విషమవృత్తము ఉద్గతలో తాళవృత్తపు మూసలు
సాహితీమిత్రులారా!
పరిచయము
తెలుగు ఛందస్సులో ఛందోబంధములు మూడు విధములు, అవి వృత్తములు, జాతులు, ఉపజాతులు. వృత్తములు సంస్కృత ఛందస్సునుండి సంక్రమించినవి. జాతులు, ఉపజాతులు దేశి ఛందస్సులోనివి. కందము, రగడలు, ఉత్సాహ, అక్కరలు జాతులు. మొదటి రెండు మాత్రాగణములపైన ఆధారపడినవి. తఱువాతి రెండు ఉపగణములైన సూర్యేంద్రచంద్ర గణములపైన ఆధారపడినవి. సీసము, ఆటవెలఁది, తేటగీతి ఉపజాతులు. ఇవి సుర్యేంద్ర గణభరితము. వృత్తములకు, జాతులకు ప్రాస నియతము, ఉపజాతులకు ప్రాస ఐచ్ఛికము. సంస్కృతములో కావ్యములలో వాడబడు లౌకిక ఛందస్సు రెండు విధములు, అవి వృత్తములు, జాతులు. స్రగ్ధర, శార్దూలవిక్రీడితాదులు వృత్తములు; ఆర్యా భేదములు, వైతాళీయాదులు జాతులు. సంస్కృతములో ద్వితీయాక్షర ప్రాస లేదు. సామాన్యముగా విరామయతిని పాటిస్తారు. వృత్తములు పాదములయందలి అక్షర సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది. సంస్కృతములో (తెలుగులో కూడ) వృత్తముల పాదమునందలి అక్షరముల సంఖ్య 26కు పరిమితము. సంస్కృత వృత్తములు మూడు తరగతులకు చెందినవి. అవి – సమ, అర్ధసమ, విష(స)మ వృత్తములు. సమ వృత్తములలో అక్షర సంఖ్యలో, గణముల అమరికలో అన్ని పాదములు ఒకే విధముగా ఉంటాయి. అర్ధసమ వృత్తములలో బేసి పాదములు ఒక అమరికతో, సరి పాదములు వేఱొక అమరికతో ఉంటాయి. అరుదుగా పూర్వార్ధమును (మొదటి రెండు పాదములను) ఒక అమరికతో, ఉత్తరార్ధమును (చివరి రెండు పాదములను) మఱొక అమరికతో కూడ వ్రాస్తారు. అన్ని పాదములలో అక్షర సంఖ్య ఒకటే అయినప్పుడు దానిని స్వస్థానార్ధసమ వృత్తమనియు, అక్షర సంఖ్య వేఱైనప్పుడు దానిని పరస్థానార్ధసమ వృత్తమనియు పిలుచుట వాడుక. విసమ లేక విషమ వృత్తములలో మూడు పాదములు ఒక విధముగా, ఒక పాదము వేఱొక విధముగా లేకపోతే అన్ని పాదములు వేఱువేఱు విధములుగా ఉంటాయి. అన్ని పాదములు ఒకే ఛందమునకు చెంది ఉంటే (అనగా అక్షర సంఖ్య ఒకటే అయినప్పుడు) అది స్వస్థాన విషమవృత్తము అవుతుంది. అక్షర సంఖ్య భిన్నమయినప్పుడు అది పరస్థాన విషమ వృత్తము అవుతుంది. పాదములు అన్నిటిలో అక్షర సంఖ్య వేఱైనప్పుడు దానిని సర్వ పరస్థాన విషమ వృత్తము అంటారు. అర్ధసమ వృత్తములు, విషమ వృత్తములు మాత్రమే కాక సంస్కృతములో ఉపజాతులు కూడ ఉన్నాయి. రెండు ఛందస్సుల పాదములను కలిపి 14 విధములుగా వ్రాయ వీలగును. వీటిని ఉపజాతులు అంటారు. ఆ 14లో రెండు అర్ధసమ వృత్తములు అవుతాయి. మిగిలినవి ఉపజాతులు. ఇంద్రవజ్ర-ఉపేంద్రవజ్రలతో, వంశస్థ-ఇంద్రవంశలతో, శాలిని-వాతోర్ములతో ఉపజాతులను వ్రాసియున్నారు సంస్కృత కవులు. విషమ వృత్తములలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది ఉద్గత(తా). ఇది మాత్రమే సంస్కృత కవులచే ఎక్కువగా వాడబడినది. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము విషమ వృత్తమైన ఉద్గతా(త) వృత్తమును వివరించి అందులో దాగియున్న తాళవృత్తముల మూసలను కూలంకషముగా చర్చించుటయే. ఈ ఉద్గతా వృత్తములో దాగియున్న తాళవృత్తముల మూసలను రెండింటిని నేను కనుగొన్నాను. వాటిని విపులముగా చర్చిస్తాను.
విషమ వృత్తము ఉద్గతా(త)
ఉద్గతా వృత్తపు లక్షణములు పింగళ ఛందస్సులో క్రింది విధముగా చెప్పబడినది-
ఉద్గతామేకతః స్జౌ స్లౌ, న్సౌ జ్గౌ, భ్నౌ జ్లౌ గ్, స్జౌ స్జౌ గ్ – పింగళ ఛందస్సు 5.25
మొదటి పాదము – స/జ/స/ల – 10 అక్షరములు
రెండవ పాదము – న/స/జ/గ – 10 అక్షరములు
మూడవ పాదము – భ/న/జ/లగ – 11 అక్షరములు
నాలుగవ పాదము – స/జ/స/జ/గ – 13 అక్షరములు
నాట్యశాస్త్రములో కూడ ఇట్టి లక్షణములే చెప్పబడినవి-
స్జౌ స్లౌ చాదౌ యథా న్సౌ జ్గౌ భ్నౌ జ్లౌ గశ్చ తథా పునః
స్జౌ స్జౌ గశ్చ త్రికా హ్యేతే ఉద్గతాయా ప్రకీర్తితాః – నాట్యశాస్త్రము 15.188
బహుశా ఈ శ్లోకము భరతముని తఱువాతికాలములో చేర్చబడినదేమో? ఎందుకంటే నాట్యశాస్త్రములోని ఛందోలక్షణములలో త్రిక గణములు పేర్కొనబడవు. ఉద్గతకు నాట్యశాస్త్రములోని లక్ష్యము-
తవరోమరాజిరతిభాతి / సుతను మదనస్య మంజరీమ్
నాభికమల వివరోత్పతిత / భ్రమరావలీవ కుసుమాత్ సముద్గతా – నాట్యశాస్త్రము 15.189
(సుందరీ, నీ నాభికమలము చుట్టు ఉండే రోమములు కుసుమములనుండి బయలువెడలిన భ్రమరసమూహమువలె నున్నవి. అది పూవిలుకాని పూలను తలదన్నుచున్నాయి.)
కావ్యములనుండి ఉద్గతకు ఉదాహరణములు
విషమ వృత్తములలో ఉద్గతా వృత్తము మాత్రమే మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. దీనిని చాలమంది కవులు వాడినారు. వరాహమిహిరుడు బృహత్సంహితలో గ్రహగోచరాధ్యాయములో మిగిలిన ఛందస్సులతోబాటు దీనిని కూడ వాడినాడు. ఆ పద్యము-
శమయోద్గతా మశుభదృష్టి / మపి విబుధవిప్రపూజయా
శాంతిజపనియమదానదమైః / సుజనాభిభాషణ సమాగమైస్తథా – బృహత్సంహితా 104.48
(గ్రహముల దుష్టప్రభావములు శమించుటకై దైవమును, బ్రాహ్మణులను శాంతికొఱకు, మంత్రజపములను, నియమానుష్ఠానముతో, దానముతో, ఆత్మనిగ్రహముతో, సుజనులతో చేరి సంభాషించి పూజలను చేయవలయును.)
సంస్కృత కావ్యములలో ఒక సర్గను (ఆశ్వాసమును) ఒకే ఛందస్సులో వ్రాయుట పరిపాటి. విషమ వృత్తమైన ఉద్గతతో కూడ కొందఱు కవులు సర్గలను నింపినారు. అశ్వఘోషుడు, ధనంజయుడు, పద్మగుప్తుడు, భారవి, మన్ఖుడు, మాఘుడు, వీరనంది మున్నగు కవులు అట్టివారు. క్రింద అశ్వఘోషుని సౌందరనందము (41 పద్యాలు), భారవి కిరాతార్జునీయము (54), మాఘుని శిశుపాలవధ (128) నుండి ఉదాహరణములు:
అవగమ్య తం చ కృతకార్య / మమృతమనసో దివౌకసః
హర్షమతులమగమన్ముదితా / విముఖౌ తు మారపరిషత్ ప్రచుక్షుభే – సౌందరనందము 3.08
(అతని కార్యసిద్ధిని చూచి అమృతమును కాంక్షించువారైన దేవతలు సంతోషముతో ఉప్పొంగిపోయారు. కాని మారుని అనుచరులు క్రుంగిపోయారు.)
అథ వాసవస్య వచనేన / రుచిరవదనస్త్రిలోచనమ్
క్లాంతిరహితమభిరాధయితుం / విధివత్ తపాంసి విదధే ధనంజయః – కిరాతార్జునీయము 12.01
(ఇంద్రుని నిష్క్రమణము పిదప అతని సాక్షాత్కారమువలన సంతోషముతో ఆ ఉపదేశమును యథాతథముగా స్వీకరించి శివునిగూర్చి నియమానుసారము తపస్సు చేయుటకు అర్జునుడు సన్నద్ధుడయ్యెను.)
ఈ పద్యమును జా(జ)నాశ్రయి కర్త పేర్కొన్నాడు. అనగా భారవి అంతకన్న ముందువాడని, ఐహొళె శాసనములను రచించిన రవికీర్తి (ఇతడే మొట్టమొదటి మత్తేభవిక్రీడితమును రచించెను) సమకాలికుడని భావన.
అథ తత్ర పాండుతనయేన / సదసి విహితం మురద్విషః
మానమహత న చేదిపతిః / పరవృద్ధిమత్సరి మనోహి మానినామ్ – శిశుపాలవధ 15.01
(పాండుతనయుడు శ్రీకృష్ణునికి చూపిన మర్యాద, గౌరవము వీటిని చూచిన చేదిరాజు అసూయతో మనసులో మండిపడ్డాడు.)
తెలుగులో ఉద్గత
తెలుగులో ఈ విషమ వృత్తమునకు లక్షణములు సంస్కృతములోలా లేవు. రేచన కవిజనాశ్రయము, అనంతుని ఛందోదర్పణము, విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి: వీటిలో ఈ వృత్తమునకు లక్షణ లక్ష్యములు లేవు. చిత్రకవి పెద్దన లక్షణసారసంగ్రహములో చెప్పబడిన ఉద్గత వృత్తము ఈ విధముగా నున్నది – స/జ/జ (1వ పాదము), న/స/జ/గ (2వ పాదము), భ/న/జ/లగ (3వ పాదము), స/జ/స/జ/గ (4వ పాదము). మొదటి పాదపు లక్షణము సంస్కృతములోని ఉద్గతకు సరిపోదు (స/జ/స/ల). అప్పకవి చెప్పిన ఉద్ధతమునకు (ఇది పూర్వ ముద్రణములో ఉద్గతమట) గణములు – స/జ/య (1), న/స/జ/గ (2), భ/న/జ/గ (3), స/జ/స/స (4). ఈ అమరికలో ఒక్క రెండవ పాదము మాత్రమే సంస్కృత ఉద్గత లక్షణములతో సరిపోతుంది. పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలోని ఉద్గత చిత్రకవి పెద్దన చెప్పిన లక్షణములతో ఏకీభవిస్తుంది. బుఱ్ఱా కమలాదేవి ఛందోహంసిలోని ఉద్గత అప్పకవి లక్షణములతో సరిపోతుంది. ఉద్గతా వృత్తమును తెలుగు కవులు వాడినట్లు లేదు. కాని కన్నడములోని నాగవర్మ ఛందోంబుధిలో ఉద్గతకు సంస్కృతములో చెప్పబడినట్లే లక్షణ లక్ష్య పద్యము ఉన్నది. కావున నేను కావ్యములలో కనిపించే సంస్కృత లక్షణములనే అంగీకరిస్తున్నాను.
ఉద్గతయందలి పాదములకు లక్షణ లక్ష్యములు
ఉద్గత వృత్తమును పరిశిలిస్తే అందులో నాలుగవ పాదపు లక్షణములు మాత్రమే మనకు తెలిసిన వృత్తములలో నున్నవి. అది పాదమునకు 13 అక్షరములు ఉండే అతిజగతి ఛందములోని 2976వ వృత్తము. దీనికి ఎన్నో పేరులు ఉన్నాయి. అవి: మంజుభాషిణీ, కనకప్రభా, నందినీ, జయా, ప్రబోధితా, మనోవతి, విలంబితా, సునందినీ, సుమంగలీ. సంస్కృతములో దీనికి యతి లేదు. తెలుగులో తొమ్మిదవ అక్షరమును యతి స్థానముగా నిర్ణయించినారు. నాకేమో ఏడవ అక్షరము యతి స్థానముగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు పాదము IIUIUI – IIUIUI Uగా విఱుగుతుంది. శ్రీవేంకటేశ్వర సుప్రభాతములోని క్రింది పద్యము ఈ వృత్తమే.
తవసుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖచంద్రమండలే
విధిశంకరేంద్ర వనితాభి రర్చితే
వృషశైలనాథ దయితే దయానిధే
క్రింద నా ఉదాహరణములు:
మంజుభాషిణీ – స/జ/స/జ/గ 13 అతిజగతి 2796
IIUIUI – IIUIUIU (7వ అక్షరము యతిగా)
సురలోక మేల – స్ఫురదిందురూపిణీ
స్వరరాశి నీవు – వరమంజుభాషిణీ
అరుదెంచు వేగ – మరవిందలోచనీ
వర మిమ్ము నాకు – భవపాపమోచనీ
IIUIUIII – UIUIU (9వ అక్షరము యతిగా)
కనకప్రభామయము – కాంతు లెల్లెడన్
కనకాంగి యందమును – గాంచు టందమే
ప్రణయాంబురాశి సుధ – ప్రాణ మివ్వఁగా
మనమిందుఁ గోరె నిను – మానినీమణీ
ఉద్గతలోని మొదటి మూడు పాదముల లక్షణములతో ఏ వృత్తములు లేవు. వాటికి నా కల్పనలను క్రింద వివరిస్తున్నాను.
ఉద్గతలోని మొదటి పాదము-
సొంపు – స/జ/స/ల IIUI – UI – IIUI
10 పంక్తి 748
ఎదలోన – నింత – ముదమేల
వదనాన – వాంఛ – వ్యధలేల
పదమొండు – పాడు – మది చాలు
సుధ పారు – సొంపు – నదిగాను
ఉద్గతలోని రెండవ పాదము-
ఇంద్రచాపము – న/స/జ/గ IIIII – UI UIU
10 పంక్తి 352
ఇనకులపు – టింద్రచాపమా
జనకజకుఁ – జారుదీపమా
కనుగవకుఁ – గామరూపమా
మనసునకు – మార్గబంధువా
ఉద్గతలోని మూడవ పాదము-
చిఱుదీవియ – భ/న/జ/లగ – UIIII – II – UIIU
11 త్రిష్టుప్పు 895
నావలపుకు – నవ – రావములా
రావములకు – రస – భావములా
భావములకుఁ – బలు – జీవములా
జీవములనఁ – జిఱు – దీవియలా
ఉద్గతలోని ఈ నాలుగు పాదములతో ఒక ఉదాహరణము:
సొంపు – IIUI – UI – IIUI – పాదము 1
ఇంద్రచాపము – IIIII – UI UIU – పాదము 2
చిఱు దీవియ – UIIII – II – UIIU – పాదము 3
మంజుభాషిణీ – IIUIUI – IIUIUIU – పాదము 4
దినమెల్లఁ – దృష్ణ – నిను జూడఁ
గనుము నను – గామవల్లభా
వేణు రవము – వినఁ – దేనియలే
నను ముంచివేసె – నగుమోముఁ జూపరా
ఉద్గతలోని తాళవృత్తపు మూసలు
ఉద్గత లక్షణములను చెప్పేటప్పుడు వాడిన పింగళసూత్రము–ఉద్గతామేకతః స్జౌ స్లౌ, న్సౌ జ్గౌ, భ్నౌ జ్లౌ గ్, స్జౌ స్జౌ గ్. ఇందులో ముఖ్యమైనది ఉద్గతామేకతః. అందువలన రెండు పాదములను విరామము లేకుండ చదువవలెను. అప్పుడు లయాన్వితములైన క్రింది మూసలు మనకు లభ్యమవుతాయి. మధ్యలో ఉండే ఈ (/) గుర్తు పాదముల విఱుపును సూచిస్తుంది.
[IIUIUI] [IIUI / III] [IIUIUI] [U]
[UIIIIII] [UIIU / II] [UIUIII] [UIUIU]
మొదటి రెండు పాదముల విఱుపు [5,3] [5,3] [5,3] [2] మాత్రలుగా ఉంటుంది. మూడవ, నాలుగవ పాదముల విఱుపు [8] [4,4] [5,3] [5,3]. ఈ విఱుపుతో పదములను ఎన్నుకొని వ్రాస్తే గానయోగ్యముగా నుంటుంది. క్రింద అట్టి ఉద్గతకు రెండు ఉదాహరణములు-
హరి వేగుచుంటి హరుసానఁ
ద్వరగఁ పరుగెత్తి రమ్మురా
భార మిది బ్రదుకు యూరట నీ-
యర నీరజాక్ష నను జేర రమ్మురా
లలితమ్ము నవ్వు లలితమ్ము
చెలువు లలితమ్ము లాస్యముల్
బాలగిరిధరుని లీలల కం-
పిలి వ్రాలిపోదునిఁక మేలమాడుచున్
పై పద్యములను పైన చూపిన మాత్రలమూసలవలె వ్రాద్దామా?
హరి వేగుచుంటి – హరుసానఁ ద్వరగఁ – బరుగెత్తి రమ్మురా
భార మిది బ్రదుకు – యూరట నీయర – నీరజాక్ష నను – జేర రమ్మురా
లలితమ్ము నవ్వు – లలితమ్ము చెలువు – లలితమ్ము లాస్యముల్
బాలగిరిధరుని – లీలల కంపిలి – వ్రాలిపోదునిఁక – మేలమాడుచున్
పై రెండు పద్యములలో చతుష్పదియందలి ద్వితీయాక్షర ప్రాసతోబాటు ప్రాసయతి కూడ ఉపయోగించబడినది. ఇప్పుడు వీటిని చక్కగా పాడుకొన వీలగును. ఉద్గతామేకతః అనే దానికి అర్థము నా ఉద్దేశములో ఇది. అనగా ఈ విషమ వృత్తము ఉద్గత అష్టమాత్రాయుక్తమై గేయమువలె పాడుకొనదగినదని నా ఉద్దేశము. నాట్యశాస్త్రములోని ఉదాహరణపు పదాల విఱుపు మొదటి రెండు పాదాలకు సరిపోతుంది. కాని చివరి పాదములలో సరిగా అతకలేదు.
ఉద్గత మొదటి రెండు పాదములతో ‘సరసాల మేడ’ అను ఒక వృత్తమును కల్పించినాను. ఈ ఉదాహరణములను గమనిస్తే అది ఎంత లయబద్ధముగా నున్నదో అనే విషయమును గమనించగలరు.
సరసాల మేడ: స/జ/స/న/న/ర/లగ IIUIUI – IIUIIII – IIUIUI U
20 కృతి 360172
మనసేల నిన్ను – మఱి నేఁడు తలఁచె – మధురానుభూతితో
ప్రణయమ్ము నిండు – పదమొండు వినఁగ – వడి లేచు నాశతో
తనువెల్ల నీదు – తపనాగ్ని ఛటలు – దహియించుచుండెనే
కనరమ్ము రమ్య – కలహంస నటన – కనిపించ వేగమే
ప్రాసయతితో-
సరసాల మేడఁ – దరుణేందురుచులు – కురిపించు కాంతిలో
హరుసాల రేయి – విరజాజి విరులు – హరిచందనమ్ముతో
చిఱుగాలి వీచఁ – జిఱునవ్వు లలర – మురిపించ నో చెలీ
దరి రమ్ము పొంద – సురసీమ సుగము – నిరతమ్ము నిండుగా
ఉద్గత వృత్తపు మూడవ నాలుగవ పాదముల అమరికయే ‘నర్మిలి’ అనే ఈ తాళ వృత్తము. దీనిని కూడ చక్కగా పాడుకొన వీలగును.
నర్మిలి: భ/న/జ/జ/జ/భ/జ/ర UII IIII – UII UII – UIUIII – UIUIU
24 సంకృతి 5725055
నవ్వుల కిలకిల – నర్మిలి నాదము – నన్ను నీదరికి – నాతి పిల్వఁగా
గువ్వల గుసగుస – కొమ్మల సవ్వడి – కోమలీ వినుము – కూర్మి నిండఁగాఁ
బువ్వుల మిసమిస – మోదపు గుర్తులు – పుష్పబాణుఁడటఁ – బొంచి చూచెనా
మువ్వల గలగల – ముంచెను నన్నిట – మోహసింధు వది – పొంగి లేచెనా
ప్రాసయతితో-
మల్లెల సరములు – తెల్లని కాన్కలు – ఫుల్లమై హృదియుఁ – బల్లవించఁగాఁ
ద్రుళ్లుచు లేచెను – వెల్లువ సంతస – ముల్లసిల్లె మది – మెల్లమెల్లఁగాఁ
జల్లని రేతిరి – జిల్లున గాలియుఁ – వెల్లఁగా నెలయు – జల్లెఁ గప్పురం
బెల్లెడ నిండెను – బెల్లున గందము – వల్లకీక్వణము – లల్ల రాగముల్
నర్మిలి వృత్తము చివర ఒక గురువు అదనముగా చేర్చి జాతి పద్యముగా వ్రాస్తే అది పాడుకొనుటకు ఇంకా బాగుంటుంది. అట్టి జాతి పద్యమే కాకలీరవము. దీనినే పట్వర్ధన్ చంద్రకాంత అని పిలిచెను. క్రింద కాకలీరవమునకు ఉదాహరణములు –
కాకలీరవము: 8 – 8 – 8/4 మాత్రలు
అక్షరసామ్య యతితో-
ప్రేమకావ్యమున – ప్రీతి దీపమున – వెలుఁగు కాంతులో నీవు
శ్యామలాభ్రమున – జలధరమ్ములోఁ – జపల చాపమో నీవు
కామసఖములోఁ – గాకలీరవపు – కలకలధ్వనులొ నీవు
శ్యామసుందరా – సరసమందిరా – స్వామి నీవె నా తావు
ప్రాసయతితో-
బాల సుకుమార – వ్రేల నగమెత్తు – నీలవపు నందబాలా
లీలలంచుఁ బలు – బాలలకు వ్యధలఁ – జాల కలిగింతు వేలా
పూలతో నొక్క – డోలలో నిన్ను – దేలఁగా నూఁచి కననా
పాలతోఁ బాత్రఁ – గేల నందించి – నీలిరాగమ్ముఁ గొననా
నర్మిలి వృత్తమువలె నాలుగు అష్టమాత్రలతో ఒక జాతి పద్యమును మరాఠీ లాక్షణికుడు మాధవ్ పట్వర్ధన్ తన ఛందోరచనా అనే గ్రంథములో పేర్కొన్నారు. దాని పేరు వనహరిణీ. వనహరిణికి ఉదాహరణములు –
వనహరిణీ: 8 – 8 – 8 – 8 మాత్రలు
అక్షరసామ్య యతితో-
వద్దు సునయనా – వనహరిణీ యుప-వనమున వేగమె – పారిపోకుమా
ముద్దాడ రమ్ము – మోహనమ్ముగాఁ – బులకింతు నేను – ముదము పొంగఁగా
సద్దు సేయనే – సరసర వెళ్లకు – చారు నేత్రముల – సాహినమా నా
యొద్దకు రావే – యుల్లమ్ము నిండ – నొక తృణము నిత్తు – నోకురంగమా
ప్రాసయతితో-
చందన చర్చిత – సుందర దేహా – విందు లీయు మా-నంద మురళితో
చందురుఁ డాకస-మందుఁ బర్వులిడ – నిందు కిరణ మతి – సుందరతరమే
స్యందన మెక్కి సు-గంధమయమ్మగు – గంధమాదనము – నందుకొనఁగ రా
పందిరి నింగియు – వందల తారలు – చిందిడ వెల్గులు – సింధువయ్యెఁగా
సౌరభక, లలిత వృత్తములు
విషమ వృత్తము ఉద్గతలోని మూడవ పాదమును మార్చగా లభించిన రెండు విషమ వృత్తములు సౌరభకము, లలిత.
UIII III UIIU – ఉద్గత మూడవ పాదము
UIU- III UIIU – సౌరభక మూడవ పాదము
IIIII III UIIU – లలిత మూడవ పాదము
సౌరభకము
పాదము 1 – స/జ/స/ల IIUIUI IIUI
పాదము 2 – న/స/జ/గ III IIUIUI U
పాదము 3 – ర/న/భ/గ UIUIII UIIU
పాదము 4 – స/జ/స/జ/గ II UIUIII UIUIU
వరవీణ మీట నరుదైన
స్వరము లరుసమ్ము నీయఁగా
వారిజాతముల సౌరభసుం-
దర సార వాహినిని రా రమించఁగా
లయబద్ధముగా సౌరభక వృత్తము-
వరవీణ మీట
నరుదైన స్వరము
లరుసమ్ము నీయఁగా
వారిజాతముల
సౌరభసుందర
సార వాహినిని
రా రమించఁగా
లలిత
పాదము 1 – స/జ/స/ల IIUIUI IIUI
పాదము 2 – న/స/జ/గ III IIUIUI U
పాదము 3 – న/న/స/స IIIIIIII UIIU
పాదము 4 – స/జ/స/జ/గ II UIUIII UIUIU
మనసెందు కిందు నిను జూతు
ననెను నునుసందె వేళలో
నినుఁ డరుణ కళిక యింపులతోఁ
గన నీయ మోదమును హృద్యమై సఖీ
లయబద్ధముగా లలిత వృత్తము-
మనసెందు కిందు
నిను జూతు ననెను
నునుసందె వేళలో
నినుఁ డరుణ కళిక
యింపులతోఁ గన
నీయ మోదమును
హృద్యమై సఖీ
పాటలలో ఉదాహరణములు
సుప్రసిద్ధ కన్నడ కవి ద.రా. బేంద్రే వ్రాసిన గంగావతరణములో పైన పేర్కొన్న జాతిపద్యమైన కాకలీరవపు చాయలు ఉన్నాయి. ఉదా.
సుర స్వప్నవిద్ద / ప్రతిబింబ బిద్ద / ఉద్బుద్ధ శుద్ధ / నీరె
ఎచ్చెత్తు ఎద్ద / ఆకాశదుద్ద / ధరెగిళియలిద్ద / ధీరె
సిరివారిజాత / వరపారిజాత / తారా౽ కుసుమ / దిందె
వృందారవంద్యె / మందారగంధె / నీనే౽ తాయి / తందె
త్యాగరాజకీర్తన ఏలా నీ దయ రాదు… లోని బాల కనకమయ… అనుపల్లవి అష్టమాత్రలతో నిండియున్నది.
బాల కనకమయ / చేల సుజన పరి- /
పాల శ్రీరమా / లోల విధృత శర- /
జాల శుభద కరు- / ణాలవాల ఘన /
నీల నవ్య వన / మాలికాభరణ
ముగింపు
‘రోజూ పూచే రోజాపూలు ఒలికించినవి నవరాగములు’ అన్నట్లు తరచి చూస్తే ఛందస్సులో ఎన్నో అందాలు దాగి ఉన్నాయి. ప్రతి ఉదయము ‘తెలియని ఆనందం’ కలుగుతూ ఉంటుంది. మఱికొన్ని ఉద్గతా వృత్తములు:
వనజాక్షి వాణి – గన రమ్ము / మనవి – విన రమ్ము వేగమే
కాన నొక కవిత – గానమె సు/స్వన – వీణ సేయు సడి – తేనెసోనలే!
నడిరేయి వేళ – విడి దార / వెడలె – నొడయండు భూమిపై
గోడునఁ గుములుచు – వాడుచు వే/డెడు – మ్రోడు జీవముల – జూడ స్వీయమై
వనసీమలందుఁ – గనఁ బచ్చ/దనము – నను విస్మరించితిన్
గానఁగను నవియు – దానము సే/యును – బ్రాణవాయువును – బ్రాణికోటికిన్
గగనంపు నీడ – జగమెల్ల / జిగియె – పొగమంచు చాటులో
రాగముల రవియు – సాఁగె స్థిర/మ్ముగఁ – దోఁగుచీఁకటిని – వేగఁ జీల్చఁగా
మధురమ్ము మోము – మధురమ్ము / పెదవి – మధురమ్ము సర్వమే
మాధురుల జగము – మాధవుఁడే / మధు-రాధరాల సుధ – మోదమే సదా
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment