Friday, June 7, 2019

రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం


రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం




సాహితీమిత్రులారా!

“యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు.”

ఇలాంటి ప్రయోగాలు చేసినవాళ్ళు ఇంతకుముందు ఉండివుంటారా?!

నిస్సందేహంగా!!

పాతికేళ్ళ క్రితం ఓ ఢిల్లీ పెద్దాయన వందేవంద రూపాయల్లో తాను హిమాలయాల్లో రెండురోజులపాటు చేసిన ముప్పై కిలోమీటర్ల ట్రెక్ గురించి రాశాడు. అది మనసులో నిలిచిపోయింది. ‘నేనూ అలా చెయ్యాలి!’ అన్న ఆకాంక్షగా పరిణమించింది.


సిమ్లాతో నా పరిచయం వయస్సు నలబైరెండేళ్ళు. 1975లో ఢిల్లీ చేరాక చేసిన మొదటి ప్రయాణాల్లో సిమ్లా ఒకటి. వింతలూ విశేషాల కోసం ప్రయాణాలు చేసిన దశలో పదేళ్ళ పాటు కనీసం ఆరేడుసార్లు సిమ్లా వెళ్ళాను. 1984లో నా దృష్టి ప్రకృతి ట్రెకింగుల మీదకు మళ్ళాక సిమ్లా ఆకర్షణ పోయింది. ‘ఏముందీ… రోడ్లు, షాపులు, టూరిస్టులు, రెస్టారెంట్లు, హడావుడి- దానికోసం వెళ్ళి అన్ని ఇబ్బందులు పడాలా?!’ అన్న చిన్నచూపు. వెళ్ళడం మానేశాను. ఒకటిరెండుసార్లు ఇతరుల కోసం వెళ్ళినా ముళ్ళమీద కూర్చున్నట్టు ఉండేది.

ఫిబ్రవరి 2015లో ఓ పెద్దవయసు పూనే దంపతులకు సిమ్లా మంచు చూపిస్తానని పిలచి తీసుకెళ్లాను. హఠాత్తుగా గుర్తొచ్చింది- నా దగ్గర ఉన్న అవుట్‌లుక్ పత్రికవాళ్ల ‘ట్రెకింగ్ హాలిడేస్ ఇన్ ఇండియా’ అన్న పుస్తకంలో సిమ్లాలో నడకల అవకాశాల గురించి నాలుగయిదు పేజీలున్నాయని. పుస్తకం తిరగేశాను. సిమ్లా పరిసరాల్లో తిరిగిన దారిన తిరగకుండా కొండలూ అడవుల మధ్య కనీసం నలభై కిలోమీటర్లు తిరిగి రావచ్చని ఆ పుస్తకం చెప్పింది.


ఊపొచ్చింది. వాళ్ళకు సిమ్లా నగరమూ కుఫ్రీలోని మంచూ చూపిస్తూ చూపిస్తూనే వాళ్ళు సేదదీరుతున్న సమయాల్లోనూ ఇంకా మేలుకోని ఉదయం పూటల్లోనూ ఆ అవుట్‌లుక్ దారుల్లో పదీపదిహేను కిలోమీటర్లు తిరిగాను. కామ్నాదేవి పర్వతం, సమ్మర్‌హిల్ ప్రాంతం, గ్లెన్ మైదానం- నా కొత్త ఆవిష్కరణలు. సిమ్లా అంటే సరికొత్త గౌరవం పుట్టుకొచ్చింది. ‘మిగిలిన పాతిక కిలోమీటర్లూ ఎప్పుడు తిరుగుతావూ?’ అని మనసు నిలదీయడం మొదలెట్టింది. అదిగో, అప్పుడు గుర్తొచ్చింది- పాతికేళ్లనాటి పెద్దాయన రెండురోజుల ట్రెక్కు. వంద కాకపోయినా వెయ్యిరూపాయల ఖర్చులో వెళ్లిరావడం సాధ్యమేనా అన్న పరిశోధన మొదలెట్టాను. అది సులభసాధ్యమేనని తేలింది.

ఢిల్లీ నుంచి సిమ్లా నాలుగువందల కిలోమీటర్లు. హిమాలయ పర్వత పాదాలలో ఉన్న కాల్కా వరకూ బ్రాడ్‌గేజ్ రైళ్లున్నాయి. మళ్లా కాల్కా నుంచి తొంబై కిలోమీటర్ల దూరంలో ఉన్న సిమ్లా దాకా నారోగేజ్ బొమ్మరైలు ఉంది. ఢిల్లీలో రాత్రి తొమ్మిదింటికి రైలు పట్టుకొంటే ఉదయం అయిదింటికల్లా కాల్కా చేరుకోవచ్చు. వెంటనే బొమ్మరైలు ఎక్కి పదిలోపల సిమ్లా చేరవచ్చు. మళ్లా సాయంత్రం ఆరుగంటల వేళ రైలెక్కి కాల్కా చేరి, రాత్రి పదకొండు గంటల బ్రాడ్‌గేజ్ ఎక్కితే మూడోరోజు ఉదయానికల్లా ఢిల్లీ గూటికి చేరిపోవచ్చు. సిమ్లాలో గడిపే పగటిపూట ఏడెనిమిది గంటల్లో ఆ ఇరవై పాతిక కిలోమీటర్లు అవలీలగా నడిచెయ్యవచ్చు.

ఆలోచన స్పష్టమయింది. ఆచరణలోకి దిగాను. 2015 ఏప్రిల్ మూడోవారంలో ఒక బుధవారం పగటిపూట సిమ్లాలో ఉండేలా టికెట్లు తీశాను. నా వయసుకు ఇచ్చే కన్సెషన్‌ల పుణ్యమా అని వెయ్యిరూపాయల బడ్జెటులోనే ఏసీ టికెట్లు సర్దగలిగాను. అటూ ఇటూ అంతా కలిపి ఎనిమిదివందలు.

ఇంటర్నెట్‌నూ అవుట్‌లుక్ పుస్తకాన్నీ మథించి నేను తిరగబోయే నడకదారుల రూపురేఖలు మనసులో ఇంకించుకొన్నాను. ఏ క్షణంలో ఏ మార్గంలో ఏ ప్రదేశంలో నేను ఉండబోతున్నానో అన్నది కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఎక్కడ భోజనం చేస్తే పసందుగా ఉంటుందో కూడా అవుట్‌లుక్ పుస్తకమే చెప్పింది!

వెళ్లేముందు ఓ స్నేహితుడితో నా ప్రణాళిక చెపితే, “ఢిల్లీ టు సిమ్లా వెయ్యి రూపాయల్లోనా?! వెనకటికి ముంగేరీలాల్ అని ఒకడుండేవాడు…” అన్నాడు పెద్దగా నవ్వి. ‘నవ్విన నాపచేనే పండును’ అందామనిపించింది. కానీ గత యాబై ఏళ్లుగా ఆ నాపచేను అంటే ఏవిఁటో అర్థంగావటం లేదని గుర్తొచ్చి మిన్నకుండిపోయాను. ‘చేసి చూపిద్దాం’ అనిపించింది.

ఓ సుఖశుభోదయాన కాల్కాలో రైలు దిగాను.


మధుమేహం మందులు, టాయిలెట్ సామాన్లు, ఓ విండ్ చీటర్, మరో జత బట్టలు, తేలికపాటి తుండుగుడ్డ, నీళ్లకు భయపడని పాదరక్షలు- అంతా కలిసి మూడు నాలుగు కిలోలకు మించని బ్యాక్‌పాక్‌తో దిగాను. సిమ్లా రైలుకు మరోగంట వ్యవధి వుందిగాబట్టి రిటయిరింగు రూములో కాలకృత్యాలను ముగించుకొని, స్నానం కూడా చేసి శుభ్రంగా బయటపడ్డాను. దానికో ఏబై ఖర్చు.

సిమ్లా బొమ్మరైలు ప్రయాణం ఇండియాలోని అతి అందమైన రైలు ప్రయాణాల్లో ఒకటి. అన్ని ఋతువుల్లోనూ పచ్చదనం కోల్పోని మహాకాయపు కొండలు, అనువైన రుతువుల్లో రైలుమార్గానికి రెండువైపులా విరగబూసే కొండపూలు, అడవి గులాబీలు, దారిలో పలకరించే అనేకానేక గ్రామాలు పట్టణాలు, వంద సొరంగాలు, మరెన్నో వంతెనలు, చేరడానికి గంటా గంటన్నర ముందునుంచే కనిపించి రారమ్మని పిలచే సిమ్లా నగరం, దూరాన తళుక్కుమనే హిమ శిఖరాలు- మరో లోకం అది.

నేను ఎంచుకొన్న రైలు కూడా ప్రత్యేకమయినది- విలాసపు బాణీది. బ్రిటిషువాళ్ళ కాలంలో రూపకల్పన చేసినది. సౌకర్యవంతమైన సీట్లు, విశాలమైన కిటికీలు, పరిశుభ్రమైన టాయిలెట్లు, నవ్వుతూ పలకరించి, అల్పాహారాలు (టికెట్ ఖరీదులోనే కలిపి) అందించే సిబ్బంది, స్నేహంగా మసలే మరో డజనుమంది ప్రయాణీకులు.

కాల్కా దాటీదాటగానే పర్వాణూ అన్న చిన్న పారిశ్రామిక నగరం. అక్కణ్నించి హిమాచల్‌ప్రదేశ్ ఆరంభం… గంటన్నరకల్లా ధర్మపురి అన్న అసలు సిసలు కొండల మధ్యనున్న చిన్నపాటి పట్టణం. మరో అరగంటలో ఓ పొడవాటి సొరంగం దాటుకొని బొరోగ్ అన్న అతి ముచ్చటైన ఊరు… కాల్కాకూ సిమ్లాకూ మధ్య బిందువు ఆ వూరు. ఆ దారిన వెళుతున్న ప్రతిసారీ ఆ ఊళ్లో ఆగాలని, రెండుమూడు రోజులు గడపాలని, అక్కడి సౌందర్యంతో మమేకమవ్వాలని, ఆ ఊరి అమాయకత్వాన్ని కాస్తంత అందిపుచ్చుకోవాలని- బలంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా ఓ సారి ఆగితీరాలి!


రైల్లో ఓ కొత్తగా పెళ్లయిన లాయరు జంట. హనీమూన్ మూడ్‌లో ఉన్నా కలుపుగోలుగా మాట్లాడారు. మరో పాతికేళ్ల జర్మను అమ్మాయి. బ్యాక్‌ప్యాకూ గట్రా చూసి తనూ ట్రావెలరే అనుకొన్నాను. కాదట. బెర్లిన్ కేంద్రంగా వ్యాపారం నడుపుతోందట. ఇండియాలాంటి దేశాలనుంచి విలక్షణంగా ఉండే హస్తకళాసామగ్రి కొనుగోలు చేసి తన దేశం పంపి అక్కడ అమ్మడం తన వ్యాపార సరళి. వ్యాపారాన్నీ తన యాత్రా కాంక్షనూ కలగలిపి ఏడాదికి ఆరు నెలలు ఆసియా దేశాల్లో గడుపుతుందట.

పదింటికల్లా సిమ్లా చేరాం.

ఇంగ్లీషువాళ్లు భారతదేశంలో నెలకొల్పి అభివృద్ధి చేసిన అనేకానేక హిల్ రిసార్ట్స్‌లో సిమ్లా అతి ముఖ్యమైనది. వేసవి విడిదిగా మొదలైన సిమ్లా పట్నం ఆంగ్లేయుల వేసవికాలపు రాజధానిగా ఎదిగింది. ఎనబై ఏళ్లపాటు ఒక వెలుగు వెలిగింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ వెలుగు తగ్గినా ఇప్పటికీ సిమ్లా హిమాచలప్రదేశ్ రాజధాని నగరమే. సిమ్లా అనగానే నాకు 1945 నాటి విఫలమయిన లార్డ్ వేవెల్ సెల్ఫ్‌రూల్ కాన్ఫరెన్స్ (Lord Wavell Simla Conference), ఆ కాన్ఫరెన్సుకు లాగుడుబళ్లలో మన జాతీయ నాయకులు మాల్ రోడ్‌లో వెళుతోన్న ఫోటోలు; అలాగే 1972 నాటి ‘సిమ్లా అగ్రిమెంట్‘ సమావేశం, అదే మాల్ రోడ్‌లో టీనేజర్ బేనజీర్ భుట్టో ఫోటోలూ గుర్తొస్తాయి.

సిమ్లా స్టేషన్ నుంచి దారి అడుగుతూ అడుగుతూ కాసిన్ని మెట్లు ఎక్కి విధాన్‌సభ ప్రాంతం చేరాను. మాల్ రోడ్ దొరకబుచ్చుకున్నాను.


ఇంగ్లీషువాళ్లు ఎప్పుడో వెళ్లిపోయినా వారివారి భవనాల పుణ్యమా అని ఆంగ్ల వాతావరణం సిమ్లాలో పదిలంగా ఉంది. అప్పటి కాలానికి చెందిన విధాన్‌సౌధ, ఏజీ ఆఫీసు భవనం, సిసిల్ ఒబెరాయ్ హోటలు భవంతి… మరికాస్త ముందుకెళితే కాళీబారీ మందిర పరిసరాలు, జీపీవో, రివోలి, గెయిటీ, గుఫా రెస్టారెంటు, గాంధీ బొమ్మ, క్రీస్తు చర్చి… నగరపు కేంద్రబిందువుగా సువిశాల ప్రాంగణం, బ్యాండ్‌స్టాండ్… పైన జాకూ (Jakhu) పర్వతం మీద నిడుపాటి ఆంజనేయ విగ్రహం… చిక్కని పచ్చదనం.

గంట పదకొండు కొట్టింది. అవుట్‌లుక్ పుస్తకం మరోసారి చూశాను.

నేను వెళదామనుకొన్న కాలిదారి స్థూలంగా ఈ జాకూ పర్వతం చుట్టూ ఓ ప్రదక్షిణ మార్గం. గాంధీ బొమ్మ ఉన్న రిడ్జ్ ప్రాంతం నుంచి సిమ్లా శివారు గ్రామపు సంజోలి చౌక్ వరకూ సాగి, అక్కడ ‘వెనక్కి’ మళ్లి, ఫారెస్ట్ హిల్ రోడ్‌ను పట్టుకొని తిరిగి గాంధీ బొమ్మ దగ్గరకు చేరుతుంది. అంతా కలిసి పన్నెండు కిలోమీటర్లు. అది ముగిశాక సమయం ఉంటే మరో ఐదారు కిలోమీటర్ల రెండో కాలిదారిలో నడుద్దామన్నది నా ప్లాను… సాయంత్రం బండి పట్టుకోడానికి ఇంకా ఆరేడు గంటల సమయం ఉంది.

సంజోలి రోడ్డు పట్టుకొని బయల్దేరాను.

ముందుగా లక్కడ్ బజార్.


గాంధీ బొమ్మకు ఎదురుగా కాస్తంత ఎడమగా ఉన్న రోడ్డు విలాసపు రోడ్లకూ రెస్టారెంట్లకూ నిలయమయితే ఈ లక్కడ్ బజారు మధ్యతరగతి మందహాసాలకు కేంద్రబిందువు. ఓ కిలోమీటరు పొడవున చిన్నచిన్న, రకరకాల గిఫ్ట్ షాపులు… ధాబాలు… ఓ ధాబా ముందు అధిక జనసందోహం… అనుమానం వచ్చి అవుట్‌లుక్‌లోకి తొంగిచూశాను. ‘డోంట్ మిస్ ఇట్’ అని వాళ్లు సిఫార్సు చేసిన ‘సీతారాం ఛోలే బటూరె’ దుకాణం ఇదే!

లంచ్ అవర్‌ని ఓ గంట ముందుకు జరిపి జై సీతారాం అంటూ లోపలికి వెళ్లాను. నిజమే. వంటకం చాలా బావుంది. అసలక్కడ దొరికేది ఒకే ఒక్క వంటకం- ఛోలే బటూరె. ఇపుడు దాన్ని నడుపుతోన్నది నాలుగోతరం వాళ్లట! ‘ఇదిగో బాబూ! ఇలా మీగురించి దీంట్లో రాశారు. వెదుక్కుంటూ వచ్చాను,’ అని మాట కలిపాను. స్పందించారు. ‘దీని బ్రాంచీలు ఈ ఊళ్లోనూ, బయట ఊళ్లలోనూ పెట్టమని ప్రోత్సాహమూ ఒత్తిడీ వస్తుంటాయి. మేం లొంగటంలేదు. మా అవసరాలకు ఇది ఒక్కటి చాలు.’ అన్నారు వాళ్లు. ఆశలకూ అవసరాలకూ మధ్య సమతౌల్యం సాధించిన మనుషులన్నమాట!


మరో అర కిలోమీటరు సాగగానే షాపుల సందడి ముగిసింది. నగరపు సామాన్య జనజీవితం కంటికి కనిపించసాగింది. బుధవారం కాబట్టి స్కూళ్లు, ఆఫీసులు, విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, పచారీ కొట్లు- ‘టూరిస్టు స్వర్గం’ అన్న ముసుగులు తొలగించుకొని కనిపించిన మేకప్పు లేని సిమ్లా నగరం సహజంగానే సంతోషం కలిగించింది. పలకరిస్తే పలికి, నిలచి మాట్లాడే మనుషులు- నగరపు పునాది అందుతోందనిపించింది. అలా నడుస్తూ ఉండగానే ఏదో మంత్రం వేసినట్టుగా జనసందోహం అదృశ్యమయిపోయి అడవులు నిండిన కొండదారి కళ్లముందు పరచుకొని కనిపించింది. ఇహనేం- ఆ అడవిదారి వశమయిపోయాను.

మనిషి జాడ లేకపోయినా నిడుపాటి చెట్లమీద కోతుల సందడి. పక్షుల కోలాహలం. ఆకుల మధ్యనుంచి దూరాన తళతళలాడుతోన్న న్యూ సిమ్లా భవనాలు. వస్తా వస్తానంటోన్న వాన. ‘వస్తే రా! భయపడను…’ అంటోన్న మనసు. అలా అరగంట.

మళ్ళా నాగరికత ఛాయలు. ఏదో భవన సందోహం. ‘ఇందిరాగాంధీ వైద్య కళాశాల’ అని సైన్‌బోర్డులు చెపుతున్నాయి. పక్కనే ఆ కాలేజ్ మగపిల్లల హాస్టలు. అడపాదడపా అక్కడో మనిషి, ఇక్కడో మనిషి. చీలిన దారి…

వాకబు చేశాను. తిన్నగా వెళితే సంజోలి గ్రామమట. కుడివేపుకు వెళ్లేది ఫారెస్ట్ హిల్ రోడ్డు. అప్పుడే మనుషులూ గ్రామాల పక్కకు వెళ్ళాలనిపించలేదు. ఆ బాట చివరలో ఉన్న షాపులో ఒక టీ తాగి మళ్లీ ఫారెస్ట్ హిల్ రోడ్డునే అనుసరించాను.

చినుకులు మొదలయ్యాయి. ఆ సహజ వాతావరణంలో ఆ చిరువాన కంగారు పెట్టడం సంగతి అటుంచి, ఆ క్షణాల మార్మికతకు మెరుగులు దిద్దుతున్నట్లు అనిపించింది. మైమరపు. ట్రాన్స్ లాంటి సుఖావస్థలో మరో అరగంట.

‘జాకూ పర్వతం ఇటు’ అంటూ బోర్డు కనిపించింది. వాచ్ చూశాను. రెండున్నర. పుష్కలంగా టైముంది. కొండపైకి సాగాను.


సిమ్లా పరిసరాల్లోని అత్యున్నత శిఖరం ఈ జాకూ పర్వతం. సముద్ర తలం నుంచి ఎనిమిదివేల ఐదువందల అడుగులు. కొండపైన హనుమంతుడి గుడి. దారిదారంతా వానరసేన కోలాహలమే కాదు, తుంటరితనం. బ్యాక్‌పాక్ జిప్పులన్నీ సరిచూసుకొని ముందుకు సాగాను.

అరగంట. ఈ కొండమీదకు వచ్చి పాతికేళ్ళయిపోయింది. రూపురేఖలు బాగా మారాయి. అప్పటి అమాయకపు వాతావరణం స్థానంలో కార్పొరేట్ గడుసుతనం, కాంక్రీట్ గుబాళింపులు. వంద అడుగుల ఎత్తువున్న అందమైన ఆంజనేయ విగ్రహం. అల్లు అర్జున్ స్థాయిలో అమ్మాయిలను అల్లరి పెడుతోన్న కోతులు. వాటిది తుంటరితనమేననేది తెలుసుగాబట్టి అనుపమ్‌ఖేర్ బాణీలో వెళ్లి వాటిని అదిలించి ఆ అమ్మాయిని ‘కాపాడటం’…

కురుస్తా కురుస్తానంటోన్న వాన కురవడం మొదలెట్టింది. చిరుచలి. బ్యాక్‌పాక్‌లోని బట్టలన్నీ ఒకటికి రెండు పాలిథిన్‌లలో భద్రంచేసి వానను జయించిన వాడిలాగా ముందుకే సాగాను. వర్షాలంటే సంకోచమే ఉంటే ఇలాంటి నడకల ప్రసక్తే పెట్టుకోంగదా!


కొండదిగి గాంధీ బొమ్మవేపు వెళుతోంటే మళ్లా మరోసారి సిమ్లా నగరపు దైనందిన రూపం కళ్లకు కట్టసాగింది. లక్కడ్ బజార్ తర్వాత ప్రాంతంలో కనిపించింది ఆఫీసులు స్కూళ్ల వాతావరణం అయితే ఈసారి సన్నపాటి సందులు, చిన్నపాటి ఇళ్లు. దిగువ మధ్యతరగతి ప్రాణులు. పిల్లల్ని రోడ్లమీదే ఆడిస్తోన్న తల్లులు. వీథి మలుపుల్లో కిరాణా దుకాణాలు. నా పలకరింపులు. ఆ దుకాణందారులే కాకుండా పిల్లలూ వారివారి తల్లులూ మాట కలపటం. మనుషులు మనుషులే అన్నంత సరళంగా సహజంగా కబుర్ల జడివాన. నగరపు నాడినేగాదు, హృదయపు చేతనను కూడా అందుకోగలుగుతున్నానన్న పులకరింత…

గాంధీ బొమ్మ చేరాక ఆ మాల్ రోడ్డూ బ్రిటిష్ భవనాలూ ధనస్వామ్య వాతావరణం- కంటికీ మనసుకీ ఆనడం మానేశాయి. మళ్లా బొమ్మరైలు కదిలి సిమ్లా నగరపు వాసనలు దాటుకొని పైన్ వృక్షాల మధ్యకు చేరితేగానీ మనసు సేద తీరలేదు.

మర్నాడు ఇంటికి చేరి లెక్క చూసుకొన్నాను. అంతా కలిసి తొమ్మిదివందల ఎనబైఆరు రూపాయల్లో ముగిసిపోయింది!

అమెరికాకు 2015 మే నెలలో మొదటిసారి వచ్చాను. అయిదు నెలలు గడిపాను. పదీపదిహేను రాష్ట్రాలూ, అన్నే నగరాలూ తిరిగాను. మరో పది రాష్ట్రాల్లో బస్సులూ రైళ్లలో ప్రయాణాలు చేశాను.

కానీ నేను ఉన్న అట్లాంటాకు ఆరే ఆరు గంటల దూరాన ఉన్న ఫ్లారిడా రాష్ట్రంలోకి అడుగు పెట్టలేదు- అదో లోటు.

మళ్లా 2016లో డాలస్ రావడం జరిగింది. అట్లాంటా సరేసరి. చికాగో, డెట్రాయిట్, పిట్స్‌బర్గ్, కొలంబస్, న్యూయార్క్ వెళ్లడం జరుగుతోంది గానీ పక్కనే ఉన్న ఫ్లారిడా కుదరటం లేదు!

‘కుదరడమేమిటీ- కుదిరించుకోవాలి’ అనిపించింది.

నెట్టు మీద పడ్డాను.

కీ వెస్ట్- ఎనిమిది వందల మైళ్లు. దూరం దూరం.

మయామీ- ఆరువందలు. అదీ దూరమే!


ఆరుగంటల ప్రయాణంలో జాక్సన్‌విల్ కనిపించింది. పరిశీలించాను. నది ఉంది, సముద్రం ఉంది. రెండొందలేళ్ల చరిత్ర ఉంది. ఎనిమిది లక్షల జనాభా ఉంది. చలో జాక్సన్‌విల్ అనుకున్నాను.

మెగా బస్ సైట్‌లో టికెట్ల కోసం చూశాను. మరో వారం రోజుల్లో- పదిహేను పదిహేను డాలర్లకు కనిపించాయి.

సిమ్లా గుర్తొచ్చింది. అప్పటిదాకా సభల్లో ‘యాత్రలకూ ధనానికీ సంబంధం లేదు…’ అంటూ చేసిన ఉపదేశాలు గుర్తొచ్చాయి.

‘ఏభై అరవై డాలర్లకు మించకుండా వెళ్లి రావచ్చా?’ అనిపించింది. లెక్కలు వేశాను. సులభసాధ్యం అని తేలింది. బస్ వివరాలు చూశాను. అర్ధరాత్రి పన్నెండింటికి అట్లాంటాలో బయల్దేరి బస్ ఉదయం ఆరున్నరకల్లా జాక్సన్‌విల్‌లో దింపుతుంది. మళ్ళా అక్కడ మధ్యాహ్నం రెండింటి బస్సెక్కి సాయంత్రం ఎనిమిదిన్నరకు అట్లాంటా చేరడం ఒక పద్ధతి. రాత్రిదాకా జాక్సన్‌విల్‌లోనే గడిపి తెల్లారేసరికి అట్లాంటా రావడం ఇంకో పద్ధతి. నేను తిరుగు ప్రయాణానికి పగటి బస్సునే ఎంచుకున్నాను. ఆ ఊళ్ళో ఎనిమిది గంటలూ గడపచ్చు. తిరుగు ప్రయాణంలో దారంతా చూసుకుంటూనూ రావచ్చు.


నెట్ పరిశీలన కొనసాగించాను. అక్కడి నది, సముద్రం, డౌన్ టౌన్, ప్రముఖ ప్రాంతాలు, పురాతన భవనాలు, నగరపు లాండ్‌మార్కులు- మెల్లిగా మనసుకు పట్టసాగాయి. డౌన్‌టౌన్ అంతా కాలినడకన తిరిగిచూడటం- నార్త్ బ్యాంక్ హిస్టారిక్ వాక్, సౌత్ బ్యాంక్ హిస్టారిక్ వాక్, అంటూ మనమే తిరిగేయగల టూర్‌ల వివరాలు సచిత్రంగా, విపులమైన మ్యాపుల సహితంగా కనిపించాయి. ఈ నార్త్, సౌత్ బ్యాంకులు అక్కడ ఉన్న నదికి గట్టులు.

రొట్టె విరిగి తేనెలో పడటమంటే ఇదే కదా!

మనసాగక సముద్రంకేసీ మ్యాపులో వెదికాను. డౌన్‌టౌన్‌కు పాతిక మైళ్ళు. బస్సులూ లోకల్ రైళ్లూ ఉన్నా, వెళ్లిరావడానికి కనీసం నాలుగు గంటలని తేలింది. డౌన్‌టౌనూ సముద్రమూ- రెండూ చూడటం పడదని అనిపించింది. సముద్రాన్ని వదిలిపెట్టి నదికటూ యిటూ ఉన్న డౌన్‌టౌన్‌నే క్షుణ్ణంగా చూసి రావాలని నిర్ణయం.

నిర్ణయమయితే తీసుకొన్నాగానీ ‘అట్లాంటాలో అర్ధరాత్రి మెగాబస్సు కోసం రోడ్డు మీద వేచి ఉండటం’ అంటే మాత్రం గుండె పీచుపీచుమంటూనే ఉంది!

ఆ 2016 జూన్ చివరివారపు మంగళవారం రాత్రి మా ఇంటిదగ్గరి డన్ఉడీ స్టేషన్‌లో లోకల్ రైలు ఎక్కి- ఓ రైలు మారి- అరగంటలో మెగాబస్సు బయల్దేరే సివిక్‌సెంటర్ స్టేషను దగ్గర దిగాను. ఎందుకయినా మంచిదని గంటన్నర ముందే బస్టాపు చేరుకొన్నాను.

భయపడ్డట్టు నిర్జనంగా లేదా ప్రదేశం. అట్లాంటా నుంచి వాషింగ్‌టన్, డాలస్, లూయీవిల్ లాంటి దూరపు ఊళ్లకు వెళ్లే బస్సులన్నీ బయల్దేరే సమయమది. డజన్లకొద్దీ ప్రయాణీకులు. విద్యుద్దీపాల ధగధగలు. దూరాన కనిపించీ కనిపించకుండా పోలీసు కారు. హమ్మయ్య! అనిపించింది.

మనుషులకేసి దృష్టి సారించాను. అమెరికా దేశపు దిగువ మధ్యతరగతి మూర్తీభవించినట్టు అనిపించింది. ఎక్కువగా ఆఫ్రికన్ అమెరికన్లు. ఆ తర్వాత హిస్పానిక్సు. అరుదుగా తెల్ల జాతీయులు. కొందరు విద్యార్థులు. ఒకరిద్దరు ఉపఖండపు ఆసియన్లు…

బిబ్లికల్ మోజెస్‌లా వున్న ఓ ఆరడుగుల ఆఫ్రికన్ పెద్దాయనతో మాట కలిసింది. పరిణతి నిండిన పలుకులాయనవి. “నలబై ఏళ్లు ఎన్నెన్నో పనులు చేశాను. ఇపుడు నాకు అయిదుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవలూ మనవరాళ్లూ- దేశమంతా వ్యాపించి ఉన్నారు. మనవలూ మనవరాళ్లూ కూడా పెద్దాళ్ళయి ఉద్యోగాలు చేసుకొంటున్నారు. మా ఆవిడ ఆరేళ్ల క్రితం పోయింది. అయినా ఎవరిమీదా ఆధారపడను. ఎప్పుడైనా వెళ్లి ఎవరిదగ్గరైనా నాల్రోజులు ఉండివస్తాను…” జీవనసారం ఎరిగిన మనిషి అనిపించింది. డెబ్బైఎనిమిదేళ్లట! కనీసం పదేళ్లు చిన్నాడిలా అనిపించాడు.

మా బస్సు ఎక్కడం కోసం క్యూలో నించుంటే నాముందే ఓ తెలుగు ఇంజినీరు కనిపించాడు. ఏదో బిల్డింగులు కట్టే కంపెనీలో సివిల్ ఇంజినీరట. గత ఆరునెల్లుగా జాక్సన్‌విల్ వారం వారం వెళ్లివస్తున్నాడట. ‘ప్రశాంతమైన ఊరు. నువు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు.’ అని ధైర్యం చెప్పాడు.

బుధవారం ఉదయం ఆరుంబావుకల్లా బస్సు జాక్సన్‌విల్‌లో దింపింది.

‘స్వాగతం… సుస్వాగతం!’ అన్నట్టుగా రంగులు నిండిన ఆకాశం పలకరించింది.

ఆ స్కైవే కన్వెన్షన్ సెంటర్ అన్నచోట అంతా కలిసి పదిమందిమే దిగాం… బస్సు ముందుకు కదిలి ఓర్లాండో గమ్యానికేసి సాగింది.


ఇంకా దీపాలు ఆరనేలేదు కానీ ఆకాశంలో రంగుల హరివిల్లు విచ్చుకోవడం మొదలయిపోయింది. ఆ ఒక్క కన్వెన్షన్ సెంటరు భవనం తప్పించి మరే ఇతర భవనమూ దరిదాపుల్లో లేదు. ఊళ్లో నేను మొట్టమొదటగా చేరుకొందామనుకొన్న జాక్సన్‌విల్ లాండింగ్ అన్న ప్రదేశం బస్‌స్టాప్ నుంచి మైలు దూరమని గూగుల్ మ్యాప్ చెప్పింది. రాసుకున్న ఆ వివరాల ఆధారంతో- పామ్ చెట్ల మీదుగా విచ్చుకుంటున్న వెలుగురేఖలను చూస్తూ- అటు అడుగు వేశాను.

ఎంత జాగ్రత్తగా గూగుల్ నోట్స్ రాసుకొన్నా ఎక్కడో దారి తప్పాను. అరగంట గడిచినా నేననుకొన్న ప్రదేశపు ఛాయలు కనిపించలేదు. అడుగుదామంటే మనుషులూ లేరు. జోస్ కిచెన్ అన్న పెద్ద రెస్టారెంటు- ఇంకా నిద్ర లేవలేదు. మరికొంచం ముందుకెళ్లాక యూనిటీ ప్లాజా అన్న ప్రదేశం. వీథి పేరు చూస్తే రివర్‌సైడ్‌స్ట్రీటని తేలింది; పక్కనే నది ఉన్న సంకేతాలు.

ఒకరిద్దరు జాగింగ్ చేస్తూ కనిపించారు. పలకరిస్తే పలికి తీరుతుందని ఎందుకో అనిపించి సన్నగా రివటలా ఉన్న ఓ అరవై ఏళ్ల యువతిని ఆపాను. ‘లాండింగ్ దాటి అరమైలు వచ్చేశావు. ఓ పనిచెయ్యి. ఆ ఎడమవేపు సందు పట్టుకో. రెండు నిమిషాల్లో నది ఒడ్డుకు చేరతావు. మళ్లా ఎడమవైపుకు తిరిగి నది ఒడ్డునే నడిస్తే పావుగంటలో జాక్సన్‌విల్ లాండింగ్!’ అని వివరించారావిడ.


నది కనిపించింది. విశాలంగా, మనోహరంగా… అటూయిటూ రెండు వంతెనలతో… అర కిలోమీటరు వెడల్పుతో… సెయింట్ జాన్స్ రివర్ దానిపేరు. మన్‌హాటన్‌లోని హడ్సన్ రివర్‌లా అనిపించింది. 1520లో ఆ నదిని ‘కనుగొన్నారట!’ 276 మైళ్ల పొడవట. మరో ఇరవై మైళ్లు సాగి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుందట. గణాంక వివరాల సంగతి ఎలా వున్నా ఆ మనోహర ఉదయపు వేళ నింపాదిగా ప్రవహిస్తోన్న ఆ నదితో ‘తొలిచూపు ప్రేమలో’ పడిపోయాను. మరో ఐదారు గంటలు మా ప్రేమాయణం కొనసాగింది.

ఆ నది ఒడ్డు నడకదారిలో నడకరాయుళ్ల కోలాహలం మొదలయిపోయింది. ఓ పది నిమిషాల్లో రెస్ట్ రూమ్ కాంప్లెక్స్‌… కాలకృత్యాలు తీరాయి.

మరో పది నిమిషాలు నడవగా జాక్సన్‌విల్ లాండింగ్ కనిపించింది. మళ్లా ఆ అరవై ఏళ్ల యువతి ప్రత్యక్షమయింది. నాకన్నా ఎక్కువగా సంబరపడిపోతూ అతి పాత చుట్టంలా పలకరించి, నా ప్రయాణపు వివరాలు అడిగి తెలుసుకొని, ఓ హగ్ ఇచ్చి, శుభాకాంక్షలతో వీడ్కోలు పలికింది!


ఏడుంబావుకి లాండింగ్ చేరాను. ఆ దరిదాపుల్లోనే ఆండ్రూ జాక్సన్ శిలావిగ్రహం అశ్వసహితంగా కనిపించింది. 1812 నాటి యోధుడు! (బ్రిటిష్ వారితో యుద్ధం.) మిలిటరీ జనరల్‌గానూ, ఫ్లారిడా గవర్నర్‌గానూ, అమెరికా ఏడవ అధ్యక్షునిగానూ, డెమొక్రటిక్ పార్టీ వ్యవస్థాపకుడుగానూ ఘనకీర్తి పొందిన మనిషే గాని; తాను ప్రసిడెంటుగా ఉండగా స్థానిక చెరోకీ తెగలను సుదూర ప్రాంతాలకు తరలించే ఉత్తర్వులను జారీ చేసి, వారిని కన్నీటి బాటలో- ట్రెయిల్ ఆఫ్ టియర్స్- నడిపించి, ఐదారువేలమంది ప్రాణాలు పోగొట్టడానికి కారకుడిగా అపకీర్తి గడించినవాడు.

ఏదేమైనా ఆయన గౌరవార్థం 1822లో పునాది పడిన ఈ నగరానికి ఆయన పేరు పెట్టారు. 1860ల నాటి అమెరికా అంతర్యుద్ధంలో ఇది ఒక ప్రధాన యుద్ధ వేదిక. అనేకమార్లు యూనియన్ సైన్యాలు, కాన్ఫెడరేట్ దళాల మధ్య చేతులు మారిందట. 1901 నాటి ఘోర అగ్నిప్రమాదంలో డౌన్‌టౌన్ అంతా కాలిపోయిందట. ఆ భస్మాలలోంచే ఇపుడు కనిపించే విలక్షణ భవన సముదాయం రెక్కలు విప్పుకొందట!

జాక్సన్‌విల్ లాండింగ్‌ను పరకాయించాను.

ముప్పై ఏళ్ల క్రితం కట్టిన ఆ రెండంతస్తుల భవన సముదాయంలో ఇరవై రెస్టారెంట్లు, షాపులు, గోడల మీద చిత్ర సంపద, దిగువున పడవల రేవు- దానిని ఒక వాణిజ్య సముదాయం అనేయడం అన్యాయం. నగరపు అసలు సిసలు నడిబొడ్డు అనటమే న్యాయం.


మెల్లగా నా అజెండాలోని మొదటి అంశం- నార్త్ బ్యాంక్ హిస్టారిక్ టూర్ మ్యాపు విప్పాను. అందులో రాసివున్న వీధుల్నీ భవనాలనూ ఒకటొకటిగా గుర్తుపడుతూ తాపీగా సాగిపోయాను. అట్లాంటిక్ ప్లేస్, డ్యాలప్ చర్చి, హోమ్స్ బ్లాక్, బేవాటర్ స్క్వేర్, ప్లాజా హోటల్, ఫ్లారిడా థియేటర్, మొరాకో టెంపుల్, ఇమాక్యులేట్ కాన్సెప్షన్ కేథలిక్ చర్చ్, ఓ గోడ పొడవునా బుద్ధుడి బొమ్మలు, అమెరికన్ హెరిటేజ్ లైఫ్ బిల్డింగ్, ఓటిస్ బ్లాక్- ఒక్కో వీధి ఒక్కో రీతి, ఒక్కో భవనం ఒక్కో శైలి. 1901 నాటి అగ్నిప్రమాదం డౌన్‌టౌన్‌కు వాస్తు విలక్షణతను సంతరించిందన్నమాట!

ఫస్ట్ సిటీ సర్వే సైట్ అంటూ ఓ ప్రదేశం. 1822లో నగరానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశమట. అక్కడో మార్కర్ వుంది. గౌరవంగా చూశాను. నడకదారిలో హెమింగ్ పార్క్ తటస్థించింది. ఆకర్షించింది. వివరాలు చదివాను. నగరపు తొట్టతొలి ఉద్యానవనమట! ఒకటిన్నర ఎకరమే అయినా స్థానికులనూ పర్యాటకులనూ ఆకర్షించే రీతిలో ఉంది. చెట్ల నీడలు… కాఫీ వ్యానులు… కులాసా కబుర్ల పిన్నాపెద్దా… చెస్ బోర్డ్ సర్ది ప్రత్యర్థి కోసం ఎదురుచూస్తోన్న ఓ పెద్దాయన… సైకిలు తొక్కబోతున్న నాలుగేళ్ల తెల్ల పాపకు హెల్మెట్ అమరుస్తోన్న ఆఫ్రికన్ యువకుడు. ‘ఇక్కడే కెనెడీ ప్రసంగించాడు’ అన్న ఫలకం…


సివిల్ వార్‌కు సంబంధించిన ‘కాన్ఫెడరేట్ మాన్యుమెంట్’ పార్కులో ఉందని బయట వివరాలు చెప్పాయి. లోపల గబుక్కున కనిపించకపోతే ఓ కాఫీ వ్యాను యువకుడ్ని అడిగాను. ‘మాన్యుమెంటా? అవును… ఉన్నట్టు విన్నట్టు గుర్తు…’ అంటూ నసిగాడు. ‘సర్లే, నేనే కనిపెట్టి మళ్లీ వచ్చి దాని ఉనికి నీకు చెపుతాన్లే…’ అంటూ ముందుకు సాగాను. పక్కనే కనిపించింది. అరవై అడుగుల ఎత్తున, ఓ ఫౌంటైన్ మధ్యన నిలబడిన స్థంభం చిట్టచివర అమరసైనికుని ప్రతీకాత్మక విగ్రహం! తిరిగివెళ్లి కాఫీ యువకునికి వివరం చెప్పాను. సిగ్గుమొహం పెట్టాడు. ‘ఆ సంగతికేంగానీ మావాడి కాఫీ ఈ వూరు మొత్తానికే ఉత్తమం!’ అని మాట కలిపాడు పక్కన ఉన్న అతని ఆఫ్రో మిత్రుడు. కాఫీ తీసుకొన్నాం. ముగ్గురం కబుర్లలో పడ్డాం. చిరకాల మిత్రుల్లాగా గలగలా కబుర్లు. చెణుకులు. మనసు నిండా సంతోషం.

పార్కు పక్కనే స్కైవే రైలు కనిపించింది. ఓ చూపు చూద్దామని వెళ్లాను. డౌన్‌టౌనంతా ఉపరితల మార్గాల్లో చుట్టిపెడుతోందన్న వివరం చూసి సంబరపడ్డాను. టికెట్ కౌంటర్ కోసం చూస్తే కనపడలేదు. వాకబు చెయ్యగా అది టికెట్ లేని సర్వీసని తెలిసింది.

డ్రైవరు లేని ఆకాశమార్గపు బళ్లవి. భవనాల పైకప్పుల్ని పలకరిస్తూ వెళ్లే మార్గమది. అంతా కలిసి ఎనిమిది స్టేషన్లు. ఉత్తరపు కొసన రోజాపార్క్ స్టేషను. పడమటి కొసన నేను బస్సు దిగిన స్కైవే కన్వెన్షన్ సెంటరు స్టేషను. దక్షిణాన నదిని దాటుకొని కింగ్స్ ఎవెన్యూతో ముగిసే రైలు మార్గం. వారేవ్వా! నాకసలే ఇలాంటి రైలు మార్గాలంటే వ్యామోహం. ఒకటికి రెండుసార్లు ఆ మార్గాల్లో ప్రయాణించాను. గంట పట్టేసింది. పదిన్నర దాటింది.


అప్పటికి ఒకటిరెండు కాఫీలయితే తాగాను కాని మరి తిండి సంగతేమిటి?!

నాదగ్గర ఆపద్ధర్మం కోసం తెచ్చుకొన్న వంటకాలున్నాయి. వాటి అవసరం లేకుండానే రైలు దిగిన వెంటనే పిజ్జా రెస్టారెంటు కనిపించింది. అది ఫాస్ట్ ఫుడ్ జాయింట్ కాకపోవడం గమనించి, ‘బావుంది. తీరిగ్గా ఒకటికి రెండు పిజ్జా ముక్కలు తిందాం…’ అని వెళ్లాను.

మరీ పదిన్నరే కాబట్టి ఎక్కువమంది లేరు. కౌంటర్లో ఓ భారతీయ మనిషి. వివరాలడిగాను. నిజమే. ఇక్కడే పుట్టి పెరిగినా మూలాలు మద్రాసువట. నా ఆర్డరు పుచ్చుకోడమేగాకుండా తానే పిజ్జా తెచ్చి అందించి దానితోపాటు కాసిన్ని కబుర్లు, కొంచం శ్రద్ధ, ఎంతో ఆప్యాయత పంచిపెట్టాడు. తియ్యని జ్ఞాపకం!

ఆనాటి అజెండాలో రెండో ముఖ్య అంశం-సౌత్ బ్యాంక్ హిస్టారిక్ టూర్.

సెయింట్ జాన్స్ నది నగరం నడిమధ్యగా ప్రవహిస్తోంది. ఊరి దక్షిణ భాగాలనూ ఉత్తర భాగాలనూ కలుపుతూ ఉన్న వంతెనలలో ముఖ్యమైనది- డౌన్‌టౌన్‌లో లాండింగ్‌ను ఆనుకొని వున్న మెయిన్ స్ట్రీట్ బ్రిడ్జ్. మనసు శ్రుతి అయి ఉండటం వల్లనే కాబోలు ఆ వంతెన, దిగువున నీలాల నది, హంసల్లాంటి పడవలు, నది దాటడానికి అతి చక్కని కాలిబాట, అటూయిటూ కనిపించే మనోహర ఆకాశ హర్మ్యాలు… సంతోషమే సంతోషం!

వంతెన దాటీదాటగానే ఫ్రెండ్‌షిప్ ఫౌంటైన్ అంటూ ఓ బృహత్తరమైన ఎగసిపడే జలధార, దానిచుట్టూ చిరుకొలను. ఆ పరిసరాల్లోనే 1520లో నదిని కనుగొన్న సంఘటనకు ప్రతీకగా ఓ హిస్టారిక్ మార్కర్. నదీ ప్రవాహాన్ని ప్రతిబింబించే ఓ కుడ్యచిత్రం! అరగంట గడిచినా తీరని తనివి.

పక్కనే విశాలమైన పచ్చని పార్కు. నిడుపాటి ఓక్ వృక్షం. నాలుగువందల సంవత్సరాలనాటిదట! పరిసరాలు ఎంత మారినా ఆ వృక్షాన్ని అలానే ఉంచేశారు, చరిత్రకు సాక్షిగా. పగటిపూట ఇద్దరు చిన్న పిల్లలతో పిక్నిక్‌కు వచ్చిన ఓ వనిత. ఆమెను అడిగి ఫోటోలు దిగటం… ఓక్ వృక్షం క్రింద- ఎదురుగా ఉన్న నదిని చూస్తూ… ఓ అరగంట.

పన్నెండున్నర దాటింది. నిండిన మనసుతో మెల్లగా మెగాబస్సు వేపు.


తిరుగు ప్రయాణంలో ‘రహదారి పరిశీలన’ అనుకొన్నాగానీ అందుకు అవకాశం దొరకలేదు. పక్క సీట్లో ఓ ఏభై ఏళ్ల ఆఫ్రో వనిత. చర్చిలో బోధకురాలట. కానీ అన్ని విషయాలలోనూ చక్కని పరిజ్ఞానం. పరిణత అభిప్రాయాలు. ఇంకేం, కబుర్లు బాగా సాగాయి. విశ్వమూ అంతరిక్షమూ ప్రపంచమూ దగ్గర్నుంచి; పక్కనుండే మనుషులూ కుటుంబ సభ్యులూ సంబంధబాంధవ్యాలూ వ్యక్తిగత ఇష్టానిష్టాలూ నమ్మకాలూ రాగద్వేషాల వరకూ- ఎన్నెన్ని విషయాలో! నేను దేవుడిని నమ్మనని విని పాపం ఎంతో కలవరపడిపోయిందావిడ.

మాటల్లో ఎపుడు అట్లాంటా చేరామో ఇద్దరమూ గమనించనేలేదు.

ఇంటికి చేరాక లెక్క చూశాను. ఏభైఏడు డాలర్లు.

నిజమే. దేశమయినా విదేశమయినా యాత్రకూ డబ్బుకూ సంబంధం లేదు.

రక్షణా భద్రతా సమస్యలే కావు.

ఎక్కడి మనుషుల్లో అయినా కనిపించేది మన ప్రతిబింబమే!
----------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

Anonymous said...

"ఓ అరవై ఏళ్ల యువతిని ఆపాను" - in youth at 60! wow.
"ఎక్కడి మనుషుల్లో అయినా కనిపించేది మన ప్రతిబింబమే!" - it is true.