Thursday, May 9, 2019

ఏకవీర నవలకు, నవలానాయికకు ఆ పేరే ఎందుకు?


ఏకవీర నవలకు, నవలానాయికకు ఆ పేరే ఎందుకు?



సాహితీమిత్రులారా!


ఈ మధ్య ఒక ఉత్తరాది వ్యక్తితో సంభాషించేటప్పుడు ‘మీ ఇటీవలి పుస్తకం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. ‘ఏకవీర: విశ్వనాథ కథన కౌశలం’ అన్నాను. సంభాషణ ఇంగ్లీషులో సాగుతోంది. ‘Oh! Then it is about a sole Warrior, or a lone Warrior! What is the name of the hero?’ అన్నాడాయన. ‘నాయకుడు కాదు, నాయిక. ఆమె పేరు ఏకవీర’ అన్నాను. నాయిక పేరు పురుషుని పేరులా ఏకవీర అని ఉండటం ఆయనకు అర్థంకాలేదు. దక్షిణాదిలో ఏకవీరాదేవి ఆరాధన పరిచితమే కాబట్టి ఇక్కడి వారికి ఎవరికి ఒక నాయికకు ఏకవీర అని పేరు ఉండటంలో వైచిత్రి గోచరించదు. ఆ సంస్కృతితో పరిచయం లేకపోవటం వల్ల ఉత్తరాదివారికి అనుమానం కలిగింది.

ఆ సంభాషణ జరిగిన తరువాత ప్రతి అక్షరాన్ని సార్థకంగా ఉపయోగించి విశ్వనాథ రచించిన ఆ నవలలో, నాయికకు ఆ పేరునే ఎందుకు ఎంచుకున్నారు? దేవీనామమే కావాలంటే, అవి అనంతంగా ఉండగా ఏకవీర అనే పేరునే ఎంచుకోవటానికి కారణం ఏమిటి? అని కుతూహలం కలిగింది. ఏదో సార్థకమైన ఉద్దేశం ఉండే ఉండాలి. ఆ కోణంలో పరిశోధన ప్రారంభించేసరికి నిజంగానే గొప్ప అవగాహన, సాంకేతికతలను రంగరించి రచయిత ఆ పేరును ఉపయోగించారని స్పష్టమైంది.

అష్టాదశ శక్తి పీఠాలలో మాహురలోని ఏకవీరాదేవి ఆలయం ఒకటి. దానిని గూర్చి చెప్పుకొనేముందుగా భారతదేశంలో శక్తి ఆరాధనా విధానాల అవగాహన అవసరమౌతుంది. హిందూ మతంలో శక్తి ఆరాధన ఏర్పడిన విధానాన్ని స్థూలంగానైనా తెలుసుకోవలసి ఉంటుంది. ఏకవీర నవలకు, దేవీ ఆరాధన ఏర్పడిన చరిత్రకు సంబంధం ఏమిటి?

భారతదేశంలో దేవీ ఆరాధన ఎన్నో దశలలో రూపొందింది. ఏకవీరాదేవి మహారాష్ట్ర ప్రాంతం నుండి అలంకవరకూ ఎన్నో పేర్లతో ఆరాధింపబడుతోంది. భారతదేశంలో ఏకవీరాదేవికి గల వివిధ నామాలతో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వివిధ దశలలోన ఆ కథలు ఉన్నాయి. అన్ని దశల కథలతోను, ఏకవీర నవలానాయిక కథకు ఎక్కడో ఒక చోట సంవాదం కుదురుతూ ఉంది. ఒక్కొక్క కథను తెలుసుకుంటూ దానికి ఏకవీర కథానాయికతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గ్రహిస్తున్నప్పుడు, విశ్వనాథ తన ముప్పయ్యో వడిలో రచించిన ఆ రచన ఎంత ప్రౌఢమో అర్థం అవుతుంది. ఏకవీర నవల ఎంతగా ఆలోచనామృతమో అనుభవంలోకి వస్తుంది.

భారతదేశంలో శక్తి ఆరాధన రూపొందిన విధానం
“భారతదేశమున ఉదయించిన మతములు- శైవము, శాక్తేయము, వైష్ణవము, గాణాపత్యము, సౌరము మొదలైన అన్నింటిలోనూ ఇంద్రాది దేవతలున్నారు. వారిపైన త్రిమూర్తులు-సత్వ రజస్తమో గుణ ప్రతీకలైన విష్ణువు, బ్రహ్మ, హరుడు. ఈ త్రిమూర్తులకు మూలమైన తత్త్వము విషయముననే అభిప్రాయ భేదములు. ఆ మూల చైతన్యమును శైవులు సదాశివుడని, వైష్ణవులు మహావిష్ణువని, శాక్తేయులు శక్తియని, సౌరులు సూర్యుడనీ, గాణాపత్యులు గణపతియని పిలిచారు.” – శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి, దశమహావిద్యలు, పుట 67.

బహుదేవతారాధన ఉన్న హిందూమతంలో శక్తి ఆరాధనకు ప్రాచీన కాలంనుంచే ప్రాచుర్యం ఉంది. ఆ శక్తినికూడా బహురూపాల్లో ఆరాధిస్తారు. ఏయే శక్తిరూపాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవటం ఒక పెద్ద అధ్యయనం అవుతుంది. సాహిత్యాధ్యయన సందర్భంలో, ఏకవీర నవలానాయికకు రచయిత ఆ పేరునే ఎందుకు ఎంచుకున్నారని ఆలోచిస్తున్న ఈ సందర్భంలో అవసరమైనంత తెలుసుకొనే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది.

“వేదకాలం నుండి శక్త్యుపాసన ఉన్నదని ప్రాజ్ఞులైన పండితుల అభిప్రాయం. ఋగ్వేదంలో ఇంద్ర, అగ్ని, వరుణాది దేవతలకు ప్రాధాన్యం కనిపిస్తుంది. శతరుద్రీయ, నారాయణీయాలలో శివ విష్ణు విశిష్టత గోచరిస్తుంది. ఇలా ఉండగా కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ఋగ్వేదం నుండి కాళీ, తారా, ఛిన్నమస్తాది దేవతా మంత్రాలను ఉద్ధరించి చూపి దశమహా విద్యా సూత్రావళి అనే పేరుతో వాటికి వ్యాఖ్యానం రచించారు. అధర్వణవేదంలో అభిచారిక ప్రక్రియల సందర్భంగా ఆసురీదుర్గ, ప్రత్యంగిర వంటి తీవ్రదేవతల ప్రస్తావన కనిపిస్తుంది. అధర్వణ ప్రత్యంగిరా ఋక్కులను ఆత్మరక్షణకు, శత్రుశిక్షణకు ఉపయోగించటం ప్రాచీన కాలం నుండీ ఉంది.”– శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి దశమహావిద్యలు, పుట 60.

ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం హిందూమతం సారాంశం. సామాజిక శాస్త్రాల నేపథ్యంతో జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేసిన పరిశోధకులు వివిధ సందర్భాలలో ఈ శక్తి ఆరాధనకు సంబంధించిన వివిధ విషయాలను తెలిపారు. ముఖ్యంగా గ్రామదేవతలకు సంబంధించిన అధ్యయనాలలో, జానపద పురాణాల్లో, జానపద గేయాల్లో, జాతుల పుట్టుక, సృష్టి ప్రారంభం గురించిన జానపద సాహిత్యంలో శక్తి ఆరాధనకు సంబంధించిన గాథలు కనిపిస్తున్నాయి. ఆ పండితులు ఈ శక్తి ఆరాధనకు సంబంధించిన దేవతలను మూడు తెగలుగా చెప్పారు. 1. వేదాలలో దేవతలు. 2. ద్రావిడ మాతృకలు. 3. జానపద దేవతలు.

“తాంత్రిక పూజలో ప్రముఖాంగంగా నెగడిన దేవీపూజకు, ప్రాఙ్మత స్వరూపంలో ప్రధానాంశమైన మాత్రారాధనకు భేదాలు తక్కువ. మొదటిదే రెండవ రకపు విధానంగా చోటుచేసుకొని పరిణామం చెందిందన్న విషయం సులువుగా గుర్తించడానికి వీలుంది.” – (మాతృదేవతారాధన) రక్షక దేవత-xxvi(27) జానపద గేయాలు సాంఘిక చరిత్ర-సంపా-బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణ కుమారి, ఆం.ప్ర.సాహిత్య అకాడమి.

“వేదాలలోని అదితి, వాగ్దేవతలు, శ్రీసూక్తంలోని శ్రీలక్ష్మి, వాజసనేయ సంహితలోని అంబిక, శతపథబ్రాహ్మణాలలో కనిపించే ఉమ, దుర్గ, కాళికలు, ముండకోపనిషత్తునందున్న సప్త మాతృకలు, గుహ్యసూత్రాలలోని సినీవాలి, వాశిని, భవాని, భద్ర, దుర్గలు, ద్రావిడ మాతృదేవతలైన పోశమ్మ, ఈదెమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, జానపద దేవతలైన మాత, రేణుక, మాహుర, కొర్రువై, అయ్యై, అక్కలు, మొదలైనవారు అందరూ కలగలపి ఏకతాస్ఫూర్తి పొంది, ఏక సమాహారంగా ఏర్పడి, లక్ష్మీ, దుర్గా, సరస్వతీ, రూపాన త్ర్యంబికా స్వరూప లబ్ధిని పొంది, హైందవ మత విధానంలో శక్తిస్వరూపంగా నెలకొనడం జరిగింది. ఆ తర్వాత అక్కడ పటిష్టంగా ఏర్పడిన పురుషత్వ ప్రతీక అయిన భగవదంశానికి, ఈ శక్తి అర్ధాంగంగా, వాగంశగా, హృదయవర్తిగా ప్రాముఖ్యాన్ని పొందడం జరిగింది.” -పై గ్రంథం-XXviii (28).

శక్తి ఆరాధన- ఛిన్నమస్త-ఇంద్రాణి, ఏకవీర, రేణుక, మాతంగి, ఎల్లమ్మ మొదలైన దేవతల పరస్పర సంబంధం
వివిధ ఆకరాల నుండి ఏర్పడిన దేవీ ఆరాధనలో అష్టాదశ శక్తిపీఠాల ప్రాముఖ్యం ఎంతో ఉంది. దక్షయజ్ఞంలో ఆత్మత్యాగం చేసిన సతీదేవి శరీరాన్ని భుజంపై ఉంచుకొని ఉగ్రతాండవం చేస్తున్న శివుని శాంతింపజేయటానికి, ఆ శరీరంపై విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆమె శరీరభాగాలు వివిధ ప్రదేశాలలో పడి అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. మాహుర గ్రామంలో సతీదేవి కుడిహస్తం పడిన చోట ఆమె ఏకవీరాదేవిగా వెలసి పూజలందుకుంటోంది. ఆమెనే ఏకవేణికాదేవి అనికూడా అంటారు.

ఏకవీర-రేణుక
[అ] జమదగ్ని భార్య రేణుకాదేవి ఐతిహ్యం అందరికీ సుపరిచితమే. ఆమె తన పాతివ్రత్య ప్రభావం చేత ప్రతిరోజూ ఇసుకతో కుండను చేసి, నది ఒడ్డున కనిపించే పామును చుట్టకుదురుగా తలపై ధరించి, నీటిని ఆశ్రమానికి తీసుకొని వెళుతుంది. ఒక రోజు గంధర్వరాజు భార్యతో క్రీడించటాన్ని చూచి ఆమె మనసు చలించింది. ఫలితంగా ఎప్పటిలాగా ఇసుకను కుండగా చేయటం సాధ్యపడదు. నదీతీరానికి పాము రాలేదు. కుండతో నీటిని తీసుకొని రాలేక విఫలమైన రేణుక శిరస్సును, కుమారుడైన పరశురాముడు, తండ్రి ఆజ్ఞానుసారం ఖండించగా అది మాహుర గ్రామంలోని ఏకవీరాదేవిలో లీనమైందని అక్కడి స్థానికులు చెపుతారు. ఇప్పటికీ అక్కడ కేవలం అమ్మవారి శిరస్సు మాత్రమే కనిపిస్తుంది. అనగా ఏకవీరాదేవి పేరిట శక్తి ఆరాధన రేణుక గాథ కంటే ముందుగానే భారతదేశంలో ఉందని తెలుస్తోంది. ఏ రోజుకు ఆ రోజు ఇసుకరేణువులతో చేసిన కుండతో నీరు తీసుకొని రావటం ఆమెకు అలవాటు కనుక ఆమె రేణుక అయింది. అప్పటినుండి ఏకవీరాదేవిని రేణుకగా కూడా ఆరాధించటం ప్రారంభమైంది. రేణుకాదేవి గాథ భారతంలో, భాగవతంలో కనిపిస్తుంది. ఏకవీరాదేవి ఆలయాల్లో మహారాష్ట్రలోని పుణేకు 58 కి.మీ.ల దూరంలో, కార్లా గుహల వద్ద ఉన్న ఆలయం చాలా ప్రసిద్ధమైంది. అక్కడ ఆమెను ఆయీ ఏకవీరగా కొలుచుకుంటారు. ఇక్కడ ఆ మాటకు ఏకైక వీరుడైన పరశురాముని తల్లిగా అర్థం చెపుతారు. మొత్తంమీద రేణుకకు, ఏకవీరకు ఎన్నో చోట్ల అభేదమైన ఆరాధన, వ్యవహారం కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తమిళనాడులలో ఆమెకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా, వరంగల్, తిరుపతి ప్రాంతాలలో ఎల్లమ్మ, రేణుకాఎల్లమ్మ పేరిట ఊరూరా ఒక గుడిగా ఆమె ఆరాధన ఇప్పటికీ కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో రేణుకాసరస్సు, రేణుకా అభయారణ్యం ఆ అమ్మవారి పేరిట నెలకొన్నాయి. జమదగ్నిని కార్తవీర్యార్జునుడు వధించగా ఆ మహర్షితోపాటుగా సహగమనం చేసిన రేణుకాదేవి పేరిట వాటిని అలా వ్యవహరిస్తున్నారు.

వివిధ క్షేత్రాలలో రేణుక కథ
[అ-1] పరశురాముడు రేణుకాదేవి శిరస్సును ఖండించిన కథకు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటిగా రెండు మూడు భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒక కథనం ప్రకారం రేణుకాదేవి నదినుండి వట్టి చేతులతో తిరిగి వచ్చేటప్పుడు ఆ సంగతిని తన దివ్యదృష్టి ద్వారా గ్రహించిన జమదగ్ని ఆమె శిరస్సును ఖండించమని పరశురాముని కోరగా అతని ధనుస్సునుండి వెలువడిన బాణం రేణుక వెనుకగా వస్తున్న మాతంగి శిరస్సును కూడా ఖండించింది. పరశురాముని కోరికపై జమదగ్ని ఆమెను పునర్జీవితురాలిని చెయ్యమని ఆదేశించినప్పుడు, పరశురాముడు తొందరలో ఒకరి శిరస్సును మరొకరి శరీరానికి చేర్చాడు. జమదగ్ని రేణుక శిరస్సు ఉన్న స్త్రీని భార్యగా స్వీకరించగా, మాతంగి శిరస్సు గల స్త్రీ నిమ్న కులాలకు దేవతగా పూజలందుకోవటం ప్రారంభమైంది.

[అ-2] మరొక కథలో రేణుక పరశురాముని నుండి తప్పించుకోవటానికి మాదిగవాడలో ప్రవేశిస్తుంది. అక్కడ ఒక మాతంగి ఆమెను కౌగలించుకొని రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమె శిరస్సు కూడా ఖండించబడుతుంది. అలా ఖండించబడిన రేణుక శిరస్సుకు ఇబ్బడిముబ్బడిగా ప్రతిరూపాలు ఏర్పడి గ్రామగ్రామాలకు వెళ్ళగా గ్రామగ్రామాన ఆమె దేవతగా పూజలందుకొన్నది. మాతంగిగా పేరుపొందింది.

[అ-3] వేరొక కథలో పచ్చికుండతో, నీటిని తేలేని రేణుకను జమదగ్ని ఆశ్రమం నుండి పంపించివేస్తాడు. ఆమె శివుని అర్చించి ధ్యానంలో కూర్చున్నప్పుడు తండ్రి ఆదేశం మీద పరశురాముడు ఆమె శిరస్సును ఖండిస్తాడు. ఆశ్చర్యకరంగా ఆమె శిరస్సు అసంఖ్యాక రూపాలను ధరించి అన్ని దిశలకు తరలిపోయి ఊరికొక దేవతగా పూజలందుకొంటుంది. అదేసమయంలో ఆమె కూడా మరణం పొందక సజీవురాలై ఉంటుంది.

ఈ కథలనన్నింటినీ పరిశీలిస్తే ఒక విషయం మనకు గోచరిస్తుంది. జమదగ్ని మహర్షికి శివుని గుణాలు ఉన్నాయి. ఈ కథలో అతడు తన మాటను ధిక్కరించిన కుమారులను తన చూపుతో దహిస్తాడు. శివునివలెనే తొందరపాటు కలవాడు. మళ్ళీ శీఘ్రమే ప్రసన్నుడౌతాడు. జమదగ్ని శివుడైనప్పుడు, రేణుక పార్వతి అవుతుంది. ఇక పరశురాముడు విష్ణువు అవతారమని మన అందరికీ తెలుసు. ఎన్నో పురాణకథల్లో తొందరపాటుతో శివుడు చేసే పొరపాట్లను విష్ణువు ఉపాయంతో సరిదిద్దుతూ ఉండటం కనిపిస్తుంది. ఈ కథలో కూడా కోపావేశంలో ఉన్న శివావతారమైన జమదగ్ని బారినుండి, కుటుంబాన్నంతటినీ పరశురాముడు తన ఉపాయంతో రక్షించటాన్ని గమనించాలి. లయకారుడు తన పని తాను చేస్తే, స్థితికారుడు తన పని తాను చేశాడు. ఖండిత శిరస్సు అనేక రూపాలు ధరించటం, ఆమె సజీవురాలై ఉండటం, ఆమె నిర్దోషిత్వాన్ని సూచిస్తుంది. రేణుకామాత ఆరాధన అన్ని జాతులలో ప్రవేశించిన విధం ఈ కథలో సూచితమైంది.

దశమహావిద్యలు– ఛిన్నమస్త-రేణుక-ఏకవీర
కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని వేదాలు ఉపనిషత్తులనుండి దశమహావిద్యలకు సంబంధించిన మంత్రాలను, స్తోత్రాలను ఉద్ధరించి చూపారు. ఆ దశమహావిద్యలలో ఛిన్నమస్త ఆరవది. షష్ఠి అనికూడా ఆమెకు వ్యవహారం ఉన్నది. దశమహావిద్యలలో ఆరవదికావటమే కాక, విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురామావతారానికి వెనుక ఉన్న శక్తి ఆమెయే! పరశురాముని తల్లియందు ఛిన్నమస్త ఆవిష్కృతమైంది అంటారు.

రేణుకాదేవి కథను గణపతిముని వేరొక విధంగా చెప్పారు. కార్తవీర్యార్జునుడు జమదగ్ని కామధేనువును కాక రేణుకాదేవినే అపహరించాడనీ, పరశురాముడు అతనిని జయించి, ఆమెను విడుదల చేశాడనీ, పరుల పంచన ఉన్న రేణుక శిరస్సును ఖండించమని జమదగ్ని ఆజ్ఞాపించగా పరశురాముడు దానిని పాలించాడనీ ఆయన అన్నారు. గణపతిముని వేదకాలంనాటి ఇంద్రుడు పురాణకాలంనాటికి ఈశ్వరుడు అయ్యాడని చెప్పి ఇంద్రేశ్వరాభేదసూత్రాలను రచించారు. ఇంద్రాణి అనగా ఇంద్రుని భార్య. శివునికి శక్తికి ఉన్న బంధమే ఇంద్రునికి ఇంద్రాణికి ఉన్నది. శివుని శక్తి శివాని అయితే, ఇంద్రుని శక్తి ఇంద్రాణి. శక్తిలేక ఈశ్వరుడు ఎలా జడుడో, ఇంద్రాణి లేక ఇంద్రుడు జడుడు. ఇంద్రాణియే వజ్రవైరోచని. ఆమె విద్యుద్రూపిణి. అనగా వజ్రాయుధరూపంలో ఇంద్రుడు ప్రయోగించేది ఆమె శక్తినే. ఛిన్నమస్తామంత్రమును రేణుకాదేవి సాధన చేసి ఉండవచ్చనీ, తన ఉపాసకురాలికి అన్యాయం జరిగినప్పుడు ఉపాసిత దేవత అయిన ఇంద్రాణి ఆమెలో ప్రవేశించి పునర్జీవితురాలిని చేసి ఉండవచ్చనీ శ్రీసిద్దేశ్వరానంద భారతీస్వామి అభిప్రాయపడ్డారు. (చూ. దశమహావిద్యలు పే-48) అందుచేత కావ్యకంఠ గణపతిముని చెప్పినట్లుగా ఇంద్రుడు ఈశ్వరుడు ఒకరే అయినప్పుడు, జమదగ్ని మహర్షి ఇంద్రుడవుతాడు. ఇంద్రాణి రేణుక అవుతుంది. విద్యుద్రూపిణి అయిన ఇంద్రాణి ఛిన్నమస్త ఒకరే. ఈ కారణం వల్లనే ఛిన్నమస్తాసాధకులను, వారు సాధనాస్థితిలో ఉన్నప్పుడు స్పృశిస్తే విద్యుత్స్పర్శ కలుగుతుందని చెప్తారు.

ఛిన్నమస్త ఒక చేత కత్తెరను (లేదా వజ్రాయుధాన్ని) ధరిస్తుంది. ఒక చేత స్వయంగా తానే ఖండించిన తన శిరస్సును ధరించి, తన కంఠం నుండి వెలువడుతున్న మూడురక్తధారలలో మధ్యధారను తానే త్రాగుతూ ఉండగా, వర్ణిని, డాకిని అనే చెలులు ఆమె పక్కన నిలబడి మిగిలిన రెండు ధారలను గ్రోలుతూ ఉంటారు. ఆమె దిగంబరమై, రతిక్రీడలో ఉన్న రతీమన్మథులపై పదఘట్టనం చేస్తూ నిలబడి ఉంటుంది. తాంత్రికులు పూజించే రూపం ఇది. ఇందులో ప్రతి వివరానికి నిగూఢార్థం ఉంది. ఈ సందర్భానికి తగినంతగా చర్చ జరుగుతుంది.

ఈ సందర్భంలో ఛిన్నమస్తా ఉపాసకులైన గణపతిముని ఆ దేవత గురించి ఏయే విశేషాలను చెప్పారో తెలుసుకోవటం అవసరం. ఛిన్నమస్తనే ప్రచండచండి అని ఆమె స్వభావానుగుణంగా పిలుస్తారు. గణపతిమునిగారి సంస్కృత గ్రంథం ప్రచండచండీత్రిశతి అందుబాటులో లేకపోవటంవల్ల వారు చెప్పిన విషయాలను తమ “The ten great cosmic powers’ లో ఇంగ్లీషులో వ్రాసిన ఎస్. శంకరనారాయణన్‌గారి వివరణ ఆధారంగా “ఛిన్నమస్త’ తత్వాన్ని ఈక్రింద వివరించటం జరుగుతోంది.

“We have said that Light Prakasa and Sound Nada are the precursors of creation. Prakasa when it becomes delimited as Akasa, Space is Bhuvaneswari. When the delimitation takes the form of duration, Time, it is Kali. When Prakasa gets involved in creation, when it becomes immanent principle in everything, at the same time transcending it, the unexpressed, un manifested Sound turned towards creation in a concentrated consciousness is Bhairavi, while the Sound perceiving itself, Seeing Word is Tara. The interaction of Prakasa and Nada, Light and Sound to precipitate the creation is known to the Tantrics as great Goddess Chinnamasta. The Supreme is Truth-Consciousness-Bliss, sat chit aananda and the Vedic Rishis called these poises of the Supreme as three states, as three worlds constituting the higher hemisphere Parardha. When the Supreme Being extended himself as creation, his three states, and his triple worlds came down in creations three worlds Prithvi, Antariksham, mid-region—and Dyauh heaven – the lower hemisphere, aparardha. This lower triple is the three worlds of Annam physical Prana vital, and Manas mental of the being evolving in creation. The interaction of Light and Sound produce such speed and force that the lower triple is almost precipitated out of the higher triple. It is almost cut asunder from the original source. The Whole purpose of creation is for the one to delight itself in separate existences as many. The many have to cut off from the One to become separate existences. The umbilical cord connecting the mother and child has to be incised to ensure the separate life of the child. The interaction of Light and Sound is so terrific and violent that it almost cuts off the creation from the creator. That is why Chinnamasta is represented as cutting off head, rending asunder the Original Source and the creation which is nothing but extended enveloping body varshma of the creator. In the world of phenomena the interaction of Light and Sound results in thunder and lightning. Chinnamasta is the thunder-clap and the lightning -flash, “Shining like a streak of lightning’ (విద్యల్లేఖేవభాస్వ రా) says Upanishad. That is why Chinnamasta is known as Vajravairochaniya. She is the force of Virochana the specially luminous. (విశేషేణ రోచతే ఇతి విరోచనా:) Who is this Virochana? It is the Supreme himself, the Primordial Prakasa. Vajra is her power which he wields. We know that Vajra is the weapon of Indra. Who then is Indra?

…But to the Vedic seers, Indra is higher than all the cosmos (విశ్వమత్ ఇంద్ర ఉత్థార) He is the one over lord of our triple existence of matter, life and spirit and master of swar which is the luminous world of Divine Mind. He is the sat of the Supreme self-manifested in the Divine Mind…Chinnamasta is the Sakti, force of Indra. He wields as his weapon and smites Vritra who covers with his darkness the luminous rays of pure knowledge. He lashes the clouds with his lightning whip, making them surrender the life-giving waters. Chinnamasta is the thunder destroying all the anti-divine forces; she is the hidden radiance in the heart of the cloud. Ruling over the Divine Mind she acts through the human mind and is the sense behind the senses. There are five senses of action Karmendriyas and five senses of Knowledge Jnanendriyas, the mind is considered as the eleventh sense by Indian thinkers. In, it is known as Antahkarana the inner instrument through which the eye sees, the ear hears and the other senses carry out their functions. The Sanskrit term for sense is significant; it is indria, the power of Indra, the ruler of the mind. Thus one becomes a master of his senses by the grace of Indras force, Chinnamasta. The most powerful activity of the senses is physical sensual activity translated in the language of sex. The great Goddess is depicted as trampling with her feet Rati and Manmatha joined in amorous union. This is the picturesque and dramatic way of the Tantric to drive home the fact that worship of Indras force Chinnamasta grants complete mastery over the sex impulse and other impulses of the senses Indriyas.” – The Ten Great Cosmic powers, S. Sankaranarayanan page 69-72.


ఈ సమస్త సృష్టి, సృష్టికర్త తన నుండి తాను వేరుపడి ఆనందించటానికే జరిగింది. అలా సృష్టి, సృష్టికర్తనుండి వేరుపడే సందర్భంలోనే ఛిన్నమస్త ఆవిర్భవించింది. ప్రకాశం-నాదం ఈ రెండూ సృజనకు పూర్వవర్తులు. ఈ రెంటి అంతఃక్రియ ద్వారా సృజన జరుగుతుంది. ఇవి రెండూ ఘనీభవించి వేగంగా వర్తిస్తాయి (precipitate), ఆదీ అలవిగాని వేగం. ఆ వేగకారణంగానే సృష్టికర్త నుండి సృజన వేరుపడుతుంది. ఈ ఘటనే ఛిన్నమస్తగా ఆరాధింపబడుతోంది. ఛిన్నమస్తకు సృజనకు అందువల్లనే అవినాభావ సంబంధం ఉంది.

భౌతికమై, నామరూపాత్మకమైన ప్రపంచంలో ప్రకాశం-నాదం పొందే అంతఃక్రియ ఉరుములు మెరుపులుగా ఫలిస్తుంది. ఛిన్నమస్త వజ్ర-సౌదామినీ స్వరూపం. వజ్రపాతం అంటే పిడుగుపాటు. వజ్రాయుధం వైరోచనునిది. మనకు వజ్రాయుధం ఇంద్రునిది అని తెలుసు. మరి ఈ వైరోచనుడు ఎవరు? వేదజ్ఞానాన్ని అనుసరించి వైరోచనుడు అంటే వేదాలలో చెప్పిన పరమ ప్రకాశం. విశేషంగా ప్రకాశించేవాడు వైరోచనుడు. అతడే పరబ్రహ్మ, వేద కాలంలో ఇంద్రుడే పరమాత్మగా ఆరాధింపబడేవాడు. స్వయంగా తనను తాను ఆవిష్కరించుకొన్న పరమాత్మ-సత్, వజ్రం అతని శక్తి, ఛిన్నమస్త. ఆ తరువాతికాలంలో ఇంద్రుడు అష్టదిక్కులకు అధిపతిగా, దేవతలకు అధిపతిగా పరిమితిని పొందాడు. జ్ఞాన కాంతిని తన చీకటితో కప్పివేసే వృత్రుని ఇంద్రుడు తన వజ్రాయుధంతో అంతమొందిస్తాడు. సమస్త అసురీశక్తులను నాశనం చేసే పిడుగు ఛిన్నమస్త. జీవుల హృదయాకాశంలోని చీకటి అనే మబ్బులో దాగి ఉన్న మెరుపు ఛిన్నమస్త. ఆమె పరమాత్మ అధికారంతో, మానవ మస్తిష్కం ద్వారా వర్తిస్తుంది. ఆమెయే జీవుల ఇంద్రియాల వెనుక ఉన్న ఇంద్రియం. ఇంద్రియం అన్నపదమే ఇంద్రునితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తోంది. భారతీయ చింతనలో మనస్సును పదకొండవ ఇంద్రియం అంటారు. మిగిలిన పదిలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. మనస్సు వాటిని పాలిస్తుంది. మనస్సును పాలించేది ఇంద్రాణి. ఇంద్రుని శక్తి మనస్సునే అంతఃకరణం అంటారు. కన్ను చూచేది, చెవి వినేది మనస్సు ఇచ్చే శక్తితోనే! ఆమె చేతనతోనే! ఇంద్రుని శక్తి, ఛిన్నమస్త దయ ఉంటే మానవుడు తన ఇంద్రియాలను జయించగలడు. ఇంద్రియాల పరమశక్తియుతమైన భౌతిక క్రియాకలాపం లైంగిక క్రియ. అందువల్లనే ఛిన్నమస్తాదేవి విపరీత లైంగిక కార్యమగ్నులైన రతీమన్మధులపై పదఘట్టనం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఛిన్నమస్త ఆరాధన ద్వారా మానవులకు కామేచ్ఛపై, ఇతర ఇంద్రియ ప్రవృత్తులపై సంపూర్ణ నిగ్రహం కలుగుతుందని ఆమె రూపం సూచిస్తుంది. తాంత్రికులు ఆరాధించేది ఈ రూపాన్నే!

గణపతిముని రచించిన ఉమాసహస్రంలో అమ్మవారి శక్తి మానవుల్లో ఎలా ప్రవేశిస్తుందో ఇలా చెప్పారు.

పూర్ణే శరీరశిల్పే ద్వారేణ బ్రహ్మ రంథ్ర సంజ్ఞేన
నాడీపథేన గత్వా తైజస మణుమా విశస్యమేయబలే-4
అంశేనావిశ్యాదౌ యాసి పునస్త్వం తతశ్చ నిర్యాసి
మార్గాభ్యాం ద్వాభ్యాంత్వం నాడ్యాః పశ్చాత్ పురశ్చ సిద్ధాభ్యాం -5
-ఉమా సహస్రము-ప్రథమ శతకము, తృతీయ స్తబకము.

ఆకాశమార్గాన బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించిన శక్తి సుషుమ్నా నాడిద్వారా శరీరమంతా తేజోరూపాన వ్యాపిస్తుంది. ఆ శక్తి రాకపోకలకు నెలవైన మార్గాలు రెండు. సుషుమ్నా నాడికి ఇరువైపులా ఉన్న ఇళ, పింగళ నాడులు. శక్తి ఒక మార్గాన క్రిందకు దిగి మరొక మార్గాన పైకి వెళుతుందని యోగశాస్త్రం చెబుతోంది. ఆ విషయమే ఈ శ్లోకాలలో వ్యక్తమైంది. ఛిన్నమస్త ఖండిత గళంనుండి వెలువడే మూడుధారలు ఈ మూడు నాడులను సూచిస్తున్నాయి. జీవుని పుట్టుక తరువాత మూసుకుపోయిన బ్రహ్మరంధ్రాన్ని తెరిస్తేకాని దైవచేతన జాగృతంకాదు. తన శిరస్సును తానే ఖండించుకొనే ఛిన్నమస్త రూపంలోని అంతరార్థమిదే.

యోగ శాస్త్రం చెప్పే ఆజ్ఞాచక్రం, రెండుకనుబొమల మధ్యగల ప్రదేశం ఛిన్నమస్త సింహాసనం. ఛిన్నమస్త విద్యుద్రూపిణి. మానవ స్వరూపం ఏర్పడేటప్పుడు, బ్రహ్మరంధ్రం ద్వారా ఈ విద్యుచ్ఛక్తి శరీరంలో ప్రవేశించి, శరీరమంతటా నాడుల ద్వారా వ్యాపిస్తుంది. ఆ శక్తే విద్యుత్తరంగాల రూపాన ఇంద్రియజ్ఞానాన్ని మానవునకు అందజేస్తుంది. మెదడు ఇచ్చే ఆదేశాలు విద్యుత్తరంగరూపాన ఉంటాయని ఆధునిక విజ్ఞానం కూడా అంగీకరిస్తోంది.

ఛిన్నమస్త అమిత వేగవతి. ఆమె చర్యలు ఎంతో త్వరితంగా ఉంటాయి. అందువల్లనే ఆమెను ప్రచండ చండి అన్నారు. ఈ విషయాన్ని శ్రీ ఎస్. శంకరనారాయణన్ ఇలా చెప్పారు.

“Chinnamasta represents the indomitable force, the striking power of the supreme. What is the difference between her action and the action of Kali? Kalis action is fierce and terrible. And she is known as Chandi. But Chinnamasta is more terrible than the terrible Kali and therefore she is known as Prachanda Chandi. Kali represents the power of transformation, the force of evolution in creation. Her action is no doubt strong and shift; but she works with the aid of time. Prachanda chandi is the lords’ weapon, the crash of thunder Vajra; she does not take time, she destroys instantaneously. Kali is the vital force, Pranashakti, while Prachanda Chandi is electric energy vidyutchakti. Kali is in the heart of beings. She is the power of strong emotions and quick actions. Chinnamasta has her seat in the head, in the place between the eyebrows, in the Ajnacenter. She is the power of will and vision.” -ibid.

ఛిన్నమస్తాతత్వం, ఆరాధన ఎంతో పురాతనమైనవి, లోతైనవి. ఏకవీర కథకు దానిని వర్తింపజేసేందుకు ఇంతమాత్రం పరిజ్ఞానం సరిపోతుంది.

ప్రాచీన సాహిత్యంలో ఏకవీరాదేవి ప్రస్తావన
వల్లభరాయని క్రీడాభిరామంలో ఏకవీరాదేవి జాతర ప్రస్తావన ఉంది. ఆమెను, మాహురమ్మను, ఆదిశక్తిని, రేణుకను ఒకరిగానే వ్యవహరించటం కనిపిస్తుంది. ఈమె వర్ణన మూడు సీస పద్యాలలో ఉంది.

సీ.
వందనం బిందరావరు కన్న తల్లికి
దండంబు ఫణిరాజమండనకును
నంజలి సోమసూర్యానలనేత్రకు
నభివందనము జగదంబికకును
మొగుఁ పుజేతులు దేవముని సిద్ధసేవలకు
జమదగ్ని గారావు సతికి శరణు
జోహారు రమణీయ శోభనాకారకు
నమితంబు గిరిరాజనందనకును
తే.
నిత్యకల్యాణి కలికుల నీలవేణి
కాదిశక్తికి వేదవేదాంతసార
కేకవీరకుఁ బూర్ణ రాకేందుముఖికి
నఖిల జననికి సాష్టాంగమనుదినంబు- క్రీడా-127
సీ.
పద్మలోచన భృగుబ్రహ్మ సంయమివంశ
పరిపాటి కల్గినవాభరణమయ్యె
రమణి త్రేతాద్వాపరముల సంధ్యావేళ
మగనితో పెక్కేండ్లు మనువుమనియె
నెలత కానకకన్న నెయ్యంపు కొడుకుచే
చంపించే ముయ్యేడుసారె నరుల
తరుణిహైహయరాజు దంతాస్థిపటలంబు
గవదపేరుగ చేసి కట్టె నఱుత
గీ.
మండపాకను పెనుపాక మాహురమున
నాగసరమున పోలాస ననిచె నింతి
ఓరుగంట నివసించె నీలోత్పలాక్షి
కాకతమ్మకు సైదోడు ఏకవీర- క్రీడా-128
ఈ పద్యాల్లో ఏకవీరకు రేణుకాది దేవతలకు అభేదమే కాక, కార్తవీర్యార్జునుని వంశమైన హైహయ వంశంపై ఆమె తన పగను చెల్లించుకోవటం కూడా గమనించవచ్చు. రేణుకను కార్తవీర్యార్జునుడు అపహరించాడని, పరశురాముడు ఆమెకు విముక్తి కలిగించాడనీ కావ్యకంఠ గణపతిముని చేసిన వాదానికి ఈ పద్యం బలమిస్తోంది.

తక దుమ్ముల్ యకతాళముల్ జవనికల్ తందానలయ్యమ్మకున్
ఏకవీరమ్మకు మాహురమ్మకు అధో హ్రీంకార మధ్యాత్మకున్- క్రీడా,

పై పద్యంలో ఏకవీర, మాహురమ్మలకు అభేదం సూచింపబడింది. అంతేకాక ఈ పద్యం ఆమె హీంకార రూపిణి అని, అనగా ఆదిశక్తి అని స్పష్టం చేస్తోంది. ఈ విధంగా ఏకవీరారాధన ప్రాచీన తెలుగు సాహిత్యంలో కూడా ప్రస్తావించబడింది.
జానపద కథలు-ఏకవీర
ఇక జానపద కథల మూలాలను తెలుసుకోవటం, అవి ఎప్పటివి అని అంచనావెయ్యటం కష్టసాధ్యం. కాని ఏకవీర ఆరాధన జానపద సాహిత్యంలో చాలా విశేషంగా కనిపిస్తోంది. రేణుక, రేణుకాఎల్లమ్మ, మాహురమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాతంగి, అంకమ్మ మొదలైన పేర్లు ఏకవీరాదేవి పేరుకు పర్యాయపదంగా ఎన్నో చోట్ల కనిపిస్తున్నాయి. వివిధగాథలు వినిపిస్తున్నాయి. శక్తి ఆరాధనను నిరసించిన కాకతీయరాజు ప్రతాపరుద్రునిపై అలిగి ఏకవీరాదేవి ఢిల్లీకి చేరి, పాదుషాకు శక్తినిచ్చి, ప్రతాపరుద్రుని జయించేందుకు దోహదం చేసిందని చెప్పే జానపదగాథలు కూడా ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలోని గ్రామదేవతలను గురించి పరిశోధించిన డా. టి. సత్యనారాయణగారు రేణుకాఎల్లమ్మను పౌరాణిక గ్రామదేవత వర్గంలో చేర్చారు. అనగా ఆ వర్గంలోని దేవతల మూలాలు పౌరాణిక గాథలలో కనిపిస్తున్నాయి. ఈమెను శక్తిరూపిణిగా భావిస్తారు. ఈమె కథ జాంబవపురాణంలోను, శ్రీ వీరబ్రహ్మేద్రస్వామి చరిత్రలో శక్తిపుట్టుక కథగాను కనిపిస్తుంది. ఈ కథను పసివిపుట్టాలమ్మ కథ, ఎల్లమ్మ కథ, రేణుకా ఎల్లమ్మ కథ అని కూడా అంటారు. ఈ కథ ఎన్నోసందర్భాలలో కొద్ది భేదాలతో కనిపిస్తోంది.

అంతర్జాలంలో ఎల్లమ్మ కల్ట్ అనే పేర చాలా సమాచారం లభ్యం అవుతోంది. ఎల్లమ్మ దేవత విగ్రహాన్ని మూడుకళ్ళతో తీర్చిదిద్దుతారు. ఉత్సవ విగ్రహాన్ని పంచలోహాలతో చేస్తారు. సాధారణంగా ఊరి చివరలో వేపచెట్టుకింద ఈ గుడి ఉంటుంది. ఈ అమ్మవారిని అన్ని కులాలవారూ ఆరాధిస్తారు. ఈడిగ,చాకలి,మాదిగ, బ్రాహ్మణ కులాలవారందరూ అమ్మవారి జాతరలో తమతమ పాత్రలను నిర్వహిస్తారు. తెలంగాణ ప్రాంతంలో బైండ్లవాండ్లు ఎల్లమ్మ పాటలు పాడుతారు. ఆమె బెస్తలకు పరమ ప్రియమైన దేవత. గ్రామరక్షక దేవతగా ఆమె పూజలందుకుంటుంది. సాధారణంగా ప్రతి గ్రామశివారులో మర్రి లేక వేప చెట్టు క్రింద ఉన్న పుట్ట, ఆ పుట్టను ఆనుకొని ఎల్లమ్మదేవత విగ్రహం, ఆ విగ్రహానికి ఒక గుడి ఏర్పాటై ఉంటాయి. అవి గ్రామాన్ని రక్షిస్తూ నిలచి ఉండటం దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. ఎల్లల్లో నిలిచే అమ్మ ఎల్లమ్మ, ఎన్నో చోట్ల ఆమెను రేణుకాఎల్లమ్మ అనే పేర కొలుస్తూ ఉంటారు. చాలాచోట్ల కేవలం అమ్మవారి శిరస్సు మాత్రమే నెలకొని ఉండటం కనిపిస్తుంది. ఈ ఆరాధనకు వెనకగల ఉద్దేశాన్ని ఈ క్రింద చెప్పిన జానపద గాథ తెలియజేస్తుంది.

రేణుకాదేవి పామురూపంలో జన్మించి పన్నెండు సంవత్సరాల తర్వాత కన్యగా మారి జమదగ్ని మహర్షిని వివాహం చేసుకుందని పసివిపుట్టాలమ్మ కథ చెపుతుంది. రేణుక ఇంద్రుడు శచీదేవిల కుమార్తె, ఆమె పాము రూపంలో జన్మిస్తుంది. ఆమెను చూచి భయపడి ఇంద్రుడు, శచీదేవి ఆ విచిత్రమేమిటని బృహస్పతిని ప్రశ్నిస్తారు. ఆయన ఆమె దేవతలకోసం కాక, నరుల కోసం జన్మించిన ఆదిశక్తి అని చెపుతాడు. అందువల్ల ఆమెను భూలోకానికి తీసుకొని వెళ్ళి ‘ఓం నమః శివాయ’ అనే నామం వెలువడుతున్న పుట్టను వెతికి అందులో ఆమెను పన్నెండు సంవత్సరాలకు సరిపడే సంభారాలతోపాటు పెట్టెలో పెట్టి వదలి, వెనకకు తిరిగిచూడకుండా తిరిగి రమ్మన్నాడు. వెనుకకు తిరిగితే తల వేయి ప్రక్కలౌతుందని చెప్పాడు. దేవేంద్రుడు అలాగే చేశాడు. తండ్రి తనను వదిలివెడుతుంటే భయపడి ఆమె అతనిని పిలిచింది. కానీ దేవేంద్రుడు వెనుకకు మరలక వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె కలియుగంలో దేవేంద్రునికి పూజలు జరగవని, ఆలయం ఉండదని శపించింది. ఆ తరువాత ఆమె పగలు పాముగా ఉంటూ రాత్రిపూట పాపగా మారి అడవిలో సంచరిస్తూ ఉండేది. పన్నెండు సంవత్సరాల తరువాత అటుగా వచ్చిన దండగిరి రాజు, జమిలికాంబ ఆమెను చూచి పెంచుకొని, జమదగ్ని మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తరువాత కథ జమదగ్ని, పరశురాముడు తల్లి శిరస్సును ఖండించటంతో కూడిన రేణుకాదేవి చరిత్ర పురాణాలల్లో ఉన్నట్లుగానే కొనసాగుతుంది.

ఈ కథకు మరొక రూపం కూడా ఉంది. దండగిరిరాజు కొలువుతీరి ఉండగా ఒక కన్య అక్కడ ప్రత్యక్షమయింది. ఆమెను వెంబడించగా ఒక పుట్టలోకి ప్రవేశించి మాయమయింది. రాతిపుట్ట అవటం వల్ల తవ్వే ప్రయత్నం విఫలంకాగా, రాజు కోపంతో గునపాన్ని పుట్టలో దించాడు. అది ఆ కన్య శిరస్సును ఛేదించింది. కన్య పుట్టనుండి వెలువడింది. శిరస్సు బద్దలైనా ఆమె జీవించే ఉంది. ఆమె సూర్య చంద్రులను పళ్ళేలుగా మార్చి చేతధరించి, వాటిలో ధారగా వెలువడుతున్న రక్తాన్ని పట్టి, ఛిద్రమైన మెదడును ఉంచింది. ఆదిశేషువును ఒక చేత ధరించింది. తన ఘోరరూపాన్ని చూసి మూర్ఛిల్లిన ప్రజల నొసట పసుపు కుంకుమలను ఉంచింది. ఆపైన ప్రజలందరూ ఆమెను దేవిగా కొలిచారు. ఆమెను దండగిరిరాజు, జమదగ్ని మహర్షికి ఇచ్చి వివాహం చెయ్యటం అనే కథ కొనసాగుతుంది. పరశురాముడు శిరస్సును ఖండించినప్పటికీ రేణుక జీవించే ఉంటుంది. ఆ మహిమ చూచి ప్రజలు ఆమెను దేవతగా ఆరాధించారు.

తమ మూలపురుషుడైన ఆదిజాంబవముని కలియుగం ప్రారంభం కావటానికి ఆరునెలలు ముందుగా ఆదిశక్తిని తన మంత్రశక్తితో సృష్టించాడని మాదిగ కులంవారు చెపుతారు. జాంబపురాణం చెప్పే కథ ఇలా ఉంది. ఆదిశక్తికి తలిదండ్రులు కాని, భర్త కాని లేరు. పురుష నిరపేక్షంగా వెలసిన ఆదిశక్తి ఆమె. ఆమె తొమ్మిది గడియలలో పెద్దదై తనతో జతకూడే పురుషుడికోసం వెతికింది. జాంబవమునిని చూసి తనతో జతకూడమని కోరింది. అతడు అది సాధ్యంకాదని చెప్పి, ఒక పూజావిధానం ఏదోచెప్పి అలాచేస్తే ఒక కోడి పుంజు అవతరిస్తుందనీ, అది అవతరించగానే ఆమెకు కోడి రూపం కలుగుతుందని చెప్పాడు. అలాగే జరిగి, ఆదిశక్తి కోడిపెట్టగా మూడు గుడ్లను పెట్టి పొదిగింది. వాటినుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెలువడ్డారు. అప్పుడు స్త్రీరూపం పొందిన ఆదిశక్తి తనతో జతకూడమని బ్రహ్మ, విష్ణువులను కోరింది. వారు తిరస్కరించగా వారిని తన మూడో కంటితో భస్మం చేసింది. శివుడు ఆదిజాంబవముని సలహాపై త్రిశూలాన్ని, మూడో కంటిని, మంత్రశక్తిని తనకు ఇస్తే అలాగే కూడుతానని చెప్పి ఆమెను స్నానంచేసి రమ్మన్నాడు. స్నానంచేసి వచ్చి ఆదిశక్తి శివుని వెంటపడింది. అతడు పారిపోయాడు. ఆ క్రమంలో అతడు ఒక పాముపుట్టలో దూరగా అతనిని పట్టుకోవటంకోసం ఆదిశక్తికూడా పుట్టలో దూరింది. శివుడు ఆమె పైకి రాకుండా వెదురు గడను పుట్టలోకి దూర్చగా దెబ్బతిని అలసిపోయి, చివరకు ఆమె కామావేశం అణగిపోయింది. ఈ సందర్భంలోనే వెదురుగడకు కణుపులు ఏర్పడ్డాయని జానపదుల విశ్వాసం. పుట్టనుండి వెలువడి తన శూలాన్ని, మూడోకంటిని, మంత్ర శక్తిని ఇచ్చివెయ్యమని శివుని కోరింది. కాని శివుడు మోసంతో ఆమె ఇచ్చిన మూడోకంటితో ఆమెనే భస్మం చేశాడు. ఆ భస్మరాశిని మూడు భాగాలుగా తన త్రిశూలంతో విభజించి లక్ష్మీ, సరస్వతి, పార్వతులను అందులోనుండి ఏర్పరచి, తన మంత్రశక్తితో భస్మమైన బ్రహ్మ, విష్ణువులను బ్రతికించి త్రిమూర్తులకు వారిని భార్యలుగా చేశాడు.

వేద, పురాణ, జానపద గాథల సమన్వయం
మొత్తంమీద భారత దేశపు శక్తి ఆరాధనలో ఏకవీర ఆరాధన అనూచానంగా వస్తున్నదని ఈ కథలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గాథలన్నీ ఆమెను ఆదిశక్తిగానే నిరూపిస్తున్నాయి. ఛిన్నమస్త, ఏకవీర, రేణుక, ఎల్లమ్మ, మాహురమ్మ ఒకే దేవతకు వివిధ నామాలుగా వ్యవహరింపబడుతున్నాయి. ఈ నామాలలో ఏకవీర అనే పేరు, ఛిన్నమస్త తరువాత అతిప్రాచీనమైనదిగా కనిపిస్తోంది. ఈ గాథలు ఆమె ఆరాధన వేదాలనుండి జానపదులలోకి, జానపదులలో నుండి పౌరాణిక గాథలలోకి ప్రయాణించటాన్ని సూచిస్తున్నాయి. గాథ ఎటునుంచి ఎటు ప్రయాణించినప్పటికీ, అన్ని దశలలోనూ ఆ కథల మధ్య సారూప్యం కనిపిస్తోంది. ఈ అధ్యయనం వల్ల హిందూమతంలోని అన్ని స్థాయిల్లోను, అన్ని జాతుల్లోను, తాంత్రిక వామాచార, దక్షిణాచార విధానాల్లోను ఏకవీరాదేవి ఆరాధన ప్రాచీన కాలంనుండీ జరుగుతూనే ఉందని స్పష్టమౌతోంది.

ఇంచుమించుగా ప్రతిగాథకు కామావేశంతోనూ, సృజనతోనూ, ఇంద్రియ నిగ్రహంతోనూ, సౌశీల్యంతోనూ అనుబంధం ఉంది. జానపద గాథల్లో ఆదిశక్తి కామావేశం పొందటం, బ్రహ్మ, విష్ణువులు ఇరువురూ ఆమెను నిరాకరించగా, శివుడు మోసం చేయటం, ఆమె శక్తిని మూడు భాగాలు చేసి తగ్గించటం కనిపిస్తుంది. ఇది వేదకాలపు పురుషదేవతారాధన, శక్తి ఆరాధనను అధిగమించిన పరిణామాన్ని సూచిస్తోందని జానపద గాథా పరిశోధకులు అన్నారు. అయితే వాసిష్ఠ గణపతిముని వేదాలలో ఉండి, ఆ తరువాత మరుగునపడిన దశమహావిద్యలను పునరుద్ధరించి చూపారు. దశమహావిద్యలలో ఆరవది ఛిన్నమస్త. అందువల్ల సనాతమైన దేవీ ఆరాధనే శక్తి ఆరాధనగానూ, తాంత్రిక పూజావిధానంగానూ రూపొందినట్లుగా అర్థమౌతోంది. పసివి పుట్టాలమ్మ కథలో శచీదేవి కుమార్తె అయిన సర్పరూపంలోని ఆదిశక్తి, తనను పుట్టలో వదలి వెడుతున్న తండ్రి ఇంద్రునికి కలియుగంలో పూజలు లేకుండా పొమ్మని శపించిన ఘట్టం తరువాతి కాలంలో ఇంద్రునికి నిజంగా పూజలు లేకపోవటాన్ని సూచిస్తోంది. వేదకాలంలో పూజలు పొందిన ఇంద్రుడు, తరువాతి కాలంలో విస్మరించబడటం అనే పరిణామం, జానపదులకు కూడా తెలుసని ఈ సంఘటన వల్ల స్పష్టమౌతోంది. మొత్తంమీద ఛిన్నమస్తకు, లేదా ఏకవీరకు లేదా ఎల్లమ్మకు, లేదా రేణుకకు ఇంద్రుని కథతో సంబంధం మాత్రం ఉంటూనే ఉంది. అనగా ఆదిశక్తికి ఇంద్రియాలపై ఆధిపత్యం ఉండటం అనే అంశం ఇందులో అంతర్లీనమై ఉంది. పౌరాణిక గాథల్లో, జానపదగాథల్లోనూ కూడా ఆమెకు, జమదగ్ని మహర్షికి సంబంధించిన గాథలో, మహర్షి భార్య శీలాన్ని అనుమానించటం, దండన విధించటం సామాన్యంగా కనిపిస్తున్నాయి. ఇసుకతో కుండను చేయలేకపోవటం ఆమె మనము చలించిన (ఏకాగ్రతను కోల్పోవటం మాత్రమే!) ఫలితమే కాని, శీలం కోల్పోవటం కాదని గాథలోని తదనంతర ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఆమె తిరస్సు ఖండించబడినా సజీవంగా ఉండటం, ఆమె శిరస్సు వేలసంఖ్యలో రూపొంది వివిధ ప్రాంతాలకు తరలి ఆరాధింపబడటం ఆమె పవిత్రతను సూచిస్తున్నాయి.

మహాభారతంలో రేణుకము కథ
దేవతారాధనతో సంబంధంలేక, కేవలం రేణుకా నామసామ్యంగల సర్పం కథ ఒకటి మహాభారతంలో ఉంది. ఈ కథను శ్రీ బూదరాజు రాధాకృష్ణగారి పురాతన నామకోశంలోని రేణుకము అనే ఆరోపం ఆధారంగా గ్రహించాను. ఈ కథ మహాభారతం, అనుశాసనిక పర్వం ప్రథమాశ్వాసంలో ఉంది. అయితే తెలుగు మహాభారతంలో ఈ కథలోని సర్పానికి పేరు లేదు. బహుశః వ్యాసభారతంలో సర్పం పేరు ఉన్నదేమో తెలియదు. ఈ కథలోని సర్పం విధి, నీతి, కర్మ మొదలైన అంశాలపై కిరాతకునితోను, మృత్యువు, కాలుడు వంటి దేవతలతోను చర్చిస్తుంది. ఒక ఉత్తమ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ కుమారుడు రేణుకము అనే పాముకాటు వల్ల మరణించాడు. ఆమె దు:ఖాన్ని చూడలేని అర్జునకుడు అనే ఒక కిరాతుడు కాటువేసిన సర్పాన్ని వెతికి తీసుకొని వచ్చాడు. దాన్ని ఎలా చంపమంటే అలా చంపుతానని ఆ బ్రాహ్మణ స్త్రీతో అన్నాడు. ఆమె సర్పాన్ని చంపటంవల్ల తన కుమారుడు బ్రతికి రాడు కనుక ఏమీ చేయవద్దన్నది. కానీ ప్రతీకారం చేసే తీరాలని, ఇంద్రుడు కూడా వృతాసురుడు మొదలైన వారిని వధించి ప్రతీకారం తీర్చుకున్నాడని, కిరాతకుడు అన్నాడు. అప్పుడు సర్పం తన తప్పేమీలేదనీ, మృత్యువు తనను ఆదేశిస్తే తాను దాన్ని పాటించాననీ, యజ్ఞఫలం యజ్ఞకర్తకు కాక హవిస్సులు అర్పించే కొయ్య తెడ్డుకు ప్రాప్తించదని వాదిస్తుంది. అప్పుడు మృత్యువు ప్రత్యక్షమై సర్పం ఎలా తన ఆదేశానికి లోబడి ప్రవర్తించిందో తాను కూడా అలాగే కాలుని ఆజ్ఞానుసారం ప్రవర్తించానని, తన తప్పు ఏమీ లేదని అన్నాడు. ఆ వాదంలో ధర్మ సందేహాన్ని తీర్చటానికి కాలుడు కూడా వచ్చి పాల్గొన్నాడు. ఈ పరిణామానికి తన బాధ్యత ఏమీ లేదనీ, ఆ బాలుడు, అతని తల్లుల పూర్వ కర్మఫలాన్ని కేవలం తాను అందజేశానని అన్నాడు. ఎవరి కర్మఫలాలను వారు అనుభవించాలి అనే అంశం ఇక్కడ స్పష్టం. మానవుల కష్టసుఖాలకు వారే బాధ్యులు అనే హిందూమత దృక్పథాన్ని స్పష్టం చేస్తోంది ఈ గాథ.

ఏకవీర నవలతో, అనగా కథానాయిక కథతో పైన చెప్పుకొన్న కథలన్నీ సారాశంలోగానీ, ఏదైనా ఒక బిందువు వద్దగానీ సంవాదం పొందుతూ ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. అది రచయిత నిర్మాణ మర్మజ్ఞతను సూచిస్తోంది.
ఏకవీర నవలానాయిక కథతో ఈ గాథల అనుబంధం
ఛిన్నమస్త-రేణుక-ఏకవీర

ఏకవీర నవల ప్రాయికంగా రెండు జంటల సంసారజీవనం అస్తవ్యస్తంగా నడవటాన్ని చిత్రిస్తోంది. చారిత్రక నేపథ్యంలో చిత్రించిన ఆ గాథలో ఆనాటి మత ఆర్థిక, సాంఘిక జీవన స్థితిగతులు వర్ణితమయ్యాయి. ఏకవీరాదేవి త్వగింద్రియ స్పర్శలక్షణాన్ని చిత్రించటమే ధ్యేయంగా ఈ నవలను రచించానని విశ్వనాథ స్పష్టం చేశారు. వ్యక్తుల ఆంతరంగికమైన విలువలకు, సంఘ ధర్మానికి సంఘర్షణ ఏర్పడటం, ఆ సంఘర్షణలో వ్యక్తులు తమ విలువలను కోల్పోకుండానే, సంఘ ధర్మాన్ని అనుసరించటం ఇందులో చిత్రితమైంది.

“రెండో దశలో నవలలన్నింటిలోనూ స్త్రీ పుంసయోగమే ప్రధానాంశము. ఏకవీరలో ఇది చాలా బలంగా, శిల్పరంజితంగా వ్యక్తమైంది. ఏకవీరాదేవి రేణుక యొక్క ఆధునిక రూపం. రేణుక కథలో కూడా రేణుక మనోవైకల్యానికిగాను శిరచ్ఛేద శిక్షను పొందింది. ఆమెయే తరువాత తాంత్రికులు ఉపాసించే ఛిన్నమస్తాదేవిగా రూపొందింది. కాల్పనికయుగంలో అధికలైన స్త్రీలు ఛిన్నమస్తలు. బలిదానం చేసుకొన్నవాళ్ళు. మాలపల్లిలో కమల, వేయిపడగల్లో మంగమ్మ, మైదానంలో రాజేశ్వరి, చెలియలికట్టలో రత్నావళి, తుఫానులో హేమసుందరీదేవి ఇత్యాదులందరూ ప్రణయభావ సముద్రమథనంలో చిక్కుకొన్నవాళ్ళే. ఎక్కువమంది వ్యక్తినిష్టమైన ధర్మానికి లొంగి ఏకవీరవలె బలియైనవాళ్ళు, మరికొందరు సమాజధర్మాన్ని ఆశ్రయించి మీనాక్షివలె నిలచిపోయినవాళ్ళు”. -కోవెల సుప్రసన్నాచార్య; తెలుగునవల- అతీత-వర్తమాన-భవిష్యత్తులు.(వ్యా) సహృదయచక్రము. పుట-220-221.

పైన ఉదాహరించిన మాటల్లో ఆచార్య సుప్రసన్నగారు కొంతవరకు ఏకవీర నవలలోని అంతర్యానికి దగ్గరగా వచ్చారు. కానీ రేణుకాదేవి ఛిన్నమస్త కాలేదు. ఛిన్నమస్తయే రేణుకగా పూజలందుకొన్నది. అయితే ధర్మకామంనుండి మనస్సు చలించి, ఫలితంగా విషాదంపాలైన వారందరూ ఛిన్నమస్తలే అనే నిర్ణయం గూర్చి ఆలోచించవలసి ఉన్నది. ఎన్ని గాథలను పరిశీలించినా, జమదగ్ని-రేణుకల కథలో ఋషి అనుమానమేకాని ఆమె మనసావ్యభిచరించిన విషయం నిరూపితంకాలేదు. పైగా ఆమెను ఛిన్నమస్త ఆవహించి, పునర్జీవితురాలిని చేసినట్లుగాను, ఆమె శిరస్సు అసంఖ్యాక రూపాలను దాల్చినట్లుగాను, శిరోఖండనం తరువాత కూడా ఆమె సజీవురాలిగా ఉన్నట్లు ఉన్న కథలన్నీ రేణుకాదేవి పవిత్రతనే తెలియజేస్తున్నాయి. ఆ విధంగా పవిత్రతను నిలబెట్టుకొన్న నవలానాయిక ఏకవీర మాత్రమే!

ఏకవీర నవలలో నాయిక తన వ్యక్తిధర్మాన్ని వదులుకోలేదు. అలాగని తన సౌశీల్యాన్ని కూడా కోల్పోలేదు. ఈ కథ చాలా జాగ్రత్తతో అల్లిన అల్లిక. ఆమె మరణం ఒకానొక సహజ పరిణామం. ఆమె ఇంద్రియ శక్తి అనుపమానం. తాను ధర్మచ్యుతి చెందుతానేమో అనే భయంతో ఏకవీర ప్రాణాన్ని వదలింది. ఆమె ప్రాణం వీరభూపతి కౌగిలి తరువాత కూడా నిలబడే ఉంది. భర్త ప్రేమకు నోచని ఆమె, తన ఊహలలో ప్రియునితో విహరించింది. అయితే ఆమెకు ఆ అవగాహన వీరభూపతి కౌగిలిలోనే కలిగింది. ఒకవేళ తన మనస్సులో ఉన్నది భర్తయినట్లైతే ఆమెకు వీరభూపతి కౌగిలే మరణకారణమయ్యేది. కాని తన మనస్సులో ఉన్నది, కౌగిలించుకొన్నది వీరభూపతి అయినందువల్లనే ఆమె ఆ కౌగిలిని మనసా అనుభవించ గలిగింది. (ఎంతగాఢమైన అనుభూతి అంటే ఆమెకు తెల్లవారి మెలకువరాగానే కలిగిన ప్రథమస్మృతి అదే!) ఆ క్షణంలో ఆమెకు తన మనస్సు చేస్తున్న మాయ స్పష్టం అయింది. తన ఊహలలో ఉన్నది ప్రియుడేకాని భర్త కాడు అని స్పష్టమైంది. ఒక వేళ కుట్టాను పూర్వంలాగానే తన మనసులోని పూర్వప్రణయం వల్ల తనకు దూరంగా ఉంటే కథ ఎలా పరిణమించేదో తెలియదు. కాని తాను ఇంతకాలంగా ఎదురుచూస్తున్న భర్తృప్రేమ అప్పుడు లభించనుంది అని మీనాక్షి చెప్పిన వర్తమానం ఆమెను క్రుంగదీసింది. తాను మనసా భర్తకు చెందదు. మనసులో ఒకరిని వలచి, భర్తగా మరొకరితో శారీరక సంసారజీవనం గడపటం ఆమె ధర్మశీలతకు తగని పని. ఆమె ఆ పరిణామాన్ని కనీసం ఊహలోకూడా భరించలేదు. భార్యయైన తాను అందుకు నిరాకరించే మార్గం లేదు. పైగా చిరకాలంగా ఆమె తన శరీరపోషణపై శ్రద్ధచూపలేదు. ఈ కారణాలన్నిటి వల్ల భర్తకౌగిలి ఆమెకు మృత్యుసదృశమైంది. మృత్యువే అయింది. ఆమె ధర్మచ్యుతి చెందలేదు, ధర్మచ్యుతిని పరిహరించటానికి ప్రాణాలను వదలింది. సరిగా రేణుకవలె ఆమె మనస్సు చలించినందుకు కాక ఏకాగ్రత తప్పినందుకు ఫలితాన్ని పొందింది కానీ శీలాన్ని కోల్పోయినందువల్లకాదు. ఆ సంఘటన అనంతరం సుందరేశ్వరుడు ఆమెను పూనటం ఆమె శీలాన్ని కోల్పోలేదు అనటానికి సాక్ష్యం. భగవంతుని ప్రవేశానికి అర్హత కలిగిన ఆమె, ధర్మచ్యుతి పొందింది అని చెప్పటానికి వీలు లేదు. మెరుపు మెరిసినట్లుగా ఉండే ఛిన్నమస్త త్వరితచర్య ఈ ఘట్టంలో కనిపిస్తుంది. నిమిషమాత్రంలో ఏకవీర తన భవిష్యత్తును నిర్ణయించుకొన్నది. తానిక కుట్టాను భార్యగా మనలేదు. సరిగా రేణుక కథలో శిరస్సు ఖండించబడగానే ఛిన్నమస్త ఆవహించి, ఆమెను సజీవురాలిని చేసినట్లు, ఏకవీర కథలో నాయిక మనసా కుట్టాను భార్యాత్వాన్ని వదలిన మరునిముషం సుందరేశ్వరుడు ఆమెను పూనాడు. అందువల్లనే విశ్వనాథ ఈ నాయికకు ఏకవీర అనే పేరును ఎంచుకున్నారు.

అయితే ఈ దేవీ ఆరాధనలో అత్యంత ప్రాచీన నామమైన ఏకవీర పేరును ఎంచుకోవటానికి కారణం ఉంది. వాచ్యతను నివారించి, గోప్యతను కలిగించి, ఆలోచనకు అవకాశాన్ని కల్పించటం ఆయన ఉద్దేశం. ఏకవీర అనే పేరును కాక ఎల్లమ్మ అని గాని, రాకుమారి అయినందున నాజాకైన పేరైన రేణుకను గానీ ఉంచినట్లైతే ఈ కథలో ప్రతీకాత్మకత వాచ్యమై, రచనాకళ లోపించి ఉండేది. ఏకవీరాదేవి అన్న పేరు, రాకుమారికి తగినట్లుగా గంభీరంగాను, అందంగాను అమరింది. ఈ కారణంవల్లనే సుప్రసన్నగారు మనోవాంచల్యంగల ఇతర నవలానాయికలను అందరినీ ఛిన్నమస్తలతో పోల్చటం సరికాదు. ఏకవీరను పోల్చటం మాత్రమే సమంజసం.

అంతేకాదు, ఏకవీర ఛిన్నమస్త అన్న అవగాహన కలిగే అవకాశం ఈ నవల అంతటా అల్లుకొని ఉంది. అది విశ్వనాథ రచనాప్రణాళికలో ఉన్న గాఢత్వాన్ని తెలియజేస్తోంది.

సంసారజీవనం, గృహస్థధర్మం ప్రజాతంతువును కొనసాగించే ప్రాథమిక ఆకరం. సమాజ క్షేమం అంతా గృహస్థధర్మం పైననే ఆధారపడి ఉంది. కామేచ్ఛ ఇందులో ధర్మబద్ధంగా, నియమబద్ధంగా వర్తిస్తుంది. ఛిన్నమస్త సృజనకు సంబంధించిన దేవత. ఆమె ఆరాధన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించి, ముఖ్యంగా కామేచ్ఛను అధిగమించటానికి తోడ్పడుతుంది. ఈ కారణంగా సంసార జీవనధర్మం ప్రధాన సమస్యగాను, నేపథ్యంగాను ఉన్న ఈ కథ ఛిన్నమస్త ఆరాధనకు ప్రత్యక్షంగా సంబంధించి ఉంది. అందువల్ల నాయికకేకాక, నవలకు కూడా ఏకవీర పేరును పెట్టడం ఎంతో ఉచితం, సంసారజీవితంలో అపశ్రుతులను ఎదుర్కొని, తన అంతరంగంలోనే కాక బాహిరమైన పరిస్థితులతో కూడా సంఘర్షణను ఎదుర్కొని, విజయి అయిన నాయికకు ఆమె పేరును ఉంచటం అత్యంత ఉచితమైన అంశం.

సౌదామినీ రూపమైన ఛిన్నమస్తాదేవి స్వభావంవలెనే తొందరపాటు స్వభావంగల (దేవతల ఆగ్రహానుగ్రహాలకు త్వరితగతి గొప్పగుణమే, కాని మానవులకు అది హానినే కలుగజేస్తుంది) నాయిక ఏకవీర ముక్కూ మొగము తెలియని బాటసారికి మనసును ఇచ్చింది. గాఢంగా వలచి అతనిని వివాహమాడాలని కోరుకొంది. కానీ ఆ ఆకాంక్ష నెరవేరక తల్లిదండ్రులు ఏర్పాటుచేసిన వివాహానికి లోబడింది. ఆపై నవల అంతటా ఆమె తన సాంసారిక వాంఛలను భర్తద్వారా నెరవేర్చుకోవాలనే తపనే చిత్రితమైంది. ఆ ప్రయత్నంలో విఫలమవటం, పరిణామం తన చేతుల్లో లేకపోవటం, ముఖ్యంగా మనస్సులో పూర్వప్రియుడు చోటుచేసుకొంటున్న విషయం తన ఎఱుకలోకి రాకపోవటం, ఆ ఆలోచనకు స్పష్టత ఏర్పడకపోవటం గమనార్హం. మనస్సులోని అనుబంధం బుద్ధిదాక రాలేదు.

ఛిన్నమస్త-ఇంద్రాణి ఒకరే. ఇంద్రాణి ఇంద్రియములకే ఇంద్రియం. అనగా మనస్సు. ఆ మనస్సుకు శక్తిని కలుగజేసేది ఇంద్రాణి. ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందిస్తుంది. మనస్సుకు అనుభవంతో సంబంధం లేనప్పుడు ఆ అనుభవం అనుభవం కాదు. ప్రతి ఇంద్రియానికి గ్రహణశక్తిని కల్పిస్తున్నది మనస్పే. ఏకవీరాదేవి త్వగింద్రియానికి గల విశిష్టతే రచయిత నిరూపించదలచిన ప్రత్యేకాంశం. లలితాసహస్రనామాల్లో ‘త్వక్థ్స’(480) అనేది ఒకటి. అనగా ‘త్వక్’(చర్మము) అనుధాతువునందు చేతనారూపముగా నున్నదని భావము.-శ్రీలలితాసహస్రనామస్త్రోత్రము-బ్రహ్మశ్రీ సింహంభట్ల రామమూర్తిశాస్త్రులవారి పరిమళమను ఆంధ్రతాత్పర్యసహితము.

ఏకవీరాదేవిలో చర్మముయొక్క స్పర్శగుణము సహస్రముఖముల ఉత్తేజితమై ఉన్నట్లుగా ఈ నవలలో అనేక సందర్భాలలో వర్ణితమైంది. ఆ ఇంద్రియం ఆమెలో అంతగా ఉత్తేజితమై ఉండటం వెనుక ఇంద్రాణియైన ఛిన్నమస్త అనుగ్రహం, లేదా ఉనికి ఏకవీరలో ఉన్నదని నిరూపితమౌతోంది.

ఆమె త్వగింద్రియము యొక్క స్పర్శగుణము వ్యాప్తి చర్మము దాటి, లోని గోరువెచ్చని రక్తప్రవాహము దాటి తల్యములదాక తాకేనని తోచినదామెకు. ఆమెకు బాహ్యజ్ఞానము పోయినది. ఇంతలో ఈదురుగాలి వెంట చిక్కని వానజల్లు వచ్చి యామె మీద తుఫాను మొదలుపెట్టువేళ సముద్రపు కెరటములొడ్డుననున్న వానిమీద కొట్టుకొన్నట్లు కొట్టుకొనెను. ఆమె పంచేంద్రియగుణములు స్పర్శగుణత్వము పొందెను.

చిన్నప్పటినుండియు ఏకవీరకు వర్షాకాలమన్న తన్మయత్వము. మరియు చిన్నప్పుడు వానలో తిరిగి తండ్రితో దెబ్బలుతిన్నది. మరికొంచెము పెద్దయిన తరువాత పట్టుచీరలు వానలో తడిపి తల్లిచే చీవాట్లుతిన్నది. ఒకసారి వానలో నిలుచుండి బిగుసుకొనిపోయినది. ఇదివరకామె వానలకు, చల్లగాలులకు తన్మయత్వము భజించెడిది. రెండు సంవత్సరములుగా ఆమెలో నొక కొత్తమార్పు వచ్చినది. ఆమెకు గాలి తన చల్లదనమును కొలిచి చెప్పమొదలు పెట్టినది. ఆమె దేహము క్రమక్రమముగా వాయువుయొక్క శైత్యోష్ణతల పరిమాణము కొలుచు విచిత్ర యంత్రమువలె నైనది. కస్తురిపూత, మంచిగంధపు పూత, కప్పురపు పొడి, వట్టివేళ్ళ విసనకర్ర, మలయానిలము-వీని ప్రత్యేక స్పర్శసుఖానుభవమామె మనస్సునకు చక్కగా నేరుపరచి, చదివిన పొత్తములోని యర్థమువలె విజ్ఞాత తత్తద్గూఢత్వ, కించిద్గూఢత్వాగూఢత్వముగా, విస్పష్టముగా తెలియవచ్చెను. – ఏకవీర, అధ్యాయము-20.

ఏకవీర స్పర్శగుణ తీవ్రతను తెలిపే ఈ వర్ణన ఆమెకు వర్షాకాలం అంటే ఉన్న ప్రీతిని కూడా తెలియజేస్తోంది. వర్షాకాలానికి, సౌదామినీరూపమైన ఛిన్నమస్తకు అవినాభావ సంబంధం ఉన్నది. అంతేకాక ఈ నవల అంతటా వర్షాకాల వర్ణన ఎక్కువగా కనిపిస్తుంది. కుట్టానుకు ఎప్పుడు ఆకాశంలో మెరుపు మెరిసినా ఏకవీర స్మరణకు వస్తుంది. మరొక విషయాన్ని గమనించవలసి ఉంది, ఏకవీరకు తెల్లని పట్టుచీరలపట్ల మక్కువ. మెరుపు ఎప్పుడూ తెలివర్ణంలోనే ఉంటుంది. ఛిన్నమస్తా స్తోత్రాలలో ఆమె సూర్యతేజస్వరూపిణిగా వర్ణితమైంది. ఇవి అన్నీ ఏకవీర ఛిన్నమస్తా రూపమనేందుకు నవలలో రచయిత పొందుపరచిన అంతరిక సాక్ష్యాలు.

ఇక ఏకవీర వీరభూపతి కౌగిలిలో పొందిన అనుభవంలో, ఆమె మనస్సుతో అనుబంధం ఉన్న కారణంగా ఆమె శరీరంలో స్పర్శరూపంలో ఛిన్నమస్త జాగృతమవటం కనిపిస్తుంది. వీరభూపతితో అనుభవం:

అతడామె చేతులు తన చేతులతో తాకెను. ఆమె దేహము మీదికొక విద్యుత్ప్రవాహము ప్రవహించెను. ఆమె యొడలంతయు కదలిపోయెను. అతని చేతులామె దేహము చుట్టు చుట్టుకొనెను. అంతవరకు వినవచ్చిన యతని నిశ్వాసవాయువుయొక్క మనోహర మృదుస్వానము వినబడలేదు. ఆ నిశ్వాస వాయువు లోకములోని పూవులన్నియు పూచిన వనముమీది మందమారుతమువలె ఆమె ఘ్రాణేంద్రియమును చూరగొనెను. ఆమె చక్షుస్సులాతని వక్షస్సునే చూచుచుండెను. ఆమె కన్నులలో వైవర్ణ్యముదయించెను. ఆమె త్వగింద్రియము చర్మదఘ్నముగా శిశిరాతి శిశిరమయ్యెను.

అతడామె నెదురొమ్మున కాన్చుకొనినాడు. ఆమె నేత్రములు తెరచుకొని యుండియు అతనివంక చూచుటలేదు. వానికి చూచునట్టి గుణము పోయినది. కన్నులవిండ నశ్రువులు నిండియుండెను. అతని యాకౌగిలింతలోని చల్లదనమామె రక్తములో ప్రవేశించెను. ఆమెకు ఓ ‘భూమధ్యరేఖా’ ప్రాంతస్థుని ఉత్తరధృవ సమీపమున కొక్కసారి కొనిపోయినట్లయ్యెను.

అతడామెను గాఢముగా కౌగిలించుకొనెను. ఆమె ఘ్రాణేంద్రియముకతని నిశ్వాస పరమళమనుభవించు శక్తి పోయినది. గట్టిగా కౌగిలించుకొనుటచేత హృదయమునుండి ధ్వనిరీతి వచ్చిన గాలి యామె కంఠమందు స్తంభించిపోయెను. అతని కౌగిలి చల్లదనమామెలో నరనరమున వ్యాపించినది. ఆమె హృదయములోని సర్వనాళములు ఆ మహాస్పర్శసుఖమనుభవించినవి.

అతడామె పెదవిపై నొక్క ముద్దిడెను. ఆమె జిహ్వేంద్రియమా ముద్దురుచి తెలుసుకొనలేదు. అతని స్పర్శ యీసారి యామెలోని అస్థి సంచయమునకు గూడ తాకినది. ఆమెకు హృదయ సంచలనమునందు మాత్రమే స్థితి! తక్కిన సర్వాణువులయందు ప్రళయము! చక్షుశ్శ్రో జిహ్వాఘ్రాణేద్రియ జ్ఞానమంతయు త్వగింద్రియ మందు లీనమయి యా స్పర్శగుణ మతిభ్రాంత మర్యాదలై ‘ఆమె’యన్న పదార్థ వాచ్యమైన సర్వమునందు నిండినది. ఏకవీర, అధ్యాయము-21.

ఆమె సర్వస్వం స్పర్శగుణమై పోయింది. ‘త్వక్థ్స’ అన్న దేవి గుణం సహస్రముఖముల ఆమెలో నెలకొన్నది. ఇక ఆమె వారింపులను లెక్కచేయక భర్త కుట్టాను కౌగిలించుకొన్నప్పుడు ఆమెలో కలిగిన మార్పులను విశ్వనాథ ఇలా వర్ణించారు. ఈ సందర్బంలో ఏకవీర మనస్సుతో కుట్టానుకు అనుబంధం లేని కారణంగా ఉపసంహరించుకొంటున్న ఛిన్నమస్త గోచరిస్తుంది.

హఠాత్తుగా కుట్టాన్ రెండుచేతులామె దేహము చుట్టుచుట్టుకొనెను. అంతవరకు వినవచ్చుచున్న వైగై తరంగముల తబకల సవ్వడి, గాలి రివ్వుమన్న సవ్వడి యామె చెవులకు వినబడలేదు. ఆమె కన్నులు చీకట్లను చూచుచుండెను. ఆమె ఘ్రాణేంద్రియముకు గాలిలో నొక వగరు వాసన తోచెను. ఆమె త్వగింద్రియము చైతన్య రహితమయ్యెను.

అతడామె ఎదురొమ్మునకాన్చుకొనెను. ఆమె నేత్రములలో చూపు తప్పిపోయెను. ఆమె దేహములోని రక్తము ప్రాణవాయువును భరించలేకపోయినది. ఆ రక్తమంతయు మృత్యుస్పర్శ వలన కలుగు శైత్యమలవరించుకొన్నది.

అతడామెను గాఢముగా నొక్కుకొనెను. ఆమె నాసారంధ్రములోని శ్వాసమాడలేదు. ఆమె నోరు కొంచెముగా తెరచుకొనెను. ఆమెలో నాడి నిలచిపోయెమ.

అతడామె పెదవి తన పెదవితో తాకెను. ఆమె హృదయములో ప్రాణవాయువు నిలచిపోయెను. ఇదియంతయు కన్ను మూసి కన్ను తెరచునంతలో జరిగెను. ఏకవీర-అధ్యాయము-23.

మొదట ఆమె సర్వస్వం త్వగింద్రియమైపోయింది. రెండవసారి త్వగింద్రియముతో సహా సర్వేంద్రియములు జడత్వాన్ని పొందాయి. అక్కడ ఇంద్రియ వికాసం ఇక్కడ ఇంద్రయ జడత్వం స్పష్టంగా వర్ణితమయ్యాయి. ఈ విధంగా కథలోని ఛిన్నమస్తా స్వరూపమైన నాయికకు ఏకవీర అని పేరు పెట్టటంలో విశ్వనాథ సార్థక ప్రయోజనాన్నే ఉద్దేశించారు. అందుకు అనుగుణంగా చిత్రించారు.

జానపద గాథలలో-ఆదిశక్తి-ఎల్లమ్మ-ఏకవీర
ఈ నవలలో ఆ పాత్రను ప్రవేశపెట్టటమే ‘ఒత్తుగా పరచిన మల్లెపూవులలో ఏకవీర గోధుమ వన్నె త్రాచు వలె ముడుచుకొని పండుకొన్నది’ అని జరిగింది. వీరభూపతి కౌగిలిని పొందిన ఏకవీర త్రాచుపామువలె సరసర నడచి వీధిలోకి వెళ్ళినట్లు విశ్వనాథ వర్ణిస్తారు. జానపద గాథలో ఇంద్రునికి, శచీదేవికి పామురూపంలో జన్మించిది ఆదిశక్తి. ఆమె నరలోకాన్ని ఏలే శక్తి. ఆదిశక్తిని బృహస్పతి సలహాపై పుట్టలో వదలి వెళ్లాడు ఇంద్రుడు. అదే విధంగా ఏకవీర తండ్రి ఆమెను కుట్టానుకు ఇచ్చి వివాహం చేశాక ఒకసారి కూడా కూతురు ఎలా ఉందో పరామర్శించలేదు. పన్నెండు సంవత్సరాల పాటు ఆమె ఒంటరిగా అడవిలో గడుపుతుంది. అదే విధంగా ఏకవీర ఒంటరిగా అంతఃపురంలో గడిపింది. ఆమె పగలు ఒక రూపంతోనూ, రాత్రివేళల మరొక రూపంతోనూ సంచరించినట్లుగా ఏకవీర బాహ్యంగా కుట్టాను భార్య స్థానంలో ఉంటూ, ఆదమరచి ఉన్నపుడు మనస్సులోని ఊహల్లో పూర్వప్రియుని నిలుపుకొన్నది. ఆదిశక్తి స్వరూపమైన ఎల్లమ్మ లేదా రేణుకను ఇప్పటికీ ఊరి పొలిమేరల్లో నిలిపి గ్రామరక్షక దేవతగా కొలుస్తారు. గ్రామంలోకి ఏ దుష్టశక్తి జొరబడకుండా ఆమె కాపాడుతుందని విశ్వసిస్తారు. ఏకవీర కూడా ఆదిశక్తి వలెనే ఆనాటి సమాజంలో జరుగుతున్న మతమార్పిడులనే అన్యాయాన్ని ఎదుర్కొని, సమాజరక్షణకు పాటుపడింది.

జాంబపురాణంలో ఆదిశక్తి ఏ పురుషశక్తితో సంబంధం ఏర్పడని దేవత. ఆమెకు తండ్రి లేడు, భర్త లేడు. తాను కోడిరూపంలో పొదిగిన గుడ్లనుండి వెలువడిన బ్రహ్మను, విష్ణువును తన కోర్కెను తీర్చమని కోరుతుంది. వారు నిరాకరించగా తన నొసటి కంటితో వారిని భస్మం చేస్తుంది. శివుడు ఆమె తన మూడోకన్ను, త్రిశూలం, ఆమె వద్దనున్న మంత్రాలను ఇస్తే ఆమె కోర్కెను తీర్చుతానని వాగ్దానం చేశాడు. అమెను స్నానంచేసి రమ్మని చెప్పి ఆమె కోర్కెను తీర్చకనే పారిపోతాడు. ఆమె వెంట పడినప్పుడు దొరకకుండా పుట్టలో ప్రవేశిస్తాడు. ఆదిశక్తి కూడా పుట్టలో ప్రవేశించగా ఆమె బయటకు వెలువడకుండా వెదురుగడను పుట్టలో దూర్చి దానికి కణుపులను ఏర్పరచి ఆమె దెబ్బతినేలాగా చేస్తాడు. అలసిన ఆదిశక్తి తన మంత్రాలను, త్రిశూలాన్ని, మూడోకన్నును తనకు ఇచ్చివెయ్యమని అడుగుతుంది. వాటిని ఇవ్వకపోగా శివుడు ఆమెను భస్మం చేస్తాడు.

ఏకవీర కథకు ఈ కథతో అంతటితో కాక సారాంశంతో సంబంధం ఉంది. ఆమెతో ప్రేమావేశం వీరభూపతిని చూసినప్పుడు పుట్టింది. కాని ఈ కథలో బ్రహ్మ ఆదిశక్తిని నిరాకరించినట్లుగా, ప్రణయ లేఖను అందుకొన్న వీరభూపతి ఆమె కోరికకు స్పందించడు. విష్ణువు ఆదిశక్తిని నిరాకరించినట్లుగా పెళ్ళాడిన కుట్టాను (రాజు విష్ణుస్వరూపుడు అని సంప్రదాయం చెపుతుంది) ఆమె ప్రేమను స్వీకరించలేదు. శివుని వెంటాడిన ఆదిశక్తి భస్మమైనట్లుగా కాలగమనంలో (శివుని మరొక పేరు కాలుడు) కామేచ్ఛతో నలిగిపోయి ఏకవీర చివరకు మరణించింది. ఏకవీర కూడా ఏ పురుషునితోనూ అనుబంధం లేకనే తనువు చాలించింది.

(తెలంగాణా జిల్లాల్లో పిల్లలకు చర్మ వ్యాధులు వచ్చినప్పుడు పొలిమేరలో ఉన్న రేణుకాఎల్లమ్మకు మొక్కులు చెల్లించడం ఆచారంగా ఈనాటికీ కొనసాగుతోంది. చర్మ సంబంధమైన స్పర్శగుణం ప్రధానంగా ఉన్న నవలానాయిక గాధలో నాయికకు ఏకవీర అనే పేరును ఉంచటం అందువల్ల చాలా సహజమైన విషయం.)

మహాభారతములోని సర్పం కథ–ఏకవీర
మహాభారతంలోని కథలో పాము కరచి బ్రాహ్మణ బాలకుడు మరణించటానికి కారణం ఆ బాలకుని పూర్వకర్మమే అని స్పష్టమయింది. ఏ పరిణామాలకైనా జీవుల స్వీయకర్మలే కారణమని, ఎవరి జీవితాలకు వారే బాధ్యులని ఈ కథ సందేశం ఇస్తోంది. అంతో ఇంతో చదువుకొని, వివేకవతి అయిన ఏకవీర తన అంతరంగంలో ఏమి జరుగుతోందో తెలిసికోలేదు. తన సౌశీల్యానికి, తన విలువలకు, తన మనస్సులో జరుగుతున్న నాటకానికి సంబంధం లేకుండా పోయింది. ప్రణయం విఫలమైనప్పుడు ప్రియుని మనస్సునుండి తొలగించి భర్తకు అభిముఖమైనట్లు, కుట్టాను తనను నిరాకరించినప్పుడు, వాటి దేశకాలపరిస్థితులకు అనుగుణంగా ఆమె తన మనస్సును కామేచ్ఛనుండి తొలగించి (ఛిన్నమస్త శక్తిచేత) ఉంటే ఆమెకు మరణం కలిగేదేకాదు. యాచన ద్వారా ప్రేమ పుట్టదు. ఆమె తన సౌశీల్యానికి అనుగుణమైన మానసిక నడవడిని కలిగి ఉన్నట్లైతే ఆమె అర్ధంతరంగా మరణించేది కాదు. ఆమె మరణానికి ఆమే బాధ్యురాలు. ఇలా ఈ కథలోని నీతితో ఏకవీర కథకు సంవాదం కుదురుతోంది.

అన్ని కారణాలచేత విశ్వనాథ సత్యనారాయణగారు తన సృజనశక్తికి పరాకాష్ఠగా ఏకవీర నవలను రచించారని ఋజువు అవుతోంది. తన కావ్యకళావ్యూహ చతురతనంతా ఇమిడ్చి ఏకవీర కథను చెప్పారు. ఆ నవలకు గానీ, ఆ నాయికకు గానీ ఆ పేరుకాక మరొక పేరు పెట్టే అవకాశంలేనంత బిగువుగా, ప్రతిపొరలోనూ అర్థవంతంగా ఆ కథను తీర్చిదిద్దారు.
-------------------------------------------------------
రచన: కామేశ్వరి యద్దనపూడి, 
ఈమాట సౌజన్యంతో

No comments: