కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్
సాహితీమిత్రులారా!
సమస్య-
కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్
గృహలక్ష్మి మాసపత్రికలో వచ్చిన కొన్ని పూరణలు-
మానవతీలలామ పతిమన్ననలందక సౌధసీమలం
దానువసించుచున్, బహువిధమ్ముల సౌఖ్యము లొందుచు న్న గా
నీ, నిఖిలమ్ము భారమగు నిక్కము ప్రేముడిజూపునాథుతో
కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్
- సామవేదం సీతారామమ్మ
దీనజనావనంబె నిజదీక్షగఁగైకొని మానసంబునన్
మానితకీర్తి సంపదల మక్కువసేయక కార్యశీలుడై
పూనిక నెల్లదేశములు పొందుగఁగ్రుమ్మరు కర్మయోగికిన్
కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్
- కనుపర్తి వరలక్షుమ్మ
పూని, సమస్త భూతహితమున్మది గోరుచు, స్వార్థలాభమున్
మానుచు, సత్యధర్మముల మానసమందున నిల్పి, ద్వేష మున్
గానక, కర్మనిష్ఠను జగద్ధితకార్యము జేయువారికిన్
కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్
- దేశిరాజు భారతీదేవి
(1931 జులై, గృహలక్ష్మి మాసపత్రిక నుండి)
No comments:
Post a Comment