Sunday, April 21, 2019

గ్రంథచౌర్యం గురించి …


గ్రంథచౌర్యం గురించి …




సాహితీమిత్రులారా!


“నేను చదివిన పుస్తకాల్లో ఉన్నదంతా నేను రాసేపుస్తకాల్లోకి వెళ్తుంది,” అని అన్నాడట డీన్‌ బీచింగ్ [1]. ఇదేదో అక్షర సత్యమని నమ్మి ధీమాగా ఈ రోజుల్లో కాపీకొడితే, కోర్టులచుట్టూ తిరగటం తప్పదు. ఎంత అధ్వాన్నదశలో ఉన్నా, ‘కాపీరైట్‌’ చట్టాలు ఉన్నాయికదా! అయినా కాపీచెయ్యడం రైటేనని కాపీచేసి, గొడవలు పడ్డవాళ్ళు లేకపోలేదు. ఏగొడవా లేకండా గూఢంగా డబ్బులు చేసుకున్నవాళ్ళూ లేకపోలేదు.

పదో శతాబ్దపు (900-950) లాక్షణికుడు రాజశేఖరుడు [2], కావ్య మీమాంసా అనే లాక్షణిక సూత్ర గ్రంథంలో, గ్రంథచౌర్యం గురించి ముచ్చటిస్తూ శబ్దహరణప్రకరణంలో ఇలా అంటాడు:

పుంసః కాలాతిపాతేన చౌర్యమన్యద్విశీర్యతి
అపి పుత్రేషు పౌత్రేషు వాక్చౌర్యం చ న శీర్యతి.

కొంత కాలం గడచిన తరువాత ఏ చౌర్యం అయినా సమసిపోవచ్చు కానీ, సాహిత్య చౌర్యం పుత్రపౌత్రాది పరంపరగా వెంటాడుతుంది అని భావం. ఆ రోజుల్లో పాపభీతితో గ్రంథచౌర్యం చెయ్యరని అతగాడి నమ్మకం అయి ఉండాలి. రాజశేఖరుడు చాలా తెలివైన వాడు. పాపంసంగతి అలా వదిలిపెట్టి, గ్రంథచౌర్యం గురించే ఇంకా ఇలా అన్నాడు:

నాస్త్యచౌరః కవిజనో నాస్త్య చౌరా వణిగ్జనః
స నన్దతి వినా వాచ్యం యో జానాతి నిగూహితుమ్.

(గ్రంథ) చౌర్యం చెయ్యని కవి ఉండడు. మోసం చెయ్యని వర్తకుడూ ఉండడు. చేసిన దొంగతనం గూఢంగా దాయగలవాడు వృద్ధిలోకి రాకుండా ఉండడు, అని భావం.

అయితే, ఏయే విషయాలు నిజంగా గ్రంథచౌర్యంగా గుర్తించాలో, ఏయే విషయాలు గ్రంథచౌర్యంగా పరిగణించనక్కరలేదో శబ్దహరణం అర్థహరణం అన్న రెండు ప్రకరణాలలో పదకొండువందలఏళ్ళ క్రిందటే రాజశేఖరుడు సోదాహరణంగా వివరించాడు. ఇప్పటికీ ఆయన చెప్పిన ఉదాహరణలు మన సాహిత్యానికి వర్తిస్తాయి. ఆయన చెప్పిన చాలా ‘సూత్రాలు’ ఒప్పుకోక తప్పదు. అయితే, ఆ వివరణలన్నీసంస్కృతంలో ఉన్నాయి.

గ్రంథచౌర్యం అనేమాటని నేను చాలా విస్తారమైన పరిథిలో వాడుతున్నాను. ఈ వ్యాసంలో సాహిత్యంలో “దొంగతనాలు” పాల్‌ గారి పుస్తకంలో చెప్పినట్లు మూడు రకాల చౌర్యచర్యలుగా పరిశీలిద్దాం: మొదటిది సాహిత్యంలో ఫోర్జరీ. రెండవది సాహిత్యంలో బందిపోటుతనం. మూడవది మనం అందరం మామూలుగా అర్థంచేసుకునే చౌర్యం – గ్రంథచౌర్యం; అదే ప్లేజియరిజమ్‌ (Plagiarism). ప్రస్తుతకాలంలో ప్లేజియరిజమ్‌ అన్న మాట ఎక్కడ సబబు, ఎక్కడ కాదు అని నిర్థారించేముందు, పూర్వకథలు గుర్తుకుతెచ్చుకోవడం అవసరం.

పాశ్చాత్య సాహిత్యంలో ప్రతిచిన్నమాట, ప్రతిచిన్న వర్ణనా గ్రంథచౌర్యం అని గలాభాచేసిన విమర్శకులని టెన్నిసన్‌ దులిపేశాడు. ” సముద్ర గర్జన, నిర్గృహసముద్రరోదన,” లాంటి మాటలు ఏ కవైనా వాడితే చాలు, “ఇవన్నీ హొరేస్‌ (Horace) నుంచో, హోమర్‌ (Homer) నుంచో కాపీ కొట్టేశారు మొర్రో” అంటారు వీళ్ళంతా! అదేదో సముద్రగర్జన వినడం హొరేస్‌ స్వంత ఆస్తిలాగా! అటువంటి కువిమర్శకులు మనకి ఇప్పటికీ అక్కడక్కడ తగులుతూ ఉంటారు.

చాసర్‌ (Chaucer) రాసిన గాబొలిన్‌ కథలోని ఇతివృత్తం తీసికొని థామస్‌ లాడ్జ్‌ (Thomas Lodge) [3], రోజలిండ్‌ అనే “నవల” రాస్తే దానిని గుట్టుగా తీసుకొని షేక్స్పియర్‌ యాజ్‌ యూ లైక్ ఇట్‌ ( As You Like It) అనే నాటకం రాసాడు. ఇది గ్రంథ చౌర్యమా కాదా అన్న రభస చాలాకాలం నడిచింది. అసలు ఇంతకన్నా విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, అసలు రచయితకి తెలియకుండా వాడు రాసిన పుస్తకం ఎత్తుకోపోయి, అక్కడక్కడ చిన్ని మార్పులు చేసి ఇంకొకడిపేరుతో అచ్చు వేసుకోవడం. దీనిని బందిపోటుతనం అనచ్చునేమో! పేరుపడ్డ రివరెండ్ల దగ్గిరనుంచి, రోడ్డున పోయే సామాన్యుడిదాకా చాలామంది ఈ రకమైన దొంగతనాలు చేసారు. ఇలాంటి పనులు కొందరు కీర్తికోసం, మరికొందరు ధనాశతోటీ చేసారు.

కేవలం డబ్బుకోసం, ఏదో తోచింది రాసిపారేసి, అప్పట్లో ప్రసిద్ధ రచయిత పేరుతో అచ్చేసి, అమ్ముకోవడం కూడా జరిగింది. వోర్టిగర్న్‌ (vortigerne) అన్న నాటకం షేక్స్‌పియర్‌ రాసిందేనని ఐర్లండ్‌ (W H Ireland [4]) అనే అతను చాలాకాలం జనానికి టోపీవేసాడు. వ్రాత ప్రతులుకూడా తయారుచేసి పెట్టాడు, జనాన్ని నమ్మించడంకోసం. చివరికి, పట్టుబడితే, “చిన్నతనపు చిలిపిచేష్ట, క్షమించండి” అన్నాడట. ఈ దురవస్థ స్విఫ్ట్‌ (Jonathan Swift) కీ, పోప్‌ (Alexander Pope) కీ కూడా పట్టింది. వాళ్ళ పేర్లతో బోలెడు పనికిరాని చెత్త సాహిత్యంగా అచ్చు వేసేశారట! ఇటువంటి చౌర్యాన్ని, ఫోర్జరీ అనవచ్చు. మరొకరకమైన ఫోర్జరీ అన్ని దేశాలలో, అన్ని కాలాలలో ఉన్నది. మతప్రచారంకోసమో, రాజకీయ, ” వేదాంత” విషయాలు జనానికి నమ్మిక కలిగించడం కోసమో, రకరకాల ఫోర్జరీలు జరిగాయి. ఉదాహరణకి క్రీస్తు జాతకంలోను, క్రీస్తు చరిత్రలోనూ, ముఖ్యంగా క్రీస్తు బాల్యదశ అంతా రకరకాల మాయలు, మంత్రాలతో నింపేసి వ్యాఖ్యాన గ్రంథాలు రాసారు. భక్తి కీర్తనలు ఎవడో దారిన పోయే దానయ్య రాసి, ల్యూక్‌ (St. Luke) కో, జాన్‌ (St. John) కో కర్తృత్వం అంటగట్టడం అప్పట్లో పరిపాటి. మనకీ, సంస్కృతంలో ఏ అనుష్టుప్‌ చందస్సులోనో నీతి సూత్రాలు రాసి, ఇవన్నీ వ్యాసుడికో, వేదాలకో అంటగట్టడం మామూలే!

ఈ సందర్భంలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన కొన్ని పిట్ట కథలు చెప్పుతాను. కృష్ణదేవరాయలుగారికి మోహనాంగి అనే కూతురు ఉండేదట. “మరీచీపరిణయము ” అనే కావ్యం ఆమె రాసిందేనని, దానిని సంస్కరించి, సవరించి, పరిష్కరించి పునర్ముద్రించారు కూడాను! ఈ కావ్య కర్తృత్వం మీద చాలా రభస జరిగింది. చివరకి తేలిందేమిటంటే, కూచి నరసింహం పంతులు గారనే ఆయన దీనిని రాసి, మోహనాంగికి అంటగట్టారట! అలాగే, చిన్నయసూరి గారి బాలవ్యాకరణానికి సంస్కృతమూలం “హరికారికలు” అనే గ్రంథం మూలం అని సృష్టించడం జరిగింది, చిన్నయసూరి గారికి గ్రంథచౌర్యం ఆపాదించే దురుద్దేశంతో! ఈ పని శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారు చేసారట! అలాగే భీమఖండానికి మూలం స్కాందపురాణంలో ఉన్నదని శ్రీనాథుడు రాసాడు. ఆ సంస్కృతమూలం శ్రీనాథుడే రాసాడట! ఫోర్జరీ దైవసంబంధమైన విషయాలదాకా పోయినప్పుడు, అది అనంతాన్నిఅంటుకుంటుంది.

ఇలా రకరాల సాహిత్య చౌర్యచర్యలు రకరకాల పేర్లతో ప్రసిద్ధికెక్కినాయి; ఫొర్జరీ, బందిపోటుతనం, గ్రంధచౌర్యం వగైరా! ప్లేజియరిజంని మనం గ్రంథ చౌర్యం అని చెప్పుకుందాము. గ్రంథచౌర్యం చేసే చోరుడికీ, సాహిత్యంలో బందిపోటుదొంగకీ భేదం కేవలం సాంకేతికభేదమే! బందిపోటుదొంగ దొరికిపోయినా ఫరవాలేదు అన్న ధీమాతో దొంగతనం చేస్తాడు. గ్రంథచోరుడు, “మనం దొరకంలే,” అన్న ధీమాతో దొంగతనం చేస్తాడు. వీడిది కళ్ళు మూసుకొని పాలుతాగే పిల్లితంతు.

సాహిత్యంలో నైతికవిలువలు, సాంఘికవిలువలతో పాటు మారిపోతున్నాయి. నిర్దిష్టమయిన కాపీరైట్‌ హక్కులు లేనిరోజుల్లోనే, మిల్టన్‌, పోప్‌ మొదలైనవాళ్ళు, ఇతివృత్తాలు ఇతరరచనలలోనుంచి తీసుకొని, వాటిని మరింత అందంగా, కాలానుగుణ్యంగా తిరిగి చెప్పడం తప్పు కాదని అందరూ ఒప్పుకున్నారు. మళ్ళీ రామాయణం ఎందుకు స్వామీ అని విశ్వనాథ సత్యనారాయణగారిని అడిగితే, “రోజూ తిన్న అన్నమే కదా అందరం తింటూన్నది” అని ధీమాగా సమాధానం ఇచ్చారు. పురాణాలు మళ్ళీ మళ్ళీ కాలానుగుణ్యంగా తిరిగి రాయాలనే సిద్ధాంతం ప్రతిపాదించిన వాళ్ళు లేకపోలేదు. “ఈ గ్రంథానికి మూలకథ ఫలానా ప్రాచీన గ్రంథంనుంచి తీసుకున్నాను,” అని ప్రస్తావనలో చెప్పితే, చౌర్యం అని ఖండించడం నాగరికం కాదు. “నేను చెప్పదలచుకున్నదంతా ఎవడో ప్రాచీనుడు ఇదివరకే చెప్పేశాడు, నా ఖర్మకాలి నేను కొంచెం లేటుగా పుట్టాను” అని వాపోని రచయిత ఉండడు. అయితే, మూలకథ నీది కాక పోయినా, నీవు చెప్పే పద్ధతిలో ప్రత్యేకత, కొత్తదనం ఉంటే, సహృదయులు మెచ్చుకుంటారు అన్న జ్ఞానం ఉంటే, ఏ విధమైన గ్రంథచౌర్యం ఉండదు.

ఇది గ్రంథచౌర్యం, ఇది కాదు అనే కొలబద్ద ఇప్పుడు తయారు చేసి ప్రాచీన గ్రంథాలని ఆ కొబద్దతో కొలవడం న్యాయం కాదు. గ్రంథచౌర్యం దేశ, కాల, చారిత్రిక, సాంఘిక పరిస్థితులతో లంకెపడి ఉన్నది. అచ్చు యంత్రం పదిహేనవశతాబ్దంలోనే ఉన్నప్పటికీ, ఆథునిక యంత్రాంగం పంథొమ్మిదవ శతాబ్దపు మధ్యభాగం వరకూ రాలేదు. అప్పుడే వందలకొలదీ కాపీలు అచ్చువేయడం మొదలయ్యింది; విరివిగా డబ్బుచేసుకోవడంకూడా ప్రారంభం అయ్యింది. ఎప్పుడైతే డబ్బుచేసుకోవడం ప్రథానంగా పరిణమించిందో, అప్పుడే సాహిత్యంలో బందిపోటుతనం కూడా మొదలయ్యింది. “కాపీరైటు” అనే చట్టం ఇంగ్లాండులో పద్ధెనిమిదవశతాబ్దంలోనే ఉన్నా, ఇరవైయవ శతాబ్దం మధ్యభాగం వరకూ నిర్దిష్టమైన కాపీరైటు హక్కులగురించి వివాదం ఉన్నది. పంథొమ్మిదివందల యాభైఐదు వరకూ జెనీవా హక్కులను అమెరికా ఒప్పుకోనే లేదు.

పద్ధెమినిమిదశతాబ్దపుముందు వచ్చిన పాశ్చాత్యసాహిత్యం, పంథొమ్మిదవశతాబ్దపు మధ్యకాలం ముందు వచ్చిన తెలుగు సాహిత్యం గ్రంథచౌర్యం అనే కొలబద్దతో కొలవటం ధర్మం కాదు. అంతే కాదు. సాంఘిక విలువలు, నైతికన్యాయాలు, సాహిత్యంలో ప్రైవేటు హక్కులు, “నాది ” “మనది” అనే మాటల్లో అంతర్గతంగా ఉన్న భావాలు ప్రాక్ పశ్చిమ దేశాల్లో ఒకే అర్థాన్నిఇవ్వవు. అందుకని, వాటిని ఒకేమూసలో పోసి వ్యాఖ్యానించడం సబబుకూడా కాదు. ప్రస్తుతానికి, పద్ధెనిమిదవశతాబ్దం తరువాతవచ్చిన పాశ్చాత్య సాహిత్యాన్ని, పంథొమ్మిదవశతాబ్దపుమధ్యభాగం తరువాత (కందుకూరి వీరేశలింగంగారి తరువాత) వచ్చిన తెలుగు సాహిత్యాన్నీ ఈ గ్రంథచౌర్యం కొలబద్ద తో కొలవడం సబబేనని అనిపిస్తుంది. ఏమిటి, ఈ కొలబద్దకి ప్రమాణాలు అని అడిగితే, మన నైతికవిలువలే ముఖ్యమైన ప్రమాణాలు అని చెప్పక తప్పదు.

గ్రంథచౌర్యం కి సంబంధించిన చట్ట ప్రమాణాలను పక్కకు పెట్టి, ప్రస్తుతం పుస్తకరూపంగా “అచ్చు” లోకి వచ్చే సాహిత్యానికి ముఖ్యమైన నైతికవిలువ ఏమిటి అని అడిగితే, ఒకే సమాధానం కనిపిస్తుంది. మూలగ్రంథం ఉంటే, ఆ మూలగ్రంథం గురించి చెప్పడం. ఇది, వ్యాసాలకి, కావ్యాలకీ తప్పకుండా వర్తిస్తుంది. సాహిత్యంలో సృజనాత్మకత (Creativity) కి ఒక ప్రత్యేక స్థానం ఉండబట్టి, “ఇది నా స్వంతబుర్రలోనే పుట్టింది సుమీ,” అని జనాన్నీ నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేయడం పరిపాటి. ముఖ్యంగా లఘు కవితల్లో, నవలల్లో, కథల్లో ఈ చౌర్యం ఉన్నప్పటికీ పట్టుకోవడం సులువైన పనికాదు. ఒకవేళ పట్టుబడినా రుజువుచెయ్యడం తేలికైన పనికాదు. సృజనాత్మక రచనలకు సంబంధించినంతవరకూ, రచయిత నిజాయితీయే నిజమైన కొలబద్ద.

ఇక ఇంటర్నెట్ యుగంలో గ్రంథచౌర్యం పరాకాష్టనందుకోవడానికి చాలా సదుపాయాలున్నాయి. మరొకళ్ళ రచనలనుండి పేరగ్రాఫులకు పేరగ్రాఫులు తమ వ్యాసాల్లో గుప్పించి, మూలాలు ఇవ్వడం గురించి తర్జనభర్జనలు తలకెత్తుతున్నాయి. మూలాలు ఇవ్వకుండా తమదిగానే కబ్జా చేసుకోవడం కూడా కనిపిస్తుంది. ఇంటర్‌నెట్‌ కాపీరైట్‌ చట్టాల గురించి, వాటిని అమలు పర్చడంలో ఉన్నసాధకబాధకాలగురించీ, కోకొల్లలుగా వ్యాసాలున్నాయి. అవన్నీ ఇక్కడ పొందుపరచడం సాధ్యం కాదు. వాటికోసం వెతకటం అసాధ్యమూ కాదు. నాకు నచ్చిన ఒక చోటు [5] పాదసూచికలో ఇస్తున్నాను. ఇటువంటి ఉపయోగకరమైన చోటులు చాలా ఉన్నాయి.

ముగింపుగా, రచయితయొక్క నైతికవిలువకి మించిన ప్రమాణం ఏదీ లేదు.

1. H. M. Paull, “Literary Ethics,” Thornton Butterworth, 1928
రాజశెఖరుడు, ” కావ్యమీమాంసా.”
Thomas Lodge (1556 – 1625), Rosalynde or Euphues’ Golden Legacy (If you Like it, So)
W H Ireland, Kynge Vortigerne
Copyright Explained: I May Copy It, Right?
-------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

Zilebi said...



రకరకాల ఫోర్జరీలు జరిగాయి. ఉదాహరణకి క్రీస్తు జాతకంలోను, క్రీస్తు చరిత్రలోనూ, ముఖ్యంగా క్రీస్తు బాల్యదశ అంతా రకరకాల మాయలు, మంత్రాలతో నింపేసి వ్యాఖ్యాన గ్రంథాలు రాసారు. భక్తి కీర్తనలు ఎవడో దారిన పోయే దానయ్య రాసి, ల్యూక్‌ (St. Luke) కో, జాన్‌ (St. John) కో కర్తృత్వం అంటగట్టడం అప్పట్లో పరిపాటి.