Thursday, July 19, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 4


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 4
సాహితీమిత్రులారా!


నిన్నటి తరువాయి................
మంత్రి మహిషం 6
దున్నపోతు స్తోత్రం నెపంగా, పాలకులను అన్యాపదేశంగా నిందించడం వల్ల, నిజంగా ధర్మపరులైన రాజులకు కవుల మీద పట్టరాని ఆగ్రహం కలగవచ్చు. అంతేకాదు పండితులందరి మీద కూడా ఆకోపం ప్రసరించవచ్చు. దీని వల్ల ఏమి ప్రయోజనం సాధించినట్టు? అంటూ ప్రశ్న వేసుకునే
బుద్ధిమంతులైన రాజులకీ శతకం సంతోషాన్నే గాని, క్రోధం కలిగించదంటూ, మంత్రి ఇలా అంటున్నాడు

శ్త్రుౖత్వెత న్మహిష ప్రబంధ మహ యే భూపా గుణగ్రా హణ
స్తే బుద్వ్ధా నిజదుర్గుణాన్‌ కవిముఖా త్త ద్వ్య్దంగ్య మర్యాదయా
అద్రోహేణ నిజాః ప్రజా ఇవ యధా ధర్మం ప్రజా రక్షితుం
కుర్వంతు స్వకుల క్రమాగత నరాన్‌ దేశాధికారోచితాన్

ఈ మహిషశతకం విని, గుణాలు గ్రహించగల రాజులు సహృదయంతో కవిద్వారా వెలువడిన ఒక్కొక్క శ్లోకంలో ఉన్న వ్యంగ్యార్థాన్ని తెలుసుకొని, తమలోని చెడ్డగుణాలను గుర్తెరిగి, తమ ప్రజలను కన్నబిడ్డల లాగ ధర్మబద్ధంగా పరిపాలించే నిమిత్తం కులక్రమానుగతంగా వచ్చే అర్హులైన వాళ్ళను పదవుల్లో నియమించాలి.
రాజులకు కోపం తెప్పించడం కోసం కాదీ రచన. వారి విధానాలను సంస్కరించడం కోసమే. పాలకులకు మంచి గుణాల మీద గౌరవమే వుంటే, చెడ్డవాళ్ళకి అధికారమిచ్చిన దెవరు? అని ప్రశ్నించుకున్నాడు మంత్రి. కొందరు ద్రోహులు ధర్మాత్ముల్లాగా నటిస్తూ అధికార యంత్రాంగంలో పదవులు చేపట్టి, ప్రజల సర్వస్వాన్ని కొల్లగొట్టే పనిలో వున్నారు. ఎప్పుడూ ఈ సంగతి పాలకుడు గుర్తించడం లేదని మంత్రి బాధ. రాజు బుద్ధిమంతుడే. అతని కంటె బుద్ధిమంతులు మంత్రులు. అయినా, వారినీ, వీరినీ కూడా మోసగిస్తూ, దేశద్రోహ బుద్ధితో కొందరు కుసంస్కారులు, స్వేచ్ఛావ్యవహారాలతో ప్రజల్ని నానా బాధల పాలు చేస్తున్నారు. అందువల్ల మహిష రాజుగారూ, చోళదేశంలో వ్యవసాయం చెయ్యాలని కోరుకోకండీ ఆ కుసంస్కారాలు అధికారంలోకి వచ్చాకే, నా సర్వస్వం కోల్పోయి గోచిపాతతో మిగిలాను. నీకా గోచిపాత పోయే సమస్య కూడా లేదయ్యా సోదరా!!

రాజా ముగ్ధమతి స్తతో ऽపి సచివాస్తాన్‌ పంచయంతః ఖలా
దేశద్రోహ పరా స్తదైవ వృషలా స్సర్వాపహారోద్యతాః
ఆశాం మా కురు చోళదేశ కృషయే త్వం సైరి భాతః పరం
శిష్టం మే త్వలమల్లకం తదపి నభ్రాత స్తవా స్వ్తంతతః

మంత్రి మహిషం 7

దుర్మార్గం అనుసరించే ఆలోచనే రావాలి గాని, వచ్చిందే తడవు స్వార్థపరులైన కుసంస్కారులు విజృంభించకుండా ఊరుకోరు కదా! మంత్రి చెపుతున్నాడు

ధాన్యం వాథ ధనాని వా సమధికం కృత్వా మిథ స్స్పర్థయా
మిధ్యా సాహసినో ऽభ్యుపేత్య వృషలా దేశాధికారాశయా
ఉత్కోచేన నృపాంతక స్థిత జనాన్‌ వశ్యాన్‌ విధాయ ప్రజా
సర్వస్వం ప్రసభం హరంతి చ శఠా స్తేయాంతు కాలాంతికమ్

కుత్సితబుద్ధి గల కుసంస్కారులు కొందరు, దేశాధికారం పొందాలనే తహతహతో, మేం ఎక్కువ ధాన్యమిస్తామనో, ధనం ఎక్కువిస్తామనో, వారిలో వారు పోటీలు పడి, పాట పెంచివేసి, లేని సాహసాలు ప్రదర్శిస్తూ, రాజసన్నిధిలో వుండే పెద్ద అధికారులకు లంచాలిచ్చి లొంగదీసుకుని, అధికారం సంపాదించుకుని, బలవంతంగా ప్రజల సర్వస్వాన్నీ దోపిడీ చేస్తున్నారు. అటువంటి దుర్మార్గులు యమ సన్నిధికి పోవాలి. వాళ్ళు బతికి వుండడానికి అర్హులు కారని వాంఛేశ్వర మంత్రి నిప్పులు చెరుగుతున్నాడు. శాపనార్థాలు సరేనయ్యా బ్రాహ్మణులు సేద్యానికి ఉద్యమించారంటే, దొంగలయ్యారనే కదా అర్థం! అంటూ ఎత్తిపొడిచే వారికి సమాధానం చెపుతున్నాడు.

చౌర్యం నామ కృషీవలస్య సహజో ధర్మోః హ్య వృత్య్తంతరై
శ్చోళేషు ద్విజసత్తమై రనుచితా ప్యంగీ కృతా సా కృషిః
తా నేతాన్‌ వృషలా శ్శపం త్య కరుణా యే దుశ్శ్రవై ర్భాషితై
ర్యే వాతాన్‌ ప్రిహరంతి తే న్ముఖకరం భూయాత్క్రిమీణాం పదమ్

దొంగతనమా? అది రైతుకి సహజమే అనాలి. ఎందుకంటే, భూమినుంచి ధాన్యాన్ని, గడ్డిని, ఎత్తుకొని పోతూంటాడు. వ్యవసాయ వృత్తి తగినది కాకపోవచ్చు. కాని, చోళ దేశంలో బ్రాహ్మణులకు బ్రతుకుతెరువు వేరే లేకపోవడం వల్ల తప్పడం లేదు. ఇది ఆపద్ధర్మ వృత్తిగా, వ్యవసాయం చేసుకుంటూంటే, కొందరు కుసంస్కారులు వినజాలని పదజాలంతో తిడుతూన్నారు. కొందరైతే కొడుతున్నారు కూడా. వారి నోట పురుగులు పడ! వారి చేతులకు పురుగులు పట్టి పోను!! మంత్రికి కడుపు మండిపోయి బాధించే దుష్టుల మీద కసితో శాపనార్థాలకు దిగాడు.
---------------------------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

No comments: