త్రిపథ: కొన్ని రామాయణ విశేషాలు
సాహితీమిత్రులారా!
సామాజికం – మానవీయం
వాల్మీకి రామాయణం నుంచి:
గుహుడు శృంగ బేరపురానికి చెందినవాడు. జింకచర్మాలతో జింకలవంటి జంతువుల బొమ్మలు చేయించి అటవీ ప్రాంతాల్లో పెట్టి, వాటి దగ్గరకు చేరిన జంతువులను పట్టి (అమ్ముకుని?) జీవనం గడిపేవారుండే పురమే శృంగ బేరపురం, ‘బేరం’ అంటే శరీరం. గుహునికి పడవ లేదు. పడవ నడిపేవాడు కాడు.
‘శబరి’ సన్యసించిన స్త్రీ–ఆమె రకరకాల ఫలాలను ఎంగిలిచేసి (రుచి చూసి) రామలక్ష్మణులకు పెట్టడం అనే దృశ్యం లేనేలేదు. జ్ఞాని, వయోవృద్ధురాలయిన శబరిని చూసివెళ్లడానికే రామలక్ష్మణులు వచ్చారు. రాముడుని చూసేందుకే ఆమె నిలిచి వుంది.
“ధర్మాత్ముడయిన రాజు ప్రజారక్షణ కోసం చేసే పని క్రూరమైనా, పాపమైనా, దోషాలతో కూడినదయినా చేయదగినదే” (బా.కా.ప.25, శ్లో. 17).
‘రాముడు తానే ముందుగా పలకరించి మాట్లాడేవాడు. శీలవృద్ధులను, జ్ఞానవృద్ధులను వెళ్లి పలకరించేవాడు. ధనం సంపాదించే ఉపాయాలు తెలిసినవాడు, పద్ధతిగా వ్యయం చేసేవాడు.’
“నాకు ఎదురు చెప్పలేకపోవటం వలన ‘రాముడు ప్రభువుగా వుండాలని’ అనడం లేదు కదా!” అని దశరథుడు సామంతరాజుల సభలో తన ప్రతిపాదన గురించి అలా అన్నాడు.
యుద్ధాలకు వెళ్లి తిరిగివచ్చే సమయంలో రథం మీద ఉన్నా, ఏనుగు మీద ఉన్నాగాని పౌరుల వద్దకు వెళ్లి సకల కుశల ప్రశ్నలు వేసేవాడు రాముడు.
“రామపట్టాభిషేక సందర్భంలో నగరంలో పతాకాలు కట్టించి, రాజమార్గాలు తడపండి. తాళజ్ఞానంగల నటులను, బాగా అలంకరించుకున్న వేశ్యలను, ఎనమండుగురు కన్యలను రాజప్రాసాదం లోని రెండవ కక్ష్యలోకి వచ్చివుండేట్లు చూడండి” (ఇవి శుభదర్శనాలు) అని వశిష్టుడు రాజాధికారులతో అన్నాడు (అయో.కాం. స 3. శ్లో. 16, 17).
రామ పట్టాభిషేక ఉత్సవ సందర్శనకు దశరథుడు పిలిపించిన రాజులలో పడమటి దేశాలవారు, ఉత్తర, దక్షిణ దేశాలవారూ, మ్లేచ్ఛదేశాలవారు, ఆర్యావర్తం, వన, పర్వతప్రాంతంవారూ వున్నారు. రాముని రాకను దశరథుడు అతి ఎత్తయిన మేడ నుంచి చూస్తున్నాడు. కైలాసశిఖర తుల్యమైన ఆ మేడను రాముడు ఎక్కాడు. ‘తండ్రికి తన పేరు చెప్పి పాదాభివందనం చేశాడు’.
పట్టాభిషేక విషయంలో మొహమాటపడుతున్న రాముని చూసి దశరథుడు అన్నమాట: “నా మనస్సులో మరొక ఆలోచన కలగడానికి ముందే అభిషేకం చేయించుకో. మానవుల మనసు చంచలమైంది గదా!” (అయో.కా. స. 4, శ్లో. 20) ఆపై ఇలా అన్నాడు: “రాత్రి అంతా ఉపవాసం చేయి. రేపే పట్టాభిషేకం, విఘ్నాలు కలగకుండా నీ మిత్రులందరు రాత్రి నిన్ను రక్షించాలి. భరతుడు నగరానికి దూరంగా ఉండగానే అభిషేకం జరగాలి. భరతుడు ధర్మస్వరూపుడే. కానీ ధర్మనిరతులు, సన్మార్గవర్తులు అయినా మనుషుల చిత్తం కూడా చంచలం కావచ్చునని నా అభిప్రాయం” (శ్లో. 24, 24, 26, 27).
“రాముని కాదని భరతుడు రాజ్యం చేయడానికి అంగీకరించడు. ధర్మం విషయంలో రాముని కంటే కూడా భరతుడు ఎక్కువ పట్టుదల కలవాడని నా అభిప్రాయం” అని దశరథుడు కౌసల్యతో అంటాడు (అ.కా. స. 12, శ్లో. 61).
“వేటకాడు పాట (గీత శబ్దేన..) పాడి లేడిని పట్టినట్టు నన్ను కట్టిపడేశావు!” దశరథుడు కైకేయితో.
“రాముని పట్టాభిషేకానికి సిద్ధంచేసి ఇలా అడవికి పంపిస్తే వీధిలో పెద్దలు చేరి నన్ను ‘మద్యపానం చేసిన బ్రాహ్మణుని’ నిందించినట్టు నిందించరా!” అని అన్నాడు కైకేయితో దశరథుడు. “నీవు నా మెడకు ఉరితాడువైనావు!” “పసివాడు పాము మీద చేయి వేసినట్టు నిన్ను దగ్గరకు చేరదీశాను” అని దుఃఖించాడు.
ఆడవారు స్వార్థపరులు. హద్దు లేకపోతే ఎంతటికయినా తెగించగలరు అని నిందిస్తూ, నేను అందరు స్త్రీలను ఉద్దేశించి అనటంలేదు సుమా, భరతుని తల్లిని మాత్రమే ఉద్దేశించి అంటున్నానని దశరథుడు స్త్రీలపట్ల సంఘ మర్యాదను, తన వ్యక్తిత్వాన్నీ నిలుపుకునేట్టు కోపాన్ని నిగ్రహించుకున్నాడు. (అ.కా. స. 12)
దశరథుని రాజసౌధంలో అంతఃపురంలో బెత్తాలు పట్టుకుని ద్వారం వద్ద వృద్ధులయిన అంతఃపురాధ్యక్షులు సిద్ధంగా వున్నారు (అ.కా. స. 16, శ్లో.3).
రామ పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న కౌసల్య ఆ రోజు తెల్లటి పట్టుచీర కట్టి మంత్రపూర్వకంగా అగ్నిలో హోమం చేస్తున్నది. (నాటికి యజ్ఞ హోమాదులు స్త్రీలకు నిషిద్ధం కాదు.)
“తండ్రి మాటేగాదు, తల్లిమాటా వినవలసిందే. నీవు అడవికి వెళ్లవద్దు. వెడితే నేను ప్రాయోపవేశం చేస్తా” అన్నది కౌసల్య రామునితో.
వనవాసం చేయడానికి సిద్ధమైన రాముడు తమ్ముడి ఆగ్రహాన్ని, తల్లి దుఃఖాన్ని సహించి, వారిని శాంతించేలా చేసి సీత దగ్గరకు వచ్చేసరికి తన దుఃఖాన్ని ఆపుకోలేక వణికిపోతూ బయటపడిపోయాడు (అ.కా. స. 26 శ్లో. 7).
“నీ అభిప్రాయం ఏదో పూర్తిగా తెలుసుకోకుండా నిన్ను అడవికి తీసుకుపోలేను గదా! ఎవరూ కీర్తిని వదులుకోలేనట్టే నేను నిన్ను వదులుకోలేను” అని రాముడు సీతతో అన్నాడు.
“జాగ్రత్త… మెత్తనివాడు ఎప్పుడూ తిరస్కరింపబడతాడు” అని లక్ష్మణుడు అన్నాడు రామునితో.
“వనవాసం నాకు తప్పదని పూర్వం నేను మా యింట వుండగా జ్యోతిష్యము తెలిసిన బ్రాహ్మణుడొకడు చెప్పడం విన్నాను. అలాగే పూర్వం ఒక భిక్షుక స్త్రీ నాకు వనవాసము వుంటుందని మా అమ్మతో చెప్పగా విన్నాను” అని సీత చెబుతూ రాముని వెంట వెళ్లేందుకు ఉత్సాహం చూపింది (అ.కా. స. శ్లో. 8, 13).
వనవాసం చేయడానికి వస్తానన్న సీతను నివారించడంతో సీతకు రామునిపై కోపం వచ్చి స్వేచ్ఛగా ఇలా అన్నది “రామా, నీవు పురుష శరీరంగల స్త్రీవి. నా తండ్రి నిన్ను ఏమనుకుని అల్లుడుగా చేసుకున్నాడో తెలియదు! నీవు ఏ దశరథాదుల హితం మాట్లాడుతున్నావో వారికి నీవు విధేయునిగా వుండవచ్చు గాని నన్ను వారికి విధేయురాలుగా వుండమనటం యుక్తం కాదు.” (శ్లో. 9)
వనవాసానికి వెళ్ళేముందు తల్లుల గురించి రామలక్ష్మణులు చర్చించే సందర్భంలో లక్ష్మణుడు ఇలా అంటున్నాడు: “వెయ్యి గ్రామాలు కౌసల్య చేతిలో వుండి, ఆమె అనుగ్రహంపై నడుస్తున్నాయి కనుక నా తల్లి వంటి అనేకమందిని పోషించగల సమర్థురాలు.”
“ధనుర్బాణాలు, గునపం, చిన్న గంప తీసుకుని నేను నీ సాయం కోసం వస్తాను” (అ.కా. స.31, శ్లో. 20,23).
“లక్ష్మణా! వేదాధ్యయన నిరతులైన బ్రహ్మచారులు వేరే ఏ పనీ చేయరు. మధుర పదార్థాలు తినగోరువారు. వారికి ఎనభై వాహనాలు, ధాన్యం మోసేందుకు వెయ్యి ఎద్దులు, దున్నేందుకు రెండువందల ఎద్దులు, భోజనాదికాలకు పెరుగు, నెయ్యి కోసం వెయ్యి ఆవులనూ ఏర్పాటు చేయి. నా అలంకరణ వస్తువులు, వస్త్రాలు, క్రీడా సామగ్రి, మంచాలు, ఇతరాలు నీవు పోషిస్తున్నవారికి ఇచ్చెయ్యి” అని అన్నాడు రాముడు వనవాసానికి సిద్ధమవుతున్న సందర్భంలో. (స.32. శ్లో.20)
రాముడు అక్కడ నిలిచిన నౌకరులందరి జీవికార్థం అత్యధికంగా ధనం ఇచ్చాడు; మరింత ధనరాశులను బ్రాహ్మణులకు, బాలురకు, వృద్ధులకు, దీనులకూ ఇప్పించారు రామలక్ష్మణులు. (స. 32 శ్లో, 28)
త్రిజటుడనే బ్రాహ్మణుడు నిత్యం చిన్న గొడ్డలి, గునపం, నాగలి వంటి సాధకాలతో అడవిలో తవ్వుతూ ఆహారాన్ని సంపాదించేవాడు, దారిద్ర్యాన్ని భరించలేక రామదర్శనానికి వచ్చాడు. ఆ కోటలో ఐదవ వాకిలి వరకు అతనిని ఎవరూ అభ్యంతర పెట్టలేదు. పేదవాడు, పిల్లలుగలవాడూ అయిన అతనికి- అతడు తన దండము విసిరివేయగా అది పడినంత దూరంలో పట్టగలిగిన గోధనాన్ని ఇచ్చాడు రాముడు (స. 32, శ్లో. 29, 33, 36). కేవలం పరిహాసానికి అలా ‘దండం విసిరి అదృష్టం చూసుకొమ్మన్నందుకు’ మన్నించమని రాముడు ఆ నిరుపేద బ్రాహ్మణుని కోరాడు.
బ్రాహ్మణులలోగాని, మిత్రుల్లోగాని, భృత్యుల్లోగాని, దరిద్రుల్లోగాని, యాచకుల్లోగానీ ఎవరూ తగిన సన్మాన, దాన, గౌరవాదులు పొందనివారు లేరు (శ్లో. 39, 44).
రామునితోపాటు అడవులవరకు సాగనంపటానికి కొంత సైన్యం, సంగీతం పాడే వేశ్యలు, ధనవంతులయిన వర్తకులను పంపమనీ, బలప్రదర్శనవంటి ఆటల్లో రామునితో పాల్గొనేవారికి రెండింతల వేతనాన్ని ఇచ్చి వెంట పంపించమనీ దశరథుడు తన మంత్రి సుమంత్రుని ఆదేశించాడు (స. 36, శ్లో. 3,4).
దశరథుడు రామునితోపాటు సమస్త సంపదలూ పంపించివేస్తాడేమోనని కైకేయి భయపడి ఇలా అన్నది: “… అనుభవించడానికి ఏమీ మిగలని రాజ్యం ఇతరులు తాగిన తరువాత మిగలని మద్యం వలె భరతునికి అక్కరలేదు” (స. 36. శ్లో. 12).
సీత కూడా వనవాసానికి సిద్దమవుతుండగా వశిష్టుడు ఇలా అన్నాడు: “ఓ కైకేయీ, సీత వనాలకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇక్కడే రాముని బదులు సింహాసనం అధిష్టించగలదు. ఆమె రాముని ఆత్మ గనుక ఆమె రాజ్యపాలన చేయవచ్చు. గృహస్థులకు భార్య ఆత్మవంటిది…” (స. 37. శ్లో. 23, 24).
“రాముడు సరే, సీత కూడా నార చీరలే ధరించాల్సిన పనిలేదు కదా,” అని వశిష్టుడు సీత నారచీరను కట్టుకొనబోతుండగా (కైకేయి ముందు) నివారించాడు (స. 37, శ్లో. 34). “చెరుకు వెన్ను తుదముట్టించు, వెదురు పువ్వే వెదురు నష్టమయిపోవడానికి కారణమైనట్టు (తన్మాం దహేత్ వేణుమివాత్మ పుష్పమ్) కైకేయీ నీ కుంటుంబాన్ని నీవే నశించిపోయేట్టు చేస్తున్నావు” అని అన్నాడాయన.
సీత వనవాసానికి కదులుతుండగా కౌసల్య మనుషుల స్వభావం గురించి ఇలా అన్నది: “పాతివ్రత్యం లేని స్త్రీలను భర్తలు ఎంత గౌరవించినా సరే, భర్తలు దురవస్థలో వున్నపుడు అవమానిస్తారు! స్త్రీలు ఎంత సుఖం అనుభవించినాగాని చిన్న ఆపదలొచ్చినా తాము చెడిపోవుదురు, భర్తలనీ వదిలేస్తారు- ఇది స్త్రీల స్వభావం! విద్య, దానం, ఉపకారం, ఆదరం ఏదీ స్త్రీల హృదయాన్ని ఆకర్షించదు- వారి హృదయం అస్థిరం!” (స. 39 శ్లో. 20, 21, 23).
నాటి సాంప్రదాయం… “ఎవరు తిరిగి రావాలని మనం కోరుకుంటామో వారిని ఎక్కువ దూరం సాగనంపరాదు” అని దశరథునితో మంత్రులు అన్నారు.
అన్యాయంగా రామలక్ష్మణులు వనవాసానికి వెళ్లారన్న బాధతో, సంతాప ప్రకటనవలె అయోధ్యలో దుకాణాలు, దేవాలయాలూ మూసివేశారు. రాజమార్గాలను శుభ్రం చేయలేదు (స. 42, శ్లో. 23).
చిత్రకూట పర్వతం మీద రామలక్ష్మణులు చెట్ల కొమ్మలతో, కర్రలతో నివాసం నిర్మించుకున్నారు. దానికి వాస్తు దేవతా శాంతి కోసం కృష్ణసారం అనే లేడిని తెచ్చి చంపి దానిని అగ్నిలో వేసి పక్వం చేశాడు లక్ష్మణుడు. ఆ మాంసం ముందుంచుకుని వాస్తు పూజ, మంత్రపఠనం చేశాడు రాముడు. విశ్వదేవతలను, రుద్రుని, విష్ణువులను ఉద్దేశించి ఉత్తమ బలి సమర్పించాడు. పూలు, పళ్లు, నీరు, మాంసములతో పూజ ముగించి పర్ణశాల ప్రవేశం చేశారు సీతా రామచంద్రులు, లక్ష్మణుడు (స. 56, శ్లో. 20, 22, 25, 26, 28, 32, 35).
రామాయణకాలవు బ్రాహ్మణ సమాజం గురించిన లోకోక్తి… “కొందరు శ్రాద్ధం రోజున తమ బంధువులకు ముందుగా భోజనం పెట్టి ఆ తరువాతనే బ్రాహ్మణోత్తములను ఇష్ట పంక్తికి పిలుస్తారట!” కౌసల్య దశరథుని నిందిస్తూ అంటున్న మాటల్లో ఇది ఒకటి (స. 61, శ్లో. 12).
సీత రకరకాల ఆహారపదార్థాలు తినేది–ఇక అడవిలో నెవరు ధాన్యంతో చేసిన వంట ఎలా తినగలదు?! మంగళవాద్య గీతాలు వినే ఆమె చెవులు సింహాది క్రూరమృగాల అరుపులు ఎలా వినగలవు?! (శ్లో. 5, 6).
“తోకను తొక్కితే పెద్దపులి ఎలా సహించదో అలాగే రాముడు తనకు జరిగిన అవమానాన్ని సహించడు” కౌసల్య దశరథునితో (శ్లో. 22).
భర్త, మహారాజు అయి కూడా దశరథుడు చేతులు జోడించి తనను క్షమించమని కౌసల్యను వేడుకుంటాడు. కౌసల్య తిరిగి తనను మన్నించమని కోరుతుంది (స. 52, శ్లో. 7, 12).
భరతుని మనస్తాపం పోగొట్టడానికి అతని స్నేహితులు అనేకరకాల కథా, వినోద కార్యక్రమాలు జరిపించారు, కొందరు నాటకాలు ఆడారు, కొందరు హాస్యసంభాషణలు జరిపారు (అ. కా. 69. శ్లో. 4,5).
“పెద్ద ఎద్దు మోసేవాడిని అలవాటులేని చిన్న ఎద్దుకు కట్టినట్టు నేను రాజ్యభారాన్ని ఎలా మోయగలను?” భరతుడు తల్లితో అన్నమాటలు.
నందిగ్రామం నుంచి భరతుడు అయోధ్య చేరటానికి ఏడు రోజులు పట్టింది. అయోధ్యలో మట్టి తెల్లగా వుంది, ఉద్యానవనాల్లో రాత్రంతా గడిపి ఇళ్లకి చేరేవారిని భరతుడు చూశాడు. ‘రథంలో ప్రయాణించి రావటం వలన ధూళి కప్పిన నా చేయిని మాటిమాటికీ తుడిచేవాడు’ అని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు భరతుడు.
“అన్నను అడవికి పంపడానికి నేను అనుమతించినట్టయితే సూర్యునికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసినంత పాపం, యజమాని సేవకుని చేత ఎంతో పనిచేయించుకుని అతనికి ఏమీ ఇవ్వకుండా పంపించి వేసినంత పాపం తగులుతుంది” అని భరతుడు తల్లితో అన్నాడు (స. 75, శ్లో. 22, 23). ప్రజలనుంచి వారి ఆదాయంలో ఆరవ వంతు పన్నుగా తీసుకుంటూ కూడా వారికి రక్షణ కల్పించలేని రాజుకు కలిగే పాపం కలుగుతుంది (శ్లో. 25). ఒక వ్యక్తి తనపై వున్న విశ్వాసంతో, రహస్యంగా తన మిత్రాదులు, ఇతరులను గూర్చి చెప్పిన దూషణ వాక్యాల్ని వారికి చెబితే ఆ వ్యక్తికి ఎంత పాపం వస్తుందో అంత పాపం కలుగుతుంది నాకు.” “లక్క, మధు మాంసాలు, లోహాలు, విషంతో వ్యాపారం చేసినంత పాపం…”
‘నూనె గల పెద్ద శయనం నుంచి దశరథుని శరీరం తీసి నేలపై పెట్టి ఆపై అగ్ని గృహంలో వుంచారు. అక్కడినుంచి చిన్న పల్లకిలో ఎక్కించి మోసుకుని వెళ్లారు. రుత్విక్కులు అతని అగ్నికి హోమం జరిపించారు. సామగులు సామగానం చేశారు…’ (స. 76, శ్లో. 5, 13, 14, 18).
దశరథునికి అపర క్రియలు జరిపించే సమయంలో భరతుడు బ్రాహ్మణులకు తెల్లని మేకల మందలను, గోవులను, దాసీజనాన్ని, వాహనాలను, ఇండ్లనూ దానం చేశాడు (స. 11, శ్లో. 3).
భరతుడు ససైన్యంగా తరలిరావటం చూసి సందేహించిన గుహుడు తన అనుచరులకు ఆదేశాలిస్తూ, “మాంసం, దుంపలు, ఫలాలూ తింటూ నదిని సంరక్షిస్తుండే పల్లెవారందరిని తమ సైన్యంతో గంగానది వెంట నిలచి వుండమనండి” అని అన్నాడు (స. 84. శ్లో. 7).
భరద్వాజ మహర్షి భరతుని పరివారానికి, సైన్యానికి సకలం సమకూర్చాడు. మద్యం ఎందరికి కావాలంటే అందరికీ చేరింది. కొందరికి చెరుకు ముక్కలు, తేనె కలిపిన పేలాలు తినిపించారు. సైనికులకు ప్రత్యేకించి పంది, మేక మాంసాలూ, లేడి, నెమలి, కోడి మాంసాలు రాసులుగా ఏర్పడివున్నాయి (స. 91, శ్లో. 91). ఇక శాకాహారంతో పాటు చక్కెర కలిపిన యవలచూర్ణం కూడా వుంది. ఇతర అవసరాల్లో తెల్లని కుచ్చులుగల దంతకాష్ట సముదాయాలు, అద్దాలు, చెప్పుల జతలు, కాటుక భరిణెలూ వున్నాయి. “ఈ మాంసం శుద్ధమైంది. ఈ ముక్క రుచిగా వుంది, బాగా కాలింది”, అని అనునయిస్తూ, మందాకినీ నదిని చూపిస్తూ రాముడు సీతకు మాంసం తినిపిస్తున్నాడు (స. 96, శ్లో. 1, 2).
“వేయిమంది మూర్ఖులని విడిచిపెట్టినా ఒక్క పండితుని చేరదీస్తున్నావు కదా? ప్రజలు తీవ్రదండనలతో భయపడిపోతుంటే మంత్రులు చూస్తూ వూరుకోడంలేదు కదా?! సైన్యానికి తగిన ఆహారం, యథోచితమైన జీతం ఆలస్యం చేయకుండా సకాలంలో ఇస్తున్నావు కదా? విషయాలు తెలిసినవాడు, సమర్థుడు, సమయస్ఫూర్తి కలవాడు, చెప్పిన, విన్న విషయం వున్నది వున్నట్లు చెప్పేవాడు, పండితుడయినవాడిని దూతగా నియమించావు గదా? సరిహద్దు చూపేరాళ్లు కలిగి, చలివేందలతో, చెరువులతో ప్రకాశించేది, గనులతో నిండినది, పూర్వీకులచే రక్షణ పొందుతూ వున్న మన దేశం సుఖసమృద్ధులతో అలరారుతోంది గదా?! కృషి (వ్యవసాయం), గో సంరక్షణ ఆధారమైన జనులందరు సుఖమే కదా?! ప్రతిదినం జనులకు దర్శనం ఇస్తున్నావు గదా? భయం, అతిశయం చేత నిన్ను చూసి నీ పనివారందరూ దూరంగా వుండటం లేదు కదా? సచ్చరిత్రగల వ్యక్తిపై అపరాధారోపణలు వచ్చినప్పుడు శాస్త్రంలో నేర్పుగలవారిచే ప్రశ్నించనీయకుండా అతనిని చంపివేయటంలేదు గదా?! ఒక కష్టం వచ్చినపుడు ఇతడు దరిద్రుడు, ఇతడు ధనవంతుడు అని తేడా చూపటంలేదు గదా?! ఇష్టం వచ్చినట్టు రాజశాసనం చేసినా, లేని అపరాధం ఎవరి పైనయినా మోపినా వారు కార్చిన కన్నీరు రాజవంశాన్ని నశించేలా చేస్తుంది! పధ్నాలుగు రాజదోషాలుండగా (ఇక్కడ కొన్నిటినే ఉదహరిస్తున్నాను) వాటిని త్యజించటంలేదు కదా?! (ఉదా. అసత్యం, కోపం, ఏమరుపాటు నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయటం, జ్ఞానులను నిర్లక్ష్యం చేయటం, ఎందరు మంత్రులున్నా ఒకటే ఆలోచన చేయటం, విషయం అర్థం కానివారితో ఆలోచన చేయటం వంటివి) వండిన పదార్థాలను నీవొక్కడివే తినకుండా మిత్రులకు కూడా ఇస్తున్నావు కదా?! (స. 100. శ్లో. 19, 22, 27, 32, 38, 46, 47, 51, 52, 56, 58, 59, 67) అని అంటూ “తండ్రిగారు చేసిన అమ్మకాలు, కుదువపెట్టడం, కొనడం మొదలయిన వ్యాపారాలు మార్చడానికి లేదు” అని హితం చెప్పాడు రాముడు భరతునితో (స. 111).
వనవాసంలో ఋషులకు మాట ఇచ్చి రాక్షస సంహారానికి సిద్ధమయిన రామునికి మానవీయమైన, ధార్మికమైన ప్రశ్నలు వేసిన సీతకు నిర్లక్ష్యం చేయకుండా గౌరవంగా రాముడు సమాధానం ఇచ్చాడు ఇలా: “ధర్మాలు తెలిసినదానవు, నా మీద స్నేహంతో హితం చెప్పావు, నీకు మంచి హృదయం వుంది గనుక ఇలా పలికావు. నీ సలహాకు సంతోషిస్తున్నాను. ఇష్టుడు కానివారికి ఎవరూ ఉపదేశం చేయరుకదా! నీ ఉన్నతికి తగినదే నాకు చెప్పావు” (అర.కా. దశమ స., శ్లో. 2, 21, 22).
అత్రిమహర్షి భార్య అనసూయాదేవి సీతకు అవసరమైనవి, అనుగుణమైనవి ఇచ్చి “నీకేం కావాలో కోరుకో, ఏ వరమైనా ఇస్తా” అని అన్నప్పుడు “ఇలా మీరు నన్ను అడగటమే చాలు” అని సీత నవ్వుతూ వరాలు నిరాకరించింది.
“స్త్రీలలో మెరుపులకున్నంత చంచలత్వం, ఆయుధాలకున్నంత తీక్షణత, గరుత్మంతునికి, వాయువుకూ ఉన్నంత వేగం వున్నది” అగస్త్య మహర్షి సీతను అభినందిస్తూ నాటి సాధారణస్థితి గురించి అన్నాడు (అరకా. దశమ స. శ్లో. 6).
లోకవిరుద్ధమైన ఘోరాలు చేసే క్రూరుణ్ణి ప్రజలు తమ వద్దకు వచ్చిన క్రూరసర్పాన్ని చంపినట్టు చంపివేస్తారు. దురాశతో పాపం చేసేవాడు వడగళ్లు తిన్న పాములాగ ఫలం అనుభవించక మానడు (అరకా. ఏకోన త్రింశ సర్గ. శ్లో. 45).
తియ్యగా, ఇష్టంగా మాట్లాడేవాళ్ళు సులభంగానే లభిస్తారు. ఇష్టంకాని, హితకరమైన విషయాలు చెప్పేవాళ్ళూ, వినేవాళ్లూ కూడా అరుదుగా వుంటారు” మారీచుడు రావణుడితో అన్నమాట (సప్తత్రింశ స. శ్లో. 24).
“జనస్థానంలోని రాక్షసులు వివిధరకాల ఆటలకు సంబంధించిన పద్ధతులు తెలుసుకున్నవారు. వారు సమాజాలుగా ఏర్పడి ఆయా ఉత్సవాలు జరుపుకుంటూ ఆనందంగా వుంటున్నారు” మారీచుడు రావణునితో అన్నాడు (అష్టత్రింశ స. శ్లో. 97).
“ప్రజలకు ప్రతికూలంగా వుండేవాడు, వినయం లేనివాడు రాజ్యాన్ని పాలించలేడు” మారీచుడు రావణునితో.(శ్లో. 11) “లోకంలో సన్మార్గంలో నడుస్తూ ధర్మం ఆచరించే సత్పురుషులు ఇతరులు చేసే అపరాధం వల్ల సపరివారంగా నశించిపోయారు! (శ్లో. 12)
మారీచుని గావుకేకలను రాముని కేకలుగా భ్రమించిన సీత ఘోరంగా లక్ష్మణుని అనుమానిస్తూ అవమానకరమైన మాటలన్నది. ఐతే లక్ష్మణుడూ ఊరుకోలేదు. ఎంతో బతిమాలి వేడుకుని కూడా తాత్కాలిక కోపంలో మొత్తం స్త్రీ జాతినే శంకించాడు ఈ విధంగా: “నీవు ఇలా ఘోరంగా మాట్లాడటం స్త్రీల విషయంలో ఆశ్చర్యకరం కాదు, స్త్రీల స్వభావం ఇది; లోక ప్రసిద్ధం! స్త్రీలు ధర్మం వదలి చపల స్వభావంతో విభేదాలు కల్పిస్తారు. పరుషంగా ధర్మవిరుద్ధంగా చేసే నీ నిందలు ఈ వనదేవతలు సాక్షులుగా వినెదరు గాక. స్త్రీవి కావడం వల్ల దుష్టస్వభావంతో నన్ను శంకిస్తున్నావు. ఛీ! నీవిప్పుడు నశించెదవు గాక. సరే, రాముడున్న చోటికి పోతున్నాను. నీకు క్షేమం అగుగాక, వనదేవతలు రక్షించెదరు గాక!” అని వెళ్లాడు (పంచత్వారింశ స. శ్లో. 29, 30, 31, 32, 33).
‘ధనవంతుడయినా, దరిద్రుడయినా, దోషాలున్నా, లేకున్నా స్నేహితుడే ఉత్తమగతి.’ సుగ్రీవుడు రామునికి ధైర్యం చెప్పే సందర్భం.
‘సరుకులవల్ల, వర్తకులవల్ల నిండా వున్న ఓడ సముద్రంలో అటు ఇటు కదిలిపోతున్నట్లు వాలి తూలిపోయాడు.’ వాలి, సుగ్రీవుల యుద్ధసన్నివేశం లోని వర్ణన.
కిష్కింధకాండలో తార లక్ష్మణుని వద్దకు వచ్చి సుగ్రీవుడు చేసిన ఆలస్యాన్ని క్షమించమంటూ ఇలా అన్నది: “ధర్మం, తపస్సులతో పేరు పొందిన మహర్షులు కూడా కామవశులయి నిరంతరం మోహంతో వుంటారు. ఇక సహజంగా వానరుడయి, చపలస్వభావం గలిగిన సుగ్రీవుడు కామాసక్తుడు కాకుండా ఎలా వుండగలడు?”
లక్ష్మణుడు కోపంతో సుగ్రీవునితో మాట్లాడుతూ “నీవు కప్ప కూతలు కూసే సర్పానివి” అని అంటాడు.
ఆంజనేయుడు శరీరం పెంచి సముద్రం దాటేందుకు సిద్ధమవుతున్న దృశ్యంలో అక్కడి కొండగుహల్లో వున్న విద్యాధరులు మద్యంతో నిండిన పెద్ద బంగారు పాత్రలు, మద్యం పోసే పాత్రలు, మద్యం తాగేందుకు వాడే చిన్న పాత్రలు, మాంసంతో సహా ఇతర భక్ష్యాలు, నేలపై పరుచుకున్న ఎద్దు చర్మాలు, ఆయుధాలూ అన్నీ వదిలేసి లేచి పారిపోయారు భయంతో. విద్యాధరులలో కొందరు బంగరు కంఠాభరణాలతో, తలమీద వజ్రపు పూలతో శరీరానికి ఎర్రని లేపనాలతోనూ ఉన్నారు (సు. కా. ప్రథమసర్గ; శ్లో. 13, 15).
సిద్ధగంధర్వులు ఆకాశయానం చేస్తూన్న ఆంజనేయుని ప్రశంశిస్తూ, “నీవలె ఎవరికి ధైర్యం, సూక్ష్మదృష్టి, బుద్ధి, నేర్పు అనే నాలుగు లక్షణాలుంటాయో వారికి దేనిలోనూ వైఫల్యం వుండదు” అని అన్నారు.
లంకను చేరిన ఆంజనేయుడు కొంత విచారం చెంది సీతను వెదకడంలో తొందర పడరాదనుకుంటూ ‘దూతలు బుద్ధిమంతులమనే అహంకారంతో పనులు చెడగొడుతుంటారు’ అని తలపోశాడు.
రావణాసురుని గృహసముదాయంలో తీవలతో అల్లిన ఇళ్లు, కర్రతో నిర్మించిన కొండల వంటివి వున్నాయి; గోడలపై వర్ణచిత్రాలున్న గృహాలు, ఆటలకోసం ఏర్పాటయిన అంతర్భాగాలున్న ఇళ్లు వున్నాయి (సుం.కా, 6 స. శ్లో. 36, 37).
నదులవద్ద, సమీపంలోని ప్రజలు ముఖ్యంగా స్త్రీలు సంధ్యోపాసన చేయటం పరిపాటి. సీత అలాటి చోటకి వస్తుందని భావించాడు ఆంజనేయుడు, అశోకవనంలో. ‘సీత సంధ్యావందనార్థం ఈ నదివద్దకు రావచ్చు’ (స. 14. శ్లో. 49).
“కామం ప్రతికూల స్వభావం కలది. ఏ వ్యక్తి మీద కామం కలుగుతుందో ఆ వ్యక్తిపై జాలి, స్నేహం కూడా కలుగుతుంటుంది” రావణుడు సీతతో అన్నమాట.
“ఎవడైనా తన మీద ప్రేమలేని స్త్రీని కామిస్తే వాని శరీరానికి తాపం మాత్రమే కలుగుతుంది. తనపై ప్రేమ వున్న స్త్రీని కామిస్తే వానికి మంచి ఆనందం కలుగుతుంది” ఒక రాక్షస స్త్రీ రావణునితో అన్నమాటలు (స. 22. శ్లో. 42).
సీతను చూసి ఆమె వివరాలు తెలుసుకోదలచిన ఆంజనేయుని ప్రశ్నలో ఒక విచిత్ర వివరం వుంది. ఇలా… “వశిష్టుని కోపం వల్లనో, అజ్ఞానం వల్ల కోపం కలిగించినందువల్లనో ఇక్కడికి వచ్చిన అరుంధతివి కాదు గదా!” అని సీతను ప్రశ్నించాడు (సుం. కాం. స. 33, శ్లో. 8). (ఈ శ్లోకం గోరఖ్‌పూర్ ప్రతిలో లేదని, ప్రక్షిప్తం కావచ్చుననీ పుల్లెలవారి వివరణ.)
బ్రహ్మాస్త్రానికి లొంగిన ఆంజనేయుని ఇంద్రజిత్ వెంట వచ్చిన రాక్షసులు జనప నారలతో, చెట్లనారతో నేసిన వస్త్రాలతోనూ బంధించారు. (నాటి జనసామాన్య వస్త్రం నారతో చేసిందన్నది తెలుస్తున్నది.)
‘దూతలను చంపటం లోకమర్యాద కాదు, రాజధర్మ విరుద్ధం. పండితులు కూడా రోషానికి లొంగిపోతే పాండిత్యం కేవలం శ్రమగా మిగిలిపోతుంది’ విభీషణుడు రావణునితో అన్నమాట.
తాను లంకకు నిప్పుపెట్టడం వలన సీతకు కూడా ప్రమాదం జరుగుతుందేమోనన్న ఆలోచనలో ఆంజనేయుడు అనుకున్న అంశాలు ఇవి: ‘మండే అగ్నిని నీళ్లతో ఆర్పినట్లు కోపాన్ని వెంటనే ఆర్పగలిగినవాడు గొప్ప బుద్ధిగలవాడు, ధన్యుడూ గదా! కోపంలో ఎవరు పాపం చేయరు గనుక? చేయకూడని పని, అనగూడని మాట వారికి వుండదు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని ఓర్పుతో తొలగించుకున్నవాడే ఉత్తముడు. రాజస ప్రవృత్తి ఎంత చెడ్డది! అదుపులో వుండదు, చపలత్వం కలిగిస్తుంది.’
సుగ్రీవుని వద్దకు వెళ్లి ఆంజనేయుడు సాధించిన విజయవృత్తాంతం చెబుదాము. ఐనా అందరం ఆలోచించి ఏం చేద్దామంటే అది చేద్దామని యువరాజువంటి అంగదుడు అనటంతో ఆయనలో సమానత్వం గ్రహించి, వానరులు “యువరాజా, మీరు ప్రభువు అయివుండి కూడా ఇలా చెప్పగలిగారు. కానీ ప్రతివారూ ఐశ్వర్యం చేత మదించి ‘నేను’, ‘నేను’ అని అనుకుంటారు గదా!” అని అన్నారు ఆనందించి.
“ఈ కామం(సీత పై) నన్ను కోపసమయంలో, సంతోషసమయంలో, శోకసమయంలో, సంతాపసమయంలో కూడా సమానంగా నిత్యం వెంటాడుతున్నది!” అని రావణుడు తన మంత్రివర్గంతో అన్నాడు (ద్వాదశ సర్గ. శ్లో. 17).
“తుమ్మెద అత్యాసక్తితో రెల్లుపూవు తేనె తాగటానికి ప్రయత్నిస్తే అదెలా విఫలం అవుతుందో అలాగే మంచితనం లేనివారితో స్నేహం పొసగదు, గజస్నానం వంటిది ఇది.” విభీషణుడు రావణునితో అన్నమాటలు (యు.కాం. షోడాశప. శ్లో. 14, 21).
విభీషణాదులను చూసిన సుగ్రీవుడు రామునితో చెప్పిన మాటలనుబట్టి ఆ కాలానికే గల సైన్యం లోని రకాలు: ‘మిత్రుల సైన్యం, ఆటవికులు కూర్చిన సైన్యం, పరంపరాగతమైన సైన్యం, తాత్కాలిక భృతిపై కూర్చుకున్న సైన్యం’వున్నాయి.
“ఒక బుద్ధిమంతుని దగ్గరకు హఠాత్తుగా వెళ్లి ప్రశ్నించగానే అతడు ఆ ప్రశ్నించేవాడి మాటల్ని శంకిస్తాడు. అలాటి సందర్భాల్లో అప్రయత్నంగా లభించిన మిత్రుడిని వంచనపూర్వకంగా ప్రశ్నించడం వలన ఆ మిత్రుడు విముఖుడయిపోతాడు. ఎదుటివాని మాటల్లోని స్వరాన్నిబట్టి తెలుసుకొనగలిగేవారికి ఎంతో నేర్పు వుంటే తప్ప ఎదుటివాని భావం చప్పున తెలుసుకొనటం శక్యం గాదు. ఎంత కప్పుకొన్నా ఆకారం దాచటం సాధ్యంకాదు. అది మానవుల మనోభావాన్ని బలాత్కారంగా ప్రకటించి తీరుతుంది.” విభీషణుని శంకించాలా అక్కరలేదా అన్న విషయంలో రామునికి ఆంజనేయుడు చెప్పిన సలహాలోని అంశం (సప్తదశ స. శ్లో: 60, 61, 64).
“సత్పురుషుల శాంతి, ఓర్పు, రుజుత్వం, ప్రియంగా మాట్లాడటం వంటి సద్గుణాలను వారి అసమర్థతగా భావిస్తుంటారు ఎక్కువమంది. ఆత్మస్తుతి చేసుకొనేవాడు, దుష్టుడు, అన్నిటికీ పరుగులెత్తేవాడిని ఈ లోకం సత్కరిస్తుంటుంది.” రాముడు లక్ష్మణునితో అన్నాడు సముద్రతీరం వద్ద.
“రావణుని మరణంతో వైరం తీరిపోయింది. అతడు నీకేమవుతాడో నాకూ అదే అవుతాడు.” అని రాముడు రావణుని మృతదేహం చూస్తూ విభీషణునితో అన్నాడు.
“పరిశుద్ధమైన ఆలోచనలు, కపటం లేకపోవటమే మీ నిజమైన బలం.” అని గరుత్మంతుడు రామలక్ష్మణులను నాగబంధ విముక్తులను చేసినపుడు వారిని ఉద్దేశించిన ప్రశంశ. (యు.కాం.)
“బలం వుంది కదాని ముందు వెనుకలు చూడకుండా పనులు చేసేవాడు ఏది నీతి, ఏది కాదో తెలుసుకోలేడు. చపలచిత్తుడు తొందరపాటుతో చేసే పనులు అతనికంటే ఇతరులకే అనుకూలంగా వుంటాయి.” అని కుంభకర్ణుడు రావణునితో అన్నాడు. దానికి సమాధానం ఇస్తూ, “బుద్ధిగలవారు అయిపోయినదాని గురించి విచారించరు. గడిచినది గడచిపోయినదే. ప్రస్తుతం ఏది యుక్తమో అదే యోచించు. నా పొరబాటువల్ల కలిగిన దుఃఖాన్ని నీ పరాక్రమంతో సరిచేయి. చెడినవాడిని ఆదుకొనేవాడే స్నేహితుడు, నీతి తప్పినవానికి సహాయం చెయ్యడానికి ముందుకి వచ్చినవాడే బంధువు.” అని అన్నాడు రావణుడు.
సాధారణ సైనికులకు ఎక్కువ భాగం ఎద్దుచర్మంతో, తదితరాలతో చేసిన డాలు వుంటుంది. రాళ్లవర్షానికి గొడుగు అడ్డు పెట్టినట్టు!
ఇంద్రుడు పంపగా వచ్చిన రథం, సారథి, మావటీ రామునివద్ద నిలిచారు. రాముడు రథం అధిరోహించి రథాన్ని జాగ్రత్తగా నడపమని, తొందరపాటు పడవద్దనీ చెప్పి, “… వాస్తవానికి నీకు చెప్పవలసిన పనిలేదు. నేను ఏకాగ్రతతో యుద్ధం చేయదలచాను. అందుకని నీకు కేవలం జ్ఞాపకం చేస్తున్నాను కానీ బోధించడం లేదు.” అని చెప్పాడు గౌరవం, సమభావం వ్యక్తంచేస్తూ, మర్యాద పాటిస్తూ.
రావణుని శరీరాన్ని సుగంధాలు చల్లి, వట్టివేళ్ల చేత కప్పిన ఉన్నిబట్టపై వేదోక్తరీతిలో ఉంచారు. తగు స్థానాల్లో అగ్నిని ఉంచారు. ఆహితాగ్ని కూడా-జీవితకాలంలో ఉపయోగించిన యజ్ఞయుక్త సాధనాలన్నీ చితిలో పడవేసే ఏర్పాటు చేశారు. పెరుగు కలిపిన నేతితో నింపిన స్రువాన్ని అతని భుజంవైపు పడవేశారు. సోమలతను తెచ్చిన బండిని పాదాల దగ్గర, హోమం కోసం ధాన్యాన్ని దంచిన రోలును తొడల దగ్గర ఉంచి, కర్ర/కొయ్యతో చేసిన గిన్నెలను, అరణీకర్ర, రోకలి ఇతర వస్తువులను శాస్త్రం చెప్పిన స్థానాల్లో వుంచి చుట్టూ తిరిగారు. శాస్త్రోక్తంగా బలిమేక ‘వప’ను(మేక కడుపులో వుండే ఉల్లిపొరవంటి పదార్థం) రావణుని ముఖం మీద పరచారు. అతని శరీరంపై పేలాలు చల్లారు, చితికి నిప్పంటించారు.
యుద్ధానంతరం పుష్పకంలో రాముడు విభీషణ, వానరాదులందరితో అయోధ్య చేరే ముందు ఆంజనేయుడిని భరతుని వద్దకు సమాచారం అందించమని రాముడు పంపుతూ “నీవు భరతుని ఆకారము, చూపు, మాటతీరు, హావభావాలు గమనించి నాకు చెప్పు. సర్వసంపదలుగల రాజ్యం ఎవరి మనస్సుని మాత్రం మార్చివేయదు? భరతుడు కావాలనుకుంటే రాజ్యం అతనికే ఇచ్చివేయగలను.”
తిరిగి అయోధ్య చేరి రాజ్యం చేస్తున్న రామునితో ప్రముఖ హితులు తరచు హాస్యోక్తులతో, పరిహాస పూర్వకములైన సంభాషణ జరిపే సందర్భంలో వివిధ ప్రాంతాల ప్రజలు తన, తన పాలన గురించి ఏమనుకుంటున్నారో చెప్పుమన్నపుడు భద్రుడు ఇలా అన్నాడు: “నగరాల్లో, గ్రామాల్లో, కూడలులలో, వనాల్లో, వీధుల్లో ఇలా అనుకుంటున్నారు. రాముడు రావణుని స్పర్శవలన కలిగిన కోపాన్ని లెక్కచేయక సీతను తిరిగి లంక నుంచి తెచ్చుకున్నాడు. రాముడు ఏవగించుకోకుండా ఎలా వున్నాడో, మన భార్యల విషయంలో మనమూ సహించి వుండాలి. రాజు ఎలా చేస్తాడో ప్రజలు కూడా అట్టి అతనిని అనుసరించి ప్రవర్తిస్తారు కదా!” అని జనవాక్కు తెలిపాడు. (ఇక్కడ ‘రజకుని’ ప్రసక్తే లేదు, జనం మాట అని మాత్రమే అన్నాడు భద్రుడు.)
రాముడు లక్షణునితో అన్నమాట: “ప్రతిదినం పౌరుల కార్యాలను పట్టించుకోని రాజు ఘోరనరకంలో పడ్డట్టే. సందేహంలేదు. పనిమీద వచ్చినవారికి బాధ కలిగించటం రాజులకు దోషహేతువవుతుంది” (ఉ. కాం. స. 53).
--------------------------------------------------------
రచన: తల్లావజ్ఝుల శివాజీ,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment