Monday, May 20, 2019

మనవూళ్ళో దేవుళ్ళు - గ్రామాల్లో దేవతలు


            మనవూళ్ళో దేవుళ్ళు - గ్రామాల్లో దేవతలు                                                                    

 

సాహితీమిత్రులారా!

అది ఖమ్మం జిల్లా, పెనుబల్లి ఊరి శివార్లలో పది పాకలు. బస్ కూడా బతిమాలితే తప్ప ఆపడక్కడ. లారీలప్పుడప్పుడు ఆగుతుంటాయి. ఆ చిన్న లంబాడి తండాలో అందరూ రోజూవారి కూలీలే. తారు రోడ్డు నించి మట్టి దారిలో రెండు మైళ్ళు లోపలికి వెడితే చిన్న పేరుకూడాలేని ఆ ప్రాంతం. ప్రగతి పధంలో వెడుతున్న మన భారతదేశానికి, అక్కడ కూడా నివశించగలిగిన ప్రజల ఆశాజ్యోతుల్లా నూని దీపాలే తప్ప వీధి దీపాలు కూడా లేవు. అక్కడుంటాడు సైదులు.

మామూలు రోజుల్లో ఎవరూ పట్టించుకోరు కాని, సోమవారం రాత్రి మాత్రం కొద్ది మంది ఎక్కడెక్కడినించో వస్తారు ఆ పాకల్లో ఒక దాంట్లో జరిగే అద్భుతాలు చూడ్డానికి. నెమ్మదిగా చీకటి పడుతూనే అందరూ చేరారు. అగరువత్తుల సువాసన, రెండు దీపాల వెలుగులో కనిపిస్తున్నాడు, సుందరమైన ఫొటోలోంచి అందంగా నవ్వుతున్న శ్రీ కృష్ణ భగవానుడు. కృష్ణుడు పెరిగిన బృందావనం కూడా ఇంత నిరాడంబరంగా వుండేదేమో తెలియదు. నెమ్మదిగా భజన మొదలైంది - "నల్లని వాడివిరా ! నామాలు గలవాడా ! నా చిన్ని కృష్ణయ్యో చిన్ని కన్నయ్యా " ఆ పాట రాగంలోనే నాదస్వరంలాంటి ఒక మత్తు ఉంది. సైదులులో నెమ్మదిగా మార్పురావడం మొదలైంది. మంత్రం, యంత్రం ఏమి లేవక్కడ. మానవుణ్ణి మించిన శక్తి క్షేత్రం సృష్టిలో ఎక్కడుంది ! రాతి విగ్రహాల్లోంచే మనని అనుగ్రహించగలిగిన ఆ సర్వాంతర్యామి నిర్మల మనస్కులైన మనుషుల్లోంచి మాట్లాడ్డం ఎంతసేపు? ఓ పక్కన సైదులు ట్రాన్స్ లాంటి స్థితిలోకి వెళ్ళాడు. భజన ఆగిపోయింది. నమ్మిన వాళ్ళకి, సైదులు కొద్ది క్షణాల్లోనే దివ్యానుభూతి అవేసించిన శ్రీ కృష్ణుడయ్యాడు. ఇక అతనిలోంచి ఓ అతీత శక్తిగా భగవంతుడు మాట్లాడడం మొదలుపెట్టాడు.

"సత్తుపల్లి నించి వచ్చిన చెల్లెమ్మా....మనవడి ఇంజనీరింగ్ చదుకోసం వచ్చిన చెల్లెమా...కొడుక్కి పెళ్ళిచేసి కన్నీళ్ళు పెట్టుకున్న చెల్లెమ్మా...బాగున్నావామ్మా?" అని పిలిచాడు. అక్కడికి మొదటిసారి వచ్చిన ఆమె ఆశ్చర్య పోయింది. అతను తనగురించి చెప్పినవి నిజమే!

"నీ మనవడు చదువుకోసం అడగాలని వచ్చావమ్మా?" అన్నాడు కృష్ణుడు. అలా మొదలుపెట్టి ఒక్కొక్కరికి వారిగురించి అనేక విశేషాలు, ఆవేదనా సంద్రం నించి బయట పడే ఉపాయాలు చెప్పడంతో వారికి ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. కొందరి మొఖాల్లో ఆనందం, కొందరికి ఆనంద బాష్పాలు. అక్కడున్నవాళ్ళందరికి అలా నవ్వుతూ, మానవాతీతమైన శక్తితో సమస్యలకు తనకి తానుగా కష్టాలని దైవ శక్తితో యధా శక్తి గుర్తించి, ఉపాయాలు చెప్పి మార్గదర్శకం చేసాడు, అన్నిటినీ మించి ఊరడించాడు. నిస్వార్ధంగా దేవుడి దగ్గర పెట్టిన అరటి పళ్ళని సైతం వారికే ఇచ్చేసి తను ఆనందాన్ని మాత్రమే పొందుతున్నాడు సైదులు. ఇలాంటి దివ్య సాధకులతో కూడిన సంఘటనలని చూసినప్పుడు అనిపిస్తుంది - ఇది దివ్య శక్తా? సంఘ సేవా? అతనిలో నిజంగా కృష్ణుడు పూనాడా? ఒకటి మాత్రం నిజం దేవుడంటూ మనిషికి కనిపిస్తే అంత ప్రేమగా మాట్లాడతాడు, వ్యధని అర్ధం చేసుకుంటాడు అని.

వ్యక్తిగత అనుభవాన్ని బట్టి, ఆయా నిజానిజాల నిర్ధారణ జరుగుతోంది. కొందరికి మహాద్భుతం అనిపించిన చోట ఇంకోరికి పచ్చి మోసం అనిపించ వచ్చు. దివ్య సాధకులు కూడా కొన్నిసార్లు మానవ సహజ మైన స్థితిలో వుండి తమ శక్తిని దుర్వినియోగం చెయ్యవచ్చు కదా? మన ఊళ్ళలో పండుగలకి నిప్పులమీద నడవడం చూశాం. వీరభద్ర భక్తులు, అమ్మవారి భక్తులు జాతరలలో కత్తులు గుచ్చుకోవడం, వీపునిండా సూదులు గుచ్చుకుని వాటికి దారాలు కట్టి చిన్న రధం లాగడం లాంటివి ఈనాటికి ఇండియాలోనే కాక మలేషియా లాంటి దేశాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి పండుగ 'తైపూసం ' లాంటి చోట్ల ప్రతిఏటా చేస్తున్నారు.ఈ హింసా పూరితమైన భక్తి మంచిది కాదని వారికీ తెలుసు.అయితే భక్తి అనేది ఒక శక్తిని పుట్టిస్తోందా లేక నమ్మకానికే ఓ మానవాతీత శక్తి వుందా అన్నది ప్రశ్నార్ధకం.

అసలు ఇంత చిత్రమైన శక్తి ఆ సైదులుకెలా వచ్చింది? నిజంగా దేవుడు అలా చిన్న చిన్న చోట్ల, మనం వెతికే గిరులు - గోపురాలు, స్వర్ణ - వర్ణ మకుటాలలో కాక కొంపతీసి ఇలా పూరి పాకల్లోంచి, సామాన్య జీవితపు సంగ్రామంలోంచి శ్రీ కృష్ణుడై తన భక్తులతో మట్లాడుతున్నాడా? అలా అయితే ఏ అవధూతలను, ఉపాసకులను మనం వెతకాలి? ఎవరికి మొక్కాలి? ఎవరిలో ఆ పరమాత్ముడు తన నిశ్చల చైతన్యాన్ని నింపుతూ, కర్మ క్షయం చేస్తూ తను కూడా మానవ సంఘ నిర్మాణానికి పాటుపడుతున్నాడు ? అసలు అవసరమేముంది ? తను దేముడైతే మార్గ దర్శకం చేయడమెందుకు సర్వశక్తిమయుడు కనుక సమస్యలు తీర్చేయవచ్చు కదా?

"అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా " అన్నారు కదా లలితా సహస్రనామంలో అలా ధ్యాన సాధనలో వుంటే ఋతంభర ప్రజ్ఞ ద్వారా తెలుసుకునే శక్తి గల యోగులు మన్అ అనుగ్రహిస్తారా? "నిస్సందేహంగా! " అని శాస్త్రాలు చెపుతున్నాయి. మనకి ఏ గురువూ లభించనపుడు, ఇష్టదేవతా సాధనలోనో లేక ధ్యానంలోనో శ్రద్ధగా ముందంజ వేసేవారికి ప్రకృతినుండి ఆయా నిర్దేశాలు లభిస్తాయని, వారిని సన్మార్గంలో తీసుకెళతాయని భగవత్గీత నుండి, పతంజలి యోగ సూత్రాల దాకా అన్ని నర్మగర్భితంగా సూచిస్తున్నాయి. నాకు గురువు కావాలి అని ఉన్న వాళ్ళని, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళనవసరంలేదని లాహిరి మహాశయులనుండి (ఒక యోగి ఆత్మ కధ) మనం తెలుసుకోవచ్చును. సప్త మహర్షులు కూడా వివాహితులేకదా!

యోగుల గురించి మాట్లాడుతున్నపుడు ఒక చిన్న చర్చ గురించి చెప్పాలి. రాజమండ్రిలో ఒక మాష్టరు గారు పేరెన్నిక గన్న ఒక సన్యాసి గారికి సన్మానం జరుగుతుంటే అడిగారు. "అయ్యా దయచేసి నాకు రెండు సందేహాలున్నాయి తీర్చండి అని. ఒకటి మనిషి దేన్నించి సన్యసించగలడు? అన్నీ ఆ పరబ్రహ్మ స్వరూపమైన తత్వమే అని ఎరిగినప్పుడు, అద్వైతమయ మైనప్పుడు ఒక దాన్ని త్యజించడం ఎలా ఇంకొకదాని కోసం? నా ఇంకో సందేహం - సన్యాసులకు సన్మానం చేయవచ్చునా?" అని.

మామూలు యోగులయితే ఈయన ప్రశ్నలకు కోపగించుకునే వారేమో, కాని ఆ సాధువు గారు ఇలా సమాధానమిచ్చారు. "యోగులందర్ని మనం యోగులని, సన్యాసులని, అవధూతలని, గురువులని అంటున్నాం. కానీ వాళ్ళలో కూడా ఎన్నో తత్వపరమైన భేదాలున్నాయి. కుంభమేలాకు లక్షలమంది సాధువులొస్తారు. అందులో అదృశ్య రూపులయిన సిద్ధులూ వుండొచ్చు, అడుక్కునే బిక్షుకులూ వుండవచ్చు. టిబెట్ లాంటి ప్రాంతాలలో కొన్ని చోట్ల అందరూ బౌద్ధ సన్యాసులే. ఆవులన్ని తెల్లనివి అని మనం ఎలా చెప్పలేమో అలాగే యోగులందరూ ఒకటే నని చెప్పలేం. వారి లక్ష్య సిద్ధికూడా వారి మార్గాన్ని, సాధనని బట్టి ఉంటుంది. ఇక మీ మొదటి ప్రశ్నకి జవాబు, మనిషి దేన్నుండీ నిజానికి సన్యసించలేడు. సన్యసించే వారు తమకి తామే శ్రాద్ధకర్మలు నిర్వహించుకుని, జంధ్యముంటే దాన్ని తొలగించుకుని, కుటుంబాన్ని వీడి వెళ్ళడం వల్ల పాపాలన్ని కడిగేసు కున్నట్టు, ఇంక ఆ రెండోరోజు నుంచీ మోక్షానికి సిద్ధం అనుకున్నా అది అజ్ఞానమే. సన్యాసం సాధనకు మొదటి మెట్టు. కాషాయం ధరించడం యుద్ధానికి వెళ్ళే సైనికుడు వేసుకునే యూనిఫార్మ్ లాంటిది. ప్రపంచంలో ప్రతి యూనిఫారంతోనూ కొన్ని బాధ్యతలుంటాయి. సైనికుడు అది వేసుకోగానే ఈ దేశమే నా కుటుంబం అనుకోగలగాలి. అయితే సన్యాసిది అంతకన్న పెద్ద లక్ష్యం, ఈ లోకమే నా కుటుంబం అనుకోగలగాలి. సన్యాసి ప్రతిదాంట్లోనూ ఆ సర్వవ్యాపకశక్తిని నిజంగా, పుస్తకల్లోచదినట్టు కాకుండా దర్శించగలగాలి. అంతర్ముఖంగా ఉన్న శత్రువులు - అరిషడ్వర్గాలతోనూ యుద్ధం చెయ్యాలి, తన జీవితాన్ని ఆ మహా లక్ష్యానికి అంకితం చేయాలి. అలా క్రమంగా అన్నిటా తమను దర్శించిన యోగులు కొందరు తమ అసలు వ్యక్తిత్వాన్ని పూర్తిగా నిర్మూలించగలుగుతారు. చిత్తవృత్తులను నిరోధించ గలుగుతారు.

అప్పుడు కాషాయమేం ఖర్మ ఆయోగికి ఏమీ అక్కర్లేదు. దిగంబరుడై సంఘ పరిధినే దాటి వైరాగ్య, అలౌకికానంద అనుభూతిలో ఉన్న ఆ యోగి ఏ భౌతిక సన్మానాలకి లొంగిపోడు. బుద్ధుడిలాంటి చక్రవర్తి కూడా యోగిగా ఆనందించాడు, అలెగ్జాండర్ కూడా ఒక సన్యాసి ముందు మోకరిల్లాడు. ఏ దేశంలో నైనా ఒక సన్యాసి గౌరవనీయుడు, అత్యంత ముఖ్యుడు - ఎందుకంటే అతడు నిర్మల చిత్తుడై నిష్పాక్షికంగా, పరదేవతా స్వరూపమై మానవాళి ఉన్నతిని కాంక్షిస్తాడు కనుక. అందుకే మనం ఋషి ప్రోక్తం అన్న విషయాలని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. పురాణకాలంలో వాళ్ళు మాట్లాడేవారు, సంఘం వినేది. ఈరోజు స్వలాభాపేక్ష లేకుండా సంఘానికి హితం చెప్పే యోగులూ కనిపించరు, వాళ్ళెవరైనా చెప్పినా మనం వినం. ఒక యోగి, అతని సాధనా ఎంత గొప్పవంటే ఎవరైన చనిపోతే ధర్మ శాస్త్ర ప్రకారం శరీరాన్ని దహనం చెయ్యమంటారు. కానీ సన్యాసుల యోగుల శరీరాలు ఖననం చేస్తారు-సమాధిని సైతం పూజిస్తారు. కొందరు యోగులను నదీ ప్రవహాల్లో వదులుతారు. వారి శరీరాల్లో వుండే సాధనా శక్తి ఈ ప్రకృతికి చేరి మంచి జరగాలని అందులోని వుద్దేశం. శరీరల్లో దాగుండే కర్మ ప్రభావాలని బుద్ధిజంలో 'సంఖారా ' అంటారు. ఇది బహుశా సంస్కారాలకి ప్రతిరూపం కావచ్చు. విపస్సనా ధ్యాన మార్గంలో వీటిని గురించి వుంది. అందుకని సన్యాసిని పూజించడం సంఘం తనని తాను పూజించుకోవడమే, మనని రక్షించే నిస్వార్ధ మహా సైనికుడ్ని అభినందించడమే. ఆ అభినందన సభ అవగానే సైనికుడు మళ్ళీ తన విధులకి దేశపుటెల్లలోకి ఎలా అయితే వెళ్ళి పోతాడో, జనావళితో పూజలు చేయించుకుంటూ ఉండిపోడో అలాగే యోగి ఇలాంటి సత్కారములందుకుంటూ ఉండడు, ఉన్నా అది తన గురువుకో, తన ఇష్టదేవతకో అంకితం చేస్తాడు. ఆ సన్మానం అవగానే తన భౌతిక ప్రపంచపుటెల్లల్లోకి అంటే నిత్యచైతన్య చిచ్చక్తిలోకి వెళ్ళిపోతాడు." అని ముగించారు.

అది విన్న ఆ మాష్టారు ముకుళిత హస్తాలతో ఆ యోగితో అన్నారు - "ఇందాక ఆ మాలని మీకు వేస్తున్నప్పుడు మీరు ఎందుకు చిరునవ్వు నవ్వారో అర్ధమైంది" అని. మనోభావాలను సైతం చదవగల ఆ యోగి చెప్పారు, "అవును ఆ మాలను చూడగానే నాకు నిర్జీవులపై వేసే పూమాలలు గుర్తుకొచ్చాయి. వారణాసిలోని కాలభైరవుని పాదాలకు ఆ మాలను సమర్పించాను" అన్నారు.

"మరి మావంటి సాధకులకు యోగులవంటి సాధనా సిద్ధులెలా కలుగుతాయి? అసలు సామాన్య మానవుడి కోసం ఇంత అపురూప రహస్యాలనెందుకు అంద అందజేయలేదు? ఇది ఏవైనా ఒక ప్రత్యేక కులానికి రహస్యంగా అందుతున్న విద్యలు, మంత్రాలా? " అని అక్కడున్న ఒక సాధకుడు అడిగాడు.

స్వామి మందహాసంతో చెప్పారు, "ఆలోకంలో వాళ్ళు తపో శక్తి బద్ధులే కాని కుల,మత,దేశ,భాషలకు కాదు. ఈ సంగతి వచ్చింది కనుక కొన్ని విషయాలు చెపుతాను, కేవలం నీ సందేహం తీర్చడానికి. విషయాన్ని లోతుగా అలోచించు -వర్గభేదాలకు అతీతంగా. వాల్మీకి ఎవరు? ఏకలవ్యుడెవరు? రాముడు ఎవరు? కృష్ణుడేవరు?

అన్నిటికన్న ముఖ్యమైన విషయమేటంటే ఎక్కడ జన్మించాం అన్నదికాదు ముఖ్యం ఎందుకోసం జీవించాం అన్నది ముఖ్యం. ఋషులు సామాన్యులకు సైతం విద్యనందించే ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రతిభా పాటవాలు మామూలు మాటల్లో పెట్టడం కష్టం. అందులో కోట్లకొలది సృష్టి సూత్రాల్లో, ప్రకృతి రహస్యాల్లో ఒక్కటి తీసుకుందాం. శ్రద్ధగా వింటే బోధపడుతుంది. పతంజలి యోగసూత్రల్లో ఉంది, మనం దేని మీద మనం సమ్యమం చేస్తే దాని మూలతత్వ సిద్ధి కలుగుతుంది అని. అంటే మామూలు మాటల్లో నాభి చక్రం మీద మెడిటేషన్ చేస్తే శరీర వ్యూహ రచన జ్ఞానం ఏర్పడుతుంది. అందువల్ల మన శరీరంలో ఉన్న వచ్చిన, రానున్న రోగాలన్నీ మనకి తెలిసి పోతాయన్న మాట.

 సూర్యుడి మీద మెడిటేషన్ చేసేవాడికి జగత్సర్వం అర్ధమై వశీభూతమవుతుంది, వాడు మహా తేజోమయుడౌతాడు. బాల అంజనేయుడు సూర్యుడిని మింగాడు అంటే అర్ధం నిజంగా కాల్తున్న సూర్యుణ్ణి నోట్లో పెట్టేసుకున్నాడు అని కాక పోవచ్చు. మనమెవరమూ అక్కడలేము కదా, కనక నిజంగా సత్యాన్ని గ్రధజ్ఞానంగానో, మనోజ్ఞానంతో తప్ప గ్రహించలేం. హనుమంతుడు సూర్యుణ్ణి మింగే విషయాన్ని గురువులు ఇలా కూడా అర్ధం చెప్పారు - హనుమంతుడు అంటే హనువులు కలవాడు. అంటే బుగ్గలు ఉన్నవాడన్న మాట. ప్రాణాయామంతో శ్వాసను కుంభించిన వాడన్న మాట. సూర్యుడిమీద ధ్యానసిద్ధిని పొందాడు అని అర్ధం సూర్యుణ్ణి మింగడం అంటే. ఆ సూర్యుడు గాయత్రి మంత్రంలోని ఆ మహా భర్గుడు కావచ్చు, లేక హృదయ స్థానంలోనుండే సూర్య ద్వారం ఉందని అందులోనుంచి బ్రహ్మలోకానికి ప్రవేశమని పతంజలి చెప్పారు, అధర్వణవేదంలో కూడా ఆ విశేషాలున్నాయి.

'నీలతో యద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా
నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః
స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ '
(నారాయణ సూక్తం)

అలా కీర్తించబడే అఖండ తేజోమయమైన బ్రహ్మత్వాన్ని ఆకళింపుచేసుకుని,అనాహతాన్ని పూర్తిగా సిద్ధింపచేసుకున్న ప్రేమ, స్వామి భక్తి ఆంజనేయునికి ఉన్నయని ఇంకో అర్ధం.అందుకే కొన్ని చిత్రాల్లో వేసినట్టు ఆయన హృదయాన్ని తెరిస్తే నారాయణుడైన ఆ రాములవారే ఉన్నట్టు చూపుతారు. ఆయన బ్రహ్మచారి అంటే బ్రహ్మ యందు చరించే వాడని అర్ధం.కొన్ని జీసస్ చిత్రాల్లో కూడా దివ్యాత్మని అనాహత చక్రంలో చూపిస్తారు.

అంతే కాదు సూర్య నాడి , చంద్ర నాడి అనేవి మన కుండలినిలో వున్నాయి కనుక అందులో సూర్య నాడిని పూర్తిగా చిన్నపుడే వశం చేసుకున్నాడు, తద్వారా అనంత విశ్వజ్ఞానాన్ని పొందాడు అని కూడా అర్ధం చెప్పవచ్చు. అందుకే హనుమంతుడి గురువు సూర్యుడు అన్నారు.

ఇప్పుడు మనం మొదలుపెట్టిన విషయానికొస్తే, సామాన్య మానవుడుకూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ ఆంజనేయ రూపాన్ని కళ్ళారా చూసి దండం పెట్టుకున్నప్పుడు,అర్చించినప్పుడు తనకి తెలియకుండానే ఆ యోగ శక్తిమీద సమ్యమం చేస్తున్నాడు, ఆ శక్తిని పొందుతున్నాడు.దుర్గ గుడికి వెళ్ళినప్పుడు సిం హంలాంటి ప్రకృతిని జయించి, తనలోని తమో రాజసిక ప్రవృత్తులనధిగమించి బహుభుజుడై జీవన గమ్యాన్ని చేరగల దుర్గాన్ని తనలోనే నిర్మించుకుంటున్నాడు, విజయోన్ముఖుడవుతున్నాడు. చిన్న మాటల్లో చెప్పాలంటే నిరక్షరాస్యుడు కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని,అలా అనాలోచితంగా వినమ్ర భక్తితో ధ్యానం చేసుకుని, మనసులో నింపుకున్న ఆ మూర్తి ద్వారా మహా యోగ సిద్ధిని తెచ్చుకుంటున్నాడన్న మాట.ఇదే మహాభారతంలోని ఏకలవ్యుడి కధలో ఉన్న అంతరార్ధం. ద్రోణాచార్యుడే ఎదురుగా ఉండక్కర్లేదు,ఆయన మట్టి బొమ్మ పెట్టుకున్నా అది మాట్లాడుతుంది మౌనంగా, అంతర్లీనంగా - ధనుర్విద్యని నేర్పుతుంది అతీతంగా. చిత్రమేమిటంటే ఇలా జరుగుతున్న విషయం, ఏకలవ్యుడు కేవలం మట్టి బొమ్మతో తన విద్యమొత్తాన్ని గ్రహిస్తున్నట్టు ద్రోణాచార్యుడికి కూడా తెలియదు. దీన్ని బట్టి మనకి అర్ధమయ్యే రహస్యాలు చాలా ఉన్నాయి. విద్య అనేది ఇచ్చేవాడిని బట్టిలేదు, తీసుకునే వాడి గ్రాహ్యక శక్తిని బట్టి ఉంది అని ఒకటి, ఇంకోటి ప్రకృతిలోనే ఋతంభర ప్రజ్ఞ అనే ఒక చైతన్యం ఉంది అది ఎవరికి ఏ జ్ఞానం ఎంత కావాలన్నా అందజేస్తూ ఉంటుంది అన్నది ఇంకోటి.ఇలా మామూలు విగ్రహాలు, రూపాల ఫొటోలు వీటిల్లోంచి శక్తులు విభూతులు, విబూదులు అవీ ఎలా వచ్చేస్తాయో పతంజలి మహర్షి చెప్పారు.రూప విశేషాల మీద ధ్యానం చేస్తే ఆ రూపాల శక్తులు ప్రాప్తిస్తాయని ఎన్నో ఉపాధులని, ఉదాహరణలని యుగాలక్రితమే మనకి ఇచ్చారు. అందుకే సామాన్య మానవుడు సైతం చేసే విగ్రహారాధన ఆ రాతిబొమ్మకి కాదు సుమా! విగ్రహారాధన మనిషిని స్వగృహారాధన (శరీరం,సంసారం)నించి గ్రహాతీతమై, అనుగ్రహకారకమై నిగ్రహారాధనలోంచి నిరాకారబ్రహ్మని మనిషి సూక్షంగా అందించే ఆరాధనాశక్తి సాధనం అన్నమాట.

అందుకే పెద్ద గుడికూడా కట్టలేని పేదలున్న చోట, అలాంటి విజ్ఞానమో ఆసక్తో కూడా లేని గ్రామాల్లో కూడా గ్రామదేవతలు నెలకొని ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు గ్రామాల్లో వారు కూడా యధాశక్తి గ్రామదేవతలని నెలకొల్పి, అర్చించి తరించగలుగుతున్నారు. ఆయాశక్తులు కూడా వారికందుబాటులో ఉంటాయి. మంత్రం సరిగ్గా చదవలేదు, బీజాక్షరం పలకలేదు నేను నీకు కనపడను, అనుగ్రహించను అనడు కదా భగవంతుడు.నిజానికి మామూలు కంటే కొంచెం తొందరగానే గ్రామ వాసుల భక్తి ఈ గ్రామ దేవతలు పలుకుతున్నట్టు కనిపిస్తుంది.నిర్మలమైన భక్తికన్నా విలువైన శక్తి ఏముంది? చాలాచోట్ల ఒక చెట్టునో రాయినో కూడా దేవతగా పూజిస్తారు. పసుపు కుంకుమా పెడితే దేవుడే. జాతరొస్తే ఊరంతా కదలి రావల్సిందే గ్రామదేవతకి మోకరిల్ల వలసిందే. పల్లెవాసుల ప్రేమాభిమానాలు ఎక్కువ. అలిగినా మళ్ళీ అంతగా ప్రేమిస్తారు, అనుగ్రహిస్తారు. ఈ తత్వమే ఆ గ్రామ దేవతల్లో కూడా ఉంటుంది. దేవతా ప్రతిరూపాలు మనం, మన మనోభావ నిర్మాణాలు వాళ్ళు కనుక వాళ్ళు మనం సృష్టించిన పాత్రలో ఇముడుతారు, మనకోసం. అమ్మవార్లు, పేరంటాళ్ళు (దేవతలు) ఈరూపాలే.

పురాతన కాలం నించి దేవతా ఉపాసనలు ఎలా ప్రారంభమయ్యాయో, అవి ఈరోజు ఎలా రూపు దిద్దుకున్నాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరెవరు ఏ విధమైన ఉపాసనని అందుకో గలిగారు అనేది ఒక విచిత్రం. అందరికి ఈ మంత్ర, ఉపాసనా విద్యలు అందలేదు అనుకోడం నిజం కాదు. ఇందుకు చిన్న ఉదాహరణని చూద్దాం.స్త్రీ దేవతా మంత్రాలని విద్యలు అని కూడా అంటారు. ఆ విద్యల్లో అత్యంత రహస్యమైనవి అద్భుత శక్తి ప్రదాయక మైనవి దశమహావిద్యలు. చాలా కాలం ఇవి గోప్యంగా ఉంచబడ్డాయి. ఇవి సామాన్యులు అర్ధం చేసుకోలేరు, యోగ శక్తి రూపాలైన ఛిన్నమస్తలాంటివి అందరికి అర్ధంకాకపోగా అయోమయానికి దారితీయరాదని పండితులు భావించి ఉండవచ్చును. సరే ఈమెనే ఉదాహరణగా తీసుకుంటే ఛిన్నమస్త తంత్ర దేవతగా ఉపాసించబడ్డ కుండలిని యోగ స్వరూపం. ఇళ, పింగళ, సుషుమ్న అన్నీ కలిపి ముగ్గురు దేవతా మూర్తులుగానూ ప్రాణ చైతన్యం ధారగానూ చూపారు. ఇంతకన్న వివరాలు ఇప్పుడు చెప్పలేను కాని ఈమె గొప్ప ఆధ్యాత్మిక యోగశక్తి. రమణ మహర్షి శిష్యులైన కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని (నాయన) ఈమెను వేదంలోని ఇంద్రశక్తిగా కీర్తించారు. ఉమాసహస్రం, ప్రచండచండీ త్రిశతి రచించారు.

"రాయస్కామో వజ్ర హస్తం సుదక్షిణం పుత్రేన పితరం హువే " మంత్రం ఈమె మంత్రంగా గుర్తించారు.ఆమెనిలా కీర్తించారు కూడా.

"ఛిన్నాం భిన్నాం సుతరాం సన్నా
మన్నా భావదభితః ఖిన్నాం
ఏతాం పాతుం భరత క్షోణీం
జాయే జిష్ణోః కురుమాం శక్తః "
(ఉమా సహస్రం - నాయన గారు, 26 నవంబరు 1907)
ఓ దేవీ ఛిన్నాభిన్నమై క్షీణించుచు అన్నములేక అంతటను దుఃఖించు భారత భూమిని రక్షించుటకు శక్తినిమ్ము అని అర్ధం. ఛిన్నమస్తయే జమదగ్ని భార్య రేణుక. ఆమె సృష్టిలోని రేణువులకు అధిష్టాన దేవత. అంటే అణు శక్తి (ఏటామిక్ ఎనర్జీ) అన్నమాట.ఈ ఉపాసన ఎంతో శక్తివంతము, రహస్యము.హిమాలయాలనించి కేరళాలోని తంత్ర వేత్తలదాకా ఉన్నత స్థాయి సాధకులు ఈమెను ఉపాసిస్తారు. నేపాల్, టిబెట్లలో ఈమెనే 'వజ్రయోగిని ' అన్నారు. మోక్షానికి, అపారమైన యోగ శక్తికి బుద్ధిజంలో ఈమె చిహ్నంగా భావిస్తారు.

మరి ఇంత గొప్ప శక్తిని తరతరాలు ఎవరు ఉపాసిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.అది ఎవరో కాదు మన ఆంధ్రదేశంలోనే హరిజనులు ! రేణుకా ఎల్లమ్మ గా, ఎల్లమ్మ గా ఆ అమ్మ కులమతాలకతీతంగా ఆంధ్రదేశంలో కొన్ని వేల ఊళ్ళల్లో అర్చించబడుతోంది.ఒకప్పుడు కొన్నికుటుంబాలలో ఒక అమ్మాయిని ఎల్లమ్మ రూపంగా ఉంచి పూజించేవారు. ఆమెను 'మాతంగి ' అని పిలిచేవారు. పల్లెల్లో ఎల్లమ్మ కధ ఈనాటికి రేణుకా కధే. ఇది ఎలా సాధ్యం? కొన్ని వేల సంవత్సారాల క్రితమే అంత శక్తి సాధన అయిన రేణుకా సాధనని ఎవరు సంఘంలో మూలనున్న వారికి కూడా అందించి తద్వారా మానవులంతా సమానమే సాధన విషయంలో అని మౌనంగా మనకి తెలియ చెప్పారు? ఆ మహనీయుల ఆలోచనా దృక్పధానికి నమస్సులు.

ఎల్లమ్మ గ్రామ దేవత. గ్రామ దేవతలు అంటే చిన్న చూపు చూడరాదు.ఒక సారి ఒక పీఠాధి పతులు పర్యటిస్తూ ఒక ఊరిలో బస చేసారు. వారిని గ్రామ పెద్దలు ఆ గ్రామ దేవత రేణుకా ఎల్లమ్మ ఆలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన "ఆ.. ఆవిడ గ్రామ దేవత నేను వచ్చేదేమిటి " అని తిరస్కరించారు. తెల్లవారి చూస్తే ఆయన కనపడలేదు. ఎక్కడున్నారని వెతికితే ఆయన ఆ గ్రామదేవత ఆలయంలో జపం చేసుకుంటూ కనబడ్డారుట. మరి రాత్రికి రాత్రి ఆ అమ్మవారు ఏంచేసిందో ఆయన అభిప్రాయాలెందుకు మార్చుకున్నారో వాళ్ళిద్దరికే తెలియాలి.

తూర్పుగోదావరి జిల్లాలో కీ||శే|| ద్విభాష్యం పుల్లకవి గారు (దుర్గాడ వాస్తవ్యులు) తునిలోని తలుపులమ్మ వారిని ఏదో అన్నారుట. క్షణంలో ఆయనకొక ఆకస్మిక అనారోగ్యం కలగడంతో అది ఆమె లీలేనని గ్రహించి అమ్మవారిపై పద్యాలు రాసారు. తలుపులమ్మ అసలు తలపులమ్మట! ఆవిడకి తెలియని తలపులేముంటాయి ?!

తునిలో తలుపులమ్మ గుడిని సాయంత్రం మూసేస్తారు. తలుపు మూసాక ఇంక మళ్ళీ మర్నాటివరకు తెరవరు. ఒకసారి ఒక దంపతులు తమ బిడ్డను గుడిలో మర్చి పోయారుట.రాత్రంతా ఆ ద్వారందగ్గర ఉండి విచారిస్తూన్నారుట.పొద్దున్న చూస్తే బిడ్డ క్షేమంగా ఆడుకుంటూ ఉందిట. "ఏమిటమ్మా నువ్వు రాత్రి ఏడవలేదా, భయపడలేదా? " అంటే ఆ పాప చెప్పిందిట, "ఎందుకమ్మా భయం, రాత్రంతా నువ్వు నాతోనే ఉన్నావు. అన్నం కూడా పెట్టావు" అందిట. అంత ప్రేమగల తల్లి ఆ అమ్మవారు.

కాటన్ దొరకు కలలో కనపడి పక్కకు తీయించిన తన విగ్రహాన్ని, గుడిని యధాస్థానంలో పెట్టించిందిట ముత్యాలమ్మ. అనకాపల్లి నూకాలమ్మ శక్తి అపారం. కాట్రేని కోన మావిళ్ళమ్మ లీలలు కధలుగా చెపుతారు. పెద్దాపురం మరిడమ్మ కు జాతరలు ఉత్సవాలు చేస్తారు. సీలేరు దగ్గర ధారకొండలో ధారాలమ్మ గుడిదగ్గరకి తరచు ఒక పెద్దపులి వస్తుండేదిట. అది ఆమె వాహనంగా భావించే వారు. పైడితల్లమ్మను విజయనగరం ప్రాంతంలో పూజిస్తారు. సికిందరాబాద్ లో ఉజ్జయిని మహాకాళి గుడిలో 'రంగం ' చెపుతారు - ఆ సాలు భవిష్యత్ దర్శనం వివరిస్తారు. ఇలా ఆంధ్ర దేశంలోనే కాక ఇతర రాష్త్రాలలో కూడా ఇలా ఉపాసిస్తారనడానికి బస్తర్లోని దంతేశ్వరి అమ్మవారు నిదర్శనం. ఇలా ఎందరో దేవతలు వారి చిత్రమైన శక్తులు ఉన్నాయి.

నీరు స్వచ్చంగా ఉండడం ముఖ్యం, అది ఎక్కడిదైనా కావచ్చు.దేవతా శక్తి కూడా అలాంటిదే.అందరికి నీళ్ళు అందించే ప్రయత్నం ప్రకృతి చేస్తూనే ఉంది. అలారాని చోట్లకి డాం లు లాంటివి నిర్మించి నీరు అందించినట్లే మహాత్ములు అనేక సంస్థల ద్వారా మానవత్వాన్ని, దైవత్వాన్ని అందిస్తున్నారు. కొందరు భగీరధుల వంటి యోగులు ఆ దివ్య గంగనే భువికి తెస్తున్నారు, అయినా వినయంగా జీవిస్తున్నారు.
-----------------------------------------------------
రచన - ప్రఖ్యా మధుబాబు, 
సుజనరంజని సౌజన్యంతో

No comments: