Tuesday, June 4, 2019

వెల్చేరు చేసిన విశ్వనాథ కథల ఆంగ్లానువాదం వెనుక


వెల్చేరు చేసిన విశ్వనాథ కథల ఆంగ్లానువాదం వెనుక




సాహితీమిత్రులారా!

వెల్చేరు నారాయణరావుగారు ఆంగ్లంలోకి అనువదించిన రెండు కథలు–విశ్వనాథ సత్యనారాయణగారివి, ఇటీవల పెంగ్విన్ ఇండియావారు ప్రచురించారు. ఆ పుస్తకం గురించి ఒక రెండుమాటలు చెప్పదలచుకున్నాను. అయితే, ఇది విశ్వనాథ రచనల సమీక్ష కాదు, ఈ పుస్తకంలో అనువదించిన, విశ్లేషించిన విశ్వనాథ రచనల మీద నారాయణరావుగారి విశ్లేషణపై సమీక్ష మాత్రమే. ఆ రెండు రచనలు: హాహాహూహూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు.

ముందుగా వచ్చే ప్రశ్న: విశ్వనాథ అనేకానేక రచనల్లో ఈ రెంటినే నారాయణరావుగారు ఎందుకు ఎంచుకున్నారనేది. ఆ పూర్వరంగాన్ని చూద్దాం.

నారాయణరావుగారి పరిశోధనల్లో ఒక ప్రధాన మార్గం భారతీయ రచనల గురించి పాశ్చాత్యుల ఆలోచనా ధోరణుల్లోని అవకతవకల్ని, ఆ ధోరణుల్ని అనుసరించిన, అక్కడక్కడ అంతకన్నా శ్రుతి మించి అధిగమించిన, భారతీయ పరిశోధకుల మార్గాల్ని ప్రశ్నించటం, ఆధారాల్తో, పటిష్టమైన వాదనల్తో వాటిని ఖండించటం. అలాటి భావాల్లో ఒకటి రచనకీ దాని రచయితకీ ఉన్న సంబంధం చాలా పటిష్టమైందని, ఆ రెంటి మధ్యలో ఇంకెవరూ రారనేది. ఈ భావం మీద తిరుగుబాటే ఆయన తొలి ప్రసిద్ధ రచన తెలుగులో కవితా విప్లవాల స్వరూపం. రచయితకీ ఆ రచనని అందుకునే శ్రోత లేదా పాఠకుడికీ మధ్య మారుతూ వచ్చిన సంబంధాలే కవిత్వ పద్ధతుల్లో మార్పులకి ప్రధాన కారణాలని, అద్భుత భావాలో, ఏ ‘యుగకవుల’ ఆలోచనా స్రవంతులో కావని అందులో ఎంతో సమర్థంగా ప్రతిపాదించారు. కవి కవితావిప్లవాల్ని తీసుకురాడని, కవికీ పాఠకుడికీ మధ్య మారిన సంబంధమే కవితావిప్లవానికి నాంది పలుకుతుందని, అలా మారే సందర్భాన్ని గుర్తించి అందుకు సరిపోయే కవిత్వం రాసినవారే కృతార్థులౌతారనీ, అలా చెయ్యనివారు ఎంత సమర్థులైనా ప్రధాన స్రవంతికి పక్కగానే మిగిలిపోతారని అనేక ఉదాహరణలతో, స్పష్టంగా నిరూపించిందీ గ్రంథం. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎంతో విస్తృతంగా, కూలంకషంగా ఎన్నో ఇతర పుస్తకాల్లోను, వ్యాసాల్లోను విపులీకరించటం జరిగింది.

ఆ తర్వాత శ్రీనాథ రచనల గ్రంథం, కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, కన్యాశుల్కము, ఇంకా అనేక వ్యాసాలు ‘ఆధునికత’ అనే అంశం మీద సుదీర్ఘమైన, లోతైన ఆలోచనల్ని వినిపించాయి. అంతకుముందు ‘విద్యాధికులైన’ భారతీయులు అనేకమంది ఒప్పేసుకున్న భావం పాశ్చాత్యులు వచ్చిన తర్వాతనే ‘ఆధునికత’ భారతదేశంలోకి ప్రవేశించిందని, అంతవరకు వున్న భారతీయ నాగరికత పురాతన భావాలు, ఆచారాలు, శాస్త్రాల ప్రకారమే వుండేదనీ. ఆ ఆలోచనని నారాయణరావుగారు తన రచనల ద్వారా తీవ్రంగా ప్రతిఘటించారు. పింగళి సూరన రచనల్లో గొప్ప ఆధునికత వున్నదని, అది పాశ్చాత్య భావాలకి ఎంతో భిన్నమైన ఆధునికత అని బలంగా వాదించారు. తెలుగు సాహిత్యంలో ‘క్షీణ యుగం’గా భావించబడే కాలంలో ఎన్నో ఆధునికభావాలతో కూడిన రచనలు వచ్చాయని నిరూపించారు. ‘క్షీణయుగం’లాటి పేర్లు పెట్టినవారికి ఆధునికత గురించిన సొంత ఆలోచనలులేక పాశ్చాత్య భావనలని గంపగుత్తగా జీర్ణించేసుకోవటంవల్లే ఇలా జరిగిందని సహేతుకంగా వాదించారు. ‘ఆధునికత’ అనేది అంతకుపూర్వం వున్న సమాజాన్ని, సమాజ భావాల్ని, విలువల్ని, ధ్వంసంచేసి వచ్చేదనే ఆలోచన అపోహ మాత్రమే అని, ఒక శుభ్రమైన, సహజ పరిణామక్రమాన్ననుసరించే ఆధునికత భారతీయ సమాజానికి కొత్త కాదని బల్లగుద్ది వాదించారు. ఈ దృష్టితో చూసి పింగళి సూరనకి నిజమైన వారసుడు గురజాడ అప్పారావుగారని ప్రతిపాదించారు. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసిన లోచూపు. ఐతే, ఆనాటి బెంగాలీ, ఆంధ్ర ‘సంఘ సంస్కర్తలు’ పాశ్చాత్య ఆధునికతా వాదానికి లొంగిపోయి సమాజం కుళ్లిపోయిందని, ఆంగ్ల విద్యా పండితులకే దాని కుళ్లు కడిగి కొత్తదారిలోకి మళ్లించటం తెలుసునని భావిస్తున్న తరుణంలో కన్యాశుల్కం చూపిస్తున్నది ఏ సంస్కర్తల అవసరం లేకుండా సమాజమే అవసరమైతే సమష్టిగా నడుంకట్టి అనుచితాలు జరగకుండా చూడగలదని నిరూపించటమని నారాయణరావుగారి వివేచన. అందుకే గురజాడ ఆధునికత పింగళి సూరన జాడలోని ఆధునికత, పాశ్చాత్యుల మార్గంలోని ఆధునికత కాదు అనేది ఆయన వాదన. రవీంద్రనాథ్ ఠాగూర్, కట్టమంచి రామలింగారెడ్డి, కందుకూరి వీరేశలింగం వంటివారు పాశ్చాత్య ఆధునికతా వాదాన్ని నిరభ్యంతరంగా ఒప్పేసుకుని అలాటి ఆధునికతని భారతదేశానికి వీలైనంత త్వరగా దిగుమతి చెయ్యాలని ప్రయత్నిస్తుంటే ఆ భావాల మీద గురజాడ తిరుగుబాటే కన్యాశుల్కం అని నారాయణరావుగారి అభిప్రాయం.

ఇదీ ఈ పుస్తకానికి పూర్వరంగం.

నారాయణరావుగారు విశ్వనాథ రచనల్లోంచి హాహాహూహూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు ఎంచుకోవటానికి కారణం–గురజాడ తర్వాత తెలుగులో ఇలా పాశ్చాత్యుల ఆధునిక భావనల్ని నిశితంగా ప్రశ్నించిన రచనల కోసం చేసిన వడపోతలో అవి మిగలటం. కాకుంటే విశ్వనాథ తన ఇతర రచనల్లో దీన్ని ఒక విపరీతధోరణికి తీసుకెళ్లి మను ధర్మశాస్త్రాన్ని పాటించాలని, బాల్య వివాహాలు కావాలని వాదించటం, పింగళి సూరనని కూడా కాదనటం, ఇంకా వెనక్కి వెనక్కి వెళ్లిపోవటం చేస్తారు. అది సమర్థనీయం కాదు. ఈ రచనలో నారాయణరావుగారు విశ్వనాథ ఆలోచనావర్తులం లోని ఆధునికతాభావాన్ని తప్ప మరేభాగాన్నీ స్పృశించరు, అది అప్రస్తుతంగా భావించినట్టున్నారు.

సాధారణంగా నారాయణరావుగారి అనువాద రచనలకి ఒక మూస వుంటుంది; ముందుగా అనువదించే రచనల గురించిన పరిచయం, వాటి పూర్వాపరాలు, వాటి సందర్భం గురించిన చర్చ; తర్వాత అనువాదం; చివరగా అనువాదిత రచనల కర్త గురించి, ఆ రచనల గురించి విపులమైన విశ్లేషణ, ప్రపంచ సాహిత్యంలో ఆ రచనలకి ఎందుకు, ఎలాటి స్థానం వుండాలో ప్రతిపాదన, సమర్థన–ఇదీ ఆ మూస. ఈ పుస్తకం కూడ అదే వరసని అనుసరిస్తుంది.

హాహాహూహూ అనేది మనిషి శరీరమూ, గుర్రపు తలా వున్న ఒక గంధర్వజాతి. వాళ్లు ఆకాశచారులు. మనుషులకన్న ఎన్నో రెట్లు పెద్ద శరీరాలు వాళ్లవి. ఒకరోజు ఏదో కారణంవల్ల ఒక హాహాహూహూ రెక్కలు తెగి లండన్‌లో పడతాడు. అక్కడివారతన్ని బంధించి ఒకచోట వుంచుతారు. అక్కడి శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు, అతనితో ‘మాట్లాడ’టానికి ప్రయత్నిస్తారు. అతన్ని ఏం చెయ్యాలా అని మల్లగుల్లాలు పడతారు. చివరికి అతను సంస్కృతంలో మాట్లాడుతున్నాడని, దూరంగా విన్నవాళ్లకే అవి మాటల్లా తెలుస్తున్నాయని, దగ్గరివాళ్లకి కేవలం ఏవో శబ్దాలుగా అనిపిస్తున్నాయని గ్రహిస్తారు. సంస్కృత పండితులు అతనితో సంభాషణలు సాగిస్తారు. చివరకు ఏదో తెలియని కారణంతో అతని రెక్కలు మళ్లీ మొలుస్తాయి; అతను ఆకాశానికి ఎగిరిపోతాడు. ఇదీ టూకీగా హాహాహూహూ వృత్తాంతం.

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు ఉత్తమ పురుషలో రాసిన కథ. కథ చెప్పే వ్యక్తికి ఒక వింతకల వస్తుంది. దాన్లో సంస్కృత పంచతంత్రకర్త విష్ణుశర్మ, ఆంధ్రమహాభారతకర్త తిక్కన కనిపించి అతనితో సంభాషణలు సాగిస్తారు. అవి ఎక్కువభాగం ఆంగ్లభాష గురించి, ఇండియాలో దానివల్ల కలిగిన, కలుగుతున్న పరిణామాల గురించినవి. ఆ కల కొన్నాళ్లు ఒక గొలుసుకలగా సాగిపోతుంటుంది. కలలోనే ఎంతోకాలం కూడ గడుస్తుంది. అలా, ఈ కథ దాదాపుగా మొత్తం వాళ్ల మధ్య సంభాషణల రూపంలోనే వుంటుంది. చివరికి కల ముగియటంతో కథా ఐపోతుంది.

నారాయణరావుగారి ఆలోచనల ప్రకారం, భారతీయుల మౌలిక భావనల మీద పాశ్చాత్యుల విమర్శలని ప్రశ్నించటమే కాకుండా పాశ్చాత్యుల మౌలిక ఆలోచనాసరళి లోని లోపాల్ని ఎత్తిచూపే రచన హాహాహూహూ. ఉదాహరణకి ఈ పుస్తకంలో హాహాహూహూ మనిషి శరీరమూ గుర్రపు తలా వున్నవాడు కనక మనిషా మృగమా అనేది ఆంగ్లేయ పండితుల మౌలిక సందేహం. ప్రాణి ఏదైనా సరే ఐతే మనిషి కావాలి కాకుంటే మృగం కావాలి తప్ప మరో రకం తమకు తెలియదు కనక అలాటిది ఉండదనేది వాళ్ల అహంకారం. మనిషైతేనే కొన్ని హక్కులు వస్తాయి, మృగాన్ని ఏమైనా చెయ్యొచ్చు, బతికుండగానే శరీరభాగాల్ని కోసి పరిశీలించటంతో సహా. ఇది భారతీయ భావనలకి పూర్తిగా విరుద్ధం. అలాగే, దేని గురించైనా జ్ఞానం కలగటానికి దాన్ని ముక్కలుముక్కలుగా కోసి మైక్రోస్కోపుల కింద చూడటం సరైన మార్గం కాదని విశ్వనాథ గంధర్వుడి చేత చెప్పిస్తాడు.

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు విచిత్రమైన శిల్పంతో రాసిన నవలిక. ఈ నవలిక ముఖ్యంగా భారతదేశంలో ఇంగ్లీష్ నేర్పించే పద్ధతుల మీద ఒక తీవ్ర విమర్శ. అలాగే సాహిత్య విమర్శ ఎలాటి పెడధోరణులు తీసుకుంటుందో, సమాజంలో ఇంగ్లీష్ ప్రభావం ఎలాటి విపరీత పరిస్థితులకి దారితీస్తుందో చూపిస్తుంది కూడ. ఇందులో విశ్వనాథ భారతీయ-యూరోపియన్ భాషల మధ్య వున్న మౌలిక భేదాన్ని స్పష్టంగా గుర్తించి వివరిస్తారు. భారతీయ భాషలన్నీ కర్త-కర్మ-క్రియ అనే చట్రంలోవైతే యూరోపియన్ భాషల చట్రం దీనికి భిన్నం (కర్త-క్రియ-కర్మ). ఈ మౌలిక భేదాన్ని స్పష్టంగా అర్థంచేసుకుని, ఆ చట్రం పనిచెయ్యటానికి ఏయే హంగులు ఎలా అవసరమయ్యాయో తెలుసుకుంటే తప్ప ఆ భాషలు నిజంగా ఒంటబట్టవు. ఈ గుర్తింపు ఇంగ్లీష్ చెప్పేవాళ్లకే లేకపోవటం వల్ల వాళ్ల దగ్గర నేర్చుకునేవాళ్లూ నానా అగచాట్లూ పడి చివరికి అయోమయంలో మునిగిపోవటం ఖాయం అని తేలుస్తుందీ నవలిక.

నారాయణరావుగారి దృష్టిలో పాశ్చాత్య విజ్ఞానార్జన విధానాల్ని, కేవలం భౌతిక పరిశోధనలే విద్యాన్వేషణ మార్గాలనే భావనల్లోని లోపాల్ని సున్నితంగా ఎత్తిచూపేవి; భారతీయులకీ పాశ్చాత్యులకీ ఆలోచనా ధోరణుల్లో, సంస్కృతీ సంప్రదాయాల్లో వున్న భేదాలు చాలా మౌలికమైనవి; వాటిని స్పష్టంగా గుర్తించినప్పుడే రెంటినీ అనుసంధించటం సాధ్యమని చాటేవి, ఈ పుస్తకంలో వున్న రెండు రచనలూ.

ఇంతకుమునుపు వచ్చిన విమర్శకులు విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు ఇంగ్లీష్ భాషలో లోపాల్ని ఎత్తిచూపుతుందని భావిస్తే, నారాయణరావుగారు అది సరైన లోచూపు కాదని, ఈ రచన గురి కేవలం భారతీయులకి ఇంగ్లీష్ నేర్పించే పద్ధతులు, అలా ఇంగ్లీష్ నేర్పేవారి అజ్ఞానం మీద తప్ప ఇంగ్లీష్ భాష మీద కాదని నిరూపిస్తారు ఈ పుస్తకంలో.

గురజాడకి వారసుడిగా విశ్వనాథని చూపించటం చాలామందికి కొరుకుడుపడని కొయ్యే కావొచ్చు. ఐతే నారాయణరావుగారు తన రచనల్తో ఒక కొత్త మార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఒక కొత్తచూపుని చూపిస్తున్నారు. ఇలా కూడ చూడొచ్చునని, చూస్తే కొత్త కోణాలు, కొత్త దారులు కనిపిస్తాయని ఆహ్వానిస్తున్నారు. ‘ఓపెన్ మైండ్’తో సాహిత్యాన్ని ఆస్వాదించమని, అలా చేస్తే కొత్త అందాలు, కొత్త భావాలు, కొత్త ఆలోచనలు తెరుచుకుంటాయని చేసి చూపిస్తున్నారు. ఆయన ఆలోచనల్తో మనం ఏకీభవించొచ్చు, వించకపోవచ్చు, అది మనిష్టం. కాని ఆ ఆలోచనల్ని, ఆ విధానాల్ని అర్థంచేసుకోవటం వల్ల మన ఆలోచనాపరిధి విస్తృతమౌతుంది. అలా చెయ్యకపోతే మనమే నష్టపోతాం. కనక ఈ రచనని, నారాయణరావుగారి ఇతర రచనల్ని చదవమని ఔత్సాహిక సాహితీపిపాసులందరికీ ఆహ్వానం.

ఈ పుస్తకం ఇప్పుడు ఇండియాలో మాత్రమే దొరుకుతుంది.
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: