Friday, September 15, 2017

ఆస్థాన కవి ప్రేమలేఖ


ఆస్థాన కవి ప్రేమలేఖ




సాహితీమిత్రులారా!



ఉర్దూ పారశీక భాషలు తెలిసిన ఆస్థానకవి దాశరథి.
ఆయాభాషల్లోని శృంగార రసాన్ని ఇంకించుకున్న 
కొద్దిమందిలో దాశరథ్ ముఖ్యులు. అంగారం,
శృంగారం కలిసికట్టుగా కవిత చెప్పగల దాశరథి
గారి ప్రేమలేఖ వూహామాత్రంగా.......

       మంచెమీద నుంచి పరిగపిట్టల్ని కసిరే
చానా!
    విసిరే వడిసెలలో రాళ్లు పెట్టావో పూలే 
తురిమావో తెలియదుకాని దెబ్బతిన్న నా గుండె
విలవిల లాడుతోంది. గూపులు వేసే చూపులు 
అలుపు వచ్చి మంచె మీదే ఆగిపోయాయి.
ఏ విసురులో నైనా నీ గుండెను గిరాటు వేస్తావనే
ఆశతో మంచె దగ్గరే పొంచి వున్నాను.
    నిన్ను చూడగానే అనుకున్నాను - ఏ పారశీక
కవో వూహించి రచించిన గజల్ వి నువ్వే అయివుంటావని.
ముషాయిరాలోంచి తప్పించుకు వచ్చిన కవిత పాదపంక్తివైనా 
అయివుండాలి. ఒక్కసారి మధుమాసం విలాసంగా నా గుండె 
గుమ్మంలో పల్లకీ దిగిన అనుభూతి కోటి పారిజాతాలు 
మానసోద్యానంలో ఘల్లున వెల్లివిరిసిన అనుభవం. అవి 
ఒంటరిగా మోయలేనంత బరువు.
     కవితాగారం గల యీ షరాబు, నేడు నా మ్రోల గోరంత 
ప్రేమను అర్థిస్తున్న గరీబు. సఖీ!నీవు సాకివి, నీ కన్నులు 
మధుపానపు గిన్నెలు, నాఎద కారవాన్ సరాయి. అయితే 
యిక నేను నవాబునే సుమీ!
     నికుంజం వుంది. ఒత్తిల మెత్తని పూలపాన్పూ వుంది. 
గుండె నిండుగ ప్రేమ సుధారసమున్నది. నీవు కూడా వుంటే 
చెలీ!యిక లేనిదేమున్నది రూపు రేఖలు పసిగట్టాను గాని 
నీ విలాసమే తెలియకున్నది రాణీ!

(ఇంతకీ ఆ విలాసవతి విలాసం తెలియదు యీ కవిగారికి, 
ఇక జవాబు ప్రసక్తి యేల)

(శ్రీరమణ పేరడీల నుండి......)

No comments: