Saturday, September 16, 2017

ఆషామాషీ వడగళ్లు


ఆషామాషీ వడగళ్లు




సాహితీమిత్రులారా!



అణువులో అనంత విశ్వాన్ని దర్శించగలవారు మాత్రమే ఫీచర్ వ్రాసి నెగ్గగలరు. అల్ప విషయంపై అనల్పంగా చర్చించగల చతురత వుండాలి, తెలుగుదేశంలో అలాంటివారు ఎందరో వున్నారు. వారిలో కొందరి ఫీచర్ రచనలను అనుకరిస్తూ యీ పేరడిలో....

కృష్ణానది పుష్కరాలు వచ్చినపుడు - ఒక్కొక్కరి కలం కదలికలు 
ఎలా వుంటాయో ఊహించి ఈ పేరడీ రాయడం జరిగింది.

అసలు వడగళ్ళు రావూరివారి వడగళ్ళకి స్వరూప స్వభావాల్లో
సారూప్యం లేదు. ఇవి కరిగిపోని రుచిగల వడగళ్ళు.

ఆనాడు కృష్ణాపత్రికలో అందిన మసాలా గుగ్గిళ్ళు.
తర్వాత అవే ఆషామాషీ లోకి పరకాయ ప్రవేశం చేసినై.
రెండు పుష్కరాలకు పైగా  వ్రాస్తున్నా రావూరు వెంకట
సత్యనారాయణగారి పాళీ నిగ్గుతేలిందేగాని రవ్వంతైనా
అరిగిపోలేదు. వారి సున్నిత హాస్యధోరణి చిరులాస్యానికి
ప్రాణదాత.

కొంప కొల్లేటిసంత

      "ముందుగా చెప్పి వచ్చేది తిథి. చెప్పకనే దిగేది అతిథి. తిథినీ
అతిథినీ కూడ ఆదరించడం గృహస్థ విథి" - అని మల్లినాథ 
సూరిగారు అంటే "తిథులూ విధులూ ఏమోగాని ఈ అకాల పుష్కరం
నా పాలిట అధిక మాసమై కూర్చున్నది. సరిగంగ స్నానాలకోసం
సకుటుంబంగా చుట్ట పక్కాలంతా దిగితే కొంప కొల్లేటిసంత కాక 
ఏమౌతుంది?" అని వాపోయాడు బంధులోకం ప్రాప్తించిన ఒక పెద్దమనిషి.

        ఒక బ్రతక నేర్చినవాడు తీర్థం సాకుతో పిల్లా మేకతోసహా ఒక గృహస్తు
యింట తిష్ట వేశాట్ట. పిన్నిగారూ, బాబాయిగారూ వరసలు పెట్టి పిలుస్తుంటే, 
కాబోలునంటే కాబోలునని చాలా మర్యాద చేశారట విడిది దిగిన దంపతులు. 
శ్రావణ భాద్రపదాల బాపతని తేలేసరికి కొంక గుండమైందిట. "తీర్థానికి వచ్చిన 
వారికి యింత ప్రసాదం పెట్టామన్న తృప్తికంటే రుణభారం అధికమైందని "
విలవిల్లాడాడు ఆ గేస్తు.


కూసేవాడు మేసేవాడు

పుష్కర పర్వదినం కదా ప్రేత తృప్తికోసం తర్పణులు విడుద్దామంటే-
పురోహితుల గిరాకీ పెరిగిపోగా, వాళ్ళంతా చెట్లెక్కి కూర్చున్నారట.
"కూసేవాడికి పది, మేసేవాడికి అయిదు ఇచ్చుకోవాల్సి వచ్చిం "- దని
ఒక మిత్రుడంటే నాకు బోధపడింది కాదు. తర్వాత చెప్పాడు భాష్యం. 
కూసేవాడంటే మంత్రం చెప్పేవాడనీ, మేసేమాడంటే భోక్త అనీ. 
పోనీ అంత కష్టంగా వుంటే మానెయ్యకపోయారా అంటే "పితృ దేవతలు 
నక నక లాడరుటండీ మళ్ళీ పన్నెండేళ్ళకు కదా పాపం "అని జాలి
ప్రదర్శించాడు.

(శ్రీరమణ పేరడీలు నుండి...)

No comments: