తోంది. పోనీ చేస్తే చేశాడయ్యా, ఇచ్చే డబ్బుని బట్టి, చెప్పే చదువులో వ్యాపార పద్ధతిలో హెచ్చు తగ్గులు చూపిస్తూ మరీ పూర్తి వ్యాపారి అయిపోయాడు. ఇక అంబుదీక్షితుడి విషయానికి వస్తే, తినడానికి వరి అన్నం బంగారమై పోయింది. పూట గడవడం లేదు. ఇంక ఆయన చదివిన కపిల, కాణాద, గౌతమ, పాతంజల, వ్యాస, జైమిని ఋషులు వ్రాసిన షడ్దర్శనాలు ఎందుకు? తగలబెట్టడానికా? ఈ అంబుదీక్షితులుతో కలిసి చదువుకున్న కుట్టికవి ఉన్నాడు (తనే, వాంఛేశ్వర మంత్రి) పొగరు బలిసిన ధనవంతుల వాకిళ్ళముందు నిద్రపోతున్నాడు. ఇదంతా ఎందుకిలా జరిగిందో తెలుసా? దారిద్య్రాన్ని నిర్మూలించగల శ్రీ దున్నపోతు గారిని ఆశ్రయించకపోవడం వల్లనే. సరే, ఈ దేశంలో విద్యవల్ల ప్రయోజనం ఏమీ లేదనుకోవవయ్యా. దేశంలో ఇతర ప్రాంతాలు గొడ్డుపోలేదు కద. అక్కడ ఆదరం ఉంటుంది గనక, సుఖంగా బతక వచ్చునే. అన్నిటా దైన్యమేల? అని శ్రీధర పండితుడనగా దానికి సమాధానం చెపుతున్నాడు.

విద్యన్మాకురు సాహసం శ్రుణువచో వక్ష్యామి య త్తేహితం
త్యక్వ్తా కామద మత్ర సైరిభ పతిం నిర్వ్యాజ బంధుం నృణాం
శ్రీరంగా భిద పత్తనం ప్రతిసఖే మా గా జ్వర స్యా లయం
దూరే శ్రీర్నికటే కృతాంత మహిష గ్రైవేయ ఘంటారవః.

మిత్రమా, శ్రీధరా, సాహసం వద్దు. ఒక మంచి మాట చెపుతున్నాను విను. కోరిన కోరికలు తీర్చేమహారాజశ్రీ దున్నపోతువారిని విడిచి, ఎక్కడికో వెళ్ళాలంటావు. శ్రీరంగపట్టణానికి వెళ్ళేవు సుమా. ఆ వూరు జ్వరాలకు పుట్టిల్లు. అక్కడి వెళ్ళి సంపాదించగలిగేదిజబ్బు తప్ప డబ్బు కాదు. ధన సంపాదన లక్ష్యం దూరం గా వుండిపోయి, యమధర్మరాజు వాహనమైన మహిషం మెడలోని గంట, గణగణ దగ్గరగా వినిపిస్తుంది. శ్రీరంగపట్టణంలో విద్యకు గౌరవం వుండవచ్చు. అక్కడ ప్రభువు ధనం కూడా ఇవ్వవచ్చు. అనారోగ్యపు పుట్ట ధనం ఇచ్చినా వద్దు. ఆయువు మూడుతుంది.

మంత్రిమహిషం 5
విద్యాజీవనం ఏమీ లాభం లేదు. సేద్యమే శ్రేష్ఠమంటూ, శ్రుతి, స్మృతి, ప్రత్యక్షప్రమాణాల ద్వారా నిరూపించి ఆ సేద్యానికి ప్రధాన సాధనమైన దున్నపోతును వర్ణించదలిచాడు మంత్రి. డానికి రాచరికాన్ని ఆపాదిస్తూ, అరాచకాలను ఖండిస్తూ, మంచిని ఉపదేసిస్తూ కావ్యరంగంలోకి కాలు
మోపుతున్నాడు.

యం యో ర క్షతి తస్యస ప్రభురితి స్పష్టం హి, మ ద్రక్షిణో
రజ శ్రీమహిషాన్‌ వినుత్య సఫలం కుర్వేద్య వాగ్వైభవం
మత్పీడా నిరతాన్‌ మదీయ మహిమాభి జ్ఞాన శూన్యాన్‌ ప్రభూన్
య న్నిందామి నిమశ్య తద్గుణ విద స్తుష్యంతు సంతో నృపా.

ఏవరెవరిని రక్షిస్తారో, వారే వారికి ప్రభువనేది లోక ప్రసిద్ధం. అందుకని నన్ను రక్షించేది, మహారాజశ్రీ దున్నపోతువారే కనుక, ఆ ప్రభుస్తుతి చేసి న మాట నేర్పరితనాన్ని సఫలం చేసుకుంటాను. నన్ను పీడించడానికి సిద్ధపడేవారిని, నా శక్తినెరుగని అజ్ఞానులైన వారిని, ప్రభువులను, నిందిస్తాను. ఈ నిందను విని గుణం గ్రహించగల, మంచి రాజులు సంతోషిస్తారు.దున్నపోతు వ్యవసాయానికి ముఖ్య సాధనమని, నీకు ప్రభువుగా కనిపించవచ్చు. దానిని స్తుతిస్తున్నట్టుగా శతకం కూర్చి, మూర్ఖులకు జ్ఞానోపదేశం చేయాలని ప్రయత్నించడంకంటె, నేరుగా ఉపదేశించవచ్చు కదా, అని ఎవరైనా అడుగుతారేమో. ఆలాగ కాదు, ద్రోహబుద్ధిగల మూర్ఖులకు నేరుగా ఏమి చెప్పినా, బుర్రకెక్కదు. ఈలాగ చెప్పక తప్పదు అంటాడు మంత్రి.

కంచి త్పశ్వధమం లు లాయ విగుణం కర్తుం ప్రబమ్ధాన్‌ శతం
త్వా మాలంబ్య సముత్సహే , న ఖలు తద్వర్ణస్య మహాత్మ్యత
మ ద్రోహ ప్రవణాధికారి హతక క్రోధేన త న్నిన్దన
వ్యాజా త్త త్ప్రభు త్ప్రభు ష్వపిచ వా గ్గండో మయా పాత్యతే.

మహిషరాజా, నీ గురించి ఒక శతకం చెప్పదలచు కున్నాను. నీ సాటి జంతువ్ల్లో నీవు అధముడివి. ఏ మంచి గుణాల్లూ చెప్పదగినవి లేవు. అయినా, చెపుతున్నాను కదా, అని “నా వంటి మహిమాత్వం ఎవరికీ లేద” ని గర్వపడేవు సుమా. అదేమీ కాదు. నాకు ద్రోహం చేయదలచుకొన్న ఒక అధికారి వెధవని చీకొట్టదలచి, ఈ వంకతో, వాడికి అధికారం కట్టబెట్టిన, వాడి పైవాడికి, ఆ పైవాడికి, తగిలే విధంగా నా వాక్కునే కర్రను చేసి విసురుతున్నాను.
---------------------------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

No comments: