Sunday, July 22, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 5


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 5




సాహితీమిత్రులారా!



నిన్నటి తరువాయి...............

మంత్రి మహిషం 8
వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నప్పటికీ, సుఖం లేదు శాంతి లేదు రక్షణ లేదు అని మంత్రి వాపోతున్నాడు.

విద్యాజీవన కుంఠనేన చ కృషా వాలంబితా యాం చిరా
దాపక్వే కణిశే కుతోऽపి పిశునాః కేదార మావృణ్వతే
హా కిం వచ్మి? సుభాహ వాలుమణియం మేజుష్ఠ హస్తాంతరం
హర్కారస్థల సంప్రతీ ముజుముదాది త్యాదయో నిర్దయాః

శాస్త్రబద్ధమైన విద్యాజీవనం లేకపోవడం వల్ల ఇంకేదారీ లేక వ్యవసాయాన్ని నమ్ముకొంటే తీరా పంట కంకిపట్టి పండే సమయానికి, పిసినిగొట్లు తయారు! ఇంక చెప్పేదేముంది? సుభాహులు, వాలు మణియాలు, మేజుష్ఠులు, హస్తాంతరులు, హర్కార స్థలులు, సంప్రతీ ముజుముదాత్తులు వంటి ప్రభుత్వ పదవుల్లో వున్న అధికారులు దయా దాక్షిణ్యాలు లేకుండా, నాలుగు వైపుల నుంచి పంటపొలాల మీదకు క్రమ్ముకొస్తారు. పంటను ఏదో ఒక నెపం పెట్టి ఒడుచుకొని పోవడమే వారి పని! డబ్బు మదం నెత్తికెక్కిన, కన్నుమిన్ను కానకుండా రెపరెపలాడిపోయే స్వభావం కలిగిన, పొగరుబోతుల కంటె దున్నపోతే మేలైనది. ఎందువల్లనో చెపుతున్నాడు.

ముగ్ధాన్‌ ధిగ్ధనికాన్‌ రమామదమషీ దిగ్ధాన్‌ విదగ్ధా నహో!
జగ్ధౌ యబ్ధిషు దగ్ధబుద్ధి విభవాన్‌ స్నిగ్ధైః ఖలై రన్వహయ్
ధన్యం సైరిభ మేక మేవ భువనే మన్యే కి మ్తౖన్యెర్నృపై
ర్యో ధాన్యై శ్చ ధనై శ్చ రక్షతి జనాన్‌ సర్వోపకార క్షమః

ధనమదం తలకెక్కి తిండికీ, మైథునానికీ గొప్ప పండితులై, చెడుసావాసాలతో మసలుతూ, ఉన్న జ్ఞానం కూడా పోగొట్టుకొన్న ధనవంతుల్ని ఎల్లప్పుడూ తీవ్రంగా నిరసిస్తాను. వాళ్ళకు డబ్బుంది ఏం లాభం? ఈ ప్రపంచంలో దున్నపోతును మించిన అదృష్టవంతు లుండరు. ఎందుకంటే, అది కష్టం ఓర్చి ప్రజలకు ధనం, ధాన్యం రెండూ సమకూరుస్తుంది. ఆ విధంగా రక్షిస్తుంది. అంతటి ఉపకారం చేసే దున్నపోతును కాదని ఇతర పాలకుల నెందుకు ఆశ్రయించాలి? డబ్బు పొగరు మనుషుల్లో వివేకాన్ని మింగేసి పశుప్రాయుల్ని చేస్తూంటే జన్మకి పశువైనా, దున్నపోతు పజలకు రక్షణ ఇస్తున్నది కనుక ఆశ్రయించాలని కవి హృదయం!

మంత్రి మహిషం 9
డబ్బుపొగరు తలకెక్కిపోయిన వారికి నన్ను మించిన వాడెవడు? అనే దురభిమానం పట్టరానిదిగా వుంటుంది. పోనీ ఆ సంపాదించిన డబ్బు న్యాయసమ్మతంగా వచ్చిందా? అబ్బే! అన్యాయాలు చేసి మూటకట్టినది! డబ్బంటే సంపాదిస్తారు గాని, సంస్కారహీనంగా “దుర్‌ ధనికులు” ప్రవర్తిస్తారంటూ మంత్రి కర్కశంగా నిందకు సిద్ధపడుతున్నాడు.

మత్తా విత్తమదై ర్దురాగ్రహ భృత శ్చండాల రండాసుతా
యే ऽమీ దుర్ధనికా నితాంత పరుష వ్యాహారకౌలేయకాః
తేషాం వక్త్ర విలోకనా త్తవ వరం స్థూలాండకోశే క్షణం
యేన శ్రీమహిషేంద్ర లోస్యత ఇహ ప్రాయోణ మృష్టాసనమ్

అన్యాయార్జనంతో అహంకరించే ధనికులు వట్టి నీచపు ముండాకొడుకులు. కుక్కల్లాగా కర్ణకఠోరమైన మాటలు మొరుగుతుంటారు. శ్రీశ్రీశ్రీ హిషరాజా! అటువంటి వాళ్ళ ముఖాలు చూడడం కంటె బరువైన నీ వృషణ దర్శనం మేలు! ఈ దర్శనం వల్ల (అంటే పొలం దున్నే వేళ నీ వెనుక భాగాన నిలిచి వుండడం వల్ల) తరుచుగా మహామంచి భోజనం దొరుకుతుంది. అరక దున్ని, పంట పండించే వారికి మంచి తిండి లభించడం ఖాయం!! ఆ ధనవంతులు నాకే కాదయ్యా, నీకూ అపకారులే … అంటూ మంత్రి, దున్నపోతుకీ, దుర్‌ ధనికులకీ, తండ్రీ కొడుకుల సంబంధాన్ని అంటగట్టి ఎద్దేవా చేస్తున్నాడు.

దేహం స్వం పరిదగ్ధ యద్ధి భవతా ధాన్యం ధనం వా ర్జితమ్
తత్సర్వ ప్రసభం హరంతి హి సుచే దారా స్స్వకీయం యథా
హేతు స్తక్త కిలాయమేవ మహిష జ్ఞాతో మయా శ్రూయతాః
పుత్రా ఏవ పిత ు ర్హరంతి హి ధనుప్రేమ్ణా బలా ద్వాऽఖిలమ్

మహిషరాజా! నువ్వు నీ శరీరాన్ని ఎంతో కష్టపెట్టుకుని, ధనమో, ధాన్యమో సంపాదించుకుంటే… పన్నులు వసూలు పేరిట సుబేదారులు వచ్చి, ఆ మొత్తమంతా, తమ సొంత సొమ్మైనట్టుగా ఒడుచుకు పోతారు. ఇదెలా సాధ్యమని నేనాలోచిస్తే నాకీ కారణం కనిపిస్తోంది. విను.. ప్రేమతో
కానియ్యి, బలవంతంగా కానియ్యి, తండ్రి ఆస్తిని పట్టుకు పోయే వాళ్ళు కొడుకులే కదా! వీళ్ళని “దున్నపోతు కొడుకు” లని అంటే తప్పేముంది? కనకనే నీ సొమ్ము దోచుకుపోతున్నారని మంత్రి విస్తరించి చెప్పాడు. పాలకుడు, పంట పండించుకొనే రైతుకి ఉపకారమేదీ చేయక పోగా, బలిమిని దోచుకుపోవడానికి మాత్రం ముందుంటాడని వ్యంగ్యం!
--------------------------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

No comments: