Thursday, September 28, 2017

రైలుబండిలో వైతాళికులు - 3


రైలుబండిలో వైతాళికులు - 3




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........

        ఉన్నట్టుండి కమ్మని అత్తరు వాసన గుప్పున తగిలింది. అందరూ
ముక్కుపుటాలెగరేసి పైకి చూశారు

     అప్పర్ బెర్త్ మీద కూచున్న కృష్ణశాస్త్రి గారు అత్తరులో దూది తడిపి వైనంగా టిక్కెట్లకి రాస్తున్నారు - ఎంకిపాట హమ్ చేస్తూ.

అది గమనించిన విశ్వనాథ నవ్వు ఆపుకుని - "అన్నట్టు మన టిక్కెట్లెక్కడ" - అన్నారు.

    "రుక్మిణీనాథం దగ్గర వుంటాయ్"- అన్నారు కాటూరి వారు చాలా నిర్లక్ష్యంగా చుట్టనోటితో -

    "ఉంటాయ్ - అని వూహించడం కాదు - వున్నవా? - అది ముఖ్యం - అడుగో రంకు మొగుడల్లే టిక్కెట్లవాడు రానే వస్తున్నాడు".

    ఇంతలో టి.టి.ఇ. "టికెట్ సార్ టికెట్" అంటూ వచ్చాడు.

     "మాటలోనే వచ్చారు....వెయ్యేళ్లు..మా రుక్మీణినాథం దగ్గర వున్నాయి."

     "ఆయనెక్కడ.."

     "ఇప్పటిదాకా ఇక్కడే వున్నారండీ..ఇప్పుడే వస్తాడు.".శి.శి.స్వామి వారికి కోపం ఇంకా తగ్గలేదు.

     అప్పర్ బెర్త్ మీద కూచున్న కృష్ణశాస్త్రి గారిని "సార్ మీరు దిగిరండి. 
టికెట్ ప్లీజ్.. "అన్నాడు.

దిగిరాను దిగి రాను

దివి నుంచి భువికి

దింపి వేతురు గాక

నాకేటి వెరపు -

ఆన్నారు కృష్ణశాస్త్రి గంభీరంగా -

   ఏమీ అర్థంగాని టిక్కెట్లవాడు "తమరెవరు? ఎక్కడికి వెళ్ళాలి?" అన్నాడు
టిక్కెట్ల కోసం చెయ్యి జాపి.

   నా నివాసమ్ము తొలుత గంధర్వలోక

   మధుర సుషమా సుధాగాన మంజువాటి

   ఏ నొక వియోగ గీతిక.

   అనగా విని, కాలము వ్యర్థపుచ్చ నిచ్చగించక. టిక్కెట్లందుకొనుచు
ఆ కవికి టి.టి.ఇ. నిట్లనియె
-
   "టికెట్ ప్లీజ్"
   
   కృష్ణశాస్త్రి గారు చహల్ తో లాల్చీ జేబులో చెయ్యిపెట్టి ఘుమ ఘుమ
లాడుతున్న రెండు టికెట్లని అందించారు. టి.టి.ఇ. ముక్కులెగరేసి అదోలా ఆయన వంక ఓసారి చూసి-
    "ఈ రెండో టికెట్ ఎవరిది" అన్నాడు

   " నా ఊర్వశికి..."

    "వేరీజ్ షీ...."

    "ఎదలోపలి యెదలో, నెమ్మదిలో, జీవిత రహస్యమార్గమ్ములలో"
    .........

    కింద నున్న కురుమెళ్ల వెంకట్రావు గారు గురువుగారి హటం చూసి
కంగారు పడ్తున్నారు. దిగిరండి అంటే దిగిరాను అంటున్నారు. ఆయనకి అంతా అయోమయంగా ఉంది.

    సంధ్యవసాన
    సమయమున నీప సాదప శాఖికాగ్ర
    పత్ర కుటిలముల లోపల వసించు
    ఇరుల గుసగుసల్ వానిలో నిపుడునపుడు..

     టి.టి.ఇ. అయోమయంలో పడి "అయ్యా ఏమిటి వారనేది" అని కురుమెళ్ల వారిని అడిగారు.
    "...ఏదియొ అపూర్వ మధుర
     రక్తి స్ఫురియించుగాని అర్థమ్ము కాని
     భావగీతమ్ములవి....-"

     అని కురుమెళ్లవారు సమర్థించి చెప్పారు. ఆ రెండో టికెట్టు నా కోసం తీసుకున్నారని కూడా నచ్చ చెప్పారు. పొయిట్రీ వదిలేసి లెఖ్ఖ సరిపెట్టుకున్నాడు టి.టి.ఇ.
    
      "...కాదు..కాదు. ఇతనికి కాదు... ఇది నా ఊర్వశికే

            నిదురలో స్వప్నాల కదలికే బరువైన

            కలలెల్ల కనులిచ్చి కాల్చు నా గతియేమి!"
   
     అని దేవులపల్లి వాదిస్తే-

     "అయ్యా... మధ్యలో దింపేస్తే నా గతి ఏమిటో ఆలోచించండి" ప్రాధేయ పూర్వకంగా వారించారు వెంకట్రావుగారు.

     టిక్కెట్లవాడు ఇదంతా గమనించి దేవులపల్లి వంక జాలిగా చూసి వూరుకున్నాడు.   


(శ్రీరమణ పేరడీలు నుండి........)

No comments: