Sunday, May 5, 2019

ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం !


ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం !




సాహితీమిత్రులారా!

వేయేండ్లుగా వెలసి విలసిల్లుతున్న ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం సులభమేమీ కాదు. వేలకొద్దీ వెలసిన కావ్యాలలో అప్రతీతపదప్రయోగం వల్ల, సుదీర్ఘసమాసకల్పనల మూలాన, భావప్రౌఢి కారణవశాన అర్థనిర్ణయం దుష్కరమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఇప్పు డా అలవాటు లేదు కాని, ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో

        క.   కమలాకర కమలాకర

              కమలాకర కమల కమల కమలాకరమై

              కమలాకర కమలాకర

              కమలాకరమైన కొలను గని రా సుదతుల్.

వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేది.  `తెనాలి రామకృష్ణ' చిత్రంలో కృష్ణదేవరాయల ఆస్థానానికి కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు వచ్చి, `రాజానందనరాజరాజాత్మజులు సాటి, తలఁప నన్నయ వేమ ధరణిపతికి' అన్న పద్యానికి అర్థాన్నడగటమూ, రామకృష్ణకవి చేతిలో భంగపడటమూ రమ్యంగా చిత్రీకరింపబడిన దృశ్యం అటువంటిదే.  పూర్వకవులు ఏకాక్షరాధారితంగానూ, ఏకసమాసనిష్ఠంగానూ చెప్పిన కఠినపద్యాలకు తరగతి గదిలో వల్లెవేసిన నిఘంటువులను బట్టి భావాన్ని గుర్తుపట్టడం ఒకప్పటి పాఠశాలలలో గురువులు విద్యార్థులకు నేర్పించేవారు.

       `దదదదదదదదదదదదదద దదదదదద దదద దదదదదదదదద

       దదద దదదద దదద దదద దదద దదదద దదదద దదదద దదదద.'

        అని 12-వ శతాబ్దంలో భగవద్రామానుజుల వారి శిష్యుడు శ్రీవత్సాంకుల వారు (కూరత్తాళ్వార్) రచించిన యమక రత్నాకరంలోని శ్రీకృష్ణస్తుతిపరకమైన ఒక ఏకాక్షరశ్లోకం. శ్లోకమంతా `ద' అన్న ఒక్క అక్షరంతోనే సాగింది. తెలుగులోనూ ఇటువంటివనేకం ఉన్నాయి. వ్యాకరణపాండిత్యం, వ్యాఖ్యానసాహాయ్యం లేకపోతే అర్థం చేసుకోవటం సులభం కాదు. ఇదొక తీరు ప్రౌఢి.

        ఇక, సమాసం అనగానే, ఇది తెలుగా? సంస్కృతమా? అనిపించే

        శా.   సాధీయోముఖపూరితోద్వమితతాసత్యోర్ధ్వగోదన్వద

                ర్ణోధారాంతరటత్తిమింగిలగిలప్రోద్ధాననిద్ధ్యానల

                బ్ధాధీశప్రభుతాస్వభాగహరణార్థాయాయిహృజ్జాంకధీ

              ప్రాధాన్యాతివిలోలవాగ్దృగబటబ్రహ్మన్! స్తుమ స్త్వా మనున్.

వంటివి, ఆరభటీ వృత్తిలో ఓజోగుణం నిండిన సంస్కృతసమాసభూయిష్ఠపద్యాలే కానక్కరలేదు.  అచ్చతెలుగు సమాసాలూ సాధ్యమే.

        మ. నెలఱాతీవియ సంతసంపు మగఱానీరాళపుం గొప్పటా

              కుల నిద్దంపుఁ బసిండి నున్జవికెనిగ్గుల్ దొట్టు కట్టాణి పూ

              సల మేల్కొల్పు మెకంబు చెక్కడపు కీల్ జాగా జాగా గద్దియన్

              జెలువెచ్చం గొలువుండె నెల్లరును జేజే యంచుఁ దన్గొల్వఁగన్.

అని గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం (1-126). మొదటి మూడు పాదాలూ ఒక్క సమాసం.

        ఇవికాక, ద్వ్యర్థికావ్యాలను, త్ర్యర్థికావ్యాలను  చదివేటప్పుడు ఒక అర్థం సుగమం గానూ, ఒక అర్థం దుర్గమం గానూ ఉండటం కూడా పాఠకులకు అనుభవంలో ఉన్నదే. పింగళి సూరన్నగారి రాఘవపాండవీయం (3-54)లో

        శా.  అక్షుద్రప్రథమానదివ్యశరసంప్రాప్తిం బ్రకాశించు నా

              కుక్షిద్వంశవతంసుఁ గన్గొని, ‘మహాగోదావరీతీరస

              ద్రక్షోపాయపథంబు నేఁడు దొరికెన్, రం!’ డంచు సంరక్షణా

              పేక్షం ద ద్వనభూమిదేవతలు సంప్రీతిం గడున్మూఁకలై.

అన్న పద్యాన్ని చూడవచ్చును. సుతీక్ష్ణముని ఆశ్రమంలో సీతారామలక్ష్మణుల రాకవల్ల రాక్షసుల బారినుండి గోదావరీతీరవాసులకు మహాగోదావరీతీర సద్+రక్షా+ఉపాయపథంబు దొరికినదని తద్ + వన (ఆ ఆశ్రమోద్యానవనం లోని) భూమిదేవతలు (బ్రాహ్మణులు) సంతోషించారన్న రామాయణార్థం సులభంగానే ఉన్నది కాని; దివ్యశరాన్ని (పాశుపతాస్త్రాన్ని) సాధించిన అర్జునుని చూచి మహాగోదావరీతీరసద్రక్షోపాయపథంబు అన్న దళానికి మహత్ + అగః + దావ + రీతీ + రసత్ + రక్షః + అపాయపథంబు అన్న పదచ్ఛేదమూ, ఆ పదచ్ఛేదానికి మహా (గొప్ప) అగః (అపరాధాలతో) + దావ (దావాగ్ని) + రీతీ (వలె) + రసత్ (ఘోషిస్తున్న) + రక్షః (రాక్షసుల) + అపాయపథంబు (వధోపాయ మార్గం) ఈనాడు దొరికినదని తద్ + వనభూమిన్ (ఆ వనభూమికి విచ్చేసిన) దేవతలు (ఇంద్రాదిదేవతలు) సంతసించారన్న మహాభారతార్థమూ ఎంతటి పండితులకైనా స్ఫురించటం కష్టమే.  వ్యాఖ్యానసాపేక్ష మైనందువల్ల ఇదీ కొంత దుర్ఘటార్థమే.  సభంగశ్లేష మూలాన ఏర్పడిన అన్వయప్రౌఢి. భాషాశ్లేషపద్యాలైతే ఉభయభాషాకోవిదులకు కానీ అర్థం కావు.

        భావార్థప్రౌఢి వేఱొక విధంగా ఉంటుంది.

        గీ.   రంగనాథుండు రంగత్తురంగ మెక్కఁ

              గులిశమును దాల్చె  గోత్రారి కుతుక మొప్ప;

              ఖేదమోదంబు లందె నగేంద్రకన్య,

              మౌళిఁ గృష్ణాజినంబున మాఁటె శివుఁడు. 

అని - అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారి సంస్కృతశ్లోకానికి నా అనువాదం. శత్రుసంహారానికై రంగనాథుడనే రాజు ఉద్యుక్తుడై గుఱ్ఱం ఎక్కుతున్నాడు. ఆ ఎక్కేటప్పుడు నేలపై గుఱ్ఱం కాలిగిట్టల తాకిడి వల్ల ధూళి చెలరేగింది. ఆ ధూళి దుమారమై ఏకంగా సప్తసముద్రాలనూ ముంచెత్తివేసేంత ఉద్భటంగా రేగిందట. సముద్రాలు ఇంకిపోతే - పూర్వం ఇంద్రుడు పర్వతాల ఱెక్కలను నఱికివేసినపుడు హిమవంతుని కొడుకు మైనాకుడు తప్పించుకొని పాఱిపోయి సముద్రంలో దాక్కొన్నాడు కదా, అతనిప్పుడు దొరుకుతాడని గోత్రారి (గోత్రములకు = పర్వతాలకు, అరి = శత్రువైన ఇంద్రుడు) వజ్రాయుధాన్ని చేతబూనాడట. ఆ మైనాకుడు హిమవత్పుత్త్రిక అయిన పార్వతీదేవికి (నగేంద్రకన్యకు) తమ్ముడు కదా, ఇంద్రుని బాఱినుండి తప్పించుకోలేడని ఆమెకు ఖేదం కలిగింది. అయితే ఒకందుకు మోదమూ కలుగకపోలేదు. సప్తసముద్రాలే ఇంకిపోగా లేనిది తన సవతి గంగాదేవి మాత్రం ఉండగలదా? అని మోదం. గంగకు కష్టం కలిగితే పార్వతికి సంతోషమే కానీ, పాపం జగత్తులకు ఈశ్వరుడు, గంగకు భర్త అయిన శివునికి ఎంతైనా భార్య కదా, ఆ దుమ్ము గంగాజలాలకు సోకకుండా జింక చర్మం తీసుకొని శిరోవేష్టనంగా తలకు చుట్టుకొన్నాడట. అశ్వారోహణమే ఇంత ఉద్భటంగా ఉంటే, ఆ రాజెంతటి వాడో! ఆయన పరాక్రమం ఎంతటిదో!! అని ఊహించుకోవాలి.

        `ధూళి రేగటం' అన్న కీలకం బోధపడకపోతే, పద్యార్థం బోధపడదు. ప్రహేళికాప్రాయమైన రచన ఇది. ఇటువంటి చిత్రకవితారీతులింకా అనేకం ఉన్నాయి.

        ఇవన్నీ ప్రౌఢమైన పద్యాలే కాని, తెలుగు సాహిత్యమంతటిలోకీ అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? అన్న ప్రశ్నకు సమాధానం నా అత్యంత పరిమితమైన అనుభవంలో నాకు ఇటీవలే భాసించింది. ఏ వ్యాఖ్యానమూ లేనందువల్ల - పద్యాన్ని ముందుంచుకొని దీని అర్థం ఏమిటని తదేకంగా ఆలోచింపగా, ఆలోచింపగా అన్వయం బోధపడటానికి ఒక గంట సేపటికి గాని అసలు స్ఫురించనే లేదు.

        అది నివేదించడానికే ఈ వ్యాసం.



        కావ్యనాయిక మనోజ్ఞసౌందర్యవర్ణనానుగతమైన ఈ పద్యాన్ని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్యమణిమంజరిలో `రామకృష్ణుని ఇతర చాటువులు' అని పేర్కొన్న పద్యావళి నుంచి గ్రహించి శ్రీ చాగంటి శేషయ్యగారు ఆంధ్రకవితరంగిణి 8-వ సంపుటంలోని తెనాలి రామకృష్ణకవి చరిత్రలో ఉదాహరించారు:

         చ.   అల ఘనచంద్రబింబసమమై తనరారెడు వక్త్ర మందులోఁ

              గలిగిన నామభేదములకైవడి నొప్పెడిఁ గప్పు కొప్పు చె

              క్కులు రదనాంశుకంబు లవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ జే

              తులు సరులయ్యె దానివలె నున్నది పొంకపుటారు బోఁటికిన్.”

       ఈ పాఠంలో అర్థప్రతీతి లోపించింది. నామవిభక్తులు, విశేష్యవిశేషణాలు తారుమారయ్యాయి.  పైగా, నాలుగవ పాదంలో యతిభంగమైంది.

        వేటూరి వారికి మునుపే 1893లో శ్రీ గురజాడ శ్రీరామమూర్తిగారు `తెనాలి రామకృష్ణుని చాటువులని వాడుక గల పద్యములు' అని తమ బృహత్పరిశోధనాగ్రంథం కవిజీవితములులో వేఱొక పాఠాన్ని చూపారు:

        చ.   అల ఘనచంద్రబింబనిభమై తగు కాంత మొగంబు, దానిలోఁ

              గలిగిన యర్థభేదములఁ గైకొని చెప్పఁగ నొప్పు కొప్పు, చె

              క్కులు రదనాంశుకంబు నవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ జే

              తులు సరియయ్యె, దానిగతిఁ దోఁచెను బొంకపుటారు దానికిన్.

అని. ఇందులో నాలుగవ పాదంలోని యతిభంగదోషం తొలగిపోయింది. కొంత భావస్ఫోరకంగానూ ఉన్నది కాని, స్పష్టార్థప్రతీతి లేదు.

       ఈ రెండు పద్యాలనూ అర్థావగతిని బట్టి సమన్వయించి, కవ్యుద్దిష్టానికి అనుగుణంగా నేను రూపొందించిన పాఠం ఇది:             

        చ.   అల ఘనచంద్రబింబనిభ       మై తనరారెడు వక్త్ర; మందులోఁ

              గలిగిన యర్థభేదములఁ        గైకొని చెప్పఁగ నొప్పు కొప్పుఁ, జె

              క్కులు రదనాంశుకంబు – నవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ, జే

              తులు సరియయ్యె, దాని గతిఁ దోఁచెను బొంకపుటారు బోఁటికిన్.

అని. లాక్షణికులు దీనిని సతృణాభ్యవహారత్వం అంటారు. చిత్రకవితాప్రీతి ప్రధానమైన ఇటువంటి పద్యాల అర్థప్రవచనం కొంత కష్టమే. శబ్దార్థాలు రెండింటి సంయోజనమూ క్లేశాస్పదం కావటం మూలాన అన్వయం కుదుర్చుకోవటమే దుష్కరం. ఆ పైని  కవి హృదయావిష్కరణం. తెలుగులో ఇటువంటి గూఢరచన మరొకటి లేదు.

        పద్యభావం ఇది:

v మొదటి దళం: ఉపక్రమణిక v

        ౧. బోఁటికిన్, అల, ఘనచంద్రబింబనిభమై తనరారెడు వక్త్రము.

బోఁటికిన్=కాంతకు, అల=ప్రసిద్ధమైన, ఘనచంద్రబింబనిభమై ` ఘన=నిండైన (`ఘనం మధ్యమనృత్యే స్యా త్కాంస్యతాలాదివాద్యకే, పుంసి ముస్తా మేఘ దార్ఢ్య విస్తార ముద్గరేషు చ' – మధురేశుని శబ్దరత్నావళి. `కిం స్విదాపూర్యతే వ్యోమ జలాధారాఘనైర్ఘనైః' – సంస్కృత మహాభారతం, ఆది. ౧౩౬:౨౮), చంద్రబింబ=చంద్రమండలముతో (`బింబో'స్త్రీ మణ్డల త్రిషు' – అమరకోశం), నిభమై=సమానమై (`నియతం భాతీతి నిభః. నిభాదయ ఉత్తరపదస్థా ఏవ సదృశవచనా వాచ్యలిఙ్గాః స్యుః;' – రామాశ్రమి). పూర్ణచంద్రబింబశోభ వంటి శోభతో నిత్యం ప్రకాశించేది కాబట్టి ఘనచంద్రబింబనిభము + ఐ అని.

        తనరారెడు=ఒప్పారెడు, వక్త్రము=ముఖము. దీనిచే భాషించటం జరుగుతుంది కాబట్టి ముఖానికి `వక్త్రము' అనిపేరు. (`ఉచ్యత'నేన. వచ పరిభాషణే, బృవో వచిః. గుధృవీపచివచి (ఉణాది. ౪-౧౬౭) ఇతి త'రః' – రామాశ్రమి) ఇక్కడ అర్థభేదాలు ప్రసంగింపబడుతున్నాయి కనుక సాకూతమైన ప్రయోగం ఇది. వక్త్రానికి వర్తులత్వ-ఆహ్లాదకత్వ-నిర్మలత్వాల వల్ల చంద్రబింబం తోడి పోలిక సుప్రసిద్ధం. `రాజరాజాకృతి రంజిల్లె వదనంబు ... అఖిలసుమనస్సమారాధ్య యయ్యె దివ్య, సౌకుమార్యాంగసౌరభ్యసంపదయును, గాన నా చాన సుందరాకారగరిమఁ, దరమె పొగడఁగ నహిలోకధవుని కైన" -  అని 18-వ శతాబ్ది నాటి గుడారు వేంకటదాసకవి ప్రబంధరాజశిరోభూషణ బలరామచరిత్రము వ్రాతప్రతి. చంద్రబింబోపమానం నాయిక పద్మినీజాతి లక్షణలక్షితకు సూచకమని ఆనాటి కవిసంప్రదాయం. `రాజీవగంధి సద్రాకేందుబింబాస్య, నీలోత్పలశ్యామ నిర్మలాంగి' – అని కూచిరాజు ఎఱ్ఱయ కొక్కోకం. గురజాడ శ్రీరామమూర్తి గారి పాఠంలో `ఘనచంద్రబింబనిభమై తగు కాంత మొగంబు' అన్నప్పుడు ఈ సాభిప్రాయపదప్రయుక్తికి అవకాశం లేకపోయింది. `వక్త్రము' అన్న నిర్దేశం వల్ల పద్యప్రతిపాదితార్థానికి విశదిమ కలిగింది. పరివృత్త్యసహిష్ణుతకు ఉదాహరణీయమైన ప్రయోగం ఇది.

v రెండవ దళం: అర్థభేదాలతో ఉపమానఘటనం v

        ౨. అందులోఁ, గలిగిన యర్థభేదములఁ గైకొని చెప్పఁగ నొప్పు కొప్పుఁ - జెక్కులు – రదనాంశుకంబు.

        అందులోన్ = ఇందాక `పూర్ణచంద్రబింబము' అని అర్థం చెప్పుకొన్న ఆ `ఘనచంద్రబింబ' అన్న సమాసాన్ని ఉపమానత్రయీగర్భమైన సమాసంగా తీసుకొని - ఆ సమాసంలోని 1) ఘన 2) చంద్ర 3) బింబ శబ్దాలకు, కలిగిన = ఏర్పడిన, అర్థభేదములన్ = అర్థభేదాలను, కైకొని = పురస్కరించుకొని, ఆ అర్థాలు మూడింటికీ కొప్పు – చెక్కులు – రదనాంశుకంబులతో, చెప్పఁగన్ = పోలికను చెప్పడం, ఒప్పున్ = సమంజసం – అని భావం.

        సంస్కృతాంధ్రసాహిత్యాలలో ఇటువంటి ప్రయోగం వేఱొకటి లేదు. ఎలాగంటే –

1.    ఘనము = అంటే ఇందాక `నిండైన' అని అర్థం అనుకొన్నాము. ఇప్పుడు `మేఘము' (`ఘనో'మ్బుదః' – అని ధరణికోశం) అని ఉన్న అర్థభేదాన్ని చెప్పుకోవాలి.  ఆ మేఘంతో కొప్పు – వేణీభరానికి నైల్యాధిక్యం వలని పోలిక.

    చూ –

    `గీ.     చంద్రభీతఘనధ్వాంతసంచయమున

              కభయ మొసఁగి వేణీభరం బను నెపమునఁ,

              దాన వెనుక వేసికొన్నది తరుణి మొగము;

              చంద్రుఁ గైకొనమి కిదియ సాక్షి గాదె.'

                            –  పింగళి సూరన ప్రభావతీప్రద్యుమ్నం (2-67)

2.   చంద్రము = అంటే ఇందాక `చంద్రుడు' అని చెప్పుకొన్నాము. ఆ `చంద్ర' శబ్దానికి ఇప్పుడు `బంగారము', `కర్పూరము' (`చంద్రః కర్పూర కామ్పిల్ల సుధాంశు స్వర్ణ వారిషు" – మేదినీ కోశం) అని రెండర్థాలు. ఆ సువర్ణ  కర్పూరాలతో చెక్కులు = చెక్కిళ్ళకు బంగారపు మేల్మి నిగారింపు వలన, కర్పూరపు సౌరభ స్నిగ్ధత్వాల వలన పోలిక.

    చూ –

    `సీ.     కలికి చెక్కులు చంద్రఖండంబులై పొల్చు'

-      రామరాజభూషణుని వసుచరిత్ర (2-33)

3.  బింబము = అంటే ఇందాక `చంద్రుని బింబము' అని అర్థం చెప్పుకొన్నాము. ఇప్పుడు ఆ `బింబ' శబ్దానికి `దొండపండు' (`బింబం తు ప్రతిబింబే స్యా న్మణ్డలే బిమ్బికాఫలే' – అని హైమకోశం) అని అర్థం. ఆ దొండపండుతో రదనాంశుకంబు = పెదవికి - ఎఱ్ఱదనం వల్ల పోలిక.

దంతచ్ఛదమంటే దంతపంక్తికి కప్పు - పెదవి అన్నమాట. `హరాజటాజూట చంద్రరేఖామృతంబు, నబల! నీ దగు దంతచ్ఛదామృతంబు సమముగా...' అని శ్రీనాథుని శృంగారనైషధం (5-27). దంత – రదనాలు, ఛద – అంశుకాల పర్యాయవాచిత్వం వలన రదాంశుకము అన్న పదసృష్టి జరిగింది. పెదవికి రూపసామ్య వర్ణసామ్యాల వల్ల దొండపండుతో ఔపమ్యఘటనం సుప్రసిద్ధమే.

    చూ –

    “సీ.    కమల లక్షణలక్ష్మి గణియించు మొగ మోష్ఠ

                        మరుణబింబపు రక్తి నవఘళించు.”

-   తిరుమల బుక్కపట్టణం వేంకటాచార్యుల అచలాత్మజాపరిణయం (2-40)



v మూడవ దళం: ఆ అర్థభేదాలకు మళ్ళీ పర్యాయపదాలతో ఔపమ్యం v

          ౩.  అవి గుబ్బలకున్ సరిరాకపోయె; చేతులు సరియయ్యె; దాని గతిఁ దోఁచెను పొంకపుటారు.

అవి = ఆ `ఘనచంద్రబింబ' ప్రయుక్తిలోని అర్థభేదాలను (అంటే, ఆ పదాల పర్యాయవాచిత్వం వలన ఏర్పడిన సరికొత్త అర్థభేదాలను) పురస్కరించుకొని, ఆ ఘన-చంద్ర-బింబ పదాల పర్యాయవాచకాలకు – 1) గుబ్బలకున్ సరిరాకపోయె 2) చేతులు సరియయ్యె 3) దాని గతిఁ దోఁచెను పొంకపుటారు అని మూడు అలంకృతవాక్యాలతో క్రమాన్వయం.

        ఇది తెలుగులో ఇంతవరకు ఏ కవీ ప్రయోగించని వినూత్నమైన శబ్దచిత్రం.

1.    ఘనము = “గుబ్బలకున్ సరిరాకపోయె.” మొదట `ఘనము' అంటే చంద్రబింబానికి ధర్మవాచకంగా `నిండైన' అనీ; ఆ తర్వాత ఘనమంటే `మేఘము' అనే అర్థంలో `కొప్పు'తో = వేణీభరంతో పోలికను చెప్పుకొన్నాము.

ఇప్పుడు ఘనము = మేఘము అనే అర్థాన్ని కలిగిన ఆ `ఘన' శబ్దానికి వేఱొక పర్యాయమైన `జీమూతము'ను గ్రహించాలి. (`ఘనో మేఘే' – మంఖకోశం; `జీమూతో వారిదో నభ్రాట్ పర్జన్యో'మ్బుద' అని హర్షకీర్తి శారదీయ నామమాల).

`ఘన' శబ్దానికి పర్యాయపదమైన “మేఘ' శబ్దానికి పర్యాయమైన ఆ `జీమూత' శబ్దానికి గల మఱొక అర్థం `పర్వతం' (`జీమూతో మేఘ పర్వతౌ' – ఇరుగప దండేశుని నానార్థ రత్నమాల).

ఆ పర్వతం `గుబ్బలకున్ (=స్తనములకు) సరి రాకపోయె' అని అన్వయం. ఉపమేయాని కంటె ఉపమానానికి అపకర్ష చెప్పబడుతున్నది.

    చూ –

            `గట్టిగ నుండు కొండలును ... ఇం,

            కెట్టుగ ఈడనం బొసఁగు? నింతి మిటారపు గుబ్బదోయికిన్.'

-   కూచిమంచి తిమ్మకవి నీలాసుందరీ పరిణయము (2-23)

2.  చంద్ర = “చేతులు సరియయ్యె”. మొదట ముఖానికి ఉపమానంగా `చంద్ర' శబ్దానికి అర్థం `చంద్రుడు' అని చెప్పుకొన్నాము. ఆ తర్వాత `సువర్ణము', `కర్పూరము' అనే అర్థాలలో `చంద్ర' శబ్దానికి చెక్కిళ్ళతో పోలిక చెప్పుకొన్నాము.

ఇప్పుడు `చంద్రుడు' అనే ఆ వెనుకటి అర్థంలో (`చన్ద్రో నిశాకరః శౌరిః కలశాబ్ధిభవో భవః భవావతంసః కమలీ వార్ధిసూనం నపుంసకమ్' – అని భోజుని నామమాల) ఉన్న ఆ `చంద్ర' శబ్దానికి పర్యాయమైన `అబ్జ' శబ్దాన్ని గ్రహించాలి (`అబ్జో జైవాతృకః సోమ' – అమరకోశం).

`చంద్ర' శబ్దానికి పర్యాయపదమైన ఆ `అబ్జ' శబ్దానికి గల మఱొక అర్థం `పద్మము' (`లవణామ్బుజయో రబ్జం క్లీబే శంఖే తు పుంసి వా, పుంస్యేవ నిచులే శీతరశ్మౌ ధన్వన్తరావపి' – నానార్థరత్నమాల).

    ఆ `పద్మము'నకు `చేతులు సరియయ్యె' అని ఔపమ్యఘటనం.

    చూ –

            `చేతుల కబ్జములే తుల'

-      చేమకూర వేంకటకవి విజయవిలాసం (1-196)

3.   బింబ = “దాని గతిఁ దోఁచెను పొంకపుటారు.”

మొదట ముఖవర్ణనలో `బింబము'నకు `చంద్రుని యొక్క మండలము' అనీ; ఆ పిమ్మట అధరానికి విశేషణంగా `బింబికా ఫలము' అనీ అర్థద్వయాన్ని చెప్పుకొన్నాము. ఇప్పుడు `బేతి – శోభతే' అన్న వ్యుత్పత్త్యర్థంలో `చంద్రుని యొక్క సుధాసారము' అని ప్రతిపాదింపబడుతున్నది.

`బింబ' శబ్దానికి గల మఱొక ప్రయుక్తివిశేషం `మండల'. చంద్రబింబము – చంద్రమండలము సమానార్థంలో ప్రయుజ్యాలు. `బింబము' అంటే చంద్రునిలోని అమృతపు నిగ్గు. `మండలము'  అంటే కళలు నిండి ఉన్నప్పటి ప్రసన్నమైన తేజోమయరూపం. “బిమ్బే తస్య సుధాసారః, కలాపూర్ణం చ మణ్డలం” - అని భోజుని నామమాలిక. `సుధారసమయారం తు తుషారనిచయాకృతిమ్, హారపఞ్జలసారస్య బహిఃస్థం చారు రాజతే'  అని పౌష్కరసంహిత (14-1) లో  చంద్రబింబలక్షణం.

అర్థసామ్యం వల్ల `బింబ' – `మండల' శబ్దాలు పర్యాయఘటితాలు కాగా, `మండల' శబ్దానికి గల మఱొక అర్థం `పాము'. `మణ్డలం ద్వాదశరాజకే చ దేశే చ బిమ్బే చ కదమ్బకే చ కుష్ఠప్రభేదే 'ప్యుపసూర్యకే'పి భుజఙ్గభేదే శుని మణ్డలః స్యాత్' – అని మహేశ్వరసూరి విశ్వప్రకాశం).

    ఇప్పుడు ఆ మండలార్థమైన `పాము'కు నూగారుతో పోలిక.

    చూ –

    `క.    అండజగామిని యూరుపుఁ

            బిండు వలపు లాన నాభిబిలము వెల్వడి చ

            న్గొండల నడుమను బ్రాఁకెడు

            కుండలియో యనఁగ నారు కొమ రొప్పారున్.'

-      శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద (5-25)

     దాని గతిన్ = ఆ మండలము వలె, పొంకపు+ఆరు = నిండు నూగారు, తోఁచెన్ = పొడచూపెను అని ఉపమ.

       పద్యంలో ప్రతిపాదింపబడుతున్న అర్థాలు మూడు విధాలు:

1.    ముఖము `ఘనచంద్రబింబనిభ'మై నిండు చంద్రుని వలె కళాపూర్ణమై శోభాయమానంగా ఉన్నది.

2.  `ఘనచంద్రబింబ'అన్న దళంలోని అర్థభేదాలను పురస్కరించుకొని వేణీభరం (“ఘన = మేఘము”) నల్లదనం వల్ల మేఘమును; చెక్కిళ్ళు (“చంద్ర = సువర్ణము, కర్పూరము”) నిగారింపు వలన సువర్ణాన్ని, సౌరభ స్నిగ్ధత్వాల వల్ల కర్పూరాన్ని; పెదవి (“బింబ = దొండపండు”) దొండపండును పోలి ఉన్నాయి.

3.  ఆ అర్థభేదాలే పర్యాయపదాల అర్థాలతో పునరుపక్రాంతా లైనప్పుడు (“ఘన = జీమూతము > పర్వతము”) పర్వతము ఆమె వక్షోజమునకు సాటి రాలేకపోయింది. కరములు (“చంద్ర = అబ్జ > పద్మము”) పద్మములను పోలి ఉన్నాయి. నూగారు (“బింబ = మండల > పాము”) పామువలె భాసిస్తున్నది. 

        `దాని గతిఁ దోఁచెను పొంకపుటారు బోఁటికిన్' అన్నప్పుడు పద్యంలో బోఁటికిన్ = కాంతకు (నాయికకు) అనీ; బోఁటికిన్ = సాదృశ్యమునకు అనీ రెండర్థాలు. సాదృశ్యార్థంలో రెండవసారి చెప్పిన అర్థత్రయానికీ – అంటే, `గుబ్బలు సరిరాకపోయె', `చేతులు సరియయ్యె', `తోఁచెను పొంకపుటారు' అన్న మూడు దళాలకూ ఇది వర్తిస్తుంది.  ఉపమాంతర్భావిగా ఇన్ని ఆహ్లాదనీయ చమత్కృతవాక్యాలను సాలంకృతంగా అనుప్రాణింపగలగటం కవి కావ్యకళాశిల్పప్రౌఢికి నిరుపమానమైన నిదర్శనం.

        ఇది గురజాడ శ్రీరామమూర్తిగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు భావించినట్లు చాటుపద్యం కాదనీ, కవితరంగిణిలో చాగంటి శేషయ్యగారు `ఈ పద్యము మనకు లభ్యము కాని యే కందర్పకేతువిలాసము లోనివో యైయుండునని నా యభిప్రాయము' అని వ్రాసినట్లు నిజంగానే తెనాలి రామకృష్ణకవి రచించిన కందర్పకేతువిలాసం లోనిదేననీ  నేను వేఱొక వ్యాసంలో నిరూపించాను.

        శబ్దార్థచిత్రాల సమ్యఙ్నివేశానికి, అత్యంతప్రౌఢికి ఉత్తమోదాహరణ ఈ పద్యం. తెలుగులో ఇటువంటి రచన మఱొకటి లేదు.
-----------------------------------------------------
రచన- డా. ఏల్చూరి మురళీధరరావు, 
సృజనరంజని సౌజన్యంతో

No comments: