Tuesday, July 17, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 2


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన)  - 2




సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి.........
మారిపోయిన పరిస్థితులపట్ల మంత్రికి కష్టం తోచింది. వంశం ఎంతగొప్పదైతే మాత్రం ఏం లాభం? అసభ్య ప్రవర్తన గల వారు తయారయ్యారు. ఇక ఉద్యోగం వల్ల ప్రయోజనం లేదు. వ్యవసాయం చేసుకోవడం ఒక్కటే దారి, అని నిర్ణయానికి వచ్చి మాట్లాడుతున్నాడు.

నానాజి ప్రభు చంద్రభాను శహజీంద్రానంద రా యాదయౌ
విద్వాంసః ప్రభవో గతాశ్రితసుధీ సందోహ జీవాతవః
విద్యాయాం విష బుద్ధయో హి వృషలా సభ్యా స్వ్థిదానీంతనాః
కిమ్‌ కుర్వేబ కృషే వ్రజామి శరణం త్వా మేవ విశ్వావనీం.

ఒకప్పుడైతే ధర్మాత్ముడు నానాజి మంత్రి, చంద్రభాను ప్రభువు, శాహజీ మహరాజు, ఆనందరాయ మంత్రి, వంటి వారు స్వయంగా మహా విద్వాంసులై తమదగ్గరకు వచ్చేవిద్వాంసుల్ని ఉదారంగా పోషించేవారు. కాని, ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పటికీ కొందరు మంచి పాలకులు లేకపోలేదు, పూర్వపు వాళ్ళంతగా కాదు. వీళ్ళు సభ్యత గల వాళ్ళు కారు. ధార్మికులు కారు. వేద,పురాణాలు, స్మృతులు వంటి వాటి మీద గౌరవం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం ెయ్యాలి? సమస్త ప్రాణులనీ రక్షించే వ్యవసాయ మాతా, నిన్నే శరణు వేడుకొంటున్నాను. వేడుకుంటున్నాడు సరే. వ్యవసాయం చేసుకోవడానికి వాంఛేశ్వర మంత్రి కులానికి వేద శాస్త్రాలు ఒప్పుకోవే, అని ఎవరైనా ఆక్షేపణ చేస్తారేమోనని ఇక్కడ ఆ ప్రమాణం కూడా చూపించదలచి మంత్రి అంటున్నాడు.

అక్షైర్మేతి నను శ్రుతి స్మృతి పథం ప్రాయః ప్రవిష్ఠేన కిం?
సౌఖ్యం వా హల జీవినా మనుపమం భ్రాతర్న కిం పశ్యసి?
కిం వక్ష్యే త దపి క్షితీశ్వరబహిర్వ్దార ప్రకోష్ఠస్థలీ
దీర్ఘావష్యితి రౌరవాయ కురుషే హా హంత హంత సృహాం.

ఋగ్వేదంలోని శాకల శాఖ సప్తమాష్టకంలో ఏ మన్నాడో వినలేదా? “జూదం ఆడవద్దు. సేద్యం చేసుకో. సేద్యం చేసుకుంటూ లోక గౌరవం పొందుతూ ధన ధాన్యాలతో ఆనందం గా జీవించు,” అని కదా వుంది. కనక వ్యవసాయం చేసే వాళ్ళకు సాటిలేని సుఖం కలుగుతూండడం అనుభవంలో ఉన్నదే, సోదరా. అయినా నువ్వు రాజగృహాల ద్వారాల ముంగిళ్ళలో పడివుండి ఎంతకాలమైనా నిరీక్షణతో గడపాలని కోరతావెందుకు? ఏం చెప్పాలి? అయ్యయ్యో, ఇంత కన్నా నరకం వేరే వుందా?

మంత్రి మహిషం 3
వ్యవసాయం చేసుకోవడం వేదసమ్మతమేనని ప్రమాణం చూపించావు సరే నయ్యా. ఆ ప్రమాణం వైశ్య కులం వారికి, తదితరులకు వర్తిస్తుంది గాని, నీ కులానికి పనికిరాదు. సేద్యం వల్ల ప్రత్యక్షంగా లాభం కనబడుతోంది కనుక తప్పులేదని వేదప్రామాణ్యం చూపించడం సరికాదు అనే ఆక్షేపకులకు మంత్రి సమాధానం చెపుతున్నాడు.

దుర్భిక్షం కృషితో న హీతి జగతి ఖ్యాతం కిల, బ్రహ్మణా
మాపద్ధర్మ తయా మనౌ చ కృషి గో రక్షా దికం సమ్మతం
భూపే ష్వర్థపరేషు హంత సమయే క్షుణ్ణే చ దుర్భిక్షతో
వృత్యర్థం కృషి మాశ్రయే మ భువి నః కిం వా తతో హీయతే.

సేద్యం వల్ల, కరవు లాటకాలుండవని లోకంలో ప్రసిద్ధి కద. ఆపద్ధర్మంగా బ్రాహ్మణులు, వ్యవసాయం పశుపోషణ చేసుకోవచ్చునని మను ధర్మశాస్త్రం కూడా చెపుతోంది. పాలకులు కేవలం నసంపాదన మీద దృష్టి పెట్టివుంటేనూ, కరవు కాటకాలతో కాలం సంక్షోభించి పోతుంటేనూ, బ్రతుకు తెరువు కోసం వ్యవసాయ వృత్తిని ఆశ్రయించక ఇంకేం చెయ్యాలి? కనక ఆ వృత్తినే ఆశ్రయించుకుంటాం. స్వధర్మం ఎలాగూ అనుష్ఠిస్తూనే ఉంటామనేది కూడా వ్యవసాయం మాకు ఆపద్ధర్మ వృత్తి అనడంలో ఉంది.

ఇలా సమాధానం చెప్పగా మహిషం (దున్నపోతు) మంత్రిని ” ఏమయ్యా, నీకు ఒక పాలకుడి కొలువులో సాగుబాటు లేకపోతే పోయె. వేరే చోటుకు పోయి చదువు చెప్పుకుంటూ జీవించవచ్చు కదా, అది శాస్త్రసమ్మతం కదా? అలా చేయవేమి?” అని అడిగినట్టు భావించి, దానికి సమాధానం చెపుతున్నాడు.

ఆర్య శ్రీధర మంబుదీక్షిత మిమౌ దృష్య్తా మహా పండితౌ
విద్యాయై సృహయే న యద్యపి వరం క్షాత్రం బిభే మ్యాహవాత్‌
వాణిజ్యం ధన మూలకం త దఖిలం త్యక్వ్తా శ్రిత స్వ్తా మహం
త్వం విద్యా చ ధనం త్వ మేవ సకలం త్వం మే లులాయ ప్రభో.

మహారాజశ్రీ దున్నపోతుగారూ, వినండి. శ్రీధరుడున్నాడు కదా, మహాపండితుడు. అంబుదీక్షితులూ ఉన్నాడు, గొప్ప నిష్ఠాపరుడు. పండితుడు. షడ్దర్శనాలూ ఆపోశనం పట్టి వదిలాడు. ఇద్దరూ దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారు. వీళ్ళని చూశాక చదువంటే నాకు విరక్తి కలిగింది. తను చదువుకోవడం, ఇతరులకు చదువు చెప్పడం అనేవి బ్రాహ్మణ ధర్మాలైనా, అవి నిష్ప్రయోజనాలని తేలిపోయింది. పోనీ, క్షత్రియ ధర్మమైన శస్త్రాలను ఆశ్రయిద్దామా అంటే, యుద్ధం అంటే భయం కనుక మానేశాను. సరి, ఏ భయం లేని వ్యాపార వృత్తి వుంది కదా అనుకుంటే, దానికి డబ్బు కావాలి. అది మనదగ్గిర లేదు కదా. ఇవేమీ లాభం లేవని నిర్ధారించుకొని, నిన్ను ఆశ్రయించాను. నువ్వే నాచదువు, నువ్వే నా ధనం, అన్నీ నువ్వే, నీ దయవుంటేనే ఇవన్నీ నాకు దక్కుతాయి.
-------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

No comments: