వీటికి అర్థాలేమిటి?
సాహితీమిత్రులారా!
శ్రీవేంకటేశ సారస్వత వినోదిని లోనిది
ఈ పొడుపు పద్యం సమాధానాలు
చెప్పగలరేమో చూడండి-
కడులోఁతుగల్గు నగస్త్య మూత్రములోన
నంబుగజములీఁదులాడుచుండె
ధార్తరాష్ట్రశతము దపిదాఁపురాఁగానె
కృష్ణశకునిలేచి యేఁగెనెటకొ
పూర్వాహ్నవేళ నభోగజమ్ములు దోఁప
నీలకంఠములెల్ల నృత్యమాడెఁ
జెడువార్తలెల్ల ద్విజిహ్వుఁడొక్కఁడు దెల్ప
లోలకర్ణుండొక్కఁడాలకించెఁ
బుణ్యజనులైన వారిని బూర్వమందు
మించి పురుషోత్తముండు వధించివైచె
మెప్పుగా నర్థములివేవి చెప్పవలయు
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!
పదాలు - సమాధానాలు
1. అగస్త్యమూత్రము - సముద్రము
2. అంబుగజములు - మొసళ్ళు
3. ధార్తరాష్టశతము - కొంగలగుంపు
4. కృష్టశకుని - నల్లకాకి
5. నభోగజములు - మేఘాలు
6. నీలకంఠములు - నెమళ్ళు
7. ద్విజిహ్వుడు - కొండెగాడు
8. లోలకర్ణుడు - కొండెములు వినువాడు
9. పుణ్యజనులు - రాక్షసులు
10. పురుషోత్తముడు - విష్ణుదేవుడు
No comments:
Post a Comment