Tuesday, April 2, 2019

చిత్రకవిత్వరీతులు


చిత్రకవిత్వరీతులు 




సాహితీమిత్రులారా!

చతుర్విధకవిత్వములు
కవిత్వము ఆశు, మధుర, విస్తర, చిత్రకవితలను నాలుగు విధములుగా ఉండునని లాక్షణికుల అభిప్రాయము.

ఆశుకవిత్వమనగా అడిగిన వెంటనే నిరర్గళముగా చెప్పెడి కవిత్వము. అష్టావధాన, శతావధానములు, ఘటికాశత ప్రబంధాదికల్పనలు ఈకోవకు చెందినవి.
దేశికవితాభేదములగు పదములు, గేయములు, కీర్తనలు, రగడలు మున్నగునవి మధురకవిత్వమున కుదాహరణములు.
విస్తారమైన ప్రబంధ, కావ్య, పురాణరచనలు విస్తారకవిత్వమున కుదాహరణములు.
శబ్దవర్ణచిత్రరచనలు, బంధకవిత్వములు చిత్రకవిత్వమున కుదాహరణములు.
ఏకాక్షరి, ద్వ్యక్షరి, పాదభ్రమకము, పాద గోపనము, నిరోష్ఠ్యము, నిర్దంత్యము, నిష్కంఠ్యము, నిస్తాలవ్యము, అనులోమవిలోమాదులు, ప్రహేళికలు మున్నగునవి శబ్దచిత్రముల కుదాహరణములు. అట్లే ఒక పద్యములో ఇతరవృత్తముల నిమిడించుట, చక్రము, పుష్పమాలిక, పద్మము, కంకణముల వంటి చిత్రములలో పొదిగించిన అక్షరములతో పద్యము నల్లుట బంధకవిత్వమున కుదాహరణములు. శబ్దప్రధానములైన అనుప్రాసయమకాదులు కూడ చిత్రకవిత్వమునకు సంబంధించినవే. దండి కావ్యాదర్శములోను, భోజుని సరస్వతీకంఠాభరణములోను వివిధములైన చిత్రకవిత్వలక్షణములు విపులముగా వివరింపబడినవి.

ఆశుచిత్రకవిత్వ ప్రధానాశయము వినోదమే. చిత్రకవిత్వమును కవి ముఖ్యముగా తన పాండిత్యప్రకర్షను ప్రదర్శించుకొనుట కనేక నిర్బంధములకు లోనయి వ్రాయుట జరుగుచున్నది. ఇట్టి నిర్బంధములకు లోనయినను, చక్కని పద్యము నల్లిన కవి యొక్క మేధాశక్తి విస్మయావహముగా నుండుటయు, అట్టి మేధాశక్తికి పాఠకుడు అబ్బురమును, ఆనందమును పొందుటయు ఇట్టి కవిత్వము యొక్క ప్రధాన ప్రయోజనము. ఉత్తమ కావ్యలక్షణములుగా లాక్షణికులు నిర్దేశించిన వ్యంగ్యవైభవము, రసపోషణావకాశము లిందులో నిమిడించుట తరచుగా కష్టసాధ్య మగుటచే నిట్టి కవిత్వ మధమకవిత్వముగా పరిగణింపబడుచు వచ్చినది. ఐనను ఇట్టి కవిత్వమును వ్రాయుటకు అసాధారణభాషాపాండిత్య మవశ్యమగు చున్నదనుటలో సందేహము లేదు. గర్భబంధకవిత్వములు శబ్దక్రమప్రధానములై రసపోషణకనువుగా లేకుండుటచే ఇవి కావ్య శరీరమునకు కణితులవంటివని లాక్షణికు లభిప్రాయపడినారు.

అనుప్రాసయమకాదులును శబ్దప్రధానములైనను, సమర్థులైన కవిపుంగవులు వీనిని రసభంగము కాకుండ ఉపయోగించి కవిత్వమున కత్యంతశోభను చేకూర్చినారు. ముఖ్యముగా మధుర కవిత్వములో నీయలంకారములు కర్ణపేయములై శ్రోత్రానందమును గూర్చుచున్నవి. కవిప్రతిభచే, భాషాపటుత్వముచే ఇవి అయాచితముగా, స్వాభావికముగా చేకూరినచో కావ్యముయొక్క అందము నధికమొనరించుటయే కాక రసపుష్టికి తోడ్పడు నవకాశము గలదు. భోజుడు అనుప్రాసః కవిగిరాం పదవర్ణ మయోఽపి యః, సోఽప్యనేన స్తబకితః శ్రియం కామపి పుష్యతి అన్నాడు. కవివాక్కులలో పదవర్ణమయమైన అనుప్రాసము కావ్యములో పొంది పొసగి కావ్యశోభను పోషించును – అని దీని కర్థము. ఇట్లీ అలంకారములను సమర్థముగా నిర్వహించిన వారిలో పోతన, రామరాజభూషణులను అగ్రేసరులుగా నెన్నవచ్చును. సురభి మాధవరాయలు చంద్రికాపరిణయమందలి చతుర్థాశ్వాసము నంతయు యమకమయముగా చేసినాడు. కాని ఈ నిర్బంధమువల్ల రసపోషణకు కొంత ఆటంక మేర్పడినట్లు తోచుచున్నది. గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ప్రతిపద్యమును ఏదో యొక చిత్రకవిత్వలక్షణమునకు లక్ష్యముగా సాగినది. ఇందులో చిత్రకవిత్వ ప్రదర్శనము పరాకాష్ఠనందినది. నన్నెచోడుడు, ముక్కుతిమ్మన, పింగళి సూరన, పినవీరనాది ఇతరకవులును తమ పాండితీప్రకర్ష చాటుకొనుటకై కొన్ని పద్యములను చిత్రాలంకారయుతముగా వ్రాసినారు.

సంస్కృతములో ఆదికవి వాల్మీకి సుందరకాండ యందలి పంచమసర్గమంతయు అంత్యప్రాసతో నలంకరించినాడు. మాఘుని శిశుపాలవధలోని ఆఱవసర్గము, కాళిదాసు రఘువంశమునందలి నవమసర్గము యమకమయములై యున్నవి. వేంకటాధ్వరి లక్ష్మీసహస్రములో యమకస్తబకము, చిత్రస్తబకము అను ఆశ్వాసములందలి శ్లోకములన్నియు యమక, బంధకవిత్వమయములై యున్నవి. మహాకవి భారవి, రూపగోస్వామి మున్నగు వారి గ్రంథములలోను చిత్రకవిత్వోదాహరణము లెన్నియో యున్నవి. ఇట్లు సంస్కృతకవు లావిష్కరించిన మార్గములోనే తెలుగుకవులును పయనించినారు.

చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షర ప్రహేళికలు
చిత్రకవిత్వము నందలి ప్రక్రియలలో ప్రహేళిక యనునదొకటి. ఇది తెలుగులో పొడుపుకథ వంటిది. ఇది రసపోషణసమర్థము గాకున్నను ఉక్తివైచిత్రితో వినోదమును కల్గించు నలంకారము. లాక్షణికు లిందులో పలురకములను గుర్తించినను, ప్రస్తుతవ్యాస పరిధిలో చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షరము లనెడు మూడురకములను గుఱించి తెలిసికొనిన చాలును. వీనికి నీక్రింద నిచ్చిన ఉదాహరణములన్నియు భోజసార్వభౌముని సరస్వతీకంఠాభరణమునుండి గ్రహింపబడినవి.

1. చ్యుతాక్షరప్రహేలిక:ఉండవలసిన అక్షరమును వదలిపెట్టి చెప్పిన యెడల అది చ్యుతాక్షరప్రహేలిక యగును. దీనికి ఉదాహరణము:

పయోధరభరాక్రాంతా సంనమంతీ పదేపదే
పదమేకం న కా యాతి యది హారేణ వర్జితా.

పయోధరముల భారముచే నాక్రమింపబడినదియు, అడుగడుగునకు వంగుచున్నదియు నైన ఏది హారరహితమైనచో ఒక్క అడుగు కూడ కదలకుండును? – అని పై ప్రహేళిక కర్థము. ఈ శ్లోకములో విశేషణములు స్త్రీలింగములో నుండుట చేతను; పయోధర, హార, సంనమంతీ, అను శబ్దముల చేతను; స్తనములును, వానిపై నలంకృతమైన హారమును, పయోధరభారముచే వంగుచు నడుగిడుచున్న అంగనయు స్ఫురించుట సహజము. కాని అట్టి స్త్రీ హారవర్జితయైనచో ఒక్క అడుగును ముందుకు సాగకుండుట యేమి? ఇది అర్థవంతముగా లేదు. అందుచేత పయోధర శబ్దమునకు వేఱగు అర్థముండవలెను. దుగ్ధం క్షీరం పయ స్సమమ్ — అని అమరకోశము. అందుచేత పయస్సనగా పాలు, పయోధరము లనగా పాలను ధరించినవి – పాలకుండలు. ఈ పాలకుండలచే నాక్రాంతమైన వస్తువేదో అడుగడుగునకు వంగుచున్నది. అట్టి వస్తువు కావడి యగుట సహజము. కాని కావడి హారము లేక ఒక్క అడుగైనను ముందుకు సాగకుండుట యేమి? కావడికి, హారమునకు గల సంబంధ మేమి? అని యోచించినచో కావడి మోపరి లేకున్నచో కావడి ఒక్క అడుగైనను ముందునకు సాగదనుట స్పష్టము. సంస్కృతములో కాహారః అను పదమునకు కావడిమోపరి యని అర్థము. అందుచేత కాహార అను పదములో చ్యుతమైన (తొలగింపబడిన) కా-అక్షరమును హార-కు చేర్చుకొని, ఈ ప్రహేళికలో సూచితమైన వస్తువు ‘కావడి’ యని గుర్తింపవలెను.

2. దత్తాక్షరప్రహేలిక: అవసరము లేనిచోట అదనపుటక్షరమును చేర్చినయెడల అది దత్తాక్షరప్రహేలిక యగును. దీని కుదాహరణము:

కాంతాయానుగతః కోఽయం పీనస్కంధో మదోద్ధతః
మృగాణాం పృష్ఠతో యాతి – శంబరో రూఢయౌవనః

బలసిన మూపులు గలవాడును, మదగర్వితుడును, స్త్రీచే అనుగమింపబడినవాడును, మృగములవెంట (అడవి జంతువుల వెంట) జనుచున్నాడు. అతడెవ్వడు? యౌవనవంతుడగు శంబరుడు. – అని పై శ్లోకమున కర్థము. ఈవర్ణనను జూడ నది వేటకాని వర్ణనవలె నున్నది. శ్లోకములో నతడు ‘శంబరు’ డని పేర్కొనబడినాడు. శంబరు డనగా వేటకాడా? మృగ దానవ బౌద్ధేషు శంబరః –- అని నానార్థరత్నమాల. అనగా శంబరశబ్దమునకు ఒకజాతిలేడి, శంబరుడను రాక్షసుడు, బౌద్ధుడు అను అర్థము లున్నవి. వేటకాడను అర్థము లేదు. కాని, కిరాత శంభూ శబరౌ అని శబరశబ్దమునకు కిరాతుడు (వేటకాడు) అనియు శివుడనియు అర్థము లున్నవి. ఇట్లు పరిశీలింపగా వినోదార్థము శ- తర్వాత అనవసరమైన అనుస్వారమును చేర్చి పై ప్రహేళికను నిర్మించినట్లు తేటపడుచున్నది. అందుచే, పై ప్రహేళకలోని శంబర-ను శబర-గా మార్చి అర్థవంతముగా పరిష్కరింపవలెను.

3. చ్యుతదత్తాక్షర ప్రహేళిక: ఉండవలసిన అక్షరమును తొలగించి, దాని స్థానములో వేఱొక అక్షరమును వేసినయెడల నది చ్యుతదత్తాక్షర ప్రహేళిక యగును. దీని కుదాహరణము:

విదగ్ధః సరసో రాగీ నితంబోపరి సంస్థితః
తన్వంగ్యాలింగితః కంఠే కలం కూజతి – కో విటః

పండితుడును, సరసుడును, అనురాగవంతుడును, నితంబ మాధారముగా నిల్చినవాడును, స్త్రీచే కౌగిలింపబడిన కంఠము గలవాడును, మధురముగా కూయుచున్నవాడును ఎవడు? విటుడా? – అని పై శ్లోకమున కర్థము. ఇందులో – విదగ్ధః, సరసః, రాగీ, ఇత్యాదివిశేషణము లన్నియు పుంలింగములో నున్నవి. అందుచే వీనిచేత బోధింపబడు వ్యక్తి విటుడా యని ప్రశ్నించుట కవకాశము కల్గినది. కాని పైవిశేషణము లన్నియు నీటికుండకును సరిపోవుటచే, అట్టి నీటికుండనే సూచించుట ఈ ప్రహేళికా లక్ష్యము. ఘటః అను పదములోని ఘ-కు బదులు వి- అను అక్షరము వేయబడినదని గుర్తించినచో ఈ ప్రహేళికకు పరిష్కార మగును. విదగ్ధః అనగా, పండితుడనియు, బాగుగా కాల్చినదనియు, రాగి యనగా అనురాగవంతుడనియు, ఎఱ్ఱగానున్న దనియు; సరసః అనగా సరసుడనియు, నీటితో కూడినదనియు అర్థములు. నీటికుండను నితంబముపై నానించుకొని, దాని మెడచుట్టును చేతిని జేర్చి స్త్రీలు గొనిపోవుచుండ నందులో నీరు శబ్దించుచుండుట సహజము. ఇట్లు, ఘటః అను పదములోని ఘ-ను చ్యుతము చేసి (తొలగించి), దాని స్థానములో వి-ని దత్తము చేయుట (కూర్చుట)వల్ల ఈ ప్రహేళిక చ్యుతదత్తాక్షరప్రహేళిక యైనది.

పైవిధమైన శబ్దచిత్రములు ప్రహేళికలకే పరిమితము గానక్కఱ లేదు. సమర్థులైన కవులు ఇటువంటి వర్ణచిత్రములను కావ్యములలో కొన్నిచోట్ల విశేషార్థపరికల్పనకై చొప్పించినారు. చంద్రికాపరిణయములోని ఈక్రింది పద్య మిట్టిదానికి ఉదాహరణముగా గమనింపవచ్చును.

అనలమ హీన మై యెసఁగె నౌర త్వదుద్ధతశౌర్యలక్ష్మిచే,
ధనదుఁడు వొందెఁ దా ధర హితస్థితిఁ దావకదానవైఖరిం
గని, యచలవ్రజంబును ముఖస్ఫుటవర్ణవియుక్తిఁ గాంచె నీ
ఘనతరధైర్యవైభవము గన్గొని, మాధవరాయ చిత్రతన్. (1-68)

ఇది సభాసదులు సురభి మాధవరాయల శౌర్యమును, త్యాగగుణమును, ధైర్యమును గుఱించి చెప్పిన పద్యము. మాధవరాయా! నీశౌర్యలక్ష్మి యెదుట అగ్నితేజమే అల్పమై తోచెను; నీ దానవైఖరి గాంచి (దానగుణమున నీచే జయింపబడినవాడు గనుక, నీయందు విధేయతతో), ధనదుడు (కుబేరుడు) (నీవు పరిపాలించు) ధరయందు హితవైఖరి బూనెను – నీరాజ్యము సంపన్నత గాంచెనని యర్థము; ఘనతరమగు నీధైర్యవైభవమును గని పర్వతములు ముఖమున వివర్ణతను పొందెను. ఇందతయు చాలా చిత్రముగా నున్నది. – అని పై పద్యమున కర్థము. ఇక్కడ, చిత్రతన్ అనుటలో అద్భుతమైన శబ్దచిత్రము సంకేతితమగుచున్నది. ఆ శబ్దచిత్రముతో అనల, ధనద, అచలాదుల కెట్లు న్యూనత కల్గెనో కవి యిట్లు చూపుచున్నాడు:

అనలమహీనమై (అనలము + అహీనమై), అనఁగా అనలములోని అ-కారము హీనము (నష్టము) కాఁగా, అది (నీ శౌర్యలక్ష్మి ముందు) నలమై పోయినది. నల మనఁగా గడ్డిపోఁచ. అనగా నీ శౌర్యము ముందు అగ్నితేజము తృణప్రాయమైనదని అర్థము.
ధనదుఁడు ధరహితస్థితిన్, అనఁగా ధ-కారము లేని స్థితిని పొందుటచే నదుఁ డయ్యెను. న దదాతీతి నదః – అను నిర్వచనము ప్రకారము ఏమియు నియ్యని వాఁడని పేరు నొందెను. అనఁగ నీదాతృత్వముతో బోల్చిన కుబేరుడు అసలు ఏమియు దానము చేయని వాని వలెనే తోచెను.
అచలవ్రజంబు = పర్వతసమూహము, ముఖస్ఫుట = ఆదియందు స్ఫుటముగా నున్న, అనఁగాఁ దొలివర్ణముగానున్న, వర్ణ = అ-వర్ణము యొక్క, వియుక్తిన్ = వియోగము చేత చలవ్రజ మయ్యెను. ధైర్యస్థులను చలనములేని పర్వతములతో బోల్చుట పరిపాటి. కాని నీ ధైర్యమును గని చలింపని అచలములు (పర్వతములు) తమ పేరులోని అ-కారమును గోల్పోయి చలములు (చలించునవి) అయ్యెను. అందుచే చలించెడి యా పర్వతములకంటె చలింపని నీ ధైర్యమే మిన్నగా నున్నది.

పైవర్ణనలో అనలములోని అ-కారమును, ధనదునిలోని ధ-కారమును, అచలములోని అ-కారమును చ్యుతము చేయగా పైన పేర్కొనిన విశేషార్థములు స్ఫురించినవి. ఇట్లు చ్యుతాక్షరసంప్రాప్తమైన విశేషార్థమును ఈక్రింది సుప్రసిద్ధ వసుచరిత్రములోని పద్యములోను జూడనగును.

స్త్వైరవిహారధీరలగు సారసలోచన లున్నచోటికిన్
భోరున లాతివారు చొరఁబూనినచో రసభంగ మంచు, నేఁ
జేరక, పూవుఁదీవియల చెంతనె నిల్చి లతాంగిరూపు క
న్నారఁగఁ జూచి వచ్చితి, నవాంబురుహాంబక! నీకుఁ దెల్పఁగన్. (2-55)

ఇది వసురాజు చెలికాడు నాయికయైన గిరికను పొదలచాటు నుండి చూచి, ఆ విషయం వసురాజునకు తెలిపే పద్యం. యథేచ్ఛగా చరించు సారసలోచనలు (పద్మముల వంటి కన్నులు గల స్త్రీలు) విలాసముగా విహరించు చోట హఠాత్తుగా అపరిచితవ్యక్తులు ప్రవేశిస్తే రసభంగమౌతుందని నేను పొదలచాటు నుండే ఆమెను చూచి వచ్చాను – అని చెలికాడు తెలుపుతున్నాడు. ఇందులో రసభంగ-మనే పదమొక శబ్దచిత్రాన్ని సూచిస్తున్నది. దీనివల్ల అపరిచితులు హఠాత్తుగా ప్రవేశిస్తే సారసలోచన లనే పదంలోని రస అనే అక్షరములకు చ్యుతి (భంగం) కలిగి సారసలోచనలు కాస్తా సాలోచనలు (విచారగ్రస్తులు) ఔతారనే విశేషార్థం స్ఫురిస్తున్నది. పద్యార్థాన్ని ఈ శబ్దచిత్రం చేత ప్రత్యక్షం చేయడం రామరాజభూషణుని యొక్క చాతుర్యమునకు నిదర్శనము.

సీతారావణసంవాదఝరి
పైవిధముగా చ్యుతాక్షరాది శబ్దచిత్రములచే విశేషార్థముల నావిష్కరించిన పద్యములు, శ్లోకములు అటనట కన్పడుచున్నవి. కాని ఈ మార్గములో నొక సరసమైన, ధారాశుద్ధిశోభితమైన కావ్యమునంతయు వ్రాయుట మహాపండితులకు సైతము ప్రవాహమున కెదురీదుట వంటిదే యగు ననుటలో సందేహము లేదు. ఐనను ఇట్టి మహత్తర కావ్యసృష్టి గతశతాబ్దారంభములో మైసూరు మహారాజాస్థానపండితులైన చామరాజనగర రామశాస్త్రిగారి చేత, అతిసమర్థులైన వారి శిష్యులు మైసూరు సీతారామశాస్త్రులగారిచేత సమష్టిగా జరిగినది. ఇదియే, సీతారావణసంవాదఝరి యను గ్రంథము. వాల్మీకి రామాయణము నందలి సుందరకాండలోని 20వ సర్గలో రావణుడు సీతకు తన గొప్పతనమును వర్ణించి చెప్పి, రాముని విడిచి తనను ప్రియునిగా కోరుకొమ్మని బోధించుట యున్నది. 21వ సర్గలో సీత రాముని దప్ప అన్యులను గోరనని, రాముడు త్వరలో రావణుని వధించి తనను రక్షించుకొనునని ప్రతివల్కుట యున్నది. ఈ సర్గల యందలి ఇతివృత్తమును గ్రహించి చిత్రకవిత్వనిర్భరముగా 100 ప్రధానమైన శ్లోకములలో వారీ కావ్యమును రచించినారు. ఇందులో పూర్వభాగమునందలి 50 ఇతివృత్తాత్త్మక చిత్రకవితాశ్లోకములు (+47 ఇతర శ్లోకములు) రామశాస్త్రిగారు వ్రాయగా, ఉత్తరభాగములో అటువంటివే 50 ఇతివృత్తాత్మక శ్లోకములు (+23 ఇతర శ్లోకములు) సీతారామశాస్త్రిగారు వ్రాసినారు. ప్రతి శ్లోకమందును మొదటి మూడు పాదములలో రావణుడు తనను పొగడికొనుచు, రాముని నిందించుచూ పలుకు వాక్యము లున్నవి. నాల్గవపాదములో సీత రావణుని గర్హిస్తూ పలుకు వాక్యమున్నది. ఇట్లు సీత పలుకు వాక్యములో గూఢముగా రావణుని వాక్యములకు వర్తింపజేయవలసిన – చ్యవితాక్షర, లేక ప్రతిదత్తాక్షర, లేక అధిదత్తాక్షర నిర్దేశమున్నది. ఈ నిర్దేశానుసారముగ వాక్యములను మార్చుట వలన పొగడ్త నింద గాను, నింద పొగడ్త గాను మారి శ్లోకార్థము రావణు డుద్దేశించినదానికి పరిపూర్ణ విరుద్ధముగా మారుచున్నది. ఇది యొక విచిత్రము! ఇది యొక అనిదంపూర్వమైన, నిస్తులమైన చిత్రకవితావిధానము. ఈ కావ్యమొక చిత్రకవితానిధానము. ఇట్టి నిర్బంధమునకు లోనైనను ప్రతిశ్లోకమును రసవత్తరముగ, ధారాశుద్ధిశోభితముగ రచించుట ఈ పండిత ద్వయము యొక్క అద్వితీయ పాండిత్య శౌండీర్యమునకు, కవితాసామర్థ్యమునకు నిదర్శనము. పైన పేర్కొన్న చ్యవితాక్షరాది పదములను రామశాస్త్రిగా రీక్రింది విధముగా వివరించినారు:

వర్ణచిత్రేషు శతశః కల్పనీయేషు సత్స్వపి| గూఢార్థస్యానుకూలాని త్రీణ్యేవాత్ర మతాని నః||
చ్యవితాక్షరమిత్యేకమధిదత్తాక్షరం పరమ్| ప్రతిదత్తాక్షరం త్వన్యదిత్యేవ త్రీణి తాని హి||
కస్మింశ్చిచ్చ్యావితే వర్ణే యత్రార్థోఽన్యః ప్రతీయతే| చిత్రం తదేవ విజ్ఞేయం చ్యవితాక్షరనామకమ్||
కస్మింశ్చిదధికే వర్ణే దత్తేఽర్థో యత్ర భిద్యతే| అధిదత్తాక్షరం నామ చిత్రం తదితి బుద్ధ్యతామ్||
చ్యవితస్యాస్పదేఽన్యేన ప్రతిదత్తేన కేనచిత్| ప్రతీయతేఽన్యో యత్రార్థః ప్రతిదత్తాక్షరం హి తత్||

అర్థము: వర్ణచిత్రము లెన్నియో కల్పింపగల్గినను, గూఢార్థపరికల్పనకు అనువైనవి మాదృష్టిలో మూడే యున్నవి. అవి – చ్యవితాక్షరము, అధిదత్తాక్షరము, ప్రతిదత్తాక్షరము, అనునవి. ఒకానొక అక్షరమును తొలగించుట వల్ల వాక్యము యొక్క అర్థము మారినచో నది చ్యవితాక్షరచిత్రము. ఒకానొక అక్షరమును అదనముగా జేర్చుట వల్ల వాక్యార్థము మారినచో నది అధిదత్తాక్షరచిత్రము. ఒకానొక అక్షరమును తొలగించి దాని స్థానమున వేఱొక అక్షరము నుంచుటవల్ల వాక్యార్థము మారినచో నది ప్రతిదత్తాక్షరచిత్రము.

పై విధముగా నిర్వచింపబడిన మూడు వర్ణచిత్రములకు లక్ష్యములుగా సీతారావణసంవాదఝరి నుండి రెండు రెండేసి ఉదాహరణలు (మొదటిది రామశాస్త్రిగారిది, రెండవది సీతారామశాస్త్రిగారిది) అర్థసహితముగా నీక్రింద నిచ్చుచున్నాను.

1. చ్యవితాక్షరచిత్రమున కుదాహరణము

జుష్టో మన్త్రిజనేన సంగతధియా మద్వన్న కశ్చిత్ప్రభుః
ప్రాప్తాత్యుజ్జ్వలకీర్తిసంహతిరహం తైస్తైశ్చరిత్రైర్నిజైః|
రామో నార్హతి తుల్యతాం జనకజే సంగ్రామసింహస్య మే
సర్వం సత్యమరే పరం త్వనుచితస్సంన్యాస ఏకస్తవ|| (పూర్వభాగము – శ్లో:22)

మొదటి మూడు పాదములలో రావణుడు స్వోత్కర్ష నిట్లు చేసికొనుచున్నాడు:

సంగతధియా = హృదయంగమమైన బుద్ధిగల, (సంగతం హృదయంగమమ్ – అని అమరము) అనగా సామదానభేద దండాది సకలోపాయముల నెఱిగి బుద్ధిమంతులైన, మన్త్రిజనేన = మంత్రులచేత, జుష్టః = సేవింపబడిన, మద్వత్ = నావంటివాడు, కశ్చిత్ప్రభుః = ఏ ప్రభువును, న = లేడు; అనగా ధీశాలురైన మంత్రివరుల సలహాలు తీసికొని, యుక్తాయుక్తము లెఱిగి పాలించు రాజులలో నాకు నేనే సాటి; నిజైః = స్వకీయమైన, తైః తైః చరిత్రైః = ఆయాచరిత్రలవల్ల, అనగా కుబేరనిరసనము, పుష్పకవిమానాపహరణము, లంకా క్రమణము – ఇత్యాది చరిత్రలవల్ల, అహమ్ = నేను, ప్రాప్తాత్యుజ్జ్వలకీర్తిసంహతిః = మిక్కిలి ప్రకాశవంతమైన కీర్తిజాలమును పొందినవాడను; జనకజే = ఓ జనరాజపుత్త్రీ! సంగ్రామసింహస్య = యుద్ధమునందు సింహమువంటి వాడనైన, మే = నాకు, తుల్యతాం = సరిపోలుటకు, రామః = రాముడు, న+అర్హతి = (ఎంతమాత్రమును) తగడు.

నాల్గవపాదములో సీత రావణుని స్వోత్కర్ష నిట్లు నిరసించుచున్నది:

అరే = ఓరీ (నీచసంబోధనము)! సర్వం సత్యమ్ = నీవు పల్కినదంతయు సత్యము! పరం తు = ఐతే(కాని), తవ = నీకు, సంన్యాస ఏకః = సంన్యాస మొక్కటే, అనుచితః = తగనిది; నీవింత గొప్పవాడవని పొగడికొనుచున్నావు. ఒక్క సన్యాసమే నీకు తగనిది అని రాముడింటలేని సమయమున దొంగసన్యాసి వేషమును వేసికొని తన్నపహరించిన విషయము గుర్తు చేసి అతనిని అపహాస్యము చేయుచున్నది.

నాల్గవపాదములోని నిగూఢార్థము:

అరే = ఓరీ (నీచసంబోధనము)! సర్వం సత్యమ్ = నీవు పల్కినదంతయు సత్యము! పరం తు = కాని, తవ = నీకు, సంన్యాస ఏకః — నీ పల్కులలో జేర్చిన సం-అను ఉపసర్గ ఒక్కటే, అనుచితః = తగనిది. అనగా సంగ్రామసింహః ఇత్యాదిపదములందలి సం- అను అక్షరమును తీసివేసి పలుకుట ఒక్కటే నీకు యుక్తముగా నుండునని సీతాప్రత్యుత్తరమందలి గూఢార్థము. ఇట్లు సం- అను ఉపసర్గను తొలగింపగా, రావణుని వాక్యము లీక్రిందివిధముగా మారి, ఉద్దిష్టార్థమునకు సంపూర్ణవ్యతిరేకార్థము సిద్ధించును:

జుష్టో మన్త్రిజనేన గతధియా మద్వన్న కశ్చిత్ప్రభుః
ప్రాప్తాత్యుజ్జ్వలకీర్తిహతిరహం తైస్తైశ్చరిత్రైర్నిజైః
రామో నార్హతి తుల్యతాం జనకజే గ్రామసింహస్య మే

దీని కర్థము:

గతధియా = బుద్ధిహీనులైన, మన్త్రిజనేన = మంత్రులచేత, జుష్టః = సేవింపబడిన, మద్వత్ = నావంటివాడు, కశ్చిత్ప్రభుః = ఏ ప్రభువును, న = లేడు. తెలివిలేని మంత్రుల మాటలు, పొగడ్తలు విని తెలివిలేని పనులే చేయుచున్నా ననుట; నిజైః = స్వకీయమైన, తైః తైః చరిత్రైః = అట్లు బుద్ధిహీనులైన మంత్రుల యాలోచనలను విని చేసిన ఆయా చర్యలవలన, అహమ్ = నేను, ప్రాప్తాత్యుజ్జ్వలకీర్తిహతిః = మిక్కిలి ప్రకాశవంతమైన కీర్తిజాలమును నష్టము చేసికొన్నవాడను – మిక్కుటముగా అపకీర్తి పొందినవాడ నైనాను; జనకజే = ఓ జనరాజపుత్త్రీ! గ్రామసింహస్య = శునకమువంటివాడనైన. శ్వ గ్రామసింహ శ్శునకో భషకో గ్రామపాలకః – అని నిఘంటువు. అందుచేత గ్రామసింహమనగా శునకము (కుక్క) అని అర్థము, మే = నాకు, తుల్యతాం =స రిపోలుటకు, రామః = రాముడు, న+అర్హతి = (ఎంతమాత్రమును) తగడు.

పై ఉదాహరణము రామశాస్త్రిగారు వ్రాసిన పూర్వార్ధము లోనిది. సీతారామశాస్త్రిగారు వ్రాసిన ఉత్తరార్ధములోని ఉదాహరణమును క్రింద నిచ్చుచున్నాను:

లోకే శస్తవివేక ఇత్యభిహితః కో మత్పరో వర్తతే?
నిత్యం మద్వదధీశసంనుతగుణః కస్తావదస్తీతర|
భూజాతే! శరణాగతస్య సులభః కో మత్సమో విద్యతే?
శశ్వజ్జల్పసి యత్త్వమేవమిహ రే కుత్రాపి శం మా గమః (ఉత్తరభాగము –శ్లో:25)

మొదటి మూడు పాదములలో రావణుడు స్వోత్కర్ష నిట్లు చేసికొనుచున్నాడు:

లోకే = లోకమునందు, శస్తవివేకః ఇతి = ప్రశస్తమైన (లేక క్షేమంకరమైన=లోకహితకరమైన) బుద్ధిగలవాడని , అభిహితః = కీర్తింపబడినవాడు, కో మత్పరః = నాకంటె ఎవ్వడు, వర్తతే = ఉన్నాడు? నాకంటె లోకహితకారియైన వాడెవ్వడును ఈలోకమున లేడనుట; నిత్యం = ఎల్లపుడు, అధీశసంనుతగుణః = (ఇతర)రాజులచేత, దిగధీశులచేత స్తుతింపబడిన (ఉత్తమ)గుణములు గలవాడు, మద్వత్ = ననుబోలిన, ఇతరః = అన్యుడు, కస్తావదస్తి = అంతటివాడు ఎవ్వడున్నాడు? తన శౌర్యాదిగుణముల నితరరాజులు, ఇంద్రాదిదిక్పాలకులు సంతతము స్తుతించుచున్నారనుట; భూజాతే = భూపుత్త్రియైన సీతా! శరణాగతస్య సులభః = శరణార్థునికి సులభుడైన, మత్సమః = నావంటివాడు, కః విద్యతే = ఎవ్వడున్నాడు? తానే శరణాగతరక్షకుడు, ఆర్తత్రాణపరాయణు డనుట.

నాల్గవపాదములో సీత రావణుని స్వోత్కర్ష నిట్లు నిరసించుచున్నది:

రే = ఓరీ! త్వం = నీవు, యత్ = ఏది, ఏవం = ఇట్లనుచితముగా, శశ్వత్ = మాటిమాటికి, జల్పసి = వదరుచున్నావో, (తత్ = దాని వలన), ఇహ = ఈభూమిపై, కుత్రాపి = ఏవిషయము నందును, శం మా గమః = శుభమును (సుఖమును) పొందకుండుము.

నాల్గవపాదములోని నిగూఢార్థము:

రే = ఓరీ! త్వం = నీవు, యత్ = ఏది, ఏవం = ఇట్లనుచితముగా, శశ్వత్ = మాటిమాటికి, జల్పసి = వదరుచున్నావో, ఇహ = దీనిలో, కుత్రాపి = ఎందును, శం మా గమః = శ-అను అక్షరము రాకుండుగాక. అనగా, శ- అక్షరరహితముగా నీవు పల్కునది పల్కుమనుట. ఇట్లు శ- అను అక్షరమును తొలగింపగా, రావణుని వాక్యము లీక్రిందివిధముగా మారి, ఉద్దిష్టార్థమునకు సంపూర్ణవ్యతిరేకార్థము సిద్ధించును:

లోకేఽస్తవివేక ఇత్యభిహితః కో మత్పరో వర్తతే?
నిత్యం మద్వదధీసంనుతగుణః కస్తావదస్తీతరః?
భూజాతే! రణాగతస్య సులభః కో మత్సమో విద్యతే?

దీని కర్థము:

లోకే = లోకమునందు, అస్తవివేక ఇతి = అంతరించిన యుక్తాయుక్తవివేకము గలవాడని, అభిహితః = కీర్తింపబడినవాడు, కో మత్పరో వర్తతే = నేను దప్ప ఇంకెవడున్నాడు? లోకములో అందఱికంటె నేనే బుద్ధిహీనుడ ననుట; నిత్యం = ఎల్లప్పుడు, మద్వత్ = నావలె, అధీ = బుద్ధిహీనులచేత, సంనుతగుణః = కీర్తింపబడిన గుణములు గలవాడు, కస్తావదస్తీతరః = ఇతరు డెవ్వడున్నాడు? బుద్ధిహీనులు మాత్రమే నాగుణములను పొగడుచున్నారనుట; భూజాతే = ఓ సీతా! రణాగతస్య = యుద్ధము చేయుటకై వచ్చినవారికి (శత్రువులకు), సులభః = సులభముగా జయింప జాలినవాడు, కో మత్సమో విద్యతే = ననుబోలు వాడెవడున్నాడు. యుద్ధములో నెదుర్కొనుటకు వచ్చిన శత్రువులకు భీరువయి సులభముగా లొంగిపోవుటలో నన్ను మించిన వాడింకెవడూ లేడనుట.

2. అధిదత్తాక్షరచిత్రమున కుదాహరణము

ఈతిత్యఙ్నిజబంధుపౌరపరిషత్తోష్టూయ్యమానోఽస్మ్యహం
శాన్తాతఙ్కనిమిత్తభూతచరిత స్సీతేఽస్మ్యహం పశ్య మామ్|
నిత్యం కిం చ ధనోపలబ్ధ్యనుగుణవ్యాపార ఏవాస్మి, రే
స్త్వైరం జల్ప ముహుర్నికారవిషయాః ప్రాగేవ తేఽమీ గుణాః|| (పూర్వభాగము-శ్లో:40)

మొదటి మూడు పాదములలో రావణుడు తన ఉత్తమరాజ్యపాలనాసామర్థ్యము నిట్లు పొగడికొనుచున్నాడు:

హే సీతే = ఓ సీతా! అహమ్ = నేను, ఈతిత్యక్ = ఈతిబాధలనుండి విముక్తులైన (అతివృష్టి, అనావృష్టి, మహామారివంటి దేశోపద్రవములకు ఈతిబాధలని పేరు), నిజ = స్వీయమైన, బంధుపౌరపరిషత్ = చుట్టములు, పౌరుల సమూహము చేత, తోష్టూయ్యమానః అస్మి = మఱిమఱి కొనియాడబడుచున్నవాడనై యున్నాను. అనగా నా సుఖపరిపాలనలో ఈతిబాధ లన్నియు తొలగిపోగా, నన్ను బంధువులు, ప్రజ లెల్లరు మాటిమాటికి స్తుతించుచున్నా రనుట; హే సీతే = ఓ సీతా! పశ్య మాం = నావైపు చూడు (చూడుమని హస్తనిర్దేశము చేయుచున్నాడు), అహమ్ = నేను, శాన్త+ఆతఙ్కనిమిత్తభూతచరితః అస్మి = శమింపజేయబడిన భయకారకములైన భూతవ్యాపారము గలవాడనై యున్నాను. అనగా, నా పరిపాలనలో ఈతిబాధలు, భూతబాధలు తొలగి ప్రజలు సుఖముగా నున్నారనుట; హే సీతే = ఓ సీతా! కిం చ = ఇంకను, నిత్యం = నిరంతరముగా, ధనోపలబ్ధి+అనుగుణవ్యాపార ఏవ+అస్మి = ద్రవ్యలాభమునకు అనుకూలమైన వ్యాపారములయందే నిమగ్నుడనై ఉన్నాను. అనగా సంతతము ధనలాభకారులైన వ్యాపారములనే చేయుచు రాజ్యమును సుసంపన్నము చేయుచున్నాననుట.

నాల్గవపాదములో సీత రావణుని స్వోత్కర్ష నిట్లు నిరసించుచున్నది:

రే = ఓరీ! ముహుః = మాటిమాటికి, స్త్వైరం = ఇష్టమున్నట్లుగా, జల్ప = వదరుదువుగాక; అమీ = ఈ నీవు చెప్పుచున్న, తే = నీయొక్క, గుణాః = గుణములు, ప్రాగేవ = ముందుగానే, నికారవిషయాః = తిరస్కారమునకు నెలవులు. (ధాన్యోత్క్షేప తిర స్కారౌ నికారౌ – అని నానార్థరత్నమాల.) అనగా, నీ గుణఘోషను వినవలసిన పనిలేదు. నీ స్వయంగుణశ్లాఘన ముందుగానే తిరస్కృతమైనదని భావము.

నాల్గవపాదము లోని నిగూఢార్థము:

రే = ఓరీ! ముహుః = మాటిమాటికి, స్త్వైరం = ఇష్టమున్నట్లుగా, జల్ప = వదరుదువు గాక; అమీ = ఈ నీవు చెప్పుచున్న, తే = నీ యొక్క, గుణాః = గుణవిశేషణములు, ప్రాగేవ = మొదటనే, నికార = ని-అను అక్షరమునకు, విషయాః = స్థానీభూతములు (నెలవులు) ఐనవి. అనగా, నీ గుణఘోషకు వాడు విశేషణములన్నింటికి ముందుగా ని- అను అక్షరము నుంచి పల్కుమనుట. ఇట్లు విశేషణములకు ముందుగా ని- అను అక్షరమును తగిలించగా, రావణుని వాక్యము లీక్రిందివిధముగా మారి, ఉద్దిష్టార్థ మునకు పరిపూర్ణవ్యతిరేకార్థము సిద్ధించును:

నీతిత్యఙ్నిజబంధుపౌరపరిషత్తోష్టూయ్యమానోఽస్మ్యహం
నిశాన్తాతఙ్కనిమిత్తభూతచరితస్సీతేఽస్మ్యహం పశ్య మామ్
నిత్యం కించ నిధనోపలబ్ధ్యనుగుణవ్యాపార ఏవాస్మి

దీని కర్థము:

అహమ్ = నేను, నీతిత్యక్ = నీతిని త్యజించిన (నీతిబాహ్యులైన), నిజబంధుపౌరపరిషత్ = స్వీయబంధుపౌరవర్గములచేత, తోష్టూయ్యమానః అస్మి = మాటిమాటికి కొనియాడబడుచున్నాను. అనగా తాను దుర్మార్గుడైనను, నీతిబాహ్యులైన తన బంధువులు, పౌరులు స్వలాభాపేక్షతో తనను నిరంతరము స్తుతించుచున్నారు గాని ఇంకెవ్వరూ స్తుతించుట లేదనుట; అహమ్ = నేను, నిశాన్త = అంతఃపురము యొక్క, పతివ్రతలైన మందోదరాదులయొక్క- నిశాన్తః కథిత శ్శాన్తే, నిశాన్తం భవనోషసౌః అని విశ్వకోశము. అంతఃపురశబ్దము అంతఃపురమందలి స్త్రీలకును వర్తించును. – ఆతఙ్క = భయమునకు, నిమిత్తభూత = కారణమైన, చరితః అస్మి = నడవడిగలవాడనై యున్నాను, సీతే = ఓ సీతా! పశ్య మామ్ = ఇటువంటి నన్ను పరికించుము. పరస్త్రీల నపహరించి మందోదరాది పతివ్రతలకు భయకారకుడ నగుచున్నాననుట. నిన్నపహరించుటచేత ఏ క్షణమున రాముడు నన్ను నిహతుని జేసి, తమకు వైధవ్యప్రాప్తిని గల్పించునో యని శుద్ధాంతస్త్రీలు భయపడుచున్నారనుట.

కించ=మఱియును, నిత్యం=ఎల్లవేళల, నిధన+ఉపలబ్ధి+అనుగుణవ్యాపార ఏవ+అస్మి=మరణము పొందుటకు తగిన నడవడికతోడనే యున్నాను – ‘మరణం నిధనోఽస్త్రియామ్’ – అని అమరము. సీతాపహరణాదులవంటి నిత్యదుష్కర్మలను నాచావుకొఱకే నేను చేయుచున్నాననియు, ఇదియే మందోదరాద్యంతఃపురస్త్రీలకు దుఃఖకారకమగుచున్నదనియు భావము.

పై శ్లోకము రామశాస్త్రిగారి పూర్వభాగము లోనిది. రావణుడు తన అసహాయశూరత్వమును, సౌందర్యమును పొగడికొను నీక్రింది శ్లోకము సీతారామశాస్త్రిగారి ఉత్తరభాగము లోనిది:

హస్తా నన్వతిలాఘవాన్మమ హితాస్సర్వే సహాయా ఇమే
పక్షా ఏవ మమాఖిలా జనకజే! యే సన్తి లోకత్రయే|
పత్త్యోఘో మమ సజ్జ ఏవ పురతః కార్యా న భీతిస్త్వయా
మైవం జల్ప పదేపదే విముఖతా తే వాచి మే రోచతే|| (ఉత్తరభాగము-శ్లో:62)

మొదటి మూడు పాదములలో రావణుడు తన సామర్థ్యము నిట్లు పొగడికొనుచున్నాడు:

నను జనకజే = ఇదిగో జానకీ! ఇమే హస్తాః సర్వే = ఈ చేతులన్నియు, అతిలాఘవాత్ = (బాణప్రయోగాదులను చేయుటలో) అతివేగము వలన, మమ = నాకు, హితాః సహాయాః = యథార్హముగా సహాయము చేయునవి (అనుచు తన ఇరువది చేతులను సగర్వముగా చూపుకొనుచున్నాడు); యే = ఎవరు, లోకత్రయే = ముల్లోకములందు, సన్తి = ఉన్నారో, అఖిలాః = వారందఱు, మమ = నాకు, పక్షాః ఏవ = సహాయులే – పక్షస్సహాయేఽపి – అని అమరము. నేను త్రిలోకములను జయించి, ఆ లోకములలో గల వారిని నాపక్షమునకు త్రిప్పుకొంటిని. అందుచేత వారందఱు యుద్ధసమయములో నాపక్షమునే వహించి సాయమొనరింతురని భావము; మమ = నాయొక్క, పత్త్యోఘః = పదాతిసమూహము, పురతః = ఎదుట, సజ్జ ఏవ = (ఆయుధములతో) సన్నద్ధమయ్యే యున్నది, (అందుచేత) త్వయా = నీచేత, భీతిః = భయము, న కార్యా = పొందవలసిన పనిలేదు. వనవాసగతుడైన రాముని విడిచి నన్ను జేరితివేని నీవు సర్వదా సురక్షితయై యుందువని భావము.

నాల్గవపాదములో సీత రావణుని స్వోత్కర్ష నిట్లు నిరసించుచున్నది:

నీచ = నీచుడా! పదేపదే = వాక్యవాక్యము నందును – పదం శబ్దే చ వాక్యే చ వ్యవసాయాపదేశయోః, శ్లోకపాదేఽపి చ క్లీబమ్ – అని విశ్వకోశము, ఏవం మా జల్ప = ఇట్లు వదరకుము. తే వాచి = నీమాటయందు, మే =నా కు, విముఖతా = వైముఖ్యమే, రోచతే = ఇష్టము. ఇట్టి ప్రలాపములు మానుము, నీమాటలందు నాకు వైముఖ్యమే కాని ఆదరము లేదని భావము.

నాల్గవపాదములోని నిగూఢార్థము:

నీచ = నీచుడా! ఏవం మా జల్ప = ఇట్లు వదరకుము. తే వాచి = నీ మాటలోని, పదేపదే = ప్రతిశ్లోకపాదమందును (పై విశ్వకోశ శ్లోకప్రకారము పదశబ్దమునకు శ్లోకపాదమను అర్థము స్పష్టము), విముఖతా = ముఖమందు అనగా పాదారంభములో వి-అను అక్షరముండుట, మే = నాకు, రోచతే = ఇష్టము. అట్లు వదరకుము. నీవు చెప్పెడి శ్లోకములో ప్రతిపాదారంభములో వి-అను అక్షరమును చేర్చి పలుకుము. అది నాకిష్టమగును అని భావము. ఇట్లు చేయగా, రావణుని వాక్యము లీక్రింది విధముగా మారి, ఉద్దిష్టార్థమునకు పరిపూర్ణవ్యతిరేకార్థము సిద్ధించును:

విహస్తా నన్వతిలాఘవాన్మమ హితాస్సర్వే సహాయా ఇమే
విపక్షా ఏవ మమాఖిలా జనకజే! యే సన్తి లోకత్రయే
విపత్త్యోఘో మమ సజ్జ ఏవ పురతః కార్యా న భీతి స్త్వయా

దీని కర్థము:

నను జనకజే = ఇదిగో జానకీ! మమ = నాయొక్క, అతిలాఘవాత్ = మిక్కిలి అల్పత్వము వలన – లాఘవశబ్దమునకు అల్పత, నైచ్యము, వేగమను అర్థము లున్నవి. అగురు క్షిప్ర నిస్సార మనోజ్ఞేషు లఘు స్త్రిషు – అని నానార్థరత్నమాల. లఘుశబ్ద భావార్థకమే లాఘవము, హితాః = హితకారులైన, సహాయాః ఇమే సర్వే = సహాయమునకు వచ్చు (బంధు మిత్రాదులగు) వీరెల్లరు, విహస్తాః (సన్తి) = వ్యాకులు లౌదురు. విహస్తవ్యాకులౌ సమౌ – అని అమరము. నా యొక్క నీచప్రవృత్తి వలన నాకు సహాయము చేయవలసిన బంధుమిత్రాదు లత్యంత వైకల్యమును వహితురని భావము; జనకజే=సీతా! యే=ఎవ్వరైతే, లోకత్రయే=ముల్లోకములందు, సన్తి=ఉన్నారో, (ఇమే) అఖిలాః=వీరందఱు, మమ=నాకు, విపక్షా ఏవ=శత్రువులే. నేను జేయు పాపకార్యములవలన నాకు ముల్లోకములం దెల్లరు శత్రువు లైనారని భావము; విపత్త్యోఘః = విపత్తుల సమూహము, మమ = నాయొక్క, పురతః = ఎదుట, సజ్జ ఏవ = సన్నద్ధ మయ్యే యున్నది, (అందుచేత) త్వయా = నీచేత, భీతిః = భయము, న కార్యా = పొందవలసిన పనిలేదు. నేను చేయు పాపకార్యములవల్ల నాయెదుట విపత్సమూహము పొంచియే యున్నది. నేనట్లు నాశనమౌదును గనుక నావలన నీవెట్టి భయమును పొంద నవసరము లేదని భావము. శ్రీరామచంద్రుడు త్వరలో యుద్ధమున తనను నిహతుని జేయునని ధ్వని.

3. ప్రతిదత్తాక్షరచిత్రమున కుదాహరణము

సదాయత్తం సత్యావికలమపి మాం విద్ధ్యవనిజే
సుధేత్యేవ గ్రాహ్యా త్వదనునయోక్తిర్మమ న కిమ్|
సుఖాధిక్యం రామాదపి మయి విమూఢా అపి విద-
న్త్యసంబద్ధం మే న శ్రుతిమధమ తేఽభ్యేతి వచనమ్|| (పూర్వభాగము-శ్లో:27)

మొదటి మూడు పాదములలో రావణుడు తన సాధుత్వమును, సత్యసంధతను వర్ణించి సీతను తన కనుకూలురాలుగా కమ్మని కోరుచున్నాడు.

హే అవనిజే = ఓ సీతా! సత్+ఆయత్తం = సత్పురుషులకు అధీనుడైనవాడుగను, సత్యే సాధౌ విద్యమానే ప్రశస్తేఽభ్యర్హితే చ సత్ అనియు అధీనో నిఘ్న ఆయత్తః – అనియు అమరము, సత్యావికలమ్ అపి = సత్యమునందు స్థిరముగా నున్నవాడు గను, మాం = నన్ను, విద్ధి = తెలిసికొనుము. నేను సత్పురుషులకు వశుడై వారిని సేవించుచు, సత్యవ్రతనిష్ఠుడైన సాధుపురుషుడనై యున్నాననుట; మమ = నా యొక్క, త్వదనునయోక్తిః = నీకగు అనునయ వాక్యములు, సుధా ఇత్యేవ = అమృతతుల్యముగా, గ్రాహ్యా న కిమ్ = స్వీకరింపదగినవి కాదా? స్వీకరించి నన్నాదరింపవలెనని అర్థము; రామాదపి = రామునికంటెను, మయి = నాయందు, సుఖాధిక్యం = అధికమైన సుఖము, సత్యపి = ఉన్నదని, విమూఢా అపి = అతిమూర్ఖులైనను, విదన్తి = ఎఱుగుదురు. నాతోడి సహవాసము రామునికంటెను ఎక్కువ సుఖప్రదమైనదని ఎంతటి మూఢులైనా ఎఱుగుదురు. ఇట్టి నన్ను వివేకవంతురాలవైన నీవు నిరసింపక చేపట్టి సుఖించుమని భావము.

నాల్గవపాదములో సీత రావణుని వాక్యముల నిట్లు నిరసించుచున్నది:

రే అధమ = ఓరి నీచుడా! తే = నీ యొక్క, అసంబద్ధం = పొంతనలేని, వచనమ్ = మాట, మే = నాయొక్క, శ్రుతిమ్ = చెవిని, న అభ్యేతి = పొందదు. పొందికలేని నీ మాటలు నా చెవిని సోకవనుట. నీది అరణ్యఘోషయే యనుట.

నాల్గవపాదములోని నిగూఢార్థము:

రే అధమ = ఓరి నీచుడా! తే = నీ యొక్క, వచనమ్ = మాట, అసం = స-కారము లేకుండ, మేనబద్ధం= మ-కారముతో గూడిన దైన, మే = నాయొక్క, శ్రుతిమ్ = చెవిని, అభ్యేతి = పొందును. నీ మాటలలో సకారస్థానములో మకారమును జేర్చి పలికినచో నీ మాటలు నా చెవిని సోకు ననుట. ఇట్లు మార్చినచో రావణుని వాక్యము లీక్రిందివిధముగా మారి, ఉద్దిష్టార్థమునకు పరిపూర్ణ వ్యతిరేకార్థము సిద్ధించును:

మదాయత్తం మత్యావికలమపి మాం విద్ధ్యవనిజే
ముధేత్యేవ గ్రాహ్యా త్వదనునయోక్తిర్మమ న కిమ్
ముఖాధిక్యం రామాదపి మయి విమూఢా అపి విదన్తి

దీని కర్థము:

హే అవనిజే = ఓ సీతా! మాం = నన్ను, మదాయత్తం = మదమునకు వశమైనవాడుగను (మదాంధునిగను), మత్యా = బుద్ధిచేత, వికలమ్ అపి = అస్థిరుడైనవాడుగను (అనగా పిచ్చివాడుగను), విద్ధి = తెలిసికొనుము. మమ = నాయొక్క, త్వదనునయోక్తిః = నీకగు అనునయోక్తులు, ముధా ఇత్యేవ =వ్యర్థవాక్యములే యని, వ్యర్థకే తు వృథా ముధా – అని అమరము, గ్రాహ్యా న కిమ్ = స్వీకరింపదగినవి కావా? నామాటలను వ్యర్థములని (నిస్సారములని) తప్పక గ్రహింపు మని అర్థము; రామాదపి = రామునికంటెను, మయి = నాయందు (నాకు), ముఖాధిక్యం (అస్తీతి) = ముఖముల బాహుళ్యము ఉన్నదని, విమూఢా అపి = అతిమూఢులును, విదన్తి = ఎఱుగుదురు. రాముని కొక్క ముఖమే గాని నాకు (దుష్టమైన) పదిముఖము లున్నవని అందఱికి దెలుసు ననుట.

పై శ్లోకము రామశాస్త్రిగారి పూర్వభాగములోనిది. సీతారామశాస్త్రిగారి ఉత్తరభాగములోని ఈక్రింది శ్లోకములో రావణుడు ఎందరో అందకత్తెలు తన అంతఃపురంలో ఉన్నారని, ఐనా తాను సీతను కామించుచున్నాడని, వృథాగా బెట్టు సేయక తనకు వశ్యము గమ్మని ఆమెను కోరుచున్నాడు:

మానిన్యః కతి వా న సన్తి సతతం మే పాదవశ్యా గృహే
త్వామానీయ తథాఽప్యహం బహివిదత్త్యాసక్తితః కామయే|
కర్తవ్యా న ముధా త్వయా మయి నను క్షోణీసుతే దోషధీః
వాఙ్నిర్యాతి కుతస్సదా ఖల హితాపేతా తవేయం ఖలు|| (ఉత్తరభాగము-శ్లో:17)

మొదటి మూడు పాదములలో రావణుడు సీతను తనకు వశ్యము కమ్మని కోరుచున్నాడు:

గృహే = అంతఃపురము నందు, సతతం = ఎల్లవేళల, కతి వా = ఎందఱు, మానిన్యః = మానవతులైన స్త్రీలు, మే = నాకు, పాదవశ్యాః = పాదసేవికలగుచు, న సన్తి = లేరు? అనగా ఎందఱో మానవతులైన స్త్రీలను హరించి నా అంతఃపురములో ఉంచుకొన్నానని, వారు నాకు వశవర్తులై నన్ను సంతతము సేవించుచున్నారని ప్రగల్భము లాడుచున్నాడు; తథాఽపి = అట్లైనను, బహువిత్ అహమ్ = అనేక స్త్రీలను పొందిన నేను, త్వామ్ = నిన్ను, ఆనీయ = (పంచవటినుండి)తీసికొని వచ్చి, అత్యాసక్తితః = మిక్కిలి ఆసక్తితో, కామయే = కోరుచున్నాను. అంతమంది స్త్రీలు గలవాడనైనను, నిన్ను పంచవటినుండి హరించుకొని తెచ్చి, అత్యాసక్తితో నీపొందును కోరుచున్నాను; హే క్షోణీసుతే = ఓ సీతా! మయి = నాయందు, త్వయా = నీచేత, దోషధీః = దోషబుద్ధి, ముధా = వ్యర్థముగ, న కర్తవ్యా = చేయ దగదు. ఇతర స్త్రీలందఱి కంటె నీయందనురక్తుడ నైనాను గనుక, పెడబుద్ధితో విలంబనము సేయక త్వరగా నావశము గమ్మని అభిప్రాయము.

{ఇదేవిషయం రామాయణంలో నిట్లు చెప్పబడినది:

కామయే త్వం విశాలాక్షి బహుమన్యస్వ మాం ప్రియే|
బహ్వీనా ముత్తమస్త్రీణా మాహృతానా మితస్తతః||
సర్వాసామేవ భద్రం తే మమాగ్రమహిషీ భవ| (ఇత్యాదిగా)}

నాల్గవపాదములో సీత రావణుని వాక్యముల నిట్లు నిరసించుచున్నది:

ఖల = దుష్టుడా! హితాపేతా ఖలు = హితరహితమైనవగు, తవ = నీదు, ఇయం వాక్ = ఈ (దుష్ట)వాక్యము, సదా = ఎల్లప్పుడు కుతః = ఎందువలన, నిర్యాతి = వెలువడుచున్నది? నిరంతరముగా ఘోషించు నీదుష్టవాక్యము లిక చాలింపు మని భావము.

నాల్గవపాదములోని నిగూఢార్థము:

ఖల = దుష్టుడా! కుతః = ఎందువలన, సదా = ద-కారముతో గూడిన, తవ = నీదు, ఇయం వాక్ = ఈ మాట, నిర్యాతి = వెల్వడు చున్నది? పేతా (ప+ఇతా) = ద-కారముతో నున్నదానికి బదులు ప-కారముతో కూడిన, వాక్ = మాట, హితా ఖలు = తగినది కదా! అనగా ద-కారమున్న చోట దానికి బదులు ప-కారమునుంచి పలికిన నీదు మాటలు వినదగినవిగా నుండు ననుట. అట్లు చేయగా, రావణుని వాక్యము లీక్రింది విధముగా మారి, ఉద్దిష్టార్థమునకు పరిపూర్ణవ్యతిరేకార్థము సిద్ధించును:

మానిన్యః కతి వా న సన్తి సతతం మే పాపవశ్యా గృహే
త్వామానీయ తథాఽప్యహం బహివిపత్త్యాసక్తితః కామయే
కర్తవ్యా న ముధా త్వయా మయి నను క్షోణీసుతే పోషధీః

దీని కర్థము:

గృహే = అంతఃపురము నందు, సతతం = ఎల్లవేళల, కతి వా = ఎందఱు, మానిన్యః = మానవతులైన స్త్రీలు, మే = నాకు, పాపవశ్యాః = నా పాపకారణమున వశ్యులైనవారు, న సన్తి = లేరు? ఎందఱో మానవతులైన స్త్రీలను బలాత్కారముగా హరించి నా అంతఃపురములో ఉంచుకొన్న పాపాత్ముడను నేనని భావము; తథాఽపి = అట్లైనను, అహమ్ = నేను, త్వామ్ = నిన్ను, ఆనీయ = (పంచవటినుండి)తీసికొని వచ్చి, బహువిపత్త్యాసక్తితః = గొప్ప విపత్తి నాశించువాడనై, కామయే = కోరుచున్నాను. అంతటితో నాగక, గొప్ప కీడు నాశించినవాడనై నిన్ను పంచవటి నుండి హరించి తెచ్చి నీపొందును కోరుచున్నాను. దీనివల్ల నాకు మరణమే పొంచియున్నదని ధ్వని; హే క్షోణీసుతే = ఓ సీతా! మయి = నాయందు, త్వయా = నీచేత, పోషధీః = పోషించుబుద్ధి, ముధా = వ్యర్థముగ, న కర్తవ్యా = చేయదగదు. ఇది నిష్కృతి లేని పాపము. ఇట్టి పాపాత్ముని పోషించు తలంపు మానుమని భావము.
---------------------------------------------------
రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు, 
ఈమాట సౌజన్యంతో

No comments: