భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1
సాహితీమిత్రులారా!
భావకవిత్వం అనగానే ప్రేమ, అమలిన శృంగారం, వెన్నెల, ఇలాంటివి వెంటనే గుర్తొస్తాయి. ప్రబంధ నాయికల అంగాంగ వర్ణనలతో విసిగిపోయిన కవులు ప్రణయానికి, హృదయానుభూతికి జాగా ఇచ్చి రాసిన కొత్త కవిత్వం భావకవిత్వం. సాంఘిక కట్టుబాట్లతో సాంప్రదాయక వివాహాలలో విసిగిపోయిన పురుషులు స్వేఛ్ఛా ప్రణయాన్ని వూహించుకుని ప్రేయసి మీద రాసిన కవిత్వం భావ కవిత్వం. ఇలా విమర్శకులు చెప్పడం మనకు తెలిసిన విషయమే!
ఇంకొక అడుగు ముందుకు వెళితే ఒక పక్క జనం ఆకలితో చచ్చిపోతూ వుంటే జీవితంలో లేని ప్రేయసి మీద కవిత్వాలు రాస్తూ ఊహాలోకంలో విహరించే కవుల గాలి మాటలుగా మార్క్సిస్టులు భావకవిత్వాన్ని నిరాకరించడం కూడా మనకు కొత్త కాదు.
అయితే భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇంకొకటి వుంది. అది దేశంలో ఒక మధ్యతరగతిని తయారు చేసి వాళ్ళ ఊహలద్వారా ఒక భారత జాతీయతని నిర్మించడం. ఈ జాతీయత ఇవాళ సర్వసాధారణంగా రుజువు చేయక్కరలేని ఒక సహజ లక్షణంగా మనకి కనిపిస్తుందిగాని భావకవిత్వ యుగానికి పూర్వం మనదంతా ఒక సమైక్య దేశమని భారతీయులంతా ఒక జాతి అని, ఈ జాతికి ఒక ప్రాచీన కాలంనుండి ఆధునిక కాలం వరకు – కనీసం బ్రిటిష్ వాళ్ళు రాక ముందువరకు ఒక మహోజ్వలమైన చరిత్ర, సంస్కృతి వున్నాయని – ఇలాంటి భావాలు వుండేవి కావు.
మనకు రాజులున్నారు. రాజ వంశాలు ఉన్నాయి, వాళ్ళ గురించిన కథలున్నాయి. వాళ్ళలో కొందరు చతుస్సాగర పర్యంతమైన భూమిని, శత్రు నిర్భేద్యమైన కోటలు కట్టుకొని యేలారు, మనకు షట్చక్రవర్తుల పేర్లు తెలుసు. పెద్దబాలశిక్ష చూస్తే హరిశ్చంద్రుడు, నలుడు, సగరుడు, కార్తవీర్యుడు, పురుకుత్సుడు, పురూరవుడు కనిపిస్తారు. కాళిదాసు రఘువంశంలో రఘుమహారాజు దిగ్విజయం చేసి జయించిన దేశాలు చూస్తే అప్పటి భరతఖండపు ఎల్లలు తెలుస్తాయి. మన పెళ్ళి మంత్రాల్లో అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజాది దేశాలన్నీ తిరిగి పెళ్ళి కూతుర్ని వెతికి తెచ్చామనే అర్థంలో బ్రాహ్మలు మంత్రాలు చదువుతారు. రాజశేఖరుడి కావ్యమీమాంసలో కావ్య పురుషుడు అనేక భాషలు మాట్లాడే భారత ప్రాంతాలన్నీ పర్యటిస్తాడు. ఇంకా ముందుకు వెళ్ళదలచుకుంటే మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి భూమి వైశాల్యాన్ని గురించి చెబుతూ జంబూద్వీపాన్ని వర్ణిస్తాడు. నిత్యం సంధ్యావందనం చేసుకునే బ్రాహ్మలు ఇప్పటికీ “జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే …” అంటూ మొత్తం దేశాన్ని సంకల్పంలో చెప్పుకుంటారు. శ్రీహర్షుడి నైషధీయ చరితంలో దమయంతీ స్వయంవరానికి వచ్చిన రాజుల్లో భరతఖండంలో వున్న అన్ని ప్రాంతాల పేర్లూ వున్నాయి. తరువాతి కాలంలో కవిపోషకుడైన భోజుణ్ణి గురించి, అష్టదిగ్గజాల మధ్య వున్న కృష్ణదేవరాయల గురించి వున్న కథలలో భరత ఖండ ప్రజలు అందరికీ ఆయన రాజు అనే అర్థం కనిపిస్తుంది కూడా.
అయితే ఈ ఊహల ఆధారంగా మనకి ప్రాచీన కాలంనుంచి జాతీయతా భావం వుంది అని వాదించడం పొరపాటు. పూర్వం రాజు అంటే తండ్రి. ఆయన పాలనలో వున్న వారు ఆయన పిల్లలు. నిర్ణయాలని రాజు శాస్త్రాల ఆధారంగా చేస్తాడు. రాజు యెడల ప్రజలకు విధేయత లేక భయం వుంటుంది. ఆ మాటకొస్తే మనం తెల్లవాళ్లు వచ్చిన మొదట్లో వాళ్ళని అప్పటి మన రాజైన బహదూర్ షా కౌలుదార్లుగానే చూశాం. ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే 1857 లో సిపాయిలు తిరుగుబాటు చేసి, బహదూర్‌షాని సింహాసనంపై కూర్చోపెట్టి మసీదుల్లోను, గుళ్ళలోను ప్రార్థనలు, పూజలు చేసారు. ఆ తరవాత, సిపాయి తిరుగుబాటు అణిచేసి, విక్టోరియా రాణికి రాజ్యం అప్పజెప్పడం తెల్లవాళ్ళు చేసిన తెలివైన పని. మనకి సాంప్రదాయికంగా వున్న రాజ విధేయతని వాడుకుని మనని పరిపాలించడం ఇందువల్ల వాళ్ళకి సాధ్యం అయింది. వాళ్ళని ఎదిరించడం అంటే రాజద్రోహం అయింది. ఇదంతా ఎందుకు చెపుతున్నామంటే, మనకి రాజునీ, రాజ భావాన్నీ వొదిలించుకున్నాక గాని జాతీయతా భావం ఏర్పడలేదు [1]. ఈ భావం భావకవిత్వపు కాలంలోనే మన మనస్సుల్లో ఒక విలక్షణమైన కొత్త ఆవేశంగా రూపొందింది.
ఈ పని భావకవిత్వం ఒక కొత్త కవిత్వపు భాషని తయారుచేయడం మూలంగా సాధించింది. ఈ భాష మధ్య తరగతి వాళ్ళ సాహిత్య భాష. అంతకు ముందు కావ్యాల్లో వున్న భాష ఇలాటిది కాదు. అది బ్రాహ్మణ, క్షత్రియ భాష. ఉదాహరణకి పెద్దనగారి మనుచరిత్రలో ప్రవరుడు బ్రాహ్మడు, వరూధిని వేశ్య, స్వరోచి క్షత్రియుడు. ఇలా వరసగా అన్ని ప్రబంధాలలోని పాత్రలు వాళ్ళ వాళ్ళ చాతుర్వర్ణ స్థానాలలో ఎక్కడుంటారో స్పష్టంగా తెలుస్తుంది. కానీ భావ కవిత్వంలో పాత్రలకి కులం పేరు కనిపించదు. (ఈ అలవాటు తెలుగుసినిమాల్లో కూడా చాలా కాలం కొనసాగింది.) బ్రాహ్మణ కులాల్లో ఉన్న కొన్ని అలవాట్లు, వ్యావసాయిక కులాల్లో వున్న కొన్ని అలవాట్లు, ఇంగ్లీషు ప్రభావంవల్ల వచ్చిన కొన్ని అలవాట్లు అన్నీ కలిపి ఒక కొత్త విద్యావంతుల వర్గం రూపొందుతున్న రోజులవి. ఈ వర్గం తయారవడానికి కావలిసిన ఊహా సంపత్తిని భావకవిత్వం ఇచ్చింది. సంఘసంస్కారం పేరుతో కులాల్లో సాంప్రదాయకంగా వున్న అలవాట్లని, కట్టుబాట్లని తిరస్కరించడం జీవితంలో కాకపోయినా సాహిత్యంలో సాధ్యం కావడం భావ కవిత్వం వల్లే జరిగింది.
భావ కవిత్వానికి పూర్వపు రోజుల్లో “దేశం” అంటే ఒక ప్రాంతానికి చెందిన మాట – తూర్పు దేశం, పడమటి దేశం ఇలాగా. భూమి రాజుకి భార్య. అందుకే ఆయన భూపతి. ఆవిడ ఏ రాజు జయిస్తే ఆరాజుకి భార్య. భావ కవిత్వానికి పూర్వం దేశభక్తి అనే ఊహ కాని, దేశం మనకి మాత కావడం కాని ఎప్పుడూ లేదు. ఈ మాతృత్వపు ఊహ పూర్తిగా కొత్తది [2]. భారతమాత, తెలుగుతల్లి ఇలాటి ఊహలు జాతీయవాద బలంతో భావ కవిత్వమే మనకు నేర్పింది.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము [రాయప్రోలు సుబ్బారావు]
…
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యం బందె నిచ్చట …. [రాయప్రోలు సుబ్బారావు]
ఈ దేశభక్తితో పాటు మన తెలుగుదేశం అంటే భక్తి కూడా ఒకదానికొకటి సంఘర్షణ లేకుండా కలిసిపోతుంది.
అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు
ఓరుగల్లున రాజ వీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు
విద్యానగర రాజవీధుల గవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు
ఆంధ్ర సంతతి కే మహితాభిమాన
దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించె
నా మహాదేశ మర్థించి యాంధ్రులార
చల్లుడాంధ్రలోకమున నక్షితలు నేడు [రాయప్రోలు సుబ్బారావు]
ఒక పక్క అరవ వాళ్ళని ఈసరించుకొన్నప్పుడు కూడా మనకి జాతీయతా భావానికి దెబ్బ తగుల్తోందనే వూహ కలగదు.
తనగీతి నరవజాతిని పాటకులునుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాని …. [రాయప్రోలు సుబ్బారావు]
అయితే, జాతి అనగానే జాతిలో వున్న అన్ని కులాల, అన్ని మతాల సంస్కృతుల్ని కలుపుకోవాలి. అందుకని భావ కవిత్వంలో కృష్ణుడి ప్రేమతో పాటు ఉమర్ ఖయ్యాం ప్రణయం, తాజ్ మహల్ మీది పద్యాలు వుంటాయి. దాంతో పాటు గ్రీక్ కవయిత్రి శాఫో అనువాదాలు కూడా ఉంటాయి. ప్రేమ ఏ కాలానిదయినా, ఏ దేశానిదయినా మనదే అని చెప్పడానికి భావ కవులు ఒక లోకాతీత, మతాతీత ప్రేమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మన భావ కవులు జాతీయ కవులే కాదు, విశ్వకవులు కూడా.
ఇంత వైశాల్యం కోసం ప్రయత్నించినా మనదేశంలోనే వున్న తక్కువ కులాల వాళ్ళు మిగిలి పోయారు. కింది కులాలవారి సంస్కృతి మన దేశ సంస్కృతిలో ప్రధానమైన భాగమని భావ కవిత్వ యుగానికి ముందు కవులు, పండితులు అనుకోలేదు. సాహిత్యం పండితులు రాసేదే కాని పామరులు చేసేది కాదు. ఈ విషయంలో తెలుగు సాహిత్యానికి ఎన్నడూ సందేహంలేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళలో విద్యావంతులు సంస్కృతం నేర్చుకుని వేదాల్ని గురించి ఉపనిషత్తుల గురించి వ్యాఖ్యానించి భారతదేశ సంస్కృతిని వాళ్ళకు నచ్చిన రీతిలో వ్యాఖ్యానించి ప్రశంసలు కురిపించారు. వాళ్ళ వ్యాఖ్యానాలు భారతదేశ సంస్కృతిని గురించి వాళ్ళు చేసిన సిద్ధాంతాలు మనని వుబ్బి తబ్బిబ్బు చేశాయి. భావకవిత్వపు కాలంలో కవులు వేదాల్ని, ఉపనిషత్తుల్ని తలకెత్తుకోవడానికి కారణం మాక్స్ మ్యుల్లర్ వాటిని ప్రశంసించడమే. నటరాజు గురించి కృష్ణశాస్త్రిగారి పద్యం (అవధరింతువు ప్రతి దివసాంతమందు …) అలాగే, కవికొండల, పుట్టపర్తి శివతాండవం మీద పద్యాలు రాయడానికి స్ఫూర్తి ఆనందకుమారస్వామి రాసిన Dance of Siva అన్న పుస్తకమే. చివరకి పరమ బ్రాహ్మణ సాంప్రదాయకుడైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు “బుద్ధ చరిత్ర” రాయడం ఎడ్విన్ ఆర్నల్డ్ గారి Light of Asia ప్రభావమే. తరవాత పింగళి, కాటూరి “సౌందర నందనం” రాయడానికి కూడా ఆప్రభావమే పని చేసింది.
మన కులాల్లో చిన్న చూపుకు లోనయిన కోమట్లని కూడా భావ కవిత్వం కలుపుకోవడానికి ఇంగ్లీషు విద్యావంతుల చదువులే కారణం. ఉదా: “కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటైపుట్టితేనేమి …” అని బసవరాజు అప్పారావుగారు రాయడంలో ఆయన మనసులో వున్నవాడు ఇంగ్లాడు వెళ్ళి, బారిస్టర్ పట్టా పుచ్చుకొని వచ్చిన గాంధి. గురజాడ అప్పారావుగారు లవణరాజు కలలో మాల వాళ్ళని మధ్య తరగతిలో కలుపుకొని కాని గౌరవించలేదు. ఉదాహరణకి ఈ కథలో రాజు మాలకన్యని పెళ్ళాడతాడు. తన మనస్సులో గొప్ప మర్పొచ్చి
“మంచి చెడ్డలు మనుజు లందున
యెంచి చూడగ, రెండె కులములు”
అనే నిర్ణయానికి వస్తాడు. కానీ అతను తిన్న “మాల కూడు” శుభ్రమైన మధ్య తరగతి భోజనం. ఆ అమ్మాయి తండ్రి
“మాలనైనను మలిన వృత్తులు
మానుకుంటిని గురువు దయచే
పొలము లోపల పశుల మేపుచు పొట్ట పోషింతున్”
అని, ఇంకా “జంతు హింసను చేయనొల్లను” అని, “వేదవాక్కులు” మాట్లాడతాడు. అతడు శాంత గంభీరమైన ఆకృతిలో “రాజ ఋషి” వలె వుంటాడు. ఈ వేదవాక్కులు నిజంగా యజ్ఞ యాగాదులలో జంతువులను చంపే బ్రాహ్మణ వాక్కులు కావు. అప్పటి మేధావి వర్గం ఇంగ్లీషు అనువాదాలలో చదివే ఉపనిషత్తుల లోంచి వచ్చిన వాక్యాలు. అప్పారావుగారి ఈ పాటలో మాలవాళ్ళు ఆధునిక విద్యావంతులైన మధ్య తరగతి వాళ్ళ లాగా ప్రవర్తిస్తారు. అంటే “మంచి అన్నది మాల అయితే మాలనే అగుదున్” అని ఆయన రాసిన వాక్యం వెనకాల మంచి అంటే మధ్యతరగతి అని అర్థం. అప్పారావు గారు ఈ కథని సంస్కృతంలో యోగవాశిష్టం నుంచి తీసుకున్నారని మనకు తెలుసు. ఆ పుస్తకంలో రాజు మాలవాళ్ళలో హాయిగా కలిసిపోతాడు. వాళ్ళు పెట్టిన తిండి తింటాడు. వాళ్ళని మలిన వృత్తులని, మలిన దేహులని, అసహ్యించుకోడు. యోగవాశిష్టపు రాజుకి, లవణరాజుకి చాలా పెద్ద తేడా వుంది. భావ కవులు కింది కులాల వాళ్ళని పద్యాల్లో వాడుకొని, జీవితాల్లో అంగీకరించక పోడానికి అప్పారావుగారే దారి చూపించారు.
భావ కవిత్వం ప్రచారంలోకి వస్తున్న రోజుల్లోనే జానపద విజ్ఞానం అనే కొత్త విభాగం తెలుగులో రూపొందడం మొదలయింది. దీనికి కారణం కూడ ఇంగ్లీషు వాళ్ళే. జడ్జీలుగానూ కలక్టర్లుగానూ, ఇతర పెద్ద ఆఫీసర్లగా వచ్చిన తెల్లవాళ్ళలో కొందరు మన దేశపు మహా విషయాలయిన సంస్కృత గ్రంథాల్లో పరిశోధన చేస్తుంటే ఇంట్లో వుండిపోయిన ఆడవాళ్ళు, మత ప్రచారం చేసే మిషనరీలు, కొన్ని సందర్భాల్లో తాలూకా స్థాయిలోను, జిల్లా స్థాయిలోను ఉండి క్యాంపులకి తిరగవలసి వచ్చే ఆఫీసర్లు తమ సేవకులైన తక్కువ కులాల భారతీయులనుంచి కాలక్షేపానికి కథలు పాటలు చెప్పించుకొనేవారు. తమ సేవకులు వచ్చీరానీ ఇంగ్లీషులో చెప్పిన కథల్నీ, పాటల్నీ సుబ్భరమైన ఇంగ్లీషులోకి అనువదించి ఇండియాలో వచ్చే ఇంగ్లీషు పరిశోధన పత్రికల్లోను, కొంతమందైతే ఇంగ్లండులోను ప్రచురించేవారు. ఈ ప్రయత్నాలకి ఆ కాలంలో ప్రచారంలోకి వస్తున్న folklore అనే కొత్త వైజ్ఞానిక రంగం ప్రోద్బలాన్ని కలిగించింది. పశ్చిమ యూరప్‌లోనూ, రష్యాలోనూ బహుళ ప్రచారానికి వచ్చిన ఈ రంగం అచిరకాలంలో అంతర్జాతీయ గౌరవాన్ని పొందింది. ఈ రంగంలో భారతీయ విభాగం ఒక గౌరవ స్థానాన్ని పొందింది. ఇవాళయితే అట్టడుగున పడి వుండి పైకి తీసుకురావలసిన స్థితిలో వున్నారు కానీ భారతదేశంలో ప్రజలు ఒకానొక కాలంలో చాలా గొప్పవాళ్ళు అనేది ఆ రోజుల్లో ఇంగ్లిష్ విద్యావంతుల ప్రతిపాదన. అందుకు గొప్ప ఉదాహరణంగా తెల్లదొరలు ఫోల్క్ లోర్‌ని వాడుకునేవారు. అక్షరం ముక్క రాని పల్లెటూరి మూర్ఖులు ఈ కథలు చెప్తారు, ఈ పాటలు పాడతారు, అయితే వాళ్ళకి వీటి అర్థాలు తెలియవు, వీటి గొప్పతనం తెలియదు, అది మనం చెప్పాలి, అని తెల్లదొరలు వీటిపై వ్యాఖ్యానించేవారు [3-4].
ఇలాంటి స్థితిలో ఇంగ్లీషు విద్యావంతులైన భారతీయులు ఈ folklore ని సగర్వంగా ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. ఈ పనిలో రవీంద్రనాథ్ టాగోర్ ప్రధాన నాయకత్వం వహించాడు. జానపదం అనే పేరుపెట్టి ఈ విజ్ఙానాన్ని భారతీయ సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించడానికి టాగోర్ ప్రతిభావంతంగా ప్రయత్నించాడు [5]. దానితో తెల్లదొరలు తమ సామ్రాజ్య గౌరవాన్ని చాటుకోవటానికి తయారు చేసిన ఈ folklore జాతీయవాదుల చేతిలో జానపద వాఙ్మయం అనే పేరుతో కొత్త అవతారమెత్తింది. టాగోర్ శిష్యులైన తెలుగు భావ కవులు ఈ పద్ధతిని అనుసరించారు. కింది కులాల సంస్కృతిని తమలో కలుపుకోవడానికి తెలుగు భావ కవులకి ఈ జానపద వాఙ్మయ పరిశోధన కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది. కవితా వస్తువులో ఒక నూతనత్వం కోసం ప్రయత్నించే ఈ కవులకి పల్లెటూళ్ళలో పొలాలు, సెలయేళ్ళు, సంక్రాంతి సంబరాలు, గంగిరెడ్లు, ముగ్గులు, గొబ్బిపాటలు, చాలా అందమైన కవితా వస్తువులయ్యాయి. ఉదా: అబ్బూరి రామకృష్ణారావు (“కాపుపాట”), దువ్వూరి రామిరెడ్డి (“కృషీవలుడు”), పింగళి-కాటూరి (“జొన్న చేను”), రాయప్రోలు (“ఏ అమాయకమగు కళలు …”), బాపిరాజు (“ప్రభువుగారికి దండం పెట్టు డూ డూ డూ బసవన్న …”), కృష్ణశాస్త్రి (“పల్లకి”), మొదలైనవి. భావ కవులు రాసిన ఈ కవిత్వమంతా పల్లెటూళ్ళలో వుండేవాళ్ళ సంస్కృతిని అందులోనూ కింది కులాల వాళ్ళ సంస్కృతిని అందంగా చిత్రించేదే అయినా వాళ్ళ కవిత్వ భాష మాత్రం యథాపూర్వంగా మధ్య తరగతి కవితా భాషే అయింది.
అయితే ఈ విషయంలో ఇంకొక అడుగు ముందుకు వేసి తక్కువ కులాలవారి యాస భాషలో కవిత్వం రాసిన వారు బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, కొనకళ్ళ వెంకటరత్నం గార్లు. వాళ్ళ పాటల్ని, ఆ పాటలమీద వచ్చిన విమర్శల్ని, ఆ పాటలకు వచ్చిన ప్రచారాన్ని, అవి పాడే సంగీతాన్ని తరువాతి భాగంలో చర్చిస్తాం.
Bibliography
Imagined Communities, Benedict Anderson, Verso, 1983
దేశం, మాత అన్న అంశంపై చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఉదాహరణకు చూ:
Passions of the tongue – Language devotion in Tamil India 1891-1970, Sumathi Ramaswamy, University of California Press, Berkeley, 1997
The life and times of Bharat Mata, Sadan Jha, Manushi, Issue 142
Photos of the Gods – The printed image and political struggle in India, Christopher Pinney, Oxford University Press, London, 2004
In quest of Indian folktales, Pandit Ram Gharib Chaube and William Crooke, Edited and with an introduction by Sadhana Naithani, Indiana University Press, Bloomington, 2006
Old Deccan Days or Hindoo Fairy Legends, Mary Frere, Edited and with an introduction by Kirin Narayan, ABC-Clio, Santa Barbara, 2002
Frank Korom, Inventing traditions: Folklore and nationalism as historical process in Bengal, in D. Rihtman-Augustin et al (eds), Folklore and historical process, Institute of folklore research, Zagreb, 1989, pp. 57-84
--------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు,
పరుచూరి శ్రీనివాస్,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment