Sunday, December 31, 2017

దాగి ఉన్న పదాలేవి


దాగి ఉన్న పదాలేవి




సాహితీమిత్రులారా!


శ్రీవేంకటేశ్వర సారస్వత వినోదినిలోనిదీ
పొడుపు పద్యం -

ఉద్యాన వనములో నుండెడు నీరేది?
                         శ్రీశైలమున నుండు చెలువ యెవతె?
కమలాకరములోఁగల్గు హస్తమ్మేది?
                          సోమవారములేన భామయెవతె?
కాశీపురములోనఁగల్గు పట్టణమేది?
                          మదరాసులోనుండు మంచి యేది?
రామేశ్వరములోని రమ్య బాణమ్మేది?
                         కల్పవృక్షమ్ములో మృగంబదేది?
విజయనగరమందునఁగల్గు వెలఁది యెవతి?
హైదరాబాదునందతివ్యయమదేది?
గర్భిత పదంబులేవి చెప్పఁగావలెమరి
దేవ! శ్రీ వేంకటేశ! పద్మావతీశ!

పై పొడుపు పద్యంలోని ప్రశ్నలకు సమాధానాలు-

1. ఉద్యాన వనములో నుండెడు నీరేది?
   - వనము(జలము)

2. శ్రీశైలమున నుండు చెలువ యెవతె?
   - శ్రీ(పార్వతి)

3. కమలాకరములోఁగల్గు హస్తమ్మేది?
   - కరము(చేయి)

4. సోమవారములేన భామయెవతె?
   - రమ(లక్ష్మి) 

5. కాశీపురములోనఁగల్గు పట్టణమేది?
   -పురము(పట్టణము)

6. మదరాసులోనుండు మంచి యేది?
   -సు(మంచి)

7. రామేశ్వరములోని రమ్య బాణమ్మేది?
   - శరము (బాణము)

8. కల్పవృక్షమ్ములో మృగంబదేది?
   - వృకము(తోడేలు)

9. విజయనగరమందునఁగల్గు వెలఁది యెవతి?
   - విజయ(స్రీ పేరు)

10. హైదరాబాదునందతివ్యయమదేది?
     - దుబారా(అతివ్యయము)

(ఈ సమాధానాల్నీ ఇచ్చిన ప్రశ్నలోనే ఉన్నాయి
  వాటినే కనిపెట్టమన్నది)

No comments: