Sunday, June 2, 2019

జీవితాన్ని పండగచేసుకొన్న కవి సోమసుందర్


జీవితాన్ని పండగచేసుకొన్న కవి సోమసుందర్




సాహితీమిత్రులారా!

ఆవంత్స సోమసుందర్ (సోసు) 92 ఏళ్ల పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి 2016 ఆగస్ట్ 12న కాలధర్మం చెందేరు. తన సుదీర్ఘ జీవితంలో 75 ఏళ్లు పైగానే సాహిత్యంతో మమైకమయ్యేరు. తొలితరం అభ్యుదయ కవిగా శ్రీ శ్రీ తదనంతర కవుల్లో అగ్రగణ్యుడిగా ప్రస్తుతి కెక్కేరు. తెలంగణా పోరాటానికి గొంతునిచ్చి, తన గేయాలతో ప్రజలపక్షాన నిలిచేరు.

కవిగా, పార్టీ కార్యకర్తగా ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉండి కొద్దికాలం జైలు పాలయ్యేరు. పుస్తకం విడుదలయ్యీ కాకుండానే ఆయన ‘వజ్రాయుధాన్ని’ ప్రభుత్వం నిషేధించింది. ప్రచురణ కర్తమీదా, కవిమీదా కేసులు పెట్టింది. ఏడాదిన్నర తర్వాత కోర్టు కేసులు కొట్టేసింది.

1950 తర్వాత రాజకీయ ప్రత్యక్ష కార్యకలాపాల నించి విరమించి ‘సార్వకాలిక సాహిత్య సేవకుని’ గా కేంద్రీకరించుకొని, విషమ సమస్యలెప్పుడు ఎదురువచ్చినా తన కంఠధ్వని విస్పష్టంగా మోగిస్తూ నిలిచేరు. ఆయన మాటల్లోనే, “ఆమోదించలేని ఏ సిద్ధాంతాన్నైనా లేక ఏ పద్ధతినైనా తీవ్రావేశంతో ఖండించకుండా మౌనంగా ఉండలేను. తద్వారా వ్యక్తులపరంగా ఏర్పడిన శతృత్వాలనుగానీ, జారిపోయే మర్యాదలను గానీ ఎన్నడూ పరిగణించలేదు. కొందరు దీనిని నిజాయతీ అంటారు. మరికొందరు బలహీనత అంటారేమో!” (ఆత్మస్తుతీ పరనిందా అస్వతంత్రులకు లక్షణాలు, ఆంధ్రభూమి 31.10.2005)

బాల్యం, ప్రభావాలు
సంతులేని పినతల్లి దత్తత తీసుకొంటే కాళూరి వారి పిల్లాడు ఆవంత్స వాడయ్యేడు. తన నాల్గో ఏడే ఆయన పిఠాపురం వచ్చేసేరు. “భాగవతంలో ప్రహ్లాద చరిత్ర లోని పద్యాలు చెప్పేది (దత్తత తల్లి). ఇంట్లో భాగవతం నిత్య పారాయణం. పోతనగారు మా ఇంట్లో ఒక సజీవ మూర్తిగా పాలించనారంభించేరు. బాల్యంలో భాగవత ప్రభావం చాలానే చూపించింది. అలంకార ప్రియత్వం, రసోల్లాసం, ఒక ప్రక్క పెరగగా, నిజాయతీ, నిస్తుల చిత్తశుద్ధీ, సత్యవాదమూ, దానిని చెప్పడానికి జంకక పోవడం జీవలక్షణాలుగా మారేయి. ఇవే రచనా లక్షణాలుగానూ పెంపొందాయి.”

పదేళ్లలోపే జనకతల్లీ, దత్తత తల్లీ చనిపోవడం గాఢమైన ముద్రవేసింది. సోసు రచనల్లో మాతృ వియోగదుఃఖం అనేక కవితల్లో కనిపిస్తుంది. బాల్యం మకరతోరణమనీ, తల్లి ఆర్చా మూర్తి అనీ అనిపిస్తుంది.

అలానే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కి ఆతిధ్యం ఇచ్చి, కరణీకం కోల్పొయిన తండ్రి ‘దేశమే ముందు జీవితం కంటే’ అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. పెరటిగుమ్మంలోనే దేశభక్తి ఉపదేశం చేసినట్లయింది.

యౌవనారంభవేళ రాంషా, శశాంకల మైత్రీ, నిరంతర పుస్తకపఠనమూ, చర్చలూ, సొంతంగా పద్యాలు రాసుకోవడం, సరిదిద్దుకోవడం, వాల్ట్ విట్మన్, ఆడెన్, బాదలేరు, మలార్మేల సాహిత్య పరిచయం, సోవియట్ విప్లవ పరిణామాలు, దేశీయంగా క్విట్ ఇండియా ఉద్యమం, కమ్యూనిస్ట్ పార్టీ విస్తృత ప్రభావమూ వెరసి సోమసుందర్ కవిగా, పార్టీ కార్యకర్తగా వేళ్లూనుకొనేట్లు చేసేయి.

అదే కాలంలో కృష్ణశాస్త్రి (కృశా) అంతేవాసిత్వము, నిత్యమూ సాయంత్రాలు అయనతో గడపడమూ రివాజుగా మారింది. సాహిత్యాన్ని అనుభవించడం, ఆస్వాదించడం, సృజనోత్సవంగా సాగింది.

అయితే సోసు పూర్తికాలం పార్తీ కార్యకర్తగా తిరగడంపట్ల కృశా విముఖత వ్యక్తపరిచేరు. సాహిత్యకారుడిగానే ఉండవలసిందని సలహా ఇచ్చేరు. ఓలేటి పార్వతీశంగారు (ఏకాంతసేవ) కూడా జెండాలుగా పై కెగరవలసినవాళ్లు జెండా కొయ్యలుగా మిగిలిపోకూడదని మిత్ర త్రయాన్ని పలుమార్లు హెచ్చరించేరు. సోసు అపుడు సున్నితంగా తిరస్కరించేరు. కొన్నేళ్ల తర్వాత తన జీవితాన్ని సాహిత్యానికే నియమించుకొని పెద్దలమాటని పాటించేరు.

వజ్రాయుధం
తెలంగాణా పోరాటం, ప్రజల ఇక్కట్లు, తాను చదువుకొంటున్న సోవియట్ విప్లవ విజయాలూ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తృత్వం సోసును బాగా కదలించివేసాయి. మార్పుకోసం, ప్రజలపక్షాన నిలవడానికి తన్నుతాను సిద్ధం చేసుకొన్నారు. వడివడిగా కవితా పంక్తులు ఉరక నారంభించాయి. నిర్దేశించుకొన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తన కవితా పాదాలనే క్లుప్తంగానూ, గాఢంగానూ కూర్చగలిగేరు. ధరణీశోకాన్ని అర్ధం చేసుకోగలిగేరు. ప్రజాశ్రేణి కొరకు గొంతు సారించేరు.

‘ధరణీ చక్రం గిరగిర పరిభ్రమిస్తోందదిగో
నిమ్నోన్నతముల జగతికి ఉద్వాసన పలుకుతోంది’

అంటూ

‘తన చరిత్ర తనె పఠించి ఫక్కున నవ్వింది ధరణి
తన గాధను తనె స్మరించి భోరున ఏడ్చింది ధరణి’

అని గమనించి

‘నిద్దుర చీకటి వెలుపల వేకువ మెలకువ పుట్టును
వృద్ధ జగతి సమాధి పై సమధర్మం ప్రభవించును’

అని ప్రకటించి ఆచార్యత్వాన్ని సంపాదించుకొన్నారు.

‘జన్మెత్తిన మానవునకు
జీవితమే పరమధనం
అయితే అది ఒకమారే
అతనికొసగబడిన వరం’

అని సూత్రీకరించి

‘అర్పించెయి నీరక్తం మనిషీ!
నీ త్యాగం వృధా కాదు!’

ఉద్యమంలో ఏకంకమ్మని చెపుతూ

‘నిన్నా నేడులకృషియే
రేపై జన్మించుతుంది’

అనీ,

‘ఒక వీరుడు మరణిస్తే
వేలకొలది ప్రభవింతురు
ఒక నెత్తుటి బొట్టులోనె
ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు’

అని విప్లవ గీతోపదేశం చేసేరు.

తెలంగాణా పోరాటమే కాదు, ప్రతీ ప్రజా పోరాటానికీ ఈ వాక్యాల ఊపిరి అందుతోనే ఉంది. నక్సల్బరీ కాలమే కాదు, ఇప్పుడు కూడ ఈ విప్లవ సూక్తి నగరాల గోడలమీద, వీరుల నాలుకల మీద కనిపిస్తోనే ఉంటుంది.

పురాణ ప్రతీకలూ, నరకాసురుడు, పుత్రకామేష్టి , తాటకీ, రక్తబీజుడి కథా, దుందుభికట్టిన ఎముకల దుర్గం ప్రజలకి వజ్రాయుధాన్ని ఇతిహాస ప్రాయంగా సులువుగా అర్థం చేసుకొనేట్లు, జనబాహుళ్యం లోకి దూసుకుపోయేట్టు చేసేయి.

‘యుగధర్మం చైతన్యం
జనహృదయం పోరాటం
తిరుగుబాటు తిరుగుబాటు
తిరుగుబాటు బావుటా’

నినాదానికి కావలిసిన ఊపూ నిజాయతీ, నమ్మకమూ అందించేయి వజ్రాయుధ గేయాలు.

అభ్యుదయ సాహిత్యానికి వైతాళికత్వం
శ్రీశ్రీ తదనంతర తరానికి ఆద్యుడుగా అభ్యుదయ సాహిత్యానికి వైతాళికుడిగా, సాటి సోదరకవులని కలుపుకొని పథ నిర్దేశం చేసేరు. దాశరధి, ఆరుద్ర, ఆనిసెట్టి, ఏల్చూరి మొదలైన నవోన్మేషశీలురైన మిత్రులతో భుజం-భుజం కలిపి ఉద్యమించేరు.

కళాకేళీ ప్రచురణలు, కళాకేళీ సాహిత్య మాసపత్రిక నడపడంతో కూడా అనేక కొత్తగొంతులకి ప్రాధాన్యం ఇచ్చేరు. దేవిప్రియ, శివారెడ్డి శీలా వీర్రాజు వంటి యువకవులని ప్రోత్సహించేరు. జీవితాంతం కొత్త తరంకవులకి తన సమర్ధన అందిస్తూనే వున్నారు.

వజ్రాయుధం తదనంతర కావ్యాలు, విమర్శ
తొలి పుస్తకం ఇచ్చిన కీర్తీ గౌరవాలు, సాహిత్య చరిత్రలో తన స్థానం పదిలం చేసుకొంటూనే, పోరాటా లకే కాకుండా, తత్త్వ చింతనకీ, మనిషి లోలోపలి నిర్నిద్ర ప్రశ్నలకీ సమాధానాలు వెతుకుతూ మేఘరంజనీ, రక్తాక్షి, సోమరసం సుదర కాండ, మిణుగురులు రచించి ప్రచురించేరు.

ఆధునిక సాహిత్య విమర్శలో అభ్యుదయ దృక్పథాన్ని ఆవిష్కరించే క్రమంలో తన సమకాలీనులైన తిలక్, నారాయణ బాబు, అనిసెట్టి, పురిపండా, శేషేంద్ర, నారాయణ రెడ్డి లపై వెలువరించిన వ్యాస పరంపర చెప్పుకోదగ్గది.

ఆధునిక కవిత్వంపైనే కాకుండా భావ కవిత్వంపై కూడా ఆయన సాధికారత మనకి కనిపిస్తుంది. కృష్ణశాస్త్రి మీదా, చలం మీదా ఆయన తులనాత్మక పరిశీలనల్లో ఇది చాలా విస్పష్టంగా గోచరిస్తుంది.

‘మాజీ కవి సోమసుందరం పీఠికల పింఛన్ తో చేస్తున్నారు కాలక్షేపం’ అని శ్రీరమణ పంచ్ విసరడానికి కారణం 70ల దశకంలో సోసు ఇస్మాయిల్, శ్రీమన్నారాయణ, దిలావర్, ప్రత్యూష, లక్ష్మీపతిల పుస్తకాలకి రాసిన విపుల పీఠికలే.

విస్తృతంగా పర్యటించి తెలుగు పలుకుబడి వున్న (ఇంగ్లండ్ తో సహా) అన్ని ప్రాంతాల్లోనూ మిత్రుల్ని పెంపొందించుకున్నారు. సిద్ధాంత విభేదాలు పక్కనపెట్టి స్నేహాన్ని కాపడుకోవడం ఎవరైనా ఆయన దగ్గర నేర్చుకోవలసిందే. దిగంబరులతోను, విరసం కవులతోనూ, ఆయన ఉత్తరప్రత్యుత్తరాలే దీనికి సాక్ష్యం.

ఆయన ముట్టని సాహితీ ప్రక్రియ లేదు: కవిత్వం, గేయాలు, కథ, సాహితీవిమర్శ, నాటకం, అనువాదం, బాల సాహిత్యం, రేడియో నాటిక, ఇంకా నవలలు. ఇంతవరకూ ప్రచురించిన నూటముప్ఫయి పుస్తకాలే కాకుండా, అప్రచురితంగా వున్న వేలసంఖ్యలో వ్యాసాలూ, సాహిత్యకారులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలూ ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రకి దర్పణాలై ఆయన సాహితీ స్వరూపాన్ని నిరూపిస్తాయి.

నావరకూ నాకు, 15 ఏళ్ల కుర్రవాడిగా మా ఇంటి దగ్గరలొ ఉన్న కవిని కలుసుకోవడం కాకతాళీయమే గానీ, ఆయన అంతేవాసిత్వంలో, పరిచయమైన ప్రాపంచిక దృక్పథమూ, సాహిత్య సుగంధమూ, వివేచనా, వివేకమూ నా జీవితాన్ని మలిచేయి. ప్రేమైక మూర్తిగా, ఆచార్యుడిగా, తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకొన్న నా చేతుల్లా, కావ్యాత్మని విశదంచేసిన అలంకార విశారదుడిగా, పిల్లల్ని అక్కున చేర్చుకొన్న అమ్మమ్మలా, మాతృమూర్తిలా, అనవరతం మంచికోరే సోసు నేర్పిన ఒకేఒక పాఠం ‘నువ్వు నీలా జీవించు.’

సోసు జీవితాన్ని పండగచేసుకొన్న కవి. తన సాహిత్యమే తన జీవితమైన మనీషి. అన్య వ్యాపకాలేమీ లేకుండా పూర్తికాలం సాహిత్య సేవకుడైన సోసు ఋషి వలే, నిత్య సరస్వతీ ధ్యానమగ్నుడై, అక్షరసింధువై ఆదర్శప్రాయుడై చిరంజీవిగా మిగిలేరు.
----------------------------------------------------------
రచన: ఇంద్రప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

No comments: