Monday, May 13, 2019

రొసెట్టా రాయి కథ – వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష


రొసెట్టా రాయి కథ – వెలుగులోకి వచ్చిన 

మరుగున పడ్డ ఒక పురాతన భాష




సాహితీమిత్రులారా!

మానవ జాతి ఒక భాష యొక్క లిపి ఎలా చదవాలో మర్చిపోయిన 1500 సంవత్సరాలు తర్వాత ఉన్నట్టుండి, ఆ భాషను చదవగలిగితే ఎలా ఉంటుంది? అందులో, ఆ భాష మానవ చరిత్రలోనే పురాతనమైన భాషల్లో ఒకటి అవటమే కాకుండా, 4500 సంవత్సరాల క్రితం అతి మహోజ్వలమైన సంస్కృతికి చిహ్నమైన భాష కూడా అయితే? ఇక్కడ ఈ విషయాల ప్రస్తావన, పురాతన ఈజిప్ట్ సంస్కృతిలో అంతర్భాగమైన “హైరోగ్లిఫ్” (Hieroglyph) లిపి గురించి.

ఇప్పటికి 4500 సంవత్సరాలకి పూర్వమే, మహా వైభవంగా సాగిన పురాతన ఈజిప్ట్ చక్రవర్తుల (ఫెరోల) పాలనలో ప్రముఖ పాత్ర వహించిన హైరోగ్లిఫ్ లిపి కాల గర్భంలో కలిసిపోయి, దాదాపు 1500 సంవత్సరాల కాలం తరవాత, ఒకదాని తరవాత మరొక అద్భుత పరిశోధనల సముదాయం వల్ల, మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆ కథా వివరాలే ఇక్కడ ప్రస్తావన.

రొసెట్టా రాయి
రొసెట్టా రాయి రెండు భాషలలో (ఈజిప్షియన్, గ్రీకు), మూడు లిపులని ( హైరోగ్లిఫ్, డెమోటిక్, గ్రీకు) ఉపయోగిస్తూ రాసిన రాతలున్న శిలాఫలకం. పైన హిరోగ్లిఫ్ లిపి, మధ్యలో డెమోటిక్ లిపి, క్రిందన గ్రీక్ లిపి ఉంటాయి. ఈ శిలాఫలకం తయారుచేసే నాటికి, ఈ మూడు లిపులు వాడకంలో ఉండేవి. అతి ముఖ్యమైన మత సంబంధిత విషయాలకి హైరోగ్లిఫ్ వాడకం జరిగేది. సామాన్యుల కోసం డెమోటిక్ (Demotic) వాడకం అందుబాటులో ఉండేది. అప్పటి కాలంలో ఈజిప్ట్ దేశానికి రాజభాషకి లిపి అయిన గ్రీకు మూడవది. ఒకే విషయాన్ని చెపుతూ, ఈ మూడు లిపుల వాడకం వల్ల, మతాధిపతులు, రాజాస్థాన ఉద్యోగులు, రాజులు – ఇలా అందరూ చదవగలిగేవారు. ఈ శిలాఫలకం క్రీస్తుపూర్వం 196 సంవత్సరం మార్చి 27 తేదీన చెక్కబడింది. క్రీస్తుశకం 1799 సంవత్సరంలో, ఈజిప్ట్ దేశం నెపోలియన్ బోనపార్టే (General Napoleon Bonaparte) క్రింద ఫ్రెంచి పాలనలో ఉండగా, ఫ్రెంచి సైనికులకి ఒక పురాతన కోటకి మరమ్మత్తులు చేస్తుండగా దొరికింది రొసెట్టా రాయి. “రషీద్” అన్న పేరు గల ఒక చిన్న పల్లెటూరులో దొరికిన ఈ శిలాఫలకానికి “రొసెట్టా” గా ఫ్రెంచివారు పేరు పెట్టారు. కొంతమంది దేవాలయ పురోహితులు రాసివుంటారనుకుంటున్న ఈ రాతల్లో, అప్పటి ఫెరోలు – పురోహితులకి, దేశ ప్రజలకి ఎటువంటి మంచి పనులు చేసారో ఇందులో ఉన్నాయి! ఈ రాతల్ని అర్థం చేసుకోడానికి ఎంతో మంది, ఎన్నో ఏళ్ళు శ్రమించినా అర్థం చేసుకోలేకపోయారు. 1822 సంవత్సరంలో, ఫ్రెంచి భాషా శాస్త్రజ్ఞుడు, మేధావి అయిన జాన్ ఫ్రాన్స్‌వా ఛాంపోలియన్‌ (Jean-Francois Champollion) , ఈ గుప్త సంకేతాల్లోని అసలు సమాచారాన్ని వెలికి తీసాడు.

జాన్ ఫ్రాన్స్‌వా ఛాంపోలియన్
జాన్ ఫ్రాన్స్‌వాకి గ్రీకు, కోప్టిక్‌ (Coptic) లిపులు రెండూ చదవటం వచ్చు. ఈ శిలాఫలకంపై ఉన్న కోప్టిక్ లిపిలో ఉన్న ఏడు డెమోటిక్ సంకేతాలని గుర్తు పెట్టి, వాటిని ఎలా వాడారో అర్థం చేసుకున్నాడు. వీటి ఆధారంగా, హైరోగ్లిఫ్‌లో వాడిన సంకేతాలకు అర్ధం తెలుసుకోగలిగాడు. 1808 సంవత్సరంలో తన 18 ఏట ప్రారంభించిన ఈ పరిశోధన ఫలితంగా, 14 సంవత్సరాల తరవాత, 1822 సంవత్సరంలో జాన్ ఫ్రాన్స్‌వా ఛాంపోలియన్ ఈ చిక్కు ముడిని విప్పగలిగాడు.

మొదటిసారిగా, ఈజిప్ట్ లిపి “హైరోగ్లిఫ్”కి ఆ పేరు ఇచ్చింది గ్రీకులు. “ta hieroglyphica” అన్న గ్రీకు పదాలకి అర్ధం “మంగళకరమైన చెక్కిన రాతలు”. హైరోగ్లిఫ్ లిపి అంతా బొమ్మలతో కూడుకున్న లిపి. ఇది ఒక రకమైన బొమ్మల పదకేళి అనుకోవచ్చు. ఈ లిపిలో వాడిందంతా, అందరికీ బాగా తెలిసిన బొమ్మలు – అవి ప్రకృతికి సంబంధించిన లేదా మానవ నిర్మితమైన వస్తువులు. వీటిని చూసి, హైరోగ్లిఫ్ అంతా ఒక బొమ్మల సముదాయం అనుకున్నంత సులభం కాదు! ఈ నాడు వాడుకలో ఉన్న ప్రపంచ భాషలన్నింటి కన్నా సంపన్నమైన భాష. నేర్చుకోటానికి చాలా కష్టమైన భాష కూడా! సాధారణంగా హైరోగ్లిఫ్ లిపిని కుడి నుంచి ఎడమకు లేదా పై నుంచి క్రిందకి రాస్తారు. కానీ, చూడటానికి అందంగా కనిపించటం కోసం, అప్పుడప్పుడు, ఎడమ నుంచి కుడి వైపు కూడా రాస్తారు. ఎటువైపు నుంచి ఎటువైపు రాసారు అన్నది, ఈ లిపిలో వాడిన మనుష్యులు, జంతువులు ఎటువైపు చూస్తున్నాయి అన్నదాన్ని బట్టి చెప్పచ్చు. మనుష్యులు, జంతువులు ఎటువైపు చూస్తున్నారో, వాక్య నిర్మాణం అటు వైపున మొదలయినట్టు లెక్క!

Heirogliph Alphabet
పదిహేనువందల సంవత్సరాల బాటు ఈ హైరోగ్లిఫ్‌లో ఏం రాసారో అన్న ఊహాగానాలు విరివిగా ఉండేవి! ముఖ్యంగా, యూరప్ ఖండం లోని భాషా వేత్తలు అంతా, రకరకాలైన ప్రతిపాదనలు చేసేవారు. కొంత మంది, బైబిల్‌లోని చాలా రహస్యాలకి మూలం ఈ హైరోగ్లిఫ్ రాతలుగా భావించేవారు. మరికొంతమంది, ఖగోళ రహస్యాలన్నీ ఇందులోనే ఉన్నాయని, ఇంకా కొంతమంది, తాంత్రిక, మాంత్రిక శక్తులు ఎలా సంపాదించాలో హైరోగ్లిఫ్ రాతల్లో పొందు పరచబడ్డాయని అనుకొనే వారు. ఇలాంటి ఊహాగానాల జాబితాకు అంతే లేకుండా ఉండేది! అసలు పిరమిడ్లు ఎందుకు కట్టారో, అందులో మహారాజులు చనిపోయిన తరవాత వాటిని మమ్మీలగా ఎందుకు మార్చారో, అలాగే ఈ మమ్మీల పక్కనే అతి విలువైన సంపదలను కూడా ఎందుకు సమాధి చెయ్యవలసి వచ్చిందో – అప్పటికి ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నలు. అలాంటి కాలంలో, ఫ్రెంచ్ సైనికాధ్యక్షుడు నెపోలియన్ బోనపార్టే, ఈజిప్ట్‌ని జయించడానికి పెద్ద సైన్యంతో దిగాడు. ఈజిప్ట్‌కి వచ్చిన వెంటనే, నెపోలియన్ ఈజిప్ట్ దేశంలో ఎన్నో విశేషాలున్నాయని గమనించాడు. అప్పటికి, కైరోలో గీజా ప్రాంతంలో, పిరమిడ్లకి పక్కనే ఉన్న స్ఫింక్స్ పూర్తిగా ఇసుకలో కూరుకుపోయి, ఒక్క తల మాత్రం బయటకు కనపడేదిట! నెపోలియన్ ఆశయాల్లో, ఈజిప్ట్ దేశాన్ని జయించడమే కాకుండా, అప్పటి ప్రపంచానికి అంతుచిక్కని, ప్రాచీన ఈజిప్ట్ నాగరిక రహస్యాలను కనుక్కోటానికి, 167 భాషావేత్తలను, ఫ్రాన్స్ నుంచి, ఈజిప్ట్ తీసుకొచ్చాడు. పురావస్తు త్రవ్వకాల్లో ఏమైనా కొత్తగా కనుక్కున్నా, హైరోగ్లిఫ్ లిపి అర్థం చేసుకోటంలో ఎదైనా కొత్త విషయాలు కనుక్కున్నా, తనకి వెంటనే ప్రత్యేకంగా తెలియ పరచాలని నెపోలియన్ ఆదేశించాడు! అదే సమయంలో (1799వ సంవత్సరం), బ్రిటిష్ వారు ఈజిప్ట్‌పై ఆధిపత్యం కోసం, హోరాహోరిగా ఫ్రెంచివారితో యుద్ధం చేసి, ఈజిప్ట్‌ను వశపరుచుకున్నారు! అందువల్ల, ఫ్రెంచి వారు యాదృఛ్చికంగా కనుకొన్న అతి విలువైన రొసెట్టా రాయి, బ్రిటీష్ వారి కైవసం అయి, లండన్‌కి పంపబడ్డది. ఇప్పటికీ, ఆ రాయి బ్రిటీష్ మ్యూజియంలో భద్రంగా ఉంది. ఇలా అవుతుందని ముందే ఊహించిన ఫ్రెంచివారు, ఈ రాయిపై ఉన్న రాతల నమూనాలు తీసి, ఫ్రాన్సులో చాలా చోట్ల ఉన్న భాషావేత్తలకి, విద్యాధికులకి హైరోగ్లిఫ్ రాతల రహస్యాలను కనిపెట్టగలరేమోనని పంపించారు. ఈజిప్ట్ దేశాన్ని వశపరచుకోడంలో నెపోలియన్ విఫలుడైనా, ప్రపంచానికి ఒక అపూర్వమైన భాషను వెలికి తీయడానికి కారకుడయ్యాడు!


ఫ్రాన్స్‌లో ఇలా పరిశోధనులు సాగే కాలానికి, సరిగ్గా ఇలాంటి ప్రయత్నాలే బ్రిటన్‌లో జరిగేవి. బ్రిటన్ – ఫ్రెంచ్ దేశాల మధ్య ఉన్న బద్ధ శతృత్వం వల్ల, ఈ రొసెట్టా రాయి రహస్యాలను ఛేదించటం అతి పెద్ద పరీక్షగా మారింది. అలాంటి సమయంలో, పురాతన ఈజిప్ట్ ప్రపంచాన్ని అర్ధం చేసుకోటంలో పునాది వేసినవాడు ఒక బ్రిటిష్ పౌరుడు. థామస్ యంగ్ (Thomas Young) అన్న భాషాశాస్త్రవేత్త, ఈ మూడు లిపుల్లోనూ, అప్పటికి అందరికీ బాగా అర్ధమైన గ్రీక్ లిపిలో ఉన్న ఆఖరు వాక్యం ద్వారా, ఈ మూడు లిపుల్లో చెప్పబడింది ఒకే విషయం అన్నది గమనించాడు. ఆ తరవాత, గ్రీక్ లిపిలో కొన్ని అక్షరాలు ఒకే బాణీలో, పదే పదే కనిపించడం గమనించాడు. వాటి ఆధారంగా, గ్రీక్ లిపికన్న పైన ఉన్న డెమోటిక్ లిపిలో ఉండి, తిరిగి పదే పదే కనిపించే బాణీని గుర్తుపట్టి, ఈ రెండూ ఒకే విషయాన్ని చెపుతున్నాయని తేల్చాడు. వీటి ఆధారంగా, హైరోగ్లిఫ్ లిపిలో వీటికి సామ్యం ఏమిటా అని పరిశోధిస్తుండగా, హైరోగ్లిఫ్ లిపిలో కొన్ని సంకేతాలన్ని కలిపి ఒక వృత్తంలో చుట్టబెట్టి ఉండటం గమనించాడు. దీన్నే తరవాత, “కార్టూష్” (Cartouche) అని పిలిచే వారు. హైరోగ్లిఫ్ లిపిలో ఒక పేరును సూచించడానికి కార్టూష్‌ని ఉపయోగించేవారు. ఈ రకంగా థామస్ యంగ్ ఏడు సంకేతాల్ని గుర్తించాడు. పురాతన ఈజిప్ట్ ప్రపంచంలో మహోజ్వలంగా వెలిగిన ఫెరో పేరే ఈ ఏడు సంకేతాల కార్టూష్. పేరు “రామెసెస్” . ఈ అత్యద్భుత విజయాన్ని అందరికీ చాటి చెప్పాడు యంగ్. అప్పటికే, ఫ్రాన్స్‌లో తన 18 సంవత్సరాల వయస్సులో ఈ విషయాలపై పరిశోధన మొదలుపెట్టిన జాన్ ఫ్రాన్స్‌వా ఛాంపోలియన్ కి, ఈ వార్త థామస్ యంగ్ అందించాడు. థామస్ తనను, జాన్ ఫ్రాన్స్‌వా‌కి, గురువుగా భావించుకొని ఈ వార్త అందజేసాడు. కానీ, తరవాత ఇలాచేసి నందుకు థామస్ ఎంతో బాధ పడ్డాడు. రొసెట్టా రాయి కథలో, జాన్ ఫ్రాన్స్‌వాకి వచ్చినంత పేరు, థామస్ యంగ్‌కు రాలేదు!


కానీ, థామస్ యంగ్‌ అసాధారణ బహుముఖ ప్రజ్ఞావంతుడు. భౌతికశాస్త్రంలో (Physics), కాంతి మీద అనేక పరిశోధనలు చేసినవాడు. “కంటికి కనపడే రంగులకు ముఖ్య కారణం, మన కళ్ళు ఎరుపు, ఆకుపచ్చ, నీలం అన్న ఈ మూడు ప్రాథమిక రంగుల్ని విడివిడిగా చూడగలగటం” అని నిర్ధారించినవాడు. మిగిలిన రంగులన్నీ కూడా, ప్రాథమికమైన ఈ మూడు రంగుల కలియిక వల్ల వచ్చినవే! భౌతిక శాస్త్రంలో ఎన్నో విభాగాల్లో ఈతని పరిశోధనల నుంచి ఈనాటికి కూడా విద్యార్థులు నేర్చుకుంటూనే ఉన్నారు! వైద్యశాస్త్రంలో కూడా నిపుణుడు. తన 14 ఏటనే, లాటిన్, గ్రీక్, పర్షియన్, ఫ్రెంచ్, ఇటాలియన్, అరబిక్, హీబ్రు భాషల్లో అపారమైన అనుభవం సంపాదించినవాడు. అప్పటికే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తోటి విద్యార్థులు ఇతని అసాధారణ ప్రతిభని గుర్తించారు.

Thomas Young
థామస్ యంగ్‌ వేసిన పునాది పై, జాన్ ఫ్రాన్స్‌వా తన పరిశోధనలని తీవ్ర తరం చేసాడు. పగలనక, రాత్రనక నిద్ర, ఆహారాలు మాని పని చెయ్యటం మొదలు పెట్టాడు. రొసెట్టా రాయి రహస్యాలను పైకి తీయటం కోసం జాన్ ఫ్రాన్స్‌వా పడుతున్న శ్రమ చూసి, ఇతని అన్న జాక్స్ జోసెఫ్ ఛాంపోలియన్ ఆందోళన పడేవాడు. అది సెప్టెంబరు 14, 1822 సంవత్సరం. ఉన్నట్టుండి, అన్నగారి గది తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. జాన్ ఫ్రాన్స్‌వా “నాకు తెలిసింది! నాకు తెలిసింది!” అని అరుస్తూ, తనకి ఏం తెలిసిందో అన్నగారికి చెప్పబోతూ, ఉన్నట్టుండి చచ్చినవాడు పడ్డట్టు, దబ్బున నేలపై పడ్డాడు.

1790 సంవత్సరంలో పుట్టిన జాన్ ఫ్రాన్స్‌వా, మనుషుల పుట్టు పూర్వోత్తరాలపై పరిశోధన చెయ్యాలని, చిన్నప్పుడే నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం, మధ్య- తూర్పు దేశాల భాషలు ఎన్ని నేర్చుకుంటే, అంత మంచిదని తోచింది. తమ్ముడి మేధస్సు గుర్తించిన అన్నగారు, తమ్ముడి చదువు కోసం ఏది అవసరమో అది చెయ్యటానికి సిద్ధపడ్డాడు. అందుకోసం, తనుంటున్న గ్రెనోబుల్ పట్టణానికి తీసుకొచ్చాడు. తన 11 ఏట, జాన్ ఫ్రాన్స్‌వా‌ని ఒక రోజు ప్రముఖ శాస్త్రవేత్త, ఈజిప్ట్ వెళ్ళి వచ్చి, నెపోలియన్‌తో పరిచయమున్న ఫూరియర్ (Fourier) ఇంటికి పిలిచారు. అప్పటికే, ఈ 11 ఏళ్ల కుర్రవాడి ప్రతిభ, ఫూరియర్ విని ఉన్నాడు. గ్రెనోబుల్ ఊరిలో అతి గొప్పవాడైన ఫూరియర్‌ని కలవగానే, జాన్ ఫ్రాన్స్‌వా ఛాంపోలియన్ నోట మాట రాలేదు. ఫూరియర్ తన ఈజిప్ట్ యాత్ర, అక్కడ దొరికిన రొసెట్టా రాయి, దాని మీద ఉన్న విచిత్రమైన చిహ్నాల గురించి చెపుతుంటే, ఆసక్తిగా విన్నాడు. అప్పటికప్పుడే, ఫూరియర్ తన దగ్గర ఉన్న రొసెట్టా రాయి పై ఉన్న రాతల నమూనాను ఒకటి, జాన్ ఫ్రాన్స్‌వా‌కి ఇచ్చాడు. ఆ ఇంటి నుంచి తిరిగి తన ఇంటికి వెడుతుంటే, జాన్ ఫ్రాన్స్‌వా, ఆ రాతల్ని శ్రద్ధగా పరిశీలించటమే కాకుండా, వాటి రహస్యాలని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు.

అందుకోసం, ఒక ఆరేళ్ళపాటు, గ్రీక్, హీబ్రు, అరబిక్, సంస్కృతం, పర్షియన్ భాషలతో పాటు, అనేక పాశ్చాత్య భాషలు కూడా నేర్చుకున్నాడు. వీటన్నిటిలోకి, ఈజిప్ట్‌లో క్రిస్టియన్లు మాట్లాడే కోప్టిక్ భాష నేర్చుకోటం అవసరంగా భావించి, దాన్ని అధ్యయనం చేసాడు. అందరిలాగే, జాన్ ఫ్రాన్స్‌వా కూడా హైరోగ్లిఫ్ భాష అంతా, చిత్రాలకి సంబంధించింది అని అనుకున్నాడు. దురదృష్టవశాత్తు, రొసెట్టా రాయిలో, హైరోగ్లిఫ్ ఉన్న చాలా పంక్తులు విరిగి పోయి, ఒక్క 14 పంక్తులు మాత్రమే మిగిలాయి. అంత కాస్త దొరికిన లిపితో ఈ రహస్యాలను ఛేదించటం కష్టంగా తోచింది జాన్ ఫ్రాన్స్‌వా‌కి. అనుకోకుండా, ఒక స్నేహితుడు నైల్ నది పక్కనే ఉన్న ఫిలే (Philae) అన్న ఒక ద్వీపంలో దొరికిన ఒక శిలాఫలకాన్ని పంపించాడు. గ్రీక్ లిపిలోనూ, హైరోగ్లిఫ్ లిపిలోనూ ఒకే విషయాన్ని చెపుతూ చెక్కిన శిల్పం ఇది. అందులో, ప్టోలెమీ ( Ptolemy VII) అన్న ఫెరో పేరు, క్లియోపాత్రా (Cleopatra II)అన్న రాణి పేరు ఉన్నాయి. ముందు కొన్ని తప్పులు దొర్లినా, ఈ రెండు పేర్లనీ జాన్ ఫ్రాన్స్‌వా సరిగ్గా గుర్తించాడు.


తర్వాత, కొన్ని నెలల శ్రమ ఫలంగా, జాన్ ఫ్రాన్స్‌వా 80 పేర్లను, 100 పైగా హైరోగ్లిఫ్ చిహ్నాలను కనుక్కున్నాడు. ఛాంపోలియన్ పరిశోధనలో అతి ముఖ్యమైనది, హైరోగ్లిఫ్ లిపి స్వరూప నిర్ధారణ! ఈ లిపి పూర్తిగా చిత్రాల ద్వారా చెప్పే భావాలకి సంబంధించినది కాదు. అలాగని, పూర్తిగా, శబ్ద పరమైన భాష కూడా కాదు! అసలు రహస్యం ఏమిటంటే, ఈ లిపి చిత్ర (భావ), శబ్ద సమ్మేళం! ఇది ఎప్పుడైతే కనుక్కున్నాడో, జాన్ ఫ్రాన్స్‌వా తన ఆనందాన్ని తట్టుకోలేక, అన్నగారి గదికి పరిగెట్టాడు.

1824 సంవత్సరంలో, తన పరిశోధన ఫలితాలను ఒక పుస్తకంగా అచ్చువేయించాడు. హైరోగ్లిఫ్ లిపిని ఎలా అర్ధం చేసుకోవాలి అన్న సూత్రాలను ఇందులో వివరించాడు. దాంతో, ఛాంపోలియన్ ఒక మహా ప్రముఖ వ్యక్తిగా ప్రపంచం గుర్తించింది! అప్పటి ఫ్రెంచి రాజు లూయి 16 ని కలిసాడు. అప్పటికప్పుడే, పారిస్‌లోని అతి ప్రముఖమైన లూవ్రె (Louvre) మ్యూజియంలో ఈజిప్ట్ విభాగానికి అధిపతిగా నియమించబడ్డాడు. తరవాత కాలంలో, స్వయంగా తానే చేసిన ఈజిప్ట్ యాత్రలో, నైల్ నది ఒడ్డున ఉన్న హైరోగ్లిఫ్ రాతల్ని స్వయంగా చదివాడు. 1832 సంవత్సరం, తన 42 ఏట, మరణించే వరకూ హైరోగ్లిఫ్ లిపి పై కృషిచేస్తూ, హైరోగ్లిఫ్ లిపిపై ఒక నిఘంటువు, అందుకు సంబంధించిన వ్యాకరణాన్ని తయారు చేసాడు.


ఆ తరవాత కాలంలో దొరికిన అనేక హైరోగ్లిఫ్ రాతలని, ఛాంపోలియన్ కృషివల్ల అర్ధం చేసుకొన్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే, అతి సాధారణంగా కనిపించే రొసెట్టా రాయిని, లండన్, బ్రిటిష్ మ్యూజియంలో ఇప్పటికీ కొన్ని వేల మంది ప్రతి ఏటా దర్శిస్తూ ఉంటారు. ఈ రాయి చుట్టూ కనపడే చాలా అందమైన శిల్పాల మధ్య అతి సాధారణంగా కనిపించే ఈ రాయి, అతి పురాతన మానవ సంస్కృతిని మనకి మళ్ళీ పరిచయం చేసింది!

ఈ రచనకు ఉపయోగ పడిన పుస్తకాలు
The Riddle of the Rosetta Stone by James Cross Giblin, Harper Collins Publishers, 1990.
The British Museum Book of The Rosetta Stone by Carol Andrews, Peter Bedrick Books, 1981.
The Keys to Egypt by Lesley and Roy Adkins, Harper Collins Publishers, 2000.
The Mystery of the Hieroglyphs by Carol Donoughue, Oxford University Press, 1999.
------------------------------------------------------
రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న, 
ఈమాట సౌజన్యంతో

No comments: