రెండు శ్రీల కవి
సాహితీమిత్రులారా!
సంవత్సరం సరిగా గుర్తు లేదు, 1945 అనుకుంటాను – అవి నేను హైస్కూల్లో చదువుకుంటున్న రోజులు. మా వూళ్ళో పాకీవాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఊరేగింపుగా ఎర్ర జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ రోడ్డు మీద నడుస్తున్నారు. నేను స్కూలు నుంచి ఇంటికి వస్తూ ఆ ఊరేగింపు చూశాను. పల్లెటూరినించి వచ్చానేమో అలాంటిది నేనెప్పుడూ చూడలేదు. చాలా ఉత్సాహంగా అనిపించింది. పుస్తకాల సంచీ భుజానికి వేలాడేసుకొని నేనూ ఒక జండా పట్టుకుని, వాళ్ళతో నినాదాలు చేస్తూ నడవడం మొదలు పెట్టాను.
ఆ తరువాత ఆ ఊరేగింపులో నాతోపాటూ నడిచిన ఓ కొత్తాయనతో మా ఇంటికి దగ్గరే ఉన్న ఒక పుస్తకాల షాపు లోకి వెళ్ళి కూర్చున్నాను. ఆయన నాకు శ్రీశ్రీ మహాప్రస్థానం లోది అని చెప్పి, మరో ప్రపంచం పద్యం చదివి వినిపించాడు. నేనూ ఆ పద్యానికి ఉత్సాహపడిపోయి, ఆయనతో పాటు అవే మాటలు పాడడం మొదలుపెట్టాను. నా ఉత్సాహానికి మురిసిపోయి ఆయన తనకి కంఠస్థంగా ఉన్న మరో రెండు పద్యాలు చదివాడు. నాకు తల తిరిగిపోయింది. అప్పటికీ చాలా రాత్రి అయిందని నేను గమనించలేదు. (అంటే తొమ్మిదిన్నరో, పదో అయింది, అప్పట్లో అది చాలా రాత్రికిందే లెక్క.) పుస్తకాల షాపు మూసేస్తున్నారు. నేను, ఆయన చదివిన పాటలు బుర్రలో గింగిర్లెత్తిస్తుండగా ఇంటికి చేరుకున్నాను.
తలుపు తట్టగానే, తలుపు తీసిన మా అత్తయ్య నన్ను గుమ్మం దగ్గరే ఆపి, “నిన్ను ఇంట్లోకి రానివద్దన్నారు మీ మామయ్య. ఆ గుడ్డలు అక్కడ విప్పి, అదిగో ఆ నీళ్ళతో స్నానం చేసి ఈ సావిట్లో పడుకో, అన్నం తెస్తాను ఇక్కడే తిను.” అని మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. నేనిదేమీ పట్టించుకోకుండా, అన్నం కూడా తినకుండా శ్రీశ్రీ పద్యాలే ఆలోచిస్తూ అక్కడే పడుకుని నిద్రపోయాను. (ఆ మర్నాడు నాకూ మా మామయ్యకీ పెద్ద వాదనయింది. నేను ఆ ఊరేగింపులో ఉండడం మా మామయ్య చూశారట. పాకీ వాళ్ళతో తిరిగితే నేను మైలపడిపోతానని ఆయన నమ్మకం.నేను చేసిన తప్పేమీ లేదని నా వాదన.)
ఆ తరవాత చాలా రోజుల దాకా శ్రీశ్రీ కవిత్వం నన్ను ఒక జ్వరం లాగా పట్టుకుంది. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం పద్యాల రాత ప్రతులు సంపాదించాను. మా ఇంటి దగ్గర ఉన్న పుస్తకాల షాపు పేరు ప్రజాశక్తి బుక్ హౌస్ అనుకుంటాను. లేదా, అది ఆ పుస్తకాల షాపుకు తర్వాత వచ్చిన పేరో. అది కమ్యూనిస్టు పుస్తకాల షాపు. ఆ తరవాత ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ పుస్తకాల షాపులో కూర్చుని అక్కడి పుస్తకాలు చదివేవాణ్ణి. ఆ తరవాత నాలుగైదేళ్ళకి మహాప్రస్థానం అచ్చయి పుస్తకంగా వచ్చింది. అప్పటికే అందులో పద్యాలు కొన్ని నాకు కంఠస్థంగా వచ్చు.
క్షమించండి, శ్రీశ్రీ మీద వ్యాసం ఇలా సొంత గొడవతో మొదలు పెట్టినందుకు.
దాదాపు యాభై ఏళ్ళ తర్వాత, చాలా దేశాలు తిరిగిన తరవాత, చాలా మంది అంతర్జాతీయ కవులతో, వాళ్ల పుస్తకాలతో పరిచయం ఏర్పడ్డ తరవాత, ముఖ్యంగా, తూర్పు బెర్లిన్, హంగరీ, రుమేనియా వెళ్లిన తరవాత, ఈమధ్య శ్రీశ్రీ శతజయంతి సభకి డెట్రాయిట్ వెళ్ళాను. అక్కడ నేను శ్రీశ్రీ గురించి మాట్లాడ్డానికి ప్రయత్నించినప్పుడు, నా ఆలోచనలు అక్కడివాళ్ళు చాలామందికి బోధపడడం లేదని అనిపించింది. అవి వివరంగా చెప్పడానికి ఆ వాతావరణంలో నాకు అవకాశం దొరకలేదు. అందుకోసం ఈ వ్యాసం రాస్తున్నాను.
శ్రీశ్రీ అంటే చాలామందికి ఇప్పుడు కూడా గుర్తుకొచ్చేది మహాప్రస్థానం. అందులో మరో ప్రపంచ గీతం. ఆగీతంలో కవిత్వం ఉద్రేకపరుస్తుంది. మనుషులు సమూహంగా ఉన్నప్పుడు అది వాళ్ళల్లో ఉన్న సార్వజనీనమైన ఒక సహజశక్తిని ప్రకోపింపచేస్తుంది. ఈ పనిని ఈ గీతం శబ్దాన్ని ఒక కదం తొక్కే తీరులో నడిపించడం ద్వారా చేస్తుంది. ఇందులో స్థూలమైన లయ, స్పష్టమైన గతి, తరవాతి పాదం ఎలా నడవబోతోందో ముందుగానే ఊహించడానికి కావలసిన ఆచూకీ ఉంటాయి. పద్యంలో ఒక్కసారి వాడబడిన మాటలే మళ్ళీ మళ్ళీ వాడబడతాయి. (మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది / పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పైపైకి — ఇట్లా.)
ఇది వివరంగా రాయవలసిన అవసరం లేదు. కానీ, ఇలాంటి పద్యాలు ప్రకోపింపచేసేది మనుషుల్లో ఉన్న ఆవేశాన్ని, ఉద్రేకాన్ని. ఇవి మెదడు పైపొరల్లో ఉంటాయి. అందుకే వెంటనే ప్రకోపిస్తాయి. ఇప్పుడు మనకు గుర్తు లేవు కానీ స్వతంత్ర్యోద్యమ కాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసిన పాటల్ల్లాంటి పాటలు, నాజర్ పాటలు, ఇప్పటి గద్దర్ పాటలు, మరోప్రపంచ గీతం, ఇవన్నీ ఒకే కోవలోవి. ఇవి అవసరమైన కాలంలో వీటికి ఉన్న దీప్తి ఏ మహాకవిత్వానికీ ఉండదనిపిస్తుంది. ఇవి పాడేవాళ్ళని కదిలిస్తాయి, నడిపిస్తాయి. ముఖ్యంగా పదిమందీ కలిసి పాడుతుంటే లేదా కలిసి వింటూంటే, వ్యక్తిని సమూహంలో కలిపేస్తే ఉమ్మడిగా పైకి వచ్చే జాంతవ శక్తిని పైకి తెస్తాయి.
కాలం మారిపోయిన తర్వాత, సందర్భం చల్లబడిన తరవాత ఇలాంటి రచనలకి ఇవి ప్రచురింపబడినప్పటి చైతన్య ప్రేరక శక్తి ఉంటుందా అనేది ప్రశ్న. ఇలాంటి ప్రశ్న శ్రీశ్రీ రాసిన మరో కొన్ని పద్యాలకు కూడా వర్తిస్తుంది. ఉదా: జగన్నాధుని రథచక్రాలు, ప్రతిజ్ఞ, ఇలాంటివి.
ఈ పద్యాల నడక, శబ్ద సంయోజనం, వేగం, అవి కలిగించే ఆవేశం, ఇప్పటికీ దిగ్భ్రమ కలిగిస్తాయి. వీటి వెనకాతల ఉన్న విప్లవకర యోచన తెగిపోయిందనీ, దానికి కాలదోషం పట్టిందనీ, అనుకునేవాళ్ళకి ఇవి మాటల గారడీలుగా మాత్రమే కనిపిస్తాయి. కాని ఆ కాలపు ఈ రాతల సందర్భాన్ని, అప్పటి యువకుల ఆవేశాన్ని గుర్తు చేసుకుని చదవగలిగితే, ఇవి ప్రచండమైన రచనలే.
ఇందులో కవి వ్యక్తిగతంగా తలకెత్తుకున్న బాధ్యత కాల్పనికావేశంగా కనిపించొచ్చు. ఉదాహరణకి జగన్నాధ రథచక్రాల్ భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను లాంటి మాటలు విన్నప్పుడు, నూరుపాళ్ళ మార్క్సిస్టు అభ్యంతరం చెప్పచ్చు. కానీ, మార్క్సిస్టు సిద్ధాంతం కన్నా బలంగా ఇంకొక కాల్పనిక విప్లవావేశ పరిస్థితి అప్పటి కుర్రాళ్ళని చాలామందిని నడిపించిందని గుర్తు చేసుకుంటే తెలుగు కవిత్వంలో ఆనాటి వాతావరణం ఎంత మహేంద్రజాలిక మైనదో బోధపడుతుంది. కాని ఈ కవిత్వం తాత్కాలికం.
1930లలో యూరోపులో విస్తరిల్లిన ఆధునికమైన మార్పులు, అప్పటి సర్రియలిస్టు ఆలోచనలతో సహా, శ్రీశ్రీని ప్రభావితం చేశాయి. వాటిలో చూచాయగా ఉన్న మార్క్సిజం లాంటి విప్లవాత్మక కాల్పనికతే శ్రీశ్రీకి ప్రోద్బలం. అయితే, తెలుగు భాషను ఒక కొత్త మలుపు తిప్పగల శక్తి, శ్రీశ్రీకి ఎక్కణ్ణుంచో వచ్చింది కాదు. అది అతని సొంత కృషి, సొంత ప్రతిభ, సొంత సంస్కారం, అప్పటి తెలుగు సాహిత్య నేపథ్యం.
ఇవి మహాప్రస్థానానికి కారణాలు కాగా, ఆ పుస్తకం సకాలంలో అచ్చు కాకపోడంవల్ల, కొన్ని నష్టాలు జరిగాయి. అందులో సమయానికి తగిన కొన్ని పద్యాలు మాత్రం ఏరుకుని కంఠస్థం చేసి, కమ్యూనిస్టు పార్టీ సభల్లో చదవడం వల్లా, చండ్ర రాజేశ్వరరావు గారు ఆపాటలకి కమ్యూనిస్టు పార్తీ తరఫున వత్తాసు పలకడం వల్లా శ్రీశ్రీకి మార్క్సిస్టు ముద్ర పడింది.
ఈ ముద్రని శ్రీశ్రీ సంతోషంగా స్వీకరించడానికి చాలా కారణాలున్నాయి. అవన్నీ ఈవ్యాసంలో చర్చించడానికి సవకాశం లేదు. కాని శ్రీశ్రీ అనే వ్యక్తి క్లిష్టమైన జమిలి భాగంలో ఒక భాగానికి ఈ ముద్ర చాలా నప్పింది. ఆముద్రని అతనెప్పుడూ తిరస్కరించలేదు. కాని అంతరాంతాల్లో అంగీకరించనూ లేదు.
తొందర్లో ఎవరో ఒకరు తెలివితేటలూ, ఓపికా ఉన్నవాళ్ళు శ్రీశ్రీ జీవితచరిత్రని సమర్థంగా సమగ్రంగా రాస్తారని ఆశిస్తాను. అందులో చాలా సంగతులు వివరంగా తెలుస్తాయి. కానీ ప్రస్తుతానికి ఒక మాట చెప్పనివ్వండి. మహాప్రస్థానంలో రచనలన్నీ అవి అచ్చయి వచ్చాక కూడా ఎవరూ వాటిని ఒక సంపుటంగా సమూహంగా చూడలేదు. దానికి కారణం అప్పటికే శ్రీశ్రీ మార్క్సిస్టు కవిగా ముద్రపడిపోయి ఉండటం. రెండో కారణం, మహాప్రస్థానం అచ్చయ్యే నాటికి, శ్రీశ్రీ సాహిత్యమిత్రులు, సహచరులూ – అతని సాహిత్య చైతన్యంతో స్నేహ పూర్వకంగానో, స్పర్థ వల్లనో, వ్యతిరేకత వల్లనో, దగ్గరికి రాగలవాళ్ళు అతనితో సమానులుగా, కొండొకచో అధికులుగా ఉండేవాళ్ళు – చాలామంది చచ్చిపోవడం, లేదా సాహిత్యంలో మరుగున పడిపోవడం. ముఖ్యంగా, కొంపెల్ల జనార్దన రావు చచ్చి పోయాడు. శ్రీరంగం నారాయణ బాబు, శిష్ట్లా ఉమామహేశ్వర రావు పేరు వినిపించకుండా పోయారు. జరుక్ అనే పేరుతో అందరికీ తెలిసిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి మానసికంగా దెబ్బ తిని రకరకాల వేదనలతో, అలజడులతో మరుగున పడిపోయాడు. అబ్బూరి వరద రాజేశ్వరరావు, సాహిత్యమార్గంలో శ్రీశ్రీతో కొన్నిచోట్ల కలుస్తూ కొన్నిచోట్ల విడిపోతూ అయినా, పేచీలేని మంచి స్నేహితుడిగా తెరమరుగున మిగిలిపోయాడు. ఇక శ్రీశ్రీ కన్నా చిన్నవాడైన ఆరుద్ర కొన్నాళ్ళు శ్రీశ్రీని మామయ్యగా గౌరవించినా, తరవాత దూరమైపోయినా, ఎప్పుడూ శ్రీశ్రీకి సమానుడు కాలేదు. వెరసి శ్రీశ్రీకి స్నేహితులు లేకుండా పోయారు. ఉన్నవాళ్ళంతా అభిమానులూ, వందిమాగధులూ. తనతో సమానంగా సాహిత్య కృషిలో మాటా మాటా కలుపుకొని ఔననో కాదనో అనగల చనువూ సామర్థ్యమూ ఉన్నవాళ్ళు పోగానే, కవి ఒంటరివాడైపోతాడు. అదే సమయంలో అతను కీర్తిమంతుడు కూడా అయితే అది కవి సృజనకి ప్రమాదకరమైన విఘాతాన్ని కలిగిస్తుంది. అలాంటి ప్రమాదం నుంచి చాలా కొద్దిమంది తప్పించుకోగలరు. ఆ శక్తి వున్న వారి కోవలో శ్రీశ్రీ చేరలేదు. కానీ, అతని అంతరంగం మాత్రం ఎప్పుడూ అలా చేరకపోవడం వల్ల మథనపడుతూనే ఉండడం నేనెరుగుదును. ఉదాహరణలు చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు. (ఈ వ్యాసం ఇప్పటికైనా పంపకపోతే ఈమాట సంపాదక వర్గం నన్ను నిలువునా పాతేస్తామని హామీ ఇచ్చారు.)
ఇదిలా వుండగా, కమ్యూనిస్టు పార్టీ తెలుగు దేశంలో అత్యద్భుతమైన రీతిలో ఇటు కార్మికులూ, అటు కర్షకులూ లేని కార్మిక కర్షక పార్టీగా మధ్యతరగతి మేధావి వర్గ నాయకత్వంలో వృద్ధిపొందుతోంది. మొదట్లో ఇంగ్లండ్ లోని మార్క్సిస్టు నాయకులు చెప్పిన మార్గంలోను, దరిమిలా రష్యా నేతలు చెప్పిన అడుగుజాడల్లోనూ, చక్కగా ఎర్ర జెండాలు ఎగరవేస్తోంది. జీవితంలో, గాంధీగారి అనుయాయిగా నిత్యం రెండు పొట్టి ఖద్దరు లాగూలూ, రెండు ఖద్దరు చొక్కాలు తప్ప ఇంకే బట్టలూ లేని సామాన్య వ్యక్తిగా, పార్టీ మెస్సులో తిండి తింటూ అందరితో కలిసి పనిచేసే పుచ్చలపల్లి సుందరయ్య గారూ, అంతకన్నా కాస్త ఎక్కువ విశ్వవిద్యాలయపు వాసనతో చండ్ర రాజేశ్వరరావు గారూ పార్టీ శ్రేణులని తమ ఉన్నత వ్యక్తిత్వాలతో ఉత్తేజపరుస్తూ ఉండేవాళ్ళు.
రష్యా పార్టీ అడుగుజాడల్లో నడిచే వీళ్ళకి, పార్టీకి సాహిత్యరంగం అనుబంధంగా ఉండడం ఎంత అవసరమో బాగా తెలుసు. కాంగ్రెసు పార్టీ కానీ, సోషలిస్టు పార్టీ కానీ మరే రాజకీయ పార్టీ గానీ అప్పటికీ ఇప్పటీకీ బోధపరచుకోలేని ఒక విశేషం కమ్యూనిస్టు పార్టీ తొలిరోజులనుంచీ బోధపరచుకుంది. రచయితలూ, కవులూ పార్టీకి అనుబంధంగా ఉంటే వాళ్ళు జనంలో అభిప్రాయాలని సునాయాసంగా మార్చడానికీ, కొండొకచో రక్షణ కవచంగా కాపాడడానికి అద్భుతంగా ఉపయోగపడగలరు, అన్న సంగతి. ఈ ఆలోచన మూలభావంగా తెలుగుదేశంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. ఈ సంఘానికి రచయితలు స్వయంగా నాయకత్వం వహిస్తున్నట్టు కనిపిస్తుంది కాని, వెనకాతల పగ్గాలు చేతబట్టి వీళ్ళను నడిపించేవాళ్ళు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు.
తెలుగుదేశంలో అప్పటికే కవులూ, పండితులూ పరిషత్తులుగా, సమితులుగా పనిచేయడం ఆరంభమయింది. అఖిలాంధ్ర పండిత సభ, నవ్య సాహిత్య పరిషత్తూ, ఇవి కవుల్నీ పండితుల్నీ ఒక వేదిక మీద కలిపాయి. అప్పటికింకా రచయితలు అనే వర్గం ఏర్పడలేదు. కలిసి పనిచేసే ఈ సంస్థలలోని వారు భారతికి రచనలు పంపేవారు. అలాంటివి అసలు రచనలే కావని తిరగబడ్డ యువవర్గం ఆధునికపు ఆలోచనలతో వేరే పత్రికలకోసం ఎదురుచూసేది. కొంపెల్ల జనార్దనరావు ఉదయినిని నడపాలని అనుకోడం ఈ ఉద్యమంలో భాగమే.
కవి పండితులు నడిపే సంస్థలు మూత పడుతున్న కాలంలో చాప కింద నీరులా అభ్యుదయ రచయితల సంఘం వచ్చింది, అందులో పైకి కనిపించే అభ్యుదయ పదాన్ని అమాయికంగానో (ఇంకోరకంగా చూస్తే, బహుశా మాయికంగానో) చూసి, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారి దగ్గరనుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారితో సహా చాలామంది ఈ సంఘంలోకి ఎగబడ్డారు. శ్రీశ్రీని ఈ సంఘంలోకి కమ్యూనిస్టు పార్టీ కావాలని ఆకర్షించుకుంది.
తాను మార్క్సిస్టు కాడు. తాను విప్లవకారుడు కాడు. ఏమన్నా అయితే అరాచక పురోగామి వాది. అస్థిమిత భావోద్రేకి. అనిశ్చల తీవ్రమనస్కుడు. అవిశ్రాంత అన్వేషి. చుక్కాని లేని పడవ. తెగిన గాలిపటం. తనకీ లోకానికీ పడదు. కానీ లోకం తనకి కావాలి. తానేదో లోకానికి చేయగలననే నమ్మకం. అంతలోనే నిరాశ. అంతులేని అశక్తత. ఇది అప్పటి శ్రీశ్రీ వ్యక్తిత్వం. ఇది నేను కల్పించింది కాదు. మహాప్రస్థానంలో ఉన్న పద్యాలన్నీ చదివితే మీకు తట్టే వ్యక్తిత్వం ఇదే. కాని అవన్నీ కలిపి చదివి అందులో వినిపించే వ్యక్తిని పట్టుకోడానికి మహాప్రస్థానం ప్రచురించిన తర్వాతి వాతావవరణం అవకాశం ఇవ్వలేదు. తానై శ్రీశ్రీ అలాటి పని చెయ్యడానికి ప్రోత్సాహం ఇవ్వలేదు.
మహాప్రస్థానంలో ఉన్న పద్యాలన్నీ కలుపుకుంటే శ్రీశ్రీ, అతని సహచరుడైన శ్రీరంగం నారాయణ బాబుతో సహా ఒక కొత్త అతినవ్య (మోడర్నిస్ట్) కవిత్వం రాస్తున్నాడని బోధపడుతుంది. ఆధునిక కవిత్వం మనం ఎరుగుదుం. అతినవ్య కవిత్వం అంతకన్నా భిన్నమైనది. ఆధునిక కవిత్వం తెలుగులో గురజాడతో మొదలైంది అంటారు. కానీ, తెలుగులో ఆధునికత పదహారో శతాబ్దంలోనే మొదలైందనీ, గురజాడ దానికి పొడిగింపనీ, ఆ తరవాత వలస రాజ్య కాలంలో ఇంకోరకమైన ఆధునికత వచ్చిందనీ, దాన్ని తెలుగులో ఉండే ఒకే ఒక్క ఆధునికతగా భ్రమ పడుతున్నామనీ నా వాదన. అది ఇప్పుడు ప్రస్తుతం కాదు. కానీ, శ్రీశ్రీ, అతని అనుయాయులూ అప్పట్లో రాస్తున్న అతినవ్య కవిత్వం ఈ రెండు రకాల ఆధునికతకీ భిన్నమైనది. యూరోపులో మోడర్నిజం అనే పేరుతో దాదాపు ఇరవై యేళ్ళపాటు సాహిత్య కళా రంగాల్లో నడిచిన ఉద్యమానికి, శ్రీశ్రీ, అతని అనుయాయులూ రాసిన అతినవ్య కవిత్వానికీ చాలా దగ్గర పోలికలున్నాయి.
శ్రీ శ్రీ మహాప్రస్థానం రాసినది 1930లలో. తెలుగులో ఆనాటి కవులు అప్పటి ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్ రచయితలకి సమకాలికులమని, సమవుజ్జీలమని అనుకునేవారు. విశాఖపట్నంలో చాసో, శ్రీశ్రీ, రోణంకి అప్పలస్వామి, శ్రీరంగం నారాయణ బాబు ఇంకా వీళ్ళ స్నేహితులు, ఆ వూళ్ళో రీడింగ్ రూమ్ అనే పేరుతో ఉన్న లైబ్రరీలో ఇంగ్లండు నుంచి వచ్చే పత్రికలు చదివేవారు. ఆ తరువాత శ్రీశ్రీ మద్రాసు వెళ్ళినా ఆ సంబంధాలు పోలేదు. కూర్చున్నది విశాఖపట్నంలోనే కావచ్చు లేదా మద్రాసులో కావచ్చు. కానీ వీళ్ళకి ప్రత్యక్ష సహచరులు లండన్ లోనూ పారిస్ లోనూ రాస్తున్న కవులే. ఆనాటి రాజకీయాల, ఆర్ధిక పరిస్థితుల ప్రభావాలు వీళ్ళ జీవితాలలో ప్రత్యక్షంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అప్పటి ఆర్థిక మాంద్యం వీళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసింది. మనది వేరే దేశం వేరే సంస్కృతి అనే భావనకి తావు లేకుండా చేసింది. ప్రపంచ కుటుంబంలో మనం భాగస్వాములం అన్నంతగా అంతర్జాతీయ తత్వం వీళ్ళలో పాతుకుపోయింది. కవుల్లో అప్పుడున్నంత బలంగా ప్రపంచ భావన, ప్రపంచీకరణ గురించి ఇంతగా మొత్తుకుంటూన్న ఇప్పుడు కూడా లేదు.
దీని ఫలితాలు మహాప్రస్థానం నిండా కనిపిస్తాయి. స్విన్ బర్న్, ఎడ్గార్ ఎలన్ పో, ఎమీల్ ఫర్హారెన్ – వీళ్ళ కవితలు నిరాఘాటంగా మహాప్రస్థానంలో చోటు చేసుకున్నాయి. మిగిలిన పద్యాల్లో చాలావాటిలో యూరోపియన్ కవుల ప్రభావాలు, ప్రరోచనలు తేలిగ్గా దొరుకుతాయి. అయినా, ఇవి నూటికి నూరు పాళ్ళూ తెలుగు పద్యాలే. తెలుగు చేత కొత్త కొత్త పనులు చేయించడం, ఆ రోజుల్లో కవులు పనిగట్టుకుని చేసిన పని. సంప్రదాయాన్ని ఎదుర్కోడం అప్పటి నవ్య కవులందరూ ఉమ్మడిగా చేశారు. చెపితే నమ్మరు గానీ అప్పటి విశ్వనాథ సత్యనారాయణ గారితో సహా అందరూ అతినవ్య కవిత్వం రాసి, సంప్రదాయాన్ని ఎదుర్కున్న వారే. ఆయన రాసిన కిన్నెరసాని పాటలు కొంపెల్ల జనార్దనరావుతో కలిసి శ్రీశ్రీ విని ముగ్ధుడైపోయేవాడు. శ్రీశ్రీ కవితా ఓ కవితా చదివినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్ష స్థానం లోంచి లేచి వచ్చి అతన్ని కౌగిలించుకున్నారు. తెలుగులో నేనంటున్న అతినవ్య (మోడర్నిస్ట్) కవితావిర్భావానికి కవులు ఉద్యమిస్తున్న కాలం అది.
తరవాత కొన్నేళ్ళపాటు శ్రీశ్రీ అధివాస్తవిక రచనలు చేశాడు. పఠాభి ఫిడేల్ రాగాలు రాస్తున్న రోజుల్లో (1939) అతని సాహచర్యంలో రకరకాల కొత్త కవిత్వం రాశాడు. క్రమక్రమంగా శ్రీశ్రీ ‘కొత్త’కి పర్యాయపదం అయ్యాడు.
భావకవిత్వం అప్పటికి చెప్పుకోదగిన కొత్త కవిత్వం. భావకవుల పనినంతటినీ గుది గుచ్చి ‘వైతాళికులు’ సమర్థంగా అందించింది. కృష్ణశాస్త్రి గారు దానికి తెరవెనుక సూత్రధారి. పేరు ముద్దుకృష్ణదైనా పని కృష్ణశాస్త్రిది. ఆ కూటమిలో చేరకూడదని అప్పటి అతినవ్య కవులు శ్రీశ్రీతో సహా ఉమ్మడిగా నిర్ణయించుకున్నారు. (అయినా, ఆఖరి క్షణంలో ఎవరికీ చెప్పకుండా శ్రీశ్రీ తన పద్యాలు వైతాళికులలో చేర్చడానికి ఇచ్చి వచ్చాడు. కానీ ఈ విషయంపై చర్చ ఇక్కడ అప్రస్తుతం.)
ఆనాటి అతినవ్య కవుల్లో ఒకరుగా పుంఖానుపుంఖంగా రచనలు చేస్తూ మద్రాసులో చిల్లర ఉద్యోగాలు చేస్తూ కాలం గడిపేవాడు శ్రీశ్రీ. ఈ కాలంలో శ్రీశ్రీ రాసిన అధివాస్తవిక రచనలు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన అతినవ్యతకి ఉదాహరణలు. వాటిని స్వయంగా శ్రీశ్రీయే మార్క్సిస్టు ఉద్యమకారుల ఒత్తిడికి లోబడి తరువాతి కాలంలో తిరస్కరించడం తెలుగు సాహిత్యంలో ఒక విషాదం. అధివాస్తవికత తన జీవితంలో ఒక దశాచ్ఛిద్రం అని శ్రీశ్రీ ప్రకటించుకున్నాడన్న మాట పక్కకి పెట్టి, అధివాస్తవిక కవిగా తనను తాను గుర్తించుకోలేక పోయినా మనం గుర్తించి, ఆ కవిత్వాన్ని తిరిగి చదివి కొత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరంగం నారాయణ బాబుతో విడిపోయి శ్రీశ్రీ తనకి తాను అపకారం చేసుకున్నాడు. నారాయణ బాబు చచ్చిపోతూ ఆరుద్రకి ఇచ్చిపోయిన కవిత్వ లిఖిత ప్రతి, శ్రీశ్రీతో ఆరుద్రకి విబేధాలు వచ్చిన తర్వాతగాని నవోదయ రామ్మోహనరావుగారికి ప్రచురణకి చేరలేదు. ఆ రచనల్లో సంస్కరణలు చేయగలిగిన సరైన చారిత్రక నేపథ్యం రాయగలిగిన ఒకే వ్యక్తి ఆరుద్ర ఆపని చెయ్యలేదు. అంచేత ఒట్టి లిఖితప్రతి ఉన్నది ఉన్నట్టుగానే అచ్చయింది. అప్పటికి నారాయణ బాబుని అంతా మరిచిపోయారు.
కాని నారాయణబాబుని గుర్తుపెట్టుకుని, శ్రీశ్రీ సంపూర్ణ సాహిత్య సంకలనాలు పరిశీలిస్తే అందులో ఉన్న చాలా రచనలకీ, నారాయణ బాబు రచనలకీ పోలికలు చాలా కనిపిస్తాయి. అనేక విచిత్ర రచనలూ, కొత్త ప్రయోగాలూ ఉభయులూ కలిసి చేస్తున్నారనిపిస్తుంది. అప్పటికి గాని, శ్రీ శ్రీ కవితా వ్యక్తిత్వం అతినవ్య (మోడర్నిస్ట్) ఉద్యమానికి నాయకత్వం వహించగలిగేంత బలమైనదని మనకు స్పష్టంగా తెలీదు.
కాని, ఈ కవితా వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టగల సంఘటన ఈ సమయంలోనే జరిగింది. అదే అభ్యుదయ రచయితల సంఘ నిర్మాణం. అభ్యుదయ రచయితల సంఘం తెలుగులో అతినవ్య కవిత్వానికి అడ్డుకట్ట వేసి కవిత్వాన్ని వ్యక్తి నుంచి సమూహం వైపూ, అంతరంగం నుంచి బహిరంగం వైపూ, కవిత్వం నుంచి నినాదం వైపూ నడిపించింది. శ్రీశ్రీ స్వయంగా మహాప్రస్థానంలో ఉన్న అనేక అతినవ్య కవితల్ని విస్మరించి మరో ప్రపంచ గీతాన్నీ, జగన్నాధుని రథచక్రాల గీతాన్నీ, ప్రతిజ్ఞనీ, గర్జించు రష్యా గీతాన్నీ పరాకాష్టగా భావించాడు.
ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా యుద్ధంలోకి దిగడం తెలుగు యువకుల మనస్సుల్లో కలిగించిన ఉద్రేకానికి శ్రీశ్రీ గర్జించు రష్యా గీతం ఆకారాన్నివ్వడం తలుచుకుంటే. కాని ఈ నాడు ఎప్పుడూ నిజంగాలేని ఒక కాల్పనిక రష్యాని ఊహించుకుంటే తప్ప ఆ గీతానికి మీమనస్సుల్లో కనీసపు కవిత్వచ్చాయగా కూడా అస్తిత్వం ఏర్పడదు. నిజానికి ఇప్పుడు అది చదువుతుంటే నవ్వొస్తుంది.
క్రమంగా శ్రీశ్రీ తనకే అర్థం కాని, అర్థం చేసుకోడానికి ఎన్నడూ ప్రయత్నించని మార్క్సిస్టు ఆర్థిక విధానాలనీ, రాజకీయ తాత్వీకతనీ తనకు ఆపాదించుకొని తేలికపాటి ఉద్వేగానికి ప్రతీకగా నిలబడ్డాడు. అభ్యుదయ కవిత్వపు ఉద్యమ దశలో ఎవరో నడిపిస్తుంటే నడిచే బుట్టబొమ్మలా సాహిత్య రంగంలో ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తాను కవిగా క్షీణించి పోయాడు. కాని, మహాకవిగా ఒక విలక్షణమైన ఉద్యమానికి ప్రాణం పోశాడు. ఈకాలంలో అతను రాజకీయ ప్రకటనలూ, సాహిత్య ప్రవచనాలూ ఒకే రకమైన డొల్లతనంతో నిండి వుండేవి. అవి అతని ఆరాధకులకి, (నాకు కూడా) గొప్పగా పనికొచ్చేవి. వాళ్ళకి అవసరమైన రూపంలో కనిపించడమే అతను చేయదల్చుకున్న పని.
ఆతరవాత ఉద్యమాల తీవ్రత చల్లారిన తరవాత శ్రీశ్రీ సాహిత్య రంగంలోంచి పక్కకి వెళ్ళి సినిమా పాటలు రాశాడు. సరిగ్గా అదేకాలంలో, నక్సల్బరీ ఉద్యమం మొదలైనప్పుడు, శ్రీశ్రీకి అరవయ్యేళ్ళు నిండగా, విశాఖపట్నంలో అతనికి చేసిన షష్టిపూర్తి చారిత్రకంగా చాలా ముఖ్యమైన సంఘటన. అందులో చురుగ్గా పాల్గొన్నవాడిగా నేను ఇప్పుడు వెనక్కి సాలోచనగా చూసుకుంటే అప్పటి ఉత్తేజంలో నాకు బోధపడని సంగతులు ఇప్పుడు చాలా కళ్ళకు కడుతున్నాయి. అందులో ఒక్కటి మాత్రం చెప్తాను.
ఆనాటి షష్టిపూర్తిలో అన్ని వేలమంది జనం మధ్య వేదిక మీద శ్రీశ్రీ ఒంటరిగా కూర్చున్నాడు. అప్పటి ఉద్వేగపూరిత వివాదాత్మక సంఘటనల మధ్య శ్రీశ్రీ నిజంగా లేడు. అప్పటికే తన వ్యక్తిత్వంతో నిమిత్తం లేని ప్రతీకగా అయిపోయానన్న సంగతి అతనికి ఎక్కడో అంతరాంతరాలలో తెలిసినట్టే ఉంది. అప్పటి శ్రీశ్రీని గుర్తుకు తెచ్చుకుంటే, అసలు తనకేమీ పట్టనట్టుగా అదేదో ఎవరికోసమో ఎవరికో జరుగుతున్న ఉత్సవంగా, అన్నిటికీ దూరంగా ఉన్నవాడిలా కూర్చున్నాడని అనిపిస్తుంది. అంతమందీ అక్కడ ఉద్వేగంగా మాట్లాడిన తరవాత, ఆరుద్ర ఒక పెద్ద దుమారం సృష్టించే ఉపన్యాసం చేసిన తరవాత, శ్రీశ్రీ లేచి నిర్లిప్తంగా, సాదా గొంతుకతో నాలుగు మాటలు చెప్పి కూర్చున్నాడు.
ఆ తరువాత శ్రీశ్రీ నూటికి నూరుపాళ్లు సాహిత్య రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. విరసం నడిపించింది, అతను నడిచాడు. కవినాయకుడిగా చెట్టంత ఎత్తు ఎదిగాడు, కానీ కవిగా చల్లారిపోయాడు. రెండు మాటల్లో ముగించాలంటే శ్రీశ్రీ కవిత్వం రాస్తున్నప్పుడు మార్క్సిస్టు కాడు. మార్క్సిస్టులతో కలిసి నడిచినప్పుడు కవి కాడు.
(ఇది పూర్తిగా రాసిన వ్యాసం కాదు. తరవాత రాయబోయే వ్యాసానికి ఒక రేఖామాత్రమైన ఊహ మాత్రమే. కొద్దిరోజుల్లో దీన్ని వివరంగా రాస్తాను. – నారా)
-------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు,
ఈమాట సౌజన్యంతో
1 comment:
శ్రీశ్రీగారిపై విశ్లేషణ అనే కన్నా ఒక పరిశోధన అనిపించే వ్యాసం.
Post a Comment