ఆషాఢస్య ప్రథమ దివసే
సాహితీమిత్రులారా!
పరిచయము
ఆకాశము దట్టంగా కారు మబ్బులతో నిండి, ఉన్నట్లుండి కర్ణభేరి బద్దలయేట్టుగా ఉరుముల మ్రోతలు వెనుకంటి వస్తుంటే మెరుపుతీగలు మిరుమిట్లు గొలుపుతూ ఒక వైపునుండి మరోవైపుకు ప్రాకుతున్నప్పుడు, జడివాన మొదటి చినుకులు నేలపై పడి మట్టివాసనను రేపినప్పుడు నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చే పంక్తి మేఘదూతము లోని ‘ఆషాఢస్య ప్రథమ దివసే’. మహాకవి కాళిదాసు (నా ఉద్దేశములో అతడిని కాలిదాసు అని పిలవాలి, ఎందుకంటే అతడు కాలి అంటే శివుని భక్తుడు, కాళికాదేవి భక్తుడయితే అతని పేరు కాళీదాసుగా ఉండి ఉండేది) సంస్కృతములో మేఘదూతమును ఒక ఖండకావ్యముగా వ్రాసినాడు. వర్షము పడుతున్నప్పుడు తనకు ప్రియమైన వ్యక్తి తోడు లేక విరహపు వ్యధ బాధిస్తున్నప్పుడు జ్ఞాపకము వచ్చేది మేఘదూతమే. ఇందులోని పద్యాలు సుమారు 110కి పైగా పూర్వమేఘము, ఉత్తరమేఘము అనే భాగాలలో ఉన్నాయి. కాళిదాసు అన్ని పద్యాలను మందాక్రాంత వృత్తములో వ్రాసినాడు.
మందాక్రాంత వృత్తములో ప్రతి పాదానికి 17 అక్షరాలు ఉంటాయి, దాని గణములు – మ భ న త త గగ. పాదమును మూడు భాగాలుగా విడదీయవచ్చును – UUUU – IIIIIU – UIUUIUU. సంస్కృతములో పదాలను వాడేటప్పుడు, పదాలను పై విధముగానే అమర్చాలి. నాలుగవ అక్షరము, ఐదవ అక్షరము, అదే విధముగా పదవ అక్షరము, పదకొండవ అక్షరము సంధి ద్వారా తప్ప మరే విధముగా కలుపబడవు. పాదాంతములో తప్పని సరి యతి ఉంటుంది. తెలుగు భాషలో ఈ నియమాలు లేవు. మందాక్రాంతానికి తెలుగులో ఒక యతి మాత్రమే నియమం. తెలుగు మందాక్రాంత పద్య పాదములో మొదటి అక్షరానికి, పదకొండవ అక్షరానికి అక్షరమైత్రి ఉండాలి, దీనినే వడి అంటారు. మనకందరికీ తెలిసిన ఒక మందాక్రాంత వృత్తము విష్ణుసహస్రనామము లోని క్రింది పద్యము:
శాంతాకారం – భుజగశయనం – పద్మనాభం సురేశం
విశ్వాధారం – గగనసదృశం – మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం – కమలనయనం – యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం – భవభయహరం – సర్వలోకైకనాథం
ప్రయాగ ప్రశస్తి
ఈ మందాక్రాంతవృత్తము కాళిదాసుకు సుపరిచితమే. కాళిదాసు రెండవ చంద్రగుప్తుని కాలములో నివసించాడు, అతని ఆస్థానకవి. ఈ చంద్రగుప్తుని తండ్రి సముద్రగుప్తుడు (క్రీ. శ. 335-380). సముద్రగుప్తుని ఆస్థానకవి హరిసేనుడు. గుప్తయుగములో సామ్రాజ్యాన్ని విస్తరించినది సముద్రగుప్త చక్రవర్తి. ఆ సామ్రాజ్యము కామరూపము నుండి యమున వరకు, హిమాలయము నుండి నర్మద వరకు ఉండినది. అది కాక దక్షిణ భారతదేశము లోని రాజులతోబాటు ఎందరో సామంతరాజులు ఉండేవారు. అతడి విజయాలను వర్ణిస్తూ ప్రయాగ (నేటి అలహాబాదు) దగ్గరి కౌశాంబిలో అశోకుని శాసనస్థంభముపై ఒక భాగములో ఈ హరిసేనకవిచే వ్రాయబడిన శాసనము ఒకటి ఉన్నది. దానిని ప్రయాగ ప్రశస్తి అంటారు. ఉత్తభారతమంతా దిగ్విజయయాత్రలో జయించి దక్షిణములో కంచివరకు వచ్చాడు సముద్రగుప్తుడు. కళింగ, విశాఖ, గోదావరి, పిఠాపురము మున్నగునవి కూడ ఈ శాసనములో ప్రత్యేకముగా పేర్కొనబడ్డాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, హరిసేనుడు వ్రాసిన ఆ ప్రయాగ ప్రశస్తిలో [1,2] ఒక మందాక్రాంత వృత్తము కూడ ఉన్నది. ఆ మందాక్రాంతవృత్తములో రెండు పంక్తులు మాత్రమే పూర్తిగా ఉన్నాయి. అవి:
సంగ్రామేషు – స్వభుజ విజితా – నిత్యముచ్చాపకారాః
తోషోత్తుంగే – స్ఫుట బహురస – స్నేహ ఫుల్లైర్మనోభిః
ఎవరు పరులకు అపకారము చేస్తారో వారిని తన భుజపరాక్రమముతో యుద్ధములో జయిస్తాడో / మనసులు ప్రస్ఫుటమైన బహురసములతో నిండి స్నేహముతో విరిసి చాల సంతోషముతో ఉంటుందో…
వియత్నాంలో మందాక్రాంతము
కాళిదాసు మేఘదూతాన్ని చర్చించడానికి ముందు మరో రెండు శాసనాలలోని మందాక్రాంత పద్యాలను తెలియబరుస్తాను. క్రీ. శ. నాలుగవ శతాబ్దానికే భారతదేశము నుండి నేటి ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి వలస వెళ్లి అక్కడి రాజులను జయించి హైందవ సిద్ధాంతాల పైన ఆధారపడిన సామ్రాజ్యాలనే నిర్మించారు కొందరు. నేటి వియత్నాం లోని మీసోన్ ప్రాంతము ఆనాడు చంపాదేశము అని పిలువబడేది. భద్రవర్మ మహారాజు (క్రీ. శ. 380-413) భద్రేశ్వరాలయము అనే ఒక శివుని గుడిని నిర్మించాడు. రెండు శతాబ్దాల తరువాత ఇది నిర్మూలించబడగా, శంభువర్మ (577-629) శంభు-భద్రేశ్వరాలయమని దీనిని పునర్నిర్మించాడు. నలభై యేళ్లకు ముందు జరిగిన వియత్నాం యుద్ధములో భద్రవర్మ కట్టిన కొన్ని గుడులు బాంబులు పడి ధ్వంసమయిన విషయము శోచనీయము. నేడు మీసోన్ ఒక world heritage site. ఈ శంభువర్మ శిలాశాసనాలలో[3] శివునిపైన ఒక మందాక్రాంత వృత్తము ఉన్నది. అది:
సృష్టం యేన – త్రితయ మఖిలం – భూర్భువస్స్వః స్వశక్త్యా
యేనోత్ఖాతం – భువనదురితం – వహ్నినేవాంధకారం
యస్యాచింత్యో – జగతి మహిమా – యస్య మాదిర్న చాంత
శ్చంపాదేశే – జనయతు సుఖం – శంభుభద్రేశ్వరోऽయం
ఎవడు భూర్భువస్సువర్లోకాలను సృష్టించాడో, ఎవడు వెలుగు చీకటిని తరిమివేసినట్లు సకలపాపాలను నిర్మూలిస్తాడో, ఎవడి మహిమలను ప్రపంచములో ఊహించుకోడానికి వీలుకాదో, ఆ శంభు-భద్రేశ్వరుడు చంపాదేశానికి సుఖములను ప్రసాదించుగాక!
క్రీ. శ. 653-687 మధ్యకాలములో విక్రాంతవర్మ చంపాదేశానికి రాజు. ఇతడు కూడ కొన్ని శాసనాలను మీసోన్‌లో చెక్కించాడు[3]. వాటినుండి ఒక మందాక్రాంతవృత్తమును క్రింద ఉదహరిస్తున్నాను:
యస్యాత్మానః – సకలమరుతాం – మానినాం మాననీయా
అష్టౌ పుణ్యా – వరహితకృతః – సర్వలోకాన్ వహంతి
అన్యోన్యస్య – స్వగుణవిధయా – గాఢసంబధ్యమానా
యోగ్యా యుగ్యా – ఇవ పథి పథి – స్యందనాన్ స్యందమానాన్
ఏ ఈశ్వరుని ఎనిమిది పుణ్యమూర్తులు మరుద్గణములచే నుతించబడుచున్నవో, ఏవి చక్కగా మంచి పనులచే ఎల్ల లోకములను భరించుచున్నవో, ఏవి తమలోతాము గాఢ సంబంధము గలిగి యున్నవో, ఏవి రథమును బాగుగా మార్గముపై నడిపించే గుఱ్ఱములవంటివో, ఆ ఈశ్వరుడు రక్ష నిచ్చుగాక!
మహాకవి కాళిదాసు నాలుగవ శతాబ్దపు అంత్యకాలములో జీవించాడు. ఇతడు పంచకావ్యాలలో రెండైన రఘువంశ కుమారసంభవములను, అత్యుత్తమ నాటకముగా పరిగణించబడే అభిజ్ఞానశాకుంతలముతోబాటు విక్రమోర్వశీయ మాళవికాగ్నిమిత్రములను, మేఘదూత ఋతుసంహార ఖండకావ్యములను రచించాడు. శృంగారతిలకము కాళిదాసు రచన అంటారు కొంతమంది. లాక్షణికగ్రంథమైన శ్రుతబోధ, దండకరాజమయిన శ్యామలాదండకము మాత్రము నిస్సందేహముగా ఇతని రచనలు కావు. మరే పుస్తకాన్ని వ్రాసినా, వ్రాయకపోయినా కాళిదాసు అద్వితీయ ప్రతిభకు ఒక్క మేఘదూతము చాలంటే అది అతిశయోక్తికాదు.
మేఘదూతము
మేఘదూతము ఒక ఖండకావ్యము. ఇందులో మనకు కనబడే సజీవమైన పాత్ర యక్షునిది మాత్రమే. కుబేరుని కొలువులో ఉండే ఈ యక్షుడు రాజకార్యము చేయడములో ఏకాగ్రత చూపకపోయిన కారణాన శాపగ్రస్తుడై ఒక యేడు తన భార్యకు దూరముగా రామగిరి ప్రాంతములో విరహవేదనతో తపిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయములో వర్షాకాలము ఆసన్నమయినది. గుంపులుగుంపులుగా కారు మేఘాలు గున్న ఏనుగులలా ఆకాశములో కనబడుతాయి. ఆ మేఘాన్ని చూచి నీవు నా దూతగా వెళ్లి అలకానగరములో ఉండే నా భార్యను కలిసి నా ప్రేమ సందేశాన్ని అందించమని ప్రాధేయపడుతాడు. అంతేగాక ఆ అలకానగరానికి ఎలా వెళ్ళాలో దారి కూడా చెప్తాడు. కాళిదాసు మేఘదూతములో సూచించిన స్థలములను ఆధారము చేసికొని జాఫర్ ఉల్లా గీసిన మేఘ మార్గాన్ని యిక్కడ చూడవచ్చును. క్లుప్తముగా యిది మేఘదూతపు కథ.
రఘువంశ రచయిత యయిన కాళిదాసుకు రామాయణ గాథ సుపరిచితమే. వర్షాకాలములో కిష్కింధలో రాముడు విరహబాధను అనుభవిస్తున్నాడు. అతడు లంకకు హనుమంతుని ద్వారా సీతకు సందేశాన్ని పంపిస్తాడు. రాముడికి బదులు యక్షుడు, లంకకు బదులు అలకాపురి, కిష్కింధకు బదులు రామగిరి, సీతకు బదులు యక్షిణి, హనుమంతుడికి బదులు మేఘము – ఇలా రామాయణానికి మేఘదూతానికి సాదృశ్యము ఉన్నది. గణితశాస్త్ర రీత్యా ఒకదానికి బదులు మరొకదానిని మనము ఉంచితే మనకు perfect isomorphism లభిస్తుంది. ఈ రామగిరి మధ్యప్రదేశములోని నేటి రాంటేక్ అంటారు. మహాభారతములోని నలోపాఖ్యానములో కూడ హంస ఒక దూత. నలునిచే పంపబడిన హంస తనకు “నలినసంభవు సాహిణములు వారువములు కులముసాములు మాకు కువలయాక్షి” అని దమయంతితో చెబుతుంది. దమయంతి హంసతో “అ నల సంబంధ వాంఛ నాకగున యేని అనల సంబంధ వాంఛ నాకగున చూవె” అంటుంది.
మేఘదూత కావ్య రచనకు కాళిదాసు ఎందుకు మందాక్రాంత వృత్తాన్ని ఎన్నుకొన్నాడు అనే ప్రశ్న మన కెదురవుతుంది. దుఃఖముతో బాధపడుతూ ఉండే మనిషి మాటలాడుతుంటే ఆ మాటలు ఆగి ఆగి ఆ వ్యక్తి నోటినుండి జారుతాయి, అవి విరామము లేకుండా ఏకధాటిన రావు. అంతే కాక మొదటి పదాలు దీర్ఘమైన అక్షరాలతో ఉంటాయి, ఉదా. అమ్మా, అబ్బా, అయ్యో, యిత్యాదులు. ఆ కాలములో సామాన్యముగా వాడబడిన పొడవైన వృత్తాలు శార్దూలవిక్రీడితము, స్రగ్ధర. శార్దూలవిక్రీడితపు పాదములోని విరుపు పన్నెండు అక్షరాల తరువాత వస్తుంది. కాబట్టి దీనికి ప్రయోజనము ఉందదు. స్రగ్ధరకు, మందాక్రాంతానికి ఉండే పోలికలను గురించి తరువాత చర్చిస్తాను. స్రగ్ధరలో పాదపు విరుపు ఏడక్షరాల తరువాత వస్తుంది. కాబట్టి యిది కూడ కాళిదాసుకు ప్రయోజనకారిగా కనబడలేదు.
కాళిదాసు తన భావాలను వెలిబుచ్చడానికి మందాక్రాంతమే సరియయిన వృత్తమని అనుకున్నట్టున్నాడు. అంతకుముండు ఈ వృత్తము రెండు మారులే వాడబడినది. పింగళఛందస్సులో ఇది సూత్రప్రాయముగా వివరించబడినది, నాట్యశాస్త్రములో దీనికి ఉదాహరణ శ్రీధరా అనే వృత్తరూపములో ఇవ్వబడినది. తరువాత హరిసేనకవి దీనిని ప్రయాగప్రశస్తిలో వాడాడు. ఈ హరిసేనుడు కాళిదాసుకు బహుశా గురుతుల్యుడై ఉండవచ్చును. ముఖ్యముగా మందాక్రాంతములోని విరుపులు తగిన మోతాదులో ఉన్నాయి తన కార్యానికి అనుకొన్నాడేమో కాళిదాసు. ఫలితము అంతవరకు ఛందఃశాస్త్రములో ఒక తాటాకుపైన మాత్రమే ఉన్న ఈ వృత్తానికి ఒక అజరామరమయిన ఖ్యాతి లభించినది. అంతేకాక కాళిదాసు మందాక్రాంతానికి మరో పేరుగా చలామణి అయ్యాడు. విప్రలంభ శృంగారాన్ని వర్ణించడానికి మందాక్రాంతము ఉచితమని కాళిదాసు అభిప్రాయపడ్డాడు.
అందుకే క్షేమేంద్రుడు సువృత్తతిలకములో[4] ఇలాగంటాడు:
సాక్షేప క్రోధ ధిక్కారే
పరం పృథ్వీ భరక్షమా
ప్రావృట్ ప్రవాసవ్యసనే
మందాక్రాంతా విరాజతే (3.21)
కోపాన్ని, ధిక్కారాన్ని సూచించడానికి పృథ్వీవృత్తము ఉచితమైనది, అది ఈ భారాన్ని మోయగలదు. వర్షాకాలములో ప్రవాసములో విరహానుభవాన్ని వివరించడానికి మందాక్రాంతము చక్కగా శోభిస్తుంది.
సువశా కాలిదాసస్య
మందాక్రాంతా ప్రవల్గతి
సదశ్వదమకస్యేవ
కాంభోజ తురగాంగనా (3.34)
కాళిదాసుకు బాగుగా వశమయిన మందాక్రాంతము మంచి గుఱ్ఱపురౌతుకు అధీనముగా ఉండే కాంభోజ దేశపు ఆడ గుఱ్ఱములా ప్రవర్తిస్తుంది.
మనకు సులభముగా అందుబాటులో ఉండే సందేశకావ్యములలో మేఘదూతము ఒకటి. సంస్కృత పద్యాల తెలుగు ప్రతి ఈమాటలో వున్నది. మూల సంస్కృతముతో విల్సన్ మహాశయుని ఆంగ్లానువాదమును ఇక్కడ చదువ వీలగును. మరొక ఆంగ్లానువాదము యిక్కడ ఉన్నది. తెలుగు టీకాతాత్పర్యాలతో శరత్ బాబు, శారదాపూర్ణ శొంఠి[5] ఒక ప్రతిని ప్రచురించారు. తెలుగులో రాయప్రోలు సుబ్బారావు మేఘదూతాన్ని యతిప్రాసలు లేని మత్తేభవిక్రీడిత వృత్తములో దూతమత్తేభముగా[6], శంఖవరం రాఘవాచార్యులు మాత్రాగణములతో షట్పదలుగా[7] అనువదించారు.
సంగీత మేఘదూతము
మేఘదూతమును ఒక సంగీత రూపకముగా సంస్కృతములో బాలాంత్రపు రజనీకాంతరావు నిర్దేశములో, వారి, బాలమురళీకృష్ణల గాత్రముతో ఇదే సంచికలో వినవచ్చును. మేఘదూతపు పద్యములను విశ్వమోహన్ భట్ సంగీత నిర్దేశకత్వములో హరిహరన్, కవితా కృష్ణమూర్తి (సుబ్రహ్మణ్యన్), రవీంద్ర సాఠే పాడిన కొన్ని పద్యములను ఇక్కడ వినవచ్చును. ఇంటర్నెట్‌లో మేఘదూతములోని కొన్ని పద్యాలను వినవచ్చును. (కశ్చిత్కాంతా విరహగురుణా; ఆషాఢస్య ప్రథమ దివసే; ధూమర్జ్యోతి సలిల మరుతాం; తత్రాగారం ధనపతిగృహా.)
అలాగే హేమంత ముఖర్జీ (కుమార్) పాడిన కొన్ని పద్యములు; వ్యాఖ్యలతో సంపూర్ణ మేఘదూతము ఆన్‌లైన్‌లో మనకు లభ్యమౌతున్నాయి. గుస్టాఫ్ హోల్స్ట్ (Gustav Holst) స్వరపరిచిన The Cloud Messenger మేఘదూతము యొక్క స్ఫూర్తియే.
కొన్ని మేఘదూత మందాక్రాంతములు
నేను క్రింద మేఘదూతములోని కొన్ని మందాక్రాంత వృత్తాలను పరిచయము చేస్తాను. వాటి తెలుగు అనువాదాలు కూడ యతి ప్రాసలు లేని మందాక్రాంతములో ఉన్నాయి. నేను ఉదహరించే పద్యాలను చదివేటప్పుడు ఎక్కడ ఆగాలనేది పాదముల విరుపును ఒక అడ్డగీతతో సూచిస్తున్నాను.
కశ్చిత్ కాంతా – విరహగురుణా – స్వాధికారాత్ప్రమత్తః
శాపే నాస్తాం – గమితమహిమా – వర్షభోగ్యేణ భర్తుః
యక్షశ్చక్రే – జనకతనయా – స్నానపుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయా – తరుషు వసతిం – రామగిర్యాశ్రమేషు (1.01)
శాపగ్రస్తుం – డయెగ నకటా – యక్షు డొక్కండు బాధన్
ఆజ్ఞాపించన్ – వరుస మొకటిన్ – వీడి భార్యన్ దనుండెన్
లేలేనీడల్ – తరువు లొసగన్ – రామగిర్యాశ్రమానన్
స్నానమ్మాడెన్ – జనకజ యటన్ – పుణ్యమౌ నీరమందున్
ఇది మేఘదూతములోని మొదటి పద్యము. యక్షుడొకడు ఏదో ఒక తప్పు చేసి తన ప్రభువైన కుబేరుని ఆగ్రహానికి గురి అయ్యాడు. కుబేరుడు యక్షుని ఒక సంవత్సరము యక్షలోకమునుండి మానవలోకానికి పంపాడు. కైకేయి వరము వలన ఎలా రాముడు వనవాసము చేసాడో అదే విధముగా యక్షుడు కూడ వనవాసము చేస్తున్నాడు. అతడు ఆ వనవాసాన్ని చేసే చోటు పేరు కూడ రామగిరియే. ఆ రామగిరి ప్రాంతములో ఒకప్పుడు శ్రీరాముడు కూడ సీతాలక్ష్మణులతో కాలము వెళ్లబుచ్చాడు. సీత అక్కడ ఉండే జలాశయములో స్నానము కూడ చేసిందంటాడు కాళిదాసు. ఒకే పద్యములో రామాయణానికి మేఘదూతానికి ఉండే సంబంధాన్ని కవి వివరిస్తాడు. రెండు కథలకు ఒక తేడా మాత్రము ఉన్నది, అదేమంటే కొన్నేళ్ళైనా సీతారాములు ఇద్దరూ అడవిలో కాలము గడిపారు. కాని యక్షుడు తన భార్యను తలుస్తూ సంవత్సరమంతా ఏకాంతముగా గడపాలి.
తస్మిన్నద్రౌ – కతిచిదబలా -విప్రయుక్తః స కామీ
నీత్వా మాసాన్ – కనకవలయ – భ్రంశరిక్తప్రకోష్ఠః
ఆషాఢస్య – ప్రథమదివసే – మేఘమాశ్లిష్టసానుం
వప్రక్రీడా – పరిణతగజ – ప్రేక్షణీయం దదర్శ (1.02)
బేలన్ వీడెన్ – గృశుడుగ నయెన్ – జారె నా కంకణమ్ముల్
ఆ శైలానన్ – నెలల గడిపెన్ – కామి యేకాంతమై తాన్
ఆషాఢంలో – మొదటి దిన మా – కొండపై మేఘమాలల్
మత్తేభమ్మా – పృథివి వడిగా – కొట్టి యాడినట్లుండెన్
నాకు నచ్చిన పద్యము ఇది. అందుకే ఈ వ్యాసానికి ఆషాఢస్య ప్రథమదివసే అని పేరుంచాను. ఎప్పుడు భార్యను తలుస్తూ ఆ విరహ వ్యధలను అనుభవిస్తూ యక్షుడు చిక్కిపోయాడు. కుబేరుని కొలువులో ఉండే అతనికి స్వర్ణాభరణాలకు తక్కువా? కాని ధరించిన బంగారు కడియాలేమో అతని చిక్కిపోయిన చేతులనుండి జారిపోతున్నాయి. శృంగారము రెండు విధాలు – సంభోగము, విప్రలంభము. వియోగశృంగారానికి పరాకాష్ఠ మేఘదూతము. కొండ చుట్టూ ఆషాఢమేఘాలు ఆవరించుకొన్నాయి. ఏనుగులు ఒక గోడను లేక భూమిని ఢీకొన్నట్లు మేఘాలు కొండను ముట్టుకొన్నాయంటాడు కవి యిక్కడ.
భర్తుః కంఠ – చ్ఛవిరితి గణైః – సాదరం వీక్ష్యమాణః
పుణ్యం యాయా – స్త్రిభువన గురో – ర్ధామ చండీశ్వరస్య
ధూతోద్యానం – కువలయరజో – గంధిభిర్గంధవత్యా
స్తోయక్రీడా – నిరతయువతి – స్నానతిక్తైర్మరుద్భిః – మేఘదూతం – 1.33
నీ వర్ణమ్మే – శివుని గళమం – చా గణమ్ముల్ దలంచన్
చేరేవంతన్ – త్రిజగపతియౌ – చండికేశాలయమ్మున్
దేవోద్యానం – బమరె గలువల్ – దెచ్చు గంధమ్ముతోడన్
స్నానంబాడన్ – సరసిఁ దరుణుల్ – గాలి మోసేను దావుల్
కాళిదాసు ఉజ్జయినీవాసి, అందువల్ల దూతమేఘాన్ని ఉజ్జయినీపురము చూస్తూ వెళ్లమంటాడు. ఉజ్జయినిలోని త్రిభువనపతియయిన చండికేశ్వరుని గుడిని చూడడము మరచిపోవద్దు. అక్కడ ప్రమథగణాలు నీలకంఠుని గొంతు నీలా (నీలమేఘములా) ఉంటుందనుకొని భక్తితో దేవుని పూజ చేస్తుంటారు. ఆ దేవోద్యానవనములో ఉండే కొలనిలో యువతులు స్నానమాడుతుంటే కలువ పూవుల పుప్పొడి సుగంధాన్ని గాలి మోసుకొని వస్తూ ఉంటుంది.
వాపీచాస్మి – న్మరకత శిలా – బద్ధ సోపానమార్గా
హేమైశ్ఛన్నా – వికచకమలైః – స్నిగ్ధవైడూర్యనాలైః
యస్యాస్తోయే – కృతవసతయో – మానసం సన్నికృష్టం
నాధ్యాస్యంతి – వ్యపగత శుచ – స్త్వామపి ప్రేక్ష్యహంసాః (2.13)
అందుండెన్‌గా – సరసొకటి య – ద్దాని మెట్ట్లేమొ పచ్చల్
స్వర్ణాంభోజ – మ్మచట విరిసెన్ – గాడ వైడూర్య మేమో
ఈదేనందున్ – జలము పయినన్ – శాంతిగా హంస లెన్నో
నిన్ జూడంగా – నవదు యవియున్ – మానసోత్కంఠతోడన్
కుబేరుడు పరిపాలించే యక్షలోకపు రాజధాని యయిన అలకాపురిని చేరిన తరువాత అక్కడ నా యింటి దగ్గర ఉండే ఒక నడబావిని చూడడము మరచిపోవద్దు. ఆ సరస్సు మెట్లు పచ్చలు, అందులో బూచిన బంగారు తామరల తూడులు వైడూర్యాలు, ఆ సరసిలో ఎన్నో హంసలు ప్రశాంతముగా ఈదుతూ ఉంటాయి, నీ నివాసమేమో మానససరోవరముగా ఉండవచ్చును, కాని అక్కడి హంసలు నిన్ను చూడగానే మానససరోవరానికి వెళ్లాలని ఆత్రపడవు, ఎందుకంటే ఆ సరస్సు ఆ మానససరోవరానికంటే యింకా గొప్పదైనది.
సందేశ కావ్యాలు
కాళిదాసు మేఘదూత రచన పిదప ఎందరో కవులు సందేశకావ్యాలను వ్రాయడానికి ఉపక్రమించారు. అలాటి కావ్యాలు వందలాది సంస్కృతముతో సహా అన్ని భాషలలో ఉన్నాయి. అన్నిటిని గురించి యిక్కడ చర్చించడానికి వీలుకాదు. మందాక్రాంతవృత్తములో వ్రాసిన కొన్ని ఖండకావ్యాలలోని కొన్ని పద్యాలను మీకు పరిచయము చేస్తాను. వీటి నిర్మాణ పరికరాలు కాళిదాసు సృష్టించినవే. ఒక నాయకుడు, నాయిక ఎడబాటుతో ఉంటారు. ఒకరికొకరు సందేశాన్ని యే వాహకుని ద్వారానో పంపుకొంటారు. నేను చర్చించే దూత కావ్యాలను గురించిన వివరాలు పక్క చిత్రములో చూడవచ్చును. తెలుగులో అత్యుత్తమమ సందేశ కావ్యమయిన గబ్బిలమును గురించిన చర్చ ఈ వ్యాస శీర్షికకు పొందుపడనిది శోచనీయము. ఈ సందేశ కావ్యాలపైన ఒక సిద్ధాంత గ్రంథము కూడ తెలుగులో ఉన్నది[8]. సందేశ కావ్యాలపైన అప్పుడప్పుడు సమావేశాలు కూడ జరుగుతుంటాయి. అట్టి సమావేశ మొకటి షికాగో నగరములో కొన్ని నెలలముందు జరిగినది.
పవనదూతము :- కాళిదాసు తరువాత మందాక్రాంత వృత్తములో వ్రాయబడిన ఖండకావ్యము పవనదూతము. దీని రచయిత ధోయీ కవి. ఇతడు వంగదేశపు (గౌడ) రాజైన లక్ష్మణసేనుని (క్రీ. శ. 1179-1206) కొలువులో ఉన్నాడు. జయదేవుడు గీతగోవిందములో (గీతగోవిందము కూడ ఒక సందేశ కావ్యమే, రాధ చెలికత్తె రాధకు కృష్ణునికి మధ్య సందేశాలను అందజేస్తూ ఉంటుంది) తన సమకాలికుడైన ధోయీ కవిని కవిక్ష్మాపతి అని క్రింది పద్యములో ప్రస్తావించాడు.
వాచః పల్లవయ త్యుమాపతిధర స్సందర్భశుద్ధిం గిరాం
జానీతే జయదేవ ఏవ శరణం శ్లాఘ్యో దురూహద్రుతేః
శృంగారోత్తర సత్ప్రమేయరచనై రాచార్య గోవర్ధన
స్పర్ధీ కోऽపి న విశ్రుత శ్రు తిధరో ధోయీ కవిక్ష్మాపతిః (1.4)
పవనదూతము లక్ష్మణసేన చక్రవర్తిని గురించి వ్రాయబడిన కావ్యము. మలయపర్వత సానువులలో (నేటి కేరళ ప్రాంతము) ఉండే కువలయవతి అనే ఒక గంధర్వకన్య లక్ష్మణసేనుని శౌర్య పరాక్రమాలను గురించి విని, అతనిపైన అభిలాష పెంచుకొన్నది. మలయమారుతముతో గౌడ దేశానికి వెళ్లి లక్ష్మణసేనునికి తన ప్రేమ సందేశాన్ని తెలుపమని వేడుకొంటుంది. దక్షిణమునుండి పూర్వోత్తర దిశలో ఉండే ప్రదేశాల వర్ణన, వంగ రాష్ట్రపు వర్ణన ఇందులోని ప్రత్యేకతలు. అందులోనుండి మూడు పద్యాలను క్రింద ఇస్తున్నాను –
తస్మిన్నేకా – కువలయవతీ – నామ గంధర్వకన్యా
మన్యే జైత్రం – మృదుకుసుమతో – ప్యాయుధం యా స్మరస్య
దృష్ట్వా దేవం – భువనవిజయే – లక్ష్మణం క్షౌణిపాలం
బాలా సద్యః – కుసుమధనుషః – సంవిధేయీబభూవ (2)
పూర్వంబందున్ – కువలయవతీ – యంచు గంధర్వకన్యా
రత్న మ్ముండెన్ – మదన శరమౌ – స్నిగ్ధపుష్పమ్మువోలెన్
చూచెన్ రాజున్ – భువనవిజయున్ – లక్ష్మణక్ష్మామహేశున్
బాలన్ దాకెన్ – కుసుమశరముల్ – మన్మథుండేలె నామెన్
మేఘదూతములో మేఘాన్ని తన భార్యను చూడడానికి దూతవు కమ్మని పురుషుడైన యక్షుడు అడిగాడు, కాని యిక్కడేమో కువలయవతి అనే ఒక యువతి, లక్ష్మణసేనుని గుణగణాదులను విన్న తక్షణము ముగ్ధురాలై అతనిని వరించి, పవనుని దూతగా పంపింది. ఇది love at first hearing!
వీక్ష్యావస్థాం – విరహవిధురాం – రామచంద్రస్యహేతోర్
యాతః పారం – పవన సరితాం – పత్యురప్యాంజనేయః
తత్తాతస్యా -ప్రతిహతగతేర్ – యాస్యతస్తే మదర్థం
గౌడీక్షౌణీ – కతి ను మలయ – క్ష్మాధరాద్యోజనాని (5)
రామావస్థన్ – విరహ వ్యధలన్ – జూచి యా కారణానన్
దాటెన్ గాదా – పవనసుతు డా – యంబురాశిన్ బిరానాన్
నాకై నీవున్ – వడిగ పవనా – వెళ్లలేవా దయాత్మా
ఆ గౌడమ్మో – మలయ గిరికిన్ – దూర మేమో యెఱుంగన్
రాముని వియోగాన్ని తెలుపడానికై నీ కుమారుడు హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, అలాగే నీవు నాకోసం గౌడదేశము వెళ్లి ఆ రాజుకు నా వలపుతలపులను తెలుపలేవా అని అడుగుతుంది. అంతే కాదు ఆమెకు మలయగిరినుండి వంగదేశము ఎంత దూరమో కూడ తెలియదు.
గంగావీచీ – ప్లుతపరిసరః – సౌధమాలావతంసో
యాస్యత్యుచ్చై – స్త్వయి రసమయా – విస్మయం సుహ్మదేశః
స్రోత్రక్రీడా – భరణపదవీం – భూమిదేవాంగణానాం
తాళీపత్రం – నవశశికలా – కోమలం యత్ర యాతి (27)
గంగాతీర – మ్మదియు నలలన్ – పొంగె సౌధాల నీడన్
సుహ్మాదేశ – మ్మతి సొబగుతో – విస్మయించున్ గదా నిన్
భూమీదేవీ – ప్రియ మహిళలున్ – రాణు లుంచేరు కమ్మల్
కర్ణాలందున్ – శశికళలతో – తాళపత్రమ్ము వోలెన్
లక్ష్మణసేనుడు ఉండే ప్రాంతానికి సుహ్మ అని పేరు, ఇది మహాభారతములో కూడ కనిపిస్తుంది. ఆ సుహ్మాదేశములో రాణులు ఎలా తాటాకులాటి కమ్మలను తొడుగుకొంటారో అనే విషయము పై పద్యములో వివరించబడినది.
హంస సందేశము :- హంససందేశ రచయిత వేంకటనాథుడు (1269-1370). ఇతనికి స్వామిదేశికన్ లేక వేదాంతదేశికన్ అని కూడ పేరు. ఇతడు రామానుజాచార్యుల పరంపరకు చెందినవాడు. ఇతడు కవి, పండితుడు, తార్కికుడు, మతప్రవక్త. సంస్కృత, ప్రాకృత, తమిళ, మణిప్రవాళ భాషలలో పుస్తకాలు వ్రాసినాడు. పాదుకాసహస్రము, యాదవాభ్యుదయము, హంససందేశాది కావ్యముల రచయిత. అల్లాఉద్ద్దీన్ ఖిల్జీ అరాజకాల కాలములో నివసించాడు. మతాచార్యులలో నిజమైన కవులు అరుదు, నా ఉద్దేశములో శంకరాచార్యులు, వేంకటనాథుడు, వాదిరాజయతి అట్టివారు.
హంససందేశములో కథానాయకుడు శ్రీరాముడు. హనుమంతుడు సీతను అశోకవనములో చూచి ఆమె యిచ్చిన ముద్రికను తీసికొని వచ్చి రామునికి ఇస్తాడు. కిష్కింధలో ఇంకా వర్షాకాలము. అట్టి వర్షాకాలములో రాముడు ఒక హంసను చూచాడు. ఆ హంసతో ఆకాశములో ఎగిరి సీత ఉండే లంకకు వెళ్లి ఆమెకు తన సందేశమును అందజేయుమని ప్రార్థిస్తాడు. హంస వెళ్లవలసిన మార్గాన్ని కూడ నిర్దేశిస్తాడు. అది హంపి, కర్ణాటక ఆంధ్ర సరిహద్దు, అహోబిలము, తిరుపతి, కాళహస్తి, కంచి, శ్రీరంగము, ఇత్యాదులు. అన్ని పద్యాలు మందాక్రాంత వృత్తాలే. క్రింద కొన్ని ఉదాహరణలు:
తస్మిన్ సీతా – గతిమనుగతే – తద్దుకూలాంకమూర్తౌ
తన్మంజీర – ప్రతిమనినదే – న్యస్తనిష్పందదృష్టిః
వీరశ్వేతో – విలయమగమ – త్తన్మయాత్మా ముహూర్తం
శంకే తీవ్రం – భవతి సమయే – శాసనం మీనకేతోః (1.03)
హంసన్ జూడన్ – గతుల సొబగుల్ – జీర యంచుల్ దలంచెన్
అందమ్మౌ యా – పలుకు వినగా – సీత పల్కుల్ స్మరించెన్
వీరుండైనన్ – క్షణము మఱచెన్ – రాముడో తన్ను దానే
ఔరా యా మ-న్మథుని బలిమిన్ – దాట శక్యమ్ము గాదే
హంసను చూడగానే సీత నడిచే తీరు జ్ఞాపకము వచ్చినది శ్రీరామునికి. సీతాదేవి హంసగమన అనడములో అతిశయోక్తి లేదు గదా! హంస ఆకారము సీత కట్టుకొన్న చీర అంచుల జ్ఞాపకమును తెచ్చాయి రామునికి. ఆడవాళ్ల చీరల అంచులలో హంసలు, నెమళ్లు, ఇత్యాదులు ఉండడము సహజమే గదా! హంసరుతమును విన్నప్పుడు సీత మాటలను విన్నటుండినది శ్రీరామునికి. ఇలా హంస రూపము, చలనము, మున్నగునవి సీతను సదా జ్ఞాపకానికి తెచ్చింది రామునికి. రాముడు గొప్ప వీరుడు, నిగ్రహము గలవాడు. ఐనా భార్యావియోగాన్ని తప్పించుకోవడానికి ఎవరివల్ల సాధ్యమవుతుంది? ఇందులో నాకు మరో రెండు విషయాలు గోచరిస్తున్నాయి. వాల్మీకి రామాయణములో కూడ సీతను వెదకుతూ వెళ్లుతున్నప్పుడు మార్గములోని ప్రకృతి దృశ్యాలను చక్కగా సహజముగా వర్ణించే ఘట్టాలు ఉన్నాయి. కాళిదాసు విక్రమోర్వశీయ నాటకములో ఊర్వశి వదలి వెళ్లిపోయిన తరువాత పురూరవచక్రవర్తి ఉన్మాదిలా సంచరిస్తూ ప్రకృతిలోని ప్రతి వస్తువులో ఊర్వశినే చూస్తాడు. ఇట్టివన్ని పై పద్యములో చక్కగా చిత్రించబడినాయి.
ఇక్షుచ్ఛాయే – కిసలయమయం – తల్పమాతస్థుషీణాం
సల్లాపైస్తై – ర్ముదిత మనసాం – శాలి సంరక్షికాణాం
కర్ణాటాంధ్ర – వ్యతికరవశాత్ – కర్బురే గీతిభేదే
ముహ్యంతీనాం – మదనకలుషం – మౌగ్ధ్యమాస్వాదయేథాః (1.20)
చూడా పాన్పుల్ – కిసలయముతో – బాలికల్ జేసిరందున్
సస్యమ్మున్ బల్ – చెఱకు మడులన్ – కాయుచున్నారు గాదా
కర్ణాటాంధ్రీ – పదముల సడిన్ – పాట బాడేరు గాదా
మధ్యాహ్నానన్ – గుసగుసలతో – మాటలాడేరు గాదా
స్థలము కర్ణాటాంధ్ర సరిహద్దులో ఉండే ఒక గ్రామము, సమయము మధ్యాహ్నము పూట. కొందరు బాలికలు చెఱకు తోటలను, వరి మడులను కాపలా కాస్తున్నారు. అక్కడ ఆకులతో తీగలతో పాన్పులు చేస్తున్నారు. అలాటి సమయములో ఆడుతూ పాడుతున్నారు. వీళ్లు సరిహద్దు ప్రాంతములో నివసిస్తున్నారు గనుక వీరు మాట్లాడేటప్పుడు రెండు భాషలలోని పదాలు మణిప్రవాళములోలా దొర్లిపోతున్నాయి. దానితో ఒకరితోనొకరు గుసగుసలాడుకొంటూ పెద్దగా నవ్వుతున్నారు. ఈ వర్ణన నాకు చాల సహజముగా ఉన్నట్లు అనిపిస్తుంది.
సంధ్యారాగం – సురభిరజనీ – సంభవైరంగరాగైః
కేశైజ్యోత్స్నా – కలహి తిమిరం – పాలికాపీడగర్భైః
ఆవిభ్రాణా – స్సరసిజదృశే – హంసదోలాధిరోహా
దాధాస్యంతే – మదకలగిర – స్తేషు నేత్రోత్సవంతే (1.37)
స్నానమ్మాడన్ – పసుపు నలదన్ – సాంధ్యరాగమ్ము వెల్గున్
కేశమ్మందున్ – సితకుసుమముల్ – రాత్రి చంద్రుండయేనో
మాట్లాడంగన్ – గలగల రొదన్ – యౌవనమ్మే కన్బడున్
ఊగన్ డోలల్ – నళినముఖులన్ – చూడ నేత్రోత్సవమ్మే
ఈ పద్యము చోళదేశములోని ఆడవారి సౌందర్యాన్ని చిత్రీకరిస్తుంది. స్నానము చేసేటప్పుడు పసుపు పూసుకొంటారు, ఆ సమయములో వారి దేహము సంధ్యారాగములా మెరిసిపోతుంటుంది. నల్లని వెండ్రుకలలో తెల్లని పూలను ధరిస్తారు, అప్పుడు అది నల్లని రాత్రి పూట వెలిగే చంద్రుడిలా కనబడుతుంది. ఇక పోతే వాళ్లు గలగలమంటూ పలికేటప్పుడు నిండు యౌవనము తొణికిసలాడుతూ ఉంటుంది. తరువాత వాళ్లు ఉయ్యాల లూగుతూ ఉంటే ఆ పద్మముఖులను చూడడము నీకు కన్నుల పండుగాగా ఉంటుంది అంటాడు శ్రీరాముడు హంసతో. ఇక్కడ కవి ఆ కాలములో ఉండే లేతవయసు ఆడపిల్లల దైనందిక చర్యలు, అలవాటులు, ఇత్యాదులను సునిశితముగా పరిశీలించి చక్కగా కవితాబద్ధము చేసినాడు.
ఇత్థం హృద్యై-ర్జనకతనయాం – జీవయిత్యా వచోభిః
సఖ్యం పుష్యం – దినకరకులే – దీప్యమానైర్నరేంద్రైః
స్వైరం లోకా – న్విచర నిఖిలాన్ – సౌమ్య లక్ష్మైవ విష్ణుః
సర్వాకారై – స్త్వదనుగుణయా – సేవితో రాజహంస్యా (2.48)
సందేశమ్మున్ – జనకజకు నీ – విచ్చి కాపాడు మామెన్
నాతో నాప్తుం – డయి మనెద వీ – సూర్యవంశమ్ముతోడన్
లోకమ్ముల్ నీ – వెగిరెదవుగా – నీదు యర్ధాంగితోడన్
లక్ష్మీవిష్ణుల్ – వలెను జగతిన్ – సర్వసౌఖ్యాలతోడన్
ఇలా నీవు వెళ్లి సీతను చూసి నా సందేశాన్ని ఆమెకు తెలియజేసి ఆమెకు నవజీవనాన్ని ప్రసాదిస్తే నాతో మాత్రమే కాదు తరతరాలకు సూర్యవంశములోని రాజులతో స్నేహము పెంచుకొంటావు. అంతే కాకుండా నీ భార్యతో హాయిగా ఎక్కడికైనా ఎగిరి వెళ్లగలవు. మీరిద్దరు లక్ష్మీదేవి విష్ణుమూర్తులలా వెలిగిపోతారు. ఈ పద్యము ఒక ఫలశ్రుతి లాటిది. నేను చెప్పినది నీవు చేస్తే నీవు మాలో ఒకడివై పోతావు అంటాడు శ్రీరాముడు.
ఉద్ధవసందేశము :- రూపగోస్వామి (క్రీ. శ. 1489-1564) చైతన్య మహాప్రభువు శిష్యుడు. ఇతని పూర్వీకులు నేటి కర్ణాటకరాష్త్రమునకు చెందిన గౌడసారస్వతులు. వంగదేశపు సుల్తాను దగ్గర అయిష్టముగా కొన్ని యేళ్లు పని చేసి, దానినుండి విరమించుకొని చైతన్యుని శిష్యుడయ్యాడు. బృందావనములో శేష జీవితాన్ని గడిపాడు. ఇతని స్థానము గౌడీయ వైష్ణవమతములో అతి ముఖ్యమైనది. ఇతడు ఎన్నో కావ్యముల రచయిత, ఉదా. భక్తిరసామృతసింధు, ఉజ్జ్వలనీలమణి, స్తవమాల, ఇత్యాదులు. ఇతడు రెండు సందేశ కావ్యాలను వ్రాసినాడు, హంసదూతం, ఉద్ధవసందేశము. హంసదూతము శిఖరిణీ వృత్తములో, ఉద్ధవసందేశము మందాక్రాంతములో వ్రాయబడినది. గోపికలకు హంస దూత అయితే, కృష్ణునికి అతని చెలికాడైన ఉద్ధవుడు దూత. ఇది భాగవతకథపైన ఆధారపడినది. గోపికలను వీడి మథురలో ఉండే శ్రీకృష్ణుడు వారికి ఉద్ధవుని ద్వార సందేశాన్ని పంపుతాడు.
వృందారణ్యే – మమ విదధిరే – నిర్భరోత్కంఠితాని
క్రీడోల్లాసైః – సపది యరిణా – హా మయా కిం విధేయం
జ్ఞాతం ధూర్తే – స్పృహయసి ముహు – ర్నందపుత్రాయ తస్మై
మా శంకిష్టాః – సఖి మమ రసో – దివ్యసారంగతోऽభూత్ (61)
కల్గెన్ నాలో – విరహ వ్యధలే – నే భరించంగ లేనే
నా కీ బృందా-వనమున మదిన్ – తాపముల్ హెచ్చె నయ్యో
పిల్లా నీలో – బెఱిగె నిజమై – వాంఛ కృష్ణుండనంగా
కాదే చెల్లీ – గనితి నదిగో – కృష్ణవర్ణంపు జింకన్
ఈ పద్యము ఇద్దరు గోపికల మధ్య జరిగిన సంభాషణను వ్యక్తము చేస్తుందని ఉద్ధవునితో కృష్ణుడంటాడు. నేను విరహబాధతో తపించిపోతున్నానంటూ ఒక గోపిక చెబుతుంది. మరో గోపిక నీకు కృష్ణుడంటే ఆశ ఎక్కువయినదని ఆమెను రెచ్చగొట్టుతుంది. మొదటి గోపిక కృష్ణ పదముపైన శ్లేష నుంచి అలా కాదు, నేను చూచినది నల్లని జింకను అని తన్ను తాను సమర్థించుకొంటుంది.
క్రీడాతల్పే – నిహితవపుషః – కల్పితే పుష్పజాలైః
స్మిత్వా స్మిత్వా – ప్రణయరభసాత్ – కుర్వతో నర్మభంగీం
విన్యస్యంతీ – తవ కిల ముఖే – పూగఫాలీ విధాస్యే
కుంజద్రోణ్యా – మహమిహ కదా – దేవసేవావినోదం (88)
శయ్యన్ జేతున్ – కుసుమములతో – పవ్వళించంగ దేవా
సిగ్గిల్లంగన్ – ప్రణయభరనై – నవ్వి నవ్వింతు నే నిన్
నీ నోరందున్ – రుచులమయమౌ – మంచి తాంబూల ముంతున్
కుంజమ్మందున్ – గృహము నొకటన్ – సేవలన్ జేతు నీకై
ఇంకొక గోపిక కృష్ణుని తలబోస్తూ నేను నీకు పూలతో పాన్పు చేస్తాను, సిగ్గుతో నవ్వుతూ ప్రణయరసాన్ని ఒలకబోస్తాను, నీకు సుగంధాలతో తాంబూలము ఇస్తాను, పొదరింటిలో నీ వినోదానికై సేవలను జేస్తాను అని అనుకొంటుంది. ఇలా వాళ్లు తమలో తామే కృష్ణునిగురించి ఆలోచిస్తుంటారని కృష్ణుడు ఉద్ధవునికి చెబుతాడు.
రాసోల్లాసా-న్నిశి నిశి చిరం – స్వప్నవృందాప్రదేశా
ద్వృందారణ్యే – సురభిణి మయా – సార్ధమాస్వాదయంతే
భూయో భూయ-స్తదపి చ పరి – త్యాగితో దూషణం మే
శంసంత్యః కిం – కుటిలహృదయా – న త్రపంతే భవత్యః (106)
రాసక్రీడన్ – రజని రజనిన్ – స్వప్నలోకాలలోనన్
మీరా బృందా-వని విడువకన్ – జేయుచున్నారు గాదా
వీడే నంచున్ – యనెదరుగదా – నింద లిట్లేల నమ్మా
మాటిట్లాడన్ – కుటిలమతితో – మీకు సిగ్గైన లేదే
మీరేమో మీ కలలలో బృందావనములో రాసక్రీడ చేస్తున్నారు, మళ్లీ కృష్ణుడు మిమ్ములను వదలివేసినాడు అని అంటారు. మీరు నిజముగా కపట హృదయులు, మీకు సిగ్గు కూడ లేదా అని గోపికలతో చెప్పమంటూ ఉద్ధవునికి కృష్ణుడు బోధిస్తాడు.
కోకిలసందేశము :- కోకిలసందేశమును వ్రాసిన ఉద్దండకవి 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు తమిళుడు, కాని నేటి కేరళలో చివరకు స్థిరపడ్డాడు. ఇతడు ఒకప్పుడు తన భార్యను వదలి కొద్ది కాలము ఉండవలసివచ్చింది. అప్పుడు ఆమెను తలుస్తూ వ్రాసిన ఖండకావ్యమే కోకిలసందేశము. మల్లికామారుతమనే ఒక నాటకమునుకూడ వ్రాసినాడు ఈ కవి. ఇందులో కోకిల తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపైన ఎగిరి దక్షిణ ప్రాంతపు యాత్ర చేస్తుంది. అందులోనుండి కొన్ని మందాక్రాంత వృత్తాలు –
దివ్యైశ్వర్యం – దిశసి భజతాం – వర్తసే భిక్షమాణో
గౌరీమంకే – వహసి భసితం – పంచబాణం చకర్థ
కుత్స్నం వ్యాప్య – స్ఫురసి భువనం – మృగ్యసే చాగమాంతైః
కస్తే తత్వం – ప్రభవతి పరి – చ్ఛేతుమాశ్చర్యసింధో (1.54)
భిక్షుండైనన్ – గొలుతురు జనుల్ – దివ్యశక్తిప్రభావా
అంకమ్మందున్ – లలిత యమరెన్ – బంచబాణారి సాంబా
లోకమ్మెల్లన్ – వెలిగెదవుగా – నైన నన్వేషణమ్మే
కొల్వంగా ని-న్నెవరితరమౌ – నయ్య యాశ్చర్యసింధూ
సంపద్గ్రామము అనే చోట ఉండే శివాలయములోని ఈశ్వరునిపైన వ్రాసిన పద్యమిది. భక్తులేమో నిన్ను దేవుడని భజిస్తారు, కాని నీవేమో తిరిపెమెత్తుకొంటావు, ఎంతో ప్రేమతో గౌరీదేవిని నీ ఒడిలో కూర్చోబెట్టుకొన్నావు, కాని మన్మథుని కోపముతో బూడిద చేసినావు, నీవేమో లోకమంతా దేదీప్యమానముగా వెలిగిపోతున్నావు, ఐనా నిన్ను వెదకడము తప్పదు, అలాటివాడిని నిన్ను ఎలా అర్చించడమో? నీవు ప్రతి క్షణము దిగ్భ్రాంతిని కలిగిస్తుంటావు.
గేహే గేహే – నవనవసుధా-క్షాలితం యత్ర సౌధం
సౌధే సౌధే – సురభికుసుమైః – కల్పితం కేలితల్పం
తల్పే తల్పే – రసపరవశం – కామినీకాంతయుగ్మం
యుగ్మే యుగ్మే – స ఖలు విహరన్ – విశ్వవీరో మనోభూః (1.6?)
వీథుల్ నిండెన్ – నవనవముగా – తెల్లగా నిండ్ల తోడన్
సౌధాలందున్ – సురభిళముగా – పుష్పతల్పమ్ము లుండెన్
తల్పాలందున్ – పరవశముగా – జంటలే ప్రేమతోడన్
జంటల్ గూడన్ – హృదయములలో – నా మనోజుండు నిండెన్
ఇది కోళిక్కోడును (కాలికట్) గురించి వ్రాసినది. సంస్కృతములో కుక్కుటక్రోడ, అంటే కోడి ఒడి అని ఈ ఊరి పేరు. ఆ ఊరిలో ఇళ్ళన్నీ తెల్లగా వెల్లవేయబడి ఉన్నాయి, ఆ సౌధాలపైన పూల పానుపులు, వాటిపైన ప్రేమతో పవళించిన జంటలు ఉన్నాయన్నాడు కవి యిక్కడ. ఆ ఊరంటే అతనికి ఎంతో ప్రీతి, ఆ ఊరిలో ఇతడు ఎన్నో బిరుదులను గొని గొప్పవాడయ్యాడు. ఇతడిని పోషించిన 15వ శతాబ్దపు రాజు పేరు మానవిక్రమవర్మ.
తీర్ణప్రాయో – విరహజలధిః – శైలకన్యాప్రసాదాత్
శేషం మాస – ద్వితయమబలే – సహ్యతాం మా విషీద
ధూపోద్గారైః – సురభిషు తతో – భీరు సౌధాంతరేషు
క్రీడిష్యావో – నవజలధర – ధ్వానమంద్రాప్యహాని (2.61)
దేవ్యాశీస్సుల్ – గలుగ విరహాం – భోనిధిన్ దాటుదామా
ఇంకన్ రెండే – నెలలు మిగిలెన్ – ధైర్యమున్ వీడ నౌనా
సౌధమ్మందున్ – మనము నెనరున్ – ధూపముల్ తావి నీయన్
కార్మేఘమ్ముల్ – సడుల మెఱయన్ – హాయిగా నుంద మెప్డున్
ఈ ఉద్దండకవి తరచుగా ప్రయాణము చేసేవాడట. అప్పుడొకప్పుడు భార్యకు దూరముగా కొన్ని నెలలు గడపవలసి వచ్చింది. బహుశా అప్పుడు వ్రాసిన ఈ కోకిలసందేశములోని చివరి పద్యము ఇది. మనము ఇలా ఇంక రెండు నెలలే ఉండాలి, ధైర్యాన్ని కోల్పోవద్దు, ఆ గౌరీదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. నేను వచ్చిన పిదప బయట ఉరుముతూ వర్షము పడుతుంటే లోపల మనము ధూపములు ఇచ్చే సువాసనతో హాయిగా ఉందాము అని ఆశాభావముతో ముగిస్తాడు కవి.
ఘనవృత్తము :- ఇది మేఘదూతమునకు తరువాతి కథ. శాపవశాత్తు భార్యనుండి వేరుపడి విరహ మనుభవిస్తున్న యక్షుడు వర్షఋతువులో మేఘమును చూచి తన సందేశమును తన భార్యకు అందజేయుమని ప్రార్థించి, అలకాపురికి మార్గమును కూడ చక్కగా తెలిపినాడు. అది మేఘదూతములోని కథ. ఇక ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. అదేమంటే పాపము తన బాధను మేఘునితో యక్షుడు మొర పెట్టుకొన్నాడు. ఐతే ఆ మొరలను ఆలకించిన మేఘుడు ఏమి చేసినాడు అన్నదే ఆ ప్రశ్న. అసలు ఆ నీలజీమూతము విన్నదా, వింటే ఏమి చేసింది? అలకాపురి చేరిందా, యక్షుని భార్యను చూసిందా? ఆమె ఏలాగుంది?
ఈ ప్రశ్నలకు జవాబు మనకు కోరాడ రామచంద్రశాస్త్రి వ్రాసిన ఘనవృత్తములో[9] లభిస్తుంది. వీరు పందొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్ధములో దీనిని వ్రాసినట్లున్నది. వీరు బందరు నోబుల్ కళాశాలలో సంస్కృతాధ్యాపకులు. తెలుగు భాషలో మొట్టమొదటి నాటకమును రచించిన ఘనత కూడ వీరికే దక్కినది. ఆ నాటకము 1860 ప్రాంతములో మంజరీమధుకరీయము అనే పేరుతో రచించబడినది.
యక్షుడు ఇచ్చిన ప్రయాణమార్గపు వివరాలు తీసికొని అలకాపురి చేరుకొంటాడు మేఘుడు. అక్కడ యక్షుని ఇంటిని కూడ కష్టము లేకుండ కనుగొంటాడు. కిటికిలోనుండి తొంగి చూడగా చిక్కిపోయిన యక్షుని భార్య దేవీపూజలో నిమగ్నమై యుంటుంది. శోకాకులయైన ఆమె మేఘునికి అశోకవనములో నున్న సీతను జ్ఞప్తికి తెస్తుందిది. హనుమంతుని వలెనే మేఘుడు సూక్ష్మరూపము దాల్చి సుందరాకారముతో ఆమె ముందు ప్రత్యక్షమయి యక్షుని విరహబాధను తెలియజేస్తాడు. యక్షుని ఇంద్రియనిగ్రహము, ఏకపత్నీవ్రతమును ఆమెకు విశదపరచినాడు.యక్షాంగన ఇది తాను దేవికి చేయు పూజాఫలము అని తలపోస్తుంది. శాపగ్రస్తుడైన యక్షుడు రామగిరిలో తపము చేసెడి సమయాన ఇంద్రుడు ఆతని తపోభంగము కోసం సురూప అనే అప్సరను పంపాడనీ, ఆమె నటనలకు, సౌందర్యమునకు బానిస కాక ఆమెను తూలనాడి ఆమెకు సద్బుద్ధిని కలిగించి తిరిగి దేవలోకానికి యక్షుడు పంపించాడనీ మేఘుడు చెబుతాడు.
“స్వర్గం గాయాః – పయసి విహరత్ – రాజహంసస్య కుల్యా
సిత్వం యాహి – ద్రుతతరమితో – యాహి కుంజాంతరం తత్”
నా భార్య ఆకాశగంగ వంటిది. నావంటి రాజమరాళం అట్టి ఆకాశగంగలో కాక నీవంటి పిల్లకాలువలో విహరిస్తుందా? నీ వృథాప్రయాస చాలించి ఇక వెంటనే వెళ్ళు అని యక్షుడు సురూపతో అన్న మాటలను ఆమెతో చెబుతాడు. తన భర్తను గురించి యక్షుడు చెప్పిన మంచి మాటలను విన్న యక్షవనిత ఆనందాధిక్యముతో మూర్ఛపోతుంది. ఆమెకు శైత్యోపచారములను జేస్తూ చెలికత్తెలు మేఘునికి ఆమె ఎలా యక్షుని వదలి కాలము గడిపినదో అనే విషయాన్ని వివరిస్తారు. కుబేరుడు తనకిచ్చిన శాపము మాట విన్న యక్షుడు బాధతో భార్యకు ఈ వార్తను తెలుపుట కిష్టము లేక ఇంటికి రాకుండ వెళ్లిపోయిన పిదప కుబేరుడు తన భార్యను యక్షవనిత వద్దకు పంపుతాడు. ఆమె కుబేరుడు తనకు బోధించిన అంబికామంత్రమును యక్షాంగనకు ఉపదేశించి దేవిని ఆరాధించమని ఓదార్చుతుంది. యక్షపత్ని అలాగే భక్తితో పార్వతిని పూజిస్తుంది. ఆమె పూజలకు తృప్తిబొంది పార్వతి ఆమెకు ప్రత్యక్షమై ఇలా అంటుంది – కుబేరుడు నా ప్రియమైన భక్తుడు. అతని శాపమును నేను తిరగజేయలేను. కాని శాపము త్వరలో ముగుస్తుంది, నీకు శుభము కలుగుతుంది. అదియును గాక యక్షుని శాపమునకు కారణము పూర్వజన్మలో అతడు తన కూతురిని అల్లుడిని కలువనీయకుండ దూరముంచుతాడు. నీవు కూడ నీ చెలికత్తెలను వారి పతులనుండి దూరము చేస్తున్నావు, అలా చేయకు అని చెప్పుతుంది. అప్పటినుండి ఆ యక్షవనిత దేవీధ్యానములో తన భర్తను తలచుచు కాలమును గడపుతున్నది. కొద్ది సేపటికి ఆమె మూర్ఛనుండి తేరుకొని మేఘుడిని ఆదరించి బహుమానముల నిచ్చి తన పతిని గూర్చి కొన్ని రహస్యములను తెలిపి ఒక సందేశాన్ని కూడ ఇస్తుంది. ఆ సందేశములను గొని మేఘుడు మళ్లీ రామగిరికి వెళ్ళి యక్షుని జూచి నీ ప్రియురాలు జీవించి వున్నది, నిన్నే తలుస్తూ ఉన్నది, త్వరలో మీరు శుభములను పొందగలరు అనే మేఘసందేశమును ఇచ్చి వెళ్ళిపోతాడు. వర్షఋతువు పిదప శరదృతువు వస్తుంది. యక్షునికి శాపము తీరుతుంది. అలకాపురికి వెళ్లి తన భార్యను మళ్లీ దర్శిస్తాడు. మేఘుడు వారిని కలిసికొని ఇద్దరిని శ్లాఘిస్తాడు. కుబేరుడు యక్షుని సన్మానించి తన సేవకావృత్తినుండి తొలగిస్తాడు. ఇది ఘనవృత్తపు కథ. ఈ కావ్యము నుండి రెండు పద్యాలను ఇక్కడ ఇస్తున్నాను:
యత్తే ప్రేయాన్ – మయి సదయయా – గ త్తనూజత్వభావం
దూరే తస్మి – న్నపిచ భవసి – ప్రేమ ధూర్మిర్భరాత్మా
సూనం తస్మా – దహముపగతో – న్యాయతస్త్యాతభావం
పుత్రం మత్వా – తవహృదయ సం – భాషణం నిర్విశంకా (1.21)
దూరంబున్నన్ – నెనరు మదిలో – నుంచుకొన్నావు నీవున్
ప్రేమన్ జూపెన్ – బ్రియ సుతునిగా – నన్ను నీ భర్త తానున్
నేనున్ దల్తున్ – గనుక నతనిన్ – దండ్రిగా దప్పకుండన్
నీవున్ నన్నున్ – సుతునివలెనే – యెంచుమా శంకలేకన్
యక్షుడి భార్యను చూచిన తరువాత మేఘుడు ఆమెతో, యక్షుడు నన్ను తన కొడుకులా ఆదరించాడు, నేను కూడ అతడిని పితృసమానముగా తలుస్తాను, నీవు నీ భర్త ఎంతో దూరములో ఉన్నా, ప్రేమతో అతనిని మరువకుండా సదా జ్ఞాపకము చేసికొంటున్నావు. నీవు కూడ సందేహాలను తొలగించి సంకోచ పడక నన్ను పుత్రసమానునిగా తలంచుకో, అని అంటాడు.
అన్యోన్యోద్యత్ – ప్రణయవశతా – జాతకందర్పదర్ప
క్రాంతక్రీడా – వశగమనసో – రర్హయోనోఃకయోశ్చిత్
ఆళీహిత్వం – స్వపదవినయం – బోద్దుకామావకాశం
వాదా ఏవం – తదసివిధురా – శాప ఏవప్రసహ్యః (2.17)
ఆనాడొక్కం – డెఱిగి తనయన్ – భర్తనున్ వేఱు జేసెన్
జ్ఞానంబున్నన్ – మతియు జెడగా – దానె గల్గించె బాధన్
తా నీ జన్మన్ – ధనపతి యిడన్ – శాపమందేను, నీవున్
వేఱుంచేవే – చెలుల పతులన్, – పాప మద్దాని వల్లన్
ఈ పద్యము పార్వతీదేవి యక్షుడికి శాపము ఎందుకు వచ్చిందో అని యక్షపత్నితో వివరించినప్పుడు చెప్పిన మాటలు. వయసులో ఉండే ప్రేమికులను వేరుజేయడము తప్పు. ఆ తప్పునే నీ భర్త పూర్వజన్మలో చేసినాడు, తన కూతురిని అల్లుడిని కలుసుకోకుండా అడ్డంకులు పెట్టేవాడు. దాని ఫలితమే కుబేరుడు ఈ జన్మలో తన శాపముచే మిమ్ములను విడదీసినాడు. నీవు కూడ నీకు పనిచేస్తూ ఉండే చెలికత్తెలను వారి భర్తలను కలిసికోకుండా వేరు చేస్తున్నావు, అది పాపకరమైన కార్యము, అలా చేయరాదు అని దేవి బోధిస్తుంది.
ఆత్మార్పణస్తుతి :- అప్పయ దీక్షితులు (క్రీ. శ. 1520-1593) ఆత్మార్పణములో 50 పద్యాలు ఉన్నాయి, అందులో సుమారు 40 మందాక్రాంత వృత్తాలు. ఈ ఆత్మార్పణస్తుతిని వ్రాయడానికి ముందు దీక్షితులు ఉమ్మెత్తకాయ రసాన్ని మ్రింగినాడట. అందువల్ల అతనికి ఉన్మత్తావస్థ ప్రాప్తించినది. తాను చెప్పినదల్లా అలాగే వ్రాయమని శిష్యులకు ముందుగానే చెప్పాడట. అట్టివేళలో అతని అంతరంగములో ఉండే భావాలు ఈ ఆత్మార్పణాస్తుతి రూపములో వచ్చాయట. ఈ స్తుతిని ఎందరో చక్కగా పాడారు. అందులో ఒకదానిని యిక్కడ వినవచ్చును. అందులోనించి ఒక మందాక్రాంత:
ఆనందాబ్ధేః – కమపి చ ఘనీ – భావమాస్థాయ రూపం
శక్త్యా సార్ధం – పరమముమయా – శాశ్వతం భోగమిచ్ఛన్
అధ్వాతీతే – శుచిదివసకృ – త్కోటిదీప్రే కపర్దిన్
ఆద్యే స్థానే – విహరసి సదా – సేవ్యమానో గణేశైః (4)
ఆనందాబ్ధుల్ – స్ఫటిక మవగా – నీదు రూపమ్మయేనో
నీతో నర్ధం – బగు నగజకున్ – మోద మందింతు వెప్డున్
లోకాతీతా – ప్రవిమల శివా – కోటిసూర్యప్రకాశా
ఆద్యా నిన్నే – గొలుతురు సదా – దేవదేవుల్ గణేశుల్
ఆనందసాగరాలు ఘనీభవించితే నీ రూపమవుతుందా? నీవెప్పుడు నీ అర్ధాంగి యయిన ఉమకు శాశ్వతమైన సంతోషాన్ని అందిస్తావు. అన్నిటికీ అతీతమయిన వాడవు నీవు, అతి విమలుడవు, కోటిసూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తావు. దేవతలు, ప్రమథగణాధీశ్వరులు నిన్నే ముందుగా పూజిస్తారు.
మందాక్రాంతపు ఛందస్సు
మందాక్రాంతవృత్తానికి పింగళుడు ఇచ్చిన సూత్రము – మందాక్రాంతా మ్భౌ న్తౌ త్గౌ గ్ సముద్రర్తుస్వరాః. అంటే మందాక్రాంతమునకు మ భ న త త గగ గణాలు ఉన్నవి, పాదపు విరుపులు నాలుగు (సముద్రము), ఆఱు (ఋతువులు), ఏడు (స్వరాలు). ఛందశ్శాస్త్రములో[10] ఈ వృత్తానికి ఇవ్వబడిన లక్ష్యము పింగళుని కాలము నాటిది కాదని అనుకొంటాను. కాని భరతుని నాట్యశాస్త్రములో[11] రెండు ప్రకరణాలు ఛందస్సుపైన ఉన్నాయి. అందులో మందాక్రాంత వృత్తపు లక్షణాలు ఉన్న పద్యానికి లక్ష్యము ఇవ్వబడినది, కాని నాట్యశాస్త్రకారుడు ఈ వృత్తాన్ని మందాక్రాంతానికి బదులు శ్రీధరా అని పిలిచాడు.
స్నానైశ్చూర్ణైః – సుఖ సురభిభిర్ – గండలేపైశ్చ ధూపైః
పుష్పైశ్చన్యైః – శిరసి రచితై – ర్వస్త్రయోగైస్చ తైస్తైః
నానారత్నైః – కనకఖచితై – రంగసంభోగసంస్థైర్
వ్యక్తం కాంతే – కమలనిలయా – శ్రీధరీవాతి భాసి (16.84)
ప్రియా, స్నానము చేసి సుగంధద్రవ్యాల నలదికొన్న చెక్కిళ్ళతో, నెత్తావితో, పూలతో విరాజిల్లే వెండ్రుకలతో, స్వర్ణభూషణాలతో అలంకరించుకొని కమలాలయ యైన ఆ శ్రీధరలా అందచందాలతో శోభిస్తున్నావు.
కాళిదాసుకు సమకాలికుడైన వరాహమిహిరుడు బృహత్సంహితలో[12] గ్రహగోచరాధ్యాయము అనే ప్రకరణములో వివిధ ఛందస్సులలో గ్రహముల స్థానములను గురించి వివరిస్తాడు. ఆ పద్యాలలో ఒక మందాక్రాంతము కూడ ఉన్నది:
దైన్యం వ్యాధిం – శుచమపి శశీ – పంచమే మార్గవిఘ్నం
షష్ఠే విత్తం – జనయతి సుఖం – శత్రురోగక్షయం చ
యానం మానం – శయనమశనం – సప్తమే విత్తలాభం
మందాక్రాంతే – ఫణిని హిమగౌ – చాష్టమే భీర్న కస్య (103.09)
చంద్రుడు జన్మరాశినుండి ఐదవ రాశిలో ఉంటే దీనత్వము, రోగము, శోకము, దారిలో విఘ్నాలు కలుగుతుంది. ఆరవ ఇంటిలో ఉంటే ధనార్జన, సుఖము, శత్రుక్షయము, ఆరోగ్యము కలుగుతుంది. ఏడవ యింటిలో ఉంటే వాహనము, పూజ, శయ్య, భోజనము, విత్తలాభము కలుగుతుంది. ఎనిమిదవ యింటిలో ఉంటే పాము భయపెట్టేటట్లు భయము కలుగుతుంది.
ఈ పద్యము నా ఉద్దేశములో చాల ముఖ్యమైనది. ఎందుకంటే యిందులో వరాహమిహిరుడు పద్యపు పేరైన మందాక్రాంతాన్ని ముద్రాలంకారముగా ఉపయోగించాడు. అంటే నాట్యశాస్త్రకారుని నామమైన శ్రీధరా చలామణిలో లేదని ఈ పద్యము స్పష్టముగా తెలుపుతుంది.
చాల శతాబ్దాలవరకు పింగళఛందస్సులో ఒక సూత్రముగా మాత్రమే నిలిచిందీ మందాక్రాంత వృత్తము. పింగళ ఛందస్సు ఛందశ్శాస్త్రములో ప్రథమ గ్రంథముగా పరిగణించబడుతుంది. నాట్యశాస్త్రము దాని తరువాత వచ్చినదని అంటారు. కాని యిందులో ఒక ఇబ్బంది ఉన్నది. లౌకిక ఛందస్సులో వృత్తాలకు సూత్రాలన్ని పింగళా ఛందస్సులో మగణాది త్రిక గణములచే నిర్మించబడినది. ఇంతకు ముందు చెప్పిన మందాక్రాంతవృత్త సూత్రమునే దీనికి ఉదాహరణముగా భావించవచ్చును. ఈ పద్ధతి అంత సులభమయిన పద్ధతి కాదు. కాని నాట్యశాస్త్ర కర్త గురులఘువులతో మాత్రమే వృత్త నిర్మాణాన్ని వర్ణించాడు, ఉదాహరణకు మందాక్రాంత (శ్రీధర) వృత్తములో మొదటి నాలుగు అక్షరాలు గురువులు, తరువాత పదవ, పదకొండవ, పదమూడవ, పదునాలుగవ, పదహారు, పదిహేడవ అక్షరాలు గురువులు, మిగిలినవి లఘువులు అని తెలిపాడు. ఇది చాల సులభమయిన పద్ధతి, త్రిక గణములను గురించిన జ్ఞానము దీనికి అవసరము లేదు. నా ప్రశ్న ఏమంటే సులభమయిన పద్ధతిని సామాన్యముగా మొదట ఉపయోగిస్తారు, తరువాత కష్టమయిన పద్ధతిని వాడుతారు. కాని పింగళ ఛందస్సు మొదట, తరువాత భరతశాస్త్రము జనించినవన్నది ఈ సిద్ధాంతముతో పొత్తు కుదరదు. పెద్ద పెద్ద వృత్తాలు పుస్తకాలలో నున్నంత మాత్రాన అవి వాడబడుతున్నవన్న మాట నిజము కాదు. శార్దూలవిక్రీడితము, స్రగ్ధర లాటి వృత్తాలు పింగళ ఛందస్సులో, నాట్యశాస్త్రములో ఉన్నాయి. కాని వీటిని క్రీస్తు శకము మొదటి శతాబ్దములో మాత్రమే మొట్టమొదట అశ్వఘోషుడు ఉపయోగించాడు. భాసుని నాటకాలలో ఈ వృత్తాలు వాడబడ్డాయి, కాని భాసుని కాలము ఇంకా నిక్కచ్చిగా మనకు తెలియదు.
మందాక్రాంత నిర్మాణ శిలలు
వైదిక ఛందస్సులో అనుష్టుభ్, ఉష్ణిక్, పంక్తి, త్రిష్టుభ్, జగతి ఛందాలకు చెంది కొన్ని నియమములను పాటించిన పద్యాలు మనకు పరిచితము. ఈ వైదిక ఛందస్సులో ఉచ్చరణకు (cadence) ప్రాముఖ్యత ఎక్కువ. లౌకిక ఛందస్సులో ఉచ్చరణకన్న హ్రస్వ దీర్ఘాదులు లేక గురు-లఘువులు ముఖ్యము. ఇది సంగీతాన్ని జనింపజేస్తుంది. ఇలా చేసినప్పుడు పుట్టిన వృత్తాలలలో కొన్ని నిర్మాణ శిలలు పదేపదే వాడబడ్డాయి. నేను వీటిని పిల్లలు ఆడుకొనే లెగోలవంటివి అంటాను. కొన్ని ముఖ్యమైన లెగోలు – IUIU, UIUI, UUUU, UUI UUI, UIU UIU, UIIU, IIIIIU మున్నగునవి. మందాక్రాంత వృత్తములో మూడు లెగోలు ఉన్నాయి, అవి – UUUU, IIIIIU, UIUUIUU. ఈ లెగోలను అదే క్రమములో కలిపితే మనకు మందాక్రాంతము లభిస్తుంది. మందాక్రాంతపు లెగోలు ఉండే కొన్ని వృత్తాలను పక్క చిత్రములో చూడవచ్చును. అందులోని కొన్ని విశేషాంశాలను క్రింద చర్చిస్తాను.
1. శాలినీవృత్తము – మందాక్రాంతములోని మొదటి, మూడవ లెగోలతో నిర్మించబడినది శాలినీవృత్తము. ఈ శాలినీవృత్తము కూడ బహు పురాతనమైనది. పింగళ ఛందస్సు, నాట్యశాస్త్రాలలో వివరించబడినవి. ఇది రామాయణములో లేదు, భారతములో ఉన్నది. కాని భారతములోని శాలిని తరువాత చేర్చినది అంటారు. శాలిని వంటి సమవృత్తాలు లేకున్నా లేక అరుదైనా, పాదానికి పదకొండు అక్షరాలు ఉండే త్రిష్టుభ్ ఛందముగా వ్రాయబడిన శ్లోకాలలో, కొన్ని పాదాలకు శాలిని వంటి వృత్తాల లక్షణాలు భగవద్గీతలో కూడ ఉన్నాయి. భాసుడు ప్రతిమానాటకంలో వ్రాసిన ఒక శాలినీ వృత్తాన్ని క్రింద ఉదాహరణగా ఇస్తున్నాను.
శాలిని – మ త త గగ, యతి (1, 5)
11 త్రిష్టుభ్ 289
భగ్నః శక్రః – కంపితో విత్తనాథః
కృష్టః సోమో – మర్దితః సూర్యపుత్రః
ధిగ్ భోః స్వర్గై – భీత దేవైర్నివిష్టం
ధన్యా భూమి – ర్వర్తతే యత్ర సీతా (5.17)
ఇంద్రుడు భంగపరచబడ్డాడు, కుబేరుడు వణికిపోయాడు, చంద్రుడేమో యీడ్చబడ్డాడు, యముడు త్రొక్కబడ్డాడు, భయకంపితులైన దేవతలతో ఉండేది అది స్వర్గమా, సీత ఉండే యీ భూమి ఎంత ధన్యమైనదో?
మనకందరికీ సుపరిచితమైన శాలినీవృత్తము విష్ణుసహస్రనామప్రారంభములో వచ్చే క్రింది పద్యము:
మేఘశ్యామం – పీతకౌశేయవాసం
శ్రీవత్సాంగం – కౌస్తుభోద్భాసితాంగం
పుణ్యోపేతం – పుండరీకాయతాక్షం
విష్ణుం వందే – సర్వలోకైకనాథం
త్రిష్టుభ్ ఛందానికి చెందిన శాలినిలాటి అమరికలు వైదిక ఛందమునుండి గ్రహించబడినవేమో?
2. శరభలలిత – నాట్యశాస్త్రమంతా ఒకే మారు వ్రాయబడలేదని పరిశోధకుల భావన. అందులో ఈ ప్రకరణాలు ఎప్పుడు వ్రాయబడ్డాయో మనకు తెలియదు, కాని అవి తప్పక క్రీస్తు పూర్వము వ్రాయబడి ఉండాలి. ఎందుకంటే మందాక్రాంతమును బోలిన మరొక పద్యము శరభలలిత. ఈ శరభలలిత పింగళ ఛందస్సులో లేదు, కాని నాట్యశాస్త్రములో ఉన్నది. శరభలలితకు, మందాక్రాంతానికి ఉండే తేడా ఏమంటే, శరభలలితలో మందాక్రాంతపు మ భ న త త గగ కు బదులు, మ భ న త గగ ఉంటుంది, అంటే మూడు అక్షరాలు తక్కువ. క్రింద శరభలలితకు నాట్యశాస్త్రమునుండి లక్ష్యము –
శరభలలిత – మ భ న త గగ, యతి (1, 5, 11)
14 శక్వరి 2545
ఏషా కాంతా – వ్రజతి లలితం – వేపమానా
గుల్మైశ్చ్ఛన్నం – వనమురునగైః – సంప్రవిద్ధం
హా హా కష్టం – కిమిదమితి నో – వేద్మి మూఢో
వ్యక్తం క్రోధా-చ్ఛరభలలితం – కర్తు కామా (16.72)
ఈ స్త్రీకయ్యెన్ – లలితగతులన్ – కంపనమ్ముల్
తానో వెళ్లెన్ – లతల వని కా – కొండపైనన్
మూర్ఖుండైతిన్ – గినుక నటనల్ – జూపుచుండెన్
వ్యక్తించెన్గా – శరభలలిత – మ్మైన కేళుల్
ఈ శరభలలితవృత్తమును అశ్వఘోషుడు సౌందరనందములో[13] రెండుమారులు ఉపయోగించాడు, అందులో ఒకటి –
తస్మాదేషా – మకుశలకరా – ణామరీణాం
చక్షుర్ఘ్రాణ – శ్రవణరసన – స్పర్శనానాం
సర్వావస్థం – భవతి నియమా – దప్రమత్తో
మాస్మిన్నర్థే – క్షణమపి కృథా – స్త్వం ప్రమాదం (13.56)
క్షేమకరము కాని ఆ శత్రువులను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండవలయును. కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ – వీటిని అణచుకొని అప్రమత్తుడవై ఉండవలయును. ఒక క్షణము కూడ ఏమరకూడదు.
అశ్వఘోషుడు క్రీ. శ. మొదటి శతాబ్దానికి చెందినవాడని అంటారు, కాబట్టి నాట్యశాస్త్రములోని ఛందస్సు అధ్యాయాలు అశ్వఘోషునికి ముందే వ్రాయబడి ఉండాలి
3. స్రగ్ధర – రెండువేల సంవత్సరాలకు ముండు వాడబడిన పొడవైన వృత్తాలలో స్రగ్ధర ఒకటి. అశ్వఘోషుడు, భాసుడు దీనిని వాడారు. స్రగ్ధరకు మందాక్రాంతాని కన్న నాలుగు అక్షరాలు ఎక్కువ. స్రగ్ధరలో 5-8 అక్షరాలను తొలగిస్తే మందాక్రాంత మవుతుంది. దీనివలన మనము మందాక్రాంతము నుండి స్రగ్ధర పుట్టినదా లేక స్రగ్ధరనుండి మందాక్రాంత పుట్టినదా అనే విషయాన్ని చెప్పలేము. కాని వీటికి సంబంధబాంధవ్యాలు ఉన్నాయని మాత్రము చెప్పగలము. దానిని నిరూపిస్తూ వ్రాసిన ఒక పద్యాన్ని క్రింద చదవండి:
స్రగ్ధర – మ ర భ న య య య, యతి (1, 8, 15)
21 ప్రకృతి 302933
శ్రీవాగ్దేవీ కరమ్మి – చ్చి చెలగు చదువుల్ – జెప్ప వేగమ్ము రావా
శ్రీవారాశీ వరమ్మి – చ్చి సిరుల ధరపై – జిందజేయంగ రావా
శ్రీవిశ్వాంబా శివమ్మి – చ్చి చిరసుఖములన్ – జిల్కి దీవించ రావా
కావన్ రారే దయల్ గ – ల్గ ఘనపదములన్ – గాఢమౌ భక్తి గొల్తున్
మందాక్రాంత
శ్రీవాగ్దేవీ – చెలగు చదువుల్ – జెప్ప వేగమ్ము రావా
శ్రీవారాశీ – సిరుల ధరపై – జిందజేయంగ రావా
శ్రీవిశ్వాంబా – చిరసుఖములన్ – జిల్కి దీవించ రావా
కావన్ రారే – ఘనపదములన్ – గాఢమౌ భక్తి గొల్తున్
4. కుసుమితాలతావేల్లిత – మందాక్రాంతములాగే మరొక వృత్తము ఉన్నది. దీనికి మొదటి లెగోలో మందాక్రాంతములోని నాలుగు గురువులకు బదులు ఐదు గురువులు ఉంటాయి. దీనిని కుసుమితాలతావేల్లిత అంటారు. ఈ వృత్తము కూడ పురాతనమైనదే. దీనిని కూడ అశ్వఘోషుడు సౌందరనందములో[13] ఉపయోగించాడు. ఆ పద్యమును క్రింద చదువవచ్చును –
తస్మాద్భిక్షార్థం – మమ గురురితో – యావదేవ ప్రయాతస్
త్యక్త్వా కాషాయం – గృహమహమిత – స్తావదేవ ప్రయాస్యే
పూజ్యం లింగం హి – స్ఖలిత మనసో – బిభ్రతః క్లిష్టబుద్ధేర్
నాముత్రార్థః స్యా – దుపహతమతే – ర్నాప్యయం జీవలోకః (7.52)
నా గురువు భిక్షకు వెళ్లిన తక్షణము నేను కాషాయ వస్త్రాలను విప్పి యిక్కడినుండి నా యింటికి వెళ్తాను. ఎందుకంటే పవిత్రమైన చిహ్నాన్ని చలించిన మనసుతో, వక్రబుద్ధితో, సడలిన గురితో ధరిస్తే ఉన్నతాశయాలు మాత్రమే కాదు, జీవకోటితో నిండిన ఈ ప్రపంచము కూడ ఉండదు.
కుసుమితలతావేల్లితను ఉపయోగించిన అశ్వఘోషుడు మందాక్రాంతవృత్తాన్ని ఎందుకు ఉపయోగించలేదో? ఈ రెంటితో గర్భకవిత్వాన్ని క్రింద చూడవచ్చును –
కుసుమితలతావేల్లిత – మ త న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37857
రా రాజీవాక్షా – రసికహృదయా – రాత్రి వేచేను నీకై
రా రాజిల్లంగా – బ్రణవరవముల్ – రమ్యమై పాడ రావా
రా రాజేంద్రా నా – రచన యది శ్రీ – రంగ నీకే నిజమ్మై
రారా జీవాత్మా – ప్రణయినియు నే – బ్రాణమిత్తున్ ముదానన్
ఇందులోని మందాక్రాంతము
రాజీవాక్షా – రసికహృదయా – రాత్రి వేచేను నీకై
రాజిల్లంగా – బ్రణవరవముల్ – రమ్యమై పాడ రావా
రాజేంద్రా నా – రచన యది శ్రీ – రంగ నీకే నిజమ్మై
రా జీవాత్మా – ప్రణయినియు నే – బ్రాణమిత్తున్ ముదానన్
ఇంకా ఎన్నో విషయాలను, గర్భకవిత్వములను తెలియజేయవచ్చును గాని, అవి ఈ వ్యాసపు పరిధిని అతిక్రమించగలదు.
తెలుగులో మందాక్రాంతము
నాగవర్మ రచించిన కన్నడ లక్షణగ్రంథము ఛందోంబుధిలో[14] మందాక్రాంతపు లక్షణాలు ఇలా చెప్పబడినవి.
కాంతం ధాత్రీ – హిమకృదమరా – కాశయుగ్మేశయుగ్మా
క్రాంతం తోర్కుం – పదదశకదోళ్ – విశ్రమం సంతతం తాం
కాంతే మత్త – ద్విరదగమనే – మల్లికామోదె మందా-
క్రాంతం వృత్తం – నెగళ్దుదిళెయొళ్ – నాగవర్మప్రణీతం (పుట 42)
భూమి (మ), చంద్రుడు (భ), స్వర్గము (న), రెండు ఆకాశాలు (త), రెండు ఈశ్వరులు (గురువులు) గలవియై తోచును మందాక్రాంతవృత్తము, పది అక్షరములతో పాదము ఎప్పుడూ విరుగుతుంది, గజగమనా, మల్లెలవలె సుకుమారీ, ఇలా భూమిపైన నాగవర్మ చెప్పాడు.
ఇక్కడ ఒక విశేషమేమంటే, పాదము పది, ఏడుగా విరుగుతుంది అని వ్రాసినా, ఉదాహరణలో నాలుగు అక్షరాల తరువాత పాదాలు విరిగేటట్లు వ్రాసినాడు నాగవర్మ. ఇంచుమించు ఇవే ప్రాసాక్షరాలతో రేచన కవిజనాశ్రయములో[15] మందాక్రాంతపు లక్షణాలను చెప్పి, పాదాలను నాలుగవ అక్షరము వద్ద అంతము చేశాడు. ఐదవ అక్షరముతో అక్షరసామ్య యతిని మాత్రము ఉంచలేదు. ఈ విషయము చాల ముఖ్యమైనది. నాలుగు అక్షరాల తరువాత కొత్త పదము ప్రారంభము అయితే ఈ వృత్తము అందముగా ఉంటుందని రేచన అనుకొన్నాడు. పదవ అక్షరము తరువాత మొదటి పాదములో కొత్త పదము ఆరంభమయినది. రెండవ పాదములో అలా ఆరంభము కాకపోయినా అది ఎబ్బెట్టుగా లేదు. కాని ఈ వృత్తమును తమ కావ్యములలో ఉపయోగించిన కవులు దీనిని పాటించక పోవడము శోచనీయము. ఆ పద్యము –
కాంతాకాంతా – మభనతతగా – కాంతిసంక్రాంతి మందా-
క్రాంతం బన్ పే – రమరు దశమా – శ్రాంత విశ్రాంతమైనన్ (పుట 25)
మనకు దొరికిన తెలుగు గ్రంథములలో మొట్టమొదట మందాక్రాంత వృత్తమును వ్రాసినది కుమారసంభవకర్త నన్నెచోడుడు. ఆ పద్యము –
ఫాలాభీలాం – బకు నురుజటా – బంధనాపీడ్యమాన
వ్యాళాధీశా – నన విగళితో – చ్ఛ్వాస నిర్ధూత గంగా
స్థూలోర్మీ శీ – కర సమితి పైఁ – దూలి శోభిల్లుఁ జూడన్
గైలాసోర్వీ – ధరపతికిని ము – క్తాఫలచ్ఛత్రలీలన్ (7.153)
తిక్కన తన భారతము స్త్రీపర్వములో ఎన్నో విశేషవృత్తాలను వాడాడు, అందులో మందాక్రాంతవృత్తము కూడ ఒకటున్నది. అది –
వీణానాద – ప్రతిమనిగమా-విర్భవత్సారపుణ్య
శ్రేణీ సంపా – దిత విమలతా – స్థేమనిర్లేపచిత్త
త్రాణక్రీడా – కలనసతతో – త్సాహవద్దివ్యభావా
ప్రాణాపానా – హరణనిపుణ – ప్రాపణీయానుభావా (2.185)
ఎఱ్ఱన నృసింహపురాణములో వ్రాసిన ఒక మందాక్రాంతము –
వేలాక్రాంత – త్రిభువన మహ – ద్విద్విషల్లక్ష్మ సూక్ష్మా
స్థులావిత్వ – స్ఫురితరచనా – దుర్నిరూపాత్మ ఖేలో
త్కోలాకార – క్షుభితవలయో – త్కూలకల్లోలమాలో
ల్లోలాబ్ధీంద్రో – ల్లుఠిత వసుధా – లోకరక్షా సమక్షా (4.188 )
ఆశ్వాసాంతములో విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణకల్పవృక్షము నుండి ఒకటి –
గౌరీపాదాం – బురుహ వినమ – త్కాంత లాక్షానురక్తా
పారావారో – న్మథన జనిత – ప్రౌఢకాకోలభక్తా
శారజ్యోత్స్నా – మృదుశశి శిశు – స్వచ్ఛ చూడాగ్రముక్తా
సౌర ప్రోద్య – జ్జగదవన ని – ష్ణాత గంగాభిషిక్తా (బాల – ఇష్టి – 435)
ఇటీవల భీమశంకరం వ్రాసిన రసస్రువు నుండి ఒక ఉదాహరణ –
వక్తల్, మేధా – వులు, కవులు, స – ర్వజ్ఞ సంగీత గానా
సక్తుల్, వేదాం – తులు, యతులు, సం – సార గాఢాంధికా ని
ర్ముక్తుల్, స్వాధ్యా – యులు, ఋషులు, ఆ – ముష్మికాలోచనా సం
పృక్తుల్, వేమూ – ద్వహు బహువిధిన్ – ప్రీతి చేయంగ నంతన్
పై పద్యాల రచనలో ఒక్క ఎఱ్ఱాప్రగడది తప్ప మిగిలిన వాటిలో మందాక్రాంతపు శోభ ఎక్కువగా లేదని నా ఉద్దేశము. ఇవి శార్దూల లేక మత్తేభ విక్రీడితములను చదివినట్లుంది, కాని మందాక్రాంతములోని సంగీతానుభవము వీటిని చదివినప్పుడు కలుగదు.
మరొక లయ
మందాక్రాంతపు గురులఘువుల అమరికను UU UU IIII IUU IUU IUU గా వ్రాస్తే మనకు మొదట మూడు చతుర్మాత్రలు, తరువాత మూడు ఎదురు నడకతో ఉండే పంచమాత్రలు లభిస్తాయి. చివరి మూడు య-గణాలు బృహతి అనే వృత్తమవుతుంది. తాళరీత్యా మూడు చతుర్మాత్రలు, మూడు పంచ మాత్రలు వినడానికి బాగుంటాయి. క్రింద అట్టి అమరికతో వాడుక భాషలో వ్రాసిన ఒక ఉదాహరణ –
కావ్యం వ్రాసా తలపుల -కలంతో మథించే ముదంతో
నవ్యం నవ్యం రసముల – నదమ్మౌ సుధాబుద్బుదమ్మౌ
దివ్యం దివ్యం ధర యిది – దివమ్మౌ నభీష్టాలయమ్మౌ
భవ్యంబౌ నీ బ్రదుకులు – వరాలౌ ప్రమోదస్వరాలౌ
మందాక్రాంతము తెలుగులో ఎందుకు అరుదు?
మందాక్రాంతవృత్తము తెలుగులో రాణించకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి: (1) తెలుగు భాషలో వరుసగా నాలుగు గురువులు వచ్చేటట్లు వ్రాయడము కష్టమే. అందుకే తెలుగు కవులు శార్దూలవిక్రీడిత వృత్తాన్ని మత్తేభవిక్రీడితానికన్న తక్కువగనే వ్రాసినారు. (2) మందాక్రాంతపు టందచందాలు పదాల విరుపు వలన ఏర్పడినది. అలా పదాలను నాలుగవ, పదవ అక్షరాలవద్ద విరగగొట్టకపోతే అందము చెడుతుంది.
ఒక గురువును రెండు లఘువులుగా లేక రెండు లఘువులను ఒక గురువుగా మార్చి కొత్త వృత్తాలను సృష్టించడము ఛందస్సులో సర్వసామాన్యమే, ఉదా. శార్దూల-మత్తేభవిక్రీడితములు, ఉత్పల-చంపకమాలలు, మత్తకోకిల-తరళములు, మానిని-కవిరాజవిరాజితములు, ఇత్యాదులు. అలా చేయాలని నాకు కూడ ఆలోచన వచ్చినది, దాని ఫలితమే మందాక్రాంతపు మొదటి గురువును రెండు లఘువులుగా మార్చి లలితాక్రాంతము అనే వృత్తాన్ని సృష్టించాను. ఇటీవల అట్టి వృత్తమును మందారమాల పేరిట జయకీర్తి ఛందోనుశాసనములో[15] ఉన్నట్లు కనుగొన్నాను. ఏది ఏమైనా, లలితాక్రాంత లేక మందారమాలకు ఒక ఉదాహరణ –
లలితాక్రాంత – స త న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37860
లలితాక్రాంతా – లయల సొబగై – లాస్య మాడంగ రావా
కలలో నీవీ – కలికి యెదలో – గారు చిచ్చుంచినావా
యలయై రావా – యలఘుతర మో – దాబ్ధిలో ముంచ రావా
తెలియందమ్మై – తెలుగు కవితై – తేనె లూరించ రావా
అదే విధముగా మందాక్రాంతపు రెండవ, మూడవ, నాలుగవ గురువును రెండు లఘువులుగా మార్చి కొత్త వృత్తములను సృష్టించాను. అవి వరుసగా కోమలకాంతా, రాగోత్కళికా, నిత్యానందము. వాటికి ఉదాహరణలు –
కోమలకాంతా – భ త న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37863
ఏమని జెప్పన్ – హృదయ మది ని-న్నెందుకో చూడ గోరెన్
శ్యామలమై యా – జలధరతతుల్ – జల్లగా నింగి దేలెన్
కామలతా నా – కవిత వినగా – కన్నులే మాటలాడున్
కోమలకాంతా – కొలనుదరి రా – కోర్కెలే కాటువేయున్
రాగోత్కళికా – త జ న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37869
ఆ నా డలలై – యమృత ధునితో – నందమై పాడినావే
గానోత్కళికా – కవిత గుళికా – కావ్యవారాధినౌకా
ఈ నా డిటులన్ – హృదయమున నా – కెంతయో బాధ గల్గెన్
రా నా మదిలో – రసము జిలుకన్ – ప్రాణమే లేచివచ్చున్
నిత్యానందము – మ న న య య య, యతి (1, 6, 12)
18 ధృతి 37881
నిత్యానందము – నిను గనుటయే – నీరజాక్షా ముకుందా
సత్యాకారము – సఖు డనుటయే – సచ్చరిత్రా మురారీ
అత్యాదర్శము – లగును కథలే – యప్రమేయా యనంతా
ప్రత్యేకత్వము – పరమపదమే – పాహిమాం ప్రత్యగాత్మా
జాతి పద్యముగా మందాక్రాంతము
మందాక్రాంతమును ఇలా వ్రాయవచ్చును – (UU UU) (IIIIIU) (UIU UIU U), అనగా (చ – చ) (త్రి -చ లేక చ – త్రి) (పం పం గురువు) (త్రి – త్రిమాత్ర, చ – చతుర్మాత్ర, పం – పంచమాత్ర). ఇలా మూడు మాత్రాగణముల లెగోలతో యతిప్రాసలతో మందాక్రాంతమును ఒక జాతి పద్యముగా వ్రాయవచ్చును. ఇట్టి జాతి పద్యమునకు మందాకిని అనే పేరును ఉంచాను. ఇట్టి అమరికతో కొన్ని వృత్తాలు కూడ ఉన్నాయి.
1. భూతిలక – భ భ ర స జ జ గ, యతి (1, 12)
19 అతిధృతి 186039
మందాకినిగా భూతిలక –
వాతపు శీతల – బాధ తగ్గెను – భాసిలెన్ రవి కాంతులన్
జేతన గల్గెను – జెట్టులన్, యవి – చెన్నుగా నిడె రంగులన్
భూతలిపైనను – బూచె బూవులు – బ్రోవులై కడు రమ్యమై
భూతిలకమ్ముగ – భూమి నామని – మోద మిచ్చెను ముగ్ధమై
2. హారిణి – మందాకిని – మ భ న మ య లగ, యతి (1, 5, 11)
17 అత్యష్టి 37361
ఈ నా డెందం – బెపుడు దలచున్ – హేమాంగి నిన్నే గదా
తేనెల్ చిందన్ – దెలుగు నుడులన్ – దివ్యమ్ముగా పాడవా
మేనుల్ రెండున్ – మిలన మవగా – మేళమ్ము లింకేలనే
రా నాచెంతన్ – రజని వెలిగెన్ – రావే మనోహారిణీ
3. శిశుశార్దూలము – మందాకిని – మ స న మ య ల గ, యతి (1, 6, 11)
17 అత్యష్టి 37337 (ఇది శార్దూలవిక్రీడితములో 6,7 అక్షరాలను తొలగించగా వచ్చిన వృత్తము.)
దూరమ్మందున – దోచె శిశుశా – ర్దూలమ్ము లెన్నో వనిన్
జేరంబోకుమ – చెంతగలదే – సిద్ధమ్ముగా దల్లియున్
వారిం జూడుమ – పల్విధములన్ – బర్వెత్తె నిట్టట్టులన్
స్వారస్యమ్ముగ – చారు గతులన్ – సానందమై యందమై
మందాకినిలో కొన్ని అనువాదాలు
మందాక్రాంతపు లయ కలిగిన జాతిపద్యమైన మందాకినిని ఉపయోగించి కొన్ని మందాక్రాంత పద్యములను అనువాదము చేసినాను. ఇందులో యతిప్రాసల నియమాలను పాటించాను. కొన్ని ఉదాహరణలను ఇక్కడ చదువవచ్చును –
సవ్యాపారా – మహని నతథా – పీడయే న్మద్వియోగః
శంకేరాత్రే – గురుతరశుచం – నిర్వినోదాం సఖీం తే
మత్సందేశైః – సుఖయితుమలం – పశ్య సాధ్వీం నిశీథే
తామున్నిద్రా – మవని శయనాం – సాధవాతాయనస్థః (మేఘదూతము – 2.25)
గడచును దినముల్ – గలుగు పనులన్ – గాన విరహమ్ము మఱచున్
పడుఁ దా బాధల్ – బాసి చెలులన్ – బాడు రాత్రుల్ దహించున్
విడిచిన నిద్రన్ – వెతల గలయున్ – బేల నేలన్ బరుండున్
పడ సంతోషము – వార్త దెల్ప గ-వాక్షమ్ములో జూడుమా
పత్యుర్దేవీ – ప్రణయసచివం – విద్ధి దీర్ఘాయుషో మాం
జీవాతుం తే – దధత మనఘం – తస్య సందేశమంతః
శూరాణాం య-శ్శరదుపగమే – వీరపత్నీవరాణాం
సమ్మానార్హం – సమయముచితం – సూచయేత్కూజితైస్స్వైః (హంస సందేశ – 2.28)
ఆతనికిని నే – నాత్మ సచివుడ – నాతండు వర్ధిలు సదా
సీతాదేవీ – చిర ముదమిడన్ – చెప్పెదన్ వాని వాక్కుల్
ఏతెంతురు వీ – రేంద్రులు రయ – మ్మింతు లాలాపించగా
నా తరుణమ్మును – హంసరుతితో – నలరి జెప్పేము తల్లీ
మాధుర్యేణ – ద్విగుణాశిశిరం – వక్త్రచంద్రం వహంతీ
వంశీవీథీ – విగలదమృత – స్రోతసా సేచయంతీ
మద్వాణీనాం – విహరణపదం – మత్తసౌభాగ్యభాజం
మత్పుణ్యానాం – పరిణతిరహో – నేత్రయో సమ్నిధత్తే
(లీలాశుక శ్రీకృష్ణకర్ణామృతము – 1.75)
మధురమధురమై -మసృణతరమై – మాధవాననము నిండెన్
నదిగా మురళీ – నాదసుధలన్ – నయముగా మున్గిపోతిన్
పదములతనివే – వఱలె నాల్కన్ – పరమభాగ్యమ్ము గాదా
యిది నా పుణ్య – మ్మెనగ కన్నుల – నిట్లు వానిన్ గనంగన్
మందం మందం – మధురనినదై – ర్వేణుమాపూ రయంతం
వృందం వృందా – వనభువి గవాం – చారయంతం చరంతం
ఛందోభాగే – శతమఖమఖా – ధ్వంసినాం దానవానాం
హంతారం తం – కథయ రసనే – గోపకన్యా భుజంగం (2.05)
మందమ్ముగ దా – మధుర రవముల్ – మంద్రమై నూదు మురళిన్
బృందావనిలో – ప్రియముగను గో – బృందమున్ గాచుచుండున్
ఛందమ్మున దు – ర్జనుల ఖలులన్ – జంపెనం చందురే యా
నందాత్మజు కథ – నాకు జెప్పవె – నాల్కతో నందవనితా
పాణౌ వేణుః – ప్రకృతిసుకుమా – రాకృతౌ బాల్యలక్ష్మీః
పార్శ్వే భాలః – ప్రణయసరసా – లోకితాపాంగలీలాః
మౌలౌ బర్హం – మధురవదనాం – భోరుహే మౌగ్ధ్యముద్రేऽ
త్యార్ద్రాకారం – కిమపి కితవం – జ్యోతిరన్వేషయామః (3.30)
చేతన్ వేణువు – చెలువు రూపము – చెన్నుగా సౌకుమార్యం
బాతని ప్రక్కన – ప్రణయభరితం – బైన లోలాక్షి బృందం
బా తలపైనన్ – బర్హిపింఛం – బంబుజానన మృదుత్వం
బీ తరుణమ్మున – వెదకుచుంటిమి – వెల్గు చిందించువానిన్
ముగింపు
పింగళ ఛందస్సు, నాట్యశాస్త్రములో ఒక బీజముగా మాత్రమే ఉన్న మందాక్రాంత వృత్తానికి ఒక కల్పవృక్షరూపమిచ్చి ఆ చెట్టులో ఎనలేని మందారకుసుమాలను పరిమళింపజేసిన మహాకవి కాళిదాసు. ఆ తావి నాటినుండి నేటివరకు భూగోళమంతా నిండియున్నది. ఈ వ్యాసము చదివిన పాఠకులు, కవులు, పండితులు మందాక్రాంతవృత్తమును, దాని ఆధారముగా సృష్టియైన మందాకిని జాతి పద్యాన్ని తెలుగు భాషలో విరివిగా ఉపయోగిస్తే నేను ధన్యుడినవుతాను. క్రింద ఒక మందాక్రాంతముతో, ఒక మందాకినితో ఈ వ్యాసాన్ని ముగించుచున్నాను.
వాణిశ్రీదా – వరము లొసగన్ – వందన మ్మిత్తు దేవీ
శ్రేణీఛందః – శిఖర సుకరా – చిన్మయా బ్రహ్మజాయా
ప్రాణత్రాణా – ప్రణవపద స-త్పద్యకావ్యాంబురాశీ
వీణాపాణీ – విమలహృదయా – వేదశాస్త్రార్థకారీ
ప్రేమనినాదము – ప్రియుల చెవులన్ – వేదవాక్కై వినబడున్
ప్రేమ నిజముగా – పెన్నిధి గదా – పేదకును మారాజుకున్
ప్రేమకు వేఱొక – పేరు దైవము – ప్రియముగా మాటాడుమా
ప్రేమాయణమే – విశ్వవీధిన్ – వెలుగు ధ్యేయమ్ము గాదా
(సృజనాత్మక వ్యాసాలను చదివి ఆనందిస్తే చాలదు. అందులోని బాగోగులను విమర్శించి రచయితకు ప్రోత్సాహమిస్తే అది రచయితకు, కవికి నవపథములో నడవడానికి చేయూత నిచ్చినట్లుంటుంది. నేను మందాక్రాంతముపై సందేశములు పంపినప్పుడల్లా స్పందించి నాకు చక్కని ప్రోత్సాహము నిచ్చిన శ్రీమతి లైలా యెర్నేని గారికి ఈ వ్యాసమును కానుకగా యిస్తున్నాను.)
గ్రంథసూచి
Bahadur Chandra Chhabra – అభిలేఖసంగ్రహః – An anthology of Sanskrit Inscriptions – Sahitya Akademi – New Delhi – 1964.
V.W. Karambelkar – Select Sanskrit Inscriptions – 1959.
R.C. Majumdar – Ancient Indian colonies in the Far East – Champa – Punjab Sanskrit Book Depot – Lahore – 1927.
క్షేమేంద్ర – పుల్లెల శ్రీరామచంద్రుని వ్యాఖ్య – ఔచిత్యవిచార, కవికంఠాభరణా, సువృత్తతిలక – సురభారతీ సమితి – హైదరాబాదు – 1983.
రామవరపు శరత్ భాబు, శొంఠి శారదాపూర్ణల వ్యాఖ్య – మేఘదూతం – ఆనందలహరి – విశాఖపట్టణము – 1988.
రాయప్రోలు సుబ్బారావు – దూతమత్తేభము – తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్ – తిరుపతి – 1957.
శంఖవరం సంపద్రాఘవాచార్య – మేఘసందేశము – నవోదయ పబ్లిషర్స్ – విజయవాడ – 2004.
బాపట్ల రాజగోపాలశర్మ – తెలుగు సందేశకావ్య సమాలోచనం – గాయత్రి ప్రచ్రణలు – విజయవాడ – 1989.
కోరాడ రామచంద్రశాస్త్రి – వ్యాఖ్య రామకృష్ణయ్య – ఘనవృత్తము – కోరాడ లక్ష్మీ మనోహరముచే ప్రచురితము – మచిలీపట్టణము – 1917.
పింగలాచార్య – ఛందశ్శాస్త్రం – పరిమల పబ్లికేషన్స్ – ఢిల్లీ – 1994.
భరతముని – నాట్యశాస్త్ర – English translation by Manmohan Ghosh – Asiatic Society of Bengal – Calcutta – 1951.
వరాహమిహిర విరచితా బృహత్సంహితా – హిందీ వ్యాఖ్య అచ్యుతానంద ఝా శర్మ – చౌఖంభా విద్యాభవన్ – వారాణసి – 1959.
అశ్వఘోషుని సౌందరనందము – సంపాదకుడు హరప్రసాద్ శాస్త్రి – Royal Asiatic Society of Bengal – Calcutta – 1939.
Nagavarma’s Canarese Prosody – F. Kittel – Basel Mission Book and Tract Depository – London – 1875.
మల్లియ రేచన – కవిజనాశ్రయము – వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ – మదరాసు – 1950.
జయదామన్ – సంపాదకుడు హరి దామోదర వేళంకర్ – హరితోషమాలా – బొంబాయి – 1949.
---------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment