కవిత్వంలో భావ సాంద్రత
సాహితీమిత్రులారా!
“కవితా! ఓ కవితా!
నా యువకాశల నవపేశల
సుమగీతావరణంలో
నిను నేనొక సుముహూర్తంలో
దూరంగా వినువీధులలో
విహరించే అందని అందానివిగా
భావించిన రోజులలో
నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు నిషాలందున
యెటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా!”
అని శ్రీ శ్రీ కలవరించిన కవితా స్వరూపమెటువంటిది? అసలు కవిత్వమంటే ఏమిటి? మాటల కూర్పుని మనం కవిత్వమని ఎప్పుడు గుర్తిస్తాం?
కాళిదాసు నించి కాడ్వెల్ వరకూ ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా ఈ ప్రశ్నకి సమాధానమిచ్చారు. “poetry is heightened language accompanied by rhythm” అని ఒకరంటే “ఏకో రసః కరుణయేవ” అని ఒకరన్నారు. “బాధ కవిత్వానికి పర్యాయ పద”మని శ్రీ శ్రీ అంటే, “కవిత్వమొక ఆల్కెమీ” అని ఇంక మరి అపీల్లేకుండా తీర్మానించాడు తిలక్.
అయితే, ఒక విషయంలో మాత్రం విజ్ఞులంతా ఏకీభవించారు – కవిత్వానికి భావం ఆయువుపట్టు. ఆ భావం ప్రేమ కావచ్చు, దేశ భక్తి కావచ్చు, విప్లవ సందేశం కావచ్చు, ఆ భావాన్ని కవి ఛందోబద్ధంగా చెప్పొచ్చు, వచనంలో చెప్పొచ్చు, గేయ రూపంలో చెప్పొచ్చు. ఎలా చెప్పినా, కవితలో భావం ఎంత బలంగా ఉంటే కవిత అంత రాణిస్తుంది.
ఒక కవిత పాఠకుడి మనసులో ముద్ర వేసుకోవాలంటే కవి ఎన్నో రకాలుగా కష్టపడాలి. కవితలో అందమైన శిల్పం కావాలి. పదాల నడకలో ఒక మంచి లయ ఉండాలి. దృశ్యాన్ని కళ్ళకి కట్టేలా ఒక అద్భుతమైన చిత్రణ ఉండాలి. కానీ, వీటన్నిటినీ మించి మనసుని కదల్చగలిగిన గాఢమైన భావ స్ఫురణ ఉండాలి. భావ సాంద్రత ఉన్న కవిత ఇంకేవీ లేకపోయినా మన మనసుల్లో కలకాలం నిలిచిపోతుంది. సందర్భమొచ్చినప్పుడల్లా అప్రయత్నంగానే గుర్తుకొస్తుంది.
దేవులపల్లి కృష్ణ శస్త్రి గారు “అప్పుడు పుట్టి ఉంటే” అన్న వ్యాస సంకలనంలో దీనికొక గొప్ప ఉదాహరణనిస్తారు. బసవరాజు అప్పా రావు గురించి రాస్తూ ఆయన రాసిన ఒక కవితా పంక్తిని “ప్రపంచ కావ్య భాండాలలో అద్భుతమైన పంక్తులలో ఇది ఒకటి” అంటారు. ఇంతకీ ఆ కవితా పంక్తి ఇలా ఉంటుంది –
“ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయాడు”
మీకు ఆశ్చర్యమెయ్యవచ్చు – ఏవిటిది, ఉత్తరంలో రాసే పొడి మాటలలా ఉన్న ఈ వాక్యాన్ని ఈయన ఇంత ఆకాశానికెత్తేస్తున్నాడనిపించవచ్చు. చాలా సీదా సాదాగా కనిపించే ఈ పంక్తిలో ఆయన చూసిన గొప్పతనమేవిటో అర్థమవాలంటే ఈ కవిత సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. అంతకంటే బసవరాజు అప్పారావు గారిని అర్థం చేసుకోవాలి. అప్పారావు గారు భావకవులలో ఒక విశిష్టమైన కవి. వైతాళికులలో ముద్దు కృష్ణ గారు అప్పారావుగారిని పరిచయం చేస్తూ “ఈయన కవిత నిజంగా, నగ్నంగా ఉంటుంది” అన్నారు. నిజంగానే ఈయన కవితలో అబద్ధాలేవీ మనకి కనబడవు. ఎటువంటి ఆర్భాటాలూ లేకుండా సూటిగా మన గుండెల్లోకి దూసుకుపోతాయి. తాజ్ మహల్ గురించి రాసినా, ప్రేమ తత్వాన్ని గురించి రాసినా, గాంధీగారి గురించి రాసినా, పాటకుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంటాయి ఈయన కవితలు. జీవితంలో ఈయన పడిన కష్టాలకి మరొకరైతే ఏమయ్యేవారో కానీ ఈయన మాత్రం తను పడిన ప్రతి కష్టాన్నీ కవిత్వ రూపంలో మనముందుంచి మనకొక తరగని గనిని అందించారు. లేక లేక కలిగిన సంతానం కొద్ది కాలానికే జబ్బుచేసి చనిపోతే ఆ దుఃఖాన్ని కవిత్వరూపంలో ఆయన ఇలా వ్యక్తం చేసారు –
“వేదాద్రి శిఖరాన వెలిగిన్న జ్యోతి
మినుకుమని కాసేపు కునికి పోయింది
దేవలోకమునించి దిగినట్టి గంగ
వచ్చిన్న దారినే పట్టి మళ్ళింది
పంజరం దూరిన బంగారు పిట్ట
తలుపు తీసి ఏయేపో తరలిపోయింది
కాపురమ్మొచ్చిన కన్నె పాపాయి
ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు”.
ఇక్కడ ఇల్లు ఖాళీ చెయ్యడం ఇంటితో పాటు జీవితాన్నీ, జీవిత పరమార్థాన్నీ కూడా ఖాళీ చెయ్యడం కాబట్టే ఈ అక్షరాలకింతటి కన్నీటి చిత్తడి.
ఇదే ఇల్లు ఖాళీ చెయ్యడం ఉన్న ఫళంగా ఊరినీ, అలవాటయిన జీవితాన్నీ ఖాళీ చేసి ప్రాణాలరచేతిలో పెట్టుకుని వలసపోవడమయితే, అదీ ఒక భయంకర భీభత్సం నించి పారిపోవడమయితే, అక్షరాలలో కన్నీటి చిత్తడే కాదు, పిడికిళ్ళ బిగింపు కూడా కనబడుతుంది. నందిని సిధారెడ్డి “ఉసురు” అన్న కవితలో ఇలా అంటాడు –
“ఇల్లు ఖాళీ చేసినంత సులభంగా
జీవితం ఖాళీ చెయ్యలేం కదా!
ఎంత భద్రంగా సర్దుకున్నప్పటికీ
ఏదో ఒకటి మరచిపోయినట్టు
గుర్తురాని యేనుగు బొమ్మేదో వెంటాడుతుంది
దువ్వెన ముక్కో విరిగిన పెనిసిలు ముక్కో
కొంత దూరం వెళ్ళాక గురుతొస్తుంది
వదిలిపెట్ట లేమూ, తెచ్చుకోనూ లేం!”
పాలస్తీనాలో, యుగాండాలో, కొసోవోలో, సూడాన్ లో, ప్రపంచం నలుమూలల్లో ఎక్కడయినా ప్రజలు మూకుమ్మడిగా ఖాళీ చెయ్యాల్సొచ్చినప్పుడల్లా వాళ్ళ స్థితి ఇలాగే ఉండి ఉంటుంది.
ఆధునిక మానవ సమాజం సాంకేతికంగా, ఆర్థికంగా ఎంత పురోగతి సాధించినా, జీవితాల్లో మిగిలిపోయిన వెలితి గురించి T.S. Eliot రాసిన Wasteland లో ఆయన ఇలా అంటాడు –
“Where is the wisdom that we have lost in knowledge?
Where is the knowledge that we have lost in information?”
కవి ఎంత బలంగా ఈ భావాన్ని చిత్రించాడంటే మనకిక్కడ ఒక పచ్చని నందనవనం మధ్యలో అంతులేని యెడారిలో నించున్నామనిపిస్తుంది.
శాంతిని ప్రేమించే వాళ్ళు యుద్ధం చెయ్యాల్సొస్తే వాళ్ళెంత క్షోభననుభవిస్తారో మనం ఊహించుకోవచ్చు. Cecil Day Lewis” తన “Where are the War Poets?” అన్న కవితలో ఇలా అంటాడు –
“They who in folly, or mere greed
Enslaved religion, markets, laws,
Borrow our language now and
Bid us to speak in Freedom’s Cause.
It is the logic of our times
– No subject matter for immortal verse –
That we who lived by honest dreams
Defend the bad against the worse”
నిజానికి ఇంతకంటా immortal verse ఎక్కడుంటుంది?
నండూరి వారి యెంకి పల్లెపడుచు. ఎప్పుడూ సముద్రాన్ని చూడలేదు. మొదటి సారి సముద్రాన్ని చూసినప్పుడు మాత్రం ఆవిడకి ఆశ్చర్యం కాదు, ఉక్రోషమొచ్చింది – ఎందుకంటే, తననీ, తన పుట్టింటి వారినీ, అందరూ సూటి పోటి మాటలన్నప్పుడు తన మనసు సంద్రంలా మరిగిందని ఎవరో చెప్పినప్పుడు ఆవిడ సముద్రాన్ని అంతు లేనంత ఉంటుందని ఊహించుకుంది. తీరా చూస్తే ఆవిడకి సముద్రం తన మరిగిన మనసుతో పోలిస్తే చాలా చిన్నగా కనపడింది.
కవి ఈ భావాన్ని ఎలా మన ముందుంచుతున్నాడో చూడండి –
“ఇంతేనటే సంద్రమెంతో అనుకొంటి
మనకి సూరీడికీ మద్దెనుందేనా!
నా నీతి నా జాతి నా వారె పోనాడ
మరిగి నా మనసు సాగరమాయెనన్నారు
ఇంతేనటే సంద్రమెంతో అనుకొంటి
మనకి సూరీడికీ మద్దెనుందేనా!”
శ్రీ శ్రీ “భూమ్యాకాశాలు” అనే కవితలో ఇలా అంటాడు –
“వాళ్ళిద్దరినీ ఉరితీసారని అరవ పత్రికలో చదివి
వాళ్ళిద్దరూ మరణించారని డైరీలో రాసుకున్నాను
వద్దు కన్నీట కవిత్వం రాయొద్దు
కాలానికి సమాజం పెట్టిన అప్పును
వాళ్ళు తమ ప్రాణాలతో తీర్చుకున్నారు
….
వాళ్ళిద్దరిలో ఒకడు భూమి,
రెండోవాడు ఆకాశం”
భూమయ్య, కిష్ట గౌడ్ అన్న విప్లవ కారులను ప్రభుత్వం ఉరి తీసినప్పుడు రాసిన కవిత ఇది.
“పతితులార! భ్రష్టులార! బాధా సర్ప దష్టులార!” అంటూ అక్షరాలను ఉరకలూ పరుగులూ పెట్టించిన శ్రీ శ్రీ ఇంత subdued గా రాసినా, కవిత్వం మాత్రం పలచబారలేదు. భావం బలమైనదైనప్పుడు ఏ హంగులూ లేని శుష్క వచనం కూడా గొప్ప కవితనిపించుకుంటుంది.
కవిత్వంలో చిక్కదనం ప్రస్తావనకొస్తే తప్పకుండా స్త్రీవాద కవిత్వం గురించీ, దళిత కవిత్వం గురించీ చెప్పుకోవాలి. నిర్మల “లేబర్ రూం” లో చెప్పిన “బల్లకొక బాధల నది” ని చూసినా, అడిగోపుల వెంకటరత్నం “మర్రి కింద మల్లెతీగలు” లో చెప్పిన “బతుకంతా అవమానాల వెల్లువ” గురించి విన్నా మనకి బాధా, కోపం, ఆవేశం, అన్నీ ఒకేసారి కలగాపులగంగా వస్తాయి.
మందరపు హైమవతి గారి “సర్ప పరిష్వంగం” కవితలో భార్యా భర్తల సంబంధంలో ఉండే సంక్లిష్టమైన వైరుధ్యం ఎలా ప్రతిఫలిస్తోందో చూడండి
“అంతా బాగానే ఉంటుంది.
అప్పటి వరకూ
కామంతోనైతేనేమి
మోహంతోనైతేనేమి
ఇరువురి తనువులొకటైనాక
అద్వైత సిద్ధి పొందినాక
ఈ లోకాన్ని మరిచిపోయిన
అమృత ఘడియలలో
అక్షరతూణీరం నుంచి
ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు
‘జీతమెప్పుడిస్తా’రని”.
అలాగే,
సతీష్ చందర్ దళితుల దుఃఖాన్ని తన “వృత్తాంతం” కవితలో చాలా బలంగా చిత్రిస్తాడు –
“హైందవ పద్యానికి అతికిన ఐదవ పాదాన్ని నేను
వృత్తం వెలుపలే ఉత్త వచనంలో
పరిభ్రమించిన నాకు
మరణమెపుడూ పునరావృతమే”
కవికీ పాఠకుడికీ మధ్య జరిగే communication లో చెప్పదలుచుకున్న వస్తువు ఎంత ముఖ్యమో, ఆ చెప్పే విధానంలోని emotional intensity అంతే ముఖ్యమని నా నమ్మకం. తను పొందిన అనుభూతిని పాఠకుడిలో కలిగించినప్పుడే కవి కృతకృత్యుడైనట్లు అనుకోవాలి. ఎంత సమర్థులైన కవులైనా తమ కవితల్లో కొన్నిట్లో మాత్రమే ఈ భావ సాంద్రతని సాధిస్తారు. మిగిలిన కవితల్లో వస్తువు ఎంత గొప్పగా ఉన్నా కవిత్వం పలచబారుతుంది.
నా దృష్టిలో మాటల కూర్పుని కవిత్వంగా మలిచే అద్భుత రసాయనం భావ సాంద్రత. Emotional intensity is the magical catalyst that transforms a collection of words into poetry. అది లేని కవిత్వం కేవలం మాటల ముక్కలే.
---------------------------------------------------------
రచన: నందివాడ ఉదయ భాస్కర్,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment