Friday, September 29, 2017

రైలుబండిలో వైతాళికులు - 4


రైలుబండిలో వైతాళికులు - 4




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........



విశ్వనాథకి చెయ్యి జాపి-

      "టికెట్ సార్...."

       "లేదు"

         "లేదా... ఇందాక ఎక్కడో వుందన్నారు?"

           "ఔను. అంటాను.

              అల నన్నయకు లేదు తిక్కనకు లేదు"

   "వాళ్ల సంగతి సర్లెండి. మీ సంగతి చెప్పండి.. పైగా మీరెవరో పెద్దమనిషిలా వున్నారు...."

వి.స.గారు వాని వంక విసవిసా చూసి

"నన్ను నెఱుగరో తెలుగునాట మీరు
విశ్వనాథ కులాంబోధి విధుని బహు వి
చిత్ర చిత్ర ధ్వని బహువిచ్ఛిత్తి మన్మ
హాకృతి ప్రణేత సత్యనారాయణ కవి-"

అని కంఠమెత్తి పాడారు.

      "పదగుంఫన మమోఘము....." అని వాఖ్యానించారెవరో - బహుశా కాటూరి వారే కావచ్చు.

   టి.టి.ఇ. అందుకేమీ రియాక్ట్ కాలేదు.

   పక్కన నిలబడండి అన్నట్టు సైగచేసి కాటూరి వారిని సమీపించాడు

   కాటూరి వారు మౌనంగా పింగళి వారిని చూపించారు

   "ఇదేం పద్ధతిగా లేదు. ఎంత జంటకవులమైనా, జవాబు కలుసే చెప్పాలా ఏమిటి?  ఈ క్లిష్టసమయంలో నా మీద భారం మోపకండి... మీరే చెప్పండి ఆ సంజాయిషీ ఏదో....."
చుట్ట తియ్యకుండా "ఉహు....ఉహు. ..."అనడం తప్ప కాటూరి వారి జవాబు లేదు.

    టి.టి.ఇ.కి ఇదేదో ఓ ముఠా అనీ, టికెట్ లేని ట్రావెలర్స్ అని అర్థమైపోయింది-

     అసలే లాలిత్యం - ఆపైన భయం - బాపిబావ మెలికలు తిరిగి పోతున్నారు - పక్కన నిలబడి.

    "టికెట్ ప్లీజ్...." అనగానే బాపిరాజు నీటి చిమ్మెన ఒక్కతూరి పైకెగసినట్టు ఇట్లు ఆరంభించిరి-

    "బెజవాడ నుండి కాకినాడ పోర్టు స్టేషనుకు టికెట్టు కొని యుంటిని..
నేను రూపాయి నాణెము ఇవ్వగా టిక్కెట్టుయున్నూ మూడణాలన్నర తిరిగి ఇచ్చినాడు. అతడిచ్చిన టిక్కెట్టు రెండంగుళముల మువ్వీసము పొడవు, అంగుళము బైన ఆరువీసముల వెడల్పూ, రెండు నూళ్ల మందమునూ, అరతులము బరువున్నూ కలిగి యుండెను. దానిపై ఏడు అంకెయు, దానికి ముందు రెండు సున్న వున్నవి. మొదటి అంకె అయిదు తదుపరి నాలుగు వున్నది. తెలుపు పసుపు కలివేత వర్ణములో కుడి అంచు పై భాగమున నల్లని చార కలిగియుండెను. చీనా దేశములో జలవర్ణ చిత్రములను ఇదే కొలతలు గల ఫలకములపై చిత్రించు నాచారము కలదు. ఇట్టి వానిని మినియేచరు చిత్రకళ అని వ్యవహరింతురు...."

   "మహాప్రభో! నన్ను వదిలెయ్యండి" అని గావుకేక పెట్టి టి.టి.ఇ. అవతలి వైపుకి నిష్క్రమించినాడు.

   "నీ శైలికి గొంత శక్తియున్నది"- అని విశ్వనాథ బాపిబావని అభినందించిరి.

   "రేపు సాహితీ సమితి సమావేశంలో - మన సభ్యులకు రైళ్లలో, బస్సులో, లాంచీలో, రేవు పడవలో టికెట్ కొనే అగత్యం వుండరాదని ఒక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపజేసి. వాటి నకళ్లు తీసి సర్కారు వారికి సమర్పిస్తాను...." సభాపతి హోదాలో హుకుం జారీ చేశారు శివశంకరస్వామి.

   "రేపటి సంగతి సరే... ఇప్పటి మాటేమిటి?"

   "అసలింతకీ మన రుక్మీనాథం ఏమైపోయినట్టు..."

   టి.టి.ఇ. వచ్చే స్టేషన్ లో దిగిపోవాలని నిష్కర్షగా చెప్పేశాడు.

   అంతా గందర గోళంగా వుంది - కవులలో కలకలం.

   "కర్మఫలము అట్లున్నపుడు ఒక యూరి కరణము మరియొక ఊరి కాపు కాక తప్పదు. మనము రుక్మిణీనాథమును నమ్మితిమి. మనిషి మనిషిని నమ్మును. లేనిచో మానుని నమ్మునా? నమ్మడు. నమ్మక మనగానేమి? అది యొక మానసిక ప్రవృత్తి నమ్మకము 
వేరు. విశ్వాసము వేరు. సమాజము - అనగా మనుషుల గుంపు. ఇందు కొందరు అంజనీ బుత్రులు కొందరు ఆషాడభూతులు. అతడు నమ్మిన బంటు. ఈతడు కాదు. అది మనకు తొలుతగా తెలియునా తెలియును. తెలియదు. ఇదియొక చమత్కారము........."

    "చస్తుంటే సంధ్యమంత్రమని - నడుమ మీ మధ్యాక్కరలా..."
అని పింగళివారు వారించారు.

(శ్రీరమణ పేరడీలు నుండి .............)

No comments: