Sunday, September 10, 2017

బాపుగారికి కవిసామ్రాట్ విశ్వనాథ అభినందన


బాపుగారికి కవిసామ్రాట్ విశ్వనాథ అభినందన
సాహితీమిత్రులారా!


బాపు గారు రాజాలక్ష్మి పౌండేషన్ అవార్డు తీసుకుంటున్న సందర్భంగా
తమ ఆశీస్సులు పంపమని విశ్వనాథ సత్యనారాయణ గారిని కోరితే-
వారు పంపే అభినందనలు లేదా అభిప్రాయం ఎలా ఉంటుందో
ఊహిస్తే - ఆ ఊహకి అందిన వివరం ఇది.

        కొందరు తామ్రపత్రములిచ్చి సమ్మానించెదరు. ఒకడు సన్మాన పత్రముతో సరిపెట్టును. మరియొకడు శాలువా గప్పును. ఇది గుడ్డిలో మెల్ల. మరి కొందరు ధనమిచ్చి సత్కరించెదరు. ఇట్టి వారు యోగ్యులు. కనుక రాజాగారు యోగ్యులు. బిరుదులు, పొగడ్తల వలన బ్రాప్తించు బ్రయోజనమేమి శూన్యము. అట్టివి యెన్నైనను బుక్కెడు కొర్రలు కాజాలవు. నాకు లౌక్యము తెలియదు. సత్యము జెప్పుట నా మతము.  తిభగలవారినిట్లు గౌరవించుట లోకశ్రేయ మగును. ఇతన్ని బరామర్శింతుము ఇతడు యనగా బాపు. అది యతని కలము పేరు. ఇతడు చిత్రకారుడు కనుక కుంచెపేరు యనవలె. అతని అసలుపేరు యేమో? వుండును.మనకు తెలియదు. కవి అక్షరములలో రచనసేయును. చిత్రకారుడనువాడు రేఖలతో, వర్ణములతో సేయును. ప్రయోజనము భావవ్యక్తీకరణ. రససిద్ధి.ఈతడు జిత్ర రచన యందేగాక చలనచిత్ర రంగమున దర్శకునిగా గూడ కొంత కీర్తి నార్జించినాడు. ఆ రంగమున కీర్తితోబాటు ధనము కూడా మిక్కిలిగా యార్జించవచ్చునని కొందరు జెప్పగా వినియుంటిని. సినిమాలోకము గురించి బొత్తిగా నాకు తెలియదు. గూడవల్లి రామబ్రహ్మము ఇట్టివారితో లోగడ కొంత పేరు ప్రఖ్యాతులు  బడసినాడు. మేమిద్దరమూ ఒక ఊరివారమగుటచే నాకాపాటి  తెలిసినది.

రమణయని వొకడున్నాడు. ముళ్ళపూడి వారు. ఇతని సహపాటి
వీరిద్దరూ మంచి స్నేహితులని నాకు తెలియును. స్నేహమనగానేమి?
ఇది యొక అనుబంధము. అవగాహన దానికి ఆలంబన. రెండు
జీవుల సమైక్య వేదన. జీవి యనగా ప్రాణి. అయినచో ప్రతి బ్రాణి 
స్నేహము చేయునా చేయును. చేయదు - రాజేశ్వరరావని నాకు 
తెలిసిన యొకడున్నాడు. కలకత్తాలో జంతు శాస్త్ర మభ్యసించి
బ్రస్తుతము సర్కారులో కార్యదర్శిగా నున్నాడు- జంతుశాస్త్రము 
జదివినవానికి కార్యదర్శి బదవి యిచ్చుట ఏమి ఏమో అతడందులకు
అర్హుడని బైవారికి తోచివుండిననది. అతనికి పక్ేషిశాస్త్రము గూడ 
కొంత తెలియును. పక్షులలో మైత్రి స్వభావము మెండుయని 
అతడొక పర్యాయము చెప్పినాడు - అతని భార్య రూపసి. పేరు కల్యాణి.
కల్యాణి యని యొక అశ్వజాతి గలదు. ఆ జాతి గుఱ్ఱము వేగమునకు
 బెట్టినది బేరు.
       చూచితిరా ఈ వైచిత్రి? ఆమె సంగీతజ్ఞుని భార్య యగుచో మనకు కల్యాణిరాగము జ్ఞప్తికి వచ్చును. ఈతడు జంతుశాస్త్రవేత్త యగుటచే గుర్రము మనసున దోచినది. దీనిని స్పురణ అందుము. అదియొక మానసిక యవస్థ. అవస్థ యనగా స్థితి. అయినచో నిట్టి స్థితి..
(అదండీ పరిస్థితి)
                                                                                (ఆంధ్రజ్యోతి వారపత్రిక 3-12-82)

(శ్రీరమణ పేరడీల నుండి)

No comments: