సాహిత్యంలో చాటువులు - 3
సాహితీమిత్రులారా!
జీవితం ఎంత చిత్ర మైనది! ఇలా ఉండాలి అని మనం అనుకొంటాం, కాని ఇలా ఉంచాలి అని భగవంతుడు అనుకొంటాడు” అని పెద్దల నానుడి. ప్రతి వ్యక్తి జీవితంలో మంచి,చెడులు చీకటి,వెలుగుల్లా ఉంటూనే ఉంటాయి. వాటిని అనుభవించి అధిగమించడమే ఉత్తమ లక్షణం. అదృష్టం, దురదృష్టం కూడా పక్కపక్కనే ఉంటాయి. వాటిని మనం తప్పించుకోలేము. ఈక్రింది ఉదాహరణ చూడండి----
“ పాములు ఆడించి జీవనం సాగించే వాడి ఇంట్లో ఒక ముసలి పాము బుట్టలో ఉంటుంది. పాములవాడు అది తనకి ఇంక పనికి రాదని దానికి ఆహారం కూడా ఇవ్వడు. అదినీరసించి, చావుకు దగ్గరలో ఉంటుంది. బలహీనతవల్ల బుట్ట మూత తీసుకొని బయటకు రాలేక పోతుంది. ఇది ఆపాము పరిస్థితి. ఓ రోజు ఒక ఎలుక ఆహారం కోసం ఆ పామున్న బుట్టకి కన్నం పెట్టి అందులో దూరుతుంది. అప్పుడు ఆముసలి పాము నోటివద్దకు వచ్చిన ఆ ఎలుకను భక్షించి కొంచెం బలం పుంజుకొని, ఆ ఎలుక చేసిన కన్నం లోంచే బయటకి వచ్చి హాయిగా వెళ్లి పోతుంది.” ఒక చిన్ని సుభాషితం తెలిపే కథ. ఇక్కడ చనిపో వలసిన పాము అదృష్టం వల్ల బ్రతికింది, దురదృష్టం వల్ల బాగున్న ఎలుక మరణించింది. కనుక విధి వ్రాతను ఎవరు తప్పించుకో లేరు.అన్నది సారాంశం.ఇది వేదాంతం కాదు. జీవిత సత్యం. ఇట్టి విశేషాలను తెలిపే కొన్ని చాటువులని ఈ నెల తెలుసుకొందాం.
చాటు సాహిత్యంలో ‘శ్రీనాధుని’ చాటువులుగా చెప్పబడే కొన్ని పద్యాలు సుప్రసిద్ధాలు. (ఇవి శ్రీనాధుని పేరుతో ఎవరో రచించారని విమర్శకుల అభిప్రాయం.) వాటిలో కొన్ని----
“ మూతిని ముట్టగా వెరతు- ముద్దకు ముద్దకు కూటిలోపలన్
పాతిక పాలు సైకతము – పచ్చడి కొంచెము – ఆది యంతమున్
చూతమటన్న లేదు – మరి సున్నము కన్నను మెత్త నన్నమీ
రాతిరివంటి భోజన మరాతికినైనను వద్దు దైవమా!”
(వివరణ)
“కవిసార్వభౌముడు”గా పేరుగాంచిన శ్రీనాధునికి కూడా కష్టాలు తప్పలేదు. అని పై చాటు పద్యం తెల్పుతుంది. మంచి ఆరు రుచులతో కూడిన భోజనము తినే శ్రీనాధ కవికి, పలనాడు వెళ్లి నపుడు ఒకరి ఇంట రాత్రి పెట్టిన భోజనము ఎంతఅరుచిగా (చెడ్డగా) ఉన్నదో చెపుతూ ఇలాంటి భోజనము శత్రువుకైనా వద్దు దైవమా! అని బాధ పడతాడు. మరి ఆ భోజనం ఎలాఉంది అంటే -----
మూతిని ముట్టగా వెరతు= నోటిలో పెట్టు కోవడానికే భయంగా ఉందిట. పచ్చడి కొంచమే ఉందిట. ఇంకా ‘ఆది’ మొదట్లో వేసే ‘నేయి’, ‘అంతము’ చివరగా వడ్డించే పెరుగు లేక ‘మజ్జిగ’ చూడటానికి కూడా లేవుట! (“తక్రాంతంహి భోజనం” అని శాస్త్రం. తక్రం అంటే మజ్జిగ.) ఇంక సున్నంలా అన్నం చాల మెత్తగా ఉందిట. ఇటువంటి భోజనము, అరాతికి= శత్రువుకైనా వద్దు అని భగవంతుని ప్రార్థించాడుట శ్రీనాధుడు. ఇది ఈ చాటువు యొక్క భావం. ఇక్కడ అప్రస్తుతమైనా శ్రీనాధుడు వర్ణించిన ఆంధ్రుల భోజన పదార్ధాలను కొన్నింటిని తెలుసుకొందాం. కొన్ని ఆంధ్రులకి అంటే మనకే స్వంతం, ఇష్టమైనవి. ( ఈ వివరణ ఇప్పటి వాళ్ళు తెలుసు కొంటారని!)
అన్నం తెల్లగా మల్లెపూవులా మెతుకు మెతుకు అంటుకోకుండా ఉండాలి. అన్నంలోకి వేడి,వేడి కమ్మని నేయి, చక్కని ముద్ద పప్పు, లేహ్యాలు, చోష్యాలు అంటే పచ్చళ్ళు, పులుసులు, ముక్కల పులుసుని ‘దప్పళం’ అనికూడా అంటారు, ఇంకా తోట కూర పులుసు,మజ్జిగ పులుసు, చారు.(సాంబారు,రసం మనవి కావు.)అందులోకి వడియాలు, అప్పడాలు.
కూరలు- వంకాయకూర తప్పని సరి, పనసపొట్టు కూర, తీయ గుమ్మడికూర, కంద,అరటి,పొట్ల, దొండ,దోస, కాకర,బచ్చలి,తోట కూరలు, బెండకాయ వేపుడు. ఆవకాయి,మాగాయి, గోంగూర, కొబ్బరి నూల పచ్చళ్ళు.
పొడులు- కంది పొడి, పెసరపొడి, పప్పుల పొడి, కారపు పొడి.
ఇంక పిండివంటలు –వీటిని భక్ష్యాలు అంటారు. వడలు, ఆవడలు, పెరుగువడలు, జంతికలు,పప్పు చెక్కలు, చేగోణి(డి)లు,ఇవి కారం. ఇక మధురం-అతిరసాలు( అరిసెలు) బొబ్బట్లు, పూర్ణాలు,( వీటిని బూరెలు అనికూడా అంటారు) సొజ్జేఅప్పాలు, అప్పాలు,లడ్లు ( వీటిని మోదకాలు అంటారు) మినప సున్ని ఉండలు, కొబ్బరి ఉండలు, కజ్జికాయలు,మొ// అన్నంతో చేసేవి--క్షీరాన్నం,లేక పాయసం( పయః అంటే పాలు) పుళిహోర, –(పుళి అనగా చింత పండు, హోర అనగా అన్నం.) దీనినే చిత్రాన్నం అంటారు. దధ్యోదనం, (దధి=పెరుగు. ఓదనం=అన్నం.) వెన్ పొంగలి, (తెల్లని ) దీనిని పులగం అని కూడా అంటారు. శర్కర లేక చెక్కర పొంగలి, చివరగా చక్కని, చిక్కని గడ్డ మీగడ పెరుగు. ఇవి కొన్ని మాత్రమే.( ఉల్లి, వెల్లుల్లి నిషేధం.)ఇవి ఆనాటి వంటకాలు. ఇప్పుడు ఇట్టిదే శ్రీనాధుని ఇంకో చాటువు.
“ ఫుల్ల సరోజ నేత్ర! అల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము! నీ పస కాననయ్యెడిన్”
ఈ చాటువు కూడా శ్రీనాధుడు పల్నాటి సీమలో తనకి పెట్టిన కుభోజనము ను వర్ణించిన పద్యం. శ్రీకృష్ణుని తో చెప్పిన పద్యం.
( వివరణ)
ఫుల్ల సరోజ నేత్ర= వికసించిన తామరపూ రేకుల వంటి నేత్రములు కల శ్రీకృష్ణా! నీవు విషపూరితమైన పూతన అనే రక్కసి పాలు త్రాగేను అని, అడవిలో వచ్చిన దావాగ్నిని మ్రింగేను అని నిక్కేదవేల? గర్వపడతావు ఎందుకు?అదేమీ గొప్పకాదు. ఇక్కడ పల్నాటిలో తింత్రిణీ పల్లవము అంటేచింతాకుతో కలిపి ఉడికించిన బచ్చలి కూర వేసి పెట్టిన జొన్న సంగటి (ఓ రకమైన అన్నం ముద్ద) ఓముద్ద తింటే నీపస(నీ గొప్ప) తెలుస్తుంది. అని అంటాడు. ఇట్టివి శ్రీనాధుని పేరుతో ఉన్న చాటువులు ఎన్నో ఉన్నాయి. వాటిని చదివి ఆనందించండి.
----------------------------------------------------------
రచన -‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు
, సుజనరంజని సౌజన్యంతో
No comments:
Post a Comment