సూడో-సూర్పనఖ :: స్టాండ్-బై లవ్
సాహితీమిత్రులారా!
బ్రోకెన్ న్యూస్: సూ.రాముడు ఇంకా తిరిగిరాలేదు. సూ.సీత రాముడిని కోసం తన పద్ధతిలో వెతకటం ఆపలేదు.
ఆ వెతకటమెత బోరింగో మనకి ఇదివరకే అర్థమయ్యుంది కాబట్టి, టైమ్‍పాస్‍కి అలా ఫ్లాష్‍బాక్‍లోకి వెళ్ళొద్దాం.
అవి సూ.రాముడింకా చదువుకుంటున్న రోజులు.
తెలిసి తెలియని వయసులో పిల్లల్ని, “పెద్దయ్యాక నువ్వేమవుతావు?” అని అడిగే పెద్దాలు, అడగాల్సిన సమయంలో ఆ ప్రశ్న అడక్కుండా వాళ్ళ నిర్ణయాలనే నెత్తిమీద రుద్దేస్తారు. అలా రుద్దించుకున్న సూ.రాముడూ ఏదోలా హెడ్-బాలెన్స్ చేస్తూ చదువుల ప్రహసనాన్ని దాదాపుగా చివరి వరకూ తెచ్చిన రోజుల్లో, ఒక విహార యాత్రలో భాగంగా ఒక అడవి గుండా వీళ్ళున్న బస్సు వెళ్తున్నప్పుడు, బస్‌లో ఒకడికి అర్జెంటుగా ఒకటికి వచ్చింది. కానీ, బయటంతా చిమ్మచీకటి. నిశ్శబ్దం. వాడికి భయమేసింది, దిగి వెళ్ళాలంటే. అప్పుడు సూ.రాముడు, “ఎందుకుబే భయం… నేనున్నాగా!” అని చెప్పి తీసుకెళ్ళి, తీసుకువచ్చాడు. అసలు సంగతేంటంటే సూ.రాముడికీ వస్తుంది, భయమూ వేస్తుంది. తోడు వస్తానంటూ తోడు తీసుకెళ్ళాడు.
చీకట్లో అతడి చర్యలను గమనించిన సూడో-సూర్పనఖ, అతడి ఆంతర్యాన్ని గ్రహించక, తెల్లారేసరికి వేషం, భాష ఏ మాత్రం మార్చకుండా, సూ.రాముడి ఎదుటపడి –
“ఇస్తినయ్య మనసు” అని అంది.
సూ.రాముడు ఉబ్బితబ్బిబైపోయాడు. సప్లీలు రాయనవసరం లేకుండా డిగ్రీ అందుకున్నంత ఆనందం కలిగిందతడికి.
“పుచ్చుకుంటినమ్మా మనసు” అంటూ పుచ్చుకున్న మనసును జేబురుమాలులో మూటగట్టాడు.
సూ.సూర్పనఖ ఎదురుచూస్తూ ఉంది, ఆశగా.
“ఏంటి?”
“నీ మనసు ఇవ్వు”
“ఎందుకు?”
“నా మనసు తీసుకున్నావ్ గా?”
“నువ్వే ఇచ్చావ్ గా!”
“అవును. అందుకే నీ మనసవ్వాలి.”
“ఎందుకివ్వాలి?”
“లేకపోతే, నా మనసు నాకిచ్చేయాలి!”
“ఎందుకిచ్చేయాలి?”
“అదంతే! అయితే ఒప్పుకోవాలి. లేదా తప్పుకోవాలి.”
సూ.రాముడు ఆలోచనలో పడ్డాడు. ఒప్పుకోడానికీ మనసొప్పలేదు. తప్పుకోడానికీ మనసు రాలేదు. ఏం చేయడం? తానా తెలుగు మధ్యతరగతి పెంపరికాలకు నమూనాయే! అంటే, పురాణేతిహాసాలలో ఎంతలేసి మంది హీరోలూ, విలన్లూ, విలనిక్ హీరోస్, హీరోయిక్ విలన్స్ ఉన్నా, తనకు ఆదర్శప్రాయం రాముడే! ఎంచక్కా సూడో-భీముడయ్యుంటే? వన్-టైమ్-ఆఫర్‍లో హిడింబిని, సీసనల్ ఆఫర్‍లో పాంచాలిని, ఫుల్-టైమ్-ఆఫర్‍లో ఏ నాగకన్యనో, మరొకరినో! ఒక పూట కాపురానికి, యుద్ధసమయంలో సాయమొచ్చే ఘటోత్కచుడులాంటి కొడుకంటే… మామూలు ROI కాదుగా! అది కూడా తిండితిప్పలు, ట్యూషన్ ఫీస్, సినిమాలు, సిగరెట్ల ఖర్చులు ఏమీ పెట్టనవసరం లేకుండా. ప్చ్.. తనకా అదృష్టం లేదు. సూ.సూర్పనఖ దగ్గర ఏ మాత్రం మొహమాటపడ్డా, ఆనక యూ-టర్న్ చేయడానికి తాను సూడో-సిద్ధార్థుడయ్యే అవకాశం ఉందిగానీ, “సింగిల్ పేరంట్” అన్న సింపతీ ఆమెకు, వదిలివెళ్ళిపోయినందుకు నానామాటలూ తనకి!
అందుకే “నో!”-కోటి రాసుకోవడం మొదలెట్టాడు.
సూ.సూర్పనఖ మళ్ళీ అడిగి చూసింది. సూ.రాముడు తాను రాసుకుంటున్న నో-కోటి చూపించాడు. ఆంగ్లాక్షరాలు “n”, “o”లను చీమల్లా రాసి, వాటికి అటూ, ఇటూ ఏనుగులంత “k”, “w”లను నిలబెట్టాడు. జాగ్రత్తగా చూసి “no”అని అర్థంచేసుకుంటే గొడవే లేదు, లేదా “know” (అంటే “నువ్వే తెల్సుకో”) అని అర్థమైనా గొడవంతా సూ.సూర్పనఖే పడుతుందిగా అని సూ.రాముడి స్కెచ్.
సూ.సూర్పనఖకి అర్థమవ్వాల్సిందే అర్థమయ్యింది. భూమి ఒక్కసారిగా చీలిపోయి అందులో తాను కలిసిపోతే బాగుణ్ణు అన్నంత వేదన పడింది. (కానీ, ఆమె ఏమీ సీత కాదు కదా?)
పాత్రోచితంగా ఉంటుందని తనలోని రాక్షసిని నిద్రలేపింది. అన్న సూ.రావణుడిని సూ.రాముడిపై ఉసిగొల్పాలనుకుంది. కానీ, సూ.రావణుడు పుట్టడానికే ఒక జన్మ ఆలస్యం చేశాడు. అయినా, అన్న ఉన్నా, అతడిని ఏమని రెచ్చగొడుతుంది? ముక్కు కోసేశారంటే కలిగే ఆవేశం, మనసు గాయపరిచాడంటే కలుగుతుందా? “అతడి భార్య సీత అతిలోక సుందరి. జగదేకవీరుడివైన నీ పక్కన ఉండాలిగానీ…” అని ఎగదోయటానికి సూ.రాముడికి సీత ఎక్కడుంది? అన్నీ ఆలోచించుకొని, సూ.రావణుని మాటే మర్చిపోయింది.
సూ.రాముడితో అంతా మామూలైనట్టు ప్రవర్తించసాగింది.
“అయితే ఒప్పుకోవాలి, లేదా తప్పుకోవాలి అన్న ఫూల్ ఎవడు?” అనుకుంటూ సూ.రాముడు కాలర్ ఎగరేశాడు.
ఆమె అతడితో మాట్లాడుతూ బుట్టలు అల్లుకునేది. తనకోసం అతడితోనూ అల్లించేది. నచ్చిన మగవాణ్ణి అందులో వేసుకోడానికి ప్రయత్నించేది. నచ్చినవాడు అందులో పట్టకపోతే, “అంతా నీవల్లే! నువ్వు ఒప్పుకోకపోవడంవల్లే.” అని దెప్పేది. నచ్చినవాడు బుట్టలో పడున్నంత కాలం సూ.రాముడి ఉనికే మర్చిపోయేది. అతడికి ఎవరన్నా నచ్చుతున్నట్టు అనిపిస్తే, సవతిని తెస్తున్నట్టు పోరుపెట్టేది.
అలా సూ.రాముడు ఆక్టివ్ – స్టాండ్‍బై మోడ్స్ మధ్య డిస్కో లైట్లలాగా డాన్స్ ఆడేవాడు, ఆమెకు పెళ్ళైయ్యే వరకూ.
బ్రేకింగ్ న్యూస్: సూ.రాముడు తిరిగి వచ్చాశాడని మాకిప్పుడే వార్త అందింది. అక్కడ ఉన్న ప్రతినిధి మనకి మరిన్ని వివరాలు అందిస్తారు. హలో ప్రతినిధి.. చెప్పండి… సూ.రాముడు తిరిగిరావటం ఎప్పుడు జరిగింది? అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఈ నేపథ్యంలో అక్కడివారు ఎలా ఫీల్ అవుతున్నారు?
ఆ లైవ్ టెలికాస్ట్ మరో విడతలో…
(ఇంకా ఉన్నట్టేగా!)
-----------------------------------------------------------
రచన - పూర్ణిమ తమ్మిరెడ్డి,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment