రైలుబండిలో వైతాళికులు - 1
సాహితీమిత్రులారా!
నవయుగ వైతాళికులు అందరూ ఒకేచోట తారసపడడం చాలా అరుదైన సంఘటన. అందరూ కలసి రైలు ప్రయాణం చేయడం మరీ అపూర్వం. అట్లాంటి సంఘటనని వూహించి రాయటానికి ప్రయత్నించాను. వారిపట్ల నాకు గల గౌరవాభిమానాలే
దీనికి ప్రేరణ. పాఠకులు సహృదయంతో స్వీకరించ ప్రార్థన.
రైలు బయలు దేరింది.
రైలు పెట్టి నవయుగ వైతాళికులతో కిటకిటలాడుతూంది.
విశ్వనాథ, కాటూరి, పింగళి, దేవులపల్లి, శ్రీశ్రీ, పిలకా, మొక్కపాటి, శివశంకరశాస్త్రి, జలసూత్రం........ వీరందరితో బోగి కళకళలాడుతోంది.
రైలు మెల్లమెల్లగా వేగం అందుకుంటోంది.
ఆంధ్రసరస్వతి పల్లకిలో ఊరేగుతున్నట్టుంది.
రైలు ఊగుతూ సాగుతోంది.
తెలుగు పలుకులు ఊయలలూగుతున్నట్టుంది.
రైలు వేగం అందుకుంది.
విజ్ఞాన సర్వస్వం పుటలు రెపరెపలాడినట్లయింది.
* * *
కిటికీ పక్కసీటులో దుడుకు మీసాలు, ఎర్రటి రూపం దిట్టమైన అంచున్న ఖద్దరు పంచె సిల్కు లాల్చీతో కాటూరివారు కూర్చున్నారు. పక్కన వెడ్లపు మూతి వున్న సీసాలో చుట్టబెట్టిన పొగాకు కాడలు - సరిజోడుగా అగ్గిపెట్టి- సన్నగా, పొడుగ్గా సనాతన తాళపత్ర గ్రంథంలా వున్న విశ్వనాథవారు ఎదురు సీటులో కూర్చుని కాటూరి వారిని శ్రద్ధగా గమనిస్తున్నారు.
ఆయన పొగాకు కాడ తీసి, వైనంగా పాయి చీల్చి, చుట్ట చుట్టే పనిలో త్రికరణ శుద్ధిగా లీనమైపోయారు.
"మీకు పాయలు తీయడమే వచ్చు... మా బాపి బావకి జడవేయడం కూడా వచ్చు.. "
కొంటెగా అని-
రావోయి! సిన్నవాడ
మావాడ
ఆడివోరి సిన్నవాడ
రావోయి సిన్నవాడ-
అంటూ పాడడం ఆరంభించారు విశ్వనాథ.
పిలుపుపాట వింటూనే బాపిరాజుగారు అవతల వింగ్ లోంచి వచ్చారు.
కళహంస కదలి వచ్చినట్టు......
"ఇంతకీ నిర్వాహకులు సరసులేనా..... ఓ శాలువా ముక్కయినా
కప్పుతారంటారా....".-జనాంతికంగా అన్నారు విశ్వనాథ.
"ఏమో?దండల వరకూ శ్రీపాద హామీ పడ్డాడు కదా... వెళ్తోంది కాకినాడ
కనుక లంకపొగాకు పుష్కలం... ఇక మిగతావంటారా.... మన ప్రాప్తం
- వారి దయ...."
చుట్టపొగలోంచి కాటూరి వారు వదలిన మాటలివి
నొసలు కదిలించారు పింగళి లక్ష్మీకాంతం గారు. త్రాసుముల్లులా
నొసటనున్న గీరునామం కదిలించి కొంచెం ఆవేశధోరణిలో "అయినా మనం వెళ్తోంది మంగపతి గారింట్లో పెళ్ళికి. వీరమ్మపెళ్ళిలోనే నారిగాడికి వొడక సోగని - ఈ పెళ్ళివంకన వారి నెత్తిన సాహితీసమితి యావత్తూ దిగిపోయి సర్వసభ్య సమావేశం పూర్తి చేసుకోవాలని గదా బయలుదేరాం - ఊరికేపెట్టే అమ్మ నీ మొగుడు బంతిన పెట్టమన్నట్టు.... ఇంకా శాలువాలూ, సన్మానాలూ కూడానా... "అన్నారు పింగళి.
"నిర్వాహకులు సరసులేనా.... అన్నాను. దానికింత కంఠశోష ఏల?"
అన్నాడు విశ్వనాథ. పింగళి వారిచ్చిన జవాబు తనకేనని గ్రహించి.
"కాకినాడ పౌరుల ఔదార్యాన్ని శంకించనక్కరలేదు. ప్రతిభకి వారెప్పుడూ పట్టం కడ్తారు....నేనెన్నడూ అక్కడ నుంచి శాలువా లేకుండా రాలేదు మరి..." అప్పర్ బెర్త్ మీంచి దేవులపల్లివారి గళం పలికింది - కిందనే ఉన్న కాటూరివారి వైపు చుట్టకోసం చెయ్యి చాపుతూ అన్నారాయన.
"ప్రతిభ మాట ఎలా వున్నా - ప్రాంతీయాభిమానం కొంత అఘోరిస్తుంది కదా..." - విశ్వనాథ వారి విసురు.
(శ్రీరమణ పేరడీలు నుండి...........)
No comments:
Post a Comment