Sunday, April 14, 2019

స్వప్నలోకచిత్రకారుడు మచాడో


స్వప్నలోకచిత్రకారుడు మచాడో



సాహితీమిత్రులారా!


ఆంటోనియో మచాడో (Antonio Machado, 1875-1939) గురించి నేను మొదటిసారి విన్నది చెస్వాఫ్ మీవోష్ (Czeslaw Milosz) దగ్గర. ప్రసిద్ధ పోలిష్ కవి, నోబెల్‌ బహుమతి గ్రహీత మీవోష్ తనకి చాలా ఇష్టమైన కవుల కవితలు కొన్నింటిని, ఎ బుక్‌ ఆఫ్‌ లూమినస్‌ థింగ్స్‌ (1998) పేరిట సంకలనం చేశాడు. అందులో ప్రతి కవితకీ నాలుగైదు పరిచయవాక్యాలు రాశాడు. ఆ కవీ, ఆ కవితా ఎందుకిష్టమో మనతో పంచుకున్నాడు. అలా పరిచయం చేసిన వాటిలో మచాడో కవితలు కూడా ఉన్నాయి. అందులో ఒకచోట మచాడో గురించి రాస్తూ అతడు స్పానిష్‌ కవులందరిలోనూ మరీ చైనా తరహా కవి అని విలిస్‌ బార్న్‌స్టన్‌ (Willis Barnstone) అన్నాడని రాశాడు. ఆ వాక్యం నన్నొక అయస్కాంతం లాగా పట్టుకు లాగింది. అసలే నేను ప్రాచీన చీనాకవిత్వ ఆరాధకుల్లో ముందు వరసలో ఉండేవాణ్ణి. అనుభవాన్ని అక్షరీకరించడమనే రహస్యవిద్యను పట్టుకోవడానికి గత పాతికేళ్ళుగా ప్రాచీన చీనాకవుల శుశ్రూష చేస్తున్నవాణ్ణి. అటువంటిది ఒక స్పానిష్‌ కవి చీనా కవుల్లాగా కవిత్వం చెప్పాడని తెలియగానే ఉండబట్టలేకపోయాను. మచాడో కవిత్వానికి బార్న్‌స్టన్‌ చేసిన అనువాదం బోర్డర్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌ (2004) తెప్పించుకుని చదివినదాకా నాకు నిద్రపట్టలేదు.

పుస్తకం చేతుల్లోకి రాగానే ఆతృతతో పేజీలు తిప్పుతూ చదివిన మొదటి కవిత తోనే మచాడో నన్ను పూర్తిగా లొంగదీసుకున్నాడు. ఆ కవిత, ముఖచిత్రం (Self portrait, 1906), కవి జీవితచిత్రమే:

నా బాల్యకాల జ్ఞాపకాలు, సెవీల్‌లో మా ఇంటిపెరడు,
పక్వాని కొస్తున్న నిమ్మపళ్ళతో మెరిసే పండ్లతోట.
కాస్టీల్ నేలమీద నడిచిన ఇరవయ్యేళ్ళు యవ్వనం, ఇక
నా జీవితం: మర్చిపోవాలనుకునే కొన్ని సంఘటనలు.

నేను డాన్‌ వాన్‌ని కాను, కలల రాకుమారుణ్ణీ
కాదని నా వేషం చూస్తేనే తెలుస్తుంది మీకు, సుమ
శరాలగాయాలు సహించినవాణ్ణే, స్త్రీలు ఎంతగా
చేయందిస్తే అంతగా ప్రేమలో కూరుకుపోయాను

నా రక్తనాళాల్ల్లో ఫ్రెంచివిప్లవాభిమానం, అయినా
నా కవిత్వం పుట్టేదొక ప్రశాంతమైన ఊటనీట
స్వధర్మం తెలిసిన సాహసిని, సత్యసంధుణ్ణి
అంతకన్నా సజ్జనుణ్ణి అనుకోవడమే నాకిష్టం

ఆధునికయుగోద్వేగమే నా సౌందర్యదృక్పథం
కాని పూర్వకవులనుండి కొన్ని గులాబీలు
సంగ్రహించకపోలేదు. అలాగని కొత్తముసుగులో
పాతపాటలు పాడను, పూతమెరుగులు మెచ్చను

అట్టహాసపు వీరగాథాగేయాల్లో బోలుతనం నాకు
నచ్చదు. వెన్నెట్లో కీచురాళ్ళ కూతల్లాంటివవి
ప్రతిధ్వనుల్ని తప్పించి ధ్వనికి చెవొగ్గుతాను
కంఠాలెన్నైనా నేను వినేదొకే ఒక్క స్వరం

నేను భావకవినా? ప్రబంధకవినా? తెలియదు.
నేను నా పద్యాన్నిక్కడ వదిలివెళ్ళినప్పుడు
తళతళలాడే దాని కత్తివాదర గుర్తుండాలి,
కాల్చిసానబెట్టిన కమ్మరికొలిమి కాదు.

నన్ను సదావెన్నంటే నేస్తంతో నా సంభాషణ
తనతో తాను మాట్లాడుకునే వాడొకనాటికి
దేవుడితో మాట్లాడకపోడు. నా స్వగతాలే
మనుషుల పట్ల నాలో ప్రేమ రగిలించాయి.

కష్టిస్తాను, నా ఖర్చులు నేనే చెల్లించుకుంటాను
ఇంటి అద్దె, దుస్తులు, శయ్య, రొట్టె సమస్తం.
చివరికి మీ ఋణమేదీ మిగుల్చుకోను, పైగా
నేను రాసిందానికి మీరే నాకు బాకీ పడతారు

నా అంతిమ ప్రయాణ తరుణం సమీపించాక
తిరిగిరాని తీరానికి లంగరెత్తేవేళ, పడవలో
నాదంటూ ఏదీ ఉండదు, సూర్యుడి కింద
సాగరతీరశిశువుల్లాగా దిసమొల తప్ప.

మచాడో అరుదైన స్పానిష్‌ కవి మాత్రమే కాదు, ప్రపంచకవి కూడా. ఆయన స్పానిష్‌ సాహిత్యంలో ’98 తరానికి చెందిన కవి. 1898లో అమెరికా చేతిలో స్పెయిన్‌ ఓడిపోయినప్పుడు పుట్టిన తరమది. వాళ్ళు తమ పరాజితస్వదేశం తిరిగి గర్వంగా తలెత్తుకోవాలని తపించారు. అలాగని మచాడో రాసింది దేశభక్తి కవిత్వం కాదు. అతడు తన దేశాన్ని తన దేశపు గ్రామాల్లో, పొలాల్లో, రైతుల్లో, ఋతువుల్లో దర్శించడానికి ప్రయత్నించాడు. అలా చూడటంలో అతడు రంగుల్ని చూశాడు. రాగాలు విన్నాడు. అవి స్పష్టంగా స్పెయిన్‌ రంగులు. కాని అతడు చూసిన స్పెయిన్‌ ఎంత స్ధానికమో, అంత విశ్వజనీనం. అందుకనే అతడు చూసిన, చూపించిన దృశ్యాల్లో నాకు నా బాల్యం, నా స్వగ్రామం, నా స్వదేశం కనిపించడంలో ఆశ్చర్యం లేదు. మచాడో కవితలు రాయడు, చిత్రిస్తాడు. బహుశా ఈ కళలో అతడితో పోల్చదగ్గ మరొక కవి ప్రపంచసాహిత్యంలో ప్రాచీన చీనా కవి వాంగ్‌ వీ (Wang Wei) మాత్రమే. ఈ మాట నేను అంటున్నది కాదు. వాంగ్‌ వీనీ, మచాడోనీ కూడా ఇంగ్లీషులోకి అనువదించిన బార్న్‌స్టన్‌ ఈ మాట అన్నాడని మీవోష్ రాశాడు. ఇందుకు ఆతడిచ్చిన ఉదాహరణనే (Summer night) నేనూ ఉదాహరిస్తున్నాను.

వేసవి రాత్రి
చాలా అందమైన వేసవి రాత్రి
ఈ పురాతనగ్రామమైదానానికి
మేడలు గవాక్షాలు తెరిచిపెట్టాయి
మనుష్యసంచారం లేని విశాలక్షేత్రం
రాతిబెంచీలు. చెట్లు, పొదలు
తెల్లని ఇసుక మీద సౌష్టవంగా
పరుచుకున్న నల్లనినీడలు.
దిగంతరేఖ మీద చంద్రుడు
గంటస్తంభంలో మెరుస్తున్న
గడియారగోళం
ఈ ప్రాచీనగ్రామసీమలో
ఒక పురాతనమైన నీడలా
నేనొక్కణ్ణే నడయాడుతున్నాను

బయటి దృశ్యాన్ని పట్టుకోవడంలో మచాడో ఒక లాండ్‌స్కేప్‌ చిత్రకారుడి లాగా కనిపిస్తాడు. ఈ గుణం వల్లనే అతడు ప్రాచీన చీనాకవుల్ని తలపిస్తాడు. అయితే అతడు చూసిన దృశ్యం బాహ్యప్రపంచదృశ్యం కాదు. అది ఆంతరంగిక ప్రపంచదృశ్యమే. దానికొక క్రమపద్ధతి ఉంది. బార్న్‌స్టన్‌ దాన్లో మూడు దశలున్నాయంటాడు. మొదటిదశలో కవి తన మనోమయ ప్రపంచానికి చెందిన స్వాప్నిక దృశ్యమొకటి చూస్తాడు. దాన్ని తన ఎదట ఉన్న బయట ప్రపంచపు లాండ్‌ స్కేప్‌ మీద ఆరోపించడం రెండవదశ. అప్పుడు ఆ బయటి దృశ్యంతో తన మానసికస్ధితిని, తన మూడ్‌ని అనుసంధానించడం మూడవదశ.

బయటి ప్రపంచపు ప్రకృతిని మానసిక ప్రకృతితో పోల్చి వర్ణించడం చీనాకవుల సంప్రదాయమని బార్న్‌స్టన్‌ అన్నాడు గానీ, ప్రాచీన సంస్కృత, ప్రాకృత, తమిళకవిత్వాల గురించి తెలిసినవాళ్ళకి అది కొత్తగా అనిపించదు. కానీ, భారతీయకవులు ప్రధానంగా మూడ్‌ని వర్ణించడంతో ఆగకుండా కథ చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. తమ వర్ణనలు కూడా కథలో భాగంగా ఉండాలని కోరుకున్నారు. కథతో సంబంధం లేని ఆత్మకథనాత్మక ముక్తకరీతి కవిత్వం మనదేశంలో చాలానే వికసించినప్పటికీ, దాన్ని మనవాళ్లు ప్రధానస్రవంతి కవిత్వంగా అంగీకరించలేదు. కవిత్వం రసపూరితం కావాలంటే అది కథని ఆశ్రయించకతప్పదనే భారతీయలక్షణవేత్తలు కూడా భావించారు.

కానీ చీనాకవులకి కథతో నిమిత్తం లేదు. కొత్తదనంతో కూడా నిమిత్తం లేదు. అవే అనుభవాలు, అవే అవస్ధలు, అవే భావావేశాలు. వాటినే పునః పునః చిత్రించడంలోనే వాళ్లకి ఆసక్తి. అలా చిత్రించుకుంటూ పోవడంలోనే కవి తన ఆత్మను కూడా చిత్రించుకుంటూ పోతాడు. ఆ ఆత్మసంతకాన్ని గుర్తుపట్టడమే రసజ్ఞుడి పని. బార్న్‌స్టన్‌ ఇలా రాస్తున్నాడు:

“చీనీయ తావో చిత్రలేఖనంలో లాగా అతడు చిత్రిస్తున్న ప్రకృతి దృశ్యాల్లో తరచూ రచయిత అదృశ్యమై, కేవలం దృశ్యం మాత్రమే మిగిలిపోతుంది. అతను చిత్రిస్తున్న ప్రకృతిక్షేత్రంలోని సజీవ అస్తిత్వాలు — కపిలగోవు, పొలం దున్నుతున్న కారెద్దులు, వాటి వెనుక ముడుతలు పడ్డ నుదుటితో నడుస్తున్న రైతు, ఇంద్రధనుసు లాగా సాగే పక్షుల బారులు, చర్చి గంటస్తంభం మీద వాలి ఆకాశాన్ని ధ్యానించే కొంగ — ఇవన్నీ కూడా ఆ నిశ్చల ప్రకృతిదృశ్యంలో భాగంగా అమరిపోతాయి. అయినప్పటికీ ఆ దృశ్యం వెనుక ఆ కవి మనని చేయి పట్టుకుని నడిపిస్తుంటాడు. మనతో పాటే విప్పారిన నేత్రాలతో నడుస్తుంటాడు. అతడి కళ్లల్లో నది ఒడ్డున పోప్లార్ల జ్ఞాపకాలు పునరుజ్జీవనం కోసం ఎదురుచూస్తున్న హేమంతకాలపు వెలమచెట్లూ, అక్కడ ఆ ఎస్పినో కొండమీద మరణాసన్నురాలైన తన భార్య కనిపిస్తూనే ఉంటారు. లేదా ఒక పురాతన స్పానిష్‌ గ్రామంలో అర్ధరాత్రి మల్లెపూల పరిమళాల మధ్య దిగంతరేఖ మీద చంద్రుడు ఉదయిస్తుండగా ఏకాకి గంటస్తంభం తోడుగా మట్టిబాటన నడుస్తుండే అతడి ఒంటరితనం మనకి ఆ కవితల్లో కనిపిస్తూంటుంది. అతడు తిరుగుతున్న పొలాలమ్మట మనం కూడా గుడ్డిగా కళ్లు పెద్దవి చేసుకుని అతడు చూపిస్తున్న దృశ్యాలన్నీ చూడటం మొదలుపెట్టగానే ఆ కవితో పాటు, మనం కూడా అదృశ్యమైపోతాం.”

ఆంటోనియా మచాడో అండలూసియా ముఖ్యపట్టణమైన సెవీల్‌లో (Seville) 1875లో పుట్టాడు. అతడి తండ్రి ఆంటోనియా మచాడో ఆల్వారెజ్‌ జానపద విజ్ఞానంలో సుప్రసిద్ధ పండితుడు. మచాడోకు ఎనిమిదేళ్ల వయస్సు వచ్చేటప్పటికి కుటుంబం మాడ్రిడ్‌కి (Madrid) మకాం మార్చింది. కాని తొలిబాల్యం నాటి ఆ అండలూసియా జ్ఞాపకాలు మచాడో మీద చెరగని ముద్ర వేశాయి. అతడి తొలి కవితా సంకలనం ‘సాలిట్యూడ్స్‌’ (Solitudes, 1903) పసితనపు రంగుల్నీ, రుచుల్నీ, సుగంధాల్నీ పట్టుకునే ప్రయత్నం చేసింది. దాన్ని 1907లో మరింత విస్తరించి ప్రచురించాడు. అప్పటి కవితల మీద వెర్లేన్‌ (Paul Verlain), హైన్‌రిచ్ హైనల (Heinrich Heine) ప్రభావంతో పాటు, మరొక స్పానిష్‌ కవి బెకర్‌ (Gustavo Becquer) ప్రభావం కూడా సుస్పష్టంగా ఉంది. బాదిలేర్ (Charles Bodelaire) గురించీ, విట్మన్‌ (Walt Whitman) గురించీ కూడా అతడికప్పటికే తెలుసు.

మచాడోని స్పానిష్‌లో 98వ తరానికి చెందిన కవిగా గుర్తిస్తున్నప్పటికీ అతడు చిత్రించిన స్పెయిన్‌ దేశభక్తి పూరితమైన స్పెయిన్‌ కాదు. తక్కిన కవులు రాజకీయంగా బలపడ వలసిన స్పెయిన్‌ గురించి ఆలోచిస్తుంటే, మచాడో స్పెయిన్‌ దేశపు మట్టి, రంగులు, పూలు, మనుషుల గురించీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ కాలం నాటి కవితల్లో అతడి చిన్ననాటి జ్ఞాపకాలు ప్రధాన వస్తువు. చిన్ననాటి జ్ఞాపకం (Memory from Childhood) అని రాసిన ఈ కవిత చూడండి:

విసుగ్గా, వణికిస్తున్న శీతాకాలపు
మధ్యాహ్నం. బళ్లో పిల్లలు
చదువుకుంటున్న దృశ్యం. కిటికీ
అద్దం మీద వాన చప్పుడు

తరగతి గది. బొమ్మల కార్డు మీద
ఒక పురాణ కథ
ఒకరినొకరు హతమార్చుకున్న
అన్నదమ్ముల బొమ్మ

బోలుగొంతుతో ఉరుముతున్న
ఉపాధ్యాయుడు, మాసిన దుస్తులు
అలసిపోయిన మనిషి, బక్కపలచని
దేహం, చేతిలో పుస్తకం

పిల్లలంతా ఎలుగెత్తి పాఠం
వల్లెవేయడం మొదలెట్టారు
‘ఏడేళ్లు నలభైతొమ్మిది
ఏడెనిమిదిలు యాభయ్యారు’

విసుగ్గా, వణికిస్తున్న శీతాకాలపు
మధ్యాహ్నం. బళ్లోపిల్లలు
చదువుకుంటున్న దృశ్యం. కిటికీ
అద్దం మీద వాన చప్పుడు

అతడి చిన్నప్పటి జ్ఞాపకాల్లో నదులూ, పోప్లార్‌ చెట్లూ, పువ్వులూ, కొండలూ పదేపదే ప్రత్యక్షమవుతాయి. అతడి కుటుంబం మాడ్రిడ్‌కి వచ్చేసినప్పటికీ ఆ చిన్నప్పటి అండలూసియా పట్టణంలో గడచిన అతడి పసితనం అక్కడి తోటలూ, నీటి ఊటలూ, తెల్లటి గోడలు, చర్చి శిథిలాలూ, సైప్రెస్‌ చెట్లూ, ఆ నిర్జననగరమధ్యాలూ కనిపిస్తూనే ఉంటాయి. తన చిన్నప్పటి ఇంట్లో గడుస్తున్న జీవితంలోకి కవిత్వం ప్రవేశించిన సందర్భాన్ని అతడెంతో సున్నితంగా కవితగా (A young face one day appears) మలిచాడు:

ఒకనాడొక యువతిముఖం
మా ఇంటిముందు కనిపించింది
నువ్వెందుకీ పాతయింటికి
తిరిగొచ్చావని అడిగానామెని.
అప్పుడామె ఒక కిటికీ తెరిచింది
పొలాలన్నిటిమీదా వెలుగు,
ఒక సుగంధం
ఇంట్లోకి ప్రవహించింది
తెల్లటిబాటపక్క
నలుపెక్కుతున్న తరుకాండాలు
శాఖాగ్రాన సుదూరస్వప్నాల్లోకి
తేలుతున్న ఆకుపచ్చపొగ
ప్రత్యూషపు తెల్లటిపొగమంచులో
విశాలమైననదిని తలపిస్తున్న
చెరువు, పాలిపోయిన కొండలమీద
మరొక పురాతన మృగతృష్ణ.

ఈ రోజుల్లోనే రాసిన ఒక కవిత నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు (Last night as I was sleeping) చాల సుప్రసిద్ధం. దీనికి రాబర్ట్‌ బ్లై (Robert Bly) చేసిన ఇంగ్లీషు అనువాదానికి తెలుగు చూడండి:

నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు
నేనో కలగన్నాను ‘ఎంత దివ్యమైన కల’
నా హృదయంలోకి నేరుగా
ఒక ఊటనీరు ప్రవహించింది.
జలాల్లారా, చెప్పండి,
నేనింతదాకా చవిచూడని
నవవసంతాన్ని వెంటబెట్టుకుని
ఏ రహస్యమార్గం ద్వారా
మీరు నాలో ప్రవహించారు?

నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు
నేనో కలగన్నాను ‘ఎంత దివ్యమైన కల’
నా హృదయంలో ఒక తేనెపట్టు.
నా పాతజీవితపు చేదు విషాలనుంచి
బంగారు తేనెటీగలు
తెల్లనితునకల చుట్టూ
తియ్యని మధువు కూడబెడుతున్నాయి.

నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు
నేనో కలగన్నాను ‘ఎంత దివ్యమైన కల’
నా హృదయంలో ఒక జ్వాలామయసూర్యగోళం
రగులుతున్నది.
ఎరట్రి అగ్నిగుండం నుంచి
వేడిగాలులు వెదజల్లుతున్నది.
ఎవరు చూసినా వెక్కివెక్కి ఏడ్చేస్తారు.

నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు
నేనో కలగన్నాను ‘ఎంత దివ్యమైన కల’
నా హృదయంలో నేను
భగవంతుణ్ని పొదివిపట్టుకున్నాను.

మచాడో మొదటి కవితలంతటా ప్రకృతి తాజాగా కొత్త రంగులతో, నవసుగంధాలతో కనిపిస్తుంది. మచాడోని మన హృదయాలకు సన్నిహితంగా తీసుకొచ్చేవి ఈ కవితలే. మాడ్రిడ్‌ లోనే మచాడో కవిగా ఎదిగినప్పటికీ అతడి కవితల్లో మాడ్రిడ్‌ కనిపించదు. ఇందుకు కారణం అతడు బాదిలేర్‌ లాగా నగరకవి కాదు. ప్రకృతీ, పట్టణమూ ఒక్కటిగానే దర్శనమిచ్చే సెవీల్ లోనే అతడి హృదయం లగ్నమైపోయింది. అటువంటి కవితలు చూడండి:

ఒక మబ్బుపింజ, ఒక ఇంద్రధనుసు (A Torn cloud and a rainbow)

ఒక మబ్బుపింజ, ఒక ఇంద్రధనుసు
ఆకాశంలో తళుకుమంటున్నాయి
పంటపొలాలచుట్టూ
ఎండావానా గుడికట్టాయి
ఒక్కసారి మెలకువ వచ్చేసింది. నా కలల
ఇంద్రజాల స్ఫటికరాగాల్నెవరు
కలగాపులగం చేస్తున్నారు?
నా గుండె కొట్టుకుంటోంది,
నాకేదో దిగ్భ్రమ.
పూతపట్టిన నిమ్మపొద,
తోటలో సైప్రస్‌లు, గరికపచ్చ మైదానం
సూర్యుడు, నీళ్లు, ఇంద్రచాపం
నీ కేశరాశిలో నీటిబిందువులు
ఇవన్నీ గాలిలో సబ్బుబుడగ లాగా
నా స్మృతిలో చెదిరిపోయాయి.

నేల నగ్నంగా వుంది (Naked is the earth)

నేల నగ్నంగా ఉంది
ఆకలిగొన్న ఆడతోడేల్లాగా ఆత్మ
శూన్యదిగంతం వైపు అరుస్తోంది
ఈ సూర్యాస్తమయంలో,కవీ,
నువ్వేం వెతుకుతున్నావు?
బాధిస్తున్న నడక, గుండెమీద
బరువుగా పరుచుకున్న బాట,
గడ్డకట్టిన గాలి, చిక్కనవుతున్న చీకటి
చేదెక్కుతున్న దూరం, తెల్లటిబాట మీద
నలుపెక్కుతున్న చిక్కటి చెట్లు
దూరపర్వతశ్రేణి మీద బంగారం,
రక్తం. సూర్యుడు మరణించాడు,
ఈ సూర్యాస్తమయంలో, కవీ
నువ్వేం వెతుకుతున్నావు?

తన ఎదుట ఉన్న ప్రకృతి దృశ్యంలో తన బాల్యాన్ని చూడటానికి ప్రయత్నించడంలో మచాడో నాకెంతో సన్నిహితుడుగా కనిపిస్తాడు. ఈ విషయంలో మచాడోకీ, నాకూ చాలా దగ్గర పోలిక ఉంది. అతడిలానే నేను కూడా ఎనిమిది తొమ్మిదేళ్ల వయస్సులోనే నా స్వగ్రామాన్ని వదలి దూరంగా వెళ్లిపోవలసి వచ్చింది. కానీ నా తదనంతర జీవితమంతా నేనెక్కడకు వెళ్లినా, నా చిన్ననాటి ఊరు, అక్కడి వెలుతురునీ పోల్చుకోవడానికే ప్రయత్నిస్తూ వచ్చాను. చిన్నప్పుడు తనకేమీ తెలియని వయసులో తన నిర్మలమైన హృదయం మీద పడ్డ వెలుతురు ముద్రల్ని తన తదనంతర జీవితమంతటా తిరిగి అన్వేషించడానికి ప్రయత్నించడంలోనే అతడు కవిగా మారాడని మనం గుర్తు పట్టవచ్చు. ఈ కవిత చూడండి:

లారెల్‌ చెట్టుకింద (Below the laurel tree)

లారెల్‌ చెట్టు కింద వానకు తడిసిన
ఆకుపచ్చని రాతిబెంచి
దుమ్ముపడ్డ పూలతీగనీ
తెల్లగోడనీ కడిగేసింది వాన
హేమంతవేళ పచ్చికతో
ఆడుకుంటున్నదొక మందపవనం
పోప్లార్లు గాలితో
కబుర్లాడుతున్నాయి, నికుంజంలో
అపరాహ్ణమారుతం
దిగంతాన్ని వైభవోపేతం చేస్తూ
సూర్యుడు ద్రాక్షతీగలపాదుల్లో
కాంతినింపుతున్నాడు, మేడమీద
సంపన్నుడొకడు పైపు వెలిగించాడు
చిమ్ముతున్న పొగ
నా చిన్నప్పటి పాటలు గుర్తొస్తున్నాయి
ఏమైంది నా హృదయానికి?
మెత్తనినీడలు బంగారుచెట్ల మధ్య
తప్పించుకుపోతున్నాయా?

తన రెండవ సంకలనం ది ఫీల్డ్స్‌ ఆఫ్‌ కాస్టీల్ లో (Fields of Castile, 1907 – 1917) కవి తనకు దొరికిన రంగుల దారాలతో మరింత సుందరమైన దృశ్యాన్ని అల్లుకోవడం కనిపిస్తుంది. కాని ఈ మధ్యకాలంలోనే అతడి జీవితంలో అత్యంత ప్రధానమైన సంఘటన సంభవించింది. అతడు 1907లో సోరియా (Soria) పట్టణంలో ఉపాధ్యాయుడుగా ఉద్యోగజీవితం ప్రారంభించినప్పుడు లెయొనార్‌ అనే పధ్నాలుగేళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ ఆ యువతి పట్ల ప్రేమగా మాత్రమే కాక, కాస్టీల్ నేల పట్ల ప్రేమగా కూడా వికసించింది. అతడు రెండేళ్ల తరువాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. 1912లో లెయొనార్‌ ఆకస్మికంగా మరణించింది. అదే సంవత్సరం అతడు ఉత్తర అండలూసియా లోని బాయేసాకు (Baeza) వెళ్లిపోయినప్పటికీ అతడి జీవితమంతా లెయొనార్‌, కాస్టీల్‌ల జ్ఞాపకం బరువైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. పూర్వకాలపు సంతోషం స్థానంలో ఇప్పుడు దుఃఖం, వదల్లేని జ్ఞాపకాలు, ఏకాంతజీవితపు విషాదం కనిపించడం మొదలుపెట్టాయి. కాస్టీల్ క్షేత్రాల గురించి అతడు రాసిన కవితలన్నిటిలోనూ ఈ దుఃఖం అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంటుంది. కొన్ని కవితలు చూడండి:

చైత్రమాసపు వేలజలాలు (The thousand waters of April)

చైత్రమాసపు వేలజలాలు
కేరింతలు కొడుతున్న గాలి
మేఘాలకూ, మేఘాలకూ మధ్య
ఊదారంగు ఆకాశం

నీళ్ళు, సూర్యరశ్మి. ఇంద్రచాపం
మెరుపు. దూరంగా
ఒక మబ్బు మీద పసుపురంగు
విద్యున్మాల

కిటికీ మీద వానవేళ్ళ చప్పుడు
అద్దాల ప్రతిధ్వని

సన్నగా వానజల్లు అల్లిక
కప్పిన అస్పష్టదిగంతం మీద
ఒక లేతాకుపచ్చ మైదానం
గజిబిజిగా కనిపిస్తున్న
ఓక్‌ చెట్ల అడవి, కనిపించకుండా
పోయిన కొండకొమ్ము

నింగి నుంచి నేలకు దింపిన దారాలు
కొత్త మడుగులు పేనుతున్నాయి
దువేరో నదీజలాల మీద
కదుల్తున్న నల్లని తరగలు

పంట పొలాల మీద వాన, అప్పుడే
నాట్లు వేసిన పొలాల మీద వాన
ఓక్‌ చెట్ల మీద ఒకింత ఎండ
దారిపక్క పడెలు కట్టినవాన

ఎండా, వానా. ఇంతలో నలుపెక్కి
ఇంతలో మెరుస్తున్న పొలాలు
ఇంతలోనే ఒక లోయ మీద చీకటి,
మరొక కొండ మీద వెలుతురు
ఇప్పుడే తళుకులీనుతూ, ఇంతలోనే
కునుకుతీసే పల్లెలు,
సుదూరప్రాచీనదుర్గాలు.

జేగురురంగు నేల మీద
పెద్దపెద్ద బంతులు దొర్లినట్టు
దూదిలాంటి బూదిలాంటి మబ్బులు

ఇప్పుడు కూడా ప్రకృతి అదే అందాలతో కనిపిస్తుంది కానీ, తన పక్కన తన స్నేహితురాలు లేదన్నది దుర్భరమైన విషయం కవికి. అందుకని ఏ అందాన్ని వర్ణించినా ఆమెను తలచుకోకుండా ఉండలేడు. తన బంధువు హొసే మరీయా పలాసియోని ఉద్దేశించి చెప్పిన కవితలో కూడా అదే ఛాయ.

హొసే మరీయా పలాసియోకు (To Jose Maria Palacio)

మిత్రమా, పలాసియో,
నది ఒడ్డున, దారి పక్క నల్లని పోప్లార్‌ కొమ్మల మీద
వసంతం అలంకారం మొదలుపెట్టిందా? దువేరో
నదీతీరమైదానాల్లో వసంతం రావడం కొంత ఆలస్యమే
కాని తీరా వచ్చాక ఎంత మెత్తగా, ఎంత కొత్తగా ఉంటుంది
పాత ఎల్మ్‌ వృక్షాల మీద కాసిని
చిగుర్లయినా తలెత్తాయా?
అకేషియాలింకా బోసిగానే ఉండి వుంటాయి,
సియొరా కొండలింకా మంచులో తడుస్తూనే వుంటాయి
తెల్లని, గులాబిరంగు మొంకాయో పర్వతరాశి మీద
ఆరగాన్‌ గగనం ఎంత శోభాయమానం!
బూడిదరంగు రాళ్ళమధ్య నల్లరేగుపొదలు
పూత పట్టాయా, పలచని పచ్చికలో
తెల్ల డైసీలు?

అక్కడి గంటస్తంభాల మీదకి
కొంగలిప్పుడే వచ్చి వాలుతుండాలి
నల్లరేగడి నాగేటిచాళ్ళలో ఆకుపచ్చ
గోధుమ చేలు,ముదురురంగు గాడిదలు,
చైత్రమాసపు వానలు పడుతూనే
పొలాల్లో నాట్లువేసే రైతులు. దవనంలో
మరువంలో తేనెటీగలు మైమరచే తరుణమిది
రేగుపళ్లు మిగలముగ్గాయా?నల్లకలువలు
విరగబూశాయా?
అక్కడక్కడ పిట్టలవేటగాళ్ళు రహస్యంగా
పొంచివుంటారు కదా.
మిత్రమా, పలాసియో, చక్రవాకాలు
నదిఒడ్డుకు చేరుకున్నాయా?
తోటల్లో మొదటిగులాబీలు, తొలి లిల్లీలు
వికసించే నీలిరంగు మధ్యాహ్నం
ఆ ఎత్తైన ఎస్పినోలో,
ఎస్పినో సమాధివాటికలో
నిద్రిస్తున్న ఆమెని పోయి
పలకరించవూ

ఇదే స్ఫురణ ఈ కాలంనాటి మరికొన్ని కవితల్లో కూడా చూడవచ్చు:

ఈ బూడిదరంగు రాళ్ళ మధ్య (Verse VI: ‘Passages’)

ఈ బూడిదరంగు రాళ్ళ మధ్య
కలలు కనడానికి తేనె పోసినట్టు
ఆ బంగారు తంగేడుపూలు ఎవరు
పూయించారు? ఆ నీలినీలి
పూలగుత్తులెవరు కురిపించారు
ఎవరు చిత్రించారు
సాయంసంధ్యాకాశం మీద
ఊదారంగు, కాషాయవర్ణాలు?
తేనెపట్టు, పల్లెపట్టు
నదీప్రవాహం మీద వంగిన
కొండకొమ్ము, గండశిలల్ని
పెనవైచుకుంటూ అనంతకాలం
ఉరకలెత్తే ప్రవాహం, సస్య
కేదారాల హరితసౌందర్యం, అన్నీ, ప్రతి
ఒక్కటీ, చివరికి, ఆ బాదం చెట్లపాదుల్లో
తెల్లటి గులాబిరంగు మట్టి కూడా

పూలు పూసిన కొండలపక్క (by the flowering hills)

పూలు పూసిన కొండలపక్క
విశాలసాగరతరంగాలు
నా తేనెటీగల మధుకోశంలో
అక్కడక్కడ ఉప్పుతునకలు

నిన్నటి నా దుఃఖాలు (Yesterday my sorrows)

నిన్నటి నా దుఃఖాలు
గూళ్లు అల్లుకునే
పట్టుపురుగులు
నేడు నల్లనిరెక్కలపురుగులు

ఎన్ని చేదుపూలనుంచి
నేనీ మైనం పోగుచేశానో
ఓఫ్, ఇప్పుడు నా దుఃఖాలు
తేనెటీగలై తిరుగుతున్నాయి

ఇప్పుడవి తాలుగింజలు
పొలాల్లో కలుపుమొక్కలు
గోధుమకంకులమీద బూజు
అడవిలో పెంకుపురుగులు

ఓఫ్, ఒకప్పుడు నా దుఃఖాలు
నిర్మలమైన కన్నీళ్లు
తోటలు తడిపే పంటకాల్వలు
ఇప్పుడు నేలలోంచి
అడుసును లాగే
వరదనీళ్లు.

ఒకప్పుడు నా హృదయం
నా దుఃఖాలకు
తేనెపట్టు,
ఇప్పుడవి తాకి మోది
పడగొట్టాలనుకునే
పాతగోడ.

1917-1930 మధ్యకాలంలో మచాడో న్యూ సాంగ్స్‌ (New Songs, 1924) పేరిట మరికొన్ని కవితలు రాశాడు. ఈ కాలంలో అతడు ఏబెల్‌ మార్టిన్‌, వాన్‌ డి మైరేన అనే పేరు మీద కూడా కవితలు రాశాడు. ఈ కాలంలో అతని జీవితంలోకి మరొక స్త్రీ ప్రవేశించింది. 1928లో సెగోవియాలో అతడు గియోమార్‌ అనే ఒక కవయిత్రిని కలిశాడు. ఆమె వివాహిత. ముగ్గురు పిల్లల తల్లి. భర్త ప్రభుత్వోద్యోగి. కాని వారిద్దరిమధ్య సఖ్యత ఉండేది కాదు. ఆమె దూరంగా ఉండేది. అప్పటికి స్పెయిన్‌లో విడాకుల చట్టం లేనందువల్ల ఆమె భర్త నుంచి దూరంగా ఉండేది. ఆమె పరిచయం అయిన తరువాత మచాడో పదేపదే ఆమె సన్నిధి కోసం తపించాడు. ఆమె అతడికి శారీరకంగా సన్నిహితం కాలేదు కానీ కవి దృష్టిలో ఆమె రక్తమాంసాలున్న స్త్రీ. ఆమె పట్ల అతడికి కలుగుతున్న ప్రేమ కోమలమైందీ, స్వప్నసదృశ్యమైందీ కాదు. ఇందులో సాంద్రత ఉంది, విరహం ఉంది, శారీరక కాంక్ష ఉంది, తీరని ఆకాంక్ష ఉంది. ఆమె కవికి ఎంత సన్నిహితంగా వస్తున్నదో అంత దూరంగా కూడా ఉండేదని చెప్పాలి. ఈ భావాలనే కవి ఒక కవితలో ఇట్లా చెప్పాడు:

నీ కవి
నిన్నే ధ్యానిస్తున్నాడు, నిమ్మపచ్చ,
ఊదారంగు దూరం,
పొలాలింకా పచ్చగా ఉన్నాయి
నువ్వు నాతోనే వున్నావు, గియొమార్‌
కొండలు మనల్ని లోపలికి లాక్కుంటున్నాయి
చెట్టుకీ చెట్టుకీ మధ్య రోజువాడిపోతోంది
రైలు విరుచుకుపడుతోంది,
పూలనీడల్లోకి తప్పుకున్నాయి.
గాడారామా కొండల
బంగారువన్నె గజిబిజి
ఒక దేవతా ఆమె ప్రేమికుడూ
కలిసిపారిపోతున్నందుకు
పున్నమి చంద్రుడు రొప్పుతూ వెంటబడ్డాడు
పెద్దకొండ సొరంగంలో
రైలు మాయమైంది
బీడుభూముల పచ్చిక, ధారాళమైన ఆకాశం
గ్రానైట్‌ కొండలు దాటాక, సున్నపురాళ్లు దాటాక
చివరికి అపారసముద్రం
మనం చేతులు కలిపి ముందుకు పోదాం
మనం విముక్తులం
కథల్లో క్రూరచక్రవర్తిలాగా
దేవుడు వాయువేగంతో వెంటబడనివ్వు
ప్రతీకారేచ్ఛతో రగిలిపోనివ్వు
జీను సవరించనివ్వు, అయినా
మన ప్రేమ స్వతంత్రం
దాన్నెవరూ ఆపలేరు.

స్పానిష్‌ అంతర్యుద్ధ సమయంలో అంటే తన చివరి సంవత్సరాల్లో అతడు సానెట్‌ (Sonnet) వైపు దృష్టి మళ్లించాడు. డాంటే (Dante), గోంగొర (Gongora), రొన్సార్డ్‌ (Ronsard) వంటి మహా కవుల దారిన తాను కూడా తన భావావేశాల్ని సానెట్‌గా మలచాలని ప్రయత్నించాడు. ఉదాహరణకి న్యూసాంగ్స్‌లోనే సంకలనం చేసిన ఈ కవిత చూడండి:

అగ్ని గులాబి (Rose of fire)

ప్రేమికులారా, వసంతం అల్లిన అల్లిక మీరు,
నేలా, నీరూ, గాలీ వెలుతురూ కలనేత, మీ
వక్షంలో ఉప్పొంగుతున్న పర్వతాలు, మీ
నేత్రాల్లో అల్లుకున్న పొలాలు పుష్పిస్తున్నాయి

నడవండి చేయి కలిపి వసంతంతో, పంచుకోండి
పూలతేరు, పొంచివున్న మృగాలు మిమ్మల్ని
ద్రోహవస్త్రంలో బంధించకముందే, అల్లరి చిరుత
అందిస్తున్న తియ్యటి క్షీరాలు తాగండి నిర్భయంగా

వేసవి అయనాంశరేఖ మీద భూమి ఇరుసు వాలక
ముందే, పచ్చని చెట్ల నడుమ పూలు వసివాడకముందే
దాహమింకా తీరకముందే, నేలలింకా తడవకముందే

సాగండి ప్రేమప్రపంచపు అపరాహ్ణదిశగా, తృప్తిగా
ముందుకి, మునుముందుకి, అరచేత అగ్నిగులాబీతో.

చివరి దశలో యుద్ధకాలంలో రాసిన ఈ కవిత కూడా చూడండి:

మళ్లా మన నిన్నటిరోజు (Again our yesterday)

మళ్లా మన నిన్నటిరోజు. పరదాల వెనగ్గా
సంగీతం, సూర్యుడు. పక్కనతోటలో బంగారు
ఫలసేకరణ. నేను చేయి చాపగానే
చిమ్ముతున్న ఊటలో మచ్చలేని నీలిమ
సెవీల్‌లో నా బాల్యం, ఆమెతోనే నిండిపోయింది
నా జ్ఞాపకాన్ని కాలమెంత తొందరగా కబళిస్తోంది
మన జీవితమూ అంతే, తమ్ముడూ, మాన్యుయెల్‌
గుర్తుపెట్టుకో, రేపటి రోజెవరిది కానుందో?
మన హోమవేదికనెవరో బాగా బలిసిన ట్యూటన్లకీ,
ఆకలిగొన్న మూర్లకీ అమ్మేసారు, ఇటాలియన్లకి
వాళ్ళు సాగరద్వారాలు వేలం పాడేశారు
మన ప్రజల్లో భయం, ద్వేషం పైకి కనబడవు. ఆలివు
తోటల్లో ఆలివు నూనె గానుగాడుతూ పాడుపడతారు,
పొలం దున్నుతారు, పస్తులుంటారు, పాడుతారు, ఏడుస్తారు.

1938 మొదలవుతూనే ఫ్రాంకో సైన్యం బార్సిలోనా పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి మూడురోజుల ముందు మచాడో, అతని కుటుంబం సరిహద్దు దాటి వెళ్లిపోయారు. అక్కడే ఆ చలికాలపు రోజుల్లో ఆ కుటుంబం తిండిలేకుండా గడపవలసి వచ్చింది. అక్కడనుంచి మళ్లా ఒక మిలటరీ వాహనం మీద ఫ్రెంచి సరిహద్దుల్ని దాటారు. చివరికి మచాడో తనెంతో ప్రేమించిన స్పానిష్‌ భూమిని వదలిపెట్టి, పరాయిదేశంలో అత్యంత దీనావస్థలో ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవలసి వచ్చింది. వృద్ధురాలయిన తన తల్లి కూడా మరొక మూడురోజుల తరువాత అతణ్నే అనుసరించింది. అతడి కవితలో చెప్పుకున్న ఈ వాక్యాలు చివరికి నిజమయ్యాయి.

నా అంతిమప్రయాణతరుణం సమీపించాక
తిరిగి రాని తీరానికి లంగరెత్తేవేళ, పడవలో
నాదంటూ ఏదీ ఉండదు, సూర్యుడి కింద
సాగరతీరశిశువుల్లా దిసమొలతో నేను తప్ప.

అతను మరణించినప్పుడు అతని ఓవర్‌కోటులో ఈ వాక్యం దొరికింది.

ఈ నీలి దినాలు, నా పసితనపు సూర్యుడు

మచాడో తన కవిత్వం పొడుగునా చెప్పడానికి ప్రయత్నించిన దానికన్నా, ఒక చెప్పలేని తనాన్నీ, ఒక నిశ్శబ్దాన్నే ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించాడని అనుకోవలసి ఉంటుంది. బార్న్‌స్టన్‌ రాసినట్లుగా, మచాడోకీ, అతడు పుట్టిన ఏడాదే పుట్టిన మరొక ప్రఖ్యాత కవి రిల్కకీ (Rilke) మధ్య ఈ విషయంలో కూడా ఒక పోలిక ఉంది. ఆ ఇద్దరు కవులూ కూడా ఏకాంతానికి చెందిన కవులు. వాళ్లు తాము చూసిన, తాము జీవించిన ప్రకృతి దృశ్యాల్నే కవిత్వంలో చిత్రించడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లు చిత్రించింది కేవలం చెట్లూ, కొండలూ కాదు. అతడు చూసిన, మనకు చూపించిన ఆ బాహ్యప్రపంచపు స్పెయిన్‌, బార్న్‌స్టన్‌ అన్నట్లుగా, మచాడో ఆంతరంగికప్రపంచమే. మామూలు పడికట్టు మాటలాగా వినిపించినప్పటికీ, మచాడో స్పెయిన్‌ ఆత్మను దర్శించాడనేదే సరైన మాట.

మచాడో చిత్రించిన ప్రపంచానికి నిర్దిష్టమైన రంగులున్నాయి. బాగా చేయి తిరిగిన నీటిరంగుల చిత్రకారుడిలాగా మచాడో రంగులపెట్టెలో కూడా రంగులు పరిమితమే. కాని ఆ కొద్దిపాటి రంగులతోటే అతడు ఎప్పటికప్పుడు ఎంతో ప్రకాశభరితమైన లోకాన్ని చిత్రిస్తూ వచ్చాడు. అతడి కవిత్వమంతా ఎన్నిసార్లు చదివినా పుస్తకం మూసేసిన ప్రతిసారీ కళ్లముందు మిగిలేవి ఆ రంగులే. ఆ రంగుల ఛాయలు భాషల పరిమితుల్ని దాటి, ఎంతదూరమైనా ప్రయాణించగలవనడానికి ఈ కవితలే గుర్తు.

దువేరో నదీతీరం (On the banks of Duero)

ఎత్తుగా గంటస్తంభం మీద వాలిన కొంగ
స్తంభం చుట్టూ, ఒంటరిమేడ చుట్టూ
కిచకిచలాడుతున్న పిచుకలు
మంచుతుపానుల, నరకఘోషల
శ్వేతశీతం తరలిపోయింది, ఈ
ప్రభాతం బద్ధకంగా ఒళ్ళువిరుచుకుంది
పేద సోరియా భూమిని మెత్తగా
వేడెక్కిస్తున్న సూర్యుడు
నీలంవన్నె తిరిగి విభ్రాంతపరుస్తున్న
పచ్చని పైన్‌ చెట్లు
దారిపక్క నది ఒడ్డున సన్నని పోప్లార్‌ చెట్లమధ్య
చిగురిస్తున్న వసంతం
మృదువుగా, మూగగా, తేటగా ప్రవహిస్తున్న
నది, మరీ లేతగాని, మరీ ముదురెక్కని
పంటపొలాలు
పచ్చికలో ఇప్పుడే ఒక చిన్నిపువ్వు పుట్టింది
తెలుపో, నలుపో. మైదానాల్లో అందమిప్పుడే
అంకురిస్తోంది, మంత్రమయవసంతం!
తెల్లటిబాట పక్క కిక్కిరిసిన చెట్లు, ఒడ్డ్డమ్మట
వికసించిన పోప్లార్లు,
సుదూరనీలదిగంతం మీద
కొండలనురగ
సూర్యప్రకాశభరితమైన రోజు
మధురాతిమధురం స్పెయిన్‌ భూమి

నల్లని జలాల పక్కన (By the black water: New Songs)

నల్లని జలాల పక్కన
సముద్రం, మల్లెల పరిమళం
సంగీతతరంగితసాయంకాలం
ముదురు ఓక్‌ చెట్టు
ముదురు ఓక్‌ చెట్టు
రాళ్ళబంజరు
సూర్యుడు మునిగిపోగానే
నది మేల్కొంటుంది
ఊదారంగు,కపిలవర్ణాల
దూరపర్వతశిఖరాల్లారా!
నీడలు పరుచుకున్న గాలిలో
నది ఒక్కటే మాట్లాడుతుంది
ఒక ప్రాచీన అపరాహ్ణపు
పేలచంద్రుడు
గడ్డకట్టిన పొలాలంతటా
మట్టికాదు, వెన్నెల

సూర్యుడి కింద ఒక కల తల దిమ్మెక్కిస్తూ (The dream below the sun)

సూర్యుడి కింద ఒక కల తల దిమ్మెక్కిస్తూ, కళ్ళు బైర్లు కమ్ముతూ
ఆకాశం ఎరుపెక్కిన వేళల అత్యుష్ణ స్వప్నం
వెలుగు చిమ్ముతున్న నదిమీద గాలి తీస్తున్న నాగేటిచాళ్ళు
మండుతున్న కొండలు
ఈ అపరాహ్ణం ఒట్టి దుమ్ము, సూర్యుడు
మారుమూల కనుమలో కునుకుతీస్తున్న
గాలిశంఖం కీచుమోత
తూలికలాంటి ఒక తేలికపాటికల
ఖర్జూరవృక్షం మీదనుంచి పైకి లేచి
నారింజపూలలో ఆవిరయ్యింది
ఆగిపోయిన మోటబావి నిశ్శబ్దంలో
ఒక కొంగ మత్తుగా ముక్కు జొనిపింది
ఒక ఎద్దు పచ్చిక మీద
అడ్డంగా మోరచాపింది
నిండుగా వికసించిన
కొమ్మల ఆకుపచ్చ నురగ
తెల్లగోడ మీద
చప్పుడు చెయ్యకుండా
ఒలుకుతోంది.
అట్టహాసపు ఆకాశం కింద
ఒక తోట సోమరిగా
నీడలో ముడుచుకుంది
ఎర్రటి అపరాహ్ణవేళ
దూరంగా
గంటస్తంభం కిటికీలు
తళుకులీనుతున్నాయి.
---------------------------------------------
రచన: వాడ్రేవు చినవీరభద్రుడు, 
ఈమాట సౌజన్యంతో

No comments: