Friday, May 3, 2019

చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి


చిన్నయ సూరిగిడుగు రామమూర్తి




సాహితీమిత్రులారా!
చిన్నయ సూరి, గిడుగు రామమూర్తి ఈ రెండు పేర్లూ ఆధునిక కాలంలో తెలుగు భాష చరిత్రలో చాలా పెద్ద పేర్లు. వీళ్లిద్దరి రచనలూ ఏ సందర్భంలో ప్రచారం లోకి వచ్చాయో పరిశీలించడం, వాటివల్ల ఆధునిక వచన రచనకి లాభం కలిగిందా, నష్టం కలిగిందా? అన్న విషయం చర్చించడం, ఈ వ్యాసంలో ఉద్దేశించిన పని. సూరిగారి అభిప్రాయాలు, రామమూర్తి పంతులుగారి అభిప్రాయాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఈ వైరుధ్యం ఆధునిక కాలంలో గ్రాంథిక, వ్యావహారిక భాషా వైరుధ్యంగా వ్యక్తమయింది. చిన్నయ సూరిగారు గ్రాంథిక భాషావాదిగా, రామమూర్తిగారు వ్యావహారిక భాషావాదిగా మన మనస్సుల్లో స్థిరపడిపోయారు. ఈ మాటలు ఈ కాలంలో ప్రచారం లోకి వచ్చిన మాటలు. ఈ రెండు రకాల భాషలకీ వైరుధ్యం ఏర్పడిన రోజులలో అమలులో ఉన్న మాటలు ఒకసారి చూద్దాం. చిన్నయ సూరి ఉద్దేశంలో వ్యాకరణ యుక్తమైన భాష లాక్షణిక భాష (భాషకి లక్షణాన్ని చెప్పేది వ్యాకరణం కాబట్టి). లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యము. గిడుగు రామమూర్తి పంతులుగారి దృష్టిలో ఈ లాక్షణిక భాష పాత పుస్తకాల్లోనే కనిపిస్తుంది. పుస్తకాలకే పరిమితమైన భాష కాబట్టి అది గ్రాంథిక భాష. ఆయన కోరుకున్న భాషకి ఆయన పెట్టిన పేరు వ్యావహారిక భాష.

20వ శతాబ్దిలో భాష విషయంలో తీవ్రమైన వాగ్యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ రెండు జంటల మాటలూ అమలులో వుండేవి.

లాక్షణికభాష X గ్రామ్య భాష
గ్రాంథిక భాష X వ్యావహారిక భాష

ఈ రెండు జంటల పేర్లలో రెండవ జంట పేర్లే ప్రచారంలోకి వచ్చి మొదటి జంట పేర్లు కనుమరుగయి పోయాయి. అంటే లాక్షణిక భాషావాదులు ఓడిపోయారని అర్థం.

ఈ కాలానికి పూర్వం తెలుగుకి వ్యాకరణాలు సంస్కృతంలో ఉండేవి. నన్నయ రాశాడని చెప్పబడుతున్న ఆంధ్రశబ్దచింతామణి (దీనికే నన్నయభట్టీయం అని పేరు), త్రిలింగశబ్దానుశాసనము, అహోబల పండితీయము, ఆంధ్రకౌముది, మొదలైనవి అన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి.

తెలుగులో వచ్చిన ఒకే ఒక్క వ్యాకరణం కేతన ఆంధ్రభాషాభూషణం. దీనికి శాస్త్రగౌరవం కలగలేదు. 19వ శతాబ్దిలో కుంఫిణీ ప్రభుత్వం వాళ్ళు తమ ఉద్యోగస్తులకు తెలుగు నేర్పాలి అనుకున్నారు. కాబట్టి, ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు వచ్చాయి. ఉదాహరణకి, విలియం కేరీ (William Carey, 1814), కేంప్‌బెల్ (A.D. Campbell, 1816), విలియం బ్రౌన్ (William Brown, 1820), మారిస్ (J.C. Morris, 1823), సి.పి.బ్రౌన్ (C.P. Brown, 1840) రాసిన వ్యాకరణాలు. వీళ్ళల్లో బ్రౌన్ ముఖ్యమైనవాడు. అప్పటి కచేరీల్లోనూ, కోర్టుల్లోనూ, అర్జీల్లోనూ, ఇతర పరిపాలనా వ్యవహారాల్లోనూ వాడుకలో వున్న తెలుగు భాష బ్రౌన్ వ్యాకరణంలో కనిపిస్తుంది. వేదం పట్టాభిరామశాస్త్రి లాంటి తొలినాటి పండితులు తెలుగులో రాసిన తెలుగు వ్యాకరణాలలో ఆ రకమైన భాష కనిపించదు. బ్రౌన్ వ్యాకరణంలో వున్న భాషకి ఒక పేరు లేదు. నిజానికి పండితులు ఆ భాషే మాట్లాడేవారు. కాని, ఇంగ్లీషు ఉద్యోగస్తులు తెలుగు నేర్చుకోవాలని ఈ పండితుల దగ్గరకి వెళ్తే వాళ్లు ఈ తెల్లదొరలకి ఆంధ్రశబ్దచింతామణి చెప్పేవాళ్లు. నిత్య వ్యవహారంలో వున్న భాష పండితుల దృష్టిలో వ్యాకరణం వున్న భాష కాదు. అంటే వాళ్ల దృష్టిలో ఈ భాషకి వ్యాకరణం లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ పండితులకి తాము మాట్లాడే తెలుగు ఎలా నేర్చుకున్నారో తెలియదు. వాళ్లు నేర్చుకున్న భాషే వాళ్లు నేర్పగలరు. అంటే వ్యాకరణమే నేర్పగలరు. (ఇప్పటికీ తెలుగు పరిస్థితి ఇదే.)

పండితుల పాఠాలతో విసిగిపోయిన బ్రౌన్ లాంటి తెల్లవాళ్ళు తమ అనుభవం లోకి వచ్చిన తెలుగుకి కావలసిన వ్యాకరణాలు. నిఘంటువులు వాళ్లే రాసుకున్నారు. వ్యాకరణాలు, నిఘంటువులు తయారు చేసినందుకు కుంఫిణీ నుంచి వారికి చక్కటి పారితోషికం లభించేది కూడా. తెలుగు సొంతభాషగా మాట్లాడుతున్న తెలుగు వాళ్ళకి ఈ వ్యాకరణాలు అక్కరా లేదు, ఇంగ్లీషులో రాసిన అవి వీళ్ళకి అర్థమూ కాలేదు. ఈ పరిస్థితుల్లో మెకాలే’స్ మినిట్ (Macaulay’s minute) అని మనకందరికీ పరిచయమైన పత్రంలో ఉన్న కొత్త ఆలోచన ఇంగ్లీషు పాలకులకి నచ్చింది. మొత్తం పరిపాలన అంతా ఇంగ్లీషులోనే జరపాలని, తెలుగు వాళ్లకే ఇంగ్లీషు నేర్పి వాళ్ళని ఒక రకమైన ఇంగ్లీషు వాళ్లుగా తయారు చేయాలని ఈ కొత్త అభిప్రాయం సారాంశం. దీని ఫలితంగా ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకోవడం మానేశారు. దానితో పాటు ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు మరుగున పడిపోయాయి.

పద్ధెనిమిదవ శతాబ్ది చివరి కాలం నాటికి రాజులు దెబ్బతిని పోయారు. ఒకరి తరువాత ఒకరుగా కుంఫిణీ ప్రభుత్వ ప్రాబల్యానికి లొంగిపోయారు. కుంఫిణీ ప్రభుత్వం నయానా భయానా, ఆ రెండూ చెల్లకపోతే మోసానా ఈ రాజ్యాలకి సైనిక అధికారం లేకుండా చేసింది. తెలుగుదేశంలో కుంఫిణీ ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోట్లాడిన ఆఖరి రాజ్యం విజయనగర రాజ్యం. ఒక పక్క ఫ్రెంచివాళ్ళు, ఇంకొక పక్క ఇంగ్లీషువాళ్ళు దక్షిణదేశంలో ప్రాబల్యం కోసం పోటీ పడుతూ ఉండగా తెలుగు ప్రాంతంలో స్థానికంగా వైరాలు ఉన్న విజయనగరం, బొబ్బిలి రాజ్యాలు, ఇంకా ఇతర చిల్లర రాజ్యాలు తమ తగాదాల పరిష్కారం కోసం ఒకరు ఇంగ్లీషు వాళ్ళని, ఇంకొకరు ఫ్రెంచి వాళ్లని సహాయం కోరుతూ ఉండేవారు. ఫ్రెంచి వాళ్ళని ఓడించి స్థిరంగా ఇంగ్లీషు కుంఫిణీ అధికారాన్ని సంపాదించుకున్న తరవాత ఈ స్థానిక సంస్థానాలని ఒక దాని వెనక ఒకటి తమ ఆధీనం లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ చరిత్ర వివరంగా చెప్పడానికి ఇది చోటు కాదు కాని, విజయనగర రాజులు ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకోకుండా పద్మనాభం అనే చోట యుద్ధం చేశారని చట్రాతి లక్ష్మీనర్సకవి రాసిన పద్మనాభ యుద్ధం చెప్తుంది. కానీ ఈ పద్మనాభ యుద్ధకావ్యం విజయనగర రాజుల ఓటమిని ఒప్పుకోదు. అలాగే బొబ్బిలి రాజులకి ఫ్రెంచి సేనాని బుస్సీకి మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి ఓడిపోయినా దిట్టకవి నారాయణకవి రాసిన రంగరాయ విజయం కూడా బొబ్బిలి ఓటమిని ఒప్పుకోదు. ఆ రాజులు వీరస్వర్గం పొందినట్లు గానో మరోవిధంగానో వారిని పైచేయిగా ఈ కావ్యాలు చూపిస్తాయి. ఈ కావ్యాలు చదివితే, సాంస్కృతికంగా ఈ రాజులు తమ ప్రపంచంలో నిర్మించుకున్న వాతావరణానికీ — ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వమూ బుస్సీ దొరా అమలు చేస్తున్న రాజకీయ, సైనిక వ్యూహాలకీ మధ్య పెద్ద అగాధం ఉందని మనకి బోధ పడుతుంది. తమ మనస్సుల్లో వీరత్వం, గౌరవం మొదలైన నమ్మకాలు ఒక పట్టాన ఈ రాజులు పోగొట్టుకోలేదు. దేశమంతా ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చింత చచ్చినా చావని పులుపు లాగా వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని, మర్యాదల్ని, విశ్వాసాల్ని, ఎక్కడో ఒకచోట అట్టే పెట్టుకున్నారు. రాజ్యంలో సైనికాధికారం పోయిన తరువాత వీళ్ళు నిజానికి పన్నుల వసూలు చేసే జమీందార్లు మాత్రమే అయ్యారు. రైతుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి, ఆ పన్నుల్లో కొంత భాగం ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వానికి, దాని తర్వాత దాని స్థానంలో వచ్చిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఏటేటా చెల్లించి, వాళ్ళ అనుమతితో ఈ జమీందార్లు బతుకుతూ ఉండేవారు. తర్వాత తర్వాత ఈ పన్నుల్ని వసూలు చేసే పనిని బ్రిటిష్ ప్రభుత్వం వేలం వేసేది. ఆ వేలంలో రకరకాల కులాల వాళ్ళు పాట పాడి కొనుక్కుని జమీందార్లు అయ్యారు. అలాంటి జమీందార్లలో ఒకప్పుడు రాజ్యాధికారానికి అలవాటు పడ్డ వెలమ దొరలు, వాళ్ళతో పాటు ఎప్పుడూ రాజ్యాధికారం లేని బ్రాహ్మణులు, వైశ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ జమీందారీ విస్తీర్ణాన్ని బట్టి, దాని మీద వచ్చే పన్నుల ఆదాయాన్ని బట్టి, బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు పోగా మిగిలిన ఆదాయాన్ని బట్టి, ఈ జమీందారులు పెద్దాచిన్నాగా రకరకాల స్థాయిల్లో ఉండేవారు (తూమాటి దోణప్ప, 1969).

రాజులు పోయిన తరవాత, అంటే దాదాపుగా 18వ శతాబ్దాంతానికి పండితులు, కవులు బతకడానికి ఆధారం లేని వాళ్ళయ్యారు. అందులో ఏ కొద్దిమందికో తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండేవి. అవి రైతులకి అమరకానికి ఇచ్చి ఆ రైతు పండించిన పంటలో కొంత భాగం వీళ్లకివ్వగా, ఆ డబ్బుతో ఈ కవులు, పండితులు సుఖజీవనం చేస్తూ వుండేవాళ్ళు. పుస్తకాలు చదవడం, కవిత్వం అల్లడం వీళ్ళకి వచ్చిన ఒకే ఒక విద్య. ఆ విద్య పోషింపబడటానికి కవిత్వాన్ని ఆదరించేవాళ్ళు కావాలి, పాండిత్యాన్ని గౌరవించేవాళ్లు కావాలి; ఆ దశలో ఈ కవులు, పండితులు పోషకుల్ని తయారుచేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. జమీందార్లకి అర్థం కాకపోయినా పెద్ద పెద్ద సమాసాలతో పద్యాలు చెప్పి, వాళ్లకి లేని ఆస్థానాలని కల్పించి, ఆ జమీందార్లకి మహారాజులని, కవిపోషకులని గౌరవకరమైన బిరుదులిచ్చి, వాళ్ళ ఆస్థాన కవులమని, ఆస్థాన పండితులమని పేర్లు తమకిచ్చుకుని ఈ కవులు, పండితులు బతుకుతుండేవాళ్లు.

కాని, తెలుగులోనే పని చేస్తున్నవాళ్లు ఒక ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చేది. వాళ్ళు కవులే కానీ పండితులు కారు. పండితులు అవాలంటే సంస్కృతంలో వ్యాకరణము, అలంకారశాస్త్రము క్షుణ్ణంగా రావాలి. పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు. పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే. ఈ పరిస్థితుల్లో తెలుగు కవులకి పాండిత్య గౌరవం లేకుండా పోయింది. జమీందారుల దగ్గరికి వెళ్లి తమకి వచ్చిన సంస్కృతాన్ని హడావిడిగా చూపించుకోగల శక్తి సంస్కృత పండితులకే ఉండేది. పెద్దగా చదువుకోని ఈ జమీందారులు సంస్కృత పండితుల హడావిడి చూసి ఉబ్బితబ్బిబ్బై పోయేవారు. వాళ్ళ ఎదుట నిలబడి, సంస్కృత పండితులతో పోటీ పడగలమని ధైర్యంతో మాట్లాడగలిగిన తెలుగు కవులు ఉండేవారు కారు. ఈ సంగతి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి జీవితచరిత్ర చూస్తే బాగా బోధపడుతుంది. తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు. అందుచేతనే వాళ్ళు ఆశువుగా పద్యాలు చెప్పడం, వందమంది అడిగిన ప్రశ్నలకి, వాళ్ళు ఇచ్చిన సమస్యలకీ పద్యాల్లోనే సమాధానాలు, పూరణలు చెప్పి, ఆ పద్యాలన్నీ మళ్ళా వాళ్ళే ధారణ పట్టి తిరిగి మరుపు లేకుండా అప్పచెప్పడం — ఇలాంటి విద్యలవల్ల వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు. కాని, అంతకు ముందు పరిస్థితి చూస్తే సంస్కృత విద్వాంసులదే పైచేయి. గీర్వాణం అంటే దేవతల భాష కానీ గీర్వాణం అంటే గర్వం, పొగరుమోతు తనం అనే అర్థాలు తెలుగులో వచ్చాయి. తిరుపతి వెంకట కవుల పుణ్యమా అని తెలుగుకి ఆస్థాన ప్రవేశము, సాహిత్య గౌరవము ఏర్పడ్డ తర్వాత ‘తెలుగు మీరిపోతోంది’ అనే మాట కూడా అందుకే వచ్చింది. తెలుగుకి, సంస్కృతానికి ఈ రకమైన పోటీ కొన్నేళ్ల పాటు కొనసాగింది.

ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం — (తెలుగు భాషతో నిండిన కావ్యం ఇనుముతో చేసిన నగ లాంటిది) అని సంస్కృత పండితులు ఈసడిస్తే,

సంస్కృతారణ్య సంచారి విద్వన్మత్తేభ శృంఖలం — (సంస్కృతమనే అడవిలో యధేచ్ఛగా తిరిగే పండితుడు అనే ఏనుగుని కట్టేసే గొలుసు ఇది) అని తెలుగు కవులు అనేవారుట. చాటు ప్రపంచంలో జ్ఞాపకం వుండే శ్లోకం ఈ వైరుధ్యాన్నే తెలియ పరుస్తుంది (వెల్చేరు, షూల్మన్, 1998).

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి కన్నా ఒక 20, 30 ఏళ్ళు ముందుకి వెళ్లి చూస్తే ఈ వివాదాలు ఇంకా బలంగా కనిపిస్తాయి. తెలుగు కవులకి, పండితులకి ఆసరాగా నన్నయ తిక్కనలు ఉన్న్నారు కానీ శాస్త్ర పండితులు ఎవరూ లేరు. జమీందార్ల పోషణలో వుండే తెలుగు కవులు, సంస్కృత పండితులు ఇలాటి అంతర్గత వైరుధ్యాలతో సతమతవుతూ వుండేవారు. తెలుగు వ్యాకరణం సంస్కృతంలో వుంది. అది సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు. పండితులు అంటే సంస్కృత పండితులు అనే పేరే వున్నా తెలుగులో కవి అనే పేరుకి అంత గౌరవమూ సంపాదించి తెలుగులో తాము చెప్పే కవిత్వమంతా ప్రామాణికం చెయ్యడానికి, అంటే శాస్త్ర గౌరవాన్ని సంపాదించుకోవడానికి, తెలుగు కవులు ప్రయత్నించేవారు. ఇలాంటి వారిని గౌరవిస్తే తప్ప జమీందార్లకి కూడా సాహిత్యపోషకులు అనే బిరుదు వచ్చేది కాదు. కుంఫిణీ ప్రభుత్వం తెలుగుని ఏ రకంగా చూచినా జమీందార్లు మాత్రం ఆంధ్రశబ్దచింతామణి ఒప్పుకున్న తెలుగునే ఆదరిస్తూ వచ్చారు. తమ ఆశుకవిత్వంతో, శతావధానాలతో జమిందార్లనే కాకుండా డబ్బున్న విద్యావంతులని కూడా ఆకర్షించిన తిరుపతి వెంకట కవులు కూడా తమ కవిత్వాన్ని ఎదుర్కునే పండితులతో పోట్లాడి, తమ ప్రయోగాలు వ్యాకరణ రీత్యా సమర్ధించుకోవడానికి ప్రయత్నించి, చివరికి ‘తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది’ అనే మాట అన్నా, వ్యాకరణాన్ని మాత్రం వాళ్లెప్పుడూ కాదనలేదు.

తెల్లదొరలు తెలుగు నేర్చుకోవడం మానేసి తెలుగువాళ్లకే ఇంగ్లీషు నేర్పడం మొదలుపెట్టిన తరువాత తెలుగుకి ఏ దిక్కూ లేకుండా పోయింది. ఒక పక్క జమీందార్లు చెప్పుకోదగ్గ బలంగా యెక్కడా లేరు. ఇంకొకపక్క కుంఫిణీ వారు తెలుగు వాళ్లకి ఇంగ్లీషు నేర్పే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర ప్రాంతంలో స్కూళ్లలో తెలుగు చెప్పేవారు. వీళ్లకోసం తెలుగు పండితులు వ్యాకరణాలు, కథల పుస్తకాలు రాశారు. ఆ వ్యాకరణాలలో ముఖ్యమైనవి: వేదం పట్టాభిరామశాస్త్రి – ఆంధ్ర వ్యాకరణము లేక పట్టాభిరామ పండితీయం, రావిపాటి గురుమూర్తిశాస్త్రి – తెనుగు వ్యాకరణం, పుదూరి సీతారామశాస్త్రి – ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము, వేదం వెంకటరమణశాస్త్రి – లఘువ్యాకరణము, తాడినాడ వెంకయ్య – ఆంధ్రవ్యాకరణం, ఇత్యాది. ఈ వ్యాకరణాలతో పాటు రావిపాటి గురుమూర్తి శాస్త్రి రాసిన విక్రమార్కుని కథలు, ఆయనే రాసిన పంచతంత్రం, దీనితో పాటు అందరికీ పరిచయమైన పెద్ద బాలశిక్ష (పుదూరి సీతారామశాస్త్రి), పాటూరి రామస్వామి రాసిన శుకసప్తతి కథలు పఠనపాఠనాలలో వుండేవి.

చిన్నయ సూరి
పరవస్తు చిన్నయ 1809లో, సాతానులు అనే చాత్తాద వైష్ణవ సంప్రదాయంలోని కుటుంబంలో పుట్టాడు. నిడదవోలు వెంకటరావుగారు రాసిన చిన్నయ సూరి జీవితము ప్రకారం చిన్నయ పదహారేళ్ళొచ్చేదాకా అక్షర జ్ఞానం లేకుండా పెరిగాడు. ఎప్పుడో ఒకసారి కంచి రామానుజాచార్యులుగారు చదువుసంధ్యలు లేని ఈ కుర్రవాణ్ణి తిడితే అప్పట్నించీ చదువు కోవడం మొదలు పెట్టి సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో గట్టి పట్టు సాధించాడు. అప్పుడు పండితులకందరికీ కుంఫిణీ ప్రభుత్వమే పెద్ద ఆధారం. మున్షీలుగాను, ఇంగ్లీషువారికి తెలుగు పాఠాలు నేర్పించే ట్యూటర్లు గాను, కొద్దిమొత్తాలకే ఈ పండితులు ఉద్యోగాలు కుదుర్చుకొనేవారు. అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి, పండితుల ఆర్ధిక పరిస్థితుల గురించి మనకు సరయిన సమాచారం లేదు. కాని, కుంఫిణీవాళ్ళు ఫోర్ట్ సెయింట్ జార్జి కోటలో ఏర్పరిచిన కళాశాలలో ఒక తెలుగు పండితుడికి ఒక మోస్తరు ఎక్కువ జీతంతో ఉద్యోగం ఇచ్చేవారని తెలుసు. (ఈ కళాశాల 1840లో మూసివేయబడి, ఆ తరువాత ప్రెసిడెన్సీ హైస్కూలుగా మారింది.) మొట్టమొదట ఆ ఉద్యోగంలో వేదం పట్టాభిరామశాస్త్రిగారు, ఆయనకు సహాయకుడిగా రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు నియమించబడ్డారు. ఏ ఉద్యోగాలు లేని పండితులకి ఈ రెండు ఉద్యోగాలు గొప్ప పదవుల కిందే లెక్క. కోటలో ఉన్న కాలేజీలో తెలుగు పండితుడికి నెలకు 70 రూపాయిలు జీతం ఇచ్చేవారు. (వేదం పట్టాభిరామశాస్త్రిగారికి 175 రూపాయిల జీతం వచ్చేదని నిడదవోలు వెంకటరావుగారు చెప్తున్నారు.) పుదూరి సీతారామశాస్త్రిగారు 1847లో రిటైరు అయిన తరువాత ఆ తెలుగు ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వారే కాకుండా కొంత ఇంగ్లీషు కూడా వచ్చిన వాళ్ళకోసం కళాశాల వారు ఒక ప్రకటన చేశారు. దానికి చిన్నయ అర్జీ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఆ కళాశాలకు అధ్యక్షుడు ఎ.జె. అర్బత్‌నాట్. అర్జీ పెట్టుకున్న చిన్నయని ఒక పండిత సభవారు పరీక్షించాలి. ఆ పరీక్షలో నెగ్గినవాళ్లకే ఆ ఉద్యోగం వస్తుంది. చిన్నయని, ఆ ఉద్యోగానికే అర్జీ పంపిన పురాణం హయగ్రీవశాస్త్రిని, పండితులు పరీక్షించి ఆ ఇద్దరిలో చిన్నయే సమర్ధుడు అని పండిత సభ వారు నిర్ణయించారు. అప్పటి కాలమాన పరిస్థితులు మనకి అంతగా తెలియవు కానీ పండితులలో కులభేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. అందులోను, బ్రాహ్మణ కులంలో పుట్టని చిన్నయ మీద చిన్నచూపు ఉండేది (చూ: ఆరుద్ర, స.ఆం.సా. పు:28-29 సం.10, 1990; బూదరాజు రాధాకృష్ణ, పరవస్తు చిన్నయ సూరి, పు. 12, 1995). పండితులందరూ శాస్త్రి అనే బిరుదు పెట్టుకునేవారు. కేవలం వైదీకులే కాకుండా నియోగి అయినా రావిపాటి గురుమూర్తి కూడా శాస్త్రి అనే పేరే పెట్టుకున్నాడు. చిన్నయకి శాస్త్రి అనే బిరుదు ఎందుకు లేదు అని అర్బత్‌నాట్ అడిగాడట. తాను అబ్రాహ్మణుడవటం చేత ఆ బిరుదుకి తను అర్హుణ్ణి కానని చిన్నయ అన్నాడట. అయితే ఏ బిరుదు పెట్టుకుంటావు అని అడిగితే సూరి అనే బిరుదైతే తనకి నప్పుతుంది అన్నాట్ట. అర్బత్‌నాట్ ఆ ప్రకారమే అప్పటి వారి ఆచారం ప్రకారం సూరి అనే అక్షరాలతో చెక్కిన బంగారపు కడియం ఒక్కటి ఇంగ్లండు నుంచి తెప్పించి చిన్నయకి బహుమతిగా ఇచ్చాడట. చిన్నయ అప్పటినుంచీ చిన్నయ సూరి అనే పేరుతొ ప్రచారం లోకి వచ్చాడు. చిన్నయ సూరి బాలవ్యాకరణానికి పూర్వం సూత్రాంధ్రవ్యాకరణం అని, పద్యాంధ్రవ్యాకరణం అని, ఆంధ్రశబ్దానుశాసనం అని అనేక వ్యాకరణాలు రాసి పెట్టుకున్నాడు. కానీ తెలుగులో చివరికి బాలవ్యాకరణమనే పేరుతొ 1858లో ఒక వ్యాకరణం ప్రకటించాడు. ఇది చిన్నయ సూరి దృష్టిలో కేవలం చిన్న పిల్లల కోసం రాసిన వ్యాకరణం.

“మును మదుపజ్ఞం బగుచుం
దనరిన వ్యాకృతిని సూత్రతతి యొకకొంతం
దెనిఁగించి యిది ఘటించితి
ననయము బాలావబోధ మగు భంగిఁదగన్

తెనుఁగునకు శబ్దలక్షణ
మనయం బరయంగ వేడ్క నందినవారల్
తనరఁగ నీవ్యాకరణం
బున మూలంబయినకృతిని బోలఁ గనఁదగున్”

అని చిన్నయ సూరి ఆ వ్యాకరణం చివర పద్యాల్లో రాసుకున్నాడు. (బాలవ్యాకరణము, దూసి రామమూర్తిశాస్త్రి వ్యాఖ్యానంతో, వావిళ్ల, మద్రాసు, 1937.)

సెయింట్ జార్జి కోటలో వున్న కళాశాలలో తెలుగు పండిత పదవి దొరకకముందు చిన్నయ కొన్నాళ్ళు సి. పి. బ్రౌన్ దగ్గర పని చేశాడు. బ్రౌన్ పద్ధతులు చిన్నయకు నచ్చలేదో, చిన్నయ రచనా పద్ధతులు బ్రౌన్‌కి నచ్చలేదో, ఆ ఉద్యోగంలో చిన్నయ ఎక్కువ కాలం ఉండలేదు. అంతకు ముందు మిషనరీ స్కూలు లోను, పచ్చియప్ప హైస్కూలులోను (1844-47) పని చేసినప్పటికీ, సెయింట్ జార్జి కోటలో వుద్యోగం దొరికిన తరువాతే చిన్నయకి కొంత స్థిరమైన, సుఖమైన జీవితం ఏర్పడింది. (1857లో ప్రెసిడెన్సీ హైస్కూలు మద్రాసు విశ్వవిద్యాలయంగా మారినాక చిన్నయసూరి మొట్టమొదటి తెలుగు విభాగాధిపతిగా ఉద్యోగం కొనసాగించాడు.) ఈ కాలంలోనే అతను పంచతంత్రంలో మిత్రలాభం, మిత్రభేదం రాసి ప్రచురించాడు. చిన్నయ బహుశా అర్బత్‌నాట్ ప్రాపకం వల్లే కావచ్చు, మద్రాసు స్కూల్ బుక్ సొసైటీలో (దీనినే ఉపయుక్త గ్రంథకరణసభ అంటారు) సభ్యుడయ్యాడు. అతని అధికార ప్రాభవం వల్లో లేక ఇతర కారణాల వల్లో అతని బాలవ్యాకరణం, పంచతంత్రంలో మిత్రలాభం, మిత్రభేదం (ఈ రెండు అర్బత్‌నాట్‌కే అంకితం యిచ్చాడు) పిల్లలకు పాఠ్యగ్రంథాలుగా వాడేవారు. దీని తరవాత బహుజనపల్లి సీతారామాచార్యులుగారు బాలవ్యాకరణంలో చెప్పని విషయాలని కలుపుకుని ప్రౌఢ వ్యాకరణము, దానితో పాటు తెలుగుకి ఇప్పటికీ పనికొస్తున్న శబ్దరత్నాకరము అనే నిఘంటువు రాశారు. ఈ మూడింటి వల్ల గ్రాంథిక భాషకి ఒక బలమైన దన్ను ఏర్పడింది. వ్యాకరణము, నిఘంటువు భాషకి ప్రాణం లాంటివి. ఇవి తెలుగు భాషకి బలమైన శాస్త్ర ప్రాతిపదికని ఏర్పాటు చేశాయి. ఏదైనా పదం ఈ రెండు వ్యాకరణాల వల్ల కానీ సాధించడం కుదరకపోతే అది గ్రామ్యం. అలాగే ఏదైనా పదం శబ్దరత్నాకరంలో కనిపించకపోతే కూడా అది గ్రామ్యమే. ఇవి ఆధారంగా తెలుగు భాషలో పండితులకి పుస్తకాలు రాయడానికి పుష్కలమైన అవకాశం దొరికింది.

చిన్నయ సూరిలో చాలామంది గ్రహించినా పైకి చెప్పని ఒక ప్రత్యేకమైన గుణం వుంది. ఆయనకి తెలుగుభాషలో సౌందర్యం, వాక్యనిర్మాణంలో స్పష్టత, పదాల కూర్పులో చక్కదనం, బాగా తెలుసు. ఈ గుణాలు తన సమకాలికులకెవ్వరికీ లేకపోగా చిన్నయ సూరి కొక్కడికీ ఎలా వచ్చాయో చెప్పడం కష్టం.

చిన్నయ సూరి రాసిన పుస్తకాలు ఆయన స్థాపించిన ప్రెస్ (వాణీదర్పణ ముద్రాక్షరశాల) లోనే అచ్చయేవి. అవి పిల్లలకి పాఠ్యగ్రంథాలుగా నిర్దేశించబడ్డాయని ముందే చెప్పాం. సూరి పుస్తకాలకి ప్రాచుర్యము, సూరి పాండిత్యానికి గౌరవము, కుంఫిణీ ప్రభుత్వంలో వున్న అర్బత్‌నాట్ వంటి వారి ప్రాపకం వల్ల జరిగిందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి.

చిన్నయ సూరి బాలవ్యాకరణం పాణిని అష్టాధ్యాయి లాగా బిగువైన సూత్రాలతో చదవడానికి, కంఠస్థం చేయడానికి చక్కగా వుండే నిర్మాణ పద్ధతిలో తెలుగు కవులకి ఆసరాగా నిలబడింది. అల్పాక్షరం ఆసందిగ్ధం సారవత్ విశ్వతోముఖమ్ అని చెప్పడానికి అనువైన సూత్రాలు చిన్నయ సూరి రాశాడు. ఆ వ్యాకరణం ఆధారంగా మాకూ ఒక శాస్త్ర గ్రంథం వుంది అని, మేము కూడా శబ్ద సాధుత్వ, అసాధుత్వాలు నిర్ణయించగలం, అని తెలుగు పండితులు ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు. ఆంధ్రశబ్ద చింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణంలో ఒప్పుకున్నాడు. బాలవ్యాకరణం చాలా శాస్త్రబద్ధంగా సూత్రాల పూర్వాపర నియమాలతో పాణిని సంప్రదాయంలో వుండే పరిభాషనే వాడుతూ తెలుగు భాషకి అంతకు ముందు లేని పాండిత్య గౌరవాన్ని సంపాదించి పెట్టింది. తెలుగులో వున్న ఒక లేమిని ఈ పుస్తకం పూర్తి చేసింది. తెలుగువాళ్ళు ఇలాంటి ఒక పుస్తకం కోరుకుంటున్న దశలో ఆ ఖాళీ (power vacuum) భర్తీ చేస్తూ బాలవ్యాకరణం ప్రవేశించింది. అది కారణంగా తెలుగు పండితులకి పెద్ద శాస్త్రాధారం దొరికింది.

కవిత్రయంతో మొదలు పెట్టి దాదాపు 8 శతాబ్దుల పాటు కవులు ఛందోబద్ధ కావ్యాలలో వాడిన భాషకి చిన్నయ సూరి వ్యాకరణం కచ్చితంగా సరిపోతుంది. ఏమన్నా తేడాలుంటే అవి చిన్నవి. కాని, మనం వేసుకోవలసిన ప్రధానమైన ప్రశ్న ఛందోబద్ధ కావ్యాలలో వాడిన భాష నన్నయ్య నుంచి ఈనాటి వరకు చిన్న చిన్న మార్పులు మినహా ఒకే పద్దతిలో ఎలా ఉండగలిగింది? అని. కవులందరూ వ్యాకరణ విధేయులై వ్యాకరణాన్ని వ్యతిరేకించే ఏ రూపాలు వాడకుండా ఉండటం దీనికి కారణం అని మనకు అందరూ చెప్తారు. కానీ అంత విస్తృతమైన వ్యాకరణం తెలుగుకి చిన్నయ సూరి వచ్చేదాకా నిజానికి లేదు. ఆంధ్రశబ్ద చింతామణి చాలా చిన్న వ్యాకరణం.

అయినప్పటికీ ఇన్నాళ్లపాటు కావ్యాలలో వుండే ఈ భాష దాదాపుగా ఒకే రూపంలో ఉండటానికి కారణం పండితులు అనుకున్నట్టుగా వ్యాకరణాలు కాదు. ఎవరో ఒకరు వ్యాకరణం రాయబట్టి, ఆ వ్యాకర్త వాగనుశాసనుడు కాబట్టి, ఆ తరవాత దక్షవాటిలో వుండే కవిరాక్షసుడు అనే ఆయన ఎవరో మనకి తెలియకుండా ఒక శాసనం చేశాడు కాబట్టి, కవులందరూ ఆ శాసనాన్ని పాటించారని వ్యాకరణ పండితుల వాదన.

ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పిన భారతంబులో
నేది వచింపగా బడియె నెందును దానినె కాని సూతసం
పాదన లేమిచే దెనుగు పల్కు మరొక్కటి గూర్చి చెప్పగా
రాదని దక్షవాటి కవిరాక్షసు డీనియమంబు జేసినన్
(ఆంధ్రకవి తరంగిణి – మూడవ సంపుటము; పు. 73)

ఈ వాదనకి ప్రధానమైన బలం — ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం. పండితులందరూ నన్నయ్య ముందు వ్యాకరణం రాసి తరవాతే మహాభారతం రాశాడని నిక్కచ్చిగా నమ్ముతారు. కానీ ఈ భాష ఇంత కాలం పాటు పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఈ రూపంలో ఉండడానికి కారణం వాగనుశాసనులూ కాదు, కవిరాక్షసులూ కాదు. ఛందస్సు ఆ పని చేసింది. తెలుగు కావ్యాలలో ఏ ఛందస్సులు వాడబడాలో దాదాపుగా నన్నయ తన మహాభారతంలో వాడి చూపించాడు. దానికి తోడుగా ఏ కొద్ది కొత్త ఛందస్సులో జేర్చి పద్య కావ్యాలలో కవులు వాటినే వాడుతూ వచ్చారు. కవులు దాదాపుగా ఛందస్సు తమకు రెండవ భాష అయినట్టుగా చెప్పగలవి నన్నయ, తిక్కనలు వాడిన ఛందస్సులే. ఈ ఛందస్సులే దాదాపుగా అందరు కవులు కొన్ని వందల సంవత్సరాల పాటు యథేచ్ఛగా వాడారు. ఈ ఛందస్సులలో విశేషమేమిటంటే వాటిలో కొన్ని రకాల పద సంపుటులు మాత్రమే పడతాయి. అక్షరబద్ధం కాబట్టి వాటిని ఇష్టం వచ్చినట్లు మనం వాడే వాక్యాలలోకి నప్పించడం కష్టం. కష్టమే కాదు, అసాధ్యం కూడా! ఎక్కడైనా ఒక చోట మనం వ్యవహారంలో వాడే ఒక మాటనో, పేరునో ఏ కంద పద్యం లోనో, సీసపద్యం లోనో ఇమిడించవచ్చు గాక. కాని, పాతకాలపు మాట ఒక్కటి కూడా లేకుండా ఇప్పుడు మనం మాట్లాడే తెలుగులో పద్యం రాయడం అసాధ్యం. ఉదాహరణకి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు అనే మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఏ తెలుగు పద్యం లోను పట్టవు. పరుచూరి శ్రీనివాసుడు అని చేసుకుంటే కంద పద్యంలో ఇమిడించొచ్చు. వెల్చేరు నారాయణరావు ఒక పట్టాన ఏ పద్యంలోను పట్టదు. సాధ్యమైనన్ని వాడుకలో ఉండే తెలుగు మాటలతో శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకం రాశాడు. కానీ అందులో కూడా వ్యవహారంలో లేని తెలుగు మాటలు పెట్టక పొతే పద్యం నడిచింది కాదు.

నీకొక సిగరెట్టిస్తా
నాకొక శతకమ్ము రాసి నయముగ నిమ్మా
త్రైకాల్య స్థాయిగ
శ్రీ కావ్యమ్ము వరలు సిరిసిరిభాయీ

ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి అంటే పద్యాలలో ఉన్న తెలుగు భాష ఇంతకాలం పాటు ఒకే రూపంలో ఉండటం ఏ వ్యాకరణం వల్లనూ కాదు, ఏ శాసనం వల్లనూ కాదు, కేవలం ఛందస్సు వల్ల. పద్య ఛందస్సులు వాడకుండా మాత్రా ఛందస్సులు వాడి పాటలు రాసిన అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి మనం వ్యవహారికం అనుకునే మాటలు (నిజంగా వ్యవహారికం కావు) రాయగలగడానికి కారణం వాళ్ళు అక్షర ఛందస్సులు అనుసరించక పోవడమే.

చిన్నయ సూరికి ముందు తెలుగు వాళ్ళే రాసిన తెలుగు వ్యాకరణాలు నాలుగైదు ఉన్నాయని ఇంతకు ముందు చెప్పాం. ఆ వ్యాకరణాలు పరిశీలిస్తే అవి శాస్త్రబద్ధంగానే ఉండటానికి ప్రయత్నించాయని తెలుస్తుంది. అంటే సంస్కృత వ్యాకరణ మర్యాదల్ని అనుసరించడానికి ప్రయత్నించాయి. ఇంకో మాటలో చెప్పాలంటే తెలుగు కావ్యాలలో వుండే భాషనే అవి ప్రమాణంగా పెట్టుకున్నాయి. భాషకి లక్షణం చెప్పేది వ్యాకరణమే అని, లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యమని ఈ వ్యాకరణాలన్నీ వొప్పుకున్నాయి. అరసున్నలు, సరళాదేశాలు, గసడదవాదేశాలు, కళాదృతప్రకృతికవిభాగాలు, సంధి నియమాలు ఈ వ్యాకరణాలన్నీ పాటించాయి. ఒక్కసారి వేదం వెంకటరమణ శాస్త్రిగారు రాసిన లఘువ్యాకరణాన్ని చూస్తే దాదాపుగా చిన్నయసూరి బాలవ్యాకరణం చదువుతున్నట్టే ఉంటుంది. పుదూరి సీతారామశాస్త్రిగారి ప్రశ్నోత్తరాంధ్రవ్యాకరణంలో ప్రశ్నలు శాస్త్రంలో వుండే ఉత్థాపిత ప్రశ్నల్లా ఉంటాయి. శాస్త్రార్ధం చేసే వాళ్లకి ఇలాంటి ప్రశ్నలు పరిచితమే.

ఇవి కాక తెలుగు పద్య కావ్యాలకి వ్యాఖ్యానాలు రాసిన పాత పండితులు ఒక రకమైన వ్యాఖ్యాన భాష రాసేవారు. ఇది పద్యకావ్యాలలో వుండే భాష కాదు. ఇవి చూస్తే ప్రక్రియని పట్టి భాష మారుతోందని, ఏ ప్రక్రియకి అనువైన భాష ఆ ప్రక్రియ రాసేటప్పుడు వాడారని, భాష కంతటికీ కలిపి ఒక వ్యవహారం లేదని, బోధపడుతుంది. భాష ఇలాంటి పరిస్థితిలో ఉందని గుర్తించి పద్యాలకి వాడిన భాషే సలక్షణమైన భాష అని భావించి, దానికి శాస్త్రీయంగా లక్షణం చెప్పి, ఆ భాషనే ఆధునిక వచన వ్యవహారానికి కూడా వాడవచ్చునని చూపించిన వాడు చిన్నయ సూరి. తెలుగులో పద్యాలకి మాత్రమే వాడుతున్న భాషని ఆధునిక వచన వ్యవహారానికి నప్పించి తెలుగు భాషని సమగ్రంగా ఆధునీకరించినవాడు ఆయనే. అందరూ చూచే చిన్నయ సూరి వచన రచనలు ఆయన నీతిచంద్రికలో రాసిన మిత్రలాభము, మిత్రభేదము మాత్రమే. ఇందులో మిత్రలాభం కన్నా మిత్రభేదం ఒక రకమైన గడ్డు భాషలో వుండి, బడిపిల్లలకు పాఠ్య గ్రంథాలుగా పెట్టబడి, బాలవ్యాకరణం ప్రకారం వచనం అంటే అలాగే ఉండాలనే అభిప్రాయం బలపడింది. కానీ చిన్నయ సూరే తెనిగించిన హిందూధర్మశాస్త్ర సంగ్రహము చూసినవాళ్ళకి చిన్నయ సూరి బాలవ్యాకరణం ప్రకారం రాసిన భాష ఆధునిక తెలుగు వచన రచనలు చేయడానికి కూడా పనికి వస్తుందని ఆయన భావించాడని తెలుస్తుంది.

ఈ అభిప్రాయం సరయిందేనా కాదా? చిన్నయ సూరి చేసిన పనిని సవిమర్శకంగా చూడవలసిన అవసరం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు గిడుగు రామమూర్తిగారు, గురజాడ అప్పారావుగారు చేసిన పనిని దృష్టిలో పెట్టుకుని వ్యవహారికా భాషావాదంలో ఉపయోగాలకు పరిమితులున్నాయా? అనేవి తర్వాత వ్యాసంలో వివరంగా చర్చిస్తాం.

(సశేషం)

Baker, Christopher J.; The Politics of South India 1920-1937; Cambridge South Asian Studies; Cambridge University Press; Cambridge; 1976.
Brown, Charles P.; A Grammar of the Telugu Language; Madras; 1840.
Brown, William; A Grammar of the Gentoo Language, Madras; 1817.
Campbell, Alexander D.; A Grammar of the Teloogoo Language, Madras; 1816.
Carey, William; A Grammar of the Telinga Language; Serampore; 1814.
Mitchell, Lisa; Language, Emotion, and Politics in South India – The Making of a Mother Tongue; Indiana University Press; 2009.
Morris, John C.; Teloogoo Selections, with Translations and Grammatical Analyses: to which is added a Glossary of Revenue Terms used in the Northern Circars; Madras; 1823.
J. Mangamma; The Rate Schools of Godavari; Regular monograph series of state archives No.3; The Government of Andhra Pradesh; Hyderabad; 1973.
R. Suntharalingam; Politics and National Awakening in South India, 1852-1891. The University of Arizona Press; Tuscon; 1974.
Radhakrishna, Bi (Budaraju); Paravastu Chinnaya Suri; Sahitya Akademi; New Delhi; 1995.
Strange, Thomas A.L.; Elements of Hindu law: referable to British judicature in India, Volume 1-2; హిందూధర్మశాస్త్ర సంగ్రహము (తెనుగింపు: పరవస్తు చిన్నయ సూరి); 3rd Ed; Madras, 1869.
Velcheru Narayanarao, David Shulman; How to tame a Pandit – Page 62, A poem at the right moment: remembered verses from pre-modern south India; 1998.
అహోబల పండితుడు (లేక గాలి ఓబళయ్య); అహోబలపండితీయము; శొంఠి భద్రాద్రిరామశాస్త్రి (ప); 1903.
అక్కిరాజు రమాపతిరావు (సేకరణ); గ్రాంథిక వ్యావహారిక వాదసూచిక (1836-1980); తెలుగు అకాడెమి; హైదరాబాదు; 1980.
అమరేశం రాజేశ్వరశర్మ; ఆంధ్ర వ్యాకరణ వికాసము – ద్వితీయ భాగము; ప్రాచ్య విద్యా పరిషత్తు; కామారెడ్డి, 1977.
ఆకురాతి పున్నారావు; ప్రసిద్ధాంధ్రవ్యాకరణాలు – ఆంధ్ర శబ్ద చింతామణి వికృతివివేకాల పుట్టు పూర్వోత్తరాలు; పద్మా ప్రచురణలు, గుంటూరు, 1982.
ఆకురాతి పున్నారావు; తెలుగు వ్యాకరణాలు సంస్క్రృతంలో ఎందుకు వ్రాసినట్లు; పద్మా ప్రచురణలు, గుంటూరు, 1994.
ఆరుద్ర, సమగ్రాంధ్ర సాహిత్యం, 9, 10, 11 సంపుటాలు; ప్రజాశక్తి బుక్‌హౌస్, విజయవాడ, 1990.
కల్లూరి వేంకటరామశాస్త్రి; బాలవ్యాకరణ గుప్తార్థప్రకాశిక (రెండవ కూర్పు); రాజమహేంద్రవరము; 1929 (మొదటి ముద్రణ 1915).
(మూలఘటిక) కేతన; ఆంధ్రభాషాభూషణము; వావిళ్ల, చెన్నపురి, 1949.
చట్రాతి లక్ష్మీనర్సకవి; పద్మనాభయుద్ధము; ఆంధ్ర క్షత్రియ గ్రంథమాల; రాజమండ్రి, 1927.
చాగంటి శేషయ్య; ఆంధ్రకవి తరంగిణి – మూడవ సంపుటము; హిందూ ధర్మశాస్త్ర గ్రంథ నిలయము; కపిలేశ్వరపురం; 1959.
చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి; కథలు గాథలు – ప్రథమ భాగము (రెండవ ముద్రణ); వేంకటేశ్వర పబ్లికేషన్స్; కడియము, 1958.
తాడినాడ వెంకయ్య; ఆంధ్రవ్యాకరణము (లేక తా. వ్యాకరణము); వావిళ్ల; మూడవ ముద్రణ, 1916 (1862లో రెండవ ముద్రణ జరిగింది).
తూమాటి దోణప్ప; ఆంధ్రసంస్థానములు – సాహిత్యపోషణము; ఆంధ్ర విశ్వకళాపరిషత్; 1969.
దిట్టకవి నారాయణకవి; రంగరాయ చరిత్రము (3.Ed.); చెన్నపురి; 1914.
నన్నయ; ఆన్ధ్రశబ్దచిన్తామణి; వావిళ్ల; మదరాసు; 1937.
నిడుదవోలు వేంకటరావు; చిన్నయ సూరి జీవితము; స్వంత ముద్రణ; మద్రాసు, 1962.
పరవస్తు చిన్నయ సూరి; బాలవ్యాకరణము – దూసి రామమూర్తిశాస్త్రి వ్యాఖ్యానంతో, వావిళ్ల, మద్రాసు, 1937.
పరవస్తు చిన్నయ సూరి; శబ్దలక్షణసంగ్రహము; కవిరాజ గ్రంథమాల; పొన్నూరు; 1958.
పరవస్తు చిన్నయ సూరి; పరవస్తు చిన్నయ సూరి; సూత్రాంధ్రవ్యాకరణములు (సంస్కృతసూత్రాంధ్రవ్యాకరణమ్, పద్యాంధ్రవ్యాకరణము, ఆంధ్రశబ్దానుశాసనం అన్న 3 పుస్తకాలు కలిపి); ఆంధ్ర సాహిత్య పరిషత్తు; కాకినాడ; 1931.
పుదూరి సీతారామశాస్త్రి; ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము; చెన్నపురి; 1859 (మొదటి ముద్రణ – 1830).
బహుజనపల్లి సీతారామాచార్యులు; ఆంధ్రశబ్దమంజరి; వావిళ్ల, చెన్నపురి; 1921.
రావిపాటి గురుమూర్తిశాస్త్రి; తెనుఁగు వ్యాకరణము, వావిళ్ల, చెన్నపురి; 1951.
జి. లలిత; తెలుగు వ్యాకరణముల చరిత్ర; వెలగపూడి ఫౌండేషన్, మదరాసు, 1996.
వేదం పట్టాభిరామశాస్త్రి (?); ఆంధ్రధాతుమాల; ఆంధ్రసాహిత్యపరిషత్తు; కాకినాడ; 1930.
వేదం పట్టాభిరామశాస్త్రి; ఆంధ్ర వ్యాకరణము – పట్టాభిరామ పండితీయం; వావిళ్ల; మద్రాసు; 1951.
వేదం వెంకటరమణశాస్త్రి; తెనుఁగు లఘువ్యాకరణము; వావిళ్ల, చెన్నపురి; 1951 (మొదటి ముద్రణ – 1856).
--------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
పరుచూరి శ్రీనివాస్, 
ఈమాట సౌజన్యంతో

No comments: