విసనకర్ర శతకము
సాహితీమిత్రులారా!
"హరి బ్రహ్మేశ్వర"గారు
"విసనకర్ర శతకం"
ఒక గంటలో వ్రాశారు
ఇది హాస్యరస ప్రధానమైన
శతకం గమనించండి-
శ్రీపదంబ నిన్ను చేర్చి మొట్టమొదట
చేతికొద్దివ్రాయజూతు మహహ
తప్పులున్న యెడల తప్పునీదేసుమా
విశ్వదాభిరామ విసనకర్ర!
ప్రధమ భాగము
దైవప్రార్థనములు
-: శారద :-
1. ఏమి శారదాంబ! ఎలమితో మానాల్క
పై వసించెదేని పద్యములను
వ్రాయువారమమ్మ హాయినవ్వుజనింప
విశ్వదాభిరామ విసనకర్ర!
-: పార్వతీదేవి :-
2. తల్లి పార్వతమ్మ దయఁతోడ జూచిన
యితర దైవములకు నుతులవేల
తల్లిస్తన్యమున్న దాయీలు ముచ్చటా
విశ్వదాభిరామ విసనకర్ర!
-: గణపతి :-
3. గణపతయ్య మాకు కలిగింప కడ్డాలు
మిమ్ముగన్న తల్లి మమ్ముఁగాచు
ఆవుతోడ దూడయరు గదా విఘ్నేశ
విశ్వదాభిరామ విసనకర్ర!
-: లక్ష్మి :-
4. మొదలు నిన్ను బిలువ మొగమాటమగునంచు
మువ్వురైన పిదప ముచ్చటగను
పిలిచినాము గాని బిర బిర రావమ్మ
విశ్వదాభిరామ విసనకర్ర!
-: బ్రహ్మ :-
5. ఆలయంబులేదు హరుశాపమున నీక
టంచు చింతపడకుమయ్య నలువ
కలియుగానఁగలదు ఘనబ్రహ్మమతమొండు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: శివుడు :-
6. గంగ నెత్తిమీద కలదంచు గర్వింతె
పార్వతమ్మయింటఁ బరఁగుచుండి
జపతపాల ఫలము జంటభార్యలటోయి
విశ్వదాభిరామ విసనకర్ర!
-: విష్ణు :-
7. లచ్చి మగడవటంచు బిచ్చంబు వేడెద
యేమి యిచ్చువాఁడవో మురారి
యిచ్చు వరముతోడ హెచ్చు నీపై భక్తి
విశ్వదాభిరామ విసనకర్ర!
-: లక్ష్మీనృసింహస్వామి :-
8. స్వర్ణకశిపు పట్టి ప్రహ్లాదు కధ చెవు
లారవినుచు లక్ష్మినారసింహ
భక్తి నిన్ను గొలువ వరములేమిచ్చెదో
విశ్వదాభిరామ విసనకర్ర!
-: శ్రీవెంకటేశ్వరులు :-
9. కలియుగాన నీవె ఘనదైవమనుమాట
నిజము తెలుపవలయు సుజనవరద
ఎంత ధనము నిత్తొ గంతువేసెద మిప్డె
విశ్వదాభిరామ విసనకర్ర!
ద్వితీయభాగము
దేశప్రార్థనలు
-: భరతమాత :-
10. దేశమాతలందు దీనాన నవుగాక
పరువు నిల్పుకొమ్మ భరతమాత
శిరియులేమి యెపుడు చీకటి వెన్నెలల్
విశ్వదాభిరామ విసనకర్ర!
11. గాంధితిలకు బోలు ఘనమైన సుతులెల్ల
నిన్ను గొలుచుచుంట నెన్నికొనుచు
గరువమూనుమమ్మ భారతీ తల్లిరో
విశ్వదాభిరామ విసనకర్ర!
12. భరతపురము కోట భగ్నమైనయపుడు
సోమనాధపురము చొచ్చునపుడు
మన తురుష్క ఘనుల మన్నించితివె తల్లి
విశ్వదాభిరామ విసనకర్ర!
13. ఐకమత్యమొక యమరియుంటయెచాలు
నదె స్వరాజ్యసిద్ధియదె స్వతంత్ర
మని యెఱుంగ సుతుల కానతిమ్మమ్మరో
విశ్వదాభిరామ విసనకర్ర!
-: ఆంధ్రమాత :-
14. ఆంధ్రజాతి యెల్ల నల్లకల్లోలమై
యితర భాషలందు నిమిడియుంత
పాడిగాదు వలయు ప్రత్యేకరాష్ట్రంబు
విశ్వదాభిరామ విసనకర్ర!
15. భారతీయసభను ప్రత్యేకరాష్ట్రంబు
కలిగె ప్రభువులీయవలయు నికను
ఆంధ్రసుతుల కట్టి యానందమెప్పుడో
విశ్వదాభిరామ విసనకర్ర!
-: గుంటురు మండలము :-
16. పన్నులీయవలదు వలదంచు నెఱిగితి
వింతలోన భయము గొంతుకొఱికె
ఎలుకపిల్లయొక్కటెట్లు పట్ట ...
విశ్వదాభిరామ విసనకర్ర!
-: కొండవీటిసీమ :-
17. రెడ్డిప్రభువులందు రేబవళ్ళును లచ్చి
తాండవింపగను నఖండ శక్తి ....
కొండవీడు జూపకుండునా యికముందు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: గుంటూరు నగరము :-
18. గంటెడేని చాలు గుంటురు నీరంబు
ప్రీతి గ్రోలువాడు వీరుఁడనుచు
గొప్ప పేరుగంటి గుంటూరు నగరమా
విశ్వదాభిరామ విసనకర్ర!
తృతీయభాగము
పూర్వజన ప్రశంస
19. పూర్వకవుల నెల్ల పొగడంగవలెనయ్య
తిరిగి రారికెన్ని తిట్లకైన
స్వర్గమందువారు చక్కగా నున్నారు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: నన్నయభట్టు :-
20. మొదటి తెనుగు పద్యముదయించె నీ నోట
ననెడిమాట సత్యమగునొ కాదొ
చెప్పు వందనాలు నిప్పింతు నన్నయా
విశ్వదాభిరామ విసనకర్ర!
-: తిక్కనసోమయాజి :-
21, తిక్కనార్యశైలియొక్క చక్కదనంబు
నొక్కి చెప్ప ప్రజకక్కజముగ
నొక్కమారువచ్చి యొకవందనముగొమ్మ
విశ్వదాభిరామ విసనకర్ర!
-: కాళిదాసు :-
22. కలియుగానవేయి కాళిదాసులు బుట్టి
వందనాల వారె యందికొనుట
కలిగె సందియంబు కాళిదాసా రమ్ము
విశ్వదాభిరామ విసనకర్ర!
-: వాల్మీకి :-
23. పుట్టలోన దూరి పుట్టెడు గ్రంధంబు
వ్రాసినాడ వంట రామకధను
మరల వ్రాయరావె మఱియొండు వాల్మీకి
విశ్వదాభిరామ విసనకర్ర!
-: పోతన :-
24. పోతనార్యుడెట్టి పోకడ పోయినా
యడ్డు చెప్పువారవని లేరు
నుతి యొనర్చుడయ్య నోరూరు కొలదిని
విశ్వదాభిరామ విసనకర్ర!
-: మొల్ల :-
25. కుమ్మరయ్య గన్న కూతురైతేనేమి
యాడుదైన నేమి యాంధ్రశైలి
వలయునన్నవారు వలయు మొల్ల నెఱుంగ
విశ్వదాభిరామ విసనకర్ర!
-: అప్పకవి :-
26. అప్పకవిస్మరింపనయ్యయో మరచుటా
యతడును తెలగాణ్యుడయ్యలార
పద్యములను వ్రాయ ఫక్కి గ్రంధము వ్రాసె
విశ్వదాభిరామ విసనకర్ర!
-: చిన్నయసూరి :-
27. బ్రాహ్మణాళికెల్ల బహులజ్జగలిగింప
వ్యాకరణము వ్రాశి వదిలె నహహ
లేతవైష్ణవుండు సాతాని చిన్నయ్య
విశ్వదాభిరామ విసనకర్ర!
చతుర్ధభాగము
నవీనజనప్రశంస
-: ప్రస్తుతకవులు :-
28. బ్రతికియున్న కవులు పరమ దుర్మార్గులు
వెదకి తప్పులెల్ల వెలువరింతు
రెదురు రాకుఁడంచు పదివేల నతులిత్తు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: పండితులు :-
29. పద్యమల్లలేని పండితవర్గులు
దోషము వెదుకనభిలాషతోడ
కష్టపడఁగవలదు కట్టెడు వందనాల్
విశ్వదాభిరామ విసనకర్ర!
-: సరసులు :-
30. అలుపులేక మీరలడుగకున్నాగాని
యట్టులిట్టులనుట యెట్టిదయ్య
సరసులైన చదివి సంతోషమందుడీ
విశ్వదాభిరామ విసనకర్ర!
-: సంపాదకులు :-
31. పొట్ట కూటికొఱకు పుట్టెడు విద్యలు
మీకు మాకు జూడ లోకమొకటి
వ్రాయఁదలతురేని వ్రాయండి మంచియే
విశ్వదాభిరామ విసనకర్ర!
-: తర్జుమాదారులు :-
32. తర్జుమాకు మీకు తగు జీతమిచ్చిరి
హెచ్చొనర్ప నేరికినచ్చలేదు
పిచ్చిగ్రంధములకు హెచ్చు పేరిడకండి
విశ్వదాభిరామ విసనకర్ర!
-: పోలీసయ్యగారు :-
33. పోలిసయ్య జోలి పోవద్దు మన మెప్పు
డతని యూహ సుజనులవని లేరు
చదువు వానిలోన సందేహములు మెండు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: చదువరులు :-
34. యిచ్చ వచ్చినటులనేమేని చెప్పుడీ
మూడణాల నిచ్చి ముందు కొనుడు
ద్రవ్యమిచ్చువారి దర్జాలు వేరయా
విశ్వదాభిరామ విసనకర్ర!
-: ప్రయాణికులు :-
35. రైలుబండి నెక్కి పాలుపోకనె మీరు
కొంటిరేని చదువుకొనుడు దీని
పద్యములను మీకు బడలిక యుండదు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: విద్యార్ధులు :-
36. విద్యనభ్యసించువేళ నీకొఱగాని
వెర్రి శతకములను వినకుఁడయ్య
పాఠముల పఠించి బాగుగా నుండుడీ
విశ్వదాభిరామ విసనకర్ర!
పంచమభాగము
దేహభాగములు
-: చేతులు :-
37. చేయుపనులుమాని చిత్తగించుట యొరుల్
న్యాయమేమి యంచు మాయ చేతు
లూరకున్నయెడల నుండునా దేహంబు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: కాళ్ళు :-
38. దేహమెల్ల మోయు దీనులమా మేము
కదులబోమటంచు కాళ్ళు చెప్ప
గర్వభంగమదియె కడమ దేహంబునకు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: కనులు :-
39. కనులు చూచుచున్న కలదులోకంబెల్ల
కనులు మూసికొనిన కదులలేము
కనులు లేనివారు ఘనులెందఱిలలేరు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: చెవులు :-
40. చెవుల విననివాడు చెవిటివాడనుచుందు
రతని తెలివి యుండదితరులకిల
చెవిటివాని కనులు చెవులంత పనిచేయు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: నోరు :-
41. తిండి తినుటకొకటి తినిత్రాగుటకు రెండు
నోరు చేయు కృషిని గౌరవింప
నితర యంగముల హెచ్చరింపవలదె
విశ్వదాభిరామ విసనకర్ర!
-: కొండనాల్క :-
42. కొండనాల్క యొకటియుండ పల్కంగనౌ
నద్దిలేక పలుక నలవిగాదు
మూగవారి జూచి ముక్కునంటగఁరాదు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: గోళ్ళు :-
43. గోళ్ళు పెంచుకొనిన గోకుట సులభంబు
దురద పుట్టునపుడు కరము సుఖము
పిరికివాళ్ళు గోళ్ళు పీకించుకొందురు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: ముఖము :-
44. మోసగాని ముఖము ముందు గుర్తింపనౌ
మంచివాని ముఖము నెంచఁదగును
ముఖమె జ్ఞాన నేత్రమునకు స్థానంబయా
విశ్వదాభిరామ విసనకర్ర!
-: ముక్కు :-
45. ముక్కు లేనివాడు ముక్కిడివాడౌను
ముక్కు సొగసు దెచ్చు ముఖము కెల్ల
ముక్కులోన పొడుము నెక్కింపవలెనయా
విశ్వదాభిరామ విసనకర్ర!
షష్టమభాగము
దుస్తులు
-: లాంగుకోటు :-
46. లాంగుకోటు దొడిగి ఠంగుమంచనియేగు
ప్లీడరయ్య నెపుడు పిలువఁదగదు
పిలువగానె యతడు ఫీజును గోరును
విశ్వదాభిరామ విసనకర్ర!
-: షార్టుకోటు :-
47. షార్టుకోటు నే డిపార్టుమెంటు గుమాస్త
దొడిగినాడొ జూచి యడుగుడయ్య
యతని సాయమబ్బు నర్ధరూపాయికే
విశ్వదాభిరామ విసనకర్ర!
-: వేష్టుకోటు :-
48. వేష్టుకోటుతోడ వెడలు వాడెవ్వడు
పిలువ వలదతండె పిలచుచుండు
కంపెనీలకెల్ల ఘనుఁడీతడే జంటు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: షర్టు :-
49. షర్టుతోడ నేగు చాకలి వీరాయ
పిలిచి మాటలాడ తెలిసె నహహ
క్రొత్తషర్టు నాది కూర్మిదొడఁగె వాడు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: బనియను :-
50. క్రొత్తబనియనొకటి కోర్కెమైఁదొడగంగ
పర్రుమంచు చినిగె పాపమకట
బనియనొకటి లేక మనలేరె మనవారు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: గూడకట్టు :-
51. గోచి పెట్టుకొనుచు గూడకట్టును గట్ట
నరవవారు మిగుల నందగాండ్రు
గోచి లేకఁగట్టుకొనువారు కొందఱు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: బిళ్ళగోచి :-
52. బిళ్ళగోచి పెట్ట పెద్దవాడనుకొంటి
చుట్టగాల్చు నితడు షోకుగాను
చంకనున్న గీత చదివినాడో లేదో
విశ్వదాభిరామ విసనకర్ర!
-: నెక్కుటై, సాక్సు బూట్సు :-
53. నెక్కుటై ధరించి నిలువుటద్దముఁజూచి
సాక్సుబూట్సు వేయసాగినాడు
చలవమడత షోకు చదువుసంధ్యల కేల
విశ్వదాభిరామ విసనకర్ర!
-: హాట్ :-
54. హాటుబూట్సు వేసి యరుదెంచు దొరగారి
కై సలాముజేయ నాసఁజూడ
నల్లమొగమగుపడి నవ్వు నాకరుదెంచె
విశ్వదాభిరామ విసనకర్ర!
సప్తమభాగము
పరికరములు
(పద్యములు 55 నుండి 61 వరకు దొరకలేదు)
-: గరిటెకాడ :-
62. గరిటెకాడకూర కరకరగ వేగించు
నడ్డువచ్చుపిల్లి నణుగకొట్టు
వంటకాకముందు వచ్చుమగనికొట్టు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: విసనకర్ర :-
63. చెమటపూయునపుడు చేజిక్కి వేధించి
పడతికొట్టునదియె భిడియపడక
వీపుగోకుకొనగ విసనకర్రయె చాలు
విశ్వదాభిరామ విసనకర్ర!
అష్టమభాగము
ఆత్మబంధువులు
-:చవతితల్లి :-
64. చవతితల్లి పోరు చవతిప్రయాణంబు
కవలతల్లి కాన్పు బలువనిదుర
విరసమగునెకాని సరసంబుకాదయా
విశ్వదాభిరామ విసనకర్ర!
-: బావమఱది :-
65. కాలిలోనిముల్లు కంటిలోనినలుసు
కడుపులోనిశూల కలసియెక్క
టైన బావమఱదియైనిల్చె నిచ్చట
విశ్వదాభిరామ విసనకర్ర!
-: అత్త :-
66. నవ్వుచున్నవేళ పువ్వులజల్లుచు
మాటవిననియెడల మండిపడుచు
పిల్లనింటనుంచ వేడునత్తగనండి
విశ్వదాభిరామ విసనకర్ర!
-: కోడలు :-
67. మనసుబుట్టు భర్త మాటాడవలెనంచు
నత్తజూచునంచు నణిగియుండు
కోడలుగనుకోపమాడుబిడ్డలమీద
విశ్వదాభిరామ విసనకర్ర!
-: భార్య :-
68. వ్యాధిపీడచేత బాధింపబడువాడు
చేతకాసులేక చిక్కునాడు
భార్యకోరివచ్చు భ్రష్టుండు సైతము
విశ్వదాభిరామ విసనకర్ర!
69. వెండిచెంబుతోడ వెండిపళ్ళెముతోడ
కొత్తబట్టతోడ నత్తతోడ
మురియుచుంట భార్య మరచునల్లుండహో
విశ్వదాభిరామ విసనకర్ర!
-: ముసలమ్మ :-
70. కొడుకుమంచివాడు కోడలుచెడ్డది
మనుమరాండ్రకిడును ధనముగొంత
వంటచేసిపెట్టు నింటిలో ముసలమ్మ
విశ్వదాభిరామ విసనకర్ర!
-: ఆడుబిడ్డ :-
71. పెండ్లి కట్నములను వేమారు దెప్పుచూ
పెండ్లికొరకు దీక్ష బట్టియుండు
నాడుబిడ్డయన్న నధికార మెక్కువ
విశ్వదాభిరామ విసనకర్ర!
-: తోడికోదలు :-
72. ఆడుబిడ్డయెపుడొ యరుదెంచునేగాని
తోడికోడలమ్మ కూడనుండి
బావగారియెదుట లావునేరము సెప్పు
విశ్వదాభిరామ విసనకర్ర!
నవమభాగము
చుట్టములు
-: ఆలివంకవారు :-
73. పిల్లనిచ్చినాము పిండంబుగతిలేదె
యల్లునింటననుచు నరుగుదెంచు
నాలివంకవారి యధికారమొకరీతి
విశ్వదాభిరామ విసనకర్ర!
-: తల్లివంకవారు :-
74. అమ్మసేమమక్కొ యయ్యడబ్బిచ్చునా
యనుచు హెచ్చరించి చనువుగాను
తల్లివంకవారు దయచూపుటొకరీతి
విశ్వదాభిరామ విసనకర్ర!
-: తండ్రివంకవారు :-
75. పొలములేమిగలవు భూములుపండునా
రొఖ్కమెంత నిలువ రూఢిజెప్ప
వలయుననెడితండ్రివంక వారొకరీతి
విశ్వదాభిరామ విసనకర్ర!
-: వియ్యాలవారు :-
76. అల్లుడొకడుమిగిలి యందఱుపోవలె
పిల్లవంటచేయ వల్లగాదు
వేరుబడుటహితము వియ్యాలవారికి
విశ్వదాభిరామ విసనకర్ర!
-: జ్ఞాతులు :-
77. మాటపలుకులేక మఱిభోజనములేక
వైరమూనునట్ట వారుకూడ
జాతశౌచములకు జ్ఞాతులంటేచిక్కు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: వారసులు :-
78. ఏలజ్ఞాతియింట చూలాలుకలిగెరా
వారసత్వమెట్లు వచ్చుననుచు
నున్నవారిచావు నెన్నువారసులేల
విశ్వదాభిరామ విసనకర్ర!
-: దత్తపుత్రులు :-
79. యెచటనుండివచ్చిరీ యాస్తిగైకొన
తద్దినాలుపెట్ట దలపరనచు
దాపువారితిట్లు దత్తపుత్రులపాలు
విశ్వదాభిరామ విసనకర్ర!
దశమభాగము
నౌకరులు
-: చాకలి :-
80. అభముశుభములందు నరుదెంచిమామూలు
గొనెడివేళనఱచి గొంతుపగుల
బట్టకొనకకట్టు భడవఝూ(?)మడియేలు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: మంగలి :-
81. పంటలన్నీయెండి పాడయిపోయినా
మంగలయ్యపంట భంగపడదు
గొఱుగుకొలదికురులు పెఱుగునువీనికై
విశ్వదాభిరామ విసనకర్ర!
-: పాలికాపు :-
82. మాలవాడొకండు పాలికాపైయుండి
యింటిగుట్టునెల్ల మంటగలుపు
యింటివారికెపుడు తంటాలువీనిచే
విశ్వదాభిరామ విసనకర్ర!
-: దాసీది :-
83. తెల్లవారుముందె కల్లాపిజల్లుచు
నంట్లుతోమునప్పు డన్నమడిగి
యిల్లునీడ్చునప్పు డెదురాడుదాసీది
విశ్వదాభిరామ విసనకర్ర!
-: డవాలిజవాను :-
84. అవసరంబుకొలది యజమానిపనిచెప్ప
నదియొనర్పనొరుల కాజ్ఞచేసి
కదులకుండువాడు ఘనడవాలి జవాను
విశ్వదాభిరామ విసనకర్ర!
-: పాకీవారు :-
85. పందులున్నయూర పనిలేదువీరికి
సమ్మెకట్టిశక్తి చాలగలదు
మునిసిపాలిటీల ముద్దుబిడ్డలువీరు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: వంటవాడు :-
86. వంటశాలకెల్ల వంటవాడధికారి
వానిలంజకంపు వంతకముల
నింటివారలెప్పు డెఱుగనేలేరయా
విశ్వదాభిరామ విసనకర్ర!
ఏకాదశభాగము
స్నేహితులు
-: ఇరుగుపొరుగువారు :-
87. క్రొత్తగానువచ్చు కోడలిముచ్చటల్
చిత్తగించి గేలిసేయుకొరకు
ఇరుగుపొరుగువారు హితులౌదు రెలమితో
విశ్వదాభిరామ విసనకర్ర!
-: నీళ్ళబావివారు :-
88. నీటికొరకువచ్చి నీలాటిరేవులో
యూరికబురులాడు యువతులందు
చెప్పనలవిగాని స్నేహంబు గలుగదా
విశ్వదాభిరామ విసనకర్ర!
-: గుడిలోనిస్నేహము :-
89. దైవదర్శనంబుకైవచ్చు వారిలో
నొకరిమొగనొక్క రొకటగాంచ
దైవభక్తితోడ లావుస్నేహములబ్బు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: ఆసుపత్రివారు :-
90. వ్యాధిగ్రస్తులందు ప్రత్యేకమగువ్యాధి
గలుగువారలొకట నిలుచునపుడు
వారియందు స్నేహభావంబు హెచ్చదే
విశ్వదాభిరామ విసనకర్ర!
-: రైలుబండి :-
91. లోనికేగువరకు పూనిశత్రుత్వంబు
లోనికేగుపిదప మానువారు
రైలుబండి స్నేహమేలరా గమనింప
విశ్వదాభిరామ విసనకర్ర!
-: పాఠశాలవారు :-
92. పాఠశాలయందు పఠియించునప్పుడు
హెచ్చుతగ్గులేక నిచ్చకొలది
యుండుస్నేహితులకే దండిభేదములబ్బు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: బజారువారు :-
93. గాలికొరకుతిరుగు గంటస్నేహంబొండు
గాలితోడనెగుర జాలునహహ
పాలిపోసి స్నేహజాలంబు పెంచనౌ
విశ్వదాభిరామ విసనకర్ర!
ద్వాదశభాగము
దేశబంధువులు
-: గాంధి :-
94. గాంధిగారువచ్చి గందరగోళంబు
దేశమంతజేసి తిరిగినారు
గాంధిజయిలుకేగ గడచెనారోజులు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: దాసు :-
95. దాసుగారు వచ్చి శాసనసభలకు
పోయి యెదురునిలచి పోరుడనుచు
హెచ్చరింపనదియు హితమయ్యె కొన్నాళ్ళు
విశ్వదాభిరామ విసనకర్ర!
-: నెహ్రూ :-
96. చాలమాటలాడి సామ్రాజ్యశాసన
సభను గెలుపుగాంచ శుభమదేమి
నెహ్రు పండితుండు నేర్పరి యున్నారు
విశ్వదాభిరామ విసనకర్ర!
(పద్యములు 97 నుండి 104 వరకు దొరకలేదు)
త్రియోదశభాగము
అధికారులు
-: కంసాలి :-
105. ఇచ్చు నగల తిరిగి యిచ్చినదాకను
వానిచుట్టు తిరుగవలయుగాన
కలియుగంబున నధికారి కంసాలియే
విశ్వదాభిరామ విసనకర్ర!
-: బాకీదారుడు :-
106. బుజ్జగించి యప్పు పుచ్చుకున్నాడేని
యిచ్చువాడు వానికెన్నిసార్లు
హెచ్చుభక్తినిడునొ యెదురు సలాములు
విశ్వదాభిరామ విసనకర్ర!
చత్రుదశభాగము
అక్షరములు
-: శకటరేభ :-
107. శకటరేఫ నీకు శతకోటిదండాలు
వ్రాతలందు వచ్చి బాధలిడకు
వలయునేని పొమ్ము పండితాళిని జేర
విశ్వదాభిరామ విసనకర్ర!
-: అరసున్న :-
108. వ్రాత చేటెగాని పలుకరించరె వారు
వద్దుపొమ్మని నను సద్దుకొనక
తిరిగి వచ్చితివిట పొరబాటులను చేసి
విశ్వదాభిరామ విసనకర్ర!
ఉపశాంతి
ఏరిమనమును నొవ్వ కోరివ్రాయగలేదు
కోపగింపవలదు గొణగవలదు
చదువువారికెల్ల పదివేలదండాలు
విశ్వదాభిరామ విసనకర్ర!
వలదునవ్వు మీకు వలదుకోపంబును
వలదుతప్పులరయ వలదుదిద్ద
విసనకర్రశతక మసలుహాస్యంబయా
విశ్వదాభిరామ విసనకర్ర!
సమాప్తి
నాల్గుఘడియలేని నలుగురునవ్వంగ
చాలునంచు మేము లీలవ్రాయ
శతకమయ్యె మీరు చదివిక్షమింపుడీ
విశ్వదాభిరామ విసనకర్ర!
(శతకసాహిత్యం బ్లాగ్ స్పాట్ సౌజన్యంతో)
No comments:
Post a Comment