Wednesday, June 19, 2019

తెలుగు కవిత్వంలో దళితవాదం


తెలుగు కవిత్వంలో దళితవాదం




సాహితీమిత్రులారా!

సాహిత్యంలో ఏవాదమైనా ప్రారంభమైనప్పుడు, ఆ వాదానికి మూలాలు ఎంతోకాలంగా పరిణమిస్తూ వ్తౖసె. అందుకు కారణం, అన్ని వాదాలకూ పునాదిగా సామాజిక సందర్భాలుండడమే. ఒక సామాజికసందర్భానికి సంబంధించిన పరిణామమే, ఒక వాదంలోని పరిణామానికి నేపథ్యంగా ఉంటుంది. ఇలా గమనించినప్పుడు, 1990ల నుండి తెలుగుకవిత్వంలో ప్రారంభమై, 1995ల నుండి లోతునూ, విస్తృతినీ, సాధించిన దళితవాదానికి సంబంధిన అంశాల్ని, ఆధునిక కవిత్వ ప్రారంభకాలం నించీ గమనించవచ్చు. అయితే, 1990ల దాకా వచ్చిన కవిత్వాన్ని “దళితకవిత్వం” అని మాత్రమే అనగలం. 1990ల నించీ వస్తున్న కవిత్వాన్ని “దళితవాదకవిత్వం” అని పేర్కొనాలి. దళితకవిత్వంలో దళితస్పృహ అన్ని కోణాల్లోనూ కనిపించవచ్చు. కాని దళితవాదకవిత్వం, దళితులు తమకోసం తామే పోరాడి, సమాజంలో తమదైన స్థానాన్ని సాధించుకోవాలనే చైతన్యంలోంచి వచ్చింది. ఒక విధంగా అసమానమైన సామాజిక స్థితిని అలాగే ఉంచి, దళితులకి జరిగిన అన్యాయాల్ని గూర్చి మాత్రమే దళితకవిత్వం చెప్తే, సామాజిక సమానత కోసం జరిగే సంఘర్షణలోంచి దళితవాదం ఉద్భవించింది.

ఒక్కసారి పూర్వ నేపథ్యం వైపు దృష్టి సారిస్తే, ముందుగా దళితస్పృహని కవిత్వంలో చాటిన కవి గురజాడ. ఏ కవుల భావప్రకటనకైనా వారు జీవించిన కాలం, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు, భావాల పరిపక్వస్థితి లోని దశలు చాలా ముఖ్యం. అంతేగాని, సరిగ్గా ఈనాడు ప్రచలితంగా ఉన్న ధోరణుల్ని, పూర్వకవుల్ని విశ్లేషించడంలో, అన్వేషించరాదు. ఈదృష్టిలోనే గురజాడ చెప్పిన భావాల్ని గూడా గ్రహించవలసి ఉంది.
“మంచి అన్నది మాల అయితే
మాలనేనగుదున్‌”
ఇది గురజాడ ప్రసిద్ధమైన ఉద్ఘాటన. మంచి, చెడు అంటే కేవలం సౌజన్యం, దుర్మార్గం మాత్రమే కాదు. ఔన్నత్యం, అవరత్వం కూడా ఆమాటల వెనక ధ్వనిస్తుంది. “ఔన్నత్యం, అవరత్వం కులం వల్ల వచ్చేవి కావు; ఔన్నత్యానికి మాల అని పేరు పెడితే నన్ను మాల అనే పిలవండి” అని కవి అభిప్రాయం. అంటే కులం అనేది ఏవిధంగానూ, అవరత్వ, ఔన్నత్యాలకి కొలమానం కాదు అని భావం. గురజాడ భావాన్ని ఆయన కాలపరిమితుల్లోనే గ్రహించవలసి ఉంది.

1933లో రెండు గొప్ప దళితకవిత్వ సంపుటాలు వచ్చినై. ఒకటి మంగిపూడి వెంకటశర్మ రాసిన “నిరుద్ధభారతము”; రెండోది కుసుమ ధర్మన్న రాసిన “హరిజన శతకము”. మంగిపూడి వెంకటశర్మ, ధర్మన్న ఆ కాలపరిమితులలో గాంధీభావాల చేత ప్రభావితులే. గాంధీ, ఏవిధంగా, ఎందుకోసం అస్పృశ్యతను వ్యతిరేకించినా, ఆనాటికి కొంతైనా సంచలనం కలిగించిన అంశమే. మంగిపూడి వెంకటశర్మ, అస్పృశ్యులపై తనకు గల సానుభూతి, సహానుభూతుల వల్ల, ఉద్యమానుకూల లక్షణాల్ని తన కవితారూపానికీ, భాషకీ ఒదిగించగలిగాడు. అంతేగాక, గుండెను కదిలించే భావాల్ని విస్తృతమైన పరిధిలో చెప్పగలిగాడు.
“కాపురంబులు చేయగా చుట్టుగుడిసెలే
కాని లోగిళ్ళు లెక్కకును లేవు
చెలగికట్టంగ మాసిన చింపిగుడ్డలే
కాని వల్వలు కొంచెమైన లేవు
త్రావంగ నూకల జావయు, గంజియే
కాని అన్నమును శాకములు లేవు
సొగసుగా తాల్ప గాజులు, పూసపేరులే
కాని బంగరునగల్‌ లేనెలేవు

పంటపండింపగా నూరివారి చేలె
కాని సొంతంబు లెందును కానరావు
అకట! మా ఘోరదారిద్య్రమొకరికైన
జాలి పుట్టింపదాయెనా శ్రీలులార!

దేవుణ్ణీ, శాస్త్రాల్నీ, హిందూమతాన్నీ కవి విశ్వసించినా, ఆపరిధిలోనే తన కాలానికి అనుగుణంగా, అస్పృశ్యతకి వ్యతిరేకంగా, సంచలనాత్మకమైన కవిత్వాన్ని రాయగలిగాడు. దళితుల్ని మేల్కొలిపే ప్రయత్నం తీవ్రంగా చేశాడు.
“పంచములార! అంతరిత భవ్య గుణోత్కరులార! గర్భితో
దంచిత శక్తులార! అసమర్థులె మీరలు? గొర్రెమందలో?
వంచితమై చరించు నల వ్యాఘ్రకిశోరమురీతి పూర్తిగా
వంచితులైరి, ఆత్మబల వైఖరినెంచుడు, మేల్కొనుండికన్‌”

కుసుమ ధర్మన్న దళితుడు కావడం చేత, ఆయన కవిత్వంలో దళితజీవన వాస్తవికత, ఆవేదన, ప్రతిఘటన తీవ్రత ఇంకా స్పష్టంగా కనిప్తౖిసె.
“మాలవాడని యవమానంబు గావించి
పంచముండని పరువు పారద్రోలి
ఆదిమాంధ్రుడవని సోదిచెప్పిరి గాదె
ఆలకింపుమయ్య హరిజనుండ!”

దళితులు పాలేర్లుగా ఉండగా, రైతులు చేసే దోపిడి గురించి, దళితుల శ్రమను వారు ధనంగా మార్చుకోడం గురించి కుసుమ ధర్మన్న చెప్పిన పద్యాలు ఎంతో దళితస్పృహ కలిగి ఉన్నై. ఆర్థికపరమైన దోపిడిని ఇంత స్పష్టంగా చెప్పిన కవి అప్పుడు మరొకడు లేడు.
“కొల్చు నీకు పిచ్చ కుంచంబుతో తాను
కొల్చుకొనడె పెచ్చుకుంచమునను
దోచుకొనక నీకు దొర యెట్టులగు రైతు..”

“అక్కరైన కొంత అప్పిచ్చి తక్కువ
కూలికెపుడు పనులు గొనుచునుండు
పేదవగుట నిన్ను పీడింపడే రైతు..”

“తెల్లదొరల పైన కళ్ళెర్రగా జేసి
హక్కులడగ జూచు నాగ్రహమున
ప్రక్కనున్న నిన్ను త్రొక్కిపెట్టరె వీరు..”

దళితవేదన దళితస్వరం నుండి వచ్చినపుడే రగిలే వాస్తవికత రూపుదిద్దుకుంటున్న విషయానికి కుసుమ ధర్మన్న మొదటి ఉదాహరణ.

ఇంకా జాలా రంగస్వామి మొదలైన కొందరు దళితస్పృహను విస్తృత పరచగా, మహాకవి జాషువాతో దళితకవిత్వంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. జాషువా, కులం కారణంగా, పేదరికం కారణంగా, తన అనుభవాలను అంతస్స్రవంతిగా చేసి, తన కవిత్వంలో జీవన వాస్తవికత, ఆవేదన, చైతన్యాలతో పాటు ప్రతిఘటన స్వరాన్ని తీవ్రంగా వినిపించిన కవి.
“నిమ్న జాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును గప్పివేయు ననుచు..”

అనగలిగిన కవి జాషువా. కన్నీటిని అగ్నిగా మార్చగల అక్షరశిల్పి, ధిక్కారశీలుడు మహాకవి జాషువా. అయినా ఆయన కాలపరిమితులు ఆయనకీ ఉన్నై. భావతీవ్రతకి తోడు, అద్భుతమైన కవితాశక్తి కూడా కలవాడు కావడం చేత, మొదటిసారిగా ప్రజాకవిత్వానికి పద్యాన్ని వినియోగించి, దళితచైతన్యానికి మార్గదర్శి కాగలిగాడు.

2

సమాజంలో తిరుగుబాట్లు జరుగుతున్నప్పుడు మాత్రమే, దానికి సమాంతరంగా కవితోద్యమాలు కూడా తలెత్తుతై. 1930ల నుండి భారతదేశాన్ని మహోద్యమరూపంతో నడిపింది మార్క్సిస్టుసిద్ధాంతం. 1980దాకా మార్క్సిస్టు ఉద్యమాలు తిరుగులేని విధంగా జరిగినై. ఈ ఉద్యమాల ఆధారంగా మార్క్సిస్టు కవిత్వం అత్యంత విస్తృతంగా సమాజాన్ని ప్రభావితం చేసింది. మార్క్సిస్టు ఉద్యమాలు దళితుల విషయంలోనూ, కులనిర్మూలన విషయంలోనూ ఉదాత్తమైన ఆశయాలతో నడిచినా, దళితచైతన్యాన్ని ప్రధాన స్థానానికి తీసుకురాలేక పోయాయి. ఆర్థిక, రాజకీయ పోరాటాలు మార్క్సిస్టు భావనలో ప్రధానస్థానంలో ఉంటై. 1969లో కంచికచెర్లలో కోటీశు అనే దళితుణ్ణి అగ్రవర్ణాలు సజీవదహనం చేసిన సంఘటన దళితచైతన్యానికి మొదటి సంచలనంగా చెప్పవచ్చు. అయితే, అప్పటికి దళితసంఘటిత శక్తి రూపొందక పోవడం చేత, ఆసంఘటన దళితస్పృహని ఎంతగా రగిలించినా, సమష్టిపోరాటానికి ప్రారంభం కాలేకపోయింది. అప్పటినుంచి క్రమంగా రూపుదిద్దుకుంటున్న దళితస్పృహ, 1980ల లోకి వచ్చేటప్పటికి, నిర్దిష్టమైన సిద్ధాంతాల్ని ఏర్పరచుకోవడం, డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ని స్ఫూర్తిదాతగా తీసుకోవడం, సమష్టి ఉద్యమాల కోసం పురోగమించడం మొదలయింది. “మేకల్నే బలిస్తారు గాని సింహాల్ని కా”దనే అంబేద్కర్‌ మాటలు దళితుల్ని పోరాటం వైపు మరల్చడం ప్రారంభమైంది. వచనకవిత్వంలో ఈ భావాల ప్రతిఫలనం మొదటిసారిగా, బొజ్జా తారకం “నదిపుట్టిన గొంతుక” లో స్పష్టమైన రూపం పొందింది. ఏ సాహిత్యవాదానికైనా, ఒక స్వఛ్ఛమైన, సమగ్రమైన తాత్విక భావధార ఉండాలి. దీన్ని మొదటిసారిగా అందించే ప్రయత్నం చేసింది “నదిపుట్టిన గొంతుక”! బొజ్జా తారకం 80ల నుండే “నలుపు” అనే దళితపత్రికను కూడా నడిపి, దళితచైతన్యాన్ని వ్యాప్తి చేశాడు. 1980ల లోనే ఆయన తెచ్చిన “నదిపుట్టిన గొంతుక”, ఆతర్వాత రాబోయే దళితవాద సాహిత్యానికి వేగుచుక్క.

“నేను అస్పృశ్యుణ్ణి
నా ఒళ్ళంతా మట్టి వాసన
నా బ్రతుకు నిండా వెట్టివేదన
నా కళ్ళనిండా ఎండవేడిమి
ఎండకు ఎండి వానకు తడిసి
బిగుసుకుపోయిన
మర్రి ఊడల్లా నా తల

నన్ను ఊరికి దూరంగా ఉంచారు
మట్టి పిసికి యిటుకలు చేసి
ఇళ్ళు కట్టి యివ్వమన్నారు
ఇంట్లోకి రావద్దన్నారు

చచ్చిన మీ గొడ్డుల్ని
మోసుకుపొమ్మన్నారు
వాటి చర్మం ఒలిచి
చెప్పులు కుట్టమన్నారు
నేను చెప్పులు తొడగకూడదన్నారు

నా గురించి కథలు లేవు
గాధలు లేవు
నాకై కవిత లేదు
నాకు చరిత లేదు

నాలుగువేదాలలోంచి
నాలుగు పాదాల లోంచి
నన్ను తొలగించారు
కట్టలోంచి జారిన కట్టెలా
ఒక్కణ్ణే ఎక్కడో ఎండిపోయాను”

కట్టలోంచి జారిన కట్టెలా ఒక్కడూ ఎండిపోవడమనేది చాలా కొత్త పోలిక. ఈ కట్టె, భవిష్యత్తులో మండుతుందన్న ధ్వనికి అనుగుణమైన ఉపమానం.

3

మార్క్సిస్టు ఉద్యమాలు ఆటుపోట్లకు గురౌతున్న సందర్భంలో, 1985 నుండి శక్తిమంతంగా ప్రచలితమైంది స్త్రీవాదం. ఆతర్వాత ఐదు సంవత్సరాలకు దళితవాదం ఒక ఝంఝలా సర్వవ్యాప్తమైంది. కారంచేడు, నీరుకొండ మొదలైన చోట్ల జరిగిన హింస, దేశవ్యాప్తంగా పెరిగిన దాడులు, పీడన, దళిత ఐక్య సంఘటనకు నేపథ్యంగా నిలిచినై. అంతకుముందు మార్క్సిస్టులుగా ఉన్న చాలా మంది రచయితలు, మేధావులూ దళితవాదంలోకి వచ్చారు. చాలామంది మార్క్సిస్టు వ్యతిరేకులుగా కూడా మారారు. ఈ యిరువర్గాల మేధావుల మధ్య ఆరోజుల్లో అతితీవ్రమైన చర్చలు జరిగినై. ఆచర్చల్లో ముఖ్యమైంది పునాది, ఉపరితలాల్ని గూర్చింది. అన్నిటికీ పునాది ఆర్థికమనీ, మిగిలినవన్నీ ఉపరితలనిర్మాణాలనీ మార్క్సిజం చెప్తుంది. అందువల్ల దళితపీడనకీ అంతిమంగా ఆర్థికమే కారణమని మార్క్సిస్టుల వాదన. అయితే, భారతదేశ పరిస్థితికి, అంతర్జాతీయ వాదాన్ని అనుసంధించరాదనీ, ఇక్కడి పరిస్థితుల్లో దళితత్వం ఉపరితలం కాదనీ, పునాదిగా ఉన్నదనీ దళితవాదులు అన్నారు. అందుకే ధనవంతుడైన దళితుడు కూడా, నిరుపేద యైన అగ్రవర్ణస్థుని చేత తక్కువగా చూడబడతాడనీ, అందుకే ఈ అంశం పునాదిగా చూడాలనీ, కులనిర్మూలన జరిగితే గాని, ఆర్థికమైన దోపిడిని ఎదుర్కొనడం సాధ్యం కాదనీ దళితవాదం చెప్తుంది. ఇంకో అడుగు ముందుకేసి జి. లక్ష్మీనరసయ్య అనే విమర్శకుడు “దేశీయ మార్క్సిజమే” దళితవాదం అన్నాడు. అంటే మార్క్సిజమ్‌ అవసరం ఇక్కడ లేదనీ, దేశీయంగా మార్క్సిజమ్‌ స్థానంలో దళితవాదమే నిలవాలనీ ఆయన అభిప్రాయం. అయితే అంత క్రితం మార్క్సిస్టులుగా ఉండి, దళితవాదులుగా మారిన కొంతమంది అంబేద్కరిజమ్‌ ని ప్రధానంగా భావిస్తూనే, మార్క్సిస్టు దృక్పథాన్ని కూడా కలుపుకోవాలని వాదించారు. సతీశ్‌చందర్‌, భూపతి నారాయణమూర్తి మొదలైన వారు ఇందుకుదాహరణ. భూపతి నారాయణమూర్తి, మార్క్సిస్టు మూలసూత్రాల్నీ, అంబేద్కరిస్ట్‌ భావధారనీ విపులంగా చర్చించి, రెంటి సమ్మేళనం కావాలని “దళితవిముక్తి” అనే సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. మార్క్సిస్టు నేపథ్యం అంగీకరించిన దళితమార్క్సిస్టు మేధావులు, అన్ని కులాలలోనూ పేదలున్నారు కాబట్టి, మార్క్సిస్టు పోరాటాల్ని సమర్థిస్తూ, దళితవాదం సాగాలని కోరారు. కేవల దళితవాదులు ముందు కులసంబంధమైన పోరాటాలే మొదటిమెట్టు అని వాదించారు. ఏమైనా దళితకవిత్వంలో దళితతత్వమే ప్రధానంగా ఉన్నా, ఆర్థికసమస్యలు కూడా ప్రతిబింబించినై. అయితే, అంతకు ముందు, ఇతరవస్తువుల మీద కవిత్వం రాస్తూ, మధ్యలో కొన్ని కవితలలో తమ వేదనలూ, ప్రతిఘటనలూ చెప్పిన దళితకవులు 1990 దాటిన తర్వాత నిబద్ధకవులయ్యారు. అంబేద్కరిస్టు నేపథ్యాన్ని విస్తృతపరుచుకుంటూ కవిత్వాన్ని కేంద్రీకృత వస్తువుతో రాయడం ప్రారంభించారు. అంతకుముందే వచనకవితా అభివ్యక్తి మార్గాల్లో నైపుణ్యం కల దళితకవులు, నిబద్ధతతో రాసిన కవిత్వం వస్తుశిల్పాల అపూర్వసమ్మేళనమై, అత్యున్నతస్థాయి దళితకవిత్వం వికసించడం మొదలయింది. ప్రజోద్యమమే కవిత్వోద్యమంగా మారిన తర్వాత, ఉద్యమనేపథ్యంతో, అత్యుత్తమ కవిత్వపు విలువలతో, అసంఖ్యాకంగా వచ్చిన కవులు సాహితీపరులందర్నీ ఆశ్చర్యపరిచారు. దళితకవిత్వోద్యమం తెలుగు వారు గర్వించదగిన స్థాయిలో కొనసాగడం జరిగింది.

4

1994, 95 ల నుండి దళితవాదం గూర్చి అతితీవ్రమైన చర్చలు ప్రారంభమైనై. వీటిలో మొదటగా చెప్పుకోవలసింది, అసలు దళితుడు అంటే ఎవరు? అనేది. దళితులంటే, అస్పృశ్యులు, వెనుకబడ్డ కులాల వారు, గిరిజనులు, మైనారిటీలు అందరూ అని బి.యస్‌. రాములు, జి. లక్ష్మీనరసయ్య మొదలైన వారు వాదించారు. అయితే సతీశ్‌ చందర్‌ మొదలైన వారు దళితులంటే తరతరాలుగా అన్ని కులాలకీ దూరంగా ఉంచబడిన అవర్ణులు మాత్రమే అని ఉద్ఘాటించారు. అస్పృశ్యులు కాక మిగిలిన వారిని “బహుజనులు” అని వ్యవహరించడం చేత, వారు దళితులు కావడం కుదరదని కొంతమంది అన్నారు. అగ్రవర్ణాల్ని ఎదుర్కోడానికి అవసరమైన రాజకీయసంఘటనకి “దళితబహుజన సమైక్యత”ను కాన్షీరామ్‌ మొదలైనవారు బలపరిచారు. కాని సాహిత్యం దగ్గరకి వచ్చేటప్పటికి, దళితకవిత్వానికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వమిచ్చేది, “అస్పృశ్యత” మాత్రమే. తరతరాలుగా వస్తున్న కవిత్వమంతటికీ కేటాయింపుగా వస్తున్న కవిత్వోద్యమానికి ఒక ప్రత్యేక వస్తువుండాలి. దళితకవిత్వంలో అలాటి వస్తువు అస్పృశ్యత పునాదిగానే ఉంటుంది. ఇది సొంతముద్ర ( identity ) కు సంబంధించిన అంశం. ఈ విషయాన్ని గూర్చి ప్రసిద్ధ మహారాష్ట్ర దళితోద్యమ రచయిత Arjun Dangle  యిలా అంటాడు

“Dalit literature is marked by revolt and negativism, since it is closely associated with the hopes for freedom of a group of people who, as untouchables, are victims of social, economic, and cultural inequality.”

కాబట్టి కవిత్యోద్యమంగా దళితవాదంలోని “దళితుడు”, తరతరాలుగా అస్పృశ్యతావివక్షకు గురైన అవర్ణుడే ఔతున్నాడు.

మద్దూరి నగేష్‌బాబు మొదలైన వారు తెచ్చిన “నిశాని” సంకలనం 1995లో వచ్చిన తర్వాత “దళితభాష” చర్చనీయాంశమైంది. “నిశాని” సంకలనంలో మద్దూరి నగేష్‌బాబు, పైడి తెరేష్‌బాబు, ఖాజా, వరదయ్య అనే నలుగురి కవితలున్నై. తమ శత్రువుని ఎదురుగా నిలబెట్టి తిడుతున్నట్టు రాసే ధోరణి ఈసంకలనంలో ఉంటుంది. ఇలా తిట్టడంలోని తీవ్రతా, కోపావేశమూ, దిగంబరకవిత్వాన్ని తలప్తౖిసె. దిగంబరకవిత్వంలో మాదిరే, “అసభ్యత” కూడా ఈకవితల్లో కనిపిస్తుంది. దీన్ని మొత్తంగా కొందరు వ్యతిరేకించారు. మొత్తంగా కొందరు సమర్థించారు. అసలు అసభ్యత అంటే ఏది, “దళితభాష” అనే దానికి నిర్వచనం ఏది అనే విషయాల మీద ఆసక్తికరమైన చర్చలు వార్తాపత్రికలలో జరిగినై. ఈఅంశాన్ని గూర్చి ఈవ్యాసకర్త అప్పట్లో రాసిన ఒక వ్యాసం (ఆంధ్రభూమి) “అసభ్యత” అనే అంశాన్ని విశ్లేషించింది. అసభ్యత అనే దృక్పథానికి ఎప్పుడూ పరిమితులుంటై. కొన్ని సందర్భాల్లో అది అంగీకరించవచ్చు. కొన్ని సందర్భాల్లో అనుచితం కావొచ్చు. భావతీవ్రతకి సహకరించినప్పుడూ, స్త్రీలను అవమానించేది కానప్పుడూ, మధ్యలో పాఠకుణ్ణి భావధారలోంచి బయటకు తేనప్పుడూ, వాస్తవిక సన్నివేశాన్ని చెప్తున్నప్పుడూ అసభ్యతను అంగీకరించవచ్చు. అలా ఏ ప్రయోజనమూ లేనప్పుడు, రచయిత కోపాన్ని తెప్పించాలనుకున్నప్పుడు అసభ్యత నవ్వు తెప్పిస్తుంది. అత్యాచారానికి గురైన దళితస్త్రీ వేదనను గూర్చి మద్దూరి నగేష్‌బాబు

“మానం అంటే కడుక్కుని సరిపెట్టుకునే దాన్ని
ఈ సినిగిపోయిన రైక ఎక్కణ్ణుంచి తెచ్చుకునేదిరా”

అన్న మాటల్లో, ఒక తీవ్రవేదన సందర్భంలో పైమాటలు అసభ్యత కాకుండా పోతున్నై. కాని “నిశాని” కవులు కూడా ఒక సంచలనాత్మక స్థితిలో ఆ విధంగా రాసినా, తర్వాత వారి ధోరణి మారింది. “బ్రాహ్మణీయ భావజాలం” గలవారికి కోపం తెప్పించేట్టు రాయడం అనే ప్రధానలక్ష్యం కాకుండా, వస్తువైవిధ్యం, ఉద్యమనేపథ్యం, వాస్తవికత, వేదన, అభివ్యక్తి వారికి ప్రధానాంశాలైనై.

దళితభాష అనే ప్రత్యేకశైలి గురించి కొందరు వాదించారు. దళితకవులు రాసే కవితల్లో, జీవనవాస్తవికత గూర్చి చెప్తున్నప్పుడు, దళితులకి చెందిన పదాలు, పదబంధాలూ, నుడికారాలూ రావొచ్చు గాని ఒక ప్రత్యేకశైలి ఉంటుందని చెప్పడం సమగ్రత నివ్వదు. మొరటుపదాల్తో రాస్తేనే అది దళితభాష ఔతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే మొరటుదనం గ్రామాల్లో చాలామంది దగ్గర ఉంటుంది. ఐతే, మొత్తం మీద చూసినప్పుడు, దళితబహుజన కవిత్వం వల్ల అచ్చమైన తెలుగు పలుకుబడికీ, నుడికారానికీ వచ్చిన ప్రచారమూ, గౌరవమూ అపూర్వం. సులభంగా రాయడమనే దృష్టి అంతకుముందు అభ్యుదయ, విప్లవ కవిత్వాల్లోనూ ఉంది గాని, కావాలని ప్రయోగించే సంస్కృతపదాలూ, పదబంధాలూ, సమాసాలూ మొదలైన వాటిపట్ల వ్యతిరేకత గానీ, అట్టడుగు వర్గాల్లో సజీవంగా ఉన్న తెలుగుపలుకుబడిని ప్రత్యేకంగా స్ఫూర్తిమంతంగా ప్రయోగించాలనే పట్టుదల గానీ లేదు. దళితకవిత్వం అమోఘంగా ఈలోపాన్ని పూరించింది. దళితజీవన వాస్తవిక సందర్భాలూ, మట్టితనం లోంచి పట్టడమే ఇందుకు కారణం. కత్తి పద్మారావు “ఓనమాలు” కవితలో ఇలా రాస్తాడు

“మాయమ్మ
ఎండిమిరపగాయలు
కాల్సి కాల్సి పచ్చిపులుసు బువ్వ కలిపి
పెట్టినప్పుడు
మా అప్ప
కుండలో, గడ్డిమీద
కుడుములు ఆయిగిలబెట్టి
నానోట్లో కుక్కినప్పుడు
ఎర్రపచ్చడితో
పొలం బువ్వ కలిపి మాయమ్మ
దోసిట్లో పెట్టినప్పుడు
మా అయ్య
పిల్లిమిసర గుత్తి తెచ్చి
బిళ్ళంగోడు ఆడేనన్ను
కేకేసి యిచ్చినప్పుడు
మా జేటి తిరగల్లో కందులు ఇసిరి
ముడిపప్పు నానోట్లో పోసినప్పుడు
ఆకలికి అర్థం తెలియలేదు …”

ఇలాటి భాష మాత్రమే ఈకవులు ప్రతిసందర్భంలో ప్రయోగించారని కాని, భావాన్ని బట్టి సంస్కృతపదాల్ని ఉపయోగించలేదని గాని చెప్పడం నా అభిప్రాయం కాదు. కాని, దళితబహుజనకవిత్వం వల్ల, తెలుగుపలుకుబడికి అంతకుమందు లేని ప్రాచుర్యం వచ్చిందనీ, ఇది దళితకవిత్వపు కొత్త ఉపలబ్ధులలో ( achievements ) ఒకటి అనీ చెప్పడమే నా ఉద్దేశం.

ముస్లిములు దళితులౌతారా అన్న ఒక చర్చ కూడా 1995లో బాగా సాగింది. మొదట్లో ముస్లిమ్‌కవులు దళితులతో కలిసి కవిత్వం రాసి, పుస్తకాల సంకలనాలు వెలువరించారు. ఆకాలంలో కొప్పర్తి “చారిత్రకపీడనలోంచి, అణచివేతలోంచి వచ్చింది దళితకవిత్వం కాగా, మైనారిటీ కవిత్వం అట్లా కాదు … స్వాతంత్య్రం తర్వాత సంఖ్యాపరంగా బాగా తగ్గిపోయిన ముస్లిములు హిందూమతతత్వ ఫలితంగా అభద్రతకు లోనయ్యారు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ హిందూమతతత్వం ప్రధానభూమికను నిర్వహించినంత మాత్రాన, అందుకు వ్యతిరేకంగా వచ్చిన దళితమైనారిటీ కవిత్వాలు ఒకటి కావు”.

కాలం ఈమాటనే ఋజువు చేసింది. తర్వాత ముస్లిమ్‌వాదకవులుగా వేర్పడి, ముస్లింలు “జలజలా” అనే సంకలనం వేశారు.

5

అభ్యుదయ విప్లవ కవిత్వాలకి మార్క్సిస్టు తత్వం నేపథ్యంగా ఉన్నట్లే, దళితకవిత్వానికి అంబేద్కరిజమే నేపథ్యంగా ఉంది. జీవనవాస్తవికతని విస్తృతంగా లోతుగా చెప్పడంతో పాటు, ఒక నిర్దిష్ట భావధార ఉండడం చేత సమగ్రత, సంఘర్షణ, పరిష్కారదృక్పథం, చారిత్రికత, సాంస్కృతికదృష్టి మొదలైన ఎన్నో లక్షణాలు ఈకవిత్వాన్ని పటిష్టం చేశాయి.

దళితకవిత్వంలో స్పష్టంగా రెండు దశలున్నాయి. మొదటిదశ, పౌరాణిక చారిత్రక కథల్లో అగ్రవర్ణాల దుర్మార్గానికి గురయిన పాత్రల్ని ప్రతీకలుగా చేసుకుని, తమ ఆగ్రహాన్నీ, ప్రతిఘటననీ వ్యక్తీకరించిన దశ. శంబుకుడు, ఏకలవ్యుడు, బలి మొదలైన ప్రతీకలు ఎన్నో కవిత్వాల్లో వచ్చినై. అలాగే పౌరాణిక సంఘటనలు కూడా ప్రతీకాత్మకంగా వినియోగించబడినై. “ఒళ్ళు కడుక్కుందాం రండి” కవితలో చిన్ని రాసిన మాటలు
“రెల్లు పొదలో పడ్డ వీర్యం నుండి పుట్టిందెవరు?
ఎవడో మాయగాడిచ్చిన కుండనుండి మొలకెత్తిందెవరు?
గుర్రం రతినుండి ఊడిపడ్డదెవరు?
నాపుట్టుక అసహ్యమైనప్పుడు
పరమ అసహ్యమైన పుట్టుకనుండి
కళ్ళు తెరిచిన దేవుళ్ళను కొలుస్తున్న
మీపుట్టుకనే నేను ఇప్పుడు సవాల్‌ చేస్తున్నాను.”

తరతరాలుగా తలవంచబడి నిలుచున్న దళితుడు, ఒక్కసారి ధైర్యంగా ప్రశ్నించగల సమష్టిశక్తి సమకూరినప్పుడు, తనకు జరిగిన అవమానాలన్నిటినీ తలచి ఆవేదన పడి, తీవ్రమైన కోపం పొంది రాస్తున్నప్పుడు ఈవిధంగా అనడంలో ఆశ్చర్యం లేదు. ఇలాటి కోపతీవ్రత, ప్రతీకాత్మకత మొదటి రెండు మూడేళ్ళలో ఎక్కువగా ఉన్నై. ఆ తర్వాతి దశలో వాస్తవికత, అభివ్యక్తి ప్రధానమైన ధోరణి వచ్చింది. అంటే మొదటి దశలో వాస్తవికత లేదనీ, రెండో దశలో అలాటి ప్రతీకలు అసలు లేవనీ నా అభిప్రాయం కాదు. రెండు దశల్లోనూ స్పష్టంగా కనిపించే రీతుల గూర్చి ఈ విశ్లేషణ.

దళితకవిత్వంలోని వస్తువైవిధ్యమూ, అభివ్యక్తిరీతుల్ని గూర్చి వివరించవలసి ఉంది.

1. దళితకవిత్వం ప్రధానంగా ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్నగా రూపొందింది. “నీసంస్కృతి హీనమైంది, నీజాతి నీచమైంది” అని తరతరాలుగా అనిపించుకున్న దళితుని ప్రతిఘటనలో మొదటి దశ “నాసంస్కృతి గొప్పది, నాచరిత్ర గొప్పది” అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడం, అంతేగాక “నీసంస్కృతి ఏం గొప్పది?” అని ప్రశ్నించడం ఇది దళితకవిత్వంలోని ప్రధాన ధోరణుల్లో ఒకటి. సతీష్‌చందర్‌ “అక్షరశయ్య” కవితలో ఇలా అంటాడు
“నాలుగు పదాలు కలవకూడదన్నదే నిన్నటి వ్యాకరణం
నాలుకనంటిన ఏ అయిదో పదమూ గ్రాంధికం కాలేదు
క్రియల్ని కిందికి తొక్కిన మనువే మహాకవయ్యాడు
భాషా అప్రవీణులారా! ఉలిక్కిపడకండి
మీరు కుదిర్చిన ఛందోబద్ధ కాపురాల్ని కాలదన్ని
పదాలు లేచిపోతున్నాయి
వర్ణక్రమాలు లేని వాడలకు వలసపోతున్నాయి”

చరిత్రలో అణచబడ్డ దళితకవి ఆత్మవిశ్వాసం పైపంక్లుల్లో ఉంది. “నను వరించిన శారద లేచిపోవునే” అన్న మహాకవి జాషువా మాటల్లోని తత్వానికి, యిది ఆధునిక అభివ్యక్తి రూపం.

“దళితధ్వని”లో నాగప్పగారి సుందర్రాజు
“అడుగులు నేర్చుకుంటున్న వారసుణ్ణి
ఓర్పునేర్పుతో అస్త్రవిద్యా వైద్యుణ్ణి
గురుదేవుడు పరుగుపరుగున వచ్చి పాదాలపై వాలి
భిక్షాన్‌ దేహి గురుదక్షిణ అడిగితే
భవిష్యత్తును బంధించి నాబొటనవేలుతో
మహాభారతానికి నాందీవాక్యం రాశాను
అయినా నాలుగు శతాబ్దాల నానగరం
నన్ను గుర్తించలేదు”

ఆత్మగౌరవప్రకటనలో మరో ముఖ్యమైన కోణం, తమకు సంబంధించిన వాటిని ఉదాత్తమైనవిగా చెప్పడం. తమ అనుభూతుల అస్తిత్వాన్ని ఎవరూ తక్కువగా చూడడానికి వీలులేదని నిరూపించడం. తమ అస్తిత్వాన్ని తాము గాఢంగా ప్రేమించడం. ఎండ్లూరి సుధాకర్‌ ఇలా అంటాడు
“సంకటి ముద్దల్లోకి
ఎండుతునకల్ని నంజుకుంటూ
వార్చిన గంజిలోకి మిరపకాయల్ని కొరుక్కుంటూ
అంబలిజుర్రిన కమ్మదనం
ఏ అమృతాని కొస్తుందిరా!”

ప్రబంధనాయిక కన్న దళితస్త్రీ అందమైంది అని సుధాకర్‌ రాసిన కవిత ఆత్మగౌరవప్రకటనలో అత్యుదాత్త స్థాయిలోది.
“ఓ నా చండాలికా
నీ వెండికడియాల కాళ్ళ ముందు
వెయ్యేళ్ళ కావ్యనాయికలు వెలవెలబోతున్నారు
అలంకారశాస్త్రాలన్నీ
నీ పాటిమట్టి మెరుపు ముందు బలాదూర్‌
నా నల్లపిట్టా
నిన్ను వరాంగివనీ, కృశాంగివనీ
లతాంగివనీ మభ్యపెట్టను…
నీనెత్తి మీది యినుపగమేళం
విశ్వసుందరి కిరీటాన్ని సైతం వెక్కిరిస్తోంది…
నా నల్ల కావ్యానికి నిన్ను
నాయికగా ప్రకటిస్తున్నాను”

ఆత్మ గౌరవ, విశ్వాస ప్రకటనలో దళితకవిత్వం వందలాది కోణాల్ని ( dimensions ) ఆవిష్కరించింది.

2. దళితులకు జరిగిన అన్యాయాల్నీ అవమానాల్నీ పేర్కొని, వాటికి ప్రతిస్పందన ఎన్నో విధాలుగా చెప్పడం దళితకవిత్వంలో ప్రబలమైన ధోరణి. 1981లోనే విప్లవకవిగా, విప్లవకారుడుగా ఉన్న సలంద్ర ఈధోరణికి మొదటికవి. “దళితమానిఫెస్టో” అనే కవితని రాశాడు.
“నన్ను
నీ దేవుడి గుళ్ళోకి రావద్దన్నావు
సరే, ఎలాగయితేనేం
నేను నాస్తికుణ్ణవడమే బాగయింది

నన్ను
చదువుకోవద్దన్నావ్‌
చదివితే నాలుక కోసెయ్యమన్నావ్‌
వింటే చెవుల్లో
వేడివేడి సీసపులోహం పోయమన్నావ్‌
సరే, ఎలాగయితేనేం
నువ్వెంతటి మూర్ఖుడివో
నీవెంతటి విశాలహృదయుడివో
నాకు తెలిసిపోవడమే బాగయింది

నన్ను
చచ్చిన శవాల దహన సంస్కారాలే చూసుకోమన్నావు
సరే, ఎలాగయితేనేం
మీ ప్రాణాలని కూడా
ఎలా పాతేయాలో
నాకు తెలవడమే బాగయింది”
యిలా సాగుతుంది కవిత. తమకు ఎలాటి అవమానం జరిగినా, తమపై ఏహింస జరిగినా వెంటనే స్పందించి, తమ పోరాటస్వరాన్ని తీవ్రంగా వినిపించడం దళితకవిత్వంలో చూడగలం. “ఐ” అనే కవి, చుండూరులో జరిగిన దళితహింసకు ప్రతిస్పందిస్తూ “మరోసారి” అనే కవిత రాశాడు. అందులోంచి ఈ పంక్తులు

“హతుడి నిశ్చల నేత్రాలను చూడు
స్తంభించిన విశేషస్వప్నాలు కనిపిస్తాయి
స్వప్నాలు ప్రవహిస్తాయి
బిగిసిన పిడికిళ్ళను చూడు
శత్రుస్థావర రహస్యాలు లభిస్తాయి
రక్తానికి తన స్వభాష తెలుసు
అది తిరుగుబాటు
ఆకాశంలో అనివార్య సూర్యోదయం”.

3. దళితజీవితంలోని విషాదవాస్తవికతలు దళితకవిత్వంలో ఆవిష్కరించబడినాయి. దళితకవిత్వంలోని సాంస్కృతికపార్శ్వం ఈలాటి కవిత్వంతో వెలుగుతోంది. ఈకవిత్వంతో దళితజీవితంలోని వాస్తవాలు తెలియగానే, తెలియని వారి మనస్సులో ఉన్నతసంస్కారం కలుగుతుంది. “వెలివాడ”ని మద్దూరి నగేష్‌బాబు ఇలా వర్ణిస్తాడు
“చాలాకాలం తర్వాత
అమ్మని చూద్దామని బయల్దేరా
బస్సు దిగేసరికి బాగా పొద్దుపోయింది
శీతకాలపు జిగటవెన్నెల
పూరిగుడిశెలపై కప్పిన మృతవస్త్రంలా ఉంది…
దూరంగా ఎక్కడో ఒక కుక్క
హృదయవిదారకంగా ఏడుస్తూ
నడుస్తుంటే నా నేల
బురదచేతుల్తో నన్ను చుట్టేసింది…”

ఇలా దళితజీవితంలోని వాస్తవికవిషాదం ఎన్నో కవితల్లో హృదయాన్ని కదిలిస్తుంది.

4. దళితజీవితంలోని సౌందర్యాన్ని కూడా కొందరు కవులు వినిపిస్తున్నారు. అందులో కత్తి పద్మారావుని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
“బడింటికాడ
గనిసిగడ్డల బండి దిగిందని
ఎడగారోడు గోలపెడితే
బానలో నూకలు చెంగున గట్టి
బేరమాడి బేరమాడి
ఈసెడు కొని
కొసరుగడ్డ మునిపంట కొరికి
పిల్లోడికి నోటికందించినపుడు
పళ్ళకొసల్లో
పూసిందొక నవ్వుపువ్వు”

దళితభాషనీ, దళితజీవితాన్నీ ఎక్కువగా రికార్డు చేస్తుంది కత్తి పద్మారావు కవిత్వం.

5. దళితకవిత్వంలో స్త్రీవేదనల్నీ, ప్రతిఘటననీ వినిపించడం దళితకవితాపరిణామంలో ఒక విశేషం. “చల్లపల్లి స్వరూపరాణి” కవితలు ఈమార్గంలో ఉత్తమమైన వాటిని అందించినై.
“ఇంట్లో పురుషాహంకారం
ఒక చెంప ఛెళ్ళుమనిపిస్తే
వీధిలో కులాధిపత్యం
రెండో చెంప పగలగొడుతుంది”

ఇంకా జి. విజయలక్ష్మి, జె. ఇందిర మొదలైన వాళ్ళు దళితస్త్రీల జీవనప్రతిబింబంగా కవితలు రాస్తున్నారు.

6. దళితకవిత్వం రానురాను, కేవలం కులసమస్యనే కాకుండా, ఇతరసమస్యల్ని కూడా స్వీకరిస్తోంది. కులసమస్య ఒక పరిధి కాగా, ఇతర సమస్యలు సాధారణమైన పరిధి. ఆర్థికాదివిషయాల్లో దళితుని జీవితం, మిగిలిన వర్ణాల పేదవారి జీవితంతో సమానంగానే ఉంటుంది. అలాగే సామ్రాజ్యవాద దురాక్రమణ వల్ల, ప్రభుత్వ వక్రవిధానాల వల్ల పొందే బాధలు అందరికీ ఒకే విధంగా ఉంటై. అందువల్ల దళితకవులు సాధారణసమస్యల్ని కూడా స్వీకరించడం కవితావస్తువుని విస్తృతం చేస్తుంది. ప్రగతిమార్గాన్ని విశాలం చేస్తుంది.

6

దళితకవిత్వం ఒక చారిత్రిక కవితోద్యమం. అగ్రవర్ణ అహంకారంతో పోరాటం తాత్కాలిక అవసరమైనా, కులనిర్మూలన దాని అంతిమలక్ష్యం. సమగ్రమైన తాత్వికనేపథ్యం, సమకాలీన సమస్యాచిత్రణ, వస్తువైవిధ్యం, దళితజీవన వాస్తవికతల్తో పాటు, అత్యుత్తమ కవితాభివ్యక్తి దళితకవిత్వాన్ని మహోజ్వ్జలం చేస్తోంది. ప్రతిఘటన వల్ల రాజకీయపార్శ్వమూ, వాస్తవికత వల్ల సాంస్కృతికపార్శ్వమూ, కవితాభివ్యక్తి వల్ల కళాపార్శ్వమూ, నిండుగా పండించుకుంటున్న దళితవాదం తెలుగుకవిత్వానికి గర్వకారణమైన ఒక ఉద్యమం.
---------------------------------------------------------
రచన: అద్దేపల్లి రామమోహనరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: