పాత్రికేయుని ప్రేమవార్త
సాహితీమిత్రులారా!
వృత్తిరీత్యా జర్నలిస్టులు కొన్ని పదాలకు అలవాటుపడి
ఆ పరిధిలోనే ఉండిపోడం తప్పనిసరి అవుతుంది.
ఏ విషయాన్నయినా తేల్చి చెప్పకపోవడం తమ మీద
బాధ్యత పెట్టుకోకుండా జాగ్రత్తపడడం వారి విధినిర్వహణలో
ఒక భాగం కనుక ప్రేమలేఖలోనూ అదే ధోరణి...........
ప్రేయసికి ఒక విజ్ఞప్తి
విజయవాడ జులై 1
శ్రీమతి / కుమారి విజయలక్ష్మి గారికి,
ఇటీవల లబ్బీపేట ప్రాంతంలో సాయంత్రం సుమారు ఆరు గంటల వేళ మిమ్మల్ని చూడటం తటస్థించింది. ఎర్ర చుక్కల తెల్లచీర కట్టుకున్న మీరు ఆరోజు చాలా అందంగా వున్నట్లు నేను భావించలేక పోలేదు. మీరు డాక్టరుగారి రెండో అమ్మాయని అభిజ్ఙవర్గాల
ద్వారా తెలియవచ్చింది.
కాగా మిమ్మల్ని చూసినప్పటినుంచి మనసు పరిపరి విధాల పోతోంది. ఇది ఒక వేళ ప్రేమభావన అయినా కావచ్చు.
పోతే నా వివాహం చేయాలనే ధృఢ సంకల్పంతో మా తల్లిదండ్రులు ఉన్నట్లు,
అందుకుగాను వారు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఇటీవల వెల్లడైంది. కనుక, మీకు ఆమోదయోగ్యమైతే అద్యతన భావిలో మన వివాహం జరుగగలదన్, ఇది విఫలం
కాబోదని ఆశిస్తున్నాను. అన్యధా భావించడానికి ఆస్కారం లేదు కాబట్టి మీరు మీ
అభిప్రాయాన్ని నిష్కర్షగా తెలుపగలరని విశ్వసిస్తున్నాను.
(ప్రేమ సఫలమైందా ఆమె జవాబు రాసిందా అనే విషయాలకు
వచ్చేవారం వార్తల్లో చూడాల్సిందే.)
(శ్రీరమణ పేరడీలు నుండి)
No comments:
Post a Comment